6. భృగురామావతారకథ
దశావతారచరిత్రము
ధవకథాసుధారసమాధుర్యాధీనహృదయ మగదలకులపాథోధికళానిధి సకలకళాదికనైపుణ్య కృష్ణయార్యవరేణ్యా!
అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమానిధరణివర భృగురామావతార మిఁకనుదెలియఁజెప్పెద వినుమని తెలుపఁ దొడఁగె.
శ్రీకాంతోజ్జ్వలదంతవాస మలకాక్షీణప్రభావాప్తముద్రాకారాజవిరాజమానముఁ గళారమ్యంబు శుద్ధద్విజాలోకం బుత్కటహేమధామవర వల్గుస్ఫూర్తి చిత్రంబు కన్యాకుబ్జంబు కకుబ్జనస్తుతినిఁ జెల్వంబౌ ముఖాబ్జంబునన్.
ఆపుర మేలు గాధి మనుజాధిప శైలనిరోధిబాధితాటోపవిరోధిసాధితకఠోరధరాంతపయోధియూధికాభాపటుకీర్తిశోధితకపర్దిశిరోధి సమేధితాత్మమేధాపరిపూరితాంబుధి సుతాగృహమేధి మహాశ్వమేధియై.
అతఁ డొకనాఁడు వేడుక నొయారులు గొందఱు గొల్వుసేయఁగారతనపుమేడ నున్నతఱి రాఁగరుచీకుఁడు చారుభక్తితోనతిథిసపర్యలం బ్రముదితాత్మునిఁ జేసి మణీమయాసనస్థితు నొనరించి తా నతనిచెంత వసించె వినీతి నత్తఱిన్.
పడుచుఁదనమునఁ బైపక్కఁ బడుచునున్న, పడుచునొక్కతె వేడుకపడుచుఁ గాంచిరాజ యీకన్య నీకూఁతురా మఱేమి, భాగ్యశాలివి సకలసంపదల నీవు.
వీక్షించినపుడె తెలిసెన్, లక్షణవతియంచు రాజనందనిహస్తంబీక్షించి తపసి సతియగు, లక్షణమున్నయది నాతలఁపు చేకూరెన్.
కన్యార్థి నగుచు వచ్చితి, ధన్యా నీయింటికడకుఁ దడయక నాకుంగన్యాదానము చేసి య, నన్యాదృశసుకృత మొందుమా నృపసోమా.
అని పలికిన జడదారిపలుకులు ములుకులై చెవినాటిన నుల్కిపడి యప్పు డప్పుడమిఱేఁడు తనమనంబున.
ఆకునలము మెసవి యడవిలో వసియించు, తపసు లేడ రాజతనయ లేడనందు నించుకైన నెంచక యక్కటా, యడుగవచ్చె నిట్లు వెడఁగుఁదపసి.
ముక్కుననె యుండుఁ గోపంబు మునుల కెల్లఁ, జెల్లఁబో యీయన శపియించిన శపించునటులుగావున నొకయుపాయమున దీనిఁ, గడపెదనటంచు నిట్లను గౌరవమున.
అమలాత్మా నినువంటి ధన్యునకుఁ గన్యాదానముం జేయుభాగ్యము సామాన్యమె యైనఁ జంద్రధవళాంగశ్యామకర్ణాగ్రవాహముల న్వేయి నొసంగఁగావలయుఁ గన్యాశుల్క మస్మత్కులక్రమ మీరీతి నొసంగి కైకొను మిదే కన్యామణి న్నావుఁడున్.
వెలవెలఁబోవు మోమునను విప్రకుమారకుఁ డౌర యెవ్వరుందలఁపరు తొల్లి యీతలఁపు ధారుణిలోపల నిట్టిగుఱ్ఱముల్గలుగునె గల్గెనా యొకటిగా పదిగావు సహస్రవాహముల్గలుగునె యేమి సేయుదును గన్నియఁ జూచిన నాస యయ్యెడిన్.
అనుచు న్నెమదిఁ గొంతచింత యిడి రాజా మంచిదే తెత్తునంచని యంపించుక భూమిఁగల్గు సకలక్ష్మాధీశుల న్వేఁడి యెందును దాదృక్తురగంబు లేక మదిలో నూల్కొన్న చింతాభరంబున నిట్లంచుఁ దలంచె మౌని యపరాంభోరాశితీరస్థుఁడై.
నెఱివేణిఁ గూడని నెఱులు నెన్నుదుటిపై కమ్మకస్తురితిలకమున నెరయఁదెలివాలుగనుకెలంకుల సానదేఱెడి చికిలిచూపు లొకింతసిగ్గు గులుకగోట నొక్కిన పాలుగాఱుకెంజెక్కుల నుదిరికమ్మలకాంతి యుదుటుసూపనొరులచూ పొరయుచో నుసిరికాయమెఱుంగుచన్నుల పయ్యెదచాటు కొసఁగఁ
గొమరుప్రాయంబునను ముద్దుగులుకుచున్న, కన్నెఁ జూచిన మొదలు నాకన్నుఁగవకునిదుర గాన హయంబుల నెమకి గాన, గాన నీచింత దరిఁ జేరు క్రమము గాన.
అని యత్యంతదురంతచింత మునిరా జౌర్వానలజ్వాలికాఘనసంతాపపరిప్లవన్మకరనక్రగ్రాహమీనాదిజంతునికాయాభ్రనదీనివాసకరుణోద్యుక్తోర్మికాహస్తమైకననౌవార్ధి గుభిల్లునం దుమికె నక్రస్ఫూర్తి వర్తిల్లఁగన్.
దుముకి మునీంద్రనందనుఁడు తోడనె వారుణభృత్యు లెందఱేసమధికభక్తిఁ జేరి కడుచక్కనిమార్గము సూపఁగా నుపాయమున నగాళికోసరిలి యయ్యమరావతి సేరివచ్చు సంయమి యమితప్రభావమున కప్పతి విస్మయ ముప్పతిల్లఁగన్.
ఎదురుగ వచ్చి మునీంద్రుని, పదములు పన్నీటఁ గడిగి బంగరువిరులన్సదమల భయభక్తులు మదిఁ, బొదలం బూజించి యతని బొగడుచు ననియెన్.
సామాన్యుండె భవద్గురుండు భృగుఁ డక్షయ్యప్రభావాఢ్యుఁ డైయామూర్తిత్రయిచేతఁ బూజగొనె నింద్రాదు ల్భవత్కింకరుల్నీమాహాత్మ్యము కొంచెమే కలిగెఁగా నీపాదము ల్గొల్వఁగానే ము న్నేమితపంబు చేసితినొకో భృగ్వాన్వయగ్రామణీ.
అనిన వరుణు వినీతవృత్తికి వినీతప్రాప్తి యగునని సంతసిల్లి మునివల్లభుం డిట్లనియె.
చెవి నల్పుం దనువెల్లఁ దెల్పుగల తేజు ల్వేయిటిం గోరి నేధవళైకాశ్వుని మేషవాహనుని గంధర్వద్విషద్వాహు మానవవాహు న్నిరసించి కాండపతిని న్యాచింపఁగా వచ్చితిన్భువనాధీశ్వర యిచ్చిపంపుము శుభంబు ల్నీకు జేకూరెడిన్.
అనిన న్భాగ్యము చేసితి న్మునికులాధ్యక్షా సహస్రాశ్వముల్గొను నే నిచ్చెద నంచు నట్టి వొసఁగన్ క్షోణీసురేంద్రుండు గ్రక్కన గంగానదిత్రోవగా వెడలెఁ దత్కంఖాణజాతంబునందనరారెన్ హయతీర్థ మన్నదినిఁ గన్యాకుబ్జపార్శ్వంబునన్.
జటివరుఁ డిటువలె గంగా, తటిని గృపీటముల వెడలి తతఘోరఖురాస్ఫుటితధరాచటులరజః, పటలారుణితాంశుఁ డగుచుఁ బఱతెంచుటయున్.
పరనృపుఁ డెవ్వఁడో పురముపైఁ జనుదెంచెనటంచు గాధీభూవరుఁడు మహారథద్విరదబంధుపదాతులతోడఁ గూడి ముద్గరకరవాలతోమరగదాపరిఘక్షురికాదిసాధనోత్కరము వెలుంగఁ బెట్టెదురఁ గన్గొని డగ్గఱి విప్రుఁ డిట్లనున్.
మామా తెచ్చితి వేయిగుఱ్ఱములు కొమ్మా నాకు నీకన్య నిమ్మా మాట ల్వెయియేల యంచనిన గోత్రాధీశుఁ డౌరౌర ని
స్సామాన్యంబు తపోవిశేషమేకదా జామాత యయ్యె న్భళీయీమౌనీంద్రుఁడు నాకు నాకులము యెంతే పావనం బయ్యెడిన్.
