కథాప్రారంభము
దశావతారచరిత్రము
రమణాంగుష్ఠశిఖరీంద్రమథితావరణపయోధిజసుధారస మనంగభువనరక్షణసదాశివసిద్ధయోగీంద్రసంభృతసిద్ధరసం బనంగభూరిమేఘాళివిస్ఫుటపత్రపుష్కరాళిందపూరితమకరంద మనఁగధరణీవధూమహీధరపయోధరభాగలక్షితక్షౌమచేలం బనంగఁ
దనరు గంగాతరంగిణీతటమునందు, వెలయుఁ ద్రిభువనవిఖ్యాతవిభవవిజితదేవతాపురభోగవతీపురక్ష, మాపనానాపురము హస్తినాపురంబు.
క్ష్మారామామణిహారవల్లు లన గంగాకుల్య లేపార ముక్కారుంబండుఁ బ్రశస్యసస్యములు రంగద్భీష్మనూక్షీరపానారూఢోత్తమసత్త్వహస్తిహయముఖ్యంబు లగు న్జాహ్నవీతీరావాసపవిత్రులై ప్రజలు నెంతే మింతు రప్ప్రోలునన్.
అప్పురిగొప్పయుప్పరిగలందు వసించిన ముగ్ధకాంత లీయొప్పెడిచందమామ కిది యొప్పునె తప్పని పైఁటకొంగులందప్పక రాచి చూచి తమునవ్వెడి ప్రౌఢలహాసకాంతులేయప్పుడుఁ గప్పు గప్పినఁ గృతార్థుల మంచు హసింతు రెంతయున్.
ఎలమి విమాన మెక్కి చరియించుచు నంబరవీథిఁ దెచ్చుకోలలుకను రంభ వచ్చి పురమందలి మేడలపైఁడిబొమ్మలంగలసి యటూరకున్నఁ గలఁక న్నలకూబరుఁ డేమి నేరమేపలుకవె యంచు బొమ్మచెయి వట్టిన రంభ నగుం గిలాకిలన్.
శతమఖువారణేంద్ర మతిశక్తి నిజాకృతిఁ జూచి కొమ్మలన్రతనపుఁగోటఁ గ్రుమ్మినను రాలెడుకెంపు లగడ్తలోఁ బడంజతనము మీఱ నెత్తి కడుసంతస మొప్పఁగ నెత్తిఁ బన్నగప్రతతులు దాల్చుఁగాక మఱి పాముల కేడవి జాతిరత్నముల్.
పట్టణమధ్యభాగపరభాగమణీమయమందిరంబులంగట్టినటెక్కెపుందుదలు గాడఁగ బెజ్జము పుట్టెఁ దమ్మిపూఁ
జుట్టుములోనఁ గానియెడ శూరులు నాకముఁ జేరఁ బోవఁగాఁబుట్టుట యెట్లు త్రోవ పరిపూర్ణదినేశ్వరమండలంబునన్.
శుకముఖ్యద్విజకీర్ణతత్పురవనక్షోణీజపాలీఫలప్రకరస్యందిరసైకతుందిలితమై పాథోదబృందంబుధాత్రికి వర్షించును గాక యున్న లవణాబ్ది న్నీరమున్ గ్రోలి వార్షుకము ల్దియ్యనినీరమున్ గురియునే చోద్యంబుగా కెయ్యెడన్.
ఒకవటుండే చాలు నకలంకవేదశాస్త్రనిరూఢి బ్రహ్మ నధఃకరింపనొకరాసుతుఁడె చాలు నుద్వేలశక్తి దిక్పాలురఁ గదిమి కప్పములు గొనఁగనొకవైశ్యసుతుఁడె చా లురుసంపదల ధనాధిపు నాదిభిక్షుమైత్రికిని జొనుపనొకశూద్రసుతుఁడె చా లుర్వీతలం బెల్ల బహుసస్యమయముగాఁ బయిరు సేయ
నొకరథము సాలుఁ గనకాద్రి కొడ్డు సూప, నొకగజము చాలు దిక్కరిప్రకర మెదురనొకహయము సాలు రవిహయాత్యుద్ధతిఁ గన, నొకభటుఁడె చాలు రుద్రుతో నొరయ నచట.
ఎక్కుడు మోహదృష్టి రతి నిచ్చఁ దలంపక వచ్చి వేఁడినంజక్కనివాఁడు గాఁ డనుచుఁ జక్కెరవిల్తుని మెచ్చ రన్నచోనక్కడి వారకామినుల యందము వారి విటాళిచందమున్నిక్కము సన్నుతింప నలనీరజగర్భున కైన శక్యమే.
