1. మత్స్యావతారకథ
దశావతారచరిత్రము
పంటవాల్గంటి గబ్బిగుబ్బలఁ జెలంగు, తళ్కుబిగిచిల్కపచ్చఱాతాళిఁ బోలిపచ్చగందని పైరుల నిచ్చమెచ్చు, దెచ్చు హెచ్చుగ ద్రావిడదేశ మధిప.
ఆదేశము సురపురవిభ, వాదేశము నృపతివితరణైశ్వర్యజితశ్రీదేశము కలుషానిల, కాదేశము నెగడుఁ బొగడి నలవియె యెందున్.
సతతంబు నభ్రంకషంబులై కనుపట్టు ధాన్యరాసులఁ జూచి తలఁకి యేమొజపతపస్వాధ్యాయచతురులై తగుమహీసురులధైర్యముఁ జూచి స్రుక్కి యేమొపైఁటచా టెఱుఁగక ప్రబలుద్రావిడవధూకుచకుంభములఁ జూచి కొంకి యేమొయభవునియాజ్ఞ వింధ్యాద్రి మెట్టిన కుంభసంభవునాగతి జడిసి యేమొ
కాక భూపాలుచేవాలు కఱుకువాలు, కఠినశితకోటిశతకోటిఁగాఁ దలంచెనేమొ లేకున్న నచట మహీధరములు, పోఁక లంతైనఁ బొడసూపఁబోకయున్నె.
సాలములో యనందగురసాలములం బరిపాకలీలచేరాలు మెఱుంగుముత్తియపురాలు ఖగంబులగుంపు దోలఁగాయేలలుగంగ వానిఁగని యేలలు వాడుదు రందు నధ్వగుల్బాళిగొనంగ శాలివనపాళికహాలికబాలికామణుల్.
బాలరొ పుష్పమంజరులపై భ్రమరంబులు వ్రాలె నధ్వగావ్రాలినచో నుపద్రవకరంబులు గావని వాని మాన్పఁగానేలని నేర్పుమీఱ వచియింతురు పల్కులఁ దేనె లొల్కఁగాహాలికబాలికామణు లుదంచితశాలివనాంతరంబులన్.
శ్రీమత్తాదృశదేశవల్లభుఁడు లక్ష్మీనాథపాదాబ్జసేవామాద్యద్భ్రమరంబరాతినృపదీవ్యద్భర్మకోటీరకోటీముక్తాయిత వామపాదనఖకోటిజ్యోతిసత్యవ్రతక్ష్మామానిన్యధినాథుఁ డొప్పు క్షితిరక్షాదక్షకాజేయుఁ డై.
తనప్రతాపము సముద్దండశాత్రవకోటి గడిసీమఁ దోరణ కట్టికొనఁగఁదనకీర్తి బహుసముద్రద్వీపములు దాఁటి చక్రవాళాద్రిపైఁ జౌఁకళింపఁ
దనకటాక్షము దిగంతరయాచకశ్రేణి రూఢి కెక్కఁగఁ గుబేరులను జేయఁదనచీటి యష్టదిక్తటులేలు వేల్పురాజులపాగలం దురాచెల్వు చూప
నతఁడు చెల్వొందుఁ బరకిరీటాగ్రఖచిత, పాకభిన్నీలమౌక్తిపద్మరాగషట్చరణచక్రచక్రాంగచక్రవాక, యుగపదాశ్రితపాదాబ్జయుగళుఁ డగుచు.
ఆసత్యవ్రతభూవర, శాసనుఁ డొకనాఁడు వేఁగుజామున ఘనగర్జాసమసమధికవంది, శ్రీసూక్తుల మేలుకాంచి చిత్త మెలర్పన్.
హరి మదిఁ దలఁచుచుఁ బ్రాతః, కరణీయచికీర్షవిబుధగణసంయుతుఁ డైస్వరధిపనిభవైభవభా, స్వరత న్ఘనవాహ మెక్కి చనఁ జన నెదుటన్.
హేళికులాగ్రణి యగునృప, మౌళి గనుంగొనియె ధరణిమహిళాసుమనోమాలిక పోలికఁ దగ్గుకృత, మాలిక యనునదిని మదిఁ బ్రమద ముదయింపన్.
కనుఁగొని హరి దిగి విబుధుల, రని కొనియాడుచును వింటిరా యీతటినింగనుఁగొను పుణ్యుఁడు మిక్కిలి, కనుఁగొను నెన్నుదుట నెన్నఁగాఁ దరమగునే.
కృత మాచరించు భూరిసు, కృతమానిన భాగ్యశాలికిం గలుగుం దుష్కృతమాలిక నడంపంగల, కృతమాలిక మునుఁగ దొరకునే యన్యులకున్.
అనుచు ననుచు ముదంబున నంబుజాప్త, నిభవిభుఁడు మేదినీవిభుఁ డభిమతార్థదాయి తటినికి డిగ్గి హృత్తటిని భక్తి, పూర్ణతరముగ సంకల్పపూర్వకముగ.
మజ్జన మొనరించెను ధీ, మజ్జననుతు లెసఁగ నృపతి మహి మహితముగామజ్జననము గావింపు న, మజ్జననీతటిని యని సమంజసభక్తిన్.
మజ్జన మొనర్చి యిటుల నమ్మనుజవిభుఁడు, కాల్యకరణీయములు దీర్చి గంధసింధురజవసైంధవపృథుహేమరథసుయోధు, లెలమి నెలవంక వలవంక బలసికొలువ.
నగరి కేతెంచె నిట్టు లన్వహము తటినిఁ, గాల్యకరణీయములు దీర్చుకతన నతనిమదిని వైరాగ్య మొదవ సామ్రాజ్యతంత్ర, ములకుఁ దనమంత్రులనె స్వతంత్రులను జేసి.
కృతమాలికాతటంబున, క్షితిపతి సలిలాశి యగుచుఁ జేసె న్దప మాశతమఖముఖబర్హిర్ముఖు, లతివిస్మయ మంద మాధవార్పితబుద్ధిన్.
ఒకనాఁ డుదయక్ష్మాభృ, న్మకుటస్ఫుటపద్మరాగమణినా దిననాయకుఁ డలర నృపతి మురభం, జకునకు నర్ఘ్యం బొసంగు సమయమునందున్.
నునుగరులు దళుకుమీసలు, మినుమినుకను కన్నుదోయి మిహికుందనపుందనువుంగల యొకమీనము, దనయంజలిఁ దవుల నృపుఁ డుదకము న్విడిచెన్.
తను నటుల నీటఁ ద్రోచినఁ, గని మీనం బనియె రాజ కారుణికుఁడ వంచును నిన్ను నమ్మి చేరితిఁ, జనునే నట్టేటఁ ద్రోయ శరణాగతులన్.
శ్రీరామచంద్రుఁడు చేపట్టఁడాయెనా శరణుఁజొచ్చిన విభీషణునిఁ దొల్లిశిబిచక్రవర్తి రక్షింపఁడే మును దన్నుఁ జేరినపక్షి దాక్షిణ్యగరిమనచ్ఛభల్లముఁ బ్రోవఁడా తొల్లి బెబ్బులిపాలుగాకుండ నృపాలసుతుఁడుఁదనశరీర మొసంగి వనచరునొక్కని దయగావదే కపోతంబు దొల్తఁ
గాన శరణాగతులఁ బ్రోచుకంటెఁ బుణ్య, మేది మేదినిలోన నన్నేది యింకనాదిరాజన్యకీర్తులఁ బ్రోది సేయు, ధర్మగుణసాంద్ర సత్యవ్రతక్షితీంద్ర.
సకలం బెఱిఁగినయాదిమ, శకులం బటులనిన రాజచంద్రునిచిత్తంబకలంకమయ్యు నించుక, వికలముగా నిట్టులను సవిస్మయుఁ డగుచున్.
శరణన్న న్విడ నిన్ను నేను శఫరీ సామాన్యబుద్ధి న్నిరాదరతం ద్రోచితి వేళగామి నిదియే తప్పంచు నీ వెంచి నిష్ఠురతం బల్కితి పాడియే దెలుపుమిచ్చో నేభయంబయ్యె నన్శరణొందం బనియేమి నావలన రక్షాసిద్ధి నీకెట్లగున్.
అనుచుఁ బలికిన జనపతి మనుచు వేడ్కఁ, బెనుచువాలుగ మేలుగాఁ గనుచు ననియెనుదకమునఁ దత్తరింపుచు నున్న నన్నుఁ, జూచి భయమేమి యనుటగా చోద్య మయ్యె.
కూర్మికిఁ గూర్మి చేకుఱునె నోరికిఁజిక్క నెగడుము న్నెగడుపై నెగడుచుండమొసలికి మొసలియే దెసలఁ జేరఁగరాదు పాముల బాములఁ బడుట కడిఁదికరటి మర్కటి గాదె పట్టినచోటు గప్పలు గొప్పలు గలవు మ్రింగబకము లంబకము లెప్పటికి మాపై నిల్పు మీలముచ్చులు ముచ్చు లేల విడుచుఁ
గన్నతల్లి కన్నఁ గరుణలే దొకవేళఁ, బట్టిపట్టిఁ తివియుఁ బార్థివేంద్రగండకముల కిట్టిగండము ల్గలవిఁకే, మనఁగవచ్చు నెట్లు మనఁగవచ్చు.
అటులుగాన నిరంతర ప్రాప్తశైత్య, తరళతరవారిధార సాదనలు సేయుమీనుపిల్లలజన్మంబు మే లనంగఁ, బడునె పరికింప విషములో బ్రతుకు గాదె.
కాన నిరుపద్రవంబగు, చో నను విడిపించి తేని సులభముగాఁ జే.కోనగు నాచంద్రార్కం, బైనసుకృత మనిన నృపతి యతివత్సలుఁ డై.
అధికనైష్ఠికవృత్తి మన్మథునిఁ గెలిచి, డాలుగైకొన్న జోళమండలవిభుండుడాసి యన్నది యుదకమండలములోనఁ, దలఁకు మీనంబుఁ దనకమండలము సేర్చి.
తనయాశ్రమమున కల్లనఁ దెచ్చి రాజర్షివల్లభుఁ డాశ్రమమెల్లఁదీఱసతతపయోధార సమకూర్చి భూమిలో నేఁటఁ బెంచినవారిఁ బూఁట బెంచెననుమాట నిజముగా నెనరుతోఁ బోషింప శిశుక మారాత్రిలోఁ జిత్రముగనుబలిసి భూమండలాఖండల కొండిక కుండికనుండఁగూడ
దింతనిర్బంధమైనచో నెటుల నోర్తు, నింక నొండొకవిరివియౌ నెడవసింపఁజేయు మెందైన నందైన చింతదీఱ, విశ్రమించెద నన్నఁ బృథ్వీవరుండు.
గండకంబు వేఱుకడ వసింపఁగఁజేయు, మన్నమాట గడవ కాక్షణంబకడువశంవదుండు గావున నొకగొప్ప, కడవలో వసింపఁగా నొనర్చె.
ఘటిఘటియించిన రెండవ, ఘటీనే యండజము ఘటినిఁ గలయ బలిసియాఘటమున నుండుటకుందు, ర్ఘటమై యున్నది యటంచుఁ గడుదీనంబై.
మీన మడుగుటయును మేదినీంద్రవతంస, మడుగులకును బ్రేమ మడుఁగు లిడుచునఖిలధీవరజన మడుగు గానఁగలేని, మడుగులోన నించ మహిమమించ.
మడుగు న్నిండఁగనిండి గండకమనున్ క్ష్మామండలాధీశ యిక్కడ నుండం దరమే జడాశయము యోగ్యంబౌనె నావంటి యెక్కుడురూపంబున మించువాని కిటఁ గైకోవయ్య విస్తారమౌకడ నిల్పం గదవయ్య యార్తజనరక్షాదక్షదీక్షానిధీ.
నావుడుఁ గడువిస్మయమున, భూవరుఁ డొండొకప్రదేశము మదిఁదలఁచుచున్వేవిధముల నిదియేతగు, నీవేళకటంచు నిశ్చయించి రయమునన్.
అలరించె న్లవణాంబుధి న్మొదట నే యారౌరశుద్ధోదకంబులవార్ధి న్గడవైచె ధాత జడజోద్భూతుండురా యంచులోకులు నిందింపఁ గలంగి యన్నలువదిక్కూలంకషోర్మిచ్ఛటల్గలయం దజ్జలరాశిముందిడియెనాఁగా నొప్పు గాసారమున్.
చేర్చి సుఖముండు మనిన రాజీవమనియె, సదయు రాజవతంసునిన్ సన్నుతింపనల్ల రాజీవగర్భున కైనఁ దరమె, శ్రితనరాజీవ ద్రవిడధాత్రీకళత్ర.
అని పొగడుచు నొకదినమున, ననిమిషకులచక్రవర్తి యాకాసారంబును నాక్రమించి వేఱొ, క్కనివాసముఁ జేర్చు స్వైరగతి విహరింపన్.
అనిన న్భూవిభుఁ డొండుచో టగునె మీనావాస మింకం దగున్ఘనఝంఝానిలసంఘసంఘటితసంఘర్షాఖలాశావిలంఘనజంఘాలతరంగరంగతలరంగత్పాండుడిండీరచందనసందీప్తవిలాసముద్రము సముద్రంబే యటంచు న్మదిన్.
జడరాశిం బడవైచిన, మిడుకుచు నప్పుడమిఱేని మీనంబనియెన్గడనేఁటికి నేటికి దిగ, విడిచెదు నమ్మితిని గావవే దయమీఱన్.
బాళిఁ జిలుకఁ బెంచి బాపురుగానికి, నొప్పగించురీతి నుచిత మగునెయిన్నినాళ్లుఁ బ్రోచి యిప్పుడు జలరాశి, మొసలివాతఁ ద్రోయ వసుమతీశ.
జలరాశిఁ దిమితిమింగిల, ములు నాఁదగుమీనసత్వములు వినలేదేకులశైలసుతుఁడు జలచర, ములతో రావెడల నుమియుఁ బునుకలతోడన్.
తాదృశమీనంబులు న, న్నే దెస వసియింపనిచ్చు నిట దిగవిడువం
గా దెసఁగిన కారుణ్యము, నాదెస నుంపంగదయ్య నరనాథమణీ.
అనిన న్నివ్వెఱఁగంది భూవిభుఁడు నాహా యిట్టిమీనంబులంగనినామో వినినామొ యెందయిన లోకత్రాణపారిణుఁ డవ్వనజాక్షుం డిటువంటిరూపమున సేవల్దాఁ బ్రసాదింపఁగాఁజనుదేఁ బోలు నటంచు నించుక మది స్సందేహముం జెందుచున్.
వలరాటెక్కెపుమీనవో సురలఁ బోవన్మించు మీనంబవోతెలియ న్వానికి నైన నీబలిమి సందేహంబు నేఁ గొల్చు నజ్జలజాక్షుండవొ ఫాలచక్షుఁడవొ సాక్షాద్బ్రహ్మవో తెల్పు మీవలవంత ల్పచరింప నేల కుహనావైసారిణగ్రామణీ.
అన నేనేమీనముగా, ననఘాత్మ స్వభావమీన మని యెన్నుము నీవనుమానము మానుము ననుఁ, జనుమానముతోడఁ బ్రోవు జా గేమిటికిన్.
విషధిలోపలఁ జాలరి వేటకాండ్ర, వలకుఁ జిక్కిన గాలంబు వంచికొనినగారవెట్టిన నేరీతిఁ గడవనేర్తు, నాకు గతి యొండుగలదె నా నరవరుండు.
అనియె నీవు స్వభావమత్స్యంబ వైన, జాలరులు నిన్నుఁ బట్టంగఁజాల రెందునీయధీనంబు గాలంబు నీకు భయము, సేయనోపునె పరులకుఁ జేయునట్లు.
నీవలకుఁ జిక్కె లోకము, లీవల నీవలకుఁ జిక్కుదేజలరాశిన్నీవలకుం జక్కు దుగా, కేవలనం గేవలంబె యీ నీమహిమల్.
పృథివి సంసారమన గారఁబెట్టఁజాలు, నీదుమాయావిలాసంబు నిఖిలజనులనందఱకు నీవ గతిగాక యన్యుఁడొకఁడు, నీకు గతి యౌనె సకలలోకైకనాథ.
యోజనలేటికి నీవ ప, యోజనయనమూర్తివే ప్రయోజనమున కీయోజ నటించెదు దినశత, యోజనమాత్రంబు పెరుఁగ నోపుదు చెపుమా.
శ్రీనారీకుచకుంభికుంభయుగళాశ్లేషంబొ బ్రహ్మాదినానానాకేశనమస్క్రియాదరమొ వీణామౌనిలోకాగ్రణీగానాకర్ణనమో వధూనటనశృంగారావలోకంబొ యీమీనాకారము దాల్పనేమిపని స్వామీ నా కెఱింగింపవే.
కలిమిగుబ్బెతమిన్న గబ్బినిబ్బరపుబ్బుగుబ్బలో జక్కవగిబ్బజోడుతెలిదమ్మివిరియింటి తెలిగంటికెంపువాతెఱసొంపొ పవడంపుతీవగుంపులెడఁదకాఁపురపుపుత్తడిబొమ్మనిడువాలుగన్నులో యీవాలుఁగన్ను లరయననవింటిదంటఁగన్నమిటారినూగారు తీరులో యీనాచుతీవగుమురు
ఏల భ్రమసితి వీవార్థి నేమిగంటి, తేలియాడెడు మీనంబు తెఱఁగుపూనియౌర తెలియకయంటిగా కయ్య నీమ, హత్త్వ మెఱుగంగ శక్యమే యజునకైన.
నే నొకనెపమున నైనను, మానక నినుఁ గొల్చినాఁడ మక్కువ నాపైనూనుము “సఖ్యం సా ప్తప, దీనం" బని మున్ను విందు దీనశరణ్యా.
మునుపటిభవమున నేఁజే, సినపుణ్యమువలన మిమ్ము సేవింపఁగఁ గంటిని మాయలేటి కింకిట, వినిపింపఁ గదయ్య నీదు వృత్తాంతంబున్.
అనినం గైతవమత్స్యమూర్తి కరుణాయత్తైకచిత్తంబు మీఱ నను న్భూవర యాత్మతత్వము పరబ్రహ్మంబుగా నెమ్మనంబునఁ జింతింపుము సంశయింప కిఁకనేమో యంచు నీచర్య కేననుమోదించి యనుగ్రహించితి నభీష్టార్థంబు నీ కయ్యెడున్.
వినుము సత్యవ్రత వినయగుణాన్విత భావికార్యము తేఁటపఱుతు నీవుకనుఁగొనుచుండు మింకను నేఁడు మొదలుగా నేడుదినంబుల కిప్పయోధిభువనముల్ త్రిభువనంబులను లోఁ గొను నేలనన్న నానాఁటికి నబ్జభవునిరేయైన నతఁడు నిద్రించుఁ గావున దాని కెడఁద భయంపడ కెనయ నప్పు
డోషధీబీజరాసుల యోడ నీకు, పంపుచున్నాఁడ నోడక యందుసప్తఋషులతోఁ గూడి వసియింపు మెపుడు నాదు, భక్తజనమున కెందు నాపదలు లేవు.
అనుచు నానతి యిచ్చి మాయావిసార, మూర్తి యంతర్హితుండైన మ్రొక్కి నృపతియెంత దయగలవాఁడు సర్వేశ్వరుండొ, హో యటంచును నిష్టతో నుండు నంత.