అనుచు ముదమున మునిఁ దోడుకొనుచుఁ బురము, సేరి పురమెల్ల మిగులఁ గైసేయఁ బనిచివేగ మౌహూర్తికులను రావించి లగ్న, నిర్ణయము చేసె గాధిభూనేత యంత.
చెలువ యొక్కతె నూనె చిలికించి జడ విప్పి నిదురరాఁ దలయంటె నేర్పు మీఱఁజెలియోర్తు కుంకుమ నలుగిడె భసితావలిప్తదేహము హేమదీప్తి మెఱయగంధ మిందేలన గందంపు టటకలిఁ బెట్టె నవ్వుచు నొక్కబిసరుహాక్షియుష్ణాంబువు లటంచు నొడ్డుకోఁ గోర్వెచ్చజలముల నొకకల్కి జలకమార్చె
చలువ లందిచ్చె నొకచెల్వ వెలఁది నవ్వు, లుత్తరీయము లందుఁ జేనొడియ మాల్యభూషణంబులఁ గైసేసెఁ బొలఁతి యొకతె, రాజులమె యంచు నమ్మునిరాజు సెలఁగ.
ఇవ్విధంబున రుచికమునీంద్రచంద్రుఁ, బెండ్లికొడుకును జేసినఁ బ్రేమమీఱఁగన్యకామణి సకలశృంగారములను, చెలులు గైచేసి రటమున్ను చెలువుమీఱ.
అట గాధిభూపాలుఁ డత్యంతముదముతో జాతిముత్యపుపెండ్లిచవికెలోనఁదోరమై మంగళతూర్యఘోషంబులు భూనభోంతరముల బోరుకలఁగఁబాటలగంధులు పాటలు పాడంగ మమతతో రుచికుపాదములు గడిగిమధుపర్క మొసఁగి సమ్మతి సత్యవతిఁ దనపుత్రికామణి ధారవోసి యిచ్చి
యంత నాల్గుదినంబులు నైనపిదప, భూరిమణివస్తువాహనభూషణంబులరణముగ నిచ్చి యల్లుని నాఁడుబిడ్డఁ, దనపురంబున నిల్పఁ జిత్తమునఁ దలఁచి.
అనఘా మానసశుద్ధి గల్గిన నరణ్యానిం బ్రవర్తిల్లుటల్గనకాగారమునందు నుంట సరియేకాదే తమోదూరుఁడైజనకుం డేలఁడె భూమి మీ రటులు నస్మత్పట్టణాభ్యంతరంబునఁ గొన్నాళ్లు వసించు టొప్పదె యన న్భూమిసురుం డిట్లనున్.
మంచిది సార్వభౌముని కుమారికకు న్వనవాసఖేద మెట్లించు నటంచు నెంచి వసియించెద నట్లనె దీన నేరమేమంచుఁ దదీయపట్టణమునం దొకకాంచనమందిరంబునంజంచలనేత్రతోడఁ బతి సల్పె సమస్తగృహస్తధర్మముల్.
గురుకుచకుంభము ల్గదలఁ గ్రొవ్వెద జాఱఁ గడాని కమ్మక్రొమ్మెఱుగులు దళ్కుచెక్కులను మించ మిటారపుఁగల్కి చూపులం
దొరసిన సిగ్గుతో నళుకుతో సతతంబును గ్రొత్తపెండ్లికూఁతురు పరిచర్య సేయఁ బతి తోరపువేడ్క నొనర్పు సత్క్రియల్.
ఔపాసనంబున కక్షత ల్దెమ్మన్న తఱినిచ్చు నపుడు తత్తఱము పేర్మినౌనటే నైవేద్య మాయెనాయన నాయె ననక పదార్థంబు లునుచు నేరుపడుగకమున్న మాఱిడఁ దెచ్చి యాతఁ డేమాత్రంబు వలదన మగుడు సిగ్గుమడుపులన్నియు నొక్కమఱి యిచ్చి భుజియింపఁ జనుమన్న నొండొం డొసంగు ప్రేమ
విశ్రమింపఁగ శయ్య గావించు నెనరు, వీజనం బల్లనల్లన విసరు మమతయొయ్యనొయ్యన పాదంబు లొత్తు బత్తిఁ, బతినిఁ జొక్కింప మెలఁగు నప్పద్మగంధి.
అంతట నొక్కనాఁ డాగాధినృపపత్ని పతిని కోలాటంపుప్రతిమజోళ్లతీరైనమంజిష్ఠితెరతోడి పచ్చలపల్లకి యెక్కి ప్రాభవము మెఱయనిరువంక నుడిగంపువిరిఁబోండ్లు రా నన్నగళుముందిసందడిఁ గడలక్రొత్తరంగులఱవికెలు బంగారుపూకొప్పెసవరము ల్వగవగ సన్నచీర
లద్దము ల్పరిమళములు నాది గాఁగఁ, బెట్టియలతోడ రాఁ దనపట్టియున్ననగరి కేతేర నారాజనందనియును, మోదమునఁ దల్లిపాదాబ్జములకు మ్రొక్కె.
మ్రొక్కినను లేవనెత్తి యమ్ముద్దుఁగూఁతు, నక్కునను జేర్చి యో యమ్మ యగ్రవర్ణుచెట్టపట్టియు దండంబు పెట్టఁదగునె, రాచవారికి నంచు నారాజవదన.
నునుసిగ్గునఁ దలవంచిన, తనయకు వస్తువు లొసంగి తపనీయగృహంబున నొక్కరత్నపీఠిని, నెనరుగఁ గూర్చుండి యిట్లనియెఁ గూఁతురికిన్.
కన్నియ నేఁడు నీముఖవికాసము దెల్పె సమస్తసౌఖ్య మైన న్నిను వేఁడ వేడుకగు నాథుఁడు నిచ్చలు నింగితజ్ఞుఁడైమన్నన సేయునే తెలుపుమా యెలఁబ్రాయపుముద్దుఁగూఁతు మేలెన్నక యిచ్చితిం జడున కేనని నీజనకుండు చింతిలున్.
అనిన నేమనకున్న సత్యవతిఁ జూచి, సఖులు దెల్పఁగరాదఁటే జననిచెంతసిగ్గువడ నేల మాతోడఁ జెలగి చెలఁగి, పతి చతురుఁ డంచుఁ దెల్పుదే ప్రతిదినంబు.
అమ్మ యిది దెల్పకున్న నేమాయె వినుము, తనమనోహరు సాటిగా రనుచుఁ బలుకునింద్రుఁ జంద్రుని నెడఁబాయ దింతతడవు, నేమి మంత్ర మెఱుంగునో ఋషిసుతుండు.
అన విని యంతెచాలుఁ జెలులార మహాత్ములు గారె తాపసుల్వనితల కింపు సేయఁదగువైఖరిఁ గూడి మెలంగఁజాలరేయనిశము నవ్వనేల యని యాకుశనాభకుమారపత్ని తత్తనయను గౌఁగిలించి ప్రమదంబున నిట్లనియె న్మృదూక్తులన్.
కన్య నినుఁగన్న కతమున ధన్యమయ్యె, నాకులంబంతయును నైన నాకులంబుగాకమానదు నామది నాకుబలెనె, నీకుఁ దనయుండు లేమికి నీరజాక్షి.
పతి వేఁడికొనుము పుత్రుని, నతులతపోన్వితుఁడుగాన నతఁ డొసఁగెడియాసుతుఁ డుభయకులంబునకుం, గతి యొసఁగెడి ననుచుఁ దెల్పి క్రమ్మఱఁ జనియెన్.
బాలిక నాఁటి రేయి పతిపజ్జకుఁ బోయి పయింటకొంగు కెంగోల బిగించుచు న్నెలను గేరెడు లేనగుమోము వంచి వాచాలతఁ జూపలే కిగురుచాయల మోవి గదల్పుచున్న నీలాలక చెట్టపట్టి తనయంకమునం దిడి మౌని యిట్లనున్.
యేమి యడుగంగ వచ్చితి వింతలోన, సిగ్గుపడ నేల తెల్పవే చిగురుఁబోఁడియెద్దియైన ఘటించెద నే నటన్న, జననివాక్యంబు సతి దెల్ప మునివరుండు.
కని పెంచువయసు గాదే, తన కేటికి లేక పోవుఁ దనయుం డిఁకనీకును నీజననికి నుత్తమ, తనయులు గల్గుటకుఁ జర్వుఁ దగఁ గావింతున్.
అని యున్నతఱిని భృగుముని, సనుదేరఁగ రుచికమౌని సతిమణికలశంబునఁ బన్నీరము వంచఁగ, జనకుని పాదములు గడిగి సంతస మెసఁగన్.
చౌకమై మించు దంతంపుఁజవికెలోన, రత్నమయపీఠిపై నుంచి ప్రకటభక్తిపొసఁగ బంగారుపువ్వులఁ బూజ సేసి, వినయమున డాసి వీవన విసరుచున్న.
వేడుక మీఱఁగా విభుని వీవన గైకొని చల్లతెమ్మెరల్గూడఁగ మెల్లనే విసరు కోడలి వల్లభభక్తి యెందునుంజూడని సద్గుణంబులును జూచి ముదంబున నమ్మునీంద్రుఁ డిట్లాడె వధూమణీ యడిగినర్థ మొసంగెద వేఁడు మీ వనన్.
వనజముఖి పలుకకున్నం, దనతల్లికిఁ దనకు మంచితనయులు వలెనంచును వేఁడె నిన్న రే న, న్నని రుచికుఁడు దెల్ప సతి త్రపాన్విత యగుచున్.
తలఁగిపోయిన భృగుమౌని తనయుఁ జూచి, యాత్మజులు గల్గుటకు నుపాయంబు దెల్పిశముల కేటికి నృపనివేశములఁ బుత్రుఁ, బడసి వని నుండు మీ వని పలికి చనిన.
అంతట భార్గవుండు తనయంగనఁ గన్గొని సి గ్గి కేటికేయింతిరొ నీదుకోర్కి ఫలియించెను నీజనయిత్రి నీవు ఋత్వంతమునందుఁ బిప్పలము నత్తియుఁ గౌగిట నొత్తి రండు నాచెంతకు నీకు నేఁజరువుఁ జేసి యొసంగెద నంచుఁ బంచినన్.
సరభసముగ సత్యవతీ, తరుణీమణీ యవ్విధంబుఁ దన కెఱిఁగింపంబరితోషంబున నరవర, సురపతిసతి ఋతువు కెదురుసూచుచు నెలమిన్.
మును దాను గడకుఁ బోయినదినం బాధిగాఁ దెచ్చుక దినమును దినము లెన్నుమధురము ల్ప్రియమైన మాని భోజనవేళ సారెకు నావపచ్చళ్లు మెసవుఁదుఱుమున నొకపువ్వు దుఱుము నెచ్చెలియోర్తు తెఱవ పుష్పవతి వైతి వన బ్రమయునలవోకఁ దొడమీఁదివలువ కుంకుమకఱ్ఱ గనుఁగొని తొలఁగితి ననుచుఁ దొలఁగుఁ
దెలిసి కాకున్న వగచు నజ్జలరుహాక్షి, యంత నెలయైన ఋతువైన యాత్మజయునుదాను మూన్నాళ్లు మూఁడేండ్లుగాను గడపి, నాలవదినంబునందు స్నానములు చేసి.
నిబ్బరంబగు నబ్బురపు సంతసపు కబ్బినుబ్బి తబ్బిబ్బగు నబ్బిబ్బోకవతులు రుచికుండాడినక్రమంబు వోనాడి వాఁడిచనుమొనలు గాఁడిపాఱఁ బుడమిఱేనిపూఁబోఁడి మేడియును రుచికమునిలికుచకుచ రావియును గౌఁగిలించి పసుపాడినరాచిల్కలవడువున నడివీథి నడతేరునపుడు తమరాక మునుగల్గ సౌవిదల్లులవలనవిని చంకలనిండ పసిబిడ్డలు గల్గుతల్లులు సరగమఱుఁగున కరుగ మందిరంబున కరిగి.
మౌనిపతి బ్రాహ్మనక్షత్రమంత్రములను, జరువు గావించి యటయుంచి సవిథ నదికిఁజనిన నావేళ మెసవిరి తనయచరువు, జనని జనయిత్రిచరువుఁ దత్తనయ పదరి.
అంతట మౌని వచ్చి యది యంతయు నాత్మ నెఱింగి కిన్కతోగాంతరొ నీదుగర్భమున క్షత్రకులాంతకరుండు పుట్టెడిన్శాంతిధనుండు బ్రహ్మఋషిచంద్రుఁడు పుట్టెడి నీదుతల్లికిన్భ్రాంతిని నీ వొనర్చినవిపర్యయ మిట్లు ఫలించు నావుడున్.
భయపడి యంత సత్యవతి భర్తపదంబుల వాలి రాజహుండయినకుమారునొల్ల సదయాత్ము నొసంగు మటంచు వేఁడినన్దయ ముని నీసుతుండగు నుదాత్తుఁడు దత్తనయుండు ఘాతుకుండయి జనియించు నీజననియందు మహర్షివరుండు పుట్టెడిన్.
అని పల్కిన ముదమందిరి, వనితామణు లంత సత్యవతి జమదగ్నింగనియె జగత్త్రయసజ్జన, వినుతుని నృపపత్ని గనియె విశ్వామిత్రున్.
విశ్వామిత్రుఁ డమిత్రభీకరభుజావార్యం బవార్యంబుగావిశ్వం బేలి వసిష్ఠమౌనిపతితో విద్వేషియై యంతటన్శశ్వద్బ్రహ్మఋషిత్వముం గనియె సాక్షాద్బ్రహ్మదేవాగ్రణీవిశ్వేశాదులు సన్నుతింపఁగ జగద్విఖ్యాతశీలంబునన్.
జమదగ్నిమునియు సకలా, గమనిగమపురాణశాస్త్రకలనాచణుఁడైశమదమయమనియమాదిమ, సమధికగుణశాలి యగుచు సన్నుతి కెక్కెన్.
అక్కాలంబున.
రేణుకభూపకుమారి క, రేణుక గుణగణనగణ్య ఋక్షధరిత్రీరేణుకగతి జితసమదక, రేణుక విలసిల్లు రూపరేఖలకలిమిన్.
ఆకన్నె రౌచికుఁడు పాణౌకృతఁ గావించి కాంచె నలుగురసుతులన్శ్రీకాంతుఁ డైదవసుతుం, డై కూరిమి నెఱపె నతని కవనీనాథా.
అనవుఁడు నమ్మునిఁ గనుఁగొని, జనపతి యిట్లనియె శౌరి జమదగ్నికి నందనుఁడై జనియించుట కే, మి నిమిత్తం బనిన మౌని మృదుగతిఁ దెల్పెన్.
నారదమౌనిచంద్రుఁ డొకనాఁడు వినోదము గాఁగ నాసహస్రారముఁ జేరి భాస్కరసహస్రనిదర్శన యోసుదర్శనావైరి నిశాటకోటి ననివారణ ద్రుంచుట నీదుశక్తియోసారసపత్రనేత్రు భుజశక్తియొ మా కెఱుఁగంగఁ జెప్పుమా.
అనవుడుఁ జక్రమూర్తి కమలాసనసూనునిఁ జూచి నవ్వుచున్విను మొకమాట దెల్పెద వివేకముతోఁ జలవాహనిర్గ తాశని గిరిభిన్న మౌట పవిశక్తియొ యల్లపయోదశక్తియోకనుఁగొను మట్ల శౌరి యొక కారణ మేన హరింతు శత్రులన్.
అన విని శౌరిఁ జేరి కలహాశనుఁ డబ్జపలాశలోచనాదనుజవరేణ్యఖండనము తావకశక్తియొ చక్రశక్తియోయనవుఁడుఁ జక్ర మేమిపని యస్మదుదారబలంబెకాక వింటను హరియించెనో యసి నడంచెనొ వైరుల నీ వెఱుంగవే.
అనిన న్వెన్నునిఁ జూచి మౌని కమలాక్షా నీవు నీశక్తియంచును నీచక్రము వేఁడిన న్స్వబలమంచుం బల్క నిందేదియొక్కొ నిజంబన్నను నవ్వి యట్లయిన నీకుం దేటఁగా నింక నేనును ధాత్రిం జనియింతుఁ బోరుటకుఁ దానుం బుట్టుగా కుర్వరన్.
అని పద్మాక్షుఁడు పంపఁ జక్రము హసాదంచుం బ్రమోదంబు మీఱను మాహిష్మతి నేలుచున్న కృతవీర్యక్షోణిపాలాగ్రగణ్యునకుం బుట్టె సహస్రబాహులయి నైజోగ్రారము ల్మించ నర్జుననామంబున ధీరతానుగుణతాశూరత్వము ల్శోభిలన్.
అణుమాత్రేతరభక్తియుక్తుఁడయి దత్తాత్రేయు సేవించి యయ్యణిమాద్యష్టవిభూతులం బడసి సప్తాంభోధిసంవేష్టితాగణితోర్వీస్తవసప్తకక్ష్యగృహరక్షాలీల రక్షించెఁ దారుణుఁడై తోఁచుచు నెందు యోగమహిమం గ్రూరాత్ములం ద్రుంచుచున్.
మఖభోక్తలయజీర్తి మాన్పఁగా వేలుపువెజ్జు మందులు సారె వెతకసాగెహోమధూమంబుల నుబ్బుమబ్బులు మరున్నేత్రశృఙ్ఖలలలో నిల్వవయ్యెవివిధకాంక్షలఁ జెంది ద్విజులు గృతార్థులై దేవతాతతులఁ బ్రార్థింపరైరియెడలేదు నువుగింజ యిడఁగ సప్తద్వీపములయందు యూపము ల్పొదలుకతన
నర్జునక్షోణిపాలకుఁ డహరహంబు, సేయుయాగంబుల నతండు సేసినట్లుధర్మములు చేసినట్టి భూధవునిఁ గాన, భూతభావిభవత్కాలముల నరేంద్ర.
ఉడురాజముఖులతో నొకనాఁడు జలకేళి సవరించుచును విలాసంబు గాఁగఁజేతులచేత రేవాతోయములు గట్టి యొకయిన్ని యవ్వలి కుబుకనీకయంతట విడువ నయ్యంబుప్రవాహంబు సైకతలింగపూజన మొనర్చురావణు ముంప విభ్రాంతుఁడై కోపించి కలహించి వచ్చినఁ గాంచి నవ్వి
వానిఁ గొని చని చెఱసాల వైచె నంతఁ, బౌత్రునకుఁగాఁ బులస్త్యుండు బ్రార్థనంబుసేయ దశకంఠు విడిచె రక్షితరణాహృ, తార్జనుం డగు కార్తవీర్యార్జనుండు.
మఱియొక్కనాఁ డల్ల మహిపుకొల్వున కొక్కబ్రాహ్మణుఁ డరుదెంచి పార్థివేంద్రయాఁకలిగొంటి నే నడిగినయన్నంబు పెట్టింపు మనవుఁడు బ్రీతి నతఁడునటువలెఁ బెట్టింతు ననిన నే దహనుండ నీదేశ మాహుతి యి మ్మటన్నబొంకక చావెంటఁ బోవుచు శిఖి నార్చువారి వారించుచు వనులు పురము
లాదిగాఁ గాల్పనీయ నిజాశ్రమంబు, దగుల వగచుచు వరుణనందనుఁడు రామదళితభుజుఁడవు గమ్మని యలుకఁ బలుక, యులికి యంతట నర్జునుం డుండెఁ బురిని.
హరియును రేణుకాజలరుహాయతనేత్రకు జమదగ్ని నాధరిణి జనించి జాత్యుచితతాపసవేషము మీఱ శూరుఁడైపరశువుఁ బూని మౌనిజనబాధకసింహహయద్విషన్మృగోత్కరకిరిముఖ్యసత్త్వముల దైత్యులఁ ద్రుంచుచునుండె నెల్లెడన్.
అట నొకనాఁడు రేణుక మహర్షిపురంధ్రులతోడఁ గూడి యెప్పటివలె గంగ కేగి యతిపావనతీర్థము లాడి యన్యదుర్ఘటముగ వాలుకాపటలి గట్టి ఘటిన్ ఘటియించి నీటితోఁగటితటినుంచిఁ దోవతులు గాలికిఁ బైనడతేర వచ్చుచోన్.
అలతి జక్కవపిట్ట లంచుఁ బట్టితిఁ గాని గుబ్బలం చెఱుఁగనే కోమలాంగినునునాచుతీవియ యని యెడిసితిఁ గాని వేణియం చెఱుఁగనే విద్రుమోష్ఠిసుడి యంచు మునివ్రేళ్ళఁ బుడికిచూచితిఁ గాని నాభియం చెఱుఁగనే నలినగంధితామరవిరి యంచుఁ దావి గ్రోలితిఁ గాని మో మంచు నెఱుఁగనే ముద్దులాఁడి
యంచు నర్మోక్తిఁ జెనకుచు మించుఁబోండ్లఁ, గూడి జలకేళిఁ గావించు కోడెకానితలిరువిల్కాని నగుచక్కఁదనమువాని, నొక్కగంధర్వుఁ గాంచి యయ్యుత్పలాక్షి.
ఏమే రేణుక కూడిరాఁగదవె నీ వెవ్వారి నీక్షించెదేమామాట ల్వినవే య టంచు మునిభామారత్నము ల్బిల్వ నో
హో మీ కెంతటితీవ్రమే నిలువరే యొక్కింతసే పంచు నక్కామిన్యుత్తమ నిల్చెఁ దోడిసతు లేగ న్వాని వీక్షించుచున్.
మఱియు మఱియును వానిమన్మథవికార, ముల విలోకించుచును వేఱెతలఁపు లేకబ్రమసి యనురక్తయై యున్న పంచబాణ, కాండ మగలించె ననఁ గటిఘటము పగిలి.
జలములఁ జేలము దడసినఁ, జెలి యది యపు డెఱిఁగి యకట చేసడలె నటంచలగంగయిసుక నెప్పటి, వలె ఘటముం జేయఁబోయి వస గాకున్నన్.
తనపాతివ్రత్యంబున, కును భంగము వచ్చెనేలొకో యని చిత్తంబునఁ దలఁచుచు గుండియ జ, ల్లన నిఁక నే నెందుఁ జొత్తు నని నతివగతోన్.
నానారీతులఁ బిల్చు నెచ్చెలుల వెంటం బోవ కేనూర కేయీనిర్భాగ్యు ని టేల సూచితిని నా కీభంగపాటొందె నేలా నాపాలివిధాత నానొసట వ్రాయంబోలు నీరీతి నింకేనేమందును గంగలోఁ బడుదునో యీదుర్యశం బింకఁగన్.
అనుచుఁ జింతించుచును రిక్తహస్తములను, గదియవచ్చిన యిల్లాలిఁ గాంచి నాథుఁడెంతప్రొ ద్దాయెఁ బోయి నీ వింతతడవు, నెచట నుంటివి జలఘటం బేది యనిన.
ఏమన నేరక యూరక, కామిని తలవంచికొనినఁ గపటజ్ఞుండౌనామునికి వచ్చెఁ గోపం, బేమాత్రమొ నాటికోప మీశ్వరుఁ డెఱుఁగున్.
జటివరుఁ డిటువలెఁ గనలుచు, జిటచిటనిప్పుకలు సెదర జిగికనుఁగొనలండటతటకటతటు లదరఁగఁ, గిటకిటమన రదనపటలి గీఁటుచుఁ బలికెన్.
ఔనే యోసి దురాత్మురాల నిను నిల్లా లంచు నే నమ్మియుంటే నీ విట్టు దురాశఁ జెందఁదగునే నీభోగము ల్సెల్లునేకానిమ్మంచును రుక్మవంత యిదిగోఁ గన్గొంటి దుశ్చేష్టితన్దీనిన్ ద్రుంపుము శస్త్రపాణివయి మాతృస్నేహ మింకేటికిన్.
అనిన శ్రీరామరామ యటంచు మౌని, నందనుఁడు హస్తములను గర్ణములు మూసియెంతమా టానతిచ్చితి రింత సేయ, నేమి నేరంబు గావించె నీపురంధ్రి.
అని మఱియు స్వేచ్ఛాగర్భవతు లగుసతులసైతంబు నోర్చి కూర్చుకొనుబృహస్పతిప్రభృతుల వినమే యట్టికాయికదోసం బణురేణుమాత్రం బీరేణుక
యందు లేదుగదా మానసికదోషంబునకుం దగినప్రాయశ్చిత్తంబు చిత్తగించుటయుత్తమం బిది నీచిత్తంబునకు రాకున్న నిమ్మత్తకాశిని వర్జించు టంతియకాకక్రూరకర్మంబు బ్రాహ్మణునకు ధర్మంబు గాదని పలుకు రుక్మవంతుతోఁ గూడవివస్వత్సుషేణవిశ్వావసులను మువ్వురుసుతు లట్ల పలికిన దురాధర్షామర్షంబుననమ్మహర్షి దురాత్ములారా మాకు ధర్మోపదేశంబు సేయవచ్చితిరే యలంఘ్యమద్వచనోల్లంఘనదోషంబున నజ్ఞానులై వనజంతుసంతతులం గూడి తపింపుండనిశపించి యాముని చెంతనున్న పరశురాము విలోకించి నీవైన నీచంచలాత్మఁద్రుంచెదవో లేదో యని యడుగ గడగడ వడంకుచు కేలు మొగిచి మీరు నొడివినవడువున నడంచెద ననిన తడవు సేయకు మని తండ్రి తరువిడఁ బెల్లడరునడలున భార్గవుం డనర్గళధారాకఠోరంబగు కుఠారంబు దెస చూచినఁ గని కొడుకులారా మిమ్ము నెడఁబాసిపోయెదనని కన్నీరు నించుతల్లిం గాంచి రుక్మవంతుండు మొదలైన నలువురుసుతులు మాతృస్నేహంబువలని దుఃఖావేశంబునజననికంఠంబు వట్టికొని తోఁబుట్టువుల మమ్ము మొదట మట్టు పెట్టి మఱిమీఁదటమాతృశిరంబుఁ గొట్టి కీర్తిఁ గట్టుకొమ్మని బెట్టు చలపెట్టిన వారల నెట్టు విడిపింపలేక పరశ్వధాయుధుండు దనమోము చూచిన జమదగ్ని యగ్నివిధంబునబగ్గున మండిపడి రుక్మవత్ప్రభృతుల మున్నుగా హతులం గావించి పిదప రేణుకను దెగవేయు మని త్వర పెట్టిన బెట్టుల్కి యిట్టికట్టిడితనంబున కొడిగట్టుటకెట్టిపాపంబు చేసితినో యని యెదఁ బట్టుసాలక నెట్టుకొనుదట్టపు నెవ్వగనిట్టట్టె యెట్టకేలకు నొడంబడి దిట్టతనంబునఁ దనతోఁబుట్టువుల నొకరొకరిఁజెట్టవట్టి కడకు రాఁదిగుచుచు వారు తమ్ముఁడా నీ కిది ధర్మంబు గాదని వాపోవుచు నొకకేల మాతృకంఠంబు విడక నొకకేల నొడ్డించుకొన నొడ్డారంబుమానక గండగొడ్డంట నన్నలువుర న్నలజడ్డిగంబులు దెంచిన దిగువంబడ్డతత్కళేబరంబులపై వాలి వారిబిడ్డలు నిల్లాండ్రు కన్నీరు మున్నీరైదొరుగ నురంబులు శిరంబులు మోదికొనుచు బహువిధంబుల విలపించుచుఁ గట్టా యిట్టిశోకం బెట్టు భరింపఁగలవారము రామాపరశ్వథంబుననే యిఁక మావధంబునుం గావించి యధిపులం జేర్చి యధికపుణ్యపదంబునం బొమ్మని వేఁడుకొనిన నట్టిక్రూరకర్ముండ నౌఁగదా యని రెట్టించువగరైణుకేయుండు దల్లికిం బ్రణమిల్లి యమ్మా భావంబున నిష్టదైవంబుఁ దలంచుకొమ్మనిన నమ్మానిని నాకింక నితరదైవం బున్నదే యని పతికి నమస్కృతి చేసిమహాత్యా మనోవాక్కాయకర్మంబులు నీవ దైవంబని యుండుదుం గాని యొండెఱుంగఁ బురాకృతవశంబున నిప్పు డిట్టిమానసికదోషం బనుభవించితి నీదోషంబుమరణాంతప్రాయశ్చిత్తంబున నివృత్తంబు గావించి నాజన్మజన్మాంతరంబులు మీకే
దాసినై పరిచర్య సేయుటకు ననుగ్రహింపుం డని పునర్వందనంబు చేసి కరగతపరశుధారాభీముం డగుపరశురాముం గనుంగొని కుమారకా క్షణభంగురంబైన యీశరీరంబునకుఁగా విచారంబు వలదు జనకవాక్యోల్లంఘనంబున రుక్మవదాదు లిట్లయిరి గదా నీవైన జనకవాక్యప్రతిపాలనంబున దీర్ఘాయుష్మంతుఁడవైకులంబు నిలుపుమని రేణుక పద్మాసనాసీనయై పుత్త్రా యన్యుల నియమింపక నాపతి నిన్ను నియమించి మేలు చేసెఁగనుక చెదరక ధారదప్పక యొక్కపెట్టునం దెగనఱకు నీనరుపు సూతమను మాత తెగువ సూచి తల్లి తెగనఱకుమంచుఁ బెంచితివే యీ చేతులంచుఁ బలపలకన్నీరు నించి యొడలు గడగడవడఁక జమదగ్ని దురాగ్రహదుర్గకుం బలివెట్టుచందంబున నెట్టకేలకు గేలికుఠారంబున రేణుకశిరంబు గఱుక్కనం దెగనఱికినఁ దలమిడిసి యల్లంతటంబడియెఁ దత్కంఠనాళంబునజుల్లున రక్తంబు వెడలునప్పుడు హాహాకారంబులు సేయువారును రేణుకవలన నేమిపాపం బిది యధర్మం బనువారును నిట్లయిన స్త్రీల కింకఁ బాతివ్రత్య మతిదుర్లభంబనువారును ఋషుల కింతరోషంబు చెల్లునే యనువారును పరశురాముం డతిక్రూరకర్ముండు పొమ్మనువారును రాముం డేమి సేయుఁ దండ్రి సెప్పినయట్లు సేసెననువారును దండ్రి ముది ముది తప్పు సెప్పిన నకార్యంబు రామునకుం జేయఁదగునే యనువారును జేయకున్న నన్నలపా టొందఁడే యనువారును నెట్టిపా టొందినఁదా నేమి యిట్టి క్రూరకర్మంబున కొడిగట్టఁదగునే బ్రాహ్మణున కనువారును వీరెక్కడి బ్రాహ్మణులు జన్మాంతరంబున బోయ లనువారును బోయలైనం దమవారిందెగఁజూతురే యనువారును నిట్టియుత్కృష్టకర్మంబున జమదగ్ని కిచ్చటనె యనుభవంబునకు రాకపోవునే యనువారును జమదగ్ని సర్వజ్ఞుం డతఁ డెఱుఁగడేయిది యెట్టి ధర్మసూక్ష్యంబో యనువారు నైరి యయ్యాశ్రమవాసు లయ్యెడగరుడగంధర్వసిద్ధవిద్యాధరాదులతోఁగూడ బ్రహ్మరుద్రేంద్రాదు లంబరంబుననిల్చి యాసాహసకర్మం బద్భుతం బని చూచుచుండి రయ్యవసరంబున.
బళిబళి నిన్ను మెచ్చితి నపారభుజాబలధామ రామ నీవలయు వరంబు వేఁడు మనివారణ నిచ్చెద నన్నఁ దండ్రిపజ్జలజములందు వ్రాలి మునిచంద్ర యొసంగుము జీవితంబు లన్నలకును నాదుతల్లి కనినం జమదగ్ని ప్రహృష్టచిత్తుఁడై.
వారివారితలలు వారివారికబంధ, ముల నమర్పఁబంచి మునివరుండుగరకమండలూదకములు పైఁ జల్లిన, సుతులతోడ బ్రతికె సతియు నంత.
నిద్దురవోయి లేచుగతి నీరజలోచన లేచి నవ్వులేముద్దుమొగంబుతోఁ బతికి మ్రొక్కి పదానతులైన పుత్త్రులందద్దయుఁ గౌఁగిలించి మునిదారలతోఁ దగ సుద్దులాడుచున్నిద్దపువేడ్క నందఱను నివ్వెరపాటున ముంచె నత్తఱిన్.
విరిసోన గురిసె మొరసె, న్సురదుందుభు లపుడు మిగులఁ జోద్యము లనుచుంబరితోషంబున వేలుపు, దొర లెన్నిరి వందిమాగధులవలె నంతన్.
జమదగ్ని యొసఁగె రామున, కమితభుజాబలము సంగరాంగణవిజయంబమరనరాజేయత్వము, నమరత్వము లోనుగాఁగ నఖిలవరములున్.
హరశిష్యుండై సురరిపు, హరణం బొనరించి శివుదయన్ దివ్యాస్త్రోత్కరముఁ గని గుహునిపై మ, చ్చరమున భేదించెఁ గ్రౌంచధర మొకకోలన్.
అంతటఁ గార్తవీర్యార్జునుం డొకనాఁడు వేఁటలాడఁగ వచ్చి విపినవాటిగజగండభేరుండఖడ్గాదిదుష్టసత్వములను ఖండించి శ్రమము మించిజమదగ్ని యాశ్రమస్థలముఁ బ్రవేశించి యతఁడు విందొనరింప నారగించికామధేనువుఁ గాంచి కలుగదొకో యిట్టి యావు నావంటిజనాధిపతికి
నంచు నెంచుచుఁ బురమున కరుగ నతని, చిత్త మెఱిఁగి కుమారు లుద్వృత్తు లగుచురాముఁ డట లేనివేళ నాశ్రమము సొచ్చి, కామగవిఁ దెచ్చి తమయింటఁ గట్టికొనిరి.
ఆవార్త ల్విని భార్గవుండు పటురోషావేశసందీప్తనేత్రావిర్భూతహుతాశనప్రభవధూమాకారఫాలస్థలవ్యావల్లద్భ్రుకుటీమహోగ్రుఁడయి దోరంచత్కుఠారంబుతోవే వచ్చె న్నగరాటవీజనపదాన్వేషంబు గావించుచున్.
అల గాధేయుఁడు చక్రవాళకులశైలాంభోధిదేవాప్సరోలలనాదిప్రతిసృష్టి చేసె నన సాలంబు ల్మహాసౌధరాజులు ఖేయంబు నృపు ల్సుతు ల్మొదలుగా సొంపొందు మాహిష్మతిందిలకించెన్ భృగురాముఁ డద్భుతరసోన్మేషానిమేషంబుగన్.
కని యౌరా కృతవీర్యనందనునిభాగ్యం బంచుఁ దద్గోపురంబున నుగ్రాకృతి నిల్వ నచ్చటిజనంబు ల్పర్వుతోఁ బోయి యర్జునభూభర్తకుఁ దెల్ప నాతఁడు గడుం జోద్యంబుతోఁ దోడితెమ్మనుచు న్నైజపురోహితుం బనుప నయ్యార్యుండు శీఘ్రంబునన్.
ఎదురుగా వచ్చి నృపతి మిమ్మిపుడు తోడి, తెమ్మనియెఁ బ్రేమ భృగురామ రమ్మటన్నభార్గవుఁ డనర్గళాగ్రహభర్గపటిమ, నిట్లనుచుఁ బల్కె నృపపురోహితునితోడ.
మే మేటికి వచ్చెద మటు, కామగవిం దెచ్చి యొసగు గ్రక్కున ననినన్భూమిసురుఁ డెఱిఁగి ధరి, త్రీమండలపతికిఁ దెల్ప ధీరత నతఁడున్.
తనయులకుఁ జెప్పి పంపిన, విని వార లొసంగ మనిన విభుఁడు సుతులఁ గాదనలేక గోసహస్రము, వినయంబున నొసఁగఁ బనుప విప్రుఁడు నటులున్.
ఒసఁగినఁ గనుఁగొని కనుఁగొన, నెసఁగిన కెంజాయ పొసఁగ ఋషిపతి మద్ధేనుసమానులె యీధేనులు, మసారమున కెనయె గాజుమణు లెన్నైనన్.
వలదు పొమ్మన విప్రుఁ డావార్తఁ దెలుప, విని నృపాలుఁడు మాతోడ వికటమేలవిప్రుఁ డేమాత్రముననైన వేడ్కఁ జెంద, వలయు ననుమాట వినఁడె భూవలయమునను.
అటులు గాకున్న దనయిచ్చ యాత్మజులకుఁ, జెప్పి పంపిన విన రేమి సేయువాఁడననిన నామాట విప్రుచే నాలకించి, యేల కించిత్తు న న్నెంచఁ డితఁ డటంచు.
మున్నుగ ద్వారరక్షుల సముద్ధతసంగరరంగదక్షులన్ఛిన్నుల సేయు భార్గవుని సేనలు గూడి యెదుర్ప భూధరాభ్యున్నతమత్తదంతిహయతుంగశతాంగభటప్రతానమున్ఛిన్నము చేసె రాముఁ డతిభీమకఠోరకుఠారధారలన్.
అంత హతశేషమైన సైన్యంబు గొంత, యెంతయును భీతి నేఁగె దిగంతములకునంతయును విని రోషితస్వాంతుఁ డగుచుఁ, జింతఁ జేయుచు మేదినీకాంతవరుఁడు.
తనచేతనున్న చాపముఁ, బనిచి నిషంగంబు మెట్టఁబనిచిన నదియుంజని గొనయ మెక్కి చాపము, దనయంతనె సంధిలె న్శితప్రదరములన్.
సంధిలుచు భూనభోంతర, బంధురత న్నిగుడు బాణపంక్తులు దునిమెంగంధరగణముల సప్త, స్కంధముగతి రాముఁ డల్ల చాపము దునిమెన్.
చాపము దునిసిన నిషునిధి, రోపంబులు వెడలి తనదు ఱొమ్మగలింపంగోపంబున భృగుపతి ప్రతి, రోపంబుల నృపునిశరధి రూపఁడగించెన్.
అంతట నర్జునుం డనుప నాయుధము ల్బహురూపధారులైయంతకదండదారుణములై శతకోటిశితంబులై యహఃకాంతకరోజ్జ్వలంబులయి కాలమహాభుజగాదిరాజదుర్దాంతములై హుతాశనకరాళములై తనపైపయిం బడన్.
పరశువున రాముఁ డన్నిటి, నిరసింపఁగ నృపతి యణిమనేర్పున నణువైపరికింపఁగ వచ్చిన దనుఁ, బరమమహాయోగి దెలిసి పట్టఁ దివురుటన్.
దివి భువి నిండియున్న ఘనదేహము మేరులసత్కిరీటమున్వివిధవిభూషణంబులును వేయివిధంబుల నాయుధంబు లత్యవితథతేజము న్మహిమ నంది త్రివిక్రముఁ బోలియున్న నయ్యవనిపుఁ జించె నంచితశరావలి రాముఁ డచంచలాత్ముఁ డై.
గరిమ ధారుణిఁ ద్రొక్కె దిక్కరులు మ్రొగ్గం గట్టు లిట్టట్టుగాధరణీవల్లభు డంత భార్గవుఁడు తత్పాదంబు నుగ్రాశుగస్ఫురణ న్మించిన ఖడ్గఖేటధరుఁడై భూమిళుఁ డత్యాశుగత్వరతో మింటఁ జరించుచున్ లఘిమచే దర్పం బనల్పంబుగన్.
ఖగగతి వ్రాలి ఖరాసి, న్భృగురాముశిరంబు వ్రేయ ఋషి పరశువునందెగనఱకినఁ దత్ఖడ్గము, జగతీనాయకుఁడు ప్రాప్తసౌభాగ్యమునన్.
హా యని చేయిసాఁప బహుళాయుధము ల్చెయిగూడు నన్నియున్వేయివిధంబులం దునుము వేగ భృగూద్వహుఁ డంతలోనఁ బెక్కాయుధము ల్ధరించు మనుజాధిపుఁ డంతనె త్రుంచు రాముఁడున్సాయకకోటు లేసి సురసంఘము విస్మయ మంది చూడఁగన్.
అహమిక భార్గవుఁ డిటువలె, బహులాయుధతతులఁ దునుమఁ బ్రాకామ్యమహామహిమాఢ్యుఁడు నీరమురహి, మహిలీయముగాఁ గుఠారి మహి భేదించెన్.
ఒకచోఁ దేలి మహీశుఁ డీశతగిరింద్రోద్యద్రథారోహణోత్సుకుఁడై సేనకుఁ జేయివీచిన భటు ల్శూలాదినానాయుధప్రకరంబు ల్వెలుఁగ న్భృగూద్వహుని పైపైఁబర్వ నుర్వీజముల్పెకలెం గట్టు దనంతఁదా నెగసివాలె న్రాముపై నత్తఱిన్.
నిబిడరోషజ్వాలనేత్రాగ్నిశిఖలతోఁ బటుతరోగ్రప్రతాపంబు వెలుఁగనిటలవక్రీభవచ్చటులభ్రూకుటితోడఁ గోదండదండంబు గొనయమెక్కఁగటుదంతసంఘర్షకిటకిటస్వనముతో శింజినీనినదంబు సెవుడుపఱుపద్వేషణభీషణభాషణంబులఁ గూడి క్రొవ్వాఁడితూపులు గుదులుగొనఁగఁ
జించి చెండాడె భుజబలోదంచదహిత, హైహయాధీశసేనల నగవితతులజలజములు ద్రుంచు మదమదావళము ఠేవ, రాముఁ డాహవవిజయాభిరాముఁ డగుచు.
వశితచే నంత ధారుణీవల్లభుండు, మెఱుఁగు మెఱసినరీతి భ్రమించుచుండియఖిలదిక్కులఁ దానయై యనుపమాన, మానమున నిట్టులనియె నమ్మౌనిఁ గాంచి.
భార్గవరామ నీవు నొకపౌరుషశాలివిఁబోలె మచ్చమూవర్గముతోడఁ బోరెదవు వద్దిక సాహస మస్మదీయదోరర్గళనిర్గళద్బహువిధాస్త్రపరంపర కోర్చి నిల్వఁగాభర్గుఁడఁవో ముకుందుఁడవొ పాఱుఁడ వింతియకాక పాఱుమీ.
ధరణిసురుండ వంచుఁ జెయి దాళితిగాని పరుండవైన దుర్భరశరమండలిం గెడపి భండనసీమఁ బరుండ నుంతు సం
గరముఁ ద్యజించు మింకయినఁ గాక యెదిర్చిన నోర్వఁ జెప్పితిన్దురితము లేదు నాకిఁకను దోఁచినరీతి నొనర్తు గ్రక్కునన్.
పొలుపుగఁ గొండ కట్టెలకుఁ బోయెడివానివిధంబు దోఁప గొడ్డలి యిది యేమి దీన జగడం బొనరింపఁగ వచ్చితే బళాబళ భృగురామ యన్న నరపాల నిజంబు సమిత్ప్రియుండనైనలువుగ నర్జునచ్ఛిద మొనర్పఁగ వచ్చితి నంచు రాముఁడున్.
ఔరా విప్రుఁడ నంచు నం జులకసేయ న్వచ్చితే మంచిదేరారమ్మా ధనువూని నీవయినక్షాత్రం బేను వీక్షించెదన్శూరత్వంబులు మీకె యంచు నజుఁ డెచ్చో ముద్ర గావించెనేలేరా బ్రాహ్మణశూరు నింకిటను గల్పింతు న్ననుం జూడుమా.
ప్రమథేంద్రుండు నుతింప నంపమొనచేఁ గ్రౌంచాద్రి భేదించి మార్గముఁ గల్పించితిఁ దొల్త నంచలకుఁ దత్కాండంబుల న్నీదువక్షము భేదించి మదీయకీర్తినవహంసం బెల్లచోఁ బోవ మార్గముఁ గల్పించెద నాబలంబు గను మింకం గార్తవీర్యార్జునా.
అనుచు రాముఁడు ఘనరీతిఁ దనపృషత్క, తతి సహస్రకరస్ఫూర్తి దరలఁ జేయఁబఱచె నంతట నర్జున పక్షబలము, మానసమున కధీనమై మనుజవమున.
అంతట భార్గవుండు భిదురాగ్రకఠోరకుఠారధార దుర్దాంతమహఃకృతారివనితాజనితాస్త్రము కార్తవీర్యభూకాంతభుజాసహస్రము సగర్వసహస్రము గాఁగ మించి విభ్రాంతునిఁ జేసి కుత్తుకకుఁ బాపె శిరంబున దక్షిణంబునన్.
కార్తవీర్యుఁడు ఘనసమీకార్తవీర్యుఁ, డగుచుఁ గూలిన నన్యోన్యమయుతు లగుచునతని పుత్రకు లయుతసంఖ్యాతు లెల్ల, కడల కేగిరి ప్రాణము ల్గాచికొనఁగ.
అసదృశకీర్తి కామగవి నాజి శరత్కబళీకృతార్జునుందెసలఁ జరింపఁ బంచి జగతీవరజాహృతకామధేనువున్మసలక తెచ్చియిచ్చి నృపమారణమున్ జమదగ్ని మౌని కింపెసఁగఁ గుఠారి దెల్ప నత్వ డి ట్లనియెన్ సవిషాదచిత్తుఁడై.
నిరతంబుఁ గొల్వఁడే దురితంబు లణఁగించు దానేప్సితత్యాగి దత్తయోగిభుజసీమ నిల్పఁడే నిజధామసంరక్షితాబ్ధి చతుష్కాంత నవనికాంతఁజెఱసాల వెట్టఁడె మొఱ సాల వెట్టంగఁ బ్రధనజయోత్కంఠుఁ బఙ్క్తికంఠుధృతిఁ దృప్తుఁ జేయఁడే యతితప్తుఁడై వేఁడు సకలదాహామోదుజాతవేదు
నకట సామాన్యుఁడే యణిమాదిసిద్ధి, సిద్ధకీర్తితభువనప్రసిద్ధకీర్తిస్నిగ్ధసద్గుణరత్నప్రసిద్ధమూర్తి, శత్రుసమవర్తి యర్జునచక్రవర్తి.
ఒకయావునకై నృపు నే, టికిఁ జంపితి వింతకటికిడెందము దగునేయకటా విప్రున కఘనా, శకముగ నిఁకఁ దీర్థయాత్ర సలుపుము పుత్త్రా.
అనినం గానిమ్మని పని, వినియె భృగూద్వహుఁడు కార్తవీర్యసుతులు తండ్రిని జంపిన పగ తీరుచు, కొనవలెనని పొంచియుండి క్రూరాత్మకులై.
ఒకనాఁ డాశ్రమవేదికాంతరమున న్యో గాఢ్యుఁడై యున్నయయ్యకలంకున్ జమదగ్నిఁ జుట్టుకొని చేయంటన్ జడల్సుట్టి మస్తకముం బాణి కృపాణిఁ గొట్టి ధరమీఁద న్వైచి వేచన్న రేణుక హానాథ యటంచు మోదికొనియెన్ శోకంబుతోఁ బల్మఱున్.
ఏఁటిలోపలఁ దీర్ఘంబు లెల్లఁ దిరిగి, యప్పు డచటికి భార్గవుఁ డరుగుదెంచితండ్రిఁ గనుగొని శోకదందహ్యమాన,మానసుండయి విలపించె దీనుఁ డగుచు.
కలనైనఁ బరుల కాపదఁ, దలఁపని నీ కిట్టికీడు దైవము దలఁచెందల క్రొవ్వి నేనొనర్చిన, కలుషంబున నేమి సేయఁగల నిఁక తండ్రీ.
అనుచు వగచుచునున్నచో మునులు రుచిర, వాగమృతధారఁ దచ్ఛోకవహ్ని నణఁచితండ్రికై తర్పణాదికృత్యములు దీర్పు, మనిన భార్గవుఁ డనియె సత్యాగ్రహమున.
అనదవలె నదిజలంబుల, జనకునకుం దర్పణం బొసంగుదునే యర్జునసుతశోణితములచే, నొనరుతు వినుఁ డదియుఁ గాక నొక్కప్రతిజ్ఞన్.
ఇరువదియొక్కమాఱు జనయిత్రి యురఃస్థలి మోదికొంట నేనరసితి నన్నిమాఱులు నృపాన్వయజాతుల దుర్వినీతులన్దురితసమేతులన్ ఖలులఁ ద్రుంపకమాన నటంచుఁ గ్రోధియైపరశువుఁ బూని యర్జుననృపాలకుమారజిఘాంస నత్తఱిన్.
మునుమున్న నతిరయంబునను మాహిష్మతి కరిగి త న్గనుఁగొని యార్తులగుచునెఱుఁగక చేసితి మీతప్పు సైరింపు రామరామ యటంచుఁ బ్రాణభీతిబతిమాలి వేఁడినఁ బదములు వాలిన సందులు సొచ్చిన శరణ మనినఁదలవీడ మొలవీడ నలుగడఁ బఱచినఁ బూరి గ్రసించినఁ బోవనీక
బ్రహ్మఘాతుకులార దురాత్ములార, దయయు ధర్మంబు మీయందుఁ దలఁపఁదగునెయనుచు గోచరులైన యర్జునసుతులను, బాఱి గొఱియల నఱకినపగిది నఱకి.
పురముల కేఁగు భూవరులఁ బోరికి రమ్మని చీరు వచ్చినంబరశువుచేతఁ జీరు భయపడ్డనృపాలురు రాకయున్న స
త్వరముగ నీడ్చి తెచ్చి యమవాసముఁ జేర్చుచు నిట్లు ధారుణిందిరుగుచు నెల్లరాజుల వధించె భృగూద్వహుఁ డట్టివేళలన్.
కొట్టివైచినతల ల్గుట్టలై కాటుకకొండలదండిని మెండు సూపభూరిమాంసంబులు ప్రోవులై మించుచుఁ గాంచనాచలములకరణిఁ గాంచనాకసం బంటిన కీకసరాసులు రజతశైలంబులరహి వహింపనెఱ్ఱనై నెత్తురుటేఱులు వాఱుచు శోణనదంబుల సొంపు నింపఁ
జెలఁగి మెసవుచు భూతము ల్సిందులాడె, కంకగృధ్రాదిఖగముల కఱువు దీఱెనారదుడు మెచ్చుచును దందనాలు పాడె, ధరణి నిర్భర యగుచు సంతసముఁ గూడె.
ఏనుమడుగు లగుచు నిల రాజరక్తంబు, గనె శమాత్తపంచకప్రసిద్ధిరాముఁ డాజి విజయరమఁ గూడి క్రీడింప, నలరు కుంకుమంపుఁగొలను లనఁగ.
ఇవ్విధంబున రాముఁ డెల్లరాజుల ద్రుంచి చిత్రశక్తిని గురుక్షేత్రముననుబరిహృతపాతకపంచకంబుగ క్షోణినాయకరక్తంబునను శమంతపంచక మొనరించి భక్తితో నటఁబితృతర్పణంబు ఘటించి ధన్యుఁ డగుచునశ్వమేధము చేసి యలసరస్వతిలోన నవబృథస్నానంబు లాచరించి
యవని దక్షిణగాఁ గశ్యపున కొసంగఁ, దన్మహత్త్వంబునను జమదగ్ని శీర్షయుక్తుఁడై సప్తఋషులలో నొక్కఁ డగుచు, వెలుఁగుచున్నాఁడు నక్షత్రవీథియందు.
