7. శ్రీరామావతారకథ
దశావతారచరిత్రము
యుతధామ దిశాక్షౌమాయత సితకీర్తిధామ మగదలకులధౌరేయ భుజావిక్రమ గౌరేయ సుధీ గేయ సత్యకృష్ణామాత్యా.
అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌనిధరణినాయక రామావతార మిఁకను, దెలియఁ జెప్పెద వినుమని తెలుపఁదొడఁగె.
హారిబింబరమావిహారకేళీశ్రాంతి హారికేతనమనోహారిరథముగంధనాగధుతాభ్రగంధవతీజాత గంధప్రసూనసగంధపదమువాహనైకగతిప్రవాహ పాంసులగంధవాహధూసరితాంబువాహఘటమువీరరసోన్నిద్రవీరభద్ర హసద్గవీరమాహవ మహావీరభటము
ధర్మపరధర్మసాధర్మ్యభర్మవిశ్వ, కర్మనిర్మితశర్మదనర్మహర్మ్యనిర్మలాభోర్మిదృశిధాతుకర్మితాచ్యు, తాభ్రమధ్యాపురం బయోధ్యాపురంబు.
ఆపుర మేలున్ దశరథ, భూపాలకుఁ డాజివిజయభుజభుజగమహాచాపాహితరోపాహృత, కోపావృతవిమతనృపతికులపాలకుఁ డై.
అతఁ డొకనాఁడు నిండుకొలువై చెలువై బలవైరి కెంతయుంబ్రతియగు ఠీవి మీఱఁగఁ బరాకు పరాకు పరాకటంచు వందితతులుసారెమ్రొక్కు ధరణీతరుణీపరిణీవరాళి నున్నతరుచిఁ దెల్పఁ గానకలనాలలనాకలనాదము ల్వినన్.
విశ్వంభరాభారవిధురకుంభీనసప్రతిసృష్టి యెవ్వాని బ్రహ్మయష్టిగాఢాంధకారనిర్గంధనక్షమసరోజపకరం బెవ్వానిజవసరంబుఘటజాతగౌరవోత్కటహర్షితార్థవిగ్రహచండి యెవ్వానిమహితకుండికనకగర్భాసాధ్యకౌశికేష్టనిధానతోషితం బెవ్వానిభాషితంబు
కమలసంభవ కమలేశ కమలభృత్క, లాకలాపాది సురలోకలోకభయదకలశదత్తాక్షి యెవ్వాని జలరుహాక్షి, యట్టిఘనుఁడు వసిష్ఠసంయమధనుండు.
చనుదెంచిన నెదురుగఁ జని, వినయంబునఁ దోడి తెచ్చి విభుఁడు సువర్ణాసనమున నునిచి సపర్యలు, నొనరిచి యిట్లనియె నతిమృదూక్తులు మెఱయన్.
అనఘాత్మా యనపత్యతాదురిత మత్తాళీంద్ర మస్మన్మనోవనజాతానిశజాతమోదరససేవం జొక్క నేసౌఖ్యముంగనలేనైతి సమగ్రభోగముల నింకం దన్మిలిందంబు గ్రక్కన వారింపుము భూరిసంతతి యొసంగం జాలఁ బ్రార్థించెదన్.
అనిన సమ్మతి ఋశ్యశృంగాదిమౌని, పతులఁ గూడి యరుంధతీప్రాణనాథుఁడశ్వమేధంబు సేయించి యధిపుచేతఁ, బుత్రకామేష్టి వేల్పింపఁ బూనునపుడు.
శచిముద్దుమోమునఁ జక్కగాఁ దిలకంబు దిద్దిదిద్దక వచ్చె దేవభర్తకులశైలతనయచెక్కులయందు మకరిక ల్వ్రాసివ్రాయక వచ్చె వామదేవుఁదొడికంబుగా వాణినిడువాలుకీల్జడ యల్లియల్లక వచ్చె నబ్జభవుఁడుకలిమిపూఁబోఁడిగుబ్బల కమ్మకస్తూరి పూసిపూయక వచ్చె వాసుదేవుఁ
డన్యదివిజులు దామున్నయట్లు వచ్చి, రింతయును దామసములేక ఋశ్యశృంగమౌనిమంత్రబలాహూయమాను లగుచు, నహహ కొనియాడఁ దరమె యయ్యనఘుమహిమ.
హవిరర్థాగతదేవతావిరహరుష్యన్నిర్జరీభేదనప్రవణానంగసమాహృతప్రసవసర్వస్వామృతాహారలోకననీదోహదధూమమో యన వపాగంధస్ఫురద్ధోమధూమవితానంబు నభోంతరాళపదవిం బర్వెన్ ఘనశ్యామమై.
ఆయెడ శిఖిభవపురుషుఁడు, పాయసభాజన మొసంగె బహువిధమంత్రోపాయసభాజనకౢప్తనృ, పాయసభొజనము లలర నవనీపతికిన్.
దశరథమేదినీధవుఁడు పాయస మగ్రసతికిఁ గౌసల్యకు సగ మొసంగిపిమ్మటఁ గైకేయ ప్రియురాలు గావున కడమ యియ్యఁదలంచి కైకకన్నబ్రాయంబుచేఁ బెద్దపత్ని నుదాసింపఁ బాడిగా దంచును బరకపాలుమాత్రం బొసంగి సుమిత్రకుఁ గైకకుఁ బాతికెపా లిచ్చి పరకపాలు
మరలి యెల్ల సుమిత్రకె మమత నొసఁగె, మునుపుఁ గొంచెమె యిచ్చితి ననుచు నెంచియంతఁ గాంతలు దత్పాయసాంశములను, మెసవి యారూఢగర్భలై యెసఁగుటయును.
హరువుగా మృగనాభి యలఁదితే కుచచూచుకంబుల నైల్యంబు గదియనేలవిడియంపుకపురంపువెలిడాలు గ్రమ్మెనే పసిఁడిచెక్కులు వెల్లబాఱనేల
కటికుచంబుల నీర్ష్య గాంచెనే నేఁడైన బలువుఁజూపె నదేమొ యలఁతినడుముపరమాన్నరుచి గ్రోలఁ బరపదార్థములందు నరుచి పుట్టెనొ పల్చనయ్యెఁ దనువు
పనులు దఱచయ్యెనే యింత బడలనేల, రేలు వేఁగింతురే పగలేల నిద్రయనుచు దశరథుఁ డతిమోద మెనయు నర్మ, వచనములఁ దేల్చె దౌహృదవతుల సతుల.
మేటిగఁ జైత్రశుద్ధనవమీబుధవారపునర్వసూడుకర్కాటకలగ్నవేళ గురురాజులు గూడ గ్రహంబు లుచ్చతంబాటిల నైదుఁ గోసలనృపాలసుతామణిగర్భవారిధింగోటిశశాంకతేజముఁ జిగుర్కొన విష్ణుఁడు పుట్టె రాముఁడై.
అచ్యుతాంశార్ధమున రాముఁ డవతరింప, హరిచతుర్థాంశమునఁ గైక భరతుఁ గనియెనలసుమిత్రకు వెనుకఁ బాయసము గొనియు, నాథునుద్దేశమే ప్రధానంబు గాఁగ.
గుణవతి సుమిత్ర సుజన, ప్రణతుల హరి పరకపరకపా లొసఁగఁగ లక్ష్మణశత్రుఘ్నుల శుభల, క్ష్మణుల న్ముజ్జగమువారుఁ గడుహర్షింపన్.
దివి పిక్కటిల మ్రోయు దివ్యదుందుభుల సంరావంబు లభ్రగర్జనలు గాఁగనటియించు నప్సరఃకుటిలాలకలమేనిమెఱుఁగులు తొలుకరిమెఱుఁగులుగనుదిలకించు వైమానికులచిత్రభూషణాంబరకాంతి యింద్రచాపంబు గాఁగమలయాచలాయాతమందమారుతములు తతశీతవాతపోతములు గాఁగ
జనముదశ్రుప్రవాహము ల్సందడింప, మునిజనానందకందము ల్మొలకలొత్తరావణగ్రీష్మతప్తధరాతలంబు, శైత్య మొందంగఁ బుష్పవర్షములు గురిసె.
అంత.
సరభసగమనఝళంఝళ, చరణమణీనూపురములు సగ మెఱిఁగింపందరుణులు దెలిపిరి యంతః, పురవనితలు సుతులఁ గనుట భూపాలునకున్.
ఘనసంతోషము మీఱఁగా దశరథక్ష్మాపాలచంద్రుండు వేచని కాంచెం బురుటింటిలోపలను గౌసల్యాంకభాగంబునంగనియై నిల్చెనొ సర్వలోకముల శృంగారం బనా మీఱురాముని గల్యాణగుణాభిరాముని జగన్మోహప్రభాధామునిన్.