ప్రథితసుమేధుఁడై పరగుసుమేధుండు విరజుఁడై శాంతిచే వెలయు విరజుఁడాభాహవిష్మంతుఁ డగుహవిష్మంతుండు నుత్తము డైనట్టి యుత్తముండువనజాక్షపదభక్తవనమధుండగు మధుం డఘపారదమహాగ్ని యైనయగ్నిద్వంద్వసహిష్ణుఁడై తగిన సహిష్ణుండు ననఁదగు సప్తర్షు లమితహర్షు
లగుచు వచ్చిరి లవణమహాంబురాశి, వేల దర్భశయానుఁడై విభుఖగేశయాను నతివేలభక్తిభాగనఘజనకృ, పాలు హరిఁ గొల్చు ద్రవిడనృపాలుకడకు.
అట్టు లరుగుదెంచి నట్టియయ్యతులకు, నతులగతుల మతులు నతులు చేసియతివినీతి, నున్న క్షితితలపతిధృతి, మతిని మెచ్చికొనుచు మౌను లనిరి.
శతవర్షంబుల నుండియు, క్షితి వర్షము లేని కతన శిథిలంబగు చోనతివృష్టి మించె జలనిధి, గతి దృష్టించితివె ముజ్జగంబులు ముంచున్.
ఇందు నెవ్వరిఁ గనుఁగొన మిజ్జగంబు, నందు నాశ్చర్యమయ్యెనో యవనినాథయేకతంబున వారాశి సైకతమున, నేకతంబున నున్నాఁడ వెఱుఁగఁ జెపుమ.
నావిని తావినీతి జననాయకుఁ డిట్లను మౌనులార రాజీవమొకండు మొన్న ననుఁ జిత్రము గా బ్రమియించి యంతటన్భావికథ ల్సవిస్తరతఁ బల్కి పయోధి మునుంగకుండ నేనావఘటింతు నీకు మునినాథులతో వసియింపు మత్తరిన్.
అంచు ననుమించు వేడుక నానతిచ్చి, గోచర మగోచరంబైనఁ గొంతధైర్యశాలినై యుంటిఁ దన్నిదర్శనముఁ గోరి, నేఁడు మీదర్శనమున సందియము దీఱె.
అనిన న్సంతసమూని మౌనిజను లాహా యింక నెట్లో కదావనధు ల్ముంపఁగఁ జాగె ముజ్జగము లేవంక న్వసింపంగవచ్చునటంచుం గడుఁదత్తఱించినతఱిం జోద్యంబుగా నీడకుంజనుదెంచుం దరియంచుఁ బల్కితిఁ దరింపన్వచ్చు నిచ్చోనృపా.
అని పలుకుచు నుండఁగ న, వ్వననిధి ఘనఘోష మడర వలమానతరంగనికాయంబులఁ బొదువఁగఁ, గని కాయం బదర లేచి గ్రక్కున వారల్.
పటుదీర్ఘతరజటాపటలంబు ముడివీడి కన్నుల కడ్డమై గప్పికొనఁగభయవేగసంచలత్పాణిపరిస్ఫుటస్ఫటికాక్షమాలిక ల్జాటిపడఁగఁగాషాయపటములు గటితటంబుల నూడి త్రొక్కుడుపాటుచేఁ దునియుచుండఁజాలినొందుచు నెత్తఁజాలక వచ్చుచో ఘనకమండలువు లక్కడనె చిక్క
జడిమ నడుగులు దడఁబడ నుడుగ కూర్పు, లడక బడిబడి బడలిక లొడలఁ బొడమఁగడలికడనుండి మగిడి క్రేఁగంటిదృష్టి, యిడుచుఁ బాఱుచు జడదారి యొడయ లపుడు.
"అస్మాన్ పాహి భయాతురాం స్త్రి జగతీమాప్లావయద్వారిధిర్విస్మార్యా సఖలు త్వయాదయ మితో విష్ణో భవాన్ రక్షకఃతస్మా త్త్వాం శరణంగతా అగతికా భావంత ఏతేభృశంకస్మాదేవ ముపేక్షసే” యని మును ల్గార్పణ్య మేపారఁగన్.
మొఱలు పెట్టుచు శరనిధి మఱలిమఱలి, కాంచుచో నిదె యోడని కదియఁ జనుచుఁదెలియ వీక్షించి యదిగాదు జలము గ్రోలు, జలద మిది యని మదిలోన జలదరింప.
కనియె న్భూపాలుఁ డంత న్ఘనతరసముదగ్రస్వకీయాగ్రభిద్యద్వవరుడ్దర్భాండభాండావరణపరిపతద్వారిధారాళి శంకాజనకాసంఖ్యాతసూత్రోజ్జ్వలదృఢగుణవృక్షచ్ఛటాకించిదాకంపనలీలాకృన్నభన్వత్పటకటపటలప్రస్యదం బైన నావన్.
కని యిట్లను మునులారా, కనుఁగొంటిరె దివ్యరత్నకమనీయంబైకనకన వెలుఁగుచు నిదిగోఁ, గననయ్యెం గనకతరణి గరుడధ్వజమున్.
అనునంతలోన దరికిం, జనుదెంచిన యత్తఱి ససంభ్రమముగ నమ్మునినాథు లెక్కి రొండొరు, లనువడిఁ జేయూఁతగా హళాహళి మీఱన్.
ఎక్కి మనలను దరి సేర్ప నీశ్వరునికె, భారమవుఁ గాన దరి సేర్చె నావ యనుచువిడిచి కాషాయవస్త్రము ల్బెట్టువిసరు, గాలి నెండించుకొనుచు నాకలమునందు.
కలధౌతనిర్మితోజ్జ్వలశిరోగృహములు దీపితమాణిక్యదీపతతులురమణీయవైడూర్యరచితపర్యంకముల్ సౌవర్ణమణిమయజాలకములుపృథులగోమేధికపీఠికాపేటిక లకలంకనవవజ్రముకురసమితిమానితముక్తావితానవితాన మాయతపుష్పరాగభద్రాసనములు
విద్రుమస్తంభములు నీలవేదు లమర, గాంగజలపూర్ణఘనకాచఘటచయంబువిత్తనము లోషధులుఁ దక్కు వివిధవస్తు, జాలములు సూచిసూచి యాశ్చర్యమునను.
ఓహో కంటిరె వారిరాశిసలిలం బుద్వేలమై శైలసందోహాగ్రంబులు దక్కఁ దక్కిన పురాదు ల్ముంచె నందు న్సుపర్వాహార్యాగ్రమె కాని కాన మితరం బాహా విమానస్వయంగ్రాహగ్రాహము లెచ్చరించెను భువఃక్రాంతిన్ విజృంభించుచున్.
తరణి మెఱుఁగారు గారుడధ్వజము గాంచి, కలఁగి పరువిడంచిలువపగ్గములు సడలిపఱచుహయముల సారథి పట్టలేమిఁ, దత్తరించుచునున్నది తరణిరథము.
ఔర సకలంకమైనట్టి యబ్జమండ, లము సభృంగాబ్జమండలభ్రమ గడంగిజలధి జలకరితుండంబు సాచి తివియు, నేమనఁగవచ్చు మత్తుల కెఱుక గలదె.
మహిజనులఁ బీడఁ బెట్టెడు, గ్రహములఁ బీడింపఁదొడఁగె గ్రాహము లివిగోసహజ మగుసత్త్వసంపద, నహహా యాకారవృద్ధి నధికము లగుటన్.
మాయురే తోయనిధిలోన మకరమీన, కర్కటకరాసులొండొండ గగనమకరమీనకర్కటరాసుల మించువేడ్కఁ, గౌఁగిలించె సజాతీయగౌరవమున.
అదరిపాటున వారాశియుదుటు సూచి, మిగులభయమునఁ దమతమ మెఱుఁగుబోండ్లుచేరి తముఁ దామె కౌఁగిటఁ జేర్ప సౌఖ్య, వార్ధిఁ దేలె మహర్లోకవాసిజనము.
ఇదియుఁ గనుఁగొంటిరే చిత్ర మిట్టివేళ, భైరవభుజాగ్రశూలాగ్రభాసి కాశికానఁగా నయ్యె మోక్షలక్ష్మీనివాస, నాళసమ్మేళితారవిందమ్మురీతి.
ఆశాలంఘనజాంఘికోజ్జ్వలతరంగాభంగనానాపయోరాశివ్యాపృతవిష్టపత్రయచతుర్వక్త్రీయనక్తంబున
న్నాశంబొందక తేజరిల్లె సకలౌన్నత్యంబు సూచించుచున్గాశీపట్టణవైభవంబుఁ బొగడంగా శక్యమే యేరికిన్.
అని యొండొరులు వచించుచుఁ, గనఁగ మహర్లోక మవధిగా నీచందంబున ముజ్జగములు దనలోఁ, గొనుచు న్హరిఁ బోలు నయ్యకూపారమునన్.
వడి నీరువడిఁ జిక్కువడి చక్రవాళాద్రి క్షణమాత్రమునఁ బ్రదక్షిణము సేయునతిరయస్ఫూర్తిచే నరుగుచో నాడాడ నగశృంగములు ఘణిల్లనఁగఁ దాఁకుఘనవర్తులావర్తగర్తభాగముల దిర్దిరను గుమ్మరసారెరీతిఁ దిరుగుశతయోజనాయతోన్నతమహాపాఠీనసంఘసంఘటితఘర్ష మున వదరు
జలధి యుల్లోలకల్లోలములను దగిలి, యట్టె యెగయుచు డిగుచును బొట్టిపిట్టపగిది మెలఁగెడునావలోపల వసింప, భయపడుచు నుండునంత లోపలనె యెదుట.
తనభయంకరవాలవినిపాత మమరేంద్రకరవాలహతి యంచు గిరులు వడఁకఁదనమస్తకోర్ధ్వరంధ్రవినిస్రుతాంబువు ల్పునరుత్పతద్గంగపొలుపు దెలుపఁదనవక్త్రబిలము సొచ్చినమహాతిమితిమింగిలతద్గిలంబు లంగిటను వెడలఁదనపార్శ్వభాగసంధర్షణంబున ద్వీపకోటులు నుగ్గులై నీటఁ గలయఁ
దనమహోద్దండనాసికాదండమునను, ఖండఖండంబులై యహిగ్రాహకమఠకర్కటీనక్రముఖజంతుకాండ మగల, జలధి విహరించు నొక్కమత్స్యంబుఁ గనిరి.
కని యిది యేమి యద్భుత మొకానొకనాఁడును జూడ మిట్టిజీవనచర మింక దీనిఘనవాలము సోఁకినయంతఁ దున్కలైచను గిరులైన నీతరణిచందము నెన్నఁగనేల యంచు నెమ్మనము గలంగి చూచుతఱి మానవనాథుఁడు వారి కిట్లనున్.
ఓహో భయపడ నేటికి, నూహించితి నాఁటియండజోత్తమ మిది సందేహింపకుండి మనకున్, సాహాయ్య మొనర్ప వచ్చె జలనిధి ననినన్.
మౌనివరు లిట్టులనిరి యోమానవేంద్ర, నీవు సేసినభక్తి కెంతేని మెచ్చిసకలవేదాంతములకుఁ గోచరముగాని, యాదితత్త్వంబు గోచర మయ్యె నిపుడు.
ననఁగూడి తుంగ దలకె, క్కినవిధమున నిన్నుఁ గూడి కేశవమూర్తిన్గనుఁగొంటి మింక నీహరి, వినుతింపుమటన్న ధరణివిభుఁ డుత్సుకుఁడై.
చూచితిరే శ్రీహరిమా, యాచాతురి హేమమీనమై జలధిచలద్వీచీడోలాకేళీ, వైచిత్రిం జెలఁగుప్రాభవము మునులారా.
అంభోధివరుఁడు వియన్నదీకన్యకపై నించు ముత్తేలప్రా లనంగవైమానికాంగనాసీమంతములఁ బొల్చు సోగవజ్రఁపుఁజేరుచుక్క లనఁగగగనలక్ష్మీవేణికాభారమును మించునిగ్గుక్రొవ్విరిజాజిమొగ్గ లనఁగనభిమతవిజయయాత్రారంభమున దిశాలలనామణులు జల్లులాజ లనఁగఁ
గంధిమధ్యాంబుచక్రచంక్రమణనిపుణ, కపటపాఠీనరాజజాగ్రన్మహోగ్రదీర్ఘవాలాగ్ర వినిహతోత్క్షిప్యమాణ, లోలకల్లోలజలబిందుజాల మమరె.
అనిమిషేంద్రం బౌటన సురరోషరసాత్తరక్తసహస్రనేత్రము లనంగఁదనగృహంబునకు వచ్చెనటంచు వరుణుండు పూజ సేసిన పైఁడిపువ్వు లనఁగరత్నాకరాంతకభ్రమణవిస్ఫురణచే మైనంటి కనుపట్టు మణు లనంగరాజీవనామవిభ్రాంతితో మైవాలి కదలనిచక్రవాకము లనంగఁ
బృథులశతకోటిశితకోటిశృంగనిహతి, నెనయు జగడంబు పగడంపుతునుక లనఁగశాంబరీమత్స్యమూర్తిదేహంబునందుఁ, బొలుచు రంగారుబంగారుపొడలబెడఁగు.
అని యనితరమతిఁ బొగడుచు, జనపతి వందన మొనర్ప జలజాక్షుఁడు మెల్లనఁ గ్రిందికిఁ జని నావం, దనమై ధరియించె భక్తతత్పరుఁ డగుచున్.
తనక్రేవఁ గనుపట్టు ధరణీధ్రములఁ గిట్టు సెలసి కొమ్మునఁ గొట్టుఁ దలఁగఁబెట్టుఁబొడువఁగా నడతెంచుజడచరంబులఁ గాంచు నిడుదకోఱలఁ జించుఁ గడుపు పెంచువెనక బారులు దీర్చుఁ బెనుగ్రాహముల నోర్చు ఘనవాల మల్లార్చుఁ గడఁకఁ బేర్చుఁబ్రక్కలయం దబ్బురంబుగాఁ బెల్లుబ్బుఁ దరగలఁ బడగెబ్బు గరులదొబ్బుఁ
గాయకాంతులఁ దిమిరనికాయములకుఁ, బగలు గావించుచును బట్టపగలు సేయుసారమున మించు మాయావిసారమూర్తి, యించు వేడుకదరి ధరియించునపుడు.
భోగభాగాభోగభాగనర్ఘ్యచిరత్నరత్నదీప్తులు తమిస్రంబు నొడియఁదారతారస్ఫారదారుణాపారభూత్కారము ల్విషములు గ్రక్కుచుండనీలజాలవిశాలనీలశోభావాలమృదునేత్రములు మిఱుమిట్లు గొల్పదండభృద్దోర్దండమండనాయితగదాదండచండోద్దండదంష్ట్ర లమర
జగతిభారంబు సైరింపఁజాలు టుడిగి, యంబునిధిఁ దేలియాడు శేషాహి యనఁగధవళతరదేహధగధగద్ధగలు మెఱయఁ, గదియ నేతెంచు నొకభుజంగంబుఁ గనిరి.
కాంచి యిఁక నేమి సేయుద మంచు గరుడ, మంత్రము జపించుచుఁ జలించు మౌనివరులవెఱవ నేటికి నిదియును విష్ణుదేవు, ననుమతంబునఁ జనుదెంచె ననుచు లేచి.
ఆనరేంద్రుఁడు భీషణాత్యంతదీర్ఘ, కాలసర్పంబు రజ్జువుగా ఘటించిమీనశృంగంబునను నావ మెదలకుండ, గట్టిగాఁ గట్టివైచి యుత్కంఠ మెఱయ.
కరములు మోడ్చి ఫాలఫలకంబునఁ జేర్చి విశాలలోచనాంబురుహముల న్మరందములఁ బోలి ముదశ్రులు జాలువార సుస్థిరతరభక్తి భూపతి నుతించె దినాంతనటన్మృగాంకశేఖరమకుటీతటీరటితగాంగ కృపీటఘుమంఘుమార్భటిన్.
జయవియన్మణిఘృణిస్థగితగాఢతమిస్ర జయచంద్రకిరణదంష్ట్రాసహస్రజయచంచలాతిచంచలదీర్ఘలాంగూల జయభయంకరముఖశ్మశ్రుజాలజయమస్తకోత్పతత్సలిలసిక్తవిమాన జయవృష్టితృప్తప్రజావితానజయనిర్జరేంద్ర వజ్రకఠోరతరశృంగ జయలక్షయోజనోచ్ఛ్రయశుభాంగ
జయమహాచక్రచంక్రమాచరణదక్ష, జయతరంగవిలంఘనచటులపక్షజయవిగాహప్లవోద్దామసత్త్వభూమ, జయహిరణ్మయపృథురోమసార్వభౌమ.
తళుకుంజాయకడానిమైపొడలు నిద్దామీసలు న్వేయికోఱలు గాటంపుగరు ల్ధగద్ధగితనేత్రంబు ల్మహేంద్రాయుధోజ్జ్వలశృంగంబును దీర్ఘపుచ్ఛము మహాసత్త్వంబు హేమాద్రికిందులయౌ దేహము గల్గునిన్ను భజియింతు న్దంభమీనాధిపా.
చంద్రుసైఁదోఁడు పూఁబోఁడి జళుకుఁదళుకు, వాలుగన్నుల బెళుకుల వైపు సూపువాలుఁగన్నుల వలపింపవలయు ననియొ, దేవమాయపుమీన వైతివి పయోధి.
సమధిక మైనప్రేమఁ దగ సాగరమధ్యములోన నాగబంధమున నటించు భీమజవనాదకనత్కనకాంగధామవిభ్రమఘనమీనమై మునులపాలన సల్పుచు వీఁకఁబూనవాయమరఁగ నేము సాధునిగమాగమగమ్య నదీనజాసఖా.
స్వవిధం బంతయుఁ గాననీక బహుళాజ్ఞానాంధకారంబు కన్గవఁ బైకొన్నఁ బదార్థతత్త్వ మెఱుఁగంగాలేని మా కిట్టిచోరవికోటిప్రతిభావిశేషముల నశ్రాంతంబు విశ్రాంతమౌభవదీయాకృతి చూసిప్రోవు కుహనాపాఠీనచూడామణీ.
మీనావతారమున స్వా, మీ నావఁ దరింపఁజేసి తీజలరాశిన్నే నిన్నుఁ బొగడఁ గలనే, మీనమ ననుఁ జేరి ప్రోవుమీ నలినాక్షా.
జడుఁ డజ్ఞానమున న్సుఖంబనుచు సంసారాంధకారంబునంబడి దుఃఖంబుల వెంబడింబడి సుఖంపన్లేక వేసారి నీయడుగు ల్చి త్తములోఁ దలంచి నుతిసేయ న్వానికారుణ్యపుంగడగంటం దిలకించి ప్రోతువు జగత్కల్యాణసంధాయకా.
నే నెవ్వఁడ నాకీయ, జ్ఞానం బేమిటికి వచ్చెసంసృతిదుఃఖంబేనాఁడు వాయు మోక్షం, బే నెన్నఁడు గాంతుఁ దెల్పవే కరుణాబ్ధీ.
నావిని సత్యవ్రతధా, త్రీవిభుఁ గరుణాకటాక్షదృష్టిం గని రాజీవాయితపాండరరా, జీవాయతలోచనుఁడు వచించె మృదూక్తిన్.
నేను న్నీ వనుటయె య, జ్ఞానం బందుననె గలిగె సంసృతియా యజ్ఞానము దెగ నదియుం దెగు, జ్ఞానము సమకూరు మోక్షసౌఖ్యము దొరకున్.
విను మిది రజ్జువు ఫణిగా, దని తెలిసిన భయము నుడుగు నటువలె జీవుండనుగాను బ్రహ్మ మని తెలి, సిన నిర్భయుఁ డగుచు ముక్తిఁ జెందు నరేంద్రా.
విను బ్రహ్మానందము తెలి, సినవాఁ డెందులను భయముఁ జెందఁ డనంగావినవే శ్రుతివాక్యంబుల, ననఘా తత్ప్రీతిఁ జెంద నర్హము గాదే.
బహుజన్మముల సాధుపరిచర్య చేసినఁ బుణ్యపురాణార్థముల నెఱుంగుఁబుణ్యపురాణార్థముల నెఱింగినయంత సత్కర్మ మెప్పుడు సలుపుచుండుసత్కర్మ మెప్పుడు సలుపుచునుండిన మత్పాదభక్తి యాత్మను జనించుమత్పాదభక్తి యాత్మను జనించినమాత్రఁ గొనసాగి జ్ఞానంబు కుదురుపడును
జ్ఞానమునఁ బూర్వకర్మసంచయము లెల్లఁ, దీఱు నప్పటికర్మము ల్ద్వేషహితులకగును బ్రారబ్ధ మనుభూతమగుచుఁ దెగిన, జనుఁడు గైవల్యసామ్రాజ్యసౌఖ్య మొందు.
అని మఱియు సాంఖ్యయోగక్రియాదిబోధ, సాధకం బైన సపురాణసంహితాక్రమము సవిస్తరముగ సంశయములు దీఱ, యముల కెఱిఁగించుచున్న యయ్యవసరమున.
అబ్రంబైన భుజాబలద్రఢిమ వాహగ్రీవుఁ డత్యంతసుప్తబ్రహ్మాస్య సమీరనిస్సృతములౌ తమ్ముం బ్రమోషించి యయ్యబ్రాశిం జొఱఁబారుచో శ్రుతులు హాహాకారము ల్మీఱఁగానబ్రహ్మణ్యము వెట్టినం గపటమత్స్యం బేగెఁ దద్రక్షకున్.
కమలజాతభవాండకర్పరం బొరయంగ మెఱుఁగుబంగరుచాయమేనిఁ బెంచుబిరుదువజ్రపుగండపెండారమై మీఱుకొమ్మున శేషాహి గ్రుచ్చి యెత్తుదిక్కుంభికుంభము ల్వ్రక్కలై ముక్తాఫలములు పై కెగయ వాలమునఁ గొట్టుబడబానలము దపింపఁగఁ జేయు రూక్షవీక్షణముల విస్ఫులింగములు దాల్చు
భావిమంథమహీధరభ్రమణరీతిఁ, దెలుపుపొలుపున గిరగిరఁదిరుపుగట్టునబ్ధి నేకాంతలీలావిహారలోలుఁ, డైనహాటకకపటపాఠీనవిభుఁడు.
అని తెలిపిన వైశంపా, యన శమధనలోక నిర్జరాధిపుతోడన్జనమేజయవిభుఁ డనియె, న్వినయము రెట్టింప మిగుల విస్మితుఁ డగుచున్.
ఓవాచంయమిచంద్ర సంద్రములు నేఁ డొండైనవేళన్ హయగ్రీవుం డెక్కడనుండె నేకరణిఁ జేరె న్సత్యలోకంబు రా
జీవోత్పన్నుఁ డెఱుంగకుండ నిగమస్తేయంబు గావించి వాఁడేవంక న్వసియించెఁ దెల్పఁగదవే యేతత్పురావృత్తమున్.
అన వైశంపాయనముని, విన విన నిం పొంద నిట్లు వినిపించె ఘనాఘనఘనరవగౌరణలం, ఘనజాంఘికనవరసార్థగంభీరోక్తిన్.
మును చాక్షుషమన్వంతర, మునను హయగ్రీవనామమునఁ దగుదనునందనుఁ డతిఘోరతపశ్చ, ర్యను హరు సంతుష్టుఁ జేసి యాహరుకరుణన్.
వనరాశి భువనమోహన, మను నగరం బొకటి దానవాధ్యక్షత్వంబును నిర్జరవరజిత్వర, ఘనబాహుబలంబుఁ గాంచి కదనోన్ముఖుఁ డై.
రుషితుఁడుగా గిరి గుహలం, దుషితత్త్వము గన్నసురల కుచితంబయ్యెన్దుషితత్వము పరు విడు నని, మిషపతియు మనోజవాఖ్య మించవహించెన్.
ఇట్లు దురతిక్రమనిర్వక్రదోర్విక్రమంబున శక్రాది సకలలోకపాలకులంబువికలంబు గావించి తదీయపదంబు లాక్రమించి వారలు దనపదంబు లాశ్రయింపభువనత్రయం బేకాతపత్రంబుగాఁ బాలించుచుండి యొక్కనాఁడు.
హరిహయవహ్నిసౌరిదనుజాప్పతి వాయు కుబేర శంకరుల్సరసత గొల్వుమ్రొక్కు లిడ స్వామి పరా కవధారు దేవ హెచ్చరిక యటంచుఁ గంచుకులు సారెకు నూరెల నుగ్గడింపఁగానురుమణిపీఠి నిండుకొలువుండి నిశాచరనాథుఁ డిట్లనున్.
ధీరహితులఁ దనమంత్రులఁ, జేరంగాఁ బిలిచి యతివిజృంభితవర్షాప్రారంభాంభోధరగం, భీరవచోగుంభనంబు మించ వచించెన్.
అఖిలదిక్పాలకాధిపత్యంబు మనకుఁ, జెల్లుచుండఁగ నిది యేమి క్షితిదివిజులుయాగభాగంబు లర్పింప రంచు నొకని, శాచరునిఁ బంప వాఁడు యాజకులకడకు.
చని “యింద్రాయస్వాహ”, యనుచుఁ బురోడాశ మిచ్చు నవసరమున హోతను జెయివట్టి యహో నిలు, మని గద్దించుచును బలికె నందఱు వినఁగన్.
సౌవర్ణాచలధైర్యకల్పితతపశ్చర్యాసహర్షీభవజ్జీవంజీవసుహృత్కళాధరవరశ్రీదర్పభీతామనాక్సేవాసాంజలితానమద్ధరిహయగ్రీవుం డనాఁగా హయగ్రీవుం డేలెడు ముజ్జగంబులు గనత్కీర్తిప్రతాపంబులన్.
జేజే యనుచు మ్రొక్కు జేజేలరాయఁడు వేఁడికోనని చూచు వేఁడివేల్పుదండంబు ధరియించు దండపాణి తదాజ్ఞ దా నవుదలఁ దాల్చు దానవుండుచేతులు మొగించి ప్రచేతుండు భజియించు గతి నీవె యని సదాగతి చరించుధర్మువంచు మనుష్యధర్ముఁడు ప్రార్థించు శంకచే శరణొందు శంకరుండు
జలధి సొరబారు హరియును జడధి యగుచు, గట్టుమెట్టును బులితోలు గట్టుదంటదెసలదొరలకె యిటువంటిదెసలు దొరలఁ, గలరె పరు లింక నతనితోఁ గలని కెదుర.
ఓవిప్రులార వినుఁడీ, నావచనము నేఁటినుండి నన్నేలు హయగ్రీవునకు యాగభాగము, లీవలయు న్వహ్నిముఖుల కీవల దనినన్.
ఏమేమి తాఁగాక యిఁక నెవ్వరున్నారు యాగభాగంబుల కనెడువారుఁదన కేల వచ్చె నింతమదాంధకారంబు తనువొల్లఁ డేమొకో యనెడివారుసలుకక దుర్భాషలాడెడి దూతజిహ్వయె చీల్పవలయుఁబో యనెడివారలెంతవింతలు పుట్టె నిది యేమి హేతువో యంచుఁ జిత్తమునఁ జింతించువారు
నొదిగి యేమనకూరక యుండువాఁర, లేమియుత్తర మంచు నూహించువారునగుసదస్యులలోఁ గొంద ఱార్యు లిట్టు, లనిరి సమయోచితంబుగా దనుజుఁ జూచి
నీవు సెప్పినబుద్ధి యెంతేని లెస్స, కాదనఁగ రాదు మాకు లోకముల కెల్లనేత గాఁడె హయగ్రీవనిశిచరేంద్రుఁ, డైన నొకమాట గల దెట్టు లనిన వినుము.
వేదోక్తవిధిని మేమా, యాదివిజుల కొఱకె యిత్తు మధ్వరభాగంబేదిక్కున స్వాతంత్రం, బేదీ మా కనిన దనుజుఁ డేగి రయమునన్.
ఆవార్త ల్వినిపింప దైత్యపతి రోషావేశ ముప్పొంగ నాహా వేదంబుల యాగభాగము లమర్త్యశ్రేణికేగాని మాకేవంకం బనిలేక యుండునటుగా నేర్పాటు గావించెఁ గానీ వేగంబ హరించి తచ్ఛ్రుతులు భగ్నీభూతము ల్సేసెదన్.
అరయఁగాఁ గశ్యపబ్రహ్మ కగ్రమహిషి, యైన దితిపుత్రులము గాన నాదిదేవతలము మే మట్టిమాకు నధ్వరములందు, భాగములు లేమిదేమి పాపంబుగాదె.
అహహ సత్రంపుఁగూటికి నమరవరులె, కాని మే మర్హులము గామెకాయటంచుఁబరిహసించుచు నత్యంతపరుషరోష, రసకషాయితనేత్రుఁ డై యసురవిభుఁడు.
ఇంక నేఁడు మొదలు నెవ్వరు వేదముల్, దలఁతు రట్టివారు దండ్యు లగుదురనుచుఁ జాటఁబంచె నఖిలలోకంబుల, దానవులకుఁ గలదె ధర్మచింత.
అంత.
ఆవార్త లెల్ల నారదు, చే విని వీఁ డెంత దుడుకు చేసె నటంచున్భావంబు గలఁగ శుక్రుఁడు, వేవేగ న్వచ్చె దైత్యవిభుసభఁ జేరన్.
వచ్చిన మునిపతితోఁ దన, ముచ్చట దనుజుండు దెల్ప మునిపతి దనలోనచ్చెరువందుచు నిదియే, మిచ్చఁ దలంచితివి దానవేశ్వర చెపుమా.
అక్కటా స్వయంవ్యక్తము లైనశ్రుతుల, నౌనుగాదనఁ దగునె యయ్యజునకైనసురలయందును ధర్మ మసురులయందుఁ, గలుషమును గల్గ మీకు భాగములు గలవె.
కలకాలము పరకాంతలఁ, గలయందలఁచుటలు హింసగలగుణ మయ్యెంగలవే ధర్మంబులు మీ, కలకలహములందెకాక యసురాధీశా.
అనిన నాగ్రహ మొదవ లోనడఁచి నెలవి, వారఁగా నవ్వి దైతేయవీరుఁ డనియెనెంతమా టానతిచ్చితి రే నెఱుంగ, నే సుధాంధులధర్మంబు లింత యేల.
అమరనాయకుఁ డహల్యాకాముకుఁడు గాఁడె శిఖి ఋషిస్త్రీల కాశింపలేదెసతతంబు యముఁడు హింసకుఁ బాలుపడఁడె రాక్షసులలోపలివాడు గాఁడె నిరృతివీర్యంబు ఘటములో విడువఁడే వరుణుండు పననుండు గన్నెలఁ బట్టలేదెశివ కపరాధంబు సేయఁడే ధనదుండు భర్గుం డొనర్పఁడె బ్రహ్మహత్య
హరియు భృగుపత్ని నొంపఁడే యజుఁడు గూఁతుఁ, గలయఁడే శశి గురుకాంతఁ గలసికొనఁడెయింక శుద్ధాత్ము లగువేల్పు లేరి వేలు, మడఁచి యెఱిఁగింపుఁ డెఱిఁగిన మౌనివర్య.
తాము చేసినయవి యెల్ల ధర్మములఁట, మేము చేసిన దఘమఁట మేలుగాదెయేకరణి వచ్చె వారల కింతయగ్ర, గణ్యతయు మాకు నింత లాఘవము జగతి.
ఎక్కడిధర్మ మేటిశ్రుతు లింకన నేటికి నేను రాజునైపెక్కువ ముజ్జగంబులు నభేద్యపరాక్రమలీల నేల నన్నెక్కుడుభక్తితోఁ గొలువ నిచ్చెదఁ గోరినవారికోరికల్దక్కిన నోర్తుఁగాని పరదైవముల న్భజియింప నోర్తునే.
మీరు విచ్చేయుఁ డనుచు సమృద్ధిరోష, మెసఁగ డిగ్గన లేచి యయ్యసురవిభుఁడునగరిలోనికిఁ బోవ దానవగురుండు, నచ్యుతుఁడె చక్కఁబెట్టెడు ననుచుఁ జనియె.
మునివృత్తి “నో” మని ముక్కు పట్టి జపంబు చేయఁ డొక్కరుఁ డేని జిత్తశుద్ధి“నగ్నయేస్వాహా” యటంచు వేలిమియందు నొకఁడైన యాహుతి నొసఁగఁబోఁడు“హరిరోహరి” యటంచు నాయాయిపుణ్యతీర్థంబుల నొకఁడైనఁ దానమాడఁడుపదేశ మొనరింప రొగిఁ “దత్త్వమసి” యంచు సామవేదంబుల సరవినొడివి
భూసురులలోన నింతేల భుక్తివేళ, నైనఁ “జిత్రాయనమ” యని యన్న మిడ రదేమి జెలువుదు నింక శ్రీరామరామ, తలఁప దోసంబు నాఁటిదుర్దశలతెఱఁగు.
లేశమాత్రంబు ధర్మంబు లేనికతన, జను లనావృష్టి నతివృష్టి సమయ విలయసమయ మగుటయు జలధు లైక్యమును జెండ, భువనమోహన మసురపుంగవుఁడు చేరి.
ఇంక నా కిది వేళయంచు ననేకసంగరరంగనిశ్శంకబాహుమహస్సనాథుల సైన్యనాథులఁ బుత్రులం
బంకజాక్షులఁ గార్యదక్షుల బంధులం దగువారలంగొంక కప్పురి నిల్పి దానవకుంజరుండు మదాంధుఁడై.
మందులముడితాట మలఁచివేసినసిగఁ బొల్పుగానఁగనీని బొమిడికంబుపరులకుఁ దాను గన్పడకుండ ఫాలభాగమునఁ బెట్టినయట్టి కావిబొట్టునెడవంకఁ బచ్చరాపిడివంకిఁ బొంకించి చారికట్టిన నీలిచాయదట్టివలకేలఁ బిడెము డాపలికేలఁ గేడెంబు నంగంబునందు వజ్రాంగిజోడు
మీఱ మఱియును దైతేయచోరభటుఁడు, కుఱుచకన్నపుఁగత్తి సొక్కుపొడిబరణిమూలిక ల్మణు ల్వాకట్టు మొదలుగాఁగఁ, జోరసంగ్రహణీయవస్తువులు గొనుచు.
ఇత్తెఱంగున నత్తురంగగ్రీవుం డుత్తరంగితోత్సాహసాహసంబులు మనంబునంబెనంగొన నభంగతిమిరభంగచంగన్మణిస్థగితగోపురం బగుపురంబు వెలువడినలుగడలం గడలి విలోకించుచు నొకించుక గొంచక రసాతలశ్రూయమాణవిరించిచంచలలోచనాకరాంచలసమంచితవిపంచికారవవంచనాచుంచుచంచత్తరంగాయమాననాగకన్యకానన్యసాధారణానూనగానతానమానంబులకుం జొక్కుచు మయమాయానియమితోపరిహరిత్పరిచ్ఛదవితానాయితతోయధిం జొచ్చి ఘనాఘనఘనాపఘనజవజాయమానపవమానదోధూయమానజలచరవర్గం బగుబాహుద్వయద్వయసమార్గంబు పట్టిపోవుచు నాడాడ సభ్యవహారంబులకై విహారంబులు సలుపు విహారంబుల కరతలప్రహారంబులం జమున కుపహారంబులు సేయుచు వక్త్రంబు లగునక్రంబుల చక్రంబులనాక్రమించి చక్కు సేయుచుఁ గులాచలచక్రక్రమవక్రచంక్రమవిక్రమాభితఃక్షుభితసర్వతోముఖత్వరితసర్వతోముఖపరిపతజ్జలచరగ్రసనవ్యననవ్యగ్రపరివృతాయమాననానామహామీనాననంబులు సొచ్చి యుదరంబులు వ్రచ్చియు గాఢతరకంచుకవ్యూఢోరుస్తటి ఘణిల్లన మైనాకాదికులపర్వతంబులందాఁకుచు నిజావలోకనభయపలాయమానమానుషీవితానంబు లనవసరపదవిలగ్నవిద్రుమలతావలయపతితజలమాణవకులం గనుంగొని హసించుచు నఖండగండతలమండనాయితపిచండిలమదప్రచండసముద్దండంబు లై యొండొండభండనంబులు సల్పుచుఁ గాండవేదండకాండప్రకాండంబుల నడుమఁదూఱి హరిదంతదంతిదంతురితకాంతిమంతంబులగు తదీయదంతిదంతంబులం బెకల్చి వరుణాంభోజనయనాకుచకుంభవిజృంభమాణావష్టంభసంరంభంబు లగుకుంభంబుల మౌక్తికంబు లెడల వ్రేయునెడల జడిసి పరువిడ బెడిదమగు ఘీంకారంబుల నంకురించిన శంకాతంకంబుల వడంకుచుఁ దమతమయంగనామణు లొసంగుహఠాలింగనంబుల నుప్పొంగు జలమానుషకుమారవర్గంబుల మ్రొక్కులు
గైకొంచు నెడనెడం ద్రోవకడ్డంబై మెలంగు జలభుజంగంబులం గనుంగొనిదుశ్శకునంబని తలంచుచుఁ జేనొడిసి జిరజిరం ద్రిప్పివైచునెడ ఫణామణులు చెదరి విస్ఫులింగంబులగములవలెఁ జూపట్టి యేపట్టున నిలువంజాలక మూలమూలలకరుగు మకరకర్కటకాదిజంతుసంతానంబుల కగుబడబానలసంతాపంబునకుఁగొంత చింతించుచు భవిష్యత్కమఠధృతమందరవసుంధరాధరసూచకంబు లగుచు గిరులక్రింద నందందఁ గ్రందుకొనుకూర్మంబులు గ్రుంగ శృంగంబులమెట్టి లంఘించుచు ఘృతపరిఫ్లుతసముజ్జ్వలదౌర్వజ్వలనజ్వాలికాసంతాపశర్కరాయితేక్షురసవ్యంజనసమంజసంబు లగుదుగ్ధంబులు గ్రోలుచుం దనివి సాలకలవణరససంమిశ్రంబు లగుదధిఖండంబుల మెసంగుచు శుద్ధోదకంబుల గండూషించుచు హేలావధారితహాలారసపానవేలావిలోలాయితకాలానలకీలాకులసమాకులాభీలారుణశోభాలవాలవిశాలలోచనగోళంబులు ద్రిప్పుచు సోలుచు జంబూప్లక్షాదిద్వీపవృక్షద్విత్రిమాత్రావశిష్టశాఖావలంబనంబునం గొంతవిశ్రాంతుం డగుచు దివాకరమార్గంబు నిర్గమించి సుధాకరపథం బంటి తారాపథంబున కెగసి బుధాదిగ్రహంబుల నతిక్రమించి ధ్రువమండలంబు దండకుం జేరిమహర్లోకపథంబునం బయలుదేఱి ప్రాప్తసంయుగవిలయసమయసముత్క్షిప్తసప్తసప్తిదీప్తితతప్తు లగుచు నుపరిలోకంబులు వలసలు చేసి మరలి తమతమయగారంబులం జేరువారి నాలోకించుచు దాహాదివర్జితులై విరాజిలు వైరాజలోకంబగు జనర్లోకంబుఁ బ్రవేశించి యవ్వల శతానందనందనసనకసనందనాదిమునిబృందారకమునిబృందసహస్రారవిందబంధుబంధురప్రభాదురవలోకం బగుతపోలోకం బస్తోకప్రయత్నంబునం గడచి యాకడం జనిచని.
కడవన్నెతళుకుబంగరుకోట కెంజాయ సంజకెంజిగిరంగు సవదరింపఁదోరంపు ముత్యాలతోరణంబుల కాంతి చొక్కమౌ చుక్కల టెక్కు సూపజేజేలరాఱాల చెలువంపుగృహపాళి కటికిచీకటిగుంపు గరిమనింపరాణించు జాతివజ్రాల మేడలడాలు పండువెన్నెలచెన్ను పరిఢవిల్ల
వివిధమాణిక్యదీపము ల్వెలుఁగుచుండ, స్మరరణశ్రాంతమిథునలోచనసరోరుహములు ముకుళింప నైశధర్మముల నొందు, సత్యలోకంబు గనుఁగొనె దైత్యవిభుఁడు.
కనుఁగొని విశ్వకర్మకరకౌశలి మెచ్చుచు రాజవీథులంజనిచని ముందట న్వెలి హజారము వెల్వడి వచ్చుచున్న యాసనకసనందనప్రముఖసంయములం గని పెద్దకొల్వు దీఱె నలువయంచు నెంచి నడురేయి నిశాంతము సొచ్చి యచ్చటన్.
ఉపసృష్టి క్రమమెల్ల నొప్పించి బహుమానమంది వచ్చిన కర్దమాదిఋషులజనులకర్మశరీరసంఖ్య లెల్ల దినాంతకము వేసి లిఖియించు కరణికులనుదమతమయాధిపత్యములు దీర హజారమందుఁ గాపున్న యింద్రాదిసురులవినికి వేళ యటంచు వీణలతంత్రులు సారించుతుంబురునారదులను
దానవరుసల పెంచు గంధర్వగాయ, కులను జతగూడునట్టువకొలమువారిఁగాసెగట్టు వియచ్చరకంబుకంధ, రలను జూచుచుఁ గక్ష్యాంతరములు గడచి.
తోరంపుసాంబ్రాణిధూపధూమము గట్టు పగదాయబాబాలబారు దీర్పబంధురమురజధింధింధిమిధ్వానంబు బహుళగర్జావిజృంభణము నెఱపవేలుపుమిన్నల వివిధభూషణకాంతి శక్రచాపస్ఫూర్తి సవదరింపఁదిరుపులగట్టు బిత్తరులమైఁదీఁగెలు గ్రొక్కారుమెఱుఁగులకోపుఁ జూపఁ
బుష్పవర్షంబు వడగండ్లపొలుపు దెలుప, సారమృదుగీతికామృతాసార మెసఁగవర్షవేళను బోలు నవ్వనజభవుని, నాట్యశాలను దడసె దానవవిభుండు.
అజుఁడు గొలువుదీరి యంతిపురంబున, కరుగుదనుక నొక్కయరుఁగుగప్పురాలత్రోవఁ గానరాకుండ డాఁగి యా, వెనుక మెల్లన వలఁజనుచు నెదుట.
భానుపరిపూర్ణనీహారభానుచిత్ర, భానుభానుమహోజనిస్థానదృశ్యమానమాణిక్యదేదీప్యమాన మైన, కాళికాగేహపాళి వీక్షించికొనుచు.
శారికాకలకంఠసగుణనిర్గుణవాదనిర్ణయప్రవణవాణీశుకంబురథవియోజితమనోరథమనోజ్ఞవిహారహారివాహనరాజహంసకులమునశ్రాంతవికచహేమాంభోజవిహరమాణాజ్ఞాతవిరహిరథాంగయుగముభారతీగళరవాభ్యసనలీలాలోలకవకివకలరవకలరవంబు
గురుకుచాహాసపుషితచకోరకంబు, గానవిద్రవమాణశృంగారసౌధచంద్ర తాంబుకణపాయిచాతకంబు, నగుచుఁ జెల్వొందు కేలీగృహంబునందు.
తళుకుంజప్పరకోళ్లమంచమున నిద్దాజాజిపూసెజ్జపైఁబలుకుంజిల్కలకొల్కి రాచిలుక బాబాసాహిబూనెయ్యపుంగలనన్ సౌఖ్యము గాంచి మైబడలఁగా గాటంపునిట్టూరుపుల్వొలయ న్నిద్రితుఁడైన పద్మభవు నాలోకించి యాలోపలన్.
అతులమాణిక్యదీపము లార్పరామిఁ, దనదు నెమ్మేనిచాయ నత్తఱి శయించియున్నయుడిగెపుపూఁబోండ్లయొడలిమీఁదఁ, బాఱనియ్యక యొకయోరఁ జేరవచ్చి.
అతులంబై తగు బ్రహ్మవర్చ సము డాయన్రామిఁ బొంచున్నచోనతివేలాయితనాసికానుషిరయాతాయాతనిశ్వాసమారుతసంక్షుబ్ధచతుర్ముఖంబులను మూర్తు ల్దాల్చి వేదాళినిస్రుతయైనన్ హరియించె దక్షణమ రక్షోభర్త విభ్రాంతుఁడై.
హీరకుట్టిమభూము లిసుకనేల లటంచు గట్టఁగా నడుగులు పెట్టవెఱచుఁబచ్చరాకట్నంబు పచ్చికపట్లని వెడవెడ మునివ్రేళ్ల నడచిపోవునిలువుటద్దంబుల నీడలు పరికించి పరులంచుఁ జేకత్తి పదిలపఱుచుఁదానువచ్చినతోవ గానక తలబొప్పిగట్టిఁగాఁ గుడ్యభాగములఁ దాఁకుఁ
దడఁబడుచు నిద్రపోయెడి తలిరుఁబోండ్ల, పాదముల మెట్టుఁ గాని మున్పంటిధైర్యమూనలేఁడయ్యె విను మెంతవానికైన, దొంగతన మన్నయప్పుడె దొడరుభయము.
అంత నొక్కక్రమంబునం దనుజాధినాథుఁడు భారతీకాంతుకేళిగృహంబు వెల్వడి కంధిగర్భముఁ జేరఁబోనెంతయు న్మొఱవెట్టె వేదము లీశ్వరా మము దేవతాహంతచేఁ బడకుండఁ బ్రోవవె యంచు బెట్టుగ భూవరా.
అప్పు డచ్చెరువందుచు నంబురాశి, దరినినుండెడి సప్తర్షివరు లిదేమియార్తనాదంబొ కపటమీనావతార, తేటతెల్లమిగా మాకుఁ దెల్పవలయు.
నావుడు శాంబరీశఫరనాయకుఁ డిట్లను మౌనులార వాణీవిభుఁ డిఫ్డు మైమఱచి నిద్దుర వోవఁగఁ జూచి యాహయగ్రీవుఁడు చోరవృత్తిని హరించి తముం గొనిపోవుచుండఁగాఁగావఁగ దిక్కు లేమిఁ గడఁక న్మొఱవెట్టఁదొడంగె వేదముల్.
కావున మ్రుచ్చురక్కసునిఁ గ్రక్కున నొక్కట నుక్కడంచి వేదావళి నుద్ధరించి క్షణదాంతవినిద్రితుఁడైన బ్రహ్మ కీఁబోవలెనంచు మించుజలమున్ బలముం గలముం బయోధి నెంతేవడి మీఱడించి దురతిక్రమవేగపరాక్రమంబునన్.
సమయాంభోనిధిఁ జొచ్చి చండతరచంచద్వాల మల్లార్చుచున్సమరోజ్జృంభితజంభశాసన భుజాస్తంభాగ్రదంభోళి దుర్దమశృంగంబున వేదచోరపురవప్రశ్రేణికల్ నుగ్గునూచముగాఁ దాఁకె సుధాశనాసహనయోషాగర్భనిర్భేది యై.
అటులం దాఁకిన యంత దంతికరలూనాబ్జంబు చందంబునన్స్ఫుటితం బైనపురంబు వేవెడలి రక్షోవీరు లీక్షించి యెచ్చొటలే దిట్టికడానిచోఱ యిది గొంచుంబోయి చేకాన్కగా
ఘటియింపందగు దైత్యనేత కని దోర్గర్వం బఖర్వంబుగన్.
గాలములు వైచువా రది కాదటంచుఁ, బెనువలలు వేయువా రవి పనికిరావటంచు వడిగా రచెక్కకై యరుగువారు, నైన యసురుల కనియె నమ్మీనమూర్తి.
ధీవరులార గాలము తుదిం బలంబుగ నెఱ్ఱగ్రుచ్చి మీరీవగ వైచినం దగుల నేటికి నేఁటికి వింతమాంసమున్గావలెనంచు వచ్చితిని గావుననేవలెనన్న మీ హయగ్రీవుని గ్రుచ్చి వైవుఁడు హరింపుదు నంతట మిమ్ముఁ జేరుదున్.
ఇంత ప్రయాస మేల చనుఁ డిప్పుడ యంచును వారు సూడఁ దానింతయి యంతయై వెనుక నేనుఁగయంతయి కొండయంతయైయెంతయుఁ బెద్దయై కడలియెల్లెడ నిండి సహస్రయోజనాక్రాంతతనూవిలాసమునఁ గన్పడఁ జూచి నిశాటసైనికుల్.
నరభక్ష్య మైనమీనము, నరభోజనభక్ష్య మౌ ననఁగఁ జిత్రం బేపరికించెద మిట నేఁడా, సురపతి నిను దినుట నీ వసురపతిఁ దినుటల్.
పదరం గారణ మేమి యంచు దనుజు ల్బాహాబలప్రౌఢిచేఁగదల న్మోఁదుచు నీఁటెలం బొడుచుచున్ ఖడ్గంబులం జించుచుంగదియ న్గన్గొని మత్స్య మొక్కపరి శృంగం బట్టిటుం ద్రిప్పఁగానుదరంబుల్ శిరముల్ దెగంబడిరి దైత్యు ల్వేనవే లొక్కటన్.
ఆవార్తల్ హతశేషసైనికులచే నాలించి సేనాని దానీవేళం జని దానిఁ దెత్తునని వే యేతేరఁ ద ద్వాలలీలావిక్షిప్తమహానగాళిపయి వ్రాలం గూలె సైన్యంబుతోదేవారాతివరూథినీవిభుఁడు మధ్యేరాజమార్గంబునన్.
అంత.
వాలోత్క్షిప్తగిరు ల్సురారివురిపై వ్రాల న్విశీర్ణంబు లైరాలె న్గోపురముల్ గృహంబు లురిలెం బ్రాసాదముల్ నుగ్గులైతూలె న్గోటలు మ్రగ్గె సౌధములు దోడ్తో ఛిన్నభిన్నంబు లైవ్రీలె న్మండపపంక్తు లొడ్డగిలె నావిర్భూతఘోషంబునన్.
వానిలోపల నొక్కపర్వతము వచ్చి, తాను గొలువున్న కేళిసౌధమునఁ బడినఁబెగిలి పైఁబడఁ జేతులఁ బట్టి యవల, వైచి వెల్వడివచ్చి నిశాచరుండు.
అగమురాఁ గారణం బేమి యనుచు మంత్రి, జనుల నడిగిన వారలు వినయముననుదేవ యొక పైఁడిచోఱ యీదీవి చేరి, విస్మయము సేయుచున్న దీవివిధగతుల.
తిమితిమింగిలముఖ్యదీర్ఘమత్స్యంబులఁ గొమ్మునఁ గుదులుగాఁ గుచ్చి యెత్తుదనసంతతికి మేతఁగొనివచ్చురీతి దిక్కరిశరీరంబుల గరులనానుదృఢవాలమున గట్టు లెగయంగఁ గొట్టుచుఁ గేలిమైఁ గందుకక్రీడ సలుపునుగ్రసత్త్వాహార ముపశమించుటకు నా బడబానలము గ్రోలి పాఱవిడుచు
నాశరచ్ఛేదనముఁ దృణప్రాయముగను, జలుపు టేవింత యదియె కావలె నటన్నగుటుకుమనకుండ బ్రహ్మాండకోటి మ్రింగి, సప్తజలధులు ద్రావదే క్షణములోన.
అని మంత్రులు వినిపించిన, విని నవ్వుచు లేచి దైత్యవిభుఁ డది యేదీకనుఁగొందము గా కని తను, దనుజులు గొలువంగ వార్ధితటగతుఁ డగుచున్.
కనియె న్దానవసార్వభౌముఁ డెదుటం గల్పాంతపాథోధిరాడనుగామీనము సాధులోకవిపదాయాసచ్ఛిదావ్యాజసంజనితోద్యత్కరుణాధృతాయతతరీసప్తర్షిభూమీనమున్ఘనదంష్ట్రాంగవిభాజితాయుతతమీకామీనము న్మీనమున్.
కని యిది మీను గాదు లయకాలమహాబలనీయమాన కాంచనకుధరంబ యంచు మది సందియమందుచుఁ గాలరుద్రశూలనిభసహస్రదంష్టలు జ్వలద్బడబానలకీల లోలిలోచనములు ధూమకేతుసదృశంబగు వాలము చూచి నివ్వెఱన్.
ఇది మీనంబగునైన నేమి యసిచే నింతింతగాఁ ద్రుంతునోకుదియంగొట్టుదునో గద న్నిశితమౌ కుంతంబునం గ్రుచ్చి యెత్తుదునో మీఁదికి నిప్పుడంచు మిగుల దుర్వారగర్వాంధుఁడైకదియంజూచి మృషాఝషాధిపుఁడు జాగ్రద్వాల మల్లార్చుచున్.
శార్ఙ్గలీలావినిర్ముక్తశరముల రిపు, సేనఁ గీలాలసిక్తంబు సేయుశౌరిశార్ఙ్గలీలా వినుర్ముక్త శరముల రిపు, సేనఁ గీలాలసిక్తంబు సేసె నపుడు.
ఓరినిశాచరాధమ పయోరుహగర్భుఁడు నిద్రవోవఁగానూరక యేల తెచ్చితివి యుత్తమవేదము లందు నేమిచేకూరెను నేఁడు నీ కకట క్రోఁతికి మానిక మేల గూలఁగాఁగారణముంటఁ జేసి చెడుకార్యము చేసితి వింతె యిమ్మెయిన్.
అన విని నీవా యెవరో, యనియుంటిని మంచికార్యమాయెను నేఁ జేసినపుణ్యంబునఁ గా నినుఁ, గనుఁగొనఁగాఁ గలిగె నింతకాలంబునకున్.
నే నేదిక్కునఁ జూతునో యనుచు నెంతేభీతి వారాశిలోమీనంబై మిడుకంగఁ జొచ్చితి వయో మేలే హరీ దీనికింకే నేమందును డాఁగఁబోయినఁ దలారిల్లయ్యె నేఁ డేడకుంబోనౌఁ జిక్కితి వంటయింటిశశమై బోనంపుఁ బెన్గూటికిన్.
ఇదె కనుఁగొమ్మటంచు నిటలేక్షణరూక్షకటాక్షవీక్షులన్గుదిగొని నిప్పు లుప్పతిల ఘోరతరభ్రుకుటీకరాళమైవదనము భానుమండలము వైఖరి జేగుఱుచాయ మించఁగాగదఁగొని త్రిప్పివైచె లయకాలమహోద్ధతి తీరుమీఱఁగన్.
ఆగదాదండ ముద్దండమగుచుఁ దాఁకి, తోఁక వెండ్రుక యైనను దులుపదయ్యెనేమి చెప్పుదు బృథురోచనామధేయ, మపుడు సార్ధకమయ్యె మత్స్యంబునందు.
అంత.
ఘనరోషంబున మీనమూర్తి నిజశృంగం బెత్తి తీరస్థుఁడైమనుజాశిప్రభు నేయఁగాఁ దెగియె రంభాస్తంభముంబోలి తత్తను వచ్చో నరుణోదయం బయినచందంబొప్ప రక్తౌఘముల్వనధిం దేలె వినిద్రతం దగెఁ జతుర్వక్త్రాబ్జము ల్బ్రహ్మకున్.
నిదుర మేల్కొని వేదము ల్నెమకి కానఁ, జాల కంభోజభవుఁ డబ్ధిఁ దేలియాడుమీనమూర్తిఁ గనుంగొని మేనువొంగఁ, జేరి ప్రణమిల్లి సన్నుతి చేసె నిట్లు.
శ్రీమీనాకృతయే నమోభగవతే సృష్ట్యాదిసంధాయినేహైమాహార్యరుచే హృతానతశుచే సారావపాథోముచేసాముద్రాంబువిహారిణే దితిజనుస్సంహారిణే హారిణేస్వామి న్పాహి కృపాహి తే హితతరా సర్వేషు దేహి శ్రుతీః.
అని వర్ణించు సువర్ణగర్భునకు వేదాళిం బ్రసాదించి గ్రక్కనఁ ద్రైలోక్యము సృష్టి సేయుమని శ్రీకాంతుండు పంప న్హసాదని వాణీశ్వరుఁ డాగమోక్తముగ సూర్యాచంద్రతార స్దావంబునుభూమిన్నభము న్సృజించెను యథాపూర్వంబుగా నంతటన్.
అనఘుండగు సత్యవ్రతు, మనుపట్టము గట్టె శౌరి మన్ననఁ జతురాననుఁ డాతఁడె వైవస్వతుఁ, డను పేరంగలిగి యిప్పు డలరె న్మిగులన్.
మనుజాధీశ్వర యిందిరారమణు శ్రీమత్స్యావతారంబు భక్తిని విన్నట్టి కృతార్థు లుత్తమరమాదీర్ఘాయురారోగ్యముల్గని సత్యవ్రతసార్వభౌమునిగతిం గల్పాంతరస్థాయికీర్తిని జెన్నొందుదు రజ్జనాభుకరుణాదృష్ట్యైకపాత్రంబు లై.
అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁ డైజనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెలుపు మని యడుగుటయున్.
తనయాగ్రేసర రామదాసవిలసత్సాహిత్య హృష్యన్మనోవనజాశంకరదాస గానకలనా వైయాత్యవీణానువా
దనసమ్మోదన పద్మనాభపరితోదారార్థశృంగారఖేలనపద్యాదకరంగశాయి మధురాలాపప్రియంభావుకా.
లక్ష్మాంబికామనోహర, లక్ష్మీకరుణాకటాక్ష లక్షణలీలాలక్ష్మణవాణీవైభవ, లక్ష్మణపూర్వావతార లలితా౽కారా.
ధనపతితారణ దుర్మదతారణ దానయుతారణరంగహరాఘనగిరివారణ గర్జితవారణ గంధిలవారణ మధ్యపురాయనమవిచారణ హర్షితచారణ యంబుజచారణ కాంతిఝరావినమితకారణ వీరనికారణ విక్రమకారణ ధైర్యధరా.
ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట్రభాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగనామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణమాచంద్ర రామమంతీంద్రప్రణీతంబైనదశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.
Comments
Loading comments…