అంతట శాంతి గైకొని వనాంతమునం దప మాచరించె దుర్దాంతమహాభిరాముఁ డగురాముఁడు నయ్యెడ గాధిమేదినీకాంతుకుమారపౌత్రుఁ డతిఘాతుకబుద్ధి పరావసుండు క్షత్రాంతకుఁ జేరవచ్చి దురహంకృతి మీఱఁ దృణీకరించుచున్.
మును మున్నీవు ప్రతిజ్ఞ చేసితివి నిర్మూలింతు శాత్రం బటంచును నేఁ డేల భయంబుఁ జెందితివి యిచ్చో నట్లు గాదే ప్రవర్ధనరాణ్ముఖ్యుల నొంప వేమిటికిఁ గారా వారు రాజు ల్నినుంగనినం బోవఁగనిత్తురే తొలఁగు మింకన్ దుష్ప్రతిజ్ఞానిధీ.
అని సదృక్షమునిసమక్షమంబునం బరావసుం డధిక్షేపించిన నతివీక్షరూక్షణుండై భృగుకులాధ్యక్షుం డిట్లనియె.
బాలురు వృద్ధు లటంచును, జాలించితిఁగాక వెఱవ క్షత్రియుల కికన్నేలంగల రాజులను స, మూలం బాబాలవృద్ధముగ ఖండింతున్.
అని యత్యుగ్రత భార్గవుం డవనిలో నాబాలవృద్ధంబుగాఁదునిమెన్ రాజుల నేమి చెప్పుదును దద్రోషంబు రాజాంగనాజనగర్భంబుల నూడ్చె హుంకృతి ధనుజ్యాటంకృతిన్ ఘోరగర్జనలన్ రూక్షనిరీక్షణచ్ఛటల దుర్దాంతాట్టహాసంబులన్.
ఇవ్విధంబున రాజుల నెల్లఁ ద్రుంచి, యరిగి మఱికొన్నినాళ్ళకుఁ దిరిగివచ్చిఆదిఁ దనదృష్టిపథమున కందనట్టి, గర్భములఁ బుట్టుశిశువులఁ గని వధించు.
ఈలా గిర్వదియొక్కమాఱు నృపులన్ హేలాగతిన్ రాముఁ డాబాలప్రౌఢజనంబు గాఁగ వధియింపన్ రాజకాంతావిలాపాలాపంబులు భూమినెల్లెడల మెండై నిండెఁ దద్దైన్యమున్మూలించె న్మది నెంచి కశ్యపుఁడు రాముం జేరి దీవించుచున్.
ఇల నిక్షత్ర మొనర్చి చేసితి మఖం బీవిశ్వవిశ్వంభరన్బళిరే దక్షిణ గాఁగ నిచ్చితివి దానక్షాత్రధర్మంబులంగలరే నీసరి యీక్షితిస్థితిని సాక్షాత్పంకజాక్షుండ వీవలఘుస్తోమయశోభిరామ భృగురామా సార్వభౌమాంతకా.
మాకొసఁగిన వసుమతిలో, నీ కేటికి సంచరింప నిఁక దక్షిణరత్నాకరతీరముఁ జేరు ప్ర, భాకరశశికులవిరామ భార్గవరామా.
అన మంచిది యని రాముఁడు, చని చాపం బెక్కుపెట్టి శరము దొడిగి వార్ధినిఁ గొట్టఁబోయి నంతనె, తనరంగా కొంతచోటు తత్క్షణ మొసఁగెన్.
అందు విహరించె రాముఁ డనంత నంత, బ్రాహ్మణుల కిచ్చి యంతఁ దపంబు సేయఁజనియెఁ గశ్యపుఁ డవని కాస్యపి యనంగ, నమరె నది యాది మఱి యుర్వి యౌట వినుము.
క్షితిసురు లిట్లు కశ్యపునిచే మహి గాంచి ప్రభుత్వ మొప్ప సంతతమును రాజభోగపరతంత్రత భార్గవుచే ననాథ లైగతి మఱి యొండులేమి నృపకాంతల సమ్మతి బల్మినైన సంగతి యొనరించుచుం గ్రతుమఖక్రియ లన్నియు నీఁగి రయ్యెడన్.
తగిన దండంబులేమి నుద్దండవృత్తి, వైశ్యులును శూద్రులును విప్రవరు లుదారగోధనాదుల బలిమిఁ గైకొనఁగఁ దొడఁగి, రి ట్లరాజకమై ధర్మ మెల్లఁ జెడిన.
కుతలం బతలం బంటిన, వెతలం బడుచున్న జనుల విని కశ్యపుఁ డూరుతలంబున నెత్తఁగ క్షో, ణితలం బుర్వియనఁ బరఁగు నృపకులతిలకా.
ఇవ్విధంబున కశ్యపమునివలన సముద్ధరింపంబడిన ధరావరారోహ యద్ధీరాగ్రణికిట్లనియె.
అనఘా విప్రులు ప్రోవలేరు నను బ్రోద్యద్బాహుశౌర్యంబుచేఘనులౌ రాజులె గాని భార్గవమహోగ్రక్రోధదావాగ్ని దప్పినవార ల్గలరందు నందు నృపతు ల్పేర్కొందు నన్నామముల్విని రప్పింపుము వారి ధర్మపరుల న్విఖ్యాతశీలాఢ్యులన్.
కశ్యపమునినాథ కాచితిఁ గొందఱన్ హైహయులను గుహలందు దాఁచిపౌరవాన్వయుఁడు విదూరథతనయుండు ఋక్షవద్గిరియందు ఋక్షరక్షసౌదానవర్యుండు శక్తిజు శరణొంది దధివాహసుతుఁడు గౌతమునిఁ గొలిచిగోపాలనముఁ జేసి గోపతి యనురాజు వత్సము ల్మేఁపుచు వత్సనృపుఁడు
గృధ్రకూటమనెడు గిరిని కోలాంగూల, జాతివలన భూతి జలధిచే మరుత్తుసుతులు మువ్వురును బ్రతికిరి వారిఁ, బతులఁ జేయు నాకు భవ్యమతుల.
అని ప్రార్థించిన మంచిదే యని దయైకాయత్తచిత్తంబుతోమునిచూడామణి శిష్యులం బనిచి సమ్మోదంబుతోఁ దెచ్చి వారిని సామ్రాజ్యపదాభిషిక్తుల నొనర్చె న్వారలున్ భూమిపాలనముం జేసిరి ధర్మ మెచ్చ జన ముల్లాసంబుఁ గాంచె న్నృపా.
విప్రులకు రాజసతుల కావిర్భవించి, రుత్తమక్షత్రియులు ధర్మయుక్తు లగుచునంతటను వారిసంతతు లతిశయిల్లె, ధరణి నంతటఁ దామరతంప రగుచు.
భార్గవుం డిప్పుడు మహేంద్రపర్వతమున, నున్నవాఁడు తపోధను ల్దన్నుఁ గొలువనాతఁడే గాదె భీష్మకర్ణాదులకును, జాపవిద్యోపదేష్టయై జయము లొసఁగె.
అనఘా యీభృగురామచర్య వినువా రత్యంతపుణ్యాత్ములైయనిశంబున్ బహుభోగభాగ్యములు దీర్ఘాయుష్యవైదుష్యముల్ధనదాన్యంబులు బుత్త్రపౌత్త్రులును భద్రంబు ల్మనోభీష్టముల్గని రాజిల్లుదు రెందుఁ గాంతురు తుదిం గైవల్యసామ్రాజ్యమున్.
అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁడైజనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతు దెలుపు మని యడుగుటయున్.
తీక్ష్ణమహామహోనిధిసుధీయుత దారకతారదారకాశ్లక్ష్ణకలావిహార యుడుజాలసమాచ్ఛవిహార యాశ్రితాభీక్ష్ణముదంచితాత్మ యవిభిన్నదృశోరచితాత్మమేదినీరక్షవిధాన దానచతురన్నయశోధన శ్రీయశోధనా.
పుంఖ్యాతియుత సరస్వతి, సాంఖ్యవిశేషజ్ఞ యోగశాస్త్రాభిజ్ఞాసంఖ్యావత్పరిపోషక, సంఖ్యాతిగసుగుణధామ సచివలలామా.
ధరాజరాజరాధిరాజదాతృతాజితాంగణాధరాజరాజరాజ దేవతావధూప్రదాసుధాధరాధరాధరాధరామృతస్పృహా మహావసుంధరాధరాధరాతిశౌర్యధైర్య దారితారికంధరా.
ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్టభాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగనామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతంబైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు షష్ఠాశ్వాసము.
Comments
Loading comments…