దశరథుఁడు రాముఁడై పుట్టె ధరణిలోన, నాత్మయే పుత్రుఁడై పుట్టు ననఁగ వినమెయట్టియాత్మావలోకనం బవనిపతికి, సమ్మదముఁ జేయు టేమియాశ్చర్య మపుడు.
పుత్రోత్సవ మొనరించెన్, ధాత్రీపతి రత్నధాన్యధనముల విశ్వామిత్రుఁడు దనలోఁ దలఁచెం, జైత్రంబుగ నుత్సవంబు సలుపఁగ నంతన్.
నామకరణాదికము లుపనయన మవని, రమణుఁ డొనరింపఁ గ్రమమున రాముఁ డనుజసహితముగ వంశగురుచెంత సకలవిద్య, లభ్యసించి ప్రవీణుఁడై యధివసించె.
అట నొక్కనాఁడు కౌశిక, జటివరుఁ డరుదెంచి సవనసంరక్షణమున్ఘటియింప రాము వేఁడినఁ, గటకటపడు దశరథేంద్రుఁ గని గురుఁ డనియెన్.
ధరణి నేకాతపత్రంబుగాఁ బాలించె బ్రహ్మఋషీ, శ్వరపదముఁ గాంచెమేనకాధరసుధాపానంబునకుఁ జొక్కె రంభను దిట్టెఁ జట్రాయి గాఁగనలుకశక్త్యాదిపుత్త్రుల మన్నిఁ గొనిపించెఁ బశువగుద్విజపుత్రుఁ బ్రతుకఁజేసెగురుశాపహతుఁ ద్రిశంకుని దివంబున నిల్పెఁ బీడించెఁ దత్పుత్రుఁ బెక్కుగతుల
వేదమాతను గాయత్రి వెలయఁజేసె, వివిధశస్త్రాస్త్రము లెఱింగె విశదముగనువిన విచిత్రము గాధిపుత్రుని చరిత్ర, మనఘగుణగణ్య దశరథజనవరేణ్య.
సుతుఁ బంపు మితనివెంటం, గ్రతురక్షణమునకు శుభము గలుగు నటన్నన్క్షితిపతి కుతుకంబున రఘు, పతిఁ బిలువఁగ నూడిగములఁ బనుపఁగ వారున్.
సిగకు నందక వెన్కఁ జెరలాడుకురులతో లాగియౌ మట్టికుళ్లాయి దనరఁజిన్నారినొసటిక్రొంజెమట యూడిగములు వలిపెంపుఁజల్వపావడలఁ దుడువనునువెడందయురంబునను జీనిసరిపెణ ల్మిన్నజన్నిదముతో మేలఁ గొనఁగబెడఁగుచెంగావిచల్లడముపై బిగియించికట్టినక్రొంబట్టుదట్టి దనర
సంజకెంజాయ దగునీలజలద మనఁగ, మెఱుఁగు టెఱమట్టిజిగితోడి మేను మెఱయఁజిగిలినాకరంబునఁ జెలువు గులుక, గరిడి వెలువడివచ్చు రాఘవునిఁ గాంచి.
వినయము మీఱఁ జేరి రఘువీర పరాకు నృపాలమౌళి చయ్యనఁ బిలుమన్న వచ్చితి మటన్న విశేషము లేమి కొల్వులోననుచు రఘూద్వహుం డతిరయంబున లక్ష్మణుకేలుదండతోమినుకుఁగడానివ్రాఁతపని మేలరిగె ల్పయిపై నటింపఁగన్.
శిర సెత్త మునివ్రేలివరుస గన్పులుగల్గు బలుకొమ్ముమగఱాల పనులపైఁడిసింహలలాటంబు జీవదంతంబులగొడియలు గడవన్నె గొప్పగిండ్లుఁబచ్చసూర్యపుటంపుఁబన్నాగమును మేలిపట్టెచట్టంబు కెంబట్టుపటముసన్నజీనామాలిజాళువాపిడికుచ్చు ముసనాబుకుచ్చులు పసిఁడిసరిగె
కుట్టుతాపెతబటువులు కొద్దిసులువు, పట్టయొరఁగును గుంకుమపఱపుచలువపైఠినీచేలకప్పుఁజొప్పడుకుమార, యందలం బెక్కె శ్రీరఘువందనుండు.
అడుగుందమ్ముల రజముం, దుడిచె న్శిబికావహుండు తోడనె యొకడప్పుడు వడిగ మైత్రినొందుచు, నడకువ సౌమిత్రి నడచె నగ్రజువెంటన్.
నగరువాకిటనె యందలము డిగ్గి బుజాన వలెవాటు వైచిన జిలుగుఁజేలకటితటంబునఁ జుట్టి గండూష మొనరించి భయభక్తు లమర లోపలికి నరిగియొడ్డోలగంబయి యున్నతండ్రినిఁ జేరి జనపతి కౌశికముని యితండునతి సేయు రామ యన్నను బ్రేమ మొక్కిన “శీఘ్రమేవ వివాహసిద్ధిరస్తు”
అనుచు రాముని దీవించి మునివరేణ్యుఁ, డెత్తి యక్కునఁ జేర్చుక యేకపీఠసీమ వసియింప రామ కౌశికులవారి, వాఁడ వైతివె యని నృపవర్యుఁ డనిన.
మునులపాలిటివాఁడె రాముఁడు నృపాల, నిజమె పల్కితి వనుచు భూభుజుఁడు వనుపరామలక్ష్మణు లిరువురుఁ బ్రేమ వెంట, రా మునీశ్వరుఁ డాశ్రమసీమ కరుగ.
తల హొంబట్టుకులాయలుం దళుకునిద్దాయొంట్లుఁ గస్తూరిపట్టెలుఁ గర్పూరపు నమము ల్దగటుదట్టీచల్లడల్ ఖడ్గముల్మొలవంకు ల్విలునమ్ములుం గవదొన ల్ముంగొంగుబంగారుదువ్వలువ ల్చెల్వుగ రామలక్ష్మణులు విశ్వామిత్రుతో వచ్చుచోన్.
అటు నిక్కి చూచిన నమరావతీపురి వీథివారలు వెఱ వేఁకిపడఁగనిటు బార సాఁప దిగీశానపురవాసు లళుకొంది సందుగొందులకుఁ బాఱనటు ద్రొక్కి నడచిన నణఁగుభూమిభరంబు భరియింప ఫణిరాజు పడగలెత్తనిటు గేరి నవ్విన నింద్రాగ్నియమముఖ్యదివిజు లంగుళములు సెవులఁ జొనుపఁ
గఱకుఁగోఱలు మిడిగ్రుడ్లుఁ జుఱుకుఁజూపు, వ్రేలుఁజన్నులుఁ దెఱనోరు వికృతముగనుగదియు తాటకిఁ గూల్చె రాఘవుఁడు జటిలు, మాట జవదాఁట కట వనమార్గమునను.
ఇవ్విధంబున.
తావచియించుమాట జవదాఁటక తాటక నొక్కకోలచేగ్రావమగల్చువజ్రికడకం బడనేసిన రాము మెచ్చుచున్దేవనియుక్తుఁడై యొసఁగె దివ్యతరంబయి మించు నస్త్రశస్త్రావళి నెల్లఁ గౌశికుఁ డుదారునకున్ రఘువీరమౌళికిన్.
కాచె రఘుప్రవీరుఁ డటఁ గౌశికయాగము సత్క్రియాగమున్నీచవిచారులై దను గణింపక విఘ్నము సేయవచ్చు మారీచుఁ బయోధిఁ గూలిచి హరించె సుబాహుని బాహుశక్తి దోషాచరసేనలం దునిమె సర్వమునీంద్రులు సన్నుతింపఁగన్.
గాధిసుతుఁ డంత శ్రీరాముఁ గౌఁగిలించి, యాది నమరుల కొసఁగితి వమృత మిప్పుడాహవాంతంబున విరోధికీహవాంత, మునను మాకు ఘటించితి వనరుహాక్ష.
క్రతుఫలదాయి నీ కిఁక ధరాతనయామధురాధరాధరామృతము ఘటింపఁజేసెదము మెచ్చుగఁ బోవలె రమ్ము మైథిలక్షీతిపతిజన్నముం గనఁగ సీతవిలాసము సన్నుతింప భారతిపతి నేరఁడన్నఁ గలరా యిల రామకు నీడుజో డిలన్.