అప్పురంబున కధిపతి యై ధరిత్రి, పాలన మొనర్చు నేకాతపత్రముగనుభామినీజనమోహనపారదృశ్వ, మృదులతనుమేజయుఁడు జనమేజయుండు.
ప్రతిదినముం బ్రభాతమునఁ బాఠకగీతుల వీతనిద్రుఁడైక్షితిసురపాళితో నరిగి చెంతఁ బొసంగెడి గంగలో సమంచితమతి నిత్యకృత్యము లశేషముఁ దీరిచి గాఁగ పంకజప్రతతులఁ బూజ సేయు నరపాలుఁడు కృష్ణు నభీష్టదైవమున్.
ఆమహీపతి యొకనాఁ డహర్ముఖంబు, నందు నెప్పటికరణి జాహ్నవిని నిత్యకృత్యములు దీర్చి నగరికి నేగుదెంచి, కొలువుసింగారమై కంతుచెలువు మెఱసి.
నిండుఁగొల్వునను గూర్చుండ ధర్మజుతోడఁ గార్యము దెలిపెడిగౌరవంబుదుర్యోధనాదు లాందోళ మొందఁగ విశ్వరూపంబు సూపెడుప్రోడతనముసంగరంబున ధనంజయరణస్థాయియై ధవళాశ్వములఁ బట్టుదంటతనమువైరాటిసూతికాద్వారంబునను జక్రహస్తుడై గాచిన యట్టి మహిమ
తెలియ శ్రీకృష్ణమూర్తిఁ జింతించినట్టి, కొలువుకూటంబులోపల నలువు మీఱభద్రపీఠికఁ గొల్వుండెఁ బాండవాన్వ, యుండు జనమేజయక్షమాఖండలుండు.
అయ్యవసరంబున.
శ్రీశంపాయతలోచనారమణచారిత్రాపగాసంభవశ్రీశైలంబగు థాతురాగజటలున్ శృంగారనిష్యందనీకాశప్రక్రియ జన్నిదంబు లతివక్షస్పూర్తి శోభిల్లఁగావైశంపాయనుఁ డేగుదేర భవనద్వారంబునం జూచుచున్.
దౌవారికవరుఁ డొక్కఁడు, వేవేగ న్వచ్చి విన్నవించిన గురునిందేవేంద్రుఁ డెదురుకొనుగతి, భూవరశాసనుఁడు వినయమున సత్వరుఁడై.
సౌవిదల్లులు చేరి సముఖా యనఁగ గద్దె డిగునంతలోన దుండీరుఁ డిడిననెఱమించుచండవన్నియచెక్కడపుబొమ్మ చికిలిదంతంపుపాదుకలు దొడిగిపాండ్యుఁ డడ్డము పట్టు పావడ మఱుఁగున లాటభూభర్త గాళాంజివూనగండూష మొనరించి కర్ణాటపతిచేతిపావడం దడియొత్తి పసిఁడిసరిగె
చలునదుప్పటివలెవాటు వెలయ రాజ, సమున నెదురేగి యల్లంత సంయమీంద్రుఁగాంచి కైదండయును బాదుకలును వదలి, హర్షభయభక్తివినయంబు లతిశయిల్ల.
గోత్రప్రవరలు నొడువుచు, గోత్రేంద్రుఁ డురోవిలిప్తకుంకుమపంకాచిత్రితధాత్రీతలుఁ డై, తత్రభవన్మౌనిరాట్పదంబుల కెరఁగెన్.
రాజితాష్టాంగవజ్రచ్చటాచకచకల్ పొదలి ప్రక్షాళనాంబువులు గాఁగఁగమనీయతరమౌక్తికశ్రేణిధళధళల్ నవకుందసుమపూజనంబు గాఁగనిర్దోషనీలమాణిక్యాళినిగనిగ ల్మంజుళధూపధూమములు గాఁగరమణీయతరపద్మరాగధగద్ధగ ల్నలువొందు నీరాజనంబు గాఁగ
భ్రమరఘంటారవాన్వితప్రసవదామ, సుమరసం బుపహారమై సొంపు నింపమనుజపతి కన్న మున్ను దన్మౌళిమౌళి, మౌనిమౌళికిఁ బూజావిధాన మొసఁగ.
“శ్రీరస్తు క్షితినాథ తే” యని మునిశ్రేష్ఠుండు దీవింపఁగానారాజన్యుఁడు లేచి సంభ్రమముతో నమ్మౌనిచూడామణిన్రారాజన్మణిపీఠిపై నునిచి యర్ఘ్యం బాదియౌ పూజచేనారాధించి ప్రహృష్టమౌనిఁ గని ధన్యం మన్యచిత్తంబునన్.
వ్రతితిలకా భవత్పదపరాగము సోఁకఁ బవిత్రమయ్యె నాయతనము మిమ్ముఁ గొల్వఁగఁ గృతార్థుఁడ నైతి ఫలించె నింక నాయతనము లెల్ల నాంతరతమోపహనూరులు గారె మీరు సంతతశుభదాయకంబులు గదా మహదాగమనంబు లెయ్యెడన్.
శతవర్షంబు లరోగదివ్యతనులై సామ్రాజ్యసంపన్ను లైసుతులం బౌత్రుల మిత్రులం గని కడున్ శుద్ధాత్ములై యందనాహతమౌ మోక్షము గాంచ నేది సులభోపాయంబు నా కానతిచ్చి తగన్ ధన్యునిఁ జేయు మీ చరణము ల్సేవింతు మౌనీశ్వరా.
అనినఁ జిఱునవ్వు నవ్వి యమ్మునివరుండు, క్ష్మారమణ యైహికాముష్మికంబు లింతసులభములె యైన వినిపింతుఁ దెలివి గాఁగ, నప్రమత్తుఁడవై విను మాదరమున.
మేదినీశ వినుము “నాదత్తముపతిష్ఠ, తే” యనంగఁ గర్మదృఢత లేకయిహసుఖంబు గల్లు నెట్లు “జ్ఞానాన్మోక్ష”, మనఁగ నజ్ఞుఁ డెట్టు లందు ముక్తి.
గుణజలనిధిగహనా “క, ర్మణోగతి” యనంగ సులభమాకర్మము దారుణము “శుకో ముక్తే” యని, గణుతింపఁగ నెటులు ముక్తి గల దన్యులకున్.
కానఁ గర్మంబు లాత్మవిజ్ఞానసరణి, దుర్లభములు విశేషించి దుష్టమైనకలియుగమువేళ నెటువలెఁ గలుగు నైన, నొకయుపాయంబు దెల్పెద యుక్తముగను.
కృష్ణదశావతారములు కేవలభక్తిని విన్న సజ్జనుల్జిష్ణుసమానవైభవము జెంది యిహంబున నంతమీఁదటన్వైష్ణవధామ మొందుదు రవశ్యము వశ్యము సుమ్ము రెంటికిన్గృష్ణకులీన యన్న నృపకేసరి యెంతయు సంతసంబునన్.
పద్మనాభుండు పాండవపక్షపాతి, యందు మిక్కిలి విజయున కనుఁగు గానఁదత్కథలె విందుఁ గృష్ణావతారపూర్వకముగ వినిపింపు మవతారకథల ననిన.
శ్రీకల్యాణగుణంబుల న్సమతచేఁ జెన్నొందియు న్భక్తరక్షాకౌశల్యముఁ దెల్ప ధర్మసుతు రాజ్యశ్రీయుతుం జేసి యెంతే కుంతీసుతపక్షపాతి యనుకీర్తిస్ఫూర్తి వర్తిల్లు నాశ్రీకృష్ణుండు కృపాకటాక్షమున రక్షించు న్బుధవ్రాతమున్.
ధరణీశ కృష్ణావతారంబు మున్నుగా వినిపింపు మని దన్ను వేఁడినాఁడవవతారములలోన నాకృష్ణచరితంబు గణియింతు రందు నొక్కటిగ బుధులుబలభద్రుచరితంబు దెలిపినపిమ్మట నుడివెదఁ దదనుజన్ముని చరితముమానసం బలరార మత్స్యకూర్మవరాహనారసింహాద్యవతారకథలు
వినుము క్రమమున వీనులవిందు గాఁగ, నీసమంచితభక్తి వర్ణింప వశమెతపము ఫలియించె జన్మంబు ధన్యమయ్యె, గలిగె భాగ్యంబు శ్రీవిష్ణుకథలు దెలుప.
అని పులకాంకురములు మై, దనరఁగ మోదాశ్రు లొలుకఁ దన్మయచితంతంబున నలరుచు వైశంపా, యనముని దెలుపంగఁ దొడఁగె నధిపతి వినఁగన్.
Comments
Loading comments…