2. కూర్మావతారకథ

దశావతారచరిత్రము

నారీమణికరుణాంభోనిధిసంభవవిచిత్రభోగానందస్థానవిచక్షణ చంచన్నానాగుణకృష్ణ పద్మనాభునికృష్ణా.

అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టు లను వ్యాసశిష్యమానిధారుణీనాథ కూర్మావతార మిఁకను, దెలియఁ జెప్పెద విను మని తెలుపఁ దొణఁగె.

జగములు సృజింపఁ బోషింప సంహరింపఁ, జాలుమూర్తులఁ గని పెంపఁజాలినట్టియత్రి కనసూయకును సాటియైన మౌని, దంపతులు గల్గుదురె జగత్త్రయమునందు.

ఆదంపతులకు గిరిక, న్యాదయితాంశమునఁ బుత్రుఁ డనఁ బొడమి స్వతఃప్రాదుర్భూతజ్ఞానుం, డై దుర్వాసస్తపోధనాగ్రణి వెలయున్.

కోమలపల్లవనిభవా, సోముని: బరిపీతవసనసోముని సుషుమాసోమునిఁ బోలిన దుర్వా, సోముని నుతియింపఁ దరమె సోమునికైనన్.

ఆలీలాశివుఁ డానం, దాలోలపయోధి మగ్నుఁ డై యెల్లపుడున్బాలునివలె నున్మత్తుని, పోలికఁ జరియించుచుండు భువనములందున్.

అతఁ డొకనాఁడు సువర్ణ, క్షితిభృత్తటి విహరణంబు సేయఁగ నత్యద్భుతమై యొకవాసన రా, మతి నెంతయుఁ జెలఁగి భృంగమార్గోన్ముఖుఁ డై.

గంధర్వభామినీగానశ్రుతీభవత్కీచకనికషణోద్గీర్ణరవముకపిధూతశాఖశాఖాపతజ్జాంబవగ్రహయాళుమునికన్యకాజనంబులగ్నకాషాయకాలస్కంధమిషతటిత్వద్విలోకననటద్బర్హిణంబుశుకదష్టమాకందమకరందవాహినీతరణలీలాలోలహరిణకులము

సతతమునిదత్తహవిరన్నజనితతుంద, భారసుత్రామపహనదుర్బలఘనప్రకామబలవర్ధనోద్దామహోమధూమ, పావనం బగు నొక్కతపోవనంబు.

కాంచి తత్రత్యమౌను లాకస్మికముగఁ, దను నిరీక్షించి యయ్యష్టతనునిఁ గన్నకరణి భక్తియొనర్పఁ గ్రేఁగంటఁ గనుచు, వాసనాహేతు వరయుచు వచ్చి యెదుర.

చిన్నిప్రాయముదానిఁ జిన్నారిపొన్నారి యంచరానడలసోయగముదానిఁగొదమగుబ్బలదానిఁ గ్రొమ్మించు గ్రమ్మించు నెమ్మేనినిగనిగన్నిగలదానిముద్దుఁబల్కులదాని నిద్దంపుటద్దంపు మురిపంపుసోము నెమ్మోముదానిరవలపావలదాని రంగారుబంగారుతమ్ములఁ గేరుహస్తములదానిఁ

జెలువుగలదాని నెఱనీటు గులుకుదాని, సొగసుగలదాని బెళుకుకందొగలదానిసొంపుగలదాని నొయ్యార మొలుకుదాని, నొక్కవిద్యాధరినిఁ గాంచె యోగివరుఁడు.

అప్పు డొకయించుకేని యయ్యతివతంస, మాత్మఁ జలియింపఁ డీశ్వరాంశావతారుఁడీమహామహుఁ డంచు మోహింపఁజేయ, వెఱచెఁ గాఁబోలు నవ్వెడవింటిజోదు.

అతనుజపావృత్తి నలరారుచెలికేలు దొరసినస్ఫటికాక్షసర మనంగఁబాణిపంకజమునఁ బ్రభవించి యొండొండ దిగజారుతళుకుముత్తెపుసరి యనంగహస్తాభిధానమోహమునశయంబున వ్రాలిననక్షత్రమాలిక యనంగగమనీయనవ్యశృంగారకరోర్మికాపరిపతజ్జలబిందుపాళి యనఁగ

నఖరనిష్క్రాంతకాంతిసంతాన మనఁగ, మధుకరాకర్షి ఘుటికాసమాజ మనఁగహస్తగతకంతుభాగ్యవర్ణాళి యనఁగ, నలరుసంతానననమాల్యంబు గాంచి.

మేలుగావలె బాల నీకేలిపూల, దండకని చేరు మౌనిమార్తాండుఁ జూచిదండనుండు వధూటి కైదండ వదలి, దండ మని కేలుమోడ్చి వేదండగమన.

కులుకువలిగబ్బిగుబ్బలఁ, జిలుగుంబయ్యెంటఁ జక్కఁ జేర్చుచుఁ బలికెన్గలకంఠి బెళుకుకన్గవ, తళుకులు వేఱొక్క కుసుమదామము గూర్పన్.

ఓమునిసార్వభౌమ తపనోపమధామ గుణాభిరామ సుత్రామముఖామరు ల్భవదుదంచితకీర్తులు సన్నుతింపఁగానేమును విందు విూపదము లెన్నఁడు నేఁ గనువిందు సేయ నేఁడీమెయి సంభవించె ఫలియించెను గోరిక లెల్లఁ గొల్లగన్.

కావలసినఁ గైకొనుమా, పావన మగుఁగాక నాదుభవమదవీయంబీవన మంచు మునీంద్రున, కావనిత ప్రసూనదామ మామోదమునన్.

ఇచ్చిన మచ్చికఁ బుచ్చుక, యచ్చెలి మెచ్చుచు మునీంద్రుఁ డౌఁదలఁ దాల్చెన్జిచ్చుఱకనుదేవర వై, యచ్చరనదిఁ దాల్చుచెలువ మచ్చుపడంగన్.

ఇటుల దాలిచి సంతుష్టహృదయుఁ డగుచు, మరలి కరమునఁ గైకొని మమతమీఱఁగన్నుఁగవ నొత్తికొనుచు వక్షంబుఁ జేర్చి, కంఠమున వైచి యవల నుత్కంఠఁ జనుచు.

గంధర్వు లగ్రభాగమున జోడనమించు ఘోటుల దుమికించుకొనుచు నడువవెనుదండ యుద్దండవేదండకాండము లమదమంధరయానసరణి నడువనిరువంక నకలంకవరరత్ననిర్మితహాటకరథకోటు లరుగుదేరవెలిడాలు గ్రమ్మించు విచ్చుకత్తుల వేల్పుమూఁక లెల్లెడలఁ గ్రముకొని నడువ

రంభనాట్యంబు మిగుల సంరంభ మెసఁగ, వెల్లయేనుఁగు నెక్కి ఠీవెల్ల మెఱయవెలయు వేడుక వాహ్యాళి వెడలివచ్చు, నమరనాయకుఁ గాంచి సంయమివరుండు.

చేతి పూదండ పైని వైచిన సురేంద్రుఁ, డది కరంబునఁ గైకొని మదకరీంద్రకుంభమున నిల్పఁ జెలువయ్యె శంభుశైల, శృంగసంగతగంగాతరంగిణి యన.

అంతఁ జంచలకుంభికుంభాగ్రనిహిత, పుష్పదామంబు దిగజాఱి భూమిఁ బడియెదేవవిభురాజ్యగర్వతమోవినాశ, సూచకంబయి పడు తోఁకచుక్క యనఁగ.

అంత

శీకరమదధారాజల, శీకరభీకరము ప్రోల్లసితమధుపాళీశ్రీకర మౌ కరమున గం, ధాకరమాల్యంబు దిగిచి యత్తఱిఁ గడఁకన్.

చరణముల వాలి కర్ణదేశముల సోలి, యాశ్రితాళులు మొఱవెట్ట నాలకింపకలరుసరి రాచె మదకరి యంతెకాదె, యాశ్రితులయుక్తు లేల మదాంధులకును.

ఈమెయిఁ దా నిచ్చిన సుమ, దామము సామజము దిగిచి ధరఁ బొరలింపంగా ముని గనుఁగొని తొలుతం, గాముని హరియించుహరునిగతి నుగ్రుండై.

కటతటముల్ చలింపఁ గడకన్నుల నిప్పుక లుప్పతిల్ల భ్రూకుటి నటియింప నెమ్మొగము కోటిరవిప్రతికోటి గాఁగ వి

స్ఫుటపటుదీర్ఘనిశ్వసనము ల్బలితంపుసెక ల్విదర్పఁగాఁగిటకిటఁ బండ్లు గీటి పలికెం జటిధూర్జటి హుంకరించుచున్.

కన్నులు బ్రహ్మ రెం డొసఁగఁ గానఁగలేఁ డని గౌతముండు దాఁగన్నులు వే యొసంగె నధికంబుగ నప్డు మదాంధకారసంఛన్నము లౌటచేఁ దెలియఁజాలవు తన్మదకారణంబు నింక న్నినుఁగూడనీయ కుపకారము చేసెదఁ జూడు వాసవా.

ఏమనవచ్చు ని న్నిఁక సురేశ్వర! నే సుమదామ మిచ్చినన్స్వామి! మహాప్రసాద మని చయ్యన నంది ప్రమోదలక్ష్మి నెమ్మోము వికాస మొంద నిజమూర్ధమునం ధరియింప కీగజగ్రామణిచేతి కిచ్చి కసుగంద నొనర్చితి ధౌర్త్య మెన్నఁగన్.

ఇందునఁగాని మే మెఱుఁగమే భవదీయమహత్వ మోరిసంక్రందన నన్ను నెవ్వనిఁగఁ గాంచితి విప్పుడు విప్రమాత్రుఁగాదెందమునం దలంచితివొ డెప్పర మప్పని నన్ను విన్న గోవిందధృతాబ్జరోచిరరవిందభవాదులు దల్లడింపరే.

ఎఱిఁగెదుగాక మాట లిఁక నేటికి నేఁటికి మాటిమాటికిన్మఱచితె నామహత్త్వము సమస్తజగజ్జనగీయమాన మైమెఱయ వసిష్ఠముఖ్యు లగు మిక్కిలిశాంతులరీతిఁ జూచితోయఱిముఱి వజ్ర శుంఠవుగదా యవిదారణకారణాయుధా.

అలుకవు బ్రహ్మహత్యకుఁ బరాంగనసంగతి కోట లేదు జ్ఞాతులపగ నీకవశ్యకము దోసము సూడవు యజ్ఞవిఘ్నముల్సలుపుటకై పరోన్నతికి సైఁపవు నీకు సురేంద్రపట్టమున్నిలిపినధాత దూఱవలె ని న్నననేటికి గోత్రభేదనా.

అవిపక్షవిచ్ఛేదనాయత్తతరుఁడ వీ వవిపక్షరక్షణోదారుఁ డతఁడుపాకశిక్షణదక్షపవి నీవు సర్వతోముఖపాకపోషణోన్ముఖుఁ డతండుఘనశృంఖలాబంధకరణలోలుఁడ వీవు బహుఘనజీవనప్రదుఁ డతండుపుణ్యజనద్వేషపూరితాత్ముఁడ వీవు పుణ్యజనావాసగణ్యుఁ డతఁడు

సతతసత్త్వవిభాసి రాజసగుణాతి, దూరుఁ డబ్భువననిధినిస్తుల్యుఁ డెందుఁదలఁపఁ ద్రైలోక్యలక్ష్మి యాధన్యుఁ జేరు, నీకు నెయ్యెది యటమీఁద నిర్జరేంద్ర.

భూసురులకు నవమానము, సేసిన నెటువంటివానిశ్రీయు వెలయునేవాసవ మముఁబోఁటులకుం, జేసిన నందేమి చింతచేయఁగ నింకన్.

అన విని గుండె జల్లన సురాధిపుఁ డభ్రమువల్లభంబు చయ్యన డిగి వల్లెవాటుగ భుజాగ్రమునందగు మేలిజాళువా

జినుఁగుమెఱుంగుబంగరువుచేలచెఱంగు కటీతటంబునంబెనఁచి మునీంద్రుపాదములమీఁదట వ్రాలి వినీతి మీఱఁగన్.

స్వామీ నే మీదాసుఁడ, నామీఁదం గోప ముంప నాయమె కరుణాకోమలకటాక్షవీక్షా, శ్రీ మెఱయఁగఁ బ్రోవు నతులు చేసెద మీకున్.

భవనిభ మీ రిపు డెన్నిన, యవగుణపుంజముల కెల్ల నాస్పద మగు నేనవివేకి నౌదు నైనన్, భవదంఘ్రులు చేరినాఁడఁ బాలింపు దయన్.

నేరిచిన నేరకున్నను, గూరుచుకొని రాక మీరె కోపించిన నెవ్వా రిఁక మాకు శరణ్యులు, కారుణ్యం బుంపవయ్య కరుణావార్థీ.

పెక్కువగల హరి యిటువలెఁ, బెక్కువగల వేఁడ మౌని పృథుహుంకారమ్మక్కువ గలఁజేయఁగ లో, మక్కువ గలయట్టు లనియె మఘవునితోడన్.

విబుధనాయక నీవెంత వేఁడికొనిన, నాకు దయరాదు శాంతి యెన్నఁడు నెఱుంగనట్టిమౌనులు వేఱె మమ్మటులు గనకు, కఠినచిత్తుని దుర్వాసుఁగా నెఱుంగు.

గౌతమాదులు ని న్నొకఘనునిఁ జేసి, వినుతి సేసిన నీవును విఱ్ఱవీఁగియిటులు నవమతి చేసితి వింతె కాని, యెఱుఁగలేవైతి మమ్ముల నించు కైన.

తనకుఁ బ్రత్యుత్థాన మొనరింపకుండిన క్షమియించుకొన బృహస్పతిని గానుదనభార్య బలిమిఁ బట్టినఁ జూచుకొని తాళుకొన నే నలయుతధ్యమునిని గానుదానంపిన త్రిశంకు ధరణి ద్రొబ్బంగఁ గాంచియును సైరింపఁ గౌశికుఁడఁగానుదనయాగమున నాయుధమును వైచిన తప్పుఁ బాటింపమికి గురుభ్రాతఁ గాను

దనకళత్రంబు లోఁజేసికొనుట యెఱిఁగి, యమితనేత్రము లొసఁగ గౌతముఁడఁ గానువసుధ సక్షాంతిసారసర్వస్వ మగుచు, వెలయుదుర్వాసుఁగా నన్నుఁ దెలియు మింద్ర.

ఊర్వశీనందనుఁడు మేనకోపభర్త వేగ నీయిల్లు గాచి దీవించి యక్షతంబు లొసఁగెడివారు నీతప్పు సైఁపవలయుఁ గా కేల సైరింపవలయు మాకు.

కులభ్రూకుటికంబుఁ గ్రోధదహనక్రూరజ్వలజ్జ్వలికాచటులాక్షంబు రదచ్ఛటాకిటకిటస్వానంబు శేషాహివిస్ఫుటఫూత్కారకరాళనిశ్వసనసంపూర్ణంబు భూయోనటత్కటమౌ మద్వదనంబు గన్గొనఁగ శక్యంబే పురారాతికిన్.

త్రైలోక్యరాజ్యసంపద, చాలా వశమయ్యె ననుచుఁ జర్చింపంగానేలా యిఁక క్షీరాంబుధి, పాలౌ నని చనియె మౌనిపాలకుఁ డధిపా.

శాంతినిధి తండ్రి యనసూయ జనని యనుజుఁ, డమృతదీధితి యట్లయ్యు నౌగ్రవృత్తి

విడువలేఁడయ్యె దుర్వాసుఁ డడుగనేల, యంశఫలమే ప్రధానమౌ నఖిలమునకు.

దుర్వాసుఁ డిటులు శాపము, దుర్వారముగా నొసంగి తొలఁగిన నెంతేనిర్వేదన మదిఁ బర్వఁగ, నుర్వీధరవైరి నిజపురోముఖుఁ డగుచున్.

అకట యొకతప్పు సైఁపక యతి శపించె, ముక్కుననె యుండుఁ గోపంబు మూర్ఖమునికినెఱిఁగి పూజింపలేనైతి నేను మున్నె, యింకఁ జింతింప నవ్వరే యెవ్వ రేని.

ఊరకెయుండక యుబుసుపోకలకునై యేనేలవచ్చితి నిట్టిపనికివచ్చిన నేరమే వలసినచోటికి నేను రా మౌని రానేల యిటకువచ్చినవాఁడు ద్రోవనె పోక పూవండ నేటికి నామీఁద నెగురవైచెవైచిన నది గొని వరభక్తి ముడువక కరి కేల యిచ్చితిఁ గండక్రొవ్వి

యంతమాత్రంబునకె మౌని యలుగనేల, యింత లేసులు రానేల యేమి సేయనింక నెవ్వరివేఁడుదు నేది దిక్కు, హా విధీ యెంత చేసితి వనుచు వగచి.

ఐరావతారోహమై రాదు తెలితేజ తెమ్మన్నఁ గానక తిరుగు సాదిసంగీతమేళ మచ్చరలఁ బిల్వుఁడటన్న వెదకి లేరని వచ్చు వేత్రధరునినందనవనిఁ గల్పనగములు లేవని పలుకరించిన వనపాలకులనుగామధేనువు దొడ్డిఁ గాన మెందేగెనో యని విన్నవించు గోష్ఠాధిపతిని

బృథులచింతామణీభద్రపీఠిఁ గొల్వు, చావడిని లేమిఁ దెల్పు సంచారికులనుబొక్కసము శూన్య మగుటకుఁ బొగులు వారిఁ, గాంచి దేవేంద్రుఁడు విచారకలితుఁ డగుచు.

చిన్నవోయినమోమునఁ జేరవచ్చి, దివిజపురి యెల్ల నేనుఁగుదిన్న వెలఁగపంటివలె రిత్త యగుచు నప్పటికి నున్నఁ, గాంచి యతఁ డుండె నిఱుపేదకరణి నంత.

పని గల్గి పిలువనంపినఁ జేరరారైరి దినముఁ గొల్వఁగ వచ్చుదిగధిపతులునెన్నఁటివలె సప్తఋషులు వేగినవచ్చి "విజయో స్త" టంచు దీవింపరైరిసంబళంబు లొసంగి సంతరింపఁగలేమి విడిచి పోవఁదొణంగె విబుధబలముభయభక్తిముక్తి నెప్పటిమేరఁ దనయాజ్ఞఁ బాటింపదయ్యెను పౌరజనము

మించి మం డొడ్డసాగెను మిత్రకులము, గడల కేగిరి తగునూడిగములవారుబయలుదేఱిన సుతుఁడు లోపలను సతీయు, గాని యన్యులు లేరైరి ఖచరపతికి.

మౌనిశాపనీదాఘజృంభణమువలన, శ్రీకృపామృతవీక్షణసిద్ధి లేకభువనములు క్షామ మొందిన నవనిజనులు,సత్త్వహీనతఁ గర్మము ల్సలుపరైరి.

అది యెట్లం లేని యక్కాలంబున సవనప్రచారంబు శార్దూలంబుల దానంబుదంతావళంబుల ధర్మంబు ధానుష్కకరంబులఁ దపోనిరూఢి కాలంబున వ్రతంబు మధువ్రతంబుల సదాచారంబు సదాగతి నధ్యయనపాటవంబు కురంగంబులధారాశుద్ధి తురంగంబుల నష్టాంగయోగంబులు వజ్రంబులం గాని జనులందునెందుఁ జెందమిఁ గ్రముకమాత్రపురోడాశంబు నెఱుంగక యాసాసల నాఁకటం గుంది కంది పురందరప్రముఖబృన్దారకబృందంబులు వెన్నంటికొనినయుదరంబులు గుంటలువడినకన్నులు దిమ్మడుచుకర్ణంబులుం గలిగి యెల్లెడలంబరిభ్రమించుచుండి రయ్యవసరంబున.

మయవిరోచనమాలిసుమాలిపాక, జంభతారకశుంభనిశుంభమహిషనముచిముఖులగుదైత్యదానవులఁ గూడి, బలి సుపర్వులపై దండు వెడలె నపుడు.

లిబ్బి నిబ్బరపుబ్బుగబ్బిగుబ్బెతమిన్న కలఁగి గొబ్బున నాథుఁ గౌఁగిలించెబిట్టుల్కి గట్టురాపట్టి దొట్టినభీతిఁ జెవులఁ జుట్టనవ్రేళ్లు చెఱివికొనియెనుడువులననఁబోణి జడియకుమని వెన్ను సజచుప్రాణేశు ఱిచ్చవడిచూచెదిగులొంది మూర్ఛనొందినశచీదేవికి శైత్యోపచారము ల్సలిపె వజ్రి

కడమ కిన్నరగంధర్వఖచరసిద్ధ, సాధ్యవిద్యాధరాంగన ల్చకిత లగుచునేమి యైరొకొ తెలియ దుద్దామభీమ, రణరణద్భేరిధణధణంధణల నపుడు.

ప్రతిసాగరంబు లై భద్రేభకర్ణస్రవన్మదాంబువులు భువనము లానథాటీనిరాఘాటఘోటీఖురాగ్రభగ్నపరాగములు పరాగములఁ బోలఁజక్రపదావక్రచక్రమార్గంబుల భోగవత్యాపగాంబువులు వెడలసైనికాస్యాన్యోన్యసంఘర్షణస్ఫులింగంబు లంగారవర్షంబు గురియ

భూరిజయభేరిభాంకారఘోరరావ, పూరితాపారగహ్వరోదారమేరుధారుణీధ్రంబు మొఱవెట్ట దారుణముగ, దండువిడిసె బలీంద్రుఁ డక్కొండదండ.

అంతఁ దనసైనికుల దుర్గ మాక్రమింపఁ, బంపుటయు వారు చటులదోర్బలము మెఱయఁగొండప్రక్కల నుక్కళ ముండు వేల్పు, తండములఁ జెండి యెక్కి యక్కొండయందు.

తెంపలు గలయడవులఁ దగి, లింప నిలింపాహితుల్ స్ఫులింగము లెగయంబెంపెసఁగెఁ బావకుఁడు బలి, సంపూరితతేజమనఁ బ్రచండస్ఫూర్తిన్.

ఇంతపొడ వెక్కి రని బలి కెఱుకపడక, వనుల దగిలించినట్టి యవ్వహ్నికీలదెలియరాదయ్యెఁ గనకాద్రిదీప్తివలన, ధూమ మెసఁగెను దానవస్తోమరుచుల.

వెలవెలఁబాఱుమోములు లావులు సలింపఁ గదలె దిక్కులకు నై గరుడకులమునిరవలంబంబునఁ దిరుగుచు వెఱ నోరు దెఱచుచుఁ జనియెఁ గిన్నరకులంబుజోడనవీడి యచ్చోనిబ్బరపుఁబర్వుననె దాఁట దొడఁగె గంధర్వకులమువెఱచి మౌనాకులవృత్తిఫణము ద్రిప్పి పాతాళమంటె నప్పన్నగతతి

కౌశికాదులు పసలైనఁ గానలేక, కన్నుఁగవలందుఁ దిమిరంబు గప్పికొనినఁబఱచె నెల్లెడ బలిదుష్టబలము మించి, కాంచనక్షోణిధర మాక్రమించినపుడు.