పువునవ్వు న్మెయితావి విచ్చుసుధచేఁ బొంగారుబంగారుకమ్మివగం బూనును మేను గౌను నగుఁదా మిన్నంటి వె న్నంటియాకువలె న్వన్నెలువన్నుఁజన్ను లరిరంగు న్మించుఁగొమ్మించులన్హవణించుం గనుమిన్న లెన్నఁ దరమా యాబోఁటి నాబోఁటికిన్.
వెన్నెలవన్నెలకు న్నెల, వన్నెలతదరస్మితంబు లందము జేజేకన్నెల చిన్నెల వన్నెల, క్రొన్నెల నెన్నుదురు మహిజ కొలఁదియె పొగడన్.
అని వర్ణించుచు మిథిలకుఁ, జనుచో బహువిధకథాప్రసంగంబులచేతను దొలఁగించుచు పథసం, జనితపదశ్రాంతి యల్ల జనఁజన నెదుటన్.
వికచపద్మకుడుంగవిహరమాణరథాంగసహచరచ్చక్రాంగచటులభృంగగాహమానపతంగకరతప్తమాతంగమదగంధిలతరంగమయశుభాంగతీరజాతలవంగనారంగతరుసంగకలనినాదవిహంగకలుషభంగబహుళశ్రమోత్సంగ పథికహర్షణచంగ సురభిశీతకురంగ వరతురంగ
నురగశయనపదాంగజార్యుత్తమాంగ, జీవితోత్తుంగ జననస్థితిప్రసంగకనకగిరిశృంగ నిర్దళద్ఘనమృదంగ, ఘనరవజలానుషంగ నాకాశగంగ.
కని శ్రీరామవిభుండు కౌశికునిచే గంగామహత్త్వంబు వించును బల్మాఱు భగీరథక్షితిపతిన్ స్తోత్రంబు గావించి మజ్జనముఖ్యక్రియ లాచరించి యటఁ గౌశాంబీపురీరాజపూజనము ల్గైకొని మైథిలోపవనవీక్షం జొక్కి తానిట్లనున్.
విమలాత్మక యేమునియా, శ్రమ మిది వికచప్రసూనసత్ఫలపాళీరమణీయ మయ్యు జనసం, గమవర్జిత మౌట కేమి కారణ మొక్కో.
అన విని రామునిఁ గని రా, ముని యిట్లను రామ గౌతమునియాశ్రమ మివ్వని నెవ్వనిఁ గనకుండుట, వినుపించెద వినుము పూర్వవృత్తాంతంబున్.
మునుపు రమామనోహరుఁడు మోహినియై భ్రమయింపఁగాఁ ద్రిలోచనుఁడు సురాసుర ల్మిగులఁజప్పఁగ నెంచిరి నాదుసృష్టిఁ గ
ల్గినమధురాధరామణులఁ గేవల మే నిక నంతకన్నఁ జక్కనివనిత న్సృజింతు నని కంజభవుం దధికప్రయత్నుఁడై.
జలజవికాసంబుఁ జంద్రరమ్యత్వంబు ముకురంబుతేట నెమ్మొగము సేసికలికిబేడిసబెళ్కుకలువరేకందంబు ఖంజనదీప్తిఁ గన్గవ రచించితలిరుపల్చదనంబుఁ జళుకుకెంపుమెఱుంగు నమృతంబు రుచి నధరము ఘటించికనకకుంభచ్ఛాయ గట్టుగట్టితనంబు బంతిసోయగము గుబ్బల నమర్చి
మించుమించును సంపెంగమించుతావి, తరుణశైరీషకుసుమమార్దవము భాసురాంగకము చేసి నిర్మించె నఖిలలోక, మోహనముగ నహల్యయ న్మోహనాంగి.
లక్ష్య్యాదికులసతు ల్పతులఁ బాయ రొకప్పు డలకాంతఁ జూతురో యనుభయముననజుకొల్వునకు సారె కరుదేరుసనకాదు లతిచంచలము చిత్త మంచు నెంచితక్కినరాజర్షు లెక్కువమక్కువఁ జిక్కి చొక్కుదురు వీక్షించినంతనేకల్పమునఁ గాన మెటులు సృజించితి వని నుతింతురు కూర్మి హరియు హరుఁడు
గరుడగంధర్వసాధ్యాదిఖచరు లైన, దినముఁ బదిమార్లు వత్తు రవ్వనితఁ జూడనొకఁడుఁ దన కిమ్మటని వేఁడ డువిద కేను, దగనటంచును దగదె యమ్మగువఁ బొగడ.
అఁట నొకనాఁడు సుధాశన, కటకేంద్రుఁడు బ్రహ్మఁ గొల్వఁగాఁ జని యచటంగుటిలాలక యొయ్యారము, తటకాపడి చూచెఁ జూపుతమి దీరంగన్.
కిసలయాధర కప్పుగీల్గొప్పుఁ బరికింప మోహాంధకారంబు ముంచుకొనియెఁగలకంఠి బెళుకువాల్గనుదోయి పరికింప స్వాంత మంతంతకుఁ జంచలించెమోహనాంగి మెఱుంగుమోవి విలోకింప ననురాగవల్లిక ల్గొనలుసాఁగెవనజాయతాక్షి లేనునుగౌను దిలకింప ధృతికిఁ బ్రాపించె నదృశ్యలీల
యర్హ మనవచ్చు నొకదారి నది బలారి, కువిదలావణ్యవారాశి నోలలాడనతనుతాపంబు జనియించు టరిది గాని, యిటులు మోహితుఁ డగుచు సురేంద్రుఁ డపుడు.
కలికిగుబ్బలఁ బోలఁగా నిమ్మపండులు దొరలకుఁ జేకాన్కతరము లయ్యెఁజిలుకలకొల్కి చెక్కులడాలు గులుకఁగాఁ దళుకుటద్దము సూడఁ దగినదయ్యెనొసపరిమిసిమి నెన్నొసలిపస ల్గాంచ మొలకక్రొన్నెలజను ల్మ్రొక్క నయ్యెఁదరుణికమ్మనిమేనితావి గ్రమ్మఁగఁ బూవుటెత్తులు శిరసావహింప నయ్యె
మగువ నిఁకఁ బెండ్లియాడఁగాఁ దగినధన్యుఁ, డఖిలలోకైకమూర్ధన్యుఁ డగుట యరుదెయంచుఁ దమిమించఁ బదరి యాచంచలాక్షి, నిమ్మనుచు వేఁడ నగి బ్రహ్మ యీయ ననిన.
గుండియ జల్లనంగ నెదగుందుచుఁ గొండొకధైర్య మూది యాఖండలుఁ డబ్జజుండు మది గాంచక నీగతి నాడెఁగాక యీయండజరాజయాన కెనయౌ పురుషుండు మదన్యుఁ డీజగన్మండలి నెవ్వడంచు బిగుమానముతోఁ బురి కేఁగె నంతటన్.
నైష్ఠికబ్రహ్మచర్యంబునను దవంబు, సలుపు గౌతమునకుఁ బరిచర్య సేయనజుఁ డహల్యను నియమించె నతని ధైర్య, కంచుకము చించ నించువిల్కాఁడు పొంచె.
కులుకుంగుబ్బలు మోవితేనె జిలుక న్గ్రొందళ్కు మేన్మించులందొలఁక న్మాటకుఁ జిల్క మాఱువలుకన్ దోర్మూలము ల్గుందనంబొలుకం జూపుల గండుమీలు బెలుక న్హోమాదులం దెల్ల దొయ్యలి నిచ్చ ల్పరిచర్య సేయ నళుకం దమ్మౌని పూవింటికిన్.
శతధృతి యట గౌతమముని, పతియతిధృతిగతికి లేదు ప్రతి యని సతిఁగాశతపత్రనేత్ర నొసఁగిన, నతఁడున్ గార్హస్థ్యసౌఖ్య మందుచు చెలఁగెన్.
పడఁతుక మునిఁ జేరుటఁ గని, జడిసి మనోజాతవిశిఖజాలమునకు లోపడి యడలుచు ననిమిషపతి, మిడికెం గడునెడఁద మిట్టి మీనై పడుచున్.
ముదమున నేను వేఁడుకొన మోహ మెఱింగి యొసంగ కయ్యయోముదిముది దప్పి యీభువనమోహిని నేమని మౌని కిచ్చె నీవిధి కిఁక నేమి సేయుదు వివేకము సాల దొకింత యెట్లుగాబ్రదికెనొ యిన్నినాళ్లు నిజపట్టము గట్టుక సృష్టికర్తయై.
కలవారి కొసఁగడు వలయుకుమారుల నతిరిక్తునకుఁ బెక్కుసుతులఁ గూర్చుస్వల్పాయువులఁ జేయు సకలగుణాఢ్యుల వ్యర్థజీవి కొసంగు వర్షశతముకష్టలోభి కొసంగు ఘనతరైశ్వర్యంబు నెఱదాత కొనగూర్చు నెఱయలేమిదీర్ఘరోగినిఁ జేయు దివిరిసంపన్నుని యారోగ్య మొసఁగు క్షుధాతురునకు
నజున కెయ్యది సువివేక మటులుగాన, నాకు నొసఁగక కానలో నాకునలముమెసవుతపసికి నొసఁగె నిక్కుసుమగంధి, నేమి సేయుదు ననుచు సురేశ్వరుండు.
నేలామంచముఁ బట్టక, చాలా జాలిం దపించె శతమఖుఁడు నిజత్రైలోక్యరాజలక్ష్మీ, పాలనమును వదలి మరుఁడు పాతకుఁడు సుమీ.
అనిన మందహాసకందళితవదనారవిందుం డగుచు సుమిత్రానందనుం డిట్లనియె.
ఏమో యని యుంటిమి సు, త్రాముని గుట్టెల్లఁ దెలిసెఁ గ్రతుభుజులకుఁనేమని పట్టము గట్టెనొ, తామరసభవుండు వానితర మెఱుఁగఁడుగా.
అనిన లక్ష్మణ వారి నే మనఁగవచ్చుదేవతలు సేయుపనులకుఁ దెగడఁదగునె
యనుచు శ్రీరామచంద్రుఁ డోమునివరేణ్య, యవలికథ యానతిమ్మన్న నతఁడు పలికె.
పరుల కొకనిందఁ గల్గినఁ, బరికింపవు గుణమెకాని పాటింపఁగ నీసరిదొరలు గలరె జగముల, వరసద్గుణధామ రామవనదశ్యామా.
నీగుణంబులు పొగడ నేనెంతవాఁడ, వినుము మీఁదటికథ యిట్లు విబుధవర్యుఁడతనుపండితశాస్త్రవిద్యావిశేష, నిగ్రహస్థానగతుఁడు నై నెఱయఁ బొగిలి.
పొరుగిరు గాశ్రమంబులకుఁ బోవ నొకానొకవేళ వచ్చు దృక్చరణునియాశ్రమంబునకు సంయమి సేమము వేఁడి దేవతాతరుసుమమాల్య మిచ్చు జడదారుల కేలని యాతఁ డంతలోఁదరుణి కొసంగఁ దన్వి దలదాల్పఁ గృతార్థుగ నెంచు దన్మదిన్.
సురవరుఁ డందఱముందఱఁ, దరుణీమణి నట్టె చూచుఁ దప్పక కామాతురులను భయమును లజ్జయుఁ, బొరయవన న్వినమె రామభూపాలమణీ.
ఎలనాఁగా శుభమౌనె ముజ్జగము మీ రేలంగ మావంటివారలకు న్సేమమె కాక యేమి యవు నీ ప్రాణేశుఁ డెందేఁగె వన్యలకుం బోయెను బోదుమే యతఁడు రా నాతిథ్యముం గాంచి పొండు లతాంగీమణి నీ వొసంగు మని వేఁడు న్వజ్రి యొక్కొక్కెడన్.
దేవాధీశ్వురుఁ డాశ్రమంబునకు నేతేరంగ నాతిథ్యముంగావించు న్మునియున్నవేళ మధుపర్కం బిచ్చి యచ్చో నహల్యావామాక్షి సుధాధరంబు గను నాహ్లాదంబుతో నింద్రుఁ డాభావం బెంచి తలంగు మాఱ్మొగముతోఁ బద్మాక్షి లేనవ్వులన్.
సురపతి నట్టె చూచుఁ దను జూచినయంతనె చూపు ద్రిప్పు వేమరు గనుసన్న సేయుఁ గని మాఱ్మొగమౌఁ గన నట్ల దీనుఁడైకరమున మ్రొక్కు మ్రొక్కునెడఁ గ్రమ్మఱఁ గేల్గవ మోడ్చుచు న్నిజాధర మరపంట నొక్కఁ గని తన్వి నుచుక్కను నొంటిపాటునన్.
ఇవ్విధంబున విబుధనాథుం డహల్యావిలాసవిభ్రమంబులఁ దగిలి తదాశ్రమంబునకు వచ్చుచుం బోవుచునున్నయెడ.
మట్టెఱుంగక యాకు మడుపు లొందుట యొద్దఁ బవళింపఁ బ్రక్కకుఁ దివియకుంటకౌఁగిలించిన బ్రబ్బుగాఁ గౌగిలించుట యురక చెక్కున మోము లుంచుకొనుటవలసివల్లములుగా వాతెఱయానుట యలవోకగా గుబ్బ లంటుటయునుసరసోక్తులకు సదుత్తర మీయకుండుట చూపు లేకయె రిత్తచూచుటయును
బలిమి దానయి పైకొన్న పారవశ్య, మొంది చొక్కమిఁ గనుగొని యుస్సు ఱనుచుశచి వగలఁ గుందు నాథుఁ డేజలజముఖికొ, మేలువాఁ డయ్యెనని రహఃకేళికలను.
కొలువౌ డిగ్గున గద్దె డిగ్గు వని కేఁగు న్మర్లు గేహంబులోఁదలిరుంబాన్పునమర్లునం బొరలు సౌధం బెక్కు మందాకినిందిలకించుం జను నిల్చుచోట నిలఁ డెంతే కంతుసంతాపవిహ్వలుఁడై చిత్తగతాంగనానయనకాల్యాధిష్ఠమార్గంబునన్.
వనితరొ నేటికైన దయవచ్చెనె యెంతటి నిర్దయాత్మవేపనివడి నీకుఁగాఁ బడిన పాటులు దేవుఁ డెఱుంగు నింక నేలను గతతోయబంధ మబలా యని కౌఁగిటఁ జేర్చు భ్రాంతి దోఁచిన నవలానిజాలవగఁజెందెడు నాతని మోహ మెట్టిదో.
ఇవ్విధంబున కంతుదురంతలతాంతకుంతతంతన్యమానసంతాపసంతప్తస్వాంతుఁ డగుచు శచీకాంతుం డొక్కనాఁ డేకాంతంబున విశ్వకర్మనందని యగుమనోరంజనిఁ బిలిచి నిజాభిప్రాయంబు దేటపడం బలికి యెటులనైన యీకార్యంబుసఫలంబు సేయుమని ప్రియంబు సెప్పిన నప్పద్మనయనయు నప్పుడ కదలి గౌతమాశ్రమంబున నొక్కపూఁదోఁటలో దేవపూజకుఁ గుసుమంబులు గోయుచున్నయహల్యం గనుంగొని యయ్యంగన భువనమోహనశృంగారాదిగుణంబులకునచ్చెరువడి మెచ్చుచుం జేరంజనిఁ యహల్య కిట్లనియె.
అలికులవేణి వెవ్వతె వహల్యవొ కావలె కాకయున్న నీచెలువము గల్గునే కడమచెల్వల కన్న నహల్య మెచ్చఁగావలయునె బోటి యేటిచెలువంబు తపోధనకాంత కింద్రునింగలసి రమింపఁజాలు శచిగౌరవ మెన్నుము నేర్పు గల్గినన్.
అని పలికిన చిలుకలకొలికి సారస్యంబు గలిగినట్లైనం జెలంగి యచ్చెలువ యిట్లనియె.
ఇంతిరొ నీదుభాగ్య మిపు డెంతని సన్నుతి సేయుదాన విశ్రాంతదిగంతకాంతులు శిఖామణి కాంతులఁ గూడ మోడ్పుకేలెంతయుఁ దాల్తు రెవ్వని యహీనకటాక్షముఁ గోరి యాశచీకాంతుఁడు గాచినాఁడు కుతుకంబున నీదుకటాక్షవీక్షకున్.
రమణిరొ యద్రిపత్త్రములు రాలఁగజేసిన దూఱువోవ నీకొమరుమిటారిగబ్బిచనుగొండల పత్త్రముల న్రచింపఁగాఁబ్రమదము నొందినాఁడు సురరాజ్యధురంధరుఁ డట్టివానియత్నము ఫలియింపఁజేయుము కనందగు నీకును గోరుకోరికల్.
అనిన లజ్జావనతముఖియై శశిముఖి సఖీమణి కిట్లనియె.
ఔనౌనే వెలయాలనా యిటులు నీవాడన్ బలా చాలుఁ బోపో నవ్వే రెవరైన విన్ననిట నేర్పు ల్సూపఁగా వచ్చితో
నానాథుం డిది విన్న యంతఁ దనకు న్నాకు న్మహాహాని రాదా నావంటికులాంగనామణికి న్యాయం బౌనె యీమార్గముల్.
తగవౌనే తనవంటివాఁడు పరకాంతంగార సామాన్యుఁడేమగువా తాను శతాశ్వమేధి త్రిజగన్మాన్యుండు నేఁ జెల్ల యీవగ వర్తించిన యాగభాగములఁ బిల్వంజూతురే బ్రాహ్మణుల్నగరే తోడిసుర ల్మహాఋషులచెంతన్ గౌరవం బబ్బునే.
అనిన విని నవ్వి యవ్విలాసిని యిట్లనియె.
వయసునఁ గంటి కింపయినవాని రమించుట ధర్మ మింతి కట్లయె మగవాఁడు చక్కనిమిటారికిఁ దక్కి రమింపఁగావలెన్నయ మిది న్యాయశాస్త్రముల నమ్మకు మొజ్జలు పుచ్చకాయ యానయవిదుఁడౌ గురుండు మదనత్వర నగ్రజుభార్య గూడఁడే.
వేడుక లెస్సఁగా ననుభవించుట యొక్కటి తక్కెఁగానియందేడది ధర్మశాస్త్రగతు లెక్కడిపుణ్యము లేడ పాపముల్సూడవు గాక నీవు బలసూదనువీఁడు సుపర్వు లన్యులంగూడియెకాక నందనులఁ గూరిమిపత్నులయందుఁ గాంచిరే.
వింతలె నిన్నువంటి యవివేకిను లెందఱు లేరు వారినేవంతుకు దేను నామనసు వచ్చినజాణయె కర్త తార యేకాంతునిపజ్జ మాని వగకాఁడగు చంద్రునిఁ దక్క నేలఁదానెంతయుఁగాక నేమి దనయిచ్చఁ గరంగిన సౌఖ్య మబ్బునే.
అలుగుటొ యల్గినప్పుడె భయంబున నంఘ్రుల వ్రాలి వేఁడుటోకలయఁగఁ బల్కుటో బలిమిఁ గౌఁగిటఁ జేరిచి మోవి నొక్కుటోచలము మిటారిచూ పొనొర జంకెనయో ముడిబొమ్మొ తక్కుచెయ్వులు గలవో తపస్విరతియున్ రతియే వెతగాక కామినీ.
ఉవిద నినుఁ జూచినప్పటినుండి నా కి, దియె విచారంబు కటకటా దేవుఁ డిట్టిచక్కనిమిటారి నేమని జడున కిచ్చె, నని తలంకుదు నైన నేమాయె వినుము.
దోషారంభము సంభ్రమం బొసఁగ నాథున్ సాధుమేషాసమున్మేషాప్తిం గికురించి యొంటిఁ జని యన్వేషించు నజ్జారు నాశ్లేషింపంగల సౌఖ్య మిందుముఖికిన్ లేదెందుఁ బద్మాననా"యోషా జార మివ ప్రియం” బనెడి శ్రుత్యుక్తి న్విచారింపవే.
అంగన పతిఁగాని యన్యపురుషుఁ జెంద ధర్మువు గాదని తలఁచితేని 'చంద్రగంధర్వకృశాను లన్యులు గారె వారు దేవతలన్న వారికెల్లనేలికయైన దేవేంద్రుఁడు గొంచెమా యది శ్రుతిచోదిత మంటివేనినలినారి శుద్ధగంధర్వుండు శుభవాణి యఖిలపావనత హుతాశి యొసఁగ
వనరుహాక్షులు పరమపావనులు వారి, కెడయు వ్యభిచారదోషంబు ఋతువువలననని మనుస్మృతి దలపఁగా వినవె యెందు, నిందు వలవనిసందియ మేల విడువు.
అది యటు లుండె న్వినుమా, మదవతి నీమీఁదఁ గలుగు మక్కువ వలనన్మదనాస్త్రములకుఁ జిక్కిన, త్రిదశేంద్రుని వెతలుగొన్ని దెలిపెద నీకున్.
కలకంఠకంఠి నీగబ్బిగుబ్బ లటంచు మేలిపూబంతులు కేల నలముఁజిలుకలకొలికి నీచిన్నవాతెఱ యంచుఁ బాళితోఁ జిగురాకుఁ బంట నొక్కుఁగలికి నీతళుకుఁజెక్కు లటంచు లవళీదలముల ముద్దాడు మేలంబు దనరనొప్పులకుప్పనీయుదుటుపెందొడ లంచుఁ గదళికాతరుల నఖంబు లుంచు
నందనవిహారవేళ సంక్రందనుండు, మదనకనకాస్త్రవిస్మృతోన్మాదుఁ డగుచుఁజూచి రంభాదికాంతలు చోద్య మందఁ, గల్లఁ గా దిది నీయాన కరటియాన.
నునుబాలకాయయొంటులు జాతినిద్దంపునీలంపుఁబోగులు నీటుసూపవలకేల బూనిన తెలిచాయ నూరుదారలవాలు గఱిచిల్వచెల్వుఁ దెల్పనెమ్మేన నలఁదిన కమ్మగంధపుఁబూత కస్తూరికాకాంతి గడలుకొనఁగగళమునం దగుకల్పకప్రసూనసరంబు నీలోత్పలంబులనీటు సూప
నిగ్గులీనెడు తలఁపు మానికపుగద్దెఁ, దొగలపగదాయ ఱాలీల రగులుకొనఁగసెగ వసముగాక దిగధిపుల్వగలఁ బొగుల, వజ్రి కొలువుండు మదనసంజ్వరమువలన.
ఇంతమన్మథసంతాప మేల వచ్చె, శక్రుఁ డెక్కడఁ జూచె నాచక్కఁదనముననుచు నడిగినఁ దెలిపెద విను మదేభ, కుంభజృంభితవక్షోజకుంభయుగళ.
కమలసంభవువీటఁ గాంచె ని న్వేడుక నది మొద ల్మనసు నీయందె తగిలెనెన్నఁడు నీవు న న్నెద నుంతువో యంచు నీచక్కఁదనము వర్ణించు నెపుడుఁగంటికి నిద్దుర గానఁడు రేపగ ల్చిగురుకైదువుకానిచేతఁ జిక్కెనమృతంబుపై సైత మరుచి జనించెను నిను గూర్చుమని వేఁడుకొనును సఖులఁ
గాకవసగాక పడు బయ ల్గౌఁగిలించు, మూర్ఛపాలగు నీమీఁదిమోహమున సురేశుఁ డేకాదశావస్థ నిటులు చెందె, నింకనైనను దయఁజూడవే లతాంగి.
అనినఁ జిఱునవ్వు నవ్వి యయ్యంబుజాక్షి, వేల్పురాయఁడు నీవల వెఱ్ఱివాఁడుగాక యెవ్వరిసొమ్ముకుఁ గాంక్ష సేసి, యింతవలవంతఁ గుందెడు నింతి యనిన.
మంచిపున్నమచందమామఁ జూడనె కాని వేడుకతోడ ముద్దాడవశమెయూరక చూచి నోరూరుటింతియె కాని యందనిమ్రానిపం డ్లందవశమె
తళుకుతళ్కని మించుతొలుకారుమించుఁ గాంచనెకాని కౌఁగిలించంగవశమెకనకాద్రిశృంగము ల్గనుఁగొననేకాని సులభంబుగాఁ బట్టిచూడ వశమె
యటులు పరకాంత నగుమొగం బధరబింబ, మంగవల్లియుఁ జనుదోయి యలరుఁబోఁడికోరుటయెకాక యేల చేకూరుఁ దనకు, వలవనిదురాశ యేటికి వలదు పొమ్ము.
చీమ చిటుక్కుమన్న వెతఁ జెందెడిచిత్తముతోడ జారతోనేమిసుఖంబు గాంచు విటుఁ డేటికి యీభ్రమ వట్టిపాప మింతే మఱియేమి లేదు వెఱతెర్వులఁ బోవుట గాదటంచునోకామిని నేఁడు నామనవిగా వినిపింపు నిలింపభర్తకున్.
అమ్మనేఁ జెల్ల యెంతప్రొద్దాయెఁ జూడు, మగువ మాటలసందడి మఱచియుంటిఁబోయివచ్చెద నని కొన్నిపూలు గొనుచు, బాలికామణి తనపర్ణశాల కరుగ.
అనిమిషపతి దూతికయును, దనరాకల కెదురుచూచు ధరణీధరభేదను జేరఁ జనిన నతఁడును, గనుఁగొని మోదమున నొంటిగా నిట్లనియెన్.
నీరేజానన పోయివచ్పితివె కంటే పూర్ణచంద్రాననంగారా మొప్పఁగ మాటలాడెనె పొసంగం గేళిసంకేతవమేయోరం జూపెను నేఁడొ ఱేపొ చెపుమా యుల్లంబు రంజిల్ల నాపై రాగం బొకయింతయుండు మును నేభావించుతచ్చేష్టలన్.
తెలియఁగలేకయున్న భవదీయవచోరచనాచమత్కృతింగలుగకపోవుటెట్లు కలకంఠికి నాపయి మోహమంచు వేల్పులదొర యప్పుఁడే మృగవిలోచన దక్కినయట్లు పల్కఁగాఁబలికె లతాంగి లేనగవుపల్కులఁ గప్రపుపల్కు లొల్కఁగన్.
వనిత చక్కనివాని నెవ్వానిఁ గనినఁ, జెమ్మగిలకుండ దాచోటు చెప్పనేలనిన్నుఁ జూచునహల్యకు నెనరు లేదె, హృదయ మియ్యదు పతిభీతి యింతె గాక.
అనుటయు నుస్సురంచు విబుధాధిపుఁ డింకిట నేమి సేయుదున్వనితను గూర్చునంచు నెదనమ్మిన నిచ్చెలి యిట్లు చేసె గ్రొన్ననవిలుకానిముల్కి యెదనాటి కలంపఁగ నోర్వఁజాల నిత్తనువుఁ ద్యజింతు నన్నను విధాత యమర్త్యునిఁగా సృజించెఁగా.
అకట కలనైన నప్పొలంతుకఁ గలయుదుఁ, గాకయని యెంచ నిద్దుర లేకయుండఁజేసినాఁ డొంట రెంటను జెఱచినాఁడె, యెల్లవంకలఁ జెఱచెఁగా యింద్రు నజుఁడు.
అని చింతించుచు నిలింపపాలకుండు శంపాలతాంగిం బంపి నిరనుకంపంచంపకగంధిగంధననందనవనకుసుమవిశిఖశిఖిశిఖాసంతాపితసంతప్తహృదయుం డగుచునొక్కరుండును సురతరంగిణి కరిగి వనవిహారంబునం బ్రొద్దు గడపుచున్నయెడ.
గౌతముం డఱకాలఁ గన్ను చూపె నటంచు హరిపదంబునఁ జూపు నక్షు లనఁగనవనికిఁ దివియుచో ననురాగమున గాంచ మొనయు సతీపతీముఖము లనఁగఁబ్రతిబింబబహుళతఁ బరికింపఁగా వ్రేలఁబట్టిన రత్నదర్పణము లనఁగసమయాంబువాహి యంసమున మించు కడానిక్రొమ్మించుకావడికుండ లనఁగఁ
బూర్వపశ్చిమపర్వతంబుల దనర్చె, శశిదివాకరబింబము ల్సాయముననుజాఱె రవి యంతఁ జంద్రుఁడు మీఱె దివిని, బండువెన్నెల నిండె భూమండలమున.
తెరువరి యెండకు నోర్వక, సరగున నొకయెడను జేరఁ జనఁదవవైశ్వానరుఁ డడరినవడు వేర్పడ, సురపతి సురసురను స్రుక్కె క్షోణిగతుండై.
ఒకయుపాయంబు చింతించి యుత్సహించి, యాశ్రమంబున కేతెంచి యక్షపాదునుటజమునఁ బొంచె నించువిల్లూనుమించు, చించి చెండాడఁ బవిపాణి వంచనమున.
ఆనాఁటినిశి నహల్యా, మానిని పతిపదము లొత్తి మక్కువమీఱంగా నొద్దఁ బవ్వళించిన, నానాతిమనం బెఱింగి యాతఁడు నగుచున్.
ఇంతీ పర్వము నేఁ డటన్న నవులే యేమైనఁ దా నేమి పోయంతేకాక మఱేమి యందులకు మి మ్మర్థించినానే బళాయెంతే కంటికి నిద్ర దొట్టుకొనిరా నీ చెంత గోరంతనిద్రింతుం గాకని పండినా ననుచు నీరేజాక్షి లేనవ్వునన్.
మాఱుమొగంబు పెట్టుకొని మారునివేదన తాళలేక వేమారుఁ గటాక్షవీక్షసుకుమారతనుం బ్రియుఁ జూచుకొం చయోకోరినవేళ నాయకునికూటమి గల్గి సుఖించువార లేమేరను నోఁచిరో యనుచు మించినచింత నొకింత గూర్కగన్.
ఆయెడ కోడియై మఘవుఁ డంబుజబాణున కోడి కొక్కరొక్కో యని కూయ వేగెనని గొబ్బున గౌతమమౌని యేటికింబోయినఁ దాను గౌతమునిపోలికె వేషము పూని దేవతానాయకుఁ డేఁగుదేర లలనామణి వాకిటనుండి చూడఁగన్.
వెలదిచూపులు దేవతావిభునిమీఁద, నెరసి నీలోత్పలంబులనీటు సూపియవియె సూచించె భావిసహస్రలోచ, నముల బెడఁగు సుదృక్కులక్రమము మెఱయ.
అంత.
వల్లభ యింతలో మరలివచ్చితి రేమని విస్మయంబుతోఁబల్లవపాణి పల్క సురపాలకుఁ డుల్లము పల్లవింప నోహల్లకగంధి నీచెలువ మట్టె తలంచిన ప్రేమ మించెనేకొల్లలు గాఁగ నిన్ రతులఁ గూడఁగ వచ్చితి రమ్ము నావుఁడన్.
ప్రేమయు గద్గదస్వరము భీతియుఁ గంపముఁ దొట్రుపాటు నానామధురోక్తి గల్గు కుహనామునిఁ దప్పక యట్టె చూచి సుత్రామునిఁగా నెఱింగి యవురా యని కాముని మెచ్చి యామునిగ్రామణి ణి యిట్లనియెఁ బ్రౌఢవచోరచనాచమత్కృతిన్.
మేనకనో తిలోత్తమనొ మెచ్చగ రంభనొ చంద్రరేఖనోనే నొకచారురూపవతినో క్షితిదేవవరేణ్య యేల నాపై నిటువంటిప్రేమమును బర్వ మటంటిరి పర్వమయ్యెనేసూనశరాసుచేత దయఁజూడఁడుగా యతఁ డెంతపెద్దలన్.
అని చాతుర్యంబుగాఁ బల్కు జలజాతముఖికిఁ గైతవ గౌతమముని పురుహూతుం డిట్లనియె.
రంభ నీమృదులోరుజృంభణం బొకయింతఁ గనుఁగొన్న లో మెత్త గాకయున్నెశశిరేఖ నీఫాలసౌందర్య మొకయింత భావింప నొకవంకఁ బోవకున్నెహరిణి నీకన్దోయియంద మొకించుక గాంచినచోఁ బూరి గఱవకున్నెయూర్వసి నీవేణియొప్పిదం బొకయింత తిలకింపఁ జాయలు దేరకున్నె
యితరకాంతల నెన్నఁగా నేల వారి, రోసియేకాదె నినుఁ గోరె వాసవుండుమున్ను నాపుణ్యఫల మన ని న్నొసంగె, నలువఋణ మేమిటను దీర్తుఁ గలువకంటి.
మాటల జాగుసేయకుము మన్మథవేదనఁ దాళఁజాల నోపాటలగంధి నీదుకుచపాలికఁ జేర్పుము తెల్లవాఱినన్వాటముగా దటంచు సురవల్లభుఁ డంగనకే ల్దెమల్చుచుంబైఁటఁ దొలంగఁ జన్నుగవపైఁ బడి కౌఁగిట కాసచేయుచున్.
నిలువునకుం జెమర్చె రమణీమణి మోహమొ కాక భీతియోతెలియగఁ గూడ దప్పు డలదేవవిభుండును గంప మొందె మిక్కిలి యొడఁబాటులేని పరకీయకరంబుఁ దెమల్పఁ గౌఁగిటంగలయఁగ దొడ్డసాహనము గాదె బలారికిఁ జెల్లె నయ్యెడన్.
ఇటులు బలాత్కారంబునఁ, దటుకునఁ బైఁబడిన దేవతాపతి కెడగానటు నిలిచి కుటిలకుంతల, యిటు లనియె న్మోహభీతు లెదఁ బెనఁగొనఁగన్.
ఇదె తెలవాఱవచ్చెఁ గదవే యిదె సంధ్యకు వేళగాదె సమ్మదమున నిత్యకర్మవిధి మానకదీర్పుదు రాత్రివేళ మీమది సరిపోవురీతి నను మన్ననచేసెద రింతెకాక నీయదవద మేరగా దని మృగాక్షి గృహాంతరసీమ కేఁగఁగన్.
వెంటనె యంటి పద్మముఖివేణి కరంబున నంటి నిల్పి నీకంటికి నింపుగా నెనరు గైకొనకేగెదు చౌకచేసి నీ
వంటి కులాంగనామణికి వర్తనమే యిది యేమి చేయునోదంటగదా మరుండు దురితం బగు వేఱొకటైన భామినీ.
అన విని నవ్వుచు జవ్వని, విను నాయక నూతినీళ్లు వెల్లువఁబోనేవెనుక నగుఁగాక పొమ్మన, వినక యతఁడు మల్లువెనుక విసువక యతఁడున్.
పెనఁగి లతాంగివేణి విడిపించుక జంకెన వాఁడిచూపుతోఁగనుఁగొని నీవు నాపతివె కావు నిశాటుఁడ వింతెకాక యాతని మునివేష మూనితివి తప్పక దెల్పుము నాదుభర్త కీఘన మగుప్రేమ గాన నిఁకఁ గల్లలు వల్క శపింతు నంచనన్.
గడగడ యొడలు వడంక, న్బడఁతుకయడుగులను వ్రాలి పడఁతీ నే నింద్రుఁడ నీ వెటువలెఁ జేసినఁ, గడుమంచిది మదనుచేత గాసిలుకంటెన్.
అనవుఁడు నింద్రుఁ డంతఘనుఁ డంఘ్రులపైఁ బడి యింత వేఁడఁగావినమి గడుం గొఱంత యని వేడుక మీఱఁగ లేవనెత్తి యోయనిమిషనాథ నీకుఁ దగవా ననుబోఁటికి మ్రొక్క నంచుఁ దాస్తనలికుచంబు లొ త్తె స్మరశాతశరవ్రణపీడ వీడఁగన్.
గమకపుగుబ్బచన్ను లెదఁ గాడఁగ నింద్రునిఁ గౌఁగిలించుచోఁదమిని నహల్య దొంటిసుకృతంబునఁ గల్గెడుఁ గాక నింద్రభోగము సమకూరునే యితరకాంతల కంచును మేనువొంగ భావమునఁ దలంచె నాఁటి శ్రుతివాక్యము వాసవదూతి మెచ్చుచున్.
కామినిగౌఁగిటం దగిలి కాయము గీయ మెఱుంగఁ డయ్యె సుత్రాముఁడు గొంతసేపునకు దత్కుచచూచుకభేదనంబుచేనేమె యొకింతమై దెలిసి యింపునఁ జెక్కిలి ముద్దుగొంచు నెమ్మోమున మోముఁ జేర్చి జిగిమోవికి మెల్లనె యాస సేయఁగన్.
ఔరా మోహ మటంచును, నారీమణి మోము ద్రిప్పి నాకాధీశున్గూరిమినిఁ జెట్టవట్టుక, చేరువఁ దనశయ్యఁ జేరి చిత్తం బలరన్.
పంట నొక్కనటంచు బాస చేసినఁగాని తేనెలూరెడి మోవి యాననీయగోట నొక్కనటంచుఁ జాటి పల్కినఁగాని బటువుగుబ్బలు కేలఁ బట్టనీయనాదు సేయనటంచు నమ్మికిచ్చినఁగాని మినుకుఁజెక్కిలి ముద్దు గొనఁగనీయనగడు సేయనటంచు నాన పెట్టినఁ గాని హాళితో రతికేళిఁ దేలనీయ
వినుము నెఱజాణ నీచక్కదనము సూచి, వలచి యొప్పినయప్పుడే వారవనితగాను మగనాలఁ గాన నీక్రమముఁ దెలిసి, యిందు కొడఁబడి న న్నేలుమీ సురేంద్ర.
అనుచు నొడఁబాటు గావించె నాది నింద్రుఁ, డింతియే కాని వెనుక యథేప్సితముగనఖరదంతక్షతాదుల నడఁచెఁగాక, తెలియమంచన గుఱికట్లు నిలుచు టెట్లు.
అసకృచ్చుంబనము ల్ముహుర్ముహుదుదారాశ్లేషము ల్శశ్వదుచ్ఛ్వసితవ్యావృతము ల్పునఃపున రుదంచద్దంతసంలక్షితవ్యసనావిష్కృతసీత్కృతంబులు మనాగ్వర్ధిష్ణుదీనోక్తులైయెసఁగెం గౌతమగేహినీదివిజలోకేశానసంభోగముల్.
మోవి యానుచుఁ బంటమొన నొక్కి విడుమంచు సీత్కృతితోఁ గోటఁ జెక్కు మీటువలిగుబ్బ లంటుచు నెలవంక లుంచినఁ గోపించి కీల్జడఁ గొట్టి విసరురతికూజితంబు ప్రార్థన సేయుచును బాదముల వ్రాఁలఁ గిన్కతోఁ దొలఁగఁజేయుమమతఁ బైకొన జుబుకముఁ బట్టి వేఁడినఁ దలకు సిగ్గునఁ గేలు దట్టివైచుఁ
జెవిని జిఱుబూతు లాడవచ్చిన నదల్చు, వలదు మెల్లన యని రతి త్వర నడంచుజాలు విడరా యటంచుఁ గెంగేల మ్రొక్కు, జలజలోచన నూతనసంగమమున.
ఎంత కామాతురుఁడొ కాని యింద్రుఁ డహహ, యలసి తొయ్యలిగబ్బిగుబ్బలను వ్రాలిగడియ సాలదె యిట్టిభోగంబు వెనుక, నేమియైనను మేలంచు నెంచె మదిని.
చెలువ రతాంతవేళ బలుసిగ్గున నంగము దాఁచికొంచు దువ్వలువ గ్రహించి కట్టికొన వల్లభుఁ డొయ్యఁ జెఱంగు పట్టి యోకలికిరొ యింతసేపుఁ బొడగాననిసి గ్గిపు డెట్టు వచ్చె నేకెలసము దీరె నంచుఁ గనుగట్టితొ ముంగడ నుంచు వ్రీడకున్.
పొంకమె యిట్టులైన నటు పొమ్మను లజ్జ నదేల యంటివాయింకొకసారియైన రమియింపక నాతమి దీరదన్న నేణాంకముఖీలలామ యమరాధిప నీతమి దీఱకున్న నీవిం కిట నేమి సేయఁగల వీతమి దీఱె నటంచు నవ్వుచున్.
చెల్ల పనులకుఁ బోవలెఁ జేల విడువు, మతఁడు రావేళ యయ్యె నటంచుఁ బెనఁగఁజేల విడుమంటి వటువలెఁ జేయువాఁడ, భామ పదరకు తెలవాఱ జాము గలదు.
అనవుడు నేటికి బ్రమసెదు, విన వృద్ధశ్రవుఁడ వౌట వినవో యేలావినవైతి కోడి గూసెం, దనరవమై మరునిధర్మధార యనంగన్.
నావుడు నవ్వి యవ్విబుధనాథుఁడు నే భ్రమఁ జెంద నొక్కనాఁడీవిభుఁ డీవునుం భ్రమయుఁ డింతియె యెట్లనఁ గైతవంబునన్నీవిభురూపుఁ బూనుగతి నే మును గుక్కుటమై నిశీధినిన్నీవిభు నంపితి న్నదికి నేరుపు మెచ్చవుగా విలాసినీ.
అన వెఱఁగందుచు నింద్రునిఁ, గనుఁగొని నాతోడు నీకుఁ గల్లయొ నిజమోవినిపింపు మిదియు నిజమై, నను వలసినవేడ్కఁ గనమె నానాగతులన్.
అనిన నిజమౌను నీయాన హంసయాన, కల్లగా దన వల్లభుఁ గాంచి యలరిమేలు నెఱజాణ యెటులైన మెచ్చవచ్చు, ననుచుఁ జెయిలోనఁ జెయి వేసి వనిత నగిన.
ఇంతిరొ వట్టిమెచ్చు లివి యేటికి నీవి యొసంగు మంచుఁ దానెంతయు నేర్పుతోఁ బెనఁగ నింద్రుఁడ నీ కిఁక నేమి యిచ్చెదంగాంతుఁడ రెండుచక్రములు గావలెనన్న నొసంగుదాన నాకింతియెె కాక వేఱొకటి యెయ్యది యీవని నంచు నవ్వుచున్.
అంత నరవిరిమజ్జనం బాచరించి, నవముగా మేన హరిచందనం బలందివిరులు కొప్పునఁ దుఱిమి యవ్వెలఁది విభుఁడు, తారసిలి రప్పుడు పునారతంబునకును.
పతి కప్పురపుఁదావి బాగాలు గైకొన్న మదిరాక్షి సగమాకుమడుపు లొసఁగెనెనరుతోఁ గాంతుఁ డొయ్యనఁ గౌఁగిలించినఁ గొమ్మ గుబ్బల ఱొమ్ము గ్రుమ్మి క్రమ్మెబ్రాణనాథుఁడు మోవిపైఁ గంటు చేసిన నలివేణి పారవశ్యమునఁ జొక్కెవిభుఁడు నిల్కడఁ గేకివిధమున రొదగుల్క లోలాక్షి చెవియొగ్గి యాలకించె
మోహనాంగుఁడు నునుపోఁకముడి సడల్పఁ, దరుణి జతయయ్యెఁ జిత్రబంధంబులకునుఁగూర్మి వల్లభుఁ డొకకొంతఁ గూడి యలయఁ, గుసుమకోమలి దాను పైకొని రమించె.
ఎన్నఁడు నేర్చెనో తెలియదే జగదేకమనోహరాంగి యాచిన్నె లదేమి దెల్ప విటశేఖరుఁ డూరక చూచుచుండె నాచన్నులకుల్కు లాసగముజాఱెడివేనలి యాయొయార మాకన్నులబెళ్కు లాకదళిక ల్గనుపొంకము లావిలాసముల్.
అతివ యీగతి నుపరతి నలసి సొలసి, యప్పళించుక వ్రాలె నాయకుని యెదనుసరి బెనంగుట గన్గొని శంబరారి, చెలఁగి యిరువుర నొక్కటి చేసె ననఁగ.
అరవిరికల్వక్రొవ్విరులయందము నొందిన కన్నులు న్సుధాకరకళలం ద్రవించు శశికాంతముఁ బోలిన చెక్కుటద్దముల్సరభసదక్షిణానిలము చాటునఁ గ్రమ్మెడు కమ్మయూరువుల్గరువపుటెండ సోలులతకైవడి వ్రాలు నిజాంగముం దగన్.
ఎదపయి వ్రాలియున్న తరళేక్షణ నిధ్దపునిండుకౌఁగిటంద్రిదశవరేణ్యుఁడు న్సమరతిక్రియఁ జొక్కియు మున్నుమున్నుగామదవతి మోవిపానకము మాటికిఁ గ్రోలుచు సేదదేలెదత్సుదతియు నట్ల దేరికొనెఁ జుంబితశంబధరోష్ఠబింబ యై.
అంత.
కమలదళాక్షి దువ్వలువఁ గైకొని లేచి కటీతటంబునంగొమరుగఁ గట్టిగట్టిగను గ్రొమ్ముడిఁ బెట్టి మిటారిగుబ్బలంజిమచిమగుల్కు గోటికొనజీరలకు న్విడికెంపు కెంపుమీఱుమెఱుఁగుమోవిపైఁ జుఱుచుఱుక్కను కెంపులకుం దలంకఁగన్.
ప్రమదా నే నిఁకఁ బోయివచ్చెదను నాపై నీకృపావేశ ముంచుము నీవాఁడ నటంచు దేవపతి యస్తోకస్పృహామందమందముగా వేఁడిన గుండెజల్లుమనఁ గాంతారత్న మొక్కింత దైన్యముతో నక్కున మోవిఁ జేర్చి నినుఁ బాయ న్నేర్తునే వల్లభా.
నీపయి నాకు నాపయిని నీకును గూరిమి గల్గఁ జూచియుంబాపపుదైవ మిట్టు లెడఁబాయఁగఁ జేసెను దొంటిపుట్టువందేవగఁ జేసినామొ విధి కేమిటి కీగతతోయబంధముల్నాపయిఁ బ్రేమ యుంచు సురనాయక మర్వక న న్నొకప్పుడున్.
అనిన నామీఁద నింతమోహంబు గలిగె, నేని నావెంట రమ్ము మత్తేభగమనయెంతపనియైన నే నిర్వహింతు నంత, సడ్డసేయను జుమ్ము ముజ్జగమువారి.
నావుడు నింత యేల సురనాయక నన్నిటఁ దక్కనిచ్చునేనావిభుఁ డట్టులైన నుడునాయకుఁ జేరిన తారరీతి మాకావిధ మింతె కాక కలదా యొకయింత ప్రయోజనంబు నాభావమునందుఁ దోఁచిన యుపాయము చెప్పెద నాలకింపుమా.
దేవపూజకు విరు ల్దెచ్చెదనంచును వనికాంతరములకు వచ్చునపుడునివ్వరిధాన్యము ల్నెమకంగఁ గేదారపరిసరంబులయందుఁ దిరుగునపుడుఁగడువేడ్క నన్నోదకంబులఁ గొని తేర దూరతటాకంబు సేరునపుడుఁజెఱగుమాసె నటంచుఁ జెప్పి యూరకయైన నొంటిగాఁ గడయింట నుండునపుడు
వచ్చి నాముచ్చట ల్దీర్చు మెచ్చుగాను, నిచ్చ తచ్చనగాదు వియచ్చరేంద్రయనుచు నక్కునఁ జేర్చి మోహమునఁ జెక్కు, ముద్దుగొని పంపె నింద్రు నమ్మోహనాంగి.
అంపినయప్పు డమ్మఘవుఁ డవ్వలఁ బోవఁగలేక ప్రేమతోఁజంపకగ్రంధి గబ్బివలిచన్నులపయ్యె కఁదఁ జక్కఁజేర్చుచున్సొంపునఁ జెక్కులుం బుణుకుచు న్మధురాధర పోయివత్తునేయంపితివా యటంచు నిలయంబట వెల్వడి యెట్టకేలకున్.
ముని యెదురౌనొ యంచు సురముఖ్యుఁడు భీతిని బోవునంతలోననఘుని గౌతముం గనియె నక్షపదుండును వేషధారినిం
ద్రునిగ నెఱింగి యిట్టులను రోషసముజ్జ్వలితాత్ముఁ డౌటఁ జెందిన యఱకాలిమంట నడునెత్తికి నెక్క ఝటాఝటంబునన్.
ముష్కరహితవృత్తినిఁ బర, పుష్కరపత్త్రాక్షిఁ బట్టి భోగించుటచేముష్కరహితుఁడవు గమ్మని, నిష్కరుణ శపించి మౌని నిలయముఁ జేరన్.
తరుణి దా నేమి యెఱుఁగనిదానిరీతి, నేతఁ గనుగొని కాళ్ళకు నీళ్లు దేఁగనలుక నమ్ముని యోసి దురాత్మురాల, యంట నర్హంబె నీచేతియంబు లిఁకను.
కల్లరివేష మూని యతికాముకుఁడై సురరాజు వేఁడుచోనుల్లము ఱాయిఁ జేసికొని యూరకయుండక నీవు లోనుఁగాజెల్లునె యిట్టిదుష్కృతముచే రఘురాముపదాప్తిదాఁక మేనెల్లను ఱాయి గాఁగ వసియింపుము నిర్జన మివ్వనంబునన్.
అని శపియించి హిమాద్రికి, జనియెన్ గౌతముఁడు జంభశాసను మేషాండునిఁ జేసి రశ్వినీసుతు, లనుపమదివ్యౌషధముల నమరులు మెచ్చన్.
బలారాతిరూపంబు భావించె గానం, బలా రాతిరూపంబెఁ బ్రాపించెఁ గానంశిలాహారినారి న్నిషేధింపు మింక, న్శిలాహారిరూపంబు శేషాఘ మింకన్.
అని ముని భవతారకనా, ముని రాముని నల్లగౌతమునివనికిం దోడ్కొనివచ్చునెడను దత్పద, వనజరజం బింత వాయువశమున సోఁకన్.
వనరాశి జనించిన శ్రీ, వనజాక్షియొ యెదురుకొనిన వనదేవతయోవనవనదావళిమించో, యని యెంచఁగ ఱాయి చెలువయై చెలు వగుచున్.
మును దలమున్కయౌ మోహాంధకారంబు వెనుకదీసినరీతి వేణిఁ దనరశాపరూపదినాంతచంద్రోదయములీల మొలకనవ్వులముద్దుమోము మెఱయబహుకాలపరచితోపలత యంటినమాడ్కి కఠినవక్షోజయుగ్మంబు గులుకఁదనదృశ్యభావంబు దవిలిపోవనిఠీవిఁ గడుసన్నమైనలేఁగౌవును వడఁక
క్షితిని లోహంబులను బైఁడిసేయు స