కల్కి

దశావతారచరిత్రము

కడవన్నెజిగిపట్టు నడికట్టు పడిదలపట్టంబు నేజయు బాగుదేరసరసభాగమున బాగైనతూణీరంబు కరమున జీనిసింగాణివిల్లు

మెఱయ నుచ్చైశ్శ్రవముఁ బోనిమించు తెల్ల, తేజిపై నెక్కి తేజంబు తేజరిల్లవెడలు దిగ్విజయార్థియై వేదబాహ్య, గళితధర్మైకజీవాతు కలికిరౌతు.

జోడన ల్ద్రొక్కించు శూరసేనాంగబంగాళము ల్పంచబంగాళముగనుజుట్టువేడెము వెట్టుఁ జోళమాళవగౌళపాంచాలములు పటాపంచ గాఁగరవగాలు నెఱపు సౌరాష్ట్రగూర్జరలాటమత్స్యభూములను దుమార మెగయనిబ్బరంబుగ నూకు నిషధమాగధసింధుమేదినీంద్రులు కంచుమించుఁ గాఁగఁ

గర్కకర్కశతరఖురాఘాతజాత, నూతనస్ఫీతరేఖికాజాతభూతలోదరీమేదురీభూతసాదరార్పి, తాత్మనఖముఖభంగి మాయాతురంగి.

జవలీలాహసితానిలం బగుజిరాసంజోకగుఱ్ఱంబుమేల్రవగాల్ జోడన చుట్టువేడెము లొనర్పం బుట్టుకెందూళికైతవతౌరంగికఖడ్గఖండితసమస్తమ్లేచ్ఛతుచ్ఛాంగరక్తవిలోలంబయి మించు భూతరుణికిం గాశ్మీరచర్చాకృతిన్.

ఈరీతిఁ గల్కి జనసం, హారము గావించి తెలిసి మహిధర్ము విస్తారము సేయుననన్ విని, కౌరవముఖ్యుండు మునిశిఖామణి కనియెన్.

విష్ణుయశునకు విష్ణుఁ డావిర్భవింపఁ, గారణం బేమి యతఁ డెట్టిఘనతపంబుఁజేసెనొ తదీయచరితంబుఁ జెప్పు మనిన, వ్యాసమునిశిష్యుఁ డిటువలె నానతిచ్చె.

అవనీశ తొల్లి స్వాయంభువమనువు బ్రహ్మర్షి లోకశరణ్యమైన నైమిశారణ్యమునఁ దర్పకారి జటావాటి నలరు వేలుపుటేటివలెఁ దనర్చుగోమతీద్వీపవతీమణితటమున ద్వాదశార్ణమనుమంత్రము జపంబుసేయుచుఁ గలశాబ్ధిశాయిణ గూఱిచి పూర్ణతమనిష్ఠ మును లద్భుతంబు సెంద

దశశతాబ్దంబు లతిఘోరతప మొనర్పమెచ్చి కనువీనుకవణంబు మెక్కు పక్కిజక్కిపై నెక్కి తనయిరుపక్కియలనునలువ మొదలైనవేలుపు ల్బలసి కొల్వశౌరి యాతనియెదుట సాక్షాత్కరించె.

కమలదళాక్షుఁ డిట్లు దనకట్టెదుటం గనుపట్టినం బ్రమోదము మదిఁ గ్రమ్మ నమ్మనువతంసము నేఁటికి నాతపంబు జన్మము ఫలియించెఁగా యని నమస్కృతులున్ నుతులున్ ఘటింప వేఁడుము వర మెట్టిదైన ననుడున్ విని యాతఁడు శౌరి కిట్లనున్.

శతపత్రదళనేత్ర జననత్రయంబు మత్పుత్రుఁడవై నీవు పొడమవలయునా ధర్మసంస్థాపనము సేయ నీకు నే సుతుఁడనై జనియింప మతిఁ దలంతునన దశరథుఁ డయ్యె మనువు దొల్తఁ దదీయ జాయసుశీల కౌసల్య యయ్యెహరి రాముఁ డయ్యె రెండవపరి దేవకీవసుదేవు లగుటయు వారియందుఁ

గృష్ణుఁడై విష్ణుఁ డుదయించె నింక విష్ణు, యశుఁడు దేవప్రభ యన గల్క్యంతముననువారె యుదయింపఁ గల్కియై శౌరి యవత, రించి కృతయుగచర్యఁ గావించఁగలఁడు.

ఈకల్క్యవతారక్రమ, మాకర్ణించిన జను ల్సదారోగ్యశుభశ్రీకలితు లగుదు రతులగు, ణాకర జనమేజయక్షమాధ్యక్షమణీ.

సకలసత్కవినితాష్టాదశవర్ణనాపూర్ణమై నవరసోదీర్ణ మగుచుఁగదళికాఫలపాకకమనీయభాషావిశేషమై కృతపరిశోష మగుచునశ్వమేధాదియాగాభోగఫలదానదక్షమై కృతిశతాధ్యక్ష మగుచుభాగవతాగ్రణీపారంపరిభాగధేయమై సజ్జనగేయ మగుచుఁ

దనరు నీదశావతారమహాప్రబం, ధంబు వినినయట్టిధన్యమతులుధరణిఁ గృష్ణుకరుణ ధర్మార్థకామము, ల్గలిగి పిదప ముక్తిఁ గాంతు రధిప.

అని శ్రీవైశంపాయన, ముని వినుపించినను భక్తి విని వేడుకతోజనమేజయవిభుఁ డా, మునిసోమునిఁ గమలభవసముని బూజించెన్.

శ్రీమద్వేంకటమాభిధానవరపుత్రీరత్నపుత్రీవివాహామేయోత్సవసుస్మితాస్యరఘుపత్యాక్యాత్మజాశ్లేషణోద్దామప్రేమరసాభిరామసతి సీతానామకన్యామణీహైమోదంచితడోలికాకలనవీక్షాయత్తచిత్తాంబుజా.

ద్విడ్భోగధవళితాశా, రుడ్యామిన్యధిపకీర్తిరుచిరచిరసుధాత్విడ్భోగధవళితాశా, కుండ్యాతరధర్మమర్మకోవిదహృదయా.

హైమభూధరగౌరనీరజహంసమండలజైత్రదోర్దామకీర్తిరమాధురంధరరమ్యనీతియుగంధరాభీమసారహృతాహితావనిభుగ్వసుందరరుగ్యజుస్సామవేదవిశారదద్విజచాతకవ్రజకంధరా.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట్రభాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణీదేవుల నాగనామాత్యసుధాసముద్రసమున్నిందరపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతంబైన దశావతారచరిత్రంబను మహాప్రబంధంబునందు దశమాశ్వాసము.

Comments

Loading comments…