ఇవ్విధంబున బలిప్రతాపతపనతప్తం బగుచు విగళితపౌరుషరసాసారం బగుస్వర్గకాసారంబున నిలువం జాలక నిఖిలానిమిషజాలకంబు సంచలించుచు జీవనప్రదుం డగుసరస్వతీరమణుం జేరంగోరి మేరూపరిభాగభాగనితరసాధారణామణిగణిలోకచ్ఛన్నవిలోకిలోకావలోకం బగుకమలభవులోకంబునకుఁ జని.

వెలిదమ్మిరేకుపొత్తుల చిన్నిపాపఁడు నలుమోముదమ్ముల వెలయుసామితళుకుబంగారుఱెక్కలవారువముజోదు బ్రతుకుప్రొద్దులలెక్కవ్రాఁతకాఁడుకడుపు బంగారుబొక్కసము సేసినదొర జీవనూత్రమున సృష్టించుజాణకెందమ్మిగద్దె యెక్కినవేలుపులపెద్ద పలుకుఁబూఁబోణికిఁ బ్రాణపదము

దినముఁ బోరిడుగాయకుఁ గనినగేస్తు, కలిమిజవరాలు నోముక కన్నబిడ్డకంతుగాఁదిలితోడు లోకములఱేఁడు, నలువ గొలువున్నకనకమండపముఁ జేరి.

అష్టదిగీశాదిసురల్, స్రష్టను సాష్టాంగ మెరఁగి స్వామీ! కరుణాదృష్టిని దృష్టింపుము బలి, దుష్టావష్టంభ మెల్లఁ దొలఁగింపు వెసన్.

అని మఱియును వినయముదగ విబుధుల్వనరుహభవపదవనజయుగముపైఁగనకమకుటమణిగణినికరరుచుల్పెనఁగొన నతి సలిపిన విధి గరుణన్.

తరళభావముఁ జెందనేటికి దైత్యదానవకోటికిన్సరళవైఖరి ముజ్జగంబులఁ జాలఁ బ్రోది యొనర్పఁగాగరళకంధరుఁ డున్నవాఁ డింకఁ గ్రక్కునన్ రజతాద్రి కిందరలఁగావలె నంచుఁ జెచ్చెఱ దమ్మిగద్దియ డిగ్గినన్.

ఒఱగంట మెఱుఁ గెక్క నొఱయంగఁగలఱెక్క హొన్నంచుపక్కెర యుదుటు సూపదళుకుకారుమెఱుంగు దొలఁకు ముక్కు మెఱుంగుపగడపునొసపరిజిగి చిగుర్పసంజకెంజిగి నేలు చరణయుగ్మముడాలు వలయంపువింతచెల్వంబు సూపముక్కున నసియాడుముదురుతామరతూడు ముత్యాలకళ్లెంబుమురువు నెఱపఁ

గళుకుమెయిచాయ లుభయభాగములయందుఁ, జిలికి జగజంపుజల్లులచెలువు నింప

మలయు రాయంచకొదమసామ్రాణి నొక్క, సాది దెచ్చినఁ జూచి ప్రసాది యగుచు.

ఎలమి న్బంగరులెక్కపక్కెరహుమాయీతేజి దాఁటించుచున్నలుమోమయ్య హుటాహుటిం గదలెఁ జెంతం జేరి జేజేలరాయలు సాహోయని హెచ్చరింప సుభటోద్యత్ఖడ్గకాంతిచ్ఛటల్వలిపెంపుం దెలిచల్వపావడలు వైవ న్దుందుభు ల్మ్రోయగన్.

ఈలీల న్సుర లెల్లరు న్గొలువ వాణీశుండు శీఘ్రంబుగాఁగైలాసంబున కేగి శంభునకుఁ దత్కార్యం బెఱింగించినన్ఫాలాకుం డొకకొంతసేపు మదిలో భావించి వైరోచనిన్దూలింపన్ హరి వేఁడఁబోద మని తోడ్తో సంభ్రమం బెచ్చఁగన్.

గుబ్బలిపట్టిగబ్బివలిగుబ్బల జొబ్బిలు తావికుంకుమంగబ్బికొనంగఁ జాలు నెదఁ గప్పిన బెబ్బులివన్నెపచ్చడంబబ్బురమై తనర్పఁ బ్రమథావలి యుబ్బుచు వెంటనంటఁగాగిబ్బవయాళితేజి దుమికించుచు వచ్చె మహేశుఁ డత్తఱిన్.

ఈరీతి సకలనిర్జర, వారము గొలువంగ భవుఁడు వారిజభవుఁడున్క్షీరాంభోనిధితీరముఁ, జేరి నతుల్సలిపి నుతులు చేసిరి భక్తిన్.

ఎయ్యది ప్రకృతివిహీనమై సచ్చిదానందనిత్యప్రపూర్ణత వెలుంగుస్వగతసజాతివిజాతీయభేదముల్ గాంచు నెయ్యది సర్వకాలముననుజీవేశ్వరాఖ్యలఁ జెలఁగు నెయ్యది యవిద్యయు విద్యయు నుపాధియై తనర్చుజ్ఞానంబు జ్ఞేయంబు జ్ఞాతయుఁ దానయై వర్తించు నెద్ది సర్వంబునందు

నట్టివేదాంతవేద్య మాద్యంతరహిత, మమలయోగీంద్రనిష్ప్రపంచాభిధానలక్షలక్షిత మపవర్గలక్షణంబు, నైన బ్రహ్మంబు మూర్తమై యలరుఁ గాఁత.

ఎవ్వఁడు 'తత్త్వమసీ'తి వేదాంతవాక్యంబు వాచ్యార్థమై యలరుచుండునెవ్వనికనుసన్న నీచరాచరములం బుట్టించు మాయ యద్భుతము గాఁగనెవ్వఁడు వరయోగిహృదయాబ్జమునఁ బరంజ్యోతిస్వరూపుఁడై యొప్పు మిగులునెవ్వఁడు లక్ష్మీసమేతుఁడై క్షీరాబ్ధి ఫణిరాజుశయ్యపైఁ బవ్వళించు

నెవ్వఁ డఖిలజగత్త్రాణహేతుభూతుఁ, డెవ్వఁ డానతసజ్జనాభీష్టదాతయెవ్వఁ డఖిలగుణాస్పద మెంచ నట్టి, శ్రీవధూనేత సాక్షాత్కరించుఁ గాఁత.

అని యివ్విధంబున నంభోజసంభవశంభుదంభోళిధరప్రభృతు లదంభగంభీరవచోనిగుంభనంబులం బొగడుచున్నసమయంబున.

దంతిమహాపద్మధనదక్షుఁ డగువాఁడు పద్మాప్తవత్సవిభ్రమమువాఁడుకరగతశంఖచక్రవిజృంభణమువాఁడు మకరకుండలదీప్తి మలయువాఁడు

భావికచ్ఛపరూపభావకుం డగువాఁడు శ్రీముకుందాఖ్యచేఁ జెలంగువాఁడుఘనసారకుందచందనకీర్తి గలవాఁడు నీలమేఘచ్ఛాయ నెగడువాఁడు

శ్రీవరఖ్యాతిచే విలసిల్లువాఁడు, శ్రితనవనిధానరీతి వర్తిల్లువాఁడునఖిలలోకైకరక్షకుఁ డైనవాఁడు, హరికృపామయమూర్తి ప్రత్యక్షమయ్యె.

ఇట్లు ప్రత్యక్షమయిన సర్వేశ్వరునకు, నవని సాష్టాంగ మెరఁగి బ్రహ్మాదిసురలునిర్భరానందమగ్నులై నిలిచియున్న, వారిఁ గనుఁగొని యాదానవారి యనియె.

ఒకముఖంబున సృష్టి యొడఁగూడదే విచారమున వచ్చితి వేమి కమలగర్భధరణి భైక్షం బెందు దొరకదాయెనె చిక్కి సగమైతి విది యేమి చంద్రమౌళివేయిభంగులను గావించె దాలోచన క్రమము స్వాస్థ్యము లేదె ఖచరనాథదెసల నొందినయట్టి తీరు గానఁగవచ్చెఁ బలుకాడ రేమి దిక్పాలురార

పెక్కువగ లొందెద వదేమి బిసరుహాప్త, చిన్నపోయెద వది యేమి శీతకిరణయితర సుమనస్సులార మీ రిటులు వాడి, యుండ నేటికి నామోద ముడిగి యనిన.

అంబురుహగర్భుఁ డనియె లోకైకనాథ, సహజమే సృష్టి యేమియు సాగనీకబలి నిలింపులనెల్లఁ బంపంగఁ దొడఁగెఁ, గించిదవశిష్టమయ్యె స్వర్గికుల మనిన.

ధననాయకసఖుఁ డిట్లను, వనజోదర భైక్ష మేది వసుధాస్థలిలోజన మెల్ల బలిరుషాభా, జనమయ్యె న్నిక్క మనిన శక్రుం డనియెన్.

స్వాస్థ్య మెయ్యది జలజాక్ష శక్తి మెఱసి, నాఁడె స్వర్గంబు గైకొనినాఁడు బలియెయెన్నిభంగులఁ దలఁచిన నేమి గలదు, స్వామివారికృపాకటాక్షంబు లేక.

అనినఁ దక్కినదేవత లనిరి భక్తి, జైత్రగతి మించ వైరి మాజాతి కెట్లుగలుగు నామోద మింకిట ఘనుఁడవైన, నీకృపామృతవర్షంబు లేక శౌరి.

అనిన విని వారిజోదరుఁ డాదరమునఁ, గలిమి బలిమిని నీకు లోకములయందునీడుజోడును లేదుగా యింద్ర యేల, పలుకనోడితి వన వజ్రపాణి పలికె.

సర్వేశ్వర వినిపించెద, సర్వము విన నవధరింపు సంపద లెల్లన్దుర్వారతరదురాగ్రహ, దుర్వాసశ్శాపమునను దోయధిఁ జేరెన్.

కాన నిశ్రీకమైన నాకంబునందు, నిర్వహింపఁగ లేనైతి నీరజాక్షకలిమి సాలనివారికి బలిమి గలదె, యింక నెయ్యది బుద్ధి సర్వేశ యనిన.

ఔనోయి యింద్ర నాయెద, పైనుండెడు రమను గానఁ బ్రణయపుటలుకంబూని యెటు నిల్చెనో యని, యేనుండితిఁ గాన జలధి కేగుట యెఱుఁగన్.

అక్కట లక్ష్మిఁ బాసి క్షణమైనను నేను వియోగవేదనంజిక్కఁగలానె యెట్లయిన శ్రీతరుణీమణి వచ్చునట్లు గానొక్కయుపాయ మెంచవలె నూహ యొనర్చితి లక్ష్మిరాకకున్గ్రక్కున వేల్పులెల్ల నమరత్వముఁ బొందుటకున్ సురోత్తమా.

కవ్వముగఁ జేసి మంధరక్ష్మాధరంబు, వాసుకినిఁ ద్రాడు చేసి దుర్వారశక్తి

జలధి మథియింపుఁ డందునఁ గలుగు నమృత, మబ్జగేహిని పొడము సత్యమ్ము సుమ్ము.

అదియునుంగాక యైరావతాదు లబ్ధిఁ బొడముఁ బోయిన వెల్లను బూర్వసరణినింత యత్నంబు సేయ నీ కేకదేశ, మునను గూడదు దైత్యులపొందు లేక.

బలవంతు లైనదైత్యులు, గొలువఁగ నున్నాఁడు బలినిఁ గూర్చుక కలశీజలధి మథియింపుఁ డమృతము, గలిగిన తర్వాత వానిఁ గడవఁగవచ్చున్.

వినవె యహిమూషకన్యాయమున ధరిత్రి, నాక్రమంబున నమరేంద్ర యసురవిభునితోడ సంధింపు మని పంపెఁ దోయజాత, నాభుఁ డరుదెంచె వైకుంఠనగరమునకు.

కాకోదరస్వామి ఘర్షించుఁ బలుమాఱు వలిగాడ్పు దనుఁ జేరవచ్చె ననుచుశుకనారదాదులఁ జూడంగ నొల్లఁడు శుకనారదాఖ్యలఁ జొప్పడుటనుదెలివిమైఁ దనకన్నుఁ దెఱచి దృష్టింపఁడు వామాక్షిరుచులు తీవ్రంబు లనుచుఁదనదు పేరిచ్చి పెంచినమాధవుని జెట్లపాలు గమ్మంచు శాపం బొసంగుఁ

గన్నకొడుకును బగవానిఁగాఁ దలంచుఁ, దను విపాండిమ నీశ్వరత్వంబుఁ దెలుపభృగుసుతాయోగసంతాపపీడ్యమాన, మానసుం డగుచుండె నమ్మాధవుండు.

అంతట నాదివస్పతి బృహస్పతి చెంతకుఁ జేరవచ్చి మౌళ్యంతరకాంతమౌక్తికవిభాంబులు పాద్యముగాఁగ మాలికాదంతురభృంగఝంకృతు లుదంచితమంత్రము లై చెలంగ నత్యంతవినీతిఁ దత్పదములందుఁ గరాబ్జము లుంచి యిట్లనున్.

భవదాశీర్వచనప్రభావమునఁగా ప్రత్యర్థిదైతేయరాడవలేపాంధతమోవిలేపకరణోద్యద్దివ్యతేజోమృషారవివిద్యోతవికాసిమత్కరశతారం బందు నిల్చెన్ రథాంగివలె న్నిర్జరమర్త్యనాగపదలక్ష్మీకాంత వాచస్పతీ.

దేవతావళికెల్ల జీవభూతుఁడ వౌట జీవాఖ్య నీకుఁ బ్రసిద్ధమయ్యెవాణి నీకే వశంవదయై చెలంగుట గీష్పతినామము కీర్తిఁ గాంచెబుద్ధియే మీరూపమునఁ బ్రవర్తింపఁగా ధిషణాభిధానంబు దేజరిల్లెనహిభయపరిహర్త వౌటచేఁ జిత్రశిఖండిజాతాభిఖ్య గణనఁగాంచెఁ

దండ్రివలె మముఁ బ్రోవఁ దత్త్వంబు దెల్ప, నోర్చుకతమున గురునామ ముచితమయ్యెనీమహత్త్వంబు నాకు వర్ణింపఁ దరమె, జలధిగాంభీర్య దేవతాచార్యవర్య.

ఇప్పు డదేమొ నాదుదురదృష్టమునం బరీభావమొందినానెప్పుడు నీకటాక్షబల మెంచుట నేభయమంద నింక మీ

కప్పులలాశిభర్త హితుఁడౌట కుపాయము సూడఁదీరుగాకిప్పని నిర్వహింపఁగలరే యన నాయన వజ్రి కిట్లనున్.

నిస్సత్త్వుఁడ వీ వతఁ డతి, దోస్సారుఁడు మీకు సంధిదొరకించుటకున్దుస్సహము “తప్తయో రుభ, యో స్పంధి” యనంగ వినవె యోదివిజేంద్రా.

ఐనను నా చేనగుగతి, నానావిధములను దనుజనాథుఁడు నెయ్యంబూనఁగఁ జేసెద నని తాఁ, బూనుక చనియెన్ సుపర్వపుంగవుఁ డంతన్.

ఒక పర్వతగుహ దిఙ్నా, యకసంయుతుఁ డగుచు గురునియాగమనము సూచుక యున్నతఱిన్ శుభసూ, చకములతో గురుఁడు వచ్చి శక్రున కనియెన్.

అమరేంద్ర నీవంప ననుకంప జనియింపఁ బొలదిండినెలదారిపురము సేరివెలిహజారంబున నిలిచి గొల్లలునిల్పఁ బలికి నేవచ్చుట దెలుపుఁడనుచునవసరంబులవారి ననుసరించిన వారు సమయంబు గా దని జాగు సేయమంత్రుల కెఱిఁగింప మంచిదె యనుటగా కెవ్వరుఁ దెల్ప రదేమొ కాని

యసురపతి తన్ను రమ్ము పొ మ్మనఁగ నిచ్చ, కములు చేసుక తిరిగెడు గాయకుండుకలహభోజనుఁ డతనికిఁ దెలియఁ జెప్పి, నన్నుఁ బిలుపింపఁగా నేను నిన్నరేయి.

సమ్ముఖమునకు వచ్చుచుఁ జనుచునుండు, గరుడగంధర్వయక్షరాక్షససుపర్వబలము లెల్లెడఁ దొలఁగ ద్రొబ్బఁగవశంబు, గాని కక్ష్యాంతరంబులు గడచి యవల.

మయవినిర్మితనవరత్నమయసభాంత, రమునఁ జెలువొందు భద్రభద్రాసనమునఁగనకశైలాగ్రనీలమేఘం బనంగ, నిండుకొలువున్న బలిదైత్యనేతఁ గంటి.

ననుఁ గనుంగొనినప్పుడె వినయమునను, లేచి కూర్చుండు మనెడి నిలింపవైరిచేరి యాశీర్వదించినఁ జేయి మొగిచి, రమ్ము కూర్చుండు మనఁ డెంతరాజసంబొ.

అపుడు మన నారదుండె నెయ్యంబుమీఱ, రా బృహస్పతి యిందురా రమ్మటంచునొదిఁగి చోటియ్య నందుఁ గూర్చుంటి నొదిఁగి, యివ్వలవ్వల దైత్యు లట్టిట్టుఁ ద్రోయ.

అంత.

బలపాకనముచిజంభపులోమముఖ్యదైత్యులమనివికిఁ జెవియొగ్గి వినుచుఁజేరి వినీతి నాశీర్వాద మొనరించు గౌతమాదులను గ్రేఁగంటఁ గనుచుఁదనధాటిపదము లందమున విన్పించుగంధర్వుల కుడుగరల్ దయ నొసఁగుచునవధారు దేవవేశ్యాభుజంగ యటంచుఁ గంచుకు ల్పొగడ నుత్కంఠ వినుచు

హరిహరాదులతోఁ బోర నలవిగాదు, మాను మనుశుక్రుతో మఱుమాట లుడిగి

కలవె యేవైన వింతవార్తలు దివంబు, నందు నారద యనుచు నయ్యసురవిభుఁడు.

ననుఁ జూచిన నే నాతనిఁ, గనుఁగొని “సౌభ్రాత్ర మస్తు ఘనతరతేజోవనజాత హితోజ్జ్వలభూ, వనజాత దితిప్రసూత వర” యని మఱియున్.

బలిదైత్యేశ్వర తావకీనపరిశుంభత్కీర్తితేజోరుచుల్దళమై లోకము లాక్రమింపఁగ సుధాధామోష్ణధామాగ్నిమండలము ల్నీరుచులై చనన్ శివుని కంధత్వంబు ప్రాపించినంగులకాంతామణి చెట్టపట్టుకొని యేగు న్వీథి భిక్షార్థియై.

అనిన న్నవ్వుచు దైత్యభర్త సురలోకాచార్య యేమీ ప్రయోజన మన్న న్మఱియేమి లే దఖిలమున్ సంపన్నమై యుండు నీఘనకారుణ్యకటాక్షవీక్షణమునం గాంక్షింప నేమున్న దైనను విజ్ఞాపన మొక్కఁ డున్న దవధానం బొప్ప నాలింపుమా.

అమరపతి నేఁడు నీదునెయ్యంబుఁ గోరి, నన్నుఁ బంపిన వచ్చితి నాయమగుటనన్నదముల కేల వృథాహవంబు, గలసి యుండుట మే లెల్లకార్యములను.

అనిన విస్మయమానమానసుండును స్మయమానవదనుండును నగుచు విరోధిస్మయమానహరణబలి యగుబలి యి ట్లనియె.

నాట్య మీక్షింప నే నొకనాఁడు రంభ, నంపు మని చెప్పి పంప హాస్యంబు చేసికదలికాతరు వంపినకండక్రొవ్వు, దీఱెనే నేఁటికైన నద్దేవపతికి.

వినుము బృహస్పతి యిఁకనై, నను భక్తిని నన్నుఁ గొలిచినను మన్నింతుందననేరము గాకున్న, న్విననేరము తోడి తెమ్ము వేగమె యనినన్.

వచ్చితి నిచ్చటి కేను వి, యచ్చరకులనాథ వింటివా బలివాక్యమ్మిచ్చకువచ్చినరీతిం, జెచ్చెరఁ గావింపు మేమి చెప్పుదు నింకన్.

హస్తీంద్రకుంభంబు లప్పళించుకరంబు దనుజపాదము లొత్త ననువుపఱుపుసురకిరీటముల నుంచుపదంబు దైతేయనాథుతేజీ వెంట నడవ నేర్పువందిమాగధులకైవారంబు విను చెవి విబుధారిరాకొట్టు వినఁగ నేర్పుహరియింతుఁ బాలింతు ననుమాటలయ్య జియ్యయటంచు వినయోక్తు లాడఁగఱపు

మాబలీంద్రునితోడి నెయ్యంబు గోరి, తేని యీరీతి సేవకవృత్తి గానిదొరతనంబులు మెఱయింప దొరకవింక, నీకు నెటువలెఁ దోచునో నిర్జరేంద్ర.

అదియునుంగాక నేను నిలింపవైరిచేత నంపించుకొనివచ్చునెడ మార్గంబుననారదుం గాంచి నేవచ్చినవెనుక నచ్చటివిశేషంబు లేమి యనియడిగిన నతండి ట్లనియె.

మనకు వారికి నైకమత్యంబు గలుగునే పొసఁగ దటంచు జంభుండు నొడివెవైరులయందు విశ్వాసంబు గావింప న్యాయంబుగాదని నముచి పలికెఁ

గపటంబు గాని నిక్కంబుగా దిది నమ్మబోకుఁడి యంచును బాకుఁ డనియెనామాట నిజమె యీయమరులతో సంధి కీ డటంచును హయగ్రీవుఁ డాడె

దనుజనాయకుఁ డివియె యోజనలతెఱఁగు, విబుధనాథుండు మానంబు వీటిఁబుచ్చికొలువవచ్చెద నన్నను బిలువరాదె, యింతకన్నను బ్రాభవం బేది యనియె.

అన విని విప్రజిత్తి దురహంకృతితో నిదియేటిమాట వృత్రుని హితుఁడై వధించె నసితో దితిగర్భము సొచ్చి యింతయున్విని వినియుండి యించుక వివేకము లేక సురేంద్రుమైత్రిఁ గోరిన నగరే నిశాచరవరేణ్య యటన్న బలీంద్రుఁ డిట్లనున్.

ఎట్టివారలు శరణన్న నేలవలయు, వీరధర్మంబు గావున విప్రజిత్తికావవలదన్న భీరులఁగాఁ దలంప, రేల యీయోజనలు మానుమింక ననియె.

అని నారదముని దెలిపెను, విను మటుగావున నిశాటవిభుఁ డెటులైనన్నినుఁ దనభృత్యునిఁ జేయంగనె తలఁచినవాఁడు చూడు కార్యం బింకన్.

సమదైరావతకుంభిజృంభితశిరస్సంస్ఫాలనప్రాప్తితోత్తమసింధూరవిభాతి పాటలితహస్తంబుల్ శయాళుద్యుషద్విమతాంఘ్రిద్వయమర్దనంబునను దాదృక్భోణితామ్రేడితంబమరం గాంచవె యింక నోయమరనాథా యెట్లు సైరించెదో.

దైవగతి యెవ్వరికి దాఁటఁ దరముగాదు, చింత సేయంగవల్వ దావంతయేనిబలికిఁ గప్పంబు లిచ్చుట గొలుచుటయును, న్యాయ మటువలెఁ గావింపు మమరనాథ.

అన వెచ్చనూర్చి యవుఁ గా, కని యనిమిషవిభుఁడు దిగ్వరాన్వితుఁ డౌచుందనబలములతోడ బలీం, ద్రునిసమ్ముఖమునకు వచ్చి తోరపుభక్తిన్.

దేవేంద్రుఁడు హయశతమే, ధావభృథస్నాతపూత మగుమస్తకమున్దేవాభియాతిపదరా, జీవభ్రమరంబు గాఁగఁ జేసినయంతన్.

ఉరుమణిపీఠి నిండుగొలువుండు నిశాచరనాథుపాదపంకరుహములందుఁ గోకములకైవడి నంచలరీతిఁ దేంట్లవైఖరిఁ దులకించె నిర్జరశిఖామణిమౌళిఁ దనర్చుజాతికెంపురవలు నిద్దపుందళుకుముత్తెము లెచ్చుకిరీటిపచ్చలున్.

అంత.

సముఖాయంచును వేత్రహస్తులు వచించన్ డిగ్గనం లేచి యయ్యమరారాతి యహార్యవక్షహరణాహంకారి లే లెమ్మటం

చమితోత్సాహము మీఱ నెత్తె సురరాజ్యశ్రీకచాకర్షణక్రమపాండిత్యకలాపిచండిలభుజాకాండంబులం గొబ్బునన్.

ఎత్తి కౌఁగిలించి యీ వేల మ్రొక్కెదు, పెద్దవాఁడ వనుచుఁ బ్రియము మీఱభద్రపీఠి నెక్కి పార్శ్వభాగంబున, నొక్కచిన్నిగద్దె నుండఁ బనిచి.

అంబకు నేమమే మనజయంతుఁడు లెస్సయి యున్నవాఁడె హర్షంబె శచీవధూమణీకి సర్వసురుల్ సుఖమున్నవారె స్వర్గంబున కేవిరోధమును గాదుగదా భవదాగమంబు సౌఖ్యంబె యటన్నఁ గాంచి కులిశాయుధుఁ డిట్లను దైత్యభర్తకున్.

ఈకరుణాకటాక్ష మొకయించుక నాపయినిల్చి యున్నచోనేకడ మేలుగాక వగ పేటికిఁ గల్గెడు దానవేంద్ర యైనా కల దొకవిన్నపము నాకు సురాధిపనామ మేల నీవే కులకర్తవై సురల నేలుము దైత్యుల నేలువైఖరిన్.

నేను నీసమ్ముఖమున నిలిచియున్న, వారిలోపల నొకఁడనై వలయుపనికినిందు నందును దిరిగెద నిదియె నాకు, మనవి కట్టడ గావింపు మనిన నతఁడు.

లెక్కలు లిఖియింప లేఖకాధీశుండు పాకంబు గావింపఁ బావకుండుదండధరుండు ముందఱబరాబరి సేయఁ జరుఁడై చరింప నిశాచరుండునీరధీశ్వరుఁడు పన్నీటిగిండి ధరింప మృగవాహనుఁడు తాళవృంత మూనసర్వస్వమును విమర్శన సేయ శ్రీదుండు భూతాళిఁ గొలిపింప భూతభర్త

ఖరరుచి సహస్రకరదీపికల ధరింపఁ, బొసఁగ విడెమీయ శతపత్రపూగహారికడమవేల్పులు దగునూడిగములు సేయఁ, గట్టడ యొనర్చి ప్రోచె రాక్షసవిభుండు.

విడెముచొక్కున నొక్కవేళఁ జొక్కినఁ దనచేలచెఱంగునఁ జెమటఁ దుడుచుఁగొలువుననుండి డిగ్గునడిగ్గునంతలో దండకై చేరి కైదండ యొసఁగుఁజనవరియై వడి జాఱెడురత్నభూషణము లప్పటికప్డు చక్కఁబెట్టుఁబేర్కొని తనుఁ బేరఁ బిలిచిన స్వామి యేమానతి యిచ్చెద రంచు నిల్చుఁ

జూచి వలదన్న మానక సురటి విసరు, నేమి మాటాడినను నుతియించు మిగులఁజిటికెలిడు జృంభణంబునఁ జేరి దివిజ, వైరి కగదారి యిచ్చకదారి యగుచు.

ఈనయమునఁ గడునెయ్యము, గా నుడువఁగ విశ్వసించె ఖచరాధీశున్దానపనాథుఁడు చిత్తము, రా నడచినవారె హితులు రాజుల కెల్లన్.

అంత నొకనాఁడు పూర్వదేవాధినేత, సుముఖుఁడై యున్నవేళను జూచి యింద్రుఁడాప్తమంత్రులతోడ నెయ్యంబు సలిపి, పలికె నిట్లని సవినయఫణితి మెఱయ.

ఈమదమత్తవారణము లీజవనాశ్వము లీరథోత్కరంభీమథితారివీరభటు లీదురతిక్రమవిక్రమక్రమంబీమహనీయకీర్తి గలదే త్రిజగంబుల నీకె గాక యౌరా! మునుసన్నవారి కిఁక రాఁగలవారికి నున్నవారికిన్.

ఇన్నియు నౌఁగదా దితిసుతేశ్వర దేహ మనిత్యమౌట సంపన్నత నిత్యమంచుఁ గలఁపంబనిలే దటుగాన సంశయాపన్నత నొందె నామది యుపాయము గల్గునె నిత్యతాప్తికింగ్రన్ననఁ గల్గెనేని యెఱుఁగ న్వలయుం దగియున్న యోజనల్.

క్షుత్పిపాసాజరావ్యాధిశుష్యమాణ, కాయమున లే దొకింతసౌఖ్యంబు దేహికది సవిస్తరఫణితిఁ దెల్పెదను వినుము, దివ్యతేజస్సనాథ దైతేయనాథ.

కనుఁగఁవఁ జీకటుల్ గవియుఁ గర్ణపుటంబుల దిమ్ము గ్రమ్ము మించును జఠరాగ్ని దుర్బలత చొప్పడు నంగములన్ శిరంబు నొచ్చు నితరభోగ్యవస్తువులు సూడ సహింపదు మాటమాత్ర మాడను మది పుట్ట దాఁకటఁ బడ న్వశమే క్షణమైన నేరికిన్.

పెదవి పేటెత్తు నాలుక పిడుచగట్టు, గొంతు తడితీయు నక్కెండుఁ గొంతతడవుదాహమున కుదకములేక తడసెనేని, కలదె మఱి యంతకన్న దుఃఖంబు జగతి.

అన్నపానంబు లొకయింత యధికమైన, తఱి నజీర్ణంబ యైనఁదా దొరయు శ్లేష్మపైత్యవాతాదికజ్వరబాధ లవియ, విషమహేతువు లగుపథ్యవిరహితములు.

కలుగునూఱేండ్లలో నర్ధకాల మపహ, రించు నిద్రయె యానిద్ర ఱేపుమాపుమానియుండిన జాడ్యంబు మేనఁ బొడముఁ, గన్నుఁగవయందు నరుణిమ గడలుకొనును.

ఇంతకన్నను దుఃఖ మిఁకనొండు లేదని తెలుపుచందంబునఁ దలవడంకఁగనుఁగవఁ బొరలు గప్పెనొ లేదొ చూత మన్పోలిక సడలి కన్బొమలు వ్రాలయౌవనస్తంభహైన్యంబున దేహంబు కుమతిగుడారునాఁ గుదియఁబడఁగస్వచ్ఛవృత్తిని దనరంగ ముక్తములగు భాతి నొక్కట ద్విజపఙ్క్తు లురుల

ఘనజరాభూతహుంకృతి నెనయ దగ్గు, నరల సద్వృత్తి కర్ణవిస్ఫురణ నొగులవృద్ధభావంబు వచ్చినవెనుక జనున, కేమిసౌఖ్యంబు గలదు దైత్యేంద్ర చెపుమ.

ఇదిగాక శమనకృత్యం, బిదమిత్థం బనఁగఁ గూడ దీదృశదుఃఖాస్పదమగు దేహంబున నె, మ్మది సుఖియింపంగ సులభమా యెవ్వరికిన్.

అటు గావున జఠరజరఠగహనవనదహనప్రథావధారణాక్షుధావ్యథాముథావిధానావధానవిధావిధానంబును, ముఖజలబిలపల్వలసరసతాషనోదనభీష్మగ్రీష్మవిలాసపిపాసానిరానంబును, బ్రపంచపదార్థప్రజ్ఞానప్రతిబంధకబంధుర

రజోనిద్రాముద్రావిద్రావణంబును, నానామయాకృతిపురాకృతదుష్కృతిమరీచికావికృతినిరాకృతికృతియును, నంగరాజ్యజీర్ణీకరణవిజయయాత్రాజీర్ణజరాబలనిరోధకంబును, దేహజీవనీరక్షీరభేదవిధానమాంసలహంసజాతపలాయనమంత్రోపదేశదేశికంబును, సుమనోవిలాసనిత్యయౌవనవనవికాసకారణంబును, భోగినీభోగవిభేదాదరమయూరనర్తనప్రవర్తకంబును, శృంగారరసప్రధానప్రభావప్రభాప్రవాహప్రకామప్రవర్ధనప్రక్రియాప్రవీణంబును నై, ప్రావృషిజపయోజప్రస్రుతామృతంబుచందంబున నందం బగునమృతంబు సంతరించినం గాని గాత్రంబు యథేష్టభోగంబులకుం బాత్రంబు గాదని తలంతు నందుల కొక్కయుపాయంబు గల దది విన్నవించెద నాకర్ణింపుము.

కవ్వముగఁ జేసి మందరధరంబు, వాసుకినిఁ ద్రాడు చేసి దుర్వారశక్తిఁగలశవారాశిఁ ద్రచ్చినఁ గలుగు నమృత, మనుచు హరి యానతిచ్చె ము న్నసురనాథ.

నావుడు నప్పుడె యమృతము, సేవించినరీతి మిగులఁ జెలఁగుచు సభలోదేవాదులెల్ల బళిబళి, దేవాధిప మంచియుక్తి దెలిపితి విచటన్.

అట్టు లమృతంబు గలుగఁ బా లధికముగను, నీకు నొసగెద మిందు సందియము వలదుతగినయత్నంబు సేయుము తడవు సేయ, రాదు వినమే “శుభస్య శీఘ్రం” బనంగ.

అని యుత్సహించి యాడెడు, దనుజులవాక్యములు దేవతాపతి పలుకుల్విని సమ్మతించి మంచిదె, యని బలియును వారిఁ గూడి యప్పుడె కదలెన్.

కదలి మదమత్తమాతంగకదలి చంద్ర, కదలి నమరావతీవనకదలి నెనయరంగదరిభంగ సంగరరంగచంగ, తుంగచతురంగసేనాతరంగుఁ డగుచు.

ముందరఁ జనిచని కాంచె, న్మందరముం దుష్టసత్త్వమయకందరమున్సుందరమున్ శిఖరశిఖా, మందరమున్ దివ్యనవ్యమణిబృందరమున్.

కనుఁగొని యిదిగద మందర, మని యడిగిన బలికి నింద్రుఁ డనియె న్నిజవాహనఘనగర్జారవలం, ఘనజాంఘికనవరసార్థగంభీరోక్తిన్.

కనుఁగొంటే దనుజేంద్ర తావకజయాంకప్రౌఢిగీతాళి వేడ్కను గంధర్వవధూమణు లసతతమున్ గానంబు సేయం గరంగిన వానీటను బొంగి నిర్ఝరము లేగె న్వార్థికాత్మీయు నొక్కని రక్షించె నటంచు వృద్ధి నొసఁగంగా నెంచెనో శైలమున్.

అనఁ జిఱునవ్వు నవ్వి దనుజాధిపుఁ డిట్లను నౌ నగారి నీయనుపమబాహుశక్తి దెలియ న్వివరించెదు శైలపక్షభే

దనచతురత్వము న్నొడివి తజ్ఞుఁడవౌ నన స్వామి కెట్లు దోఁచెనొ యటులే గణింపుదునె చిత్త మెఱుంగదె యంచు నింద్రుఁడున్.

నీయంతవాని కుపకృతి, సేయఁగలిగె నా కటంచుఁ జెలఁగుచు గిరిరాజీయెడ నిర్మలనిర్ఝర, తోయాఖ్యము నశ్రుధార దోఁగెడుఁ గంటే.

అసురనాయక తనదుగహ్వరము సూప, దలఁచి చెంగావి గప్పిన చెలువు మెఱసెఁదురగఖురధూత మగుచుఁ గెందూళి పొడమ, నందమై మించు నీమంచరాచలంబు.

బలిదైత్యేశ్వర కంటె యీగిరిదరీభాగంబుల న్వేడుకల్వొలయం గ్రీడలు సల్పుకిన్నరసతుల్ జ్యోతిర్లతాదీపముల్జ్వలియింపం దిలకించి సిగ్గున నురోజక్షేమచేలాంచలంబుల వారింతురు చూచి నవ్వఁగఁ బ్రియు ల్ముద్ధత్వము న్మెచ్చుచున్.

మృగధరమృగనాభీస్పృష్టగండోపలంబుల్భుగభుగ యను తావు ల్పూన్చె నీమందరాద్రిన్మృగయువరమృగాక్షీవృత్తవక్షోజకుంభాత్యగణితతులితత్వావాప్తిఁ గంటే బలీంద్రా.

దానవనాథ కంటే వసుధాధరరాజము మౌళిభాగసందానితతారకాకుసుమదామము గైరికకుంకుమంబు సంవ్యానితమేఘవర్ణరుచిరాంబర మించుగమించె నెంచఁగాసానులకూటముల్ గలుగుజాణలు నీటులు పెట్టకుందురే.

అని యనితరసాధారణసుధామధురవివిధవచోరచనల నవ్వసుధాధరంబు వినుతించు సుధాశనాధినాథునకు విబుధవిరోధిమూర్ధన్యుం డి ట్లనియె.

ఔర మనరాక కలరి మిన్నంది యున్న, దీనగేంద్రంబు; గదలింప నెవ్వఁ డోపుఁగలఁడె యటువంటిబలియుఁ డొక్కరుఁడు దేవ, దానవులలోన నన బలదైత్యుఁ డనియె.

అసురనాయక నీధృతి కళికి క్రుంగి, కుతల మంటినమందరక్షోణిధరముఁబెల్లగించుట యిది యొకపెద్దఱికమె, యిందు నెవ్వనిచేతఁ గా దిట్టిపనికి.

దిగ్గజంబులు మొగ్గ ధాత్రీధరేంద్ర, మడఁగఁద్రొక్కుదునో లేక యంబరమునకెగరవైతునొ తిరిగి నగేంద్రమునకు, ఱెక్క లొదవెనొ యంచు విరించి చూడ.

అనిన విని బలాసురు మెచ్చక జంభుం డి ట్లనియె.

కులపర్వతంబు లేడును, గలయఁగ నమ్మొదళు లార్పఁగలిగిననా కగ్గలమే మందర మెత్తుట యలమేరువు నేన్ బగల్తునా దైత్యేంద్రా.

అని మఱియు శంబరారిష్టనేమిత్రిపురవాసజంభశుంభనిశుంభహయగ్రీవనముచితారకబాణవిప్రచిత్తివిరోచనహేతిప్రహేతిమయమాయావిమాలిసుమాలిపౌలోమకాలకేయనివాతకవచవజ్రదంష్ట్రకాలనాభశరభవృషపర్వరాహుమహిషేల్వలవాతాపిదుర్మర్షణోత్కలమేఘదంభద్విమూర్ధ్నకేతుక్రోధవశాదినానాదనుజయూథనాథులు మందరవసుంధరాధరసముత్పాటనపాటవంబుఁదెల్పుచు నబ్బలీంద్రుచేఁ గనకమణిమయభూషణాంబరాదులు బహుమానంబులు గైకొనుచు మహోత్సాహంబున బాహు లప్పళించుచు శంఖమర్దళపటహభేరీధణంధణధ్వనులకుం బ్రతిధ్వనులిచ్చు మందరకందరంబులకుం గుప్పించుచుఁ దనుం బెకలింపవచ్చుట నిచ్చ నెఱింగి మచ్చరంబునం బెచ్చుపెరిగియద్ధరంబుం దమతోడి యుద్ధరంగంబునకుం బంపిన బలంబులో నా దరీకుహరనిర్గతశరభశార్దూలగండభేరుండఖడ్గగవయకంఠీరవమహోద్దండవేదండప్రచండభల్లూకశశచమరశల్యభల్లసారంగసాలావృకవరాహమహిషమర్కటమహోరగప్ర్రముఖజంతునికాయంబుల కాయంబుల కపాయంబు గల్పించుచునుపాయంబుల నగ్గట్టుచుట్టువారుకొని యిట్టట్టు మెదలక నెట్టుకొని యొకరొకరు కదిలించి చూచి కదలకున్నఁ బదుండ్రు నూఱ్గురు వేగురు లక్షకోటిసంఖ్యాకులుం గూడికొని నలుదిక్కులం డాసిత్రోసి వేసియుం గదలింపలేకయుద్దామనిశితకుద్దాలంబులం బెద్దయుం బ్రొద్దు నాశైలంబు మూలంబు గానం ద్రవ్వు నెడనెడం బొడముస్థూలోపలంబులు పెకలింపంజాలక యులువకట్టునించిమించినభుజాటంకంబుల నగల్చుతఱి శిలాగర్భంబుల వెడలువర్షాభులఁ గని యచ్చెరువందుచు నందంద సన్నలు వైచుచు మఱియు నానోపాయంబులం జూచుచు నొకించుకయుం దెమలింపఁజాలక సురాసురజాలంబులు ఘర్మకణజాలకంబులందోఁగుగాత్రంబులు స్రవన్నిర్ఝరంబు లగు గోత్రంబులం బోల గుహాముఖంబులువెడలు గాడ్పులచాడ్పున నాసికారంధ్రంబుల నీరంధ్రంబులై నిట్టూర్పులు బెట్టిదంబుగా నడర భుజంబులబలిమి సడల నొడళ్లు జడియ జడిమ నిగుడ బడలియున్నవారలం గనుంగొని.

బలి యింద్రున కిట్లను నిటు, వలె నూరక యుండఁదగునె వరశైలగరుదళనసమర్ధుఁడ వయ్యును, భళిభళి దేవేంద్ర యనిన బలి కతఁ డనియెన్.

బలజంభప్రముఖమహా, బలశాలులచేతఁ గానిపని యిట నాచేనలవడునె దైత్యనాయక, యల వెన్నుని వేడఁదగు నుపాయం బింకన్.

అని వారలఁ దోడ్కొని తాఁ గనకాద్రికి నేగి యచటఁ గమలాక్షునిఁ దత్తనయుం గనుఁగొని సాష్టాం, గనమస్కారములు సేసి కార్యము దెలుపన్.

విని నవ్వుచు వనజోదరుఁ, డనియె సురాసురలుమీరలందఱు నొకగట్టు నగల్పలేరె యిఁక నే, యనువున సుధ గాంతు రనుచు నహిపతిఁ దలఁపన్.

తనమహాసవనిరంతరసమ్యగాసక్తి కుండలీంద్రత్వంబు కుదురుపఱుపఁదనశ్రీవహనసముద్భాసితోత్సాహంబు చక్రిభావమున కౌజ్జ్వల్య మొసఁగఁదనభోగినీభోగజనితానుభావలీల భుజంగపుంగవోల్లాస మెసఁగఁదనమహాబలసముద్యద్విగ్రహప్రవృద్ధి యహీనభావంబు దేఁటపఱుప

సోమరుచియు ననంతవిస్ఫూర్తి భోగి, ముఖ్యతయు భూమిభరణసముత్సుకత్వమరలఁ జెలువొందు నెవ్వఁ డుదారఫణితి, నట్టిశేషాహి వచ్చె నయ్యవసరమున.

వచ్చినయచ్చిలువలదొర, మచ్చికతోఁ జేరఁబిలిచి మాధవుఁడు ఫణాభృచ్చూడామణి మందశి, లోచ్చయ మగలించి వీరి కొసఁగు మటన్నన్.

పెకలిచి యిచ్చినఁ జాలుం, బ్రకటితదోశ్శక్తి బెండువలెఁ దెచ్చెద మేమొకరొకరమె యని దైత్య, ప్రకరంబులు మదముమీఱి పలుకఁగ వించున్.

మంచిదయంచును మరుదశనవిభుం, డంచితశక్తిని నఖిలము గొలువంగాంచనభూధరఘనతరమహిమో, దంచితమందరధరగతుఁ డగుచున్.

పరివేష్టించె ఫణీంద్రుఁడు, ధరణీభరణాత్మసామ్యధన్యుఁ డటంచుంబరిరంభణ మొనరించెను, ధరణీధరమౌళి నను చుదారస్ఫూర్తిన్.

ధరణీభారము నే వహింపఁగ మహీధ్రంబయ్యెఁ దా నెట్లు మందరమం చల్గెనొ నాఁగ నాగవిభుఁ డుద్యత్క్రోధసంరంభియైపరివేష్టించి యగల్చెఁ దన్నగము క్ష్మాభృత్తుంగశృంగాగ్రభంగురజంఘాలదృషద్ఘలంఘలఘలాఘోషంబు ఘోరంబుగన్.

ఇటులు పెకలించి కరముల కెత్తె మిగుల, సంభ్రమమున సురాసురుల్ శైలమానిపట్టఁజాలక మున్పటిపాతు గొనఁగ, కూలవైచిరి మందరకుధర మవని.

దాన నొచ్చిరి గొంద ఱిత్తఱి నగారి, ముఖసుపర్వులు చక్రికి మొఱలువెట్టగరుడవాహన మెక్కి యక్కడికి వడిగఁ, దాన విచ్చేసె భక్తవాత్సల్యమునను.

కరివరదుండు వచ్చి ఘనగైరికరాగము మందరాగముంగరమున నెత్తి పక్షితురగంబు శిరంబున నుంప జాళువాబురుక తెఱంగునం దనరఁ బొంజిగి ఱెక్కలు గుందనంపుపక్కెర హరువూనఁ జంచువునఁ గీల్కొనుచిల్వ ఖలీనమై తగన్.

హరి గిరి ధరించి యిటువలె, సరగునఁ జన గరుడువెంటఁ జనలేక సురాసురులమనమ్ముల నంటిన, వెరవఱియవి గుఱుతులూని వెనకకుఁ జిక్కెన్.

కోరి బ్రహ్మాండకోటులఁ గుక్షి నుంచు, కొన్న విశ్వంభరునిఁ బూనుపన్నగారికవనిధర మేమిభారమా యట సురాసు, రులకుఁ జాలవిచిత్రమై యలరె గాక.

నిమిషమాత్రంబులోపల నీరరాశి, తటమునకు నేగి హరిని మందరము డించివెనుకవచ్చు సురాసురవీరవరులఁ, గాంచి యనిపించుకొని యేగె గరుడుఁ డంత.

వాసుదేవునియానతి వాసవుండు, సకలదేవాసురాలికి సమ్మతముగ

వాసుకి ననంతశక్తినివాసుఁ బిల్వ, నంపి యిట్లని పలికెఁ బ్రియంబు గులుక.

పొలయల్క నొకవేళఁ బలుకనిపార్వతి వెఱపించి కూర్తువు విశ్వనాథుఁబావనబ్రహ్మకపాలమాలికల జోడౌదు వొక్కొకనాఁడు హార మగుచుఁబడగమానికవుఁ జెక్కడపుఁగీల్కంకణం బగుదు వొక్కొకయెడ హస్తమునకుఁగన్నెగేఁదగిఱేకుకమ్మతావులు వెలయింతు వొక్కొకచాయ నింపుగాఁగ

నెన్నిభంగులఁ జూడ విశ్వేశ్వరునకు, నీవె కా కెవ్వరున్నారు కేవలాప్తులట్టి నిన్నుఁ బ్రశంసింప నలవియగునె, ప్రణుతగుణగణ్య వాసుకిఫణివరేణ్య.

క్షమ వహియించి శేషుఁడు యశంబుగనెన్ క్షమయు న్వహించి నీవమృతము గల్గఁజేసి దివమంతయుఁ బ్రోచిన నంతకన్న నుత్తమమగుకీర్తి గల్గు వసుధాధరమంథము ద్రిప్ప నానుగుణ్యము వహియింప గల్గు ఫల మందఱకు న్సరి యింతె వాసుకీ.

లేయని యింద్రుఁడు సూత్ర, ప్రాయముగా నిటులనాడు పలుకున కెంతేనీయెద మెచ్చుచు వాసుకి, యీయకొనియె నంత నిర్జరేంద్రుఁడు గడఁకన్.

వేవేగ వజ్రధారన్, గ్రావము నిష్కంటకముగ ఘనమృగసమ్యగ్రావముల మించఁ బార్శ్వ, గ్రావంబుల నెల్ల నఱకి కవ్వము చేసెన్.

అంత.

ఘనకిరీటంబులు గట్టిగా సవరించి కలితకుండలముల కొలుకు లదిమిబాహాంగదంబులు పదిలంబుగఁ దొడిగి ముంజేకడెంబులు మొగపు లరసియంగుళీయకముల నటకొన్ని ఘటియించి మౌక్తికహారము ల్మట్టుపఱిచిమొలదట్టి పొరలవంకులు పొంకముగఁ జెక్కి పిరిచుట్టి చేలము ల్బిగియఁగట్టి

యంతకంతకు నుత్సాహ మతిశయిల్ల, నుల్లమునఁ బల్లవింపఁగ నొండొకళ్లఁబిలిచికొనుచును దమతమ పేరువాడి, కొనుచు దేవాసురులు దుగ్ధవనధిఁ జేరి.

బంగరుమొలకట్టు రంగుమీఱంగనా, నాగభోగ మద్రినడుమఁ జుట్టికలశవారిరాశి నిలిపిరి తమసొమ్ము, మొదలువెట్టఁ జుట్టి మోపి రనఁగ.

అంత బృందారకులు దమలోన.

అక్కట దానవేంద్రుఁడు బలాఢ్యుఁడు గాన ఫణీంద్రపుచ్ఛమున్రక్కసిమూఁక కిచ్చి సుకరంబుగ ఘోరవిషాగ్నికీలలంగ్రక్కుఫణాళి మాకొసఁగఁ గాదనరా దిఁక నేమికార్య మీదిక్కున నంచు నొండొరులు దీనత మోములు చూచుచుండఁగన్.

తదభిప్రాయం బంతయు, మది నారసి శౌరి కపటమార్గంబున నోత్రిదశవరులార రత్నా, స్పదఫణిభోగములు మనము పట్టుద మనుచున్.

భోగిభోగశయానుఁడు యాగభాగ, భోక్తలునుగూడి భోగీంద్రభోగభాగ

ములు గ్రహించిన నది యాగముగ గ్రహించి, యాగతామర్షమున దైత్యు లనిరి యపుడు.

దితిసుతులము పరిపఠిత, శ్రుతులము నిష్ఠురతపోనిరూఢమహోవిశ్రుతుల మిదిగాక బహు, శ్రుతులము మముఁ జులకసేసి చూడందగునే.

శౌరి మేము కులస్థానపౌరుషముల, నేమిటఁ గొఱంత తెల్పుమా యీసురలకువారికన్నను బూర్వదేవతల మగుట, నేమె ఘనులము గామె నీ వెఱుఁగవేమి.

శ్రీహరి యెంత యక్రమము సేసితి వాసుకిభోగిభోగసందోహము మీరలూని కడతుచ్ఛపుఁబుచ్ఛము మా కొసంగ మేమూహ యొనర్పలేక యిది యూనిన నధ్యయనశ్రుతంబులున్సాహసముం బరాక్రమము సత్కులజత్వము వీటివోవదే.

అని దనుజు లూరకున్నం, గనుఁగొని నవ్వుచును శౌరి ఘను లిట మీ రింతన యల్గనేల కైకొనుఁ, డని ఫణము లొసంగి పుచ్ఛ మానె సురలతోన్.

ఈనీతిసమాకర్ష, స్థానము లేర్పాటు గాఁగ దైవాసురసంతానంబు లైకమత్యము, గా నమృతాబ్ధి న్మథింపఁ గడఁగిరి కడిమిన్.

అమృతావాప్తికి దేవదానవులు దుగ్ధాంభోధి మంథాద్రిచేనమితోత్సాహమున న్మథించునెడ నయ్యద్రీంద్ర మాధారహీనముగా నజ్జలరాశి మున్గ నదియానం జాలవిస్తారమౌకమఠాంగంబు ధరించె మాధవుఁ డభంగప్రౌఢి సంధిల్లఁగన్.

అగశిలాపాత మోర్వక యంబురాశి, చర్మఫలకంబుచే మేను చాటు చేసెననఁగఁ జూపట్టె లక్షయోజనవిశాల, మైనకమఠంబు దుగ్ధరత్నాకరమున.

కఠినతరకర్పరము మృదు, జఠరము నయనాబ్జయుగళసహబహిరంతర్లుఠదాస్యంబును గలుగఁ గ, మఠముం గని విస్మయంబు మదిఁ బెనఁగొనఁగన్.

మరల సొమ్మిచ్చుటకు బహుమధనపడిన, యజ్ఞజునిరోసి పూఁటకా పైనహరినిజట్టు మోపి రనంగఁ గచ్ఛపముమీఁదఁ, గట్టు నిల్పె సురాసురగణము లపుడు.

ఉదధిఁ గమఠాసనమునఁ గూర్చుండి భోగి, భోగ మనుయోగపట్టిక పొసఁగ నడుమనమృతసిద్ధికి జపియించునట్టియోగి, కరణిఁ గనుపట్టె మందరక్ష్మాధరంబు.

ఇవ్విధంబున దుర్ఘటసింధురకందరం బగునమ్మందరవసుంధరాధరంబు వాతంధయగుణానుబంధురంబుగా నగ్ఘటసింధుబంధురమధ్యంబునఁ బ్రతిష్టించి.

శృంగాగ్రదళితవైరించాండగళితావరణధార లననిర్ఝరములు దొరఁగనానామహాగుహాంతరసమాధి సనాథతాపసనాథమస్తములు దిరుగఁ

గందరాంతరసింహగజగండభేరుండశరభాదు లొకటఁ గ్రేళ్లుఱకఁదొడఁగఁగంపితశాఖిశాఖాశిఖాఫలపత్రకుసుమము ల్జడిగొని కురియుచుండఁ

జిఱుతపులితోలుగట్టు జేజేలఱేఁడు, దిరుపుగట్టువిధంబునఁ దిరిగె గట్టునవ్యభుజశక్తి దేవదానవులు దుగ్ధ, జలనిధానంబు మథియించుసమయమునను.

కులశైలాగ్రణి క్రింద మీఁద నడుమ న్గూర్మాదిరూపంబులన్బలియుండై భరియించి దేవదితిభూభాగంబులన్ వారిలోపలను న్నిల్చి స్వకీయమూర్తిని జతుర్బాహార్గళ ల్మార్పుచుంగలశాంభోధి మథించె మాధవుఁ డభంగప్రౌఢి రూఢిం గనన్.

ఈరీతిన్ హరి దేవదానవులతో హేలాగతిన్ ధీరుఁడైక్షీరాంభోధి మథింపఁ గాంచనకటీచేలప్రభ ల్హేమకేయూరాన్యోన్యవిఘర్షణోదితరజం బుద్వేలసౌవర్ణకోటీరచ్ఛాయలు పర్వఁ బర్వతము గట్టెం బొమ్మ హేమాద్రికిన్.

అప్పుడు.

రక్షోదేవమిథోట్టహాసహహహారావంబులుం గూర్మమంథక్షోణీధరమర్షఘర్ఘరనినాదంబు ల్దృణాకర్ష వేగక్షుభ్యద్భుజగేంద్రభూరిఫణభూత్కారధ్వనుల్ ఘూర్ణితోద్యత్క్షీరాంబుధి జంతుఘోషములు మెండై నిండె బ్రహ్మాండమున్.

అఖిలాదిత్యసురాహితభ్రమితమంథానాద్రిఘోషంబుచేసఖిమై నించుక వెన్నుతీఁట శమియించంజేయ క్షీరాబ్ధిలోసుఖనిద్రారతిఁ జొక్కెఁ గూర్మపతి ప్రాంశుశ్వాసవాతోచ్చలాబ్ధిఖవీథిం బొరలం దరంగపటలోద్రేకంబుచే మాటికిన్.

అప్పుడు.

వలదత్యుగ్రదవాగ్ని మగ్నశలభవ్రాతంబుమాడ్కి న్విశృంఖలసంఘర్షణభుగ్నభోగిఫణపూత్కారాక్షిదంష్ట్రాగళద్విలయాభీలకరాళకాలదహనోద్వేలజ్జ్వలజ్జ్వాలికావళిచే మాడిరి పెక్కుదానవులు గర్వం బెల్ల ఖర్వంబుగన్.

ఘనత యంచును దుష్కరకార్యములకుఁ, బూనఁగాఁ జెల్లునే యెట్టిపురుషులకునుఘనత యంచును భోగిభోగములఁ బూని, దానవులు పడ్డపా ట్లెన్నియైనఁ గలవు.

ఆవిషవహ్నికీలలు సురావళి నంటి తపించునప్డు రాజీవదళాయతేక్షణవిశేషకృపామృతదృష్టిచేతఁ బా

రావరదుగ్ధవాఃకణధురంధరబంధురమంథరానిలశ్రీ వెలయన్ ఘనాళి గురిసెన్ బరిశీతలవారిధారలన్.

హరికిఁ బ్రతిఘటించి యసురులు విషవహ్నిఁ, గమలి రదితిసుతులు కమలనయనునాశ్రయించి శైత్య మందిరి యెందైన, శౌరికరుణ లేక సౌఖ్యమేది.

జలసేకంబుల సేద దేరుచు నభశ్చారాళికన్నన్ విశృంఖలవృత్తిన్ మథియించి రాదితిజు లుగ్రంబై విషజ్వాలికల్కలయంబర్విన సడ్డ సేయక ఫలాకాంక్షం బ్రవర్తించువారలకుం దోఁచునె భేద మెందయిన వైరాటేయ భూపాత్మజా.

భీమనిశాటబాహుబలపీడితవాసుకిభోగిభోగదంష్ట్రాముఖనిర్గద్విషము శైలవిఘర్షణకూర్మకర్పరోద్దామకృశానుకీలల నుదగ్రతరంబయి దేవదానవస్తోమము భీతిలం గలశతోయధి వెల్వడి సత్వరంబుగన్.

ప్రళయకాలాళీలఫాలలోచనఫాలకీలికీలాకేళిఁ గేలిసేసిసంవర్తసమయప్రచండచండాంశుమండలమండలోద్దండనటన దెగడిత్రైలోక్యభస్మసాత్కరణదీయోదక్షరూక్షాశుశుక్షణిరూఢి నొడిచికల్పాంతజలదనిర్గళదనర్గళదీర్ఘఘోరనిర్ఘాతనిర్ఘోష మడఁచి

భూర్భువస్వర్ముఖానేకభువనగహన, దహనలీలాతిసహనధూర్వహసవోగ్రచిటచిటాయితశిఖల నశేషముం గ, లంచె హాలాహలంబు కోలాహలముగ.

అపు డిది యేమి యక్కట సుధార్థము దుగ్ధధిన్ మథింప నుగ్రపువిష ముద్భవించి లయకాల మొనర్పఁ దొడంగె నింక నీవిపదపవారణంబునకు విశ్వపతిన్ శరణంబు వేఁడినంగృప దళుకొత్తఁ బ్రోచునని యీశ్వరుచెంగటి కేగి యందఱున్.

గడగడ నొడలు వడంకఁగ, దడదడ దడమంచు గుండె తల్లడమందన్బడిబడి నడ్డము దిగటముఁ, బడిబడి మ్రొక్కుచును “బాహిపాహి” యనంగన్.

ఆభవుఁ డేమేమి యనిన సురాసురుల్ భ, యమున హాలాహలము హలాహలము హాలహలము హలహల మని తోఁచినట్టు పలుక, నన్నినామంబులను గాంచె నవ్విషంబు.

వారిభయమెల్ల వారింప వారిజారి, ధారి మది నెంచి తనదుచిత్తం బెఱింగిచిన్నవోయిన పార్వతిచెలువు గాంచి, యిట్లనుచుఁ బల్కె దరహాస మిగురులొత్త.

భామా యేటికిఁ జిన్నవోయెదవు నీభావంబు నేఁగంటి నాకేమౌనో గరళంబుచే ననుచు నీ వెంతే విచారించె దందేమీ గా దటుగాక నేమయినఁ గానీ సర్వలోకాళికిన్క్షేమంబైనను జాలుఁ దద్విషము భక్షింతున్ వినోదంబుగన్.

వచ్చినవారికి నాపద, వచ్చిన నది పరిహరించువాని ప్రభుత్వంబెచ్చౌను గాని మఱి పొర, పొచ్చెము గావించినం బ్రభుత్వము గలదే.

పరులఁ బీడించుకంటెఁ బాపముఁ బరోప, కృతి యొనర్చుటకంటె సుకృతము లేదుపరుల కుపకృతిఁ జేసిన భాగ్యశాలి, యిహముఁ బరమును జెందుఁ బూర్ణేందువదన.

అని యుత్సహించి కలశీ, వనరాశితటంబుఁ గదిసి వసుధాధరరాట్తనయాధిపుఁ డవ్విషముం, గని హరియింపంగ వశముగా కడలంగన్.

అంత బ్రహ్మదిసురలు భయార్తు లగుచుఁ, దన్ను బ్రార్థింప శ్రీహరి తద్విషంబుధీరుఁడై యారగించిన దేహమెల్ల, నల్లనయ్యెను వ్యాపించి నాఁటనుండి.

హరియు మిగిలినవిషము కాలాంతకునకుఁ, గొంత యొసఁగిన హరుఁ డది ఘుటిక సేసిమ్రింగ నది కంఠమున నిల్చె హృదయనిహిత, గరుడవాహనవీక్షణాగతభయమున.

ఫాలాక్షుఁడు కబళింపఁగ, హాలాహలవిషము కొంత యవశిష్టం బైతూలఁగ నది వృశ్చికములు, వ్యాళంబులు మెసవి విషధరాఖ్యల వెలసెన్.

ఈలీల దైవకరుణన్, హాలాహలబాధ యుడిగి యమరాసురు లుద్వేలముదంబున మందర, శైలంబునఁ గడలిఁ ద్రచ్చుసమయమునందున్.

గొరిసెలయందముం గుఱుచ కొమ్ములచందము వెన్ను మందమున్గరువపుమేనిలో నుదుటు కాఁగెడు పెన్పొదు గింద్రనీలముంబెరసినముక్కు మీఁగడబలెం జెలువౌ గళకంబళంబునన్హరు వగుకామధేనువు సుధాంబుధిఁ బుట్టె నక్షీష్టధాత్రియై.

అంత.

సురభిన్ సవనవనాపన, సురభిన్ స్రనదమృతగళితశుష్యన్నానాసురభిం గైకొనిరి మురా, సురభిత్కృప దేవఋషులు సురుచిరభక్తిన్.

మొదటనున్న నిజాకారమును ద్యజించి, వారిరాశితరంగ మువర్ణసహితమై తురంగంబు గాఁబోలు ననఁగఁ బొడమె, వెల్లవారువ మాపాలవెల్లి నంత.

కర్పూరకదళికాకళికాదళంబులు నెఱమించు విదళించునిక్కుఁజెవులునేలినవానికిఁ ద్రైలోక్యసాంబ్రాజ్యలక్ష్మి నియ్యగఁజాలు లక్షణములు

మానసాధికవేగ మూనఁగా జపియించుపోలికఁ గదలెడుప్రోథపుటముఁదామరసాప్తనందనునివాహమునకు రోషంబు పుట్టించుహేషితంబు

గలిగి శరదిందుకందళత్కందబృంద, కుందగోవిందతుందారవిందకందచందనామందరుచి నందచంద మగుచు,నొనరునుచ్చైశ్శ్రవంబు నేత్రోత్సవముగ.

దేవమణియుక్త మని మదిఁ దెలిసియుండి, తేజిఁ దాఁ గైకొనియెఁ బూర్వదేవభర్తదేవమణియును నలవాసుదేవుసన్నఁ, దెలిసి యూరకయుండె నిశ్చలత నంత.

ప్రాయంపుఁబూఁబోణిబటువుసిబ్బెపుగబ్బిగుబ్బచన్నులఁబోలు కుంభయుగముఁదొలిచూలిజవరాలితళుకులేఁజెక్కుటద్దములతోఁ దులఁగూఁగు దంతరుచులుఁబ్రౌఢకాంతామణిభాసురమృదులోరుకాండముల్ దొరయంగఁ గల్గుకరమునటనచే నలసినకుటిలకుంతలిమందగతుల కొయ్యారంబు గఱపునడలు

విటుని తబ్బిబ్బులకుఁ గేరువెలమిటారి, నగవునేలినడాలు గంధర్వరాజసతినిషాదంబు నెనయుబృంహితరవంబుఁ, గలిగి చౌదంతి వొడమె నాజలధియందు.

విశ్వేశువాహనవృషభమౌఁ గాదేని ధేనుకామేళనోద్వృత్తి గనునెశ్రీగౌరివాహనసింహమౌఁ గాదేని వనకదంబకమున వసతి గనునెయాత్మభూవాహనహంసమౌఁ గాదేని బిసజాతహరణలాలసత గనునెశక్రవాహనశరజ్జలదమౌఁ గాదేని యభ్రముసంగతి నలరఁ గనునె

యనుచుఁ గవిగురుబుధముఖు ల్వినతి సేయఁ, బ్రతిగజభ్రాంతిదంతనిర్దళితధవళభూధరాపారపాంసుకర్పూరపూర, మెగయఁ జల్లుచు వచ్చె హస్తీంద్ర మపుడు.

వెండియు నాఖండలబలిప్రముఖసురాసురమండలం బుద్దండభుజాదర్పంబు మెండుకొన సుధాపయోధి మథియించుసమయంబున.

సకలసురేప్సితఫలదా, యకచిత్రచరిత్రములను హరిచందనకల్పకపారిజాతసంతా, నకమందారంబు లవ్వనధి నుదయించెన్.

గైరికము ల్ప్రవాళములు గా గశదబ్ధిపయఃకణాళియేకోరకపాళిగా నడుమఁ గోరికమీఱ విశేషమైనయాకారము పూని మందరము కామితసత్ఫల మీయనయ్యె మందారము గానిచోట నగనామము సెల్లునె రెంటికిందగన్.

మఱియు వియచ్చరనిశాచరసముచ్చయంబు విచ్చలవిడి శిలోచ్ఛయంబుచేనప్పాలకడలిం ద్రచ్చుసమయంబున.

చెచ్చెర మందరసంగతి, నచ్చటిమణులెల్ల రమణు లయ్యె నటంచున్మెచ్చుచు నచ్చెరువంద వి, యచ్చరు లచ్చరలు పుట్టి రయ్యమృతాబ్దిన్.

పదకోకనదములు ప్రపదకూర్మంబులు నఖరశుక్తులు జఘనపులినములువలితరంగములు పొక్కిలిసుళ్లు నూఁగారుకలువచా ల్గుబ్బజక్కవలకవలుభుజనాళగళశంఖములు గల్లమశరికామకరిక లాలోకశకులకులములక్షిసితాబ్జోష్ఠహల్లకభ్రమరషట్పదంబులు కేశశైవలములుఁ

జాలఁ జెలువొంది సుస్వరస్పర్శరూప, రసగుణంబులచే నప్సరస్సు లనఁగనప్సరఃకామినీమణు లలరి రపుడు, సహజసౌరభ్య మెక్కుడుమహిమ దెలుప.

వారితనూవిలాసములు వారితనూత్నలతావికాసముల్వారివిలోలనేత్రములు వారివిహారవిసారజైత్రముల్వారిదరస్మితాస్యములు వారిదముక్తశశీతదాస్యముల్వారిజగన్నుతాకృతులు వారిజబాణసతీకృతానతుల్.

కమలాకరంబెల్లఁ గలఁగఁబారిన నొల్ల కరుదెంచుకొదమరాయంచ లనఁగవరుణాలయాంతరవనవాసము దరల్చి చేరెడుకలికిరాచిలుక లనఁగవిషరాశివిషమాను విషధరంబుల రోసి మెట్టకు నరుగుక్రొమ్మెఱుఁగు లనఁగనడుగునఁ బడక రత్నాకరంబునఁ దేలి నడతెంచు జీవరత్నంబు లనఁగఁ

గులుకునడ జీనిచక్కెరలొలుకుపలుకు, బెళుకుఁజూపులుఁ గెమ్మోవితళుకు ముద్దుచిలుకు నచ్చరచిలుకలకొలుకు లపుడు, కడలి వెలువడి వచ్చుశృంగార మమరె.

ఎచ్చోటఁ జూచిన నెలతేఁటిదాఁటులఁ బుట్టించుకప్పుఁగొప్పులమెఱుంగులేవంకఁ జూచిన నిందుబింబంబుల మొలపించుముద్దుమోములబెడంగులేచాయఁ జూచిన నిందీవరశ్రేణి వెలయించువాలుఁజూపులవిలాసమేకడఁ జూచినఁ గోకనదశ్రీలఁ గీలింపఁజాలు కెంగేలిడాలు

లేయెడను జూడఁ గెంపులఁ జేయుమోవు, లెందుఁ జూచిన వెన్నెలల్ చిందునవ్వులెచటఁ జూచిన మెఱుఁగుల నీనుమేను, చెలువ మలరారె నచ్చరచెలువలకును.

అచ్చపురేవెలుంగు దొరయంగలనిద్దపుముద్దుమోములంబచ్చమెఱుంగుఱెక్కజిగిపక్కెరచక్కనిరౌతుతూఁపులన్మెచ్చనిచూపులం దళుకుమేనుల నిచ్చకు మెచ్చుఁ దెచ్చునయ్యచ్చరమచ్చెకంటులయొయార మయారె నుతింప శక్యమే.

అచ్చిగురాకుఁబోండ్లనెఱయందమునందె మనంబు నిల్పి వైయచ్చరదానవప్రవరు లచ్చెరుపాటఁ బరాకుఁ జెందుచున్మెచ్చుల కెచ్చరించుచు సమిద్ధఫలాబ్ధికి మేను లుబ్బఁగాఁద్రచ్చిరి క్షీరవారిధి నుదగ్రరవం బడరంగ నంతటన్.

పాలు సిలుకంగ వెన్న యేలీలఁ బొడమెఁ, జాలవింతని వేలుపు ల్సంభ్రమింపఁజంద్రుఁ డుదయించె నప్పాలసంద్రమునను; వాని శిరసావహించె భవానివిభుఁడు.

నిస్తులమై నిస్తులతే, జస్తులమై దీప్యమానసకలదశదిశావాస్తుభమై కలశాంబుధిఁ, గౌస్తుభరత్నంబు తరణికరణిఁ జనించెన్.

అమృతంబు ద్రావునీలాభ్రమో యిది గాదు కప్పుపెన్నెఱి గొప్పుకొప్పు గానిమరలఁబుట్టెడు చందమామయో యిది గాదు మొలకనవ్వుల ముద్దుమోము గానిప్రభవించునమృతకుంభంబులో యివి గావు కఠినవక్షోజయుగ్మంబు గానిజలధిఁ బుట్టిన పూర్వజగతియో యిది గాదు మహితనితంబబింబంబు గాని

యనుచు నామస్తకము క్రమంబునను నిర్వి, కల్పసవికల్పవిజ్ఞానగతి గణింపఁగా సురాసురు లతులశృంగారగరిమ, క్షీరవార్ధి జనించె లక్ష్మీమృగాక్షి.

ఆరమాసతిరూపరేఖాతిశయము, వర్ణనము సేయఁ దరమె యెవ్వారి కైనఁగాంచినప్పుడె చిత్రతఁ గాంచె సకల, దైవదానవరాజి చిత్రంబు గాఁగ.

శ్రీరాజీవముఖీవినూతనతనూశృంగారరేఖాదిదృక్షారంభంబున దేవతావళి సహస్రాక్షత్వముం గోరె విస్తారప్రీతి సహస్రనేత్రుఁ డయుతాక్షత్వంబు గాంక్షించె నౌరౌరా యాసకు మేరలే దనుట సత్యంబే కదా ధారుణిన్.

అంత.

పద్మగర్భాదినిర్జరప్రార్థ్యమాన, యగుచుఁ బద్మావధూటి దేవాధినాథఘటితమణిపీఠి వసియించెఁ గమలమధ్య, మునను జెలువందుకలహంసికను హసించి.

“పుణ్యాహ” మనుచు నప్పుడు, పుణ్యాహము చేసె వాగ్విభుఁడు భూమిని నైపుణ్యార్పితనవపల్లవ, పుణ్యోదకపూర్ణకలశములు చెలువొందన్.

పాథోధరశ్రేణి పటహభేరీశంఖపణవాదివాద్యవిభ్రమము నెఱపనప్సరోభామినుల్ హస్తాభినయలీల నర్థముల్ దెలియ నృత్యంబు నలుపగంధర్వకలకంఠకంఠులు స్థాణువుల్ ననలొత్త మధురగానంబు సేయజయలోకపావని జయజగజ్జనయిత్రి జయలక్ష్మి యని సుర ల్సన్నుతింపఁ

జారుతరదక్షిణావర్తశంఖములను, విమలగంగాదినదులతో యములు ముంచియాగచోదితమంత్రరహస్యములను, బద్మ నభిషిక్తఁ జేసిరి బ్రహ్మఋషులు.

శ్రీమహిళాలలామ కభిషేకముఁ జేసె దిగంతదంతు లుద్దామకరప్రకాండసముదంచితకాంచనకుంభసంభృతశ్రీమహనీయతోయములచేతఁ దదీయకచాళికోమలశ్యామలభృంగపాళికి నవాబ్జమరందము నించుకైవడిన్.

హస్తముల కొసఁగు మిపుడె ప్ర, శస్తోరుశ్రీల ననెడిచందమున దిశాహస్తులు లక్ష్మీశైలే, శస్తని కభిషేచనోపచారము సలిపెన్.

శైవాలవల్లికాజలధియిచ్చిన పచ్చపట్టుపుట్టముఁ గట్టెఁ బడఁతి యొకతెకుండలీంద్రుఁ డొసంగుకురువిందమాణిక్యకుండలములు వెట్టెఁ గొమ్మ యొకతెశారద యొసఁగిన సదమలతారహారంబు చనవఁ జేర్చె రమణి యొకతెవనరాశిపతి యొసంగిన వైజయంతీవ్రజంబు కంధర వైచె సకియ యొకతె

విశ్వకర్మ యొసంగిన వివిధరత్న, భూషణంబులు గైసేసెఁ బొలఁతి యొకతెపద్మగర్భుఁ డొసంగిన పంకజంబుఁ, గేలఁ గీలించె నొకరాజకీరవాణి.

ఈరీతి సకలదైవత, నారీతిలకములు మిగులనైపుణితో శృంగారింప నొప్పె రమ బం, గారపుబొమ్మో యనం జగన్మోహిని యై.

జయజయ యంచు బ్రహ్మఋషిజాలము దీవన లియ్యఁగాఁ బురంజయజలజాతసంభవనిశాచరవైరికులాధిభూధనంజయముఖదిగ్వరప్రముఖసర్వసుర ల్వినుతింపఁ జిత్తభూజయకరవిభ్రమంబుల నెసంగె రమాసతి భద్రపీఠికన్.

మకుటాగ్రమరకతమణిరుచుల్ తనువిభాజలధి శైవాలవల్లులు ఘటింపవాలుఁజూపులు కేళివనజాతముల వ్రాలుగండుఁదుమ్మెదలతోఁ గలసి మెలఁగగట్టాణిముత్యాలకమ్మడాల్ నునుజెక్కుమించుటద్దములఁ గ్రామెఱుఁగువెట్టగళశంఖకుచకుంభకరికుంభసంభవభ్రమదంబు లగుచు హారములు మెఱయఁ

జరణనఖకాంతిజాహ్నవీఝరము వినమ, దమరవరముఖ్యసురకిరీటముల నిగుడస్వస్వరాజ్యాభిషేకసూచకము గాఁగ, సింహపీఠిఁ జెలంగె లక్ష్మీలతాంగి.

ఒకగుణ మున్నచోట మఱియొక్కగుణం బరు దెన్ని చూడఁగాసకలసుపర్వసంఘముల సర్వగుణంబులు గల్గి లోకనాయకుఁ డన మించువానిహృదయంబున నిల్చెదనంచు నిందిరాముకురముఖీలలామ సురముఖ్యులఁ గన్గొనుచుం గ్రమంబునన్.

మణికిరీటమువాని మరకతప్రత్యుప్తమకరకుండలదీప్తిమహిమవానిబటువుకైదువువాని భాసమానమృగాంకభాసమానస్మితాస్యంబువానిఁగంబుకంఠమువానిఁ గారుణ్యరససూచితారుణ్యలోచనాంతములవానిఁదమ్మిపొక్కిలివానిఁ దపనీయరుచిరుచ్యతపనీయపటకటితటమువాని

డాలుగులికెడు పులుఁగురాడాలువాని, వాలువైరులఁ జెండాడువాలువానిమేలు సమకూర్చి త్రైలోక్య మేలువానిఁ, బద్మనాభుని వీక్షించెఁ బద్మ యపుడు.

కమలనయనమనోహరాంగములసౌకు, మార్యసౌందర్యములు చూచి మగువ వలచెననుట చిత్రంబె తన్మూర్తిధ్యానగమ్య, మైనతఱి యోగివరులు మోహంబు గనఁగ.

అంగవల్లిక మాధవాలోకమునఁ గోరకములొందె ననఁ బులకలు దనర్పగండస్థలీచంద్రకాంతము ల్విధుదర్శనంబున స్రవియించెనాఁ జెమర్పఁబురుషోత్తమోద్వాహభూరిసౌభాగ్యనూచకమునా వామోరు సంచలింపఁజక్రాప్తరుచుల లోచనపద్మములు దేనియలు చిందెనా ముదశ్రులు జనింప

జలజపీఠము డిగ్గి భాషావధూటి, చేరి కైదండ యొసఁగ లక్ష్మీమృగాక్షిపరమసాత్త్వికదృష్టిసంపర్కమునను, సాత్త్వికోదయ మగుట యాశ్చర్య మగునె.

ఇంద్రాణిమొదలుగా నెనమండ్రు దిక్పాలకాంతాశిరోమణుల్ క్రమము గాఁగనడపంబు గిండి పావడ కుంచె కాళాంజి సామ్రాణి ధూపంబు చామరములుచేకొని యుడిగంబు చేయ రంభామేనకోర్వసీహరిణీతిలోత్తమాదిసురవారవారిజాక్షులు చెం గుపాంగంబు ముఖవీణ మురజంబు మొదలు గాఁగఁ

గొనుచు గంధర్వమేళంబు వినికిసేయ, నబ్జభవురాణి బిరుదుపద్యములు చదువశక్రుఁ డందంద సందడి జడియఁజేయఁ, బ్రాభవంబున సకలవైభవము లమర.

అఖిలలోకేశ నినుఁ జూచినది మొదలుగ, మదనుఁ డేసినశరపాలి యిదిగొ యనుచునాథునకుఁ జూపి తెల్పుచందమున నల్లఁ, గల్వపూదండ చేఁబూని కల్మిచెలువ.

ఘంటలు మొలనూలిఘణఘణధ్వనులతో ఘనతరశ్రోణిచక్రంబు గదలవలిగుబ్బచనుదోయివలిపెపయ్యెదకొంగు చెంగావిటెక్కెంబు చెన్ను మీఱఁజిన్నిలేనవ్వులు చికిలిఁజేసిన తళ్కు చెక్కుటద్దంబుల చెన్ను చూపవెలిదమ్మిరేకుల వెలయించుకనుడాలు తెల్లజల్లులలీల నుల్లసిల్ల

నంఘ్రికటకారవాకృష్ణహంసతతులు, వాజులై మించఁ గచగంధవలదపారమధుపబలములు వెలయు మన్మథరథంబు, ఠీవి మీఱంగ వచ్చె లక్ష్మీవధూటి.

ఆరమాకాంతరూపరేఖాతిశయము, గాంచి హరి కప్పు డంతరంగంబు నిండివెలికిఁ గ్రమ్మిన యనురాగజల మనంగ, స్వేద మానందబాష్పముల్ చెలువమయ్యె.

నూనసాయకశరవృష్టి నానుకతనఁ, బొడముచలిచేత నెమ్మేను పులకరించుకరణి రోమాంచకంచుకకలిత మగుచుఁ, దనువు గననయ్యె దనుజమర్దనున కపుడు.

వనజాతాక్షునిచూపు శ్రీతరుణిలావణ్యాబ్ధి నోలాడుచున్స్తనకుంభంబులు వీడి భంగవళిపాతస్ఫూర్తి గంభీరనాభినిభావర్తమున న్మునింగి జఘనాప్తిం దేలి యమ్మిట్టనట్టె నిలంజాలక లోలమై యడుగువట్టెన్ రాగభారంబునన్.

చూపు మఱి ద్రిప్పఁజాలక, యాపంకజవదన భాసురాకారకళాటోపము గనుఁగొని హరి సుమ, చాపునకున్ లొంగి మానసంబునఁ బొగడెన్.

సహజత్వజనితవత్సలతచే వెనువెంట వచ్చినశైవాలవల్లి యనఁగఁదనపట్టిఁ బాయఁజాలనిప్రేమమున వెన్కవచ్చినయమునాప్రవాహ మనఁగఁ

దనుఁబాసి చనుమెఱుంగని క్షీరపానంబు వదలి వెన్గొను నీలవనద మనఁగఁగమలాభిధానమోహమునఁ బైపై వ్రాలి కనుపట్టు తుమ్మెదకదు పనంగ

నిరుల జేజేలరాఱాలసరుల దొరయు, కప్పుచొప్పడుపెన్నెఱి గల్గి బారకెక్కుడై సూక్ష్మకచముల కింపుసొంపు, నిచ్చె నీపద్మపాణి వేణీభరంబు.

వనిత నిడువాలుఁగన్నులు వాలుగన్ను, లౌట కందేమి యాశ్చర్య మరసిచూడబెళుకుఁజూపుల నెంతయుఁ బ్రేమమీఱ, నాత్మసంతతిఁ బోషించు ననుదినంబు.

నెఱివేణి నీలాహి నిరసించుటే వింత నెమిలిపింఛమువంటికొమరు గలుగముద్దునెమ్మొగము దమ్ముల నెంచుటే చోద్య మిందుబింబముచంద మెనసియుండనధరంబు బింబంబు నగలించుటే హెచ్చు శుకరాజతుండవిస్ఫురణఁ బొదలబటువుపెందొడలు రంభల వంచుటే చిత్ర మిభహస్తములరీతి నేపుఁ బెనుప

గబ్బిగుబ్బలు జక్కవకవబెడంగు, గాంచఁ గెందమ్మిమొగ్గల మించు టెంతతనువు ఘనసారసౌరభ్య మనువుపఱుప, నెల్లతాపంబు లుడిగించు టేమి యరుదు.

స్ఫురితగవిప్రకాశపరిఫుల్లపయోరుహకేళికాగృహాంతరసురతక్రియాలుఠనతత్పరతాప్తపరాగపాళిధూసరితరథాంగదంపతులచందమునం జిగికుంకుమంబుచేగురుకుచకుంభము ల్మెఱసెఁ గోకిలవాణికి హృద్యవైఖరిన్.

కఠినతరవృత్తకుచకుంభ కరటకుంభ, గళితమదధారలీల శృంగార మయ్యెగారుడోపలరుచులచేఁ గారుకొనుచుఁ, జాలరంగారునూగారు చారుముఖికి.

కరములఁ గాంతి మోమున వికాసము గమ్మనిమేనఁ దావియుంజరణముల న్మృదుత్వము విశాలత నేత్రముల మ్మరందముల్సరసవచోవిలాసములఁ జన్గవఁ గోశత పక్ష్మపాలిఁ గేసరములసౌక్ష్మముం దగఁ బొసంగెఁ గదా కమలాఖ్య లక్ష్మికిన్.

జాతినిద్దంపువజ్రాలకమ్మలడాలు గండపాండిమకుఁ గైదండ యొసఁగఁజికురలక్ష్మికి నళిశ్రేణిఝంకృతులచే సారె పరాకు హెచ్చరిక దెలుపమొగమున కెగయు చన్గవపైని నునుమోవితళుకుగుంకుమ వసంతములు చల్లముఖచంద్రునకు దృగంబుజధాళధళ్యంబు సరిగాఁగ నుభయచామరలు వైవ

వాలుఁజూపులు కువలయశ్రీల నింప, నవయవంబులసవురు రాజాధిరాజచర్యలనుబోల సహజసౌందర్యరేఖ, కలిమిఁ జూపగఁ జెలఁగె నీకలిమిచెలువ.

ఈ చెలువ నన్నుఁ జేరిన నింక నెపుడు, ఱొమ్ముదింపకయుందు ముదమ్ముమీఱననుచు నెంతయు ననురాగవనధి నోల, లాడు వేడుకమాఱ క్షీరాబ్ధిశాయి.

దృష్టి దాఁకునటంచుఁ దెరవైచె ననియెంచు బహురత్నభూషణప్రభలు గాంచితనుఁగూడి పలికెనో యనఁ జెలంగుఁ బదాబ్జహంసకకలకలం బాలకించి

యక్కునఁ జేర్చెద ననివొక్కు వజ్రాలతాళిఁ దోచిన తనతనువు సూచిచేకల్వదండ వైచె నటంచుఁ దమి ఱొమ్ముఁ జూచుఁ బైగ్రమ్ము వాల్చూపు లరసి

చక్కనొత్తు నెపంబునః జారుకౌస్తు, భంబు స్పృశియించుఁ దత్ప్రతిఫలితయువతికఠినవక్షోజసంస్పర్శకౌతుకమున, మదనజనకుండు లక్ష్మీసమాగమమున.

కోరిక తెప్పలెత్తుచును గొంకున నంతనె ఱెప్పవ్రాల్చుచున్శ్రీరమణీలలామ సరసీరుహనాభునిఁ జూచువేళ విస్తారవిలోచనద్యుతులు చక్కనిమో మనురాజు సూరెలన్సారెకు వైచు నయ్యుభయచామరలో యన మించె నెంతయున్.

శౌరి గనుఁగొనఁ గనుఁగొన నారిగొంకు, నారి గనుఁగొన గనుఁగొన శౌరిగొంకుగనుఁగొనకయున్నఁ గనుఁగొను వనిత పతియు, వారిప్రేమంబు సిగ్గుచే వన్నె గాంచె.

మందయానంబునకు సిగ్గు మఱియుఁ గొంత, మాంద్య మొనగూర్ప భారతీమానినీకరాంచలము వీడి భయవినయములు దొరయ, వారిజాక్షుసమ్ముఖమును జేరవచ్చి.

దృగ్రాజీవకరాబ్జము ల్తరళరీతిం జెంద శ్రీనామకంబుగ్రీవామణి యంబుజోదరుని కంబ గ్రీవఁ గీలించెఁ దాదృగ్రాజాననచంద్రికాహసనదీప్తిస్మేరనీలోత్సలస్రగ్రాజంబు తదీయకాంతి యమునాసౌగంధ్యసంధాయిగన్.

శ్రీకల్యాణనగాధివాసులు సుమశ్రేణిం బ్రవర్షింప వాణీకల్యాణసుగంధి యాదిగఁ బురంధ్రీరత్నము ల్సేరి గౌరీకల్యాణము వాడఁగాఁ బటహభేరీశంఖము ల్మ్రోయ లక్ష్మీకల్యాణమహోత్సవంబునఁ జెలంగెం జక్రి యుప్పొంగుచున్.

కమలాప్తకమనీయకౌస్తుభరత్నంబు గృహదీపకలికసుశ్రీ వహింపఁబావనవైజయంతీవనమాలిక కేలికాడోలికలీలఁ జూపఁదారహారశ్రేణి ధవళముత్తామయరంగవల్లికలవిభ్రమముఁ దెలుపశ్రీవత్సలక్ష్మంబు జేజేలరాఱాతికట్నంపుజగతి పొంకంబు నెఱప

దీర్ఘబాహుదృఢస్తంభదీప్యమాన, సురభికస్తూరికాలిప్తహరిభుజాంతరాళహరినీలమణిమందిరమున నిలిచెఁ, బాలమున్నీటిరాకన్య ప్రమదమునను.

కౌస్తుభరత్నంబుఁ గాంచి బింబ మటంచు మోహించి చేరిన ముద్దుచిలుకబాహాంతరచ్ఛద్మపద్మాకరంబునఁ జెలువైనతావిచెంగలువపువ్వుపావనవైజయంతీవనమాలిక గ్రొంజిగురొత్తినగుజ్జుమావివన్నెవాసి గనంగ జిన్నంపుబొజ్జప చ్చెదమీఁద నొరసిన హేమరేఖ

చెఱకువిలుకాఁ డురంబున మెఱుఁగుసాన, పైని మొనయిడు కాంచనాంబకమురేఖయనఁగఁ జూపట్టె జలధికన్యాలలామ, పద్మనాభుని ఘనభుజాభ్యంతరమున.

ఇంపు దళుకొత్త లచ్చి ఱొమ్మెక్కినపుడె, జలధిమథనప్రయాసంబు దలఁపఁడయ్యెహరి యిటులుగాదె యెందుఁ గార్యంబు సఫల, మైననేటికిఁ బూర్వప్రయాసగణన.

ఈక్రమంబున సకలలోకైకజనకుఁ, డైన శ్రీహరి విపులబాహాంతరముననఖిలలోకైకమాత శ్రీ యధివసించి, ప్రజలఁ గనుఁగొనెఁ దాఁ గన్నప్రజలరీతి.

శ్రీలావణ్యవతీకరు, ణాలోలకటాక్షవీక్షణాళులు సుమనఃపాళుల వ్రాలెఁ గర్బుర, జాలంబులఁ జేరవయ్యె సహజస్ఫూర్తిన్.

అకలంకరూపరేఖా, నికషోద్భవభూరిగరిమ నిరసించిన లక్ష్మికటాక్షంబునఁ దలఁచిరి, నికషోద్భవభూరిగరిమ నిరసించి సురల్.

శ్రీకృపామృతవృష్టిసంసిద్ధివలన, జనులదారిద్ర్యతాపంబు శాంత మయ్యెనఖిలజాతులు నామోదమంది చెలఁగె, సత్ప్రతత్పరమయ్యె ద్విజవ్రజంబు.

అంత మఱియు దెఱగంటిదొరలు వేడుక రక్కసులం గూడుకొని కలశజలనిధి మథియించు సమయంబున.

సురలుందైత్యులు మేరమీఱి తను సంక్షోభించి సర్వస్వమున్హరియింపంగఁదొడంగినా రనుచు నానావకాశంబులన్మొఱవెట్టంగఁ దొడంగెనో యనఁగ నంభోరాశి కల్లోలముల్మొఱసె న్వాసుకిభూరిభూత్కృతి మరుల్లోలంబులై యత్తఱిన్.

తనగంధాఘ్రాణముచే, తనె లాహిరి గొనఁగ దేవదానవు లబ్ధింజనియించె మదిర దానిం, గొనె నాసురవితతి మిగులఁ గుతుకం బమరన్.

ప్రజలతల్లి యనంగఁ బరఁగు హరీతకి దక్షిణపాణిపద్మమునఁ బట్టివ్రణిదుష్టరక్తపత్వమున మించుజలూక వామహస్తంబున వలనుపఱిచిరమణీయనవసుధారసపూర్ణకుంభంబు సవ్యశయంబున సవదరించియఖిలదేవశ్రేణి కభయప్రదాతృత్వ మపసవ్యకరమున నవధరించి

కనకచేలాద్యలంక్రియల్ కమలదళవి, శాలనేత్రంబు లసితాంగసౌకుమార్యమమలగుణగౌరవము మించు నచ్యుతాంశ, మగుచు ధన్వంతరి జనించె నమృతజలధి.

అతని చేతిసుధాకుంభ మపహరించె, విప్రజిత్తి బలాఢ్యుఁడై వేగ వానిచేతిది హరించె జంభుఁ డక్షీణబలుఁడు, వానిచేతిది గొనియె నిల్వలుఁడు గడిమి.

అప్పుడు.

మనతోడఁ గూడఁ ద్రచ్చినదేవతల కీక గొనుట నాయంబు గాదనెడివారుఁగైకొన్న మనతోడఁ గలహంబునకు రాక యమరు లూరకయుండ రనెడివారుదురమైన యంతఁ జిందఱవందఱైపోవు నమృత మెవ్వరికి లే దనెడివారునెందాఁకఁ గొంచుపోయెదవు మంచిది పొమ్ము నినుఁ ద్రావనిత్తుమే యనెడివారు

వలదు మనకెల్ల బలిచక్రవర్తి నేత, గాన నాతనిచేతికిఁ గలశ మిచ్చియతఁడు పంచి యొసంగిన యటులు గొనఁగ, నర్హ మనువారలైరి నిశాటు లెల్ల.

అలమి నిశాచరుల్ గొనినయట్టి సుధాకలశంబు గైకొనంబలిమి యొకింతలేక సురనాయకముఖ్యమఖాశను ల్సుధాకలశము పోయెఁ బోయె నని కాతరులై మొఱవెట్టఁగా నహోవలదు భయం బటంచు హరి వంచన సేయఁదలంచె దైత్యులన్.

కులుకుంగుబ్బలు ముద్దుగాఱుపలుకుల్ క్రొమ్మించుమేన్మించులుందళుకుంజెక్కులు మందహాసములు నిద్దాకెంపుకెమ్మోవియుంబెళుకుంజూపులు సన్నపుంగవును శోభిల్లం జగన్మోహినీలలనాకారము పూనె మాధవుఁడు లీలాలోలహేలాగతిన్.

ఈరీతిం జగదేకమోహనవయోహేలావిలాసంబులన్నారీరూపముఁ బూని శౌరి దితిసంతానంబు వీక్షింపఁగాఁజేరన్ వచ్చె నవాబ్జరంజితపదశ్రీమంజుమంజీరశింజారావంబులు మారభూరమణనిస్సాణధ్వని న్మీఱఁగన్.

శ్రవణావతంసవాసనఁ గ్రోలు నెలదేఁటిగరులతెమ్మెరలముంగురులు నెఱయఁగమ్మలేనిట్టూర్పుగాడ్పులఁ దెలిమించు మెఱయించు పయ్యెదచెఱఁగు దొరుఁగఁగులికెడుతనదుగుబ్బలభారమున కోర్వఁజాలక లేఁగౌను సంచలింపఁగటకారవములకుఁ గాళ్ళవ్రేళ్లఁ బెనంగు నంచలచే నడ యలసపడఁగఁ

గుసుమభరమున నునుగప్పుకొప్పు జడియఁ, కొలఁకుసిగ్గున వాల్చూపు బెళుకుఁ జూపదంతరుచినాఁగు మందస్మితంబు మెఱయ, దనుజసభఁ జేరవచ్చెఁ గాంతాలలామ.

పంచబాణప్రతాపాతపమున కాది, కారణం బైనసంతప్తకాంచనాంగిమేనిమించులు కెంజాయ మించె నచట, “నా తపాయాతిలోహితాయ” యన వినమె.

బలిమనోహరలీలఁ జెలు వయ్యె మధ్యంబు బాణమోహనరీతిఁ బరఁగెజూపుశంబరహృదయంగమం బయ్యెఁ గనుఁగవ జంభభావ్యం బయ్యెఁ జన్నుదోయిరాహువిభ్రమదమై రంజిల్లె నెఱివేణి హేతిమంజులరీతి నెనసె నారుతారకాశాస్యమై తగె నఖద్యుతి విరోచనపర్వమై మించె సౌకుమార్య

మంగముసుమాలికోమల మయ్యె నఖిల, కర్బురామోదకర మయ్యెఁ గమ్మతావిమోహినీకాంతసౌందర్యమును గణింప, నసురవరులనె లోఁగొన్నపస దలిర్చె.

మోము ల్వెల్వెలఁబాఱఁ గన్నుఁగవ నామోదాశ్రువుల్ గాఱ మైరోమాంచంబులు మీఱ ఘర్మకలశశ్రోణాంబువు ల్జాఱఁగామామోఘాస్త్రపరంపరల్ నిగిడి చిత్తాంభోజముల్ దూఱఁ దోడ్తో మోహం బలరారఁ గల్గొనిరి దైత్యు ల్దంభనారాయణిన్.

ఆజవరాలిఁ జూచి యసురాళి వరాళి విరాళి గొన్నచోఁదేజము మీఱఁగా మరుఁడు ధేయని వన్నియ మీఱఁ జిల్కరాతేజదువాళిదోలి గడిదేరిన దారి మిటారికల్వపూనేజను వైచె నద్దనుజనేతలచిత్తము లుచ్చి పాఱఁగన్.

కదళికారూపముల్ గన నారియూరువుల్ స్తంభలీలాప్తి రాక్షసుల కొదవెనలివేణివేణి నీలాభ్రమై తగ దేవవిమతాంగముల ఘర్మవృష్టి గురిసెనిందుబింబానన యెలుఁగెత్తి పాడిన దానవేంద్రులకు గద్గదిక పొడమెమెలఁత నెమ్మేను గ్రొమ్మెఱుఁగు సంచునమించు దనుజేంద్రచిత్తముల్ దత్తఱించె

లేమచిన్నారిలేఁగౌను లేమిపూన, నసురవక్త్రంబులందు దైన్యంబు గదిసెనిది యసంగతమయ్యు రతీశకౌశ, లాతిశయమున సంగతంబయ్యె నపుడు.

మొలకనవ్వుల ముద్దుమోములఁ దిలకించి కళ పట్టినట్లుండె గలువఱేఁడుచిన్నారిమైఁదీఁగె జిగిఁ జూచి సురపాదపంబులు తీఁగియల్ పారసాఁగెఁగ్రొమ్మావిచిగురాకునెమ్మోవిరుచి గాంచి కలువడి నిలిచె నక్కౌస్తుభంబునెఱనీటుగులుకులేనెన్నడ ల్పరికించి కడుమందగతిఁ గాంచె గంధకరటి

తేనియలసోన వెదచల్లు తేటమాట, లలికి యమృతంపుగుండలో నడఁగియుండెనేల యిటువంటివెల్ల మా కీలతాంగి, యబ్బినను జాలు నని యెంచి రసురు లపుడు.

జంభుండు సాభిలాషంబుగాఁ గనుఁగొన్న ముసిముసినగవుతో మోమువంచుఁగనుసన్నఁ దను వేఁడుకొన బలాసురుఁడు రాగమున మునుంగఁ గ్రేఁగంటఁ జూచుభ్రూసంజ్ఞ సంకేతములు దెల్పు నముచికి నింపుగాఁ గనుబొమ లెగయవై చుబలి చూడ గబ్బిగుబ్బలమీఁది పయ్యెదఁ జాఱిచి గ్రక్కునఁ జక్కఁ జేర్చుఁ

నిలుచు నొక్కెడఁ జేసన్నఁ బిలుచు నొకని, నొకనితో మంతనముఁ గోరు నొకనిఁ జీరునొకని సరసోక్తులకు మెచ్చు నొకని నొరయు, మోహినీకాన్త యసురసమ్మోహనముగ.

రేచాయ నడరు బారెఁడుకీలుజడఁ జూచి మొలకలేనగవునెమ్మొగముఁ జూచితరితీపుఁ జూపు బిత్తరపుఁజూపులు చూచి తేనె చిందెడు మోవితీరు చూచిజిలుఁగుపయ్యెంటలోఁ గులుకుగుబ్బలు చూచి కనులఁ గాన్పింపని కౌను చూచితతమై రహించు నితంబబింబముఁ జూచి నునుదళ్కుఁ జెందు పెందొడలఁ జూచి

చొక్కి మిక్కిలి రక్కసిరిక్కఱేండ్లు, చక్కనయ్యకుఁ జిక్కి రాజసము దక్కి

తామసంబునఁ జొక్కి యెంతయును సాత్త్వి, కమున మోహంబు తల కెక్కి కలఁగి రపుడు.

భళిభళి మెచ్చవచ్చు నిఁక బ్రహ్మను దీని సృజించినప్పుడేవెలయఁగఁ జేతికి బిరుదు వేయఁగవచ్చును గొమ్మమాత్ర మాయలరెడుముద్దుగుమ్మ నడయాడెడి బంగరుబొమ్మ గాక యీచెలువకటాక్ష మెవ్వరికిఁ జేరును వారు కృతార్థు లిమ్మహిన్.

కంతుపట్టపుదంతి గాదేని యీయింతి ఘనమనస్సరసులఁ గలఁచు టెట్లుకళుకుబంగరుబొమ్మ గాదేని యీకొమ్మ చిత్తంబు లాసింపఁజేయు టెట్లుకళలూనులతకూన గాదేని యీచాన నయనోత్పలంబుల ననుపు టెట్లుకారుమెఱుఁగుచెన్ను గాదేని యీయన్ను మోహకైతవముల మొనపు టెట్లు

చెఱకుసింగాణివింటివజీరుపువ్వుఁ, గోల గాదేని యీగోల గుఱుతు గాఁగహృదయమున నాటు టె ట్లని యెంచి ఱెప్ప, వైవ కీక్షించు దైతేయవల్లభుండు.

గజరాజగమనసింగారంబు గనుఁగొనవలవదే కన్నులు గలుగుఫలముజలజాక్షిమధురభాషణము లాకర్ణింపవలవదే వీనులు గలుగుఫలమువిరిఁబోఁడిజీనిచక్కెరమోవిరుచు లానవలవదే నాలుక గలుగుఫలముచెలిచెక్కుఁగపురంపుఁబలకలు మూర్కొనవలవదే నాసిక గలుగుఫలము

గబ్బిగుబ్బల బిగ్గరఁ గౌఁగిలింప, వలవదే తళ్కునెమ్మేను గలిగినఫలమటులు గాకున్నఁ బంచేంద్రియములు గలిగి, నన్దులకు నేమిఫలము వ్యర్థములు గాక.

కనఁగలిగె న్విలాసములు కమ్మనిచక్కెర లొల్కుపల్కులున్వినఁగలిగెన్ సుధారసము వెల్లువ పెట్టెడు మోవి యాన నింపున నునుజెక్కుటద్దములు ముద్దుగొన న్నెలవంక లుంచి చక్కనివలిగుబ్బచన్నుఁగవఁ గౌఁగిటఁ జేర్ప నిఁ కెఫ్డు గల్గునో.

ఇదియే కనుటయు వినుటయు, నెదపైఁ బవళింపఁ గనుటయే గనుట రతిన్మదనజయశంఖరణితం, బెదిరెడుమణితంబు వినుటయే వినుట గదా.

కుసుమకోమలమైన యీకోమలాంగి, తనువుభుజబంధనఖరదంతక్షతాలతాపకర్షణముష్టిఘాతాదిసురత, ధార్ష్ట్యమున కోర్చునే యన్యతనువుభంగి.

చక్కెర కెమోవి చవిచూడనేకాని మొనపల్లు చుఱుకన మోపరాదుబలితంపుగుబ్బలు పట్టిచూడనెగాని నునువాడిగోరున నొక్కరాదుఅంగంబు మెల్లనే యక్కుఁజేర్పనగాని మించి బిగ్గరఁ గౌఁగిలించరాదులలితంపురతికేళి నలరింపనేకాని బంధచాతుర్య మేర్పఱపరాదు

ఈఁగ వాలినఁ గందు నీయిగురుబోఁడి, కమ్మనెమ్మేను గనఁగఁ బొంకమ్ము దెలిసియేలికొనవలె మన్మథకేళియందు, నాకుఁ దక్కిన మెప్పింతు నలినముఖిని.

మానవతు లెంతకోమలు, లైనను బతిసురతపటుత నలరుదు రసహంబైనరవిద్యుతిసంగము, చే నందవె పద్మినులు విశేషశ్రీలన్.

ఔర యిదేటియోజన మృగాయతలోచన నన్నుఁ గోరునోకోరదొ కోర కేమి నలకూబరముఖ్యులు నాదుబంట్లు శృంగారము చెప్ప నేల త్రిజగంబులు నేలఁగఁ గల్మిలేదె యెవ్వా రిఁక నన్నువంటిబలవంతులు శక్రుఁడె వచ్చి కొల్వఁగన్.

అని యుత్సహించి యొకనెప, మునఁ జెంగటి కేగి దీనిముద్దులమాటల్వినవలతు ననుచు నబ్బలి, తనమదిలోఁ దలఁచి మిగులఁ దత్తఱ మందన్.

కలకలనవ్వునెమ్మొగము కమ్మనితమ్మి యటంచుఁ దుమ్మెదల్హళహళిఁ జిమ్మిఱేఁగ భయమంది గిఱుక్కున మోము ద్రిప్పుచోఁగలికిమెఱుంగుచెక్కుపయిఁ గ్రమ్మఁ దళుక్కునఁ బైఁట జాఱఁగాబెళుకుదు నబ్బలిం గదిసి బిత్తరి యత్తఱి దత్తఱింపఁగన్.

వెఱవకు కీరవాణి యలివేణివి గావె మదాళిపాళికిన్వెఱవఁగ నేల యంచు బలి వేడుకతోడ లలాటపట్టికన్మెఱుఁగులు సిందుముంగురులు మెల్లనె చిక్కులు దీర్చి చెక్కులందొఱిఁగెడు ఘర్మము ల్తనదు దుప్పటిచేఁ దుడిచెన్ నయంబుగన్.

అలికులవేణి భృంగగరుదంచలచంచలకర్ణమంజరీగళితపరాగము ల్పయిని గ్రమ్మిన రాల్చునెపంబు దోఁప గాఁబలుమఱు జాలువాసరిగెపయ్యెదకొంగు విదుర్ప గుబ్బచన్నుల జిగిఱేఁగి చూపఱ కనుంగవకు న్మిఱుమిట్లుగొల్పఁగన్.

ఆసరోజాక్షిలీలావిలాసములకు, మరులుకొని దానవేంద్రుండు మనసిజాతమత్తవేదండదోధూయమానమాన, సాబ్జుఁడై యిట్లు పలికె నబ్జాక్షిఁ జూచి.

సుదతీ యెవ్వరిదాన వీ వెపుడు నెచ్చో నుందు నీనామ మెయ్యది యీనీభువనైకమోహననవీనాకార మత్యద్భుతాస్పద మయ్యెం బరమేష్టి మాపయిఁ గృపం బంచేంద్రియాత్యంతసమ్మదముం జేయఁ దలంచి నిన్నిటులు నిర్మాణంబు గావించెనే.

హరిణాక్షీ యటుగాకయున్న భవదీయాకారరేఖామనోహరశృంగారవిలాసవిభ్రమములం దావంతమాత్రంబు కిన్నరవిద్యాధరనాగకింపురుషగంధర్వాదినానామరుత్తరుణీరత్నములందుఁ గంటిమె వృథాతర్కంబు లింకేటికిన్.

కన్నులకల్కి నీచెలువు కన్నులు చల్లగఁ గాంచఁగల్గుటంగన్నులు గల్గినందులకుఁ గల్గె ఫలం బటు గాకయుండినంగన్నులు కన్నులే వలలకన్నులుగా కవియేల కల్లగాకన్నులవింటిజోదు పదకంజములాన చకోరలోచనా.

తరుణి నీయధరామృతముకంటె మధురమా యతికషాయంబైన యమృతరసముపూఁబోణి నీభుజంబులకన్న మృదువులా గణియింప విషమంపుఁగల్పలతలుజనిత నీనగుమొగంబునకన్న నందమా యెందునఁ గొఱగానిచందమామకలికి నీగబ్బిచన్గవకన్నఁ బొంకమా కుంభీంద్రదుస్పర్శకుంభయుగము

నారి నీకన్నఁ జక్కనివారె యప్స, రస్స లారయ వారివిభ్రమము లెల్లనప్రయోజన మటుగాన హంసయాన, నీకు సరిగాన నీయాన లోకములను.

మొదట నే నిన్నుఁ జూచిన మోహనాంగి, యబ్ధి మథియింప మూరకె యమృతవాంఛగంగచెంగట వాసంబు గలుగుజనుఁడు, డప్పికై పల్వలంబులు డాయఁజనునె.

తళుకుఁగన్నులు దృష్టి దాఁకునటంచు నో శుకవాణి తల యెత్తి చూడ వేమియిగురంచు గండుఁగోయిల దూఱునంచు నో తరళాక్షి పెదవి గదల్పవేమిచౌదంతిప్రతికుంభిశంకఁ జేరునటంచొ గబ్బిగుబ్బలు సారె గప్పెదేమియంచలు వెన్నాడు నంచునో మంజీరరవము గుల్కఁగఁ జేరరా వదేమి

స్వర్గమర్త్యవధూటుల చక్కఁదనము, తుచ్చమని నాగకన్యలతోడి కలహమునకుఁ గాల్ద్రవ్వెదవొ లేక బొటనవ్రేలఁ, బుడమి వ్రాసెద విది యేమి పువ్వుఁబోణి.

కలశాంబుధి మథియింపఁగఁ, గలిగినసుధఁ బంచికొనఁగఁ గానక మేమేబలదుర్బలములఁబోవుచుఁ, గలహించెద మొరుల దూఱఁగా నేల చెలీ.

దాయాదుల మాకన్యప, దాయాదుల మౌట మేము దైవతములు మాకీయమృతము సరిగా నీ, వీయెడఁ బంచిమ్ము నేర్తు వెంతయుఁ దరుణీ.

లలనా నీమధురాధరామృతము గ్రోల న్గాంక్ష గావింప కీకలశీతుచ్ఛతరామృతంబునకు నేఁ గాంక్షించినా నంచు నంజులకంజేయకు గోటికల్పముల కెచ్చున్ జేయఁగా నౌ తపఃఫలముల్ గల్గినఁగాని గల్గునటె యీభాగ్యంబు భామామణీ.

కులుకుమిటారి గబ్బిచనుగుబ్బల కోడిన దంచు నెంచ కీకలశము చేతఁబూను కలకంఠి భవన్మధురాధరంబునంజిలికెడి తేనెబొట్టయినఁ జిందెడిమాధురి పావనత్వముంగలిగి సుధారసం బఖిలగణ్యముఁ బుణ్యము నౌఁగదే యనన్.

బలిదైత్యేంద్రునిఁ జిన్నినవ్వు దొలఁకం బద్మాక్షి వీక్షించి యుజ్జ్వలవాసంతరసాలపల్లవలవాస్వాదైకలీలాలస

త్కలకంఠీకలనాదమేదురవచోగాంభీర్య మేపారఁగాఁబలికెం జెంతల వట్టిమ్రాఁకులు చిగుర్పన్ నేర్పుసంధిల్లఁగన్.

అబలలము మూఁడుమాటల కాఱుతప్పు, లమ్మ నేఁ జెల్లగా పరిహాసకంబుచేసె దీ విట్టిపనులు మాచేత నౌనె, చాలు నగరాకు పొమ్ము నిశాచరేంద్ర.

స్త్రీలను నమ్మరాదు చలచిత్త లటంచు జనమ్ము లెల్ల వాచాలత చూప నాపలుకు సత్య మటంచును విశ్వసింతురేచాలు ని దేటిమాటలు పొసంగవు మీ రటుగాక నమ్మినన్మే లొనరింతు నందఱకు మిత్రతఁ జూపి జగంబు మెచ్చఁగన్.

అక్కట కల్లగాదు నిజమౌ జనవాక్యము ముజ్జగంబులంజక్కఁదనంబు కల్మి రతిశక్తియు జాణతనంబు ప్రాయమున్మక్కువ గల్గువారియెడ మచ్చిక లెచ్చ రమించు జారయందెక్కడిసత్య మేడ వల పెక్కడినిల్కడ దానవోత్తమా.

కుంతలంబులయందె కుటిలత్వ మననేల భావంబులందును బ్రబలియుండుగబ్బిగుబ్బలయందె కాఠిన్య మననేల హృదయసీమలయందు నెనసియుండుఁగీలుఁగొప్పులయందె మాలిన్య మననేల బుద్ధిమార్గములందుఁ బొడమియుండుజళుకుఁజూపులయందె చాంచల్య మననేల మోహంబులందును మొనసియుండుఁ

దలఁచి చూచిన బొమలందె ధర్మగుణము, మాట లేటికిఁ గటినె క్షమావిలాసమనవరతరక్తి యధరంబులందె కాని, మానినులచిత్తముల లేదు దానవేంద్ర.

బాలామణులను గానన, సాలావృకములను నమ్మి సఖ్యము సేయంబోలదని బుధులు దెలుపుదు, రేలాగున నమ్మవచ్చు నింతులచెలుముల్.

పలుకుల నొక్కటి భావం, బుల నొక్కటి చేత నొకటి పూఁబోణులకుంగలగుణములు వారల నెటు, వలె నమ్మెద వీవు దైత్యవల్లభ చెపుమా.

ఐన న్నే నటువలెఁ గా, నీననుకోరాదు గాక యెల్లసుగుణముల్నే నీయక లేదుసుమీ, యీనెట్టున నీవె మీఁద నెఱిఁగెద వింకన్.

ఇతరసతులందు మతిలేక యెపుడు నన్నె, యాత్మఁ బొందఁదలంచుపుణ్యజనులందులీయమై యుందు నేనెందు లేశమైన, భేద మెఱుఁగక పరమసమ్మోదమునను.

ఆదరముఁ జెందియుండుదు నఖిలమునను, బలుకు లేటికిఁ జక్రంబు పంపు సేయవెఱ పెఱుంగక స్వచ్ఛందవృత్తి నుందు, నా కొకఁడు కర్త లేఁడు దానవవరేణ్య.

ఒకభుజంగునితోఁ గూడియుందు నతఁడు, వివిధభోగాఢ్యుఁ డయ్యును జెవుల వినఁడుగానఁ దత్తల్పత వసింప కేను గోరి, వచ్చితి నటన్న బలిదైత్యవర్యుఁ డనియె.

వినుమా యీయనుమాన మేల బెళుక న్వేయైన నీయాన జవ్వని నీచేతిది నాదుదేహమును జీవంబు న్వృథామాట లే

లను నీచిత్తము నాదుభాగ్య మిఁక నీళ్ళ న్ముంచినం బాల ముంచిన నీవే మఱియొం డెఱుంగ నిదియే సిద్ధంబు ముమ్మాటికిన్.

అని దైత్యేంద్రుఁడు మోహినీమృదులహస్తాంభోజసంపర్కసంజనితస్వేదకరాగ్రుఁడై యొసఁగఁ జంచత్కుంభికుంభోపమస్తనకుంభంబులు గుల్క మేనఁ బులక ల్సంధిల్ల మోదంబు సిగ్గు నొయారంబును మీఱఁ గైకొనె సుధాకుంభంబు హేలాగతిన్.

సొలపుంజూపులు బెళ్కుబేడిస లటంచుం బట్టనుంకించి పాణులు సాపన్ దనుజు ల్మృగాక్షిదెలిగన్నుల్ గాన లేనవ్వుతోఁబలికెం బాణిపయోజభాసురసుధాప్రచ్ఛన్నసన్మాధురీకలనాసూచకభావగర్భితవచోగాంభీర్య మేపారఁగన్.

రక్కసులార మీరలు సుర ల్సమయత్నబలప్రయాసు లైయిక్కడలి న్మథింప జనియించిన యీసుధ మీరు వారుఁ బెన్మక్కువతో భుజింప నయమార్గము గావునఁ బంచిపెట్టెదంజక్క సమంబు గాఁగ నిది సమ్మతమౌఁ గద మీకు వారికిన్.

వెనుక నిటువలె నటువలె ననుచు నన్ను, మాటలాడిన వినను ముమ్మాటి కిదిగొనెఱుఁగఁ జెప్పితి హితమౌనె యేను బంచి, పెట్టినటువలెఁ గైకొన గట్టిగాను.

అని నిశ్చయంబు దోఁపఁగ, ననిన లతాతన్విమాట కౌఁగా కని యద్దనుజులు బృందారకులున్, ఘనతరసంతోషరసవికస్వరముఖు లై.

గురుఁడు దోషాచరగురుఁడు సంకల్పంబు దెలుపఁగాఁ గలశాబ్ధిఁ దీర్థమాడిమందారమహిజ మమందారమున నిచ్చుకనకాంబరంబులు కటులఁగట్టిపారిజాతంబు పెంపారిజాతముదంబుచే నిడువిరిసరుల్ శిఖల జుట్టిహరిచందనము గూర్చు హరిచందనపుఁబూఁత లందమ్ముగా మేన నలవరించి

కల్పక మొనర్చు మణిమయాకల్పకములు, పూని సంతాన మొసఁగు నవీనకర్ణపూరసంతానములు దాల్చి భూరినిష్ఠ, నుపవసించి యొనర్చిరి హోమవిధులు.

అంతట నెంతయు భక్తిం, జింతామణి కామధేనుశీతలభానుల్చింతితవస్తువు లొసఁగ౯, శాంతమహీసురుల కొసఁగి శాస్త్రోక్తవిధిన్.

వజ్రమౌక్తికరత్నవైడూర్యమణిఘృణిస్థగితకుంభస్తంభసంభృతంబునసమానచీనిచీనాంబరశ్రేణికాకలితవితానశృంగారితంబుఁగల్పకప్రసవసౌగంధ్యగంధాంధపుష్పంధయఝంక్రియాసంకులంబుదీపితసామ్రాణిధూపధూమస్తోమఘుమఘుమాయితగంధగుంభితంబుఁ

బ్రకటగంధర్వగాంధర్వబంధురంబుఁ, జటులపంచమహావాద్యశబ్దితంబునిపుణతరవిశ్వకర్మవినిర్మితంబు, నవము నై మించు కనకమంటపమునందు.

ప్రాగగ్రకుశాస్తరణా, భోగంబులయందుఁ దూర్పుమొగముగ బఙ్క్తుల్సాఁగిరి బలిముఖదానవు, లాగిరిభిన్మముఖ్యదివిజు లతులితభక్తిన్.

జాఱెడుపైఁటతోఁ గులుకుజక్కవగుబ్బలతో మిటారినవ్వారెడుమోముతో గిలుకుటందెలతో నసియాడుకౌనుతోసారసగంధి సౌధకలశంబు కరంబునఁ బూని యెప్పు డొయ్యారము మీఱ వచ్చునొకొ యంచు నిశాచరు లెంచునత్తఱిన్.

వలలోఁ జిక్కినకల్కిజక్కవలఠేవం జిల్గుఁబయ్యెంటలోఁగులుకు న్సిబ్బెపుగబ్బినిబ్బరపుఁజన్ను ల్బల్మిటారింపఁగాఁగలమంజీరఝళంఝళల్మదనఢక్కారూఢిఁ జూప న్సుధాకలశీకమ్రకరాబ్జయై కలికి శృంగారంబు తోరంబుగాన్.

గిలుకుమెట్టెలడాలు చిలువకుచ్చెలలపై జాళువాబంగారుసరిగఁ గూర్పజిలుఁగుపైఠాణిదువ్వలువలోఁ జిఱుదొడ ల్సెంగావిపావడరంగు లీనఁగమనీయమై మించు కటిచక్రచలనంబు రతిమనోవల్లభురాకఁ దెలుపగమనశ్రమంబుచేఁ గమ్ముకమ్మనియూర్పుతెమ్మెరచేఁ గౌనుదీఁగె వడఁక

గుబ్బ లొండొంటి నొరయ ముంగురులు నెఱయ, గంకణంబులు మొఱయ నంగంబు మెఱయనడలు ముద్దులు గురియ లేనగవు దొరయ, వెలఁది చనుదెంచె దైత్యులు వేడ్కఁ బొరయ.

ఆమదిరాక్షిఁ జూచి పరిహాసము మీఱ బలీంద్రుఁ డిప్పు డోకోమలి నీవు చే నమృతకుంభము పూనినఁ జూచి గోపబాలామణివంచుఁ బాల్గొనఁదలంచెద మన్నను నవ్వుచు న్మృగాక్షీమణి బావ నీవు దధిఁ జిల్కఁగ గోపిక నైన దోసమే.

అవు బావా యమృతంబు ముందు మనదైత్యశ్రేణికిం బంతునోదివిజు ల్గుయ్యిడకుండ ముం దొసఁగి యందే గొంత తర్వాత దానవదైత్యాసురరాక్షసావళులకు న్వడ్డింతునో యానతీయవలె న్మీరన మంచిదే యనియె దైత్యస్వామి మేనుబ్బఁగన్.

గిలుకుటందెలు ఘల్లనఁ గీరవాణి, మరలి సురబఙ్క్తి కరుగుచో బిఱుదుచక్కఁదనము నెఱివేణిచెలువు గన్గొని బలీంద్రుఁ, డాదికన్నను మిగుల మోహంబు గాంచె.

వారిజేక్షణ సురపఙ్క్తిఁ జేరవచ్చి, యింద్రుఁ డెంత యమర్చిన నింతయేనియమరకుండెడి యమరులయలబలంబు, మాన్చెఁ జేసన్న నొకమాటమాత్రలోన.

వజ్రధరముఖ్యులౌ దిశావల్లభులును, గరుడగంధర్వకిన్నరఖచరసిద్ధసాధ్యవిద్యాధరాదినిర్జరకులంబు, వారి వేర్వేఱబంతిగా నేరుపఱిచి.

ధారుణీస్థలిఁ దోఁచు నూరుమూలము గాంచ నింతసి గ్గేల మోమెత్తు మనుచుఁబయ్యెద దొలఁగ గుబ్బలుచూడ బల్లంటఁ గెమ్మోవి నొక్కి జంకించుకొనుచు

భుజమూల మీక్షింపఁ బొదలు సిగ్గున నీకు వడ్డించ నని కేలు వంచికొనుచుఁగనుఱెప్ప లెత్తి గన్గొని మెచ్చి తల యూఁచి యమృతపానము సాలునా యటంచుఁ

దియ్యసరసంపుమాటలఁ దేనె లొలికి, యమృతరసము కదంబింప నమరపతికిమొదట వడ్డించి వడ్డించుఁ ద్రిదశతతికి, మోహినీకాంత జగదేకమోహనముగ.

అలివేణీమణి గిల్కుమెట్టియలు మ్రోయం బంతి వడ్డించుచుంజిలుఁగుంగుచ్చెలజాఱఁ ద్రొక్కువడి డాఁచేఁ జెక్కుచోఁ బైఁటయుందొలఁగంగాఁ జుబుకంబుచే నదిమెఁ దోడ్తో సిగ్గు నొయ్యారముందలుకుం దత్తఱము న్విలోకిజనచిత్తంబుల్ గరంగింపఁగన్.

చెదరినముంగురు ల్చెమటచే నుదురంటఁ గొనగోళ్ళచే దువ్వుకొనుబెడంగుజాఱుపయ్యెంట భుజంబుమీఁదికిఁ ద్రోసి చెఱఁగు డాఁపలివంకఁ జెక్కు హొయలుసడలి ముంజేవ్రాలు జాళువాపైఁడిగాజులు పైకి నెగఁద్రోయుచో విలాసమవనిభాగమున జీఱాడుకుచ్చెలకొంగు లీలఁ గెంగేలఁ కేలించుచెలువ

మలసి నిట్టూర్పు లిచ్చు నొయ్యార మెదను,మించు ఘర్మంబు గొనగోట మీటునీటుగలుగుమోహినిఁ దలప మైఁబులక లొదవె, దానవులు సొక్కు టేవింత ధరణికాంత.

ఇట్లు మోహినీకాంత యత్యంతశృంగారవిలాసకుతూహలంబున సుధారసం బమరులకు నొసంగుసమయంబున.

వనజాక్షి యమృతంబు వడ్డింపరాదాయె మనబంతి కిది యేమొ యనుచు నొకఁడువచ్చెద నని రాక వంచించునే ప్రేమ యధికంబు మనయందె యనుచు నొకఁడునమృతంబు మాకుఁ దెమ్మని బీఁదతనమున నడుగ గౌరవము గాదనుచు నొకఁడుకాదని పిలిచినఁ గలకంఠి వడ్డింప కలిగిపోవునొ కడ కనుచు నొక్కఁ

డమృత మేబ్రాఁతి యాచకోరాక్షిచిత్త, మెడయఁ జేయంగ రాదని యెంచి యొకఁడునూరకుండి రిగాని యోయువిద! యమృత, మిందుఁ దెమ్మనలేరైరి యెంతవలపొ.

సుదతి వడ్డించునపుడు పయ్యెద యొకింత, తొలఁగ గుబ్బలు సూచునబ్బలియుఁ బల్కరింపలేఁడయ్యెఁ దాఁ బల్కరింపఁ దెలిసి, యట్టె పయ్యెదఁ గప్పునో యనుభయమున.

తళుకు న్ముంగఱముత్తియంపురుచి సింగారంపుఁగెమ్మోవిపైఁదులకింప న్మెడ గుల్కి చెక్కుపయి బంతుల్సాగఁ దాటంకదీపులు కెంగేల బిగించుచున్ బయిఁట నంభోజాక్షి వాలారుచూవులఁ దేలించుచుఁ బల్కుఁ బల్కులసుధాపూరంబు తోరంబుగన్.

తడవాయె ననుచుఁ జిత్తమున నుంపఁగ నేల నిదె వత్తుఁ దాళుమీ యింతతడవుతాళఁగూడదొ బావ కేలగూఁడదొ తాళ కిపు డేమిగద్దులే యిట నదేమిబావ నవ్వితివి నాపలుకున కేమైనఁ దోఁచెనో నాకు నీతోడు దాఁచనేటికిఁ జెప్పుమా నేవింతదాన దయలేదొ నామీఁద దాళు మంచి

దందు కేమాయె నాకొకయవసరంబు, గలుగదే యఫ్డు చిక్కెదుగాక యెటకుఁబోయె దంచును నవ్వుచుఁ బువ్వుఁబోణి, బలినిఁ దేలించె బరిహాసభాషణముల.

మఱఁది యటంచు బావ యని మామ యటంచును నల్లుఁ డంచు నందఱకును నన్నివావు లిడి తచ్చనల న్మటుమాయ సుద్దులన్ముఱిపెముల న్విలాసముల మోహము లెంచి నిశాటచిత్తముల్గఱఁచె లతాంగి యంగనలు గారె మనోధనపశ్యతోహరల్.

ఇటులు దైత్యులనెల్ల నోరెత్తకుండఁ, జేసి సురలకు వడ్డించు చిగురుఁబోఁడిదేవరూపంబు గైకొని దివిజపఙ్క్తి, నున్నరాహువునకు సుధ యొసఁగెఁ గొంత.

ఆయెడ రాహువంచు వనజాహితమిత్రులు సన్న సేయ నాహా యని మోహినీమహిళ యద్భుతరోషకషాయితాక్షి యైహా యనునంతలోపల సహస్రసహస్రసహస్రదీధితిచ్ఛాయ సహస్రధారమగు చక్రము వ్రాలెఁ గరాంబుజంబునన్.

శయజలజాతవిస్ఫురితచక్రముచే మధుకైటభారి దుర్ణయుఁడగు సైంహికేయునిశిరంబు గఱుక్కన ద్రుంచునంతలోరయమునఁ గుత్తుక న్వెడలురక్తముతోడి కబంధ మొప్పె వింతయి పరిషత్సరస్సున వరాంబువుసూత్రపుఁగంబమో యనన్.

క్షితిఁబడు రాహుశీర్షము ద్విజిహ్వలు రోషకషాయితాక్షులున్సితతరదంష్ట్రలున్ బహువిచిత్రఫణామణు లుల్లసిల్ల విస్మితులయి దేవదానవులు చేరికఁ జేరి కనంగ మోహినీసతిఁ దిలకించి యిట్లను విషవ్యతిషంగకటూక్తివైఖరిన్.

సరిగా మాకు సుధారసంబు విభజించం జేరి యీలాగునన్సురపక్షం బొనరింపఁగాఁ జనునె యిచ్చో నంతమాత్రంబె యొక్కరుఁడ న్నే నిటనాసవచ్చినను జక్రచ్ఛిన్ను గావించి తిందరయంగా ఫలమేమి నీ వెఱుఁగలే వైతే సరోజేక్షణా.

అక్కట నిన్ను దూఱఁదగవా మగువా పగవారలుండఁగానిక్కడఁ జంద్రభాస్కరు లిదేమి యకారణవైర మిట్లు నాదిక్కునఁ జూపినారు కడతేఱఁగనిత్తునె యింక వారలన్మిక్కిలి శక్తిమీఱఁ దిగమ్రింగెద నంచుఁ బరిప్లవింపఁగన్.

వలదని నాఁటనుండియు దివాకరచంద్రులఁ బర్వయుగ్మవేళలఁ గ్రసియింపఁ బంపెఁ గమలప్రభవుండు నకారణంబుగావలవనివైరముం గొనినవారికి భోగ్యముగాక యున్నె తత్ఫల మది యెంతవారికిని బార్థకులాంబుధిపూర్ణచంద్రమా.

అమృతరస మింత సోఁకఁగ, నమృతంబై రాహుశీర్ష మతిభయదముగానమృతకరార్కులఁ బట్టెడి, నమృతరుహప్రభవునాజ్ఞ నఖిలం బెఱుఁగన్.

అంత.

ఈమటుమాయలాఁడి గద యింత యొనర్చె నటంచు దానవస్తోమము సుట్టుకొన్న మధుసూచనుఁ డప్పుడు నీలనీరదశ్యామతనూవిలాసము భుజాయుగళోజ్జ్వలశంఖచక్రముల్హేమపటంబు గన్పడ వహించి తిరోహితుఁ డయ్యె నయ్యెడన్.

ఆకపటంబు గాంచి దురహంకృతి మీఱ యుగాంతవిస్ఫురల్లోకవిలోచనద్యుతి విలోచనుఁ డౌచు విరోచనాత్మజుండాకులవృత్తి లేక ధనురస్త్రము లూని సహస్రచంద్రమశ్శ్రీకమనీయయానమునఁ జెన్ను వహించె రణాగ్రయాయియై.

రథచక్రనేమిఘర్ఘరరావములు కేతుపటపటాత్కృతులకు దిటము దెలుపగంధేభఘంటికాఘణఘణల్ ఘనబృంహితధ్వానములకుఁ గైదండ యొసఁగజవనాశ్వహేషలు చటులఖురాఘాతచిటపటధ్వనులతోఁ జెలిమి చూపనమరాట్టహాసనాదములు ఘోరశరాసవిస్ఫారములకుఁ బ్రావీణ్య మునుపఁ

బటహశంఖాదిబహువాద్యరటనములకు, వేత్రిసాహోనినాదము ల్విజయ మొసఁగసకలసేనలఁ గూడి రాక్షసజిగీషఁ, గదిసెఁ జౌదంతి నెక్కి సంక్రందనుండు.

అవనీమండలి గుల్భదఘ్న మయి మాద్యద్దంతిదానాంబువుల్ప్రవహింప న్వడిఁ జిక్కువాఱినఁ దమిస్రాచారి త్రొక్కుళ్లచేనవియున్ లేవఁగఁజాలఁ డెంతబలియుండైనం జమూసంకులంబవురా యెన్నఁదరంబె దానవమయం బయ్యెన్ జగం బత్తఱిన్.

త్వంగద్వాహఖురాగ్రభిన్నధరణీతత్త్వంబు రేణ్వాకృతిన్మ్రింగె న్వారిధులన్ గ్రసించె హిమరుఙ్మిత్రాదులం బుష్కరంబుం గప్పె న్నడయాడదయ్యెఁ బవనంబు దైత్యరాడ్భీతిఁ జూడంగా నప్పు డకాండసంప్రళయ మౌటం దోఁచె దేవాళికిన్.

కాంచనస్యందనగంధదంతావళరాజజంఘాల తురంగమములశార్దూలమహిషకేసరిగండభేరుండశరభప్రముఖవన్యసత్త్వములనుగంకగృధ్ర శ్యేనకాకోలకౌశికపారావతబకాదిపతగములనుగమఠపాఠీనకర్కటకనక్రగ్రాహశంకుప్రభృతితోయజంతువులను

వాహములు గాఁగ నెక్కి దుర్వారశక్తిఁ, బరశుపట్టసతోమరప్రాసముఖ్యశస్త్రములు పూని బలపాకజంభనముచి, విప్రజిత్త్యాదిదైతేయవీరు లపుడు.

చేరి వేర్వేఱ బారులుదీఱి కొల్వు, మ్రొక్కు మ్రొక్కిన వారలముఖముఁ జూచికంటిరే వీరవరులార కార్య మెంత, మోసమయ్యెను సురల నమ్ముటను నేఁడు.

కటకట యాడుదానివలెఁ గంజదళాక్షుఁడు సేరి మమ్ములందటవటఁ జేసి తీసి యమృతంబు సురాళికిఁ బంచిపెట్టె నింకెటువలె నమ్మవచ్చు జగదీశ్వరుఁడే యొకయింత మేరలేకిటువలెఁ జేయఁజూచె మన కెయ్యది తప్పు గణించి చూడఁగన్.

తా నొకమాయఁ జేసి యమృతంబు సురాళికిఁ బంచిపెట్టఁగానే నిఁక మాయఁ జేసి త్రిదివేశుల నందఱ మాయఁ జేసెదన్మానుప శక్తుఁడే యహహ మాధవుఁ డూరక లంజెతక్కులంబూనెనె కాక యాయుధముపోటు నెఱుంగునె చూత మంతయున్.

అని పలికిన దనుజేంద్రునిఁ, గనుఁగొని యిది యెంత స్వామి కనిపించుకొనందునిమెదము నీప్రతాపం, బున మే మాసురల నొకనిఁ బోనీకుండన్.

తలఁద్రుంపక మ్రింగమె వే, ల్పులందఱ నమృతసేవఁ బొలియకయున్నన్మెలఁగుదురుగాక కడుపునఁ, గలకాలము జాఠరాగ్నిఁ గమలి బలీంద్రా.

అటువలెఁ గాకున్నను మన, పటలిశృంఖలలు వైచి బంధించిన యుత్కటదురితంబు ననుభవిం, చుటకుఁ జెఱసాల నిడమె సురపతిఁ గినుకన్.

అని యుత్సహించి పలికిన, విని దనుజేంద్రుండు మిగుల వేడుక మీఱన్గనుఁగొని యిదుగో సమయం, బనుపమభుజశక్తి కనుచు నందఱఁ బనుపన్.

కృతవీరపాణకర్ణేజపభ్రమణారుణాభనేత్రముల రోషాగ్ను లొలుకఁగలశాబ్ధిజలఘోషఘనతమాశబ్ది కస్మయఘట్టితాట్టహాసములు చెలఁగఁబ్రతిభటాళ్యంధకరణహాలహలదీప్తిముష్టిందయచ్ఛాయమూర్తు లలరమధ్యేవియర్దీప్యమానార్కనిష్ప్రభీకరణభీకరఖడ్గకాంతు లడర

హైమరథములఁ దోలి గంధాంధభద్ర, కరుల గారాడి దుముదారుగా హయాళిజేరువకు నూకి భటులకుఁ జేయి వీచి, యభ్యమిత్రీయదైవసైన్యంబుఁ గదిసి.

వాతంధయపాణింధమ, శాతశరము లసురు లేయ సౌరబలంబుల్భీతిలక ప్రతిసువర్ణా, న్వీతోజ్జ్వలపత్రితతుల విదలించె వెసన్.

రథికుల్ హస్తికు లాశ్వికు ల్భటులు శస్త్రాశస్త్రిఁ బోరం బరశ్వథకౌక్షేయకకుంతముద్గరగదాచక్రాదినానావిధాయుధకాంతుల్ దశదిగ్విభాగములయం దొప్పారె నత్యుగ్రమౌమధుభ్ళల్లోచన మాసులోచనము సామ్యంబూని చూపట్టఁగన్.

ఈకరణి శరాశరిఁ గుం, తాకుంతి గదాగదిని బ్రతాపము మెఱయన్భీకరముగఁ బోరఁగ నా, కౌకోదైత్యులకు ద్వంద్వయుద్ధం బయ్యెన్.

బలిశక్రులును హేతిపాశాయుధులు వృషపర్వాశ్వినులు రవిబాణు లిందుసైంహికేయులు విరోచనకృశానులు భద్రకాళినిశుంభులు కాలనాభ

కాలులు మయవిశ్వకర్మలు జంభవృషాకపు ల్ద్విశిరోనిశాకరజులుమాతృకోత్కలులు దుర్మర్షణవామదేవులు నముచ్యపరాజితులు పులోమ

నీలులును మేఘదంభావనీతనయులు, కాలకేయమరుత్తులు కమలమిత్రతనయనరకాసురులు నివాతకవచపవ, మాను లొండొరుల్ వోరుసమయమునందు.

కవచస్ఫూర్తి నభేద్య మౌ కవచ మేకంబైనబాణంబుచేనవియించెన్ రథరథ్యసారథిపతాకాద్యంబుల న్నాలుగింట విచారించె సురేంద్రు డగ్గఱి భుజాటంకంబునం దైత్యదానవచూడామణి యట్టహాసమునఁ గాండం బెల్ల ఘూర్ణిల్లగన్.

మఱియుం దఱచుగ శరములు, గఱిగఱి గఱువంగ నేయఁగా వెఱవక యత్తెఱగంటిరాయఁ డప్పుడె, యఱిముఱిఁ బ్రతిశరము లేసి యన్నిటిఁ ద్రుంచెన్.

కోపంబు మీఱఁగాఁ జాపంబు చేపట్టి రోషంబుచే దానిరూ పడంచెశూలంబుఁ గైకొని ఫాలంబు వొడువరా వాలముచే దాని వ్రేలఁజేసెఁబంతంబు మీఱఁగాఁ గుంతంబు గైకొన్న నంతంబు నొందించె నస్త్రనిహతిగండంబు గుఱి సేసి దండంబు వైచిన ఖండంబు గావించెఁ గాండమునను

మఱియు నేయాయుధము లూన మనుజభోజి, తత్తదాయుధములఁ ద్రుంచెఁ దత్క్షణంబయమృతసేవయు హరికటాక్షమును గలుగఁ, గలదె యీడును జోడు నాఖండలునకు.

ఆగ్నేయాస్త్రము దేవతాధిపతి యేయం దానిచే భగ్గునన్భగ్నంబయ్యె మహారథంబు దివిజప్రత్యర్థిరాజేంద్రుఁ డున్మగ్నుండౌట నదుృశ్యుఁడై చనియె నానాదైత్యసంఘాత ముద్విగ్నంబయ్యె సుధాశను ల్సెలఁగి రుద్వేలప్రమోదంబునన్.

అంత నిటులు నలోచనగోచరుండై చనినవిరోచననందనుండు కృతగర్వవిమోచనుండై తననేర్పు మెఱసి మాయావి యగుచు నెల్లెడలఁ దోఁచి పెల్లుగనాక్రమించెడుమాయ గావించిన.

కులశైలమున వాన గురియంగ గిరిభేది యంగంబు గులగులనయ్యె మిగులలయకాలదహనకీలలు సుట్టుకొని యేర్చి పరితపింపఁదొడంగెఁ బావకుండుమృత్యుపాశంబులు మెడఁబట్టి తివియఁగా మొఱలు వెట్టఁదొడంగెఁ ధరణిసుతుఁడుబేతాళములు నీళ్ల వ్రేసి త్రొక్కఁగఁ బాశి యుదు టెల్లఁ బెడఁబాసి యుడ్డుగుడిచెఁ

బెక్కుభూతంబు లితరులపీచ మణఁచె, నే మనఁగవచ్చు వానిమాయామహత్త్వమహహ యింద్రాదులేల బ్రహ్మాదులైన, మెదలఁగాఁజాల రావేళ నెదుటఁబడిన.

అదియునుంగాక.

జలదంతావళఘోరఘీంకృతులతో ఝంఝానిలాఘాతసంచలితాభ్రంలిహతుంగతుంగతరచంచద్భంగఘోషంబుతోఁగలశాంభోనిధిఁ దమ్ము ముంచినగతిం గన్పింపఁ గంపించుచున్బలభిన్ముఖ్యులు పాహిపాహి యని యబ్రహ్మణ్యము న్వెట్టఁగన్.

వినిపించెన్ హరిపాంచజన్యరవ ముద్వేలప్రభాచక్రముంగనిపించెన్ సురదానవావళికి రక్షస్వామిమాయాళి లేదనిపించెన్ క్షణమాత్రలో సమదదేవారాతి రింఛోళిచేఁదినిపించెం దృణరాజి రాజితభుజాతేజంబు శోభిల్లఁగన్.

అప్పుడు.

చిక్కితి వెందుఁ బోయెదవు శ్రీహరి యంచు మృగేంద్రవాహముంజక్కఁగఁ బైకి నూకి రభసంబున శూలము పూని జక్కియౌపక్కిని ప్రక్కలింపఁ గని పక్కున శూలము నాచి త్రుంచె నాచక్కనికాలనేమితల చక్రధరుండు సురాళి మెచ్చఁగన్.

అది గనిన మాల్యవంతుఁడు, గద గొని హా! పోకుపోకు! గరుడ యటంచున్విదలించె గరుడుఱెక్కలు, త్రిదశేంద్రుఁడు తనదు పవిని దిట్టఁగ నంతన్.

దానవధ్వంసికరచక్రధార మునుపొ, తాను మునుపొ యనంగఁ గంధరను వలచియచ్చరమిటారి వైచుమాల్యంబువలన, మాల్యవంతుఁడు సహజనామంబుఁ గనియె.

సురభీకరణోత్కమనో, హరమూర్తి సుమాలి మాధవౌద్ధత్యమునందెరలెం దానవజాతియు, వరసుమనోజాతియైనఁ బ్రమదము గనదే.

తనపేరు గలుగు హరి నె, క్కినవాఁడని మాలిఁ దునిమెఁ గేశవుఁడు సుదర్శనమున మఱియు ననేకుల, దనుజులఁ దునుమాడె బాహుదర్ప మెలర్పన్.

ఈరీతిం జగదేకవల్లభుఁడు భూయిష్ఠప్రతాపంబుచేఁగ్రూరాదిత్యవిరోధివర్గముల నుగ్గుల్సేయ నంతంతకున్హేరాళం బగువేడ్క వాసవుఁడు మత్తేభంబుఁ గాలాడి దుర్వారంబౌకులిశంబు పూని బలిఁ జేరంబోయి తా నిట్లనున్.

ఏరా యోరినిశాచర, యేరా వృత్రారి నెఱుఁగవే నాతోడంబోరాడలేవు పోరా, కోరా యభయంబు నిల్పుకోరా తనువున్.

వదలి శౌర్యంబు విద్యలవానికరణి, నింద్రజాలంబు వన్నెదవే బలీంద్రయిదిగొ వజ్రంబు మెచ్చి యిచ్చెదను గొనుము, కల్లగా దన విని దైత్యవల్లభుండు.

ఇంద్రజాలంబు వన్నక యెటుల నొడియ, వచ్చు ననిమిషబలము లవ్వారి గాఁగదోఁ పొసంగకపోదువే దొడ్డదొరవు, వజ్రమాత్రంబు నా కేల వలవ దనిన.

ఇం కిట దోఁపె కాక పుర మెయ్యది నీకు నిశాచరేంద్ర యీయంకము మాని పోయిన యథార్థమె పల్కితి వౌర యంచునిశ్శంకత నిర్జరేశ్వరుఁడు సారెకుఁ బ్రల్లదమాడఁగా మహాహంకృతిఁ జెంత నున్నబలియయుం దనుజాతుఁడు హుంకరించుచున్.

ఏమిరా యింద్ర యింతలో నింతగర్వ, మేల వచ్చెఁ దలంపరా యిన్నినాళ్లునీవు పడినట్టిపాటు నే నెఱుఁగుదు నొక, గరిడిలో వింతసాధన క్రమముగాదు.

ఇతఁడు నీ కోడి మాయలు నిచటఁ జేసె, నే స్వకాండ విజృంభణం బెల్లఁ దొలఁగగౌతమీజార యెవ్వనిఁగాఁ దలంచి, నావు బలిఁ గాఁడె పుణ్యజనప్రభుండు.

కొమ్ములుఁ దోక లేక జతగూడెను నీకు వృషాఖ్య యింద్ర రేద్రిమ్మరిదొమ్మికయ్యమున జట్టతనం బరి పూరి మేసితోఁగ్రమ్మినభీతిచే నటులుగావలె నచ్చెరువేల దీనికైయిమ్మహి నీదుపేరిపసు లెచ్చటఁ జూచినఁ బూరి మేయఁగన్.

కౌశికలీలను గానన, కౌశికమూలమునఁ దపము గావించెదవోకౌశిక యటు గాకున్నం, గౌశికగతి గొంది నడఁగఁ గాంక్షించెదవో.

బలి భాస్వత్తేజంబున, నళుకుచు నిఁకఁ గౌశికా మహాబిలపదవిన్మెలఁగు యథార్థాభిఖ్య, న్వలవదు మాతోడఁ బోర వశమే నీకున్.

అనిన మదిరాపానఖదిరాంగారసదృశదృశుం డగుచు సహస్రదృశుం డిట్లనియె.

కౌశికుఁడ నౌదుఁగాక రాక్షస యటైనఁ, గౌశికస్ఫూర్తి బలిపుష్టగణము లెట్లుమనఁగ నేర్చు నెఱుంగ వేమనఁగవచ్చు, ననిన విని నవ్వి బలి యిట్టు లనియె నపుడు.

విబుధలోకేంద్రుండు వీరాధివీరుండు గాఁడె యెన్నండైనఁ గలన నోడిపోవునె యటమొన్న పుణ్యంబునకు స్వర్గ మిచ్చి తా నడవుల కేగెఁగాకమరల నెయ్యంబున మముఁ గొల్చెఁ గాఁబోలు ఘనభుజాశక్తికిఁ గడమగలదెయింకఁ దాఁగాక న న్నెవ్వరు నవ్వెద రాహవంబున నోడి యరుగుచుండ

నహహ యందుల కేమి కర్మానుసార, మాపదలు సంపదలు జయ మపజయంబుదానికన లేదు దైవకృత్యంబులకును, విఱ్ఱవీఁగుట వ్రేఁగుట వెఱ్ఱితనము.

వినవోయి యింద్ర దైవం, బనుకూలంబైనఁ గలుగు నన్నిశుభంబుల్దనకుఁ బ్రతికూలమైన వ, చ్చిన నేకార్యంబుఁ గాదు సిద్ధము సుమ్మీ.

మీ కొకవేళ నేమమగు మే మొకవేళఁ ద్రిలోకరాజ్యముంజేకొనియుందు మిర్వురకుఁ జేకుఱ వొక్కట వాంఛితార్థముల్కోకచకోరకంబులకుఁ గూడునె కోరిక లొక్కవేళనేయాకరణిం దలంపు త్రిదళాధిప గర్వపుమాట లేటికిన్.

అని వైరోచని పలికిన, విని బలి నను వాఁడు దేవవిభుఁడు కృతఘ్నుండని రోయక సరిచేసుక, చనునే మాటాడ రాత్రిచరమూర్ధన్యా.

క్షణమాత్ర మూరకుండుము, క్షణదాచరకోటి గొలువ సమితి సహస్రేక్షణకాయము గూలిచి భ, క్షణముగఁ జేసెదను భూతసంఘంబులకున్.

గాలికిఁ బోవువాహము నగంబులపత్రములం దెమల్పఁగాఁజాలును వాలు సైన్యములు సంగరమన్న గృహోపయుక్తముల్ప్రోలును బట్టబైట నిజపుత్రకుఁడుం బలుగాకి యిట్టిచోవేలుపుఱేని గెల్చు టొకవిక్రమమే బలిదైత్యవల్లభా.

అని దురాగ్రహగ్రహావేశకిటకిటాయితరదనపటలుం డగుచు నిజభుజాగ్రజాగ్రన్మండలాగ్రంబు జళిపించి యాఖండలున కి ట్లనియె.

అబ్బలి సురమృగములకుం, బెబ్బులి యటఁ బోకు నీకుఁ బింకం బున్నన్గొబ్బున రా బలి నే నొక, దెబ్బం బరిమార్తు ధరణిఁ గొబ్బునఁ గూలన్.

నాసురేంద్రుండు నవ్వి యిన్నాళ్లు గావు, నేఁడు బలివైతి వాహవోన్నిద్రబాహుశక్తికని పల్కి బలికి ద్రాసంబు బలియ, నెలిని ఖండించెఁదను సురల్ బలియుఁ డనఁగ.

అంతటఁ బోక సురేశ్వరుఁ, డెంతయు రోషమున వజ్ర మేసిన మూర్ఛాక్రాంతుం డయ్యెన్ బలి దివి, జాంతకునరదంబు సూతుఁ డవలికిఁ దివిచెన్.

చెలికానిహాని వీక్షించి రోషంబున జంభుండు కధనసంరంభుఁ డగుచునిలు నిలురా యింద్ర నేఁ డెందుఁ బోయెదు చిక్కితివం చని సింహహయముఁగదియంగఁ దోలి యుధ్ధతి గదాదండంబు బిరబిరఁ ద్రిప్పి యాసురవరేణ్యుకరిని వైచిన నది సురసుర స్రుక్కుచు ధరణిపై మ్రొగ్గినఁ దత్క్షణంబు

నందె మాతలి దెచ్చిన హయసహస్ర, రథముపై నెక్కి జంభుశిరంబు దునిమెవాసవుఁడు గట్టుదెగఁగొట్టువజ్రమునను, జంభసంభేదమేమి యాశ్చర్య మనఁగ.

కలహప్రియుచే నెంతయుఁ, దొలుత న్విని కనలి వానితోఁబుట్టువుబలపాకనముచు లత్యు, జ్జ్వలశోభాభువనముచులు సంరంభమునన్.

త్రేతాగ్నులవలె మువ్వురు, దైతేయులు సుట్టుముట్టి దారుణశరసంఘాతములఁ గప్పఁగాఁ బురు, హూతుం డొప్పారె మేఘయుతమేరుగతిన్.

బలుఁడు రథంబును దురగం, బులఁ బాకుఁడు సూతు నముచి భూరిశరములన్దళియించి యింద్రునంగక,ములు సింఛిరి మించి యతఁడు మూర్ఛ మునుంగన్.

అంత నంతటంబోక యనలు నంతకు నసుర నబ్ధిపు ననిలు నలకేశ్వరు నలికలోచను నన్యు లగునమరుల నతులితంబు లగునస్త్రంబుల నదటణంచి యట్టహాసంబడరించిన.

వెఱచి తెఱగంటి మూఁకలు మొఱలు వెట్ట, నమరపతి సేదదేరి యుదగ్రుఁ డగుచుఁగులిశధారను ఖండించె బలుని మొదట, వెనుకఁ బాకాసురునిఁ ద్రుంచె విక్రమమున.

వారలపాటుఁ జూచి యనివారితరోషకషాయితాక్షుఁ డైవీరవతంసుఁడౌ నముచి విక్రమశాలి యనేకఘంటికోదారము మత్తశాత్రవవిదారము నైన త్రిశూల మెత్తి హుంకారము మీఱ వాసవ పొకాలుము దీన నటంచు వైచినన్.

అదియుఁ బ్రళయకాలకాలఫాలలోచనకీలికీలాకరాళం బై నిగిడిన యట్టిశూలంబు తూలంబులీల నతివేలంబై యాలంబున నేలంబడ వాలంబున నేసి తద్దనుజకంఠనాళంబు ఖండింప నాఖండలుం డఖండదోర్మండలమండనాయితం బగుశతకోటి జళిపించి వైచిన నదియు శతకోటిమార్తాండమండలపిచండిలరుచిమండలప్రచండతాఖండనపండితమన్యం బగుచు సంవర్తసమయప్రవర్తితపుష్కలావర్తప్రముఖచటులతరమేఘపటలనిర్దళదనర్గళజాగ్రద్దీర్ఘనిర్ఘాతసంఘాతలింగంబు లగు విస్ఫులింగంబులు తోరంబై నిగుడం గనుంగొని దనుజపుంగవుండు గలంగక చెలంగుచు మదీయవక్షఃస్థలికుందనంపుతాళికి నొకయపూర్వవజ్రంబు లేదు గదా యని వెదకుచుందు నదియుఁ ద్రిదళపతి యంపెనేకదా యని యెదయిచ్చిన వజ్రంబును జనుమఱగ్రుచ్చి వెనువిచ్చి చనలేకయచ్చటనే యున్నం గనుంగొని వియచ్చరప్రవరుఁ డిది యేమి యెచ్చటనుంగాన మిట్టి యచ్చెరు వని రిచ్చవడి కనుంగొనుచు వెచ్చనూర్చుచున్న సమయంబున నార్ద్రంబును శుష్కంబును గాని దాన నముచిదానవుండు దెగునని నిదానంబు దెలిపిన నాకాశవాణి పలుకు నాకర్ణించి నలుదిక్కులుం బరికించిశైత్యప్రభావమానితవజ్రఘనసారం బగుచుఁ గనుపట్టు వారాశిడిండీరంబుభవిష్యన్నముచిహననజనిష్యమాణయశస్సౌరభకారణకుసుమమంజరిం జేపట్టువిధంబున హస్తారవిందంబున హంసంబు చందంబున గనుపట్టం గైకొని దివ్యతేజంబు సంధించి యనార్ద్రశుష్కం బిది యౌ గదా యని ప్రయోగించిననదియు నింద్రప్రతాపభూపాలునిసమీపంబున వెలుంగు చంద్రజ్యోతితెఱంగున రంగై నిజాభిముఖవిజయలక్ష్మికి సుపర్వాధిపతి సమర్పించు కర్పూరనీరాజనంబుడంబున విరాజమానం బై బలిదైత్యత్రిలోకాధిపత్యవినాశసూచకంబై పడునుడువువడువున బెడంగై నముచిప్రాణాపకర్షణసమావతన్మృత్యు

దేవతాట్టహాసంబు పోలికె వికాసంబై తైలాదభ్రసితాభ్రంబు సుహృ త్తగురీతి శీతలజలప్రవాహంబు కూల సాలనిర్మూలనానుకూలం బగులీల సురవిరోధిశిరోధి ఖండించిన దనుజవరూథినీహాహానాదంబు లుప్పతిల్లె దివిజచమూసమూహంబులు గాయకహాహానాదంబులు బ్రహ్మర్షిసముచ్చయసముచ్చైరుచ్చారితజయజయేత్యాశీర్వాదంబులు జయదుందుభి రటనంబులు నప్సరోనటనంబులుంజెలంగె నంత.

ఏఱులై పాఱు నెత్తురు లెందుఁ జూడఁ, గొండలై పడుకండలు గుములుగూడిదానికై పోరు భూతబేతాళతతులు, గలిగి భీకరమయ్యె సంగరము గరము.

మెదడు ముద్దలు గావించి మెసవి మెసవి కుతిక మోయంగ నెత్తురుల్ గ్రోలి కడుపునిమిరికొంచు నగస్త్యమంత్రములు నొడివి, శతపదంబులు ద్రొక్కుఁ బిశాచగణము.

తుందిలదనుజకబంధము, నందొకగజమస్తకంబు నతికి గజాస్యాయిందలి కరివిఘ్నంబులఁ, గుందింపకు మనుచు మ్రొక్కుకొనుభూతంబుల్.

వేలుపులు వారు దనుజులు వీర లనుచు, భూతబేతాళములపఙ్క్తి పొంకపఱిచితాను మోహిని యంచు రక్తంపుసుధను, బొసఁగ వడ్డించెఁ గామినీభూత మొకటి.

కరిగండస్రుతదానవారి యమునాకల్లోలముల్ గా నికోచరరక్తంబు సరస్వతీకలన మించె న్వాహలాలాంబువుల్సురకల్లోలినిగాఁ ద్రివేణికరణి న్సొంపొందె జ్ఞాతేయసంగరభూభాగము గాన దానఁబడ మోక్షప్రాప్తి సంధిల్లెడిన్.

ద్వంద్వయుద్ధంబు గావించు దనుజవిభులు, దక్కురక్కసు లెదురంగఁ దల్లఁడిలుచుఁబఱవ వెన్నాడి పొడిచె సుపర్వగణము, లహహ దాయాదిపోరు దుస్సహము గాదె.

ఇవ్విధంబున నుపేంద్రసుదర్శనంబునఁ గాలనేమి మాలి సుమాలి మాల్యవంతులు నంభోధరవాహదంభోళిసంరంభంబుల బల జంభ పాక నముచి ప్రముఖదానవప్రవరులు దక్కినదిశాధిపతులవలనఁ దెగిన సేనాధిపతు లెల్లం ద్రెళ్లినవిలోకించి దేశకాలవిశేషవిజ్ఞానవిచక్షణుండు గావున బలీంద్రుండు దన కది విజయసమయంబు గాదుగా యని యెఱింగి సంగరరంగంబు దొరంగి శుక్రుసన్నిధికేగి తదీయసంజీవినీవిద్యఁ దత్త్వోపదేశవచోవిశేషంబుల బాహ్యాంతఃకరణదుఃఖంబులఁ బాసి తపంబునకుం జనియెఁ దక్కు రక్కసులు దిక్కు లేక పెక్కువగలం జిక్కువడి నానాదిక్కులకుఁ బఱవఁ బరవరూథునీవరుల వెన్నంటి మున్నిం

టి రోషంబుకంటు దెఱగంటి దొరలు సమయింపలేక వెఱచువారును, రక్షింపుండని యఱచువారును, దెసలకుఁ బఱచువారును, దృణంబులు గఱచువారును, కాననంబులు దూఱువారును, విధి దూఱువారును, మ్రొక్కువారును,నగంబు లెక్కువారును, నొచ్చువారును, సముద్రంబులం జొచ్చువారును నైకలంగిన రక్షోబలంబులవలన దిగంతంబులుం గరుణరసమయంబు లయ్యె నాసమయంబున.

గీరమణుండు పంప ననికిం గలహప్రియుఁ డేగుదెంచి లక్ష్మీరమణప్రసాదమునఁ జెందితి రింతె యభీష్ట మింక బృందారకులార భీతు లగుదైత్యుల నొంపఁగ నేల యంచుఁ దావారలఁబోరు మాన్పెఁ బితృవాక్య మలంఘ్యము గాదె యేఱికిన్.

అంత సుపర్వసార్వభౌముం డవార్యశౌర్యంబున దుర్వారతరసర్వశార్వరీచరభుజాఖర్వగర్వశార్వరంబు దొలంగించి నిజప్రతాపతపను వెలింగించి పలాయమాననానాదానవప్రాణత్రాణపరాయణుం డగుచుఁ దచ్ఛిబిరంబుల ధర్మదారలం బట్టింపక ధర్మధారలం బట్టించె నంత.

వృత్రనిర్జరమిత్ర వృత్రపంకజమిత్ర జంభజంభలవిభంజనకుఠారపాకవారణపాకపాకలరోషనముచిఖండనభండనప్రచండబలయుక్తబలభుజాబలమహాబలనాగకృతపులోమవిరామకీర్తిధామజితవిరోచనదైత్య సుతవిలోచనభీమ తతగరుద్ధరధరాధరనిరోధ

యంచుఁ గొంచక కంచుకు లభినుతింప, విజయలక్ష్మీసమేతుఁ డై వెల్లగౌరునెక్కి సర్వామరులు గొల్వ నింపుసొంపు, లమర నమరావతికి నేఁగె నమరవిభుఁడు.

అమితానంద మెలర్ప డెందమున దైత్యారాతి కూర్మావతారము గాఢస్పృహ మీఱ వ్రాయు మనుజుల్ రాణింతు రాచంద్రతారముగా శ్రీయుఁ జిరాయు వొంది రుచిరాధారాదితోదారితారముగా వర్ధిలుఁ గీర్తిగల్గి ఘనసామ్రాజ్యంబున న్భూవరా.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁ డైజనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెలుపు మని యడుగుటయున్.

నవరత్నోజ్జ్వలధామ దామసుమనోనాళీక నాళీకపాత్రవరామోదనిదాన దానవిలసత్కల్యాణ కల్యాణనమ్రవనీచైత్రవిహార హారుసువచోమాధుర్య మాధుర్యశాస్త్రవిభాస్యాత్మవిశేష శేషవిలసత్సత్కీర్తి సత్కీర్తితా.

భర్తృహరిప్రముఖసుధీ, కర్తృకృతగ్రంథజలధి కజ్ఞానసుబోధర్తృమనీషామంథర, ధర్తృ శ్రీపద్మనాభ తనయవరేణ్యా.

సుధామాధురీధుర్యసూక్త్యైకధామాకథామాత్రధూతారికౌక్షేయధామాయథామాధవస్వాన్గకాదిప్రధామాప్రథామానితామాత్యరాజీసుధామా.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్టభాషాకవిత్వసామాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణీదేవుల నాగనామాత్యసుధానముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతంబైనదశావతారచరిత్రం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.

Comments

Loading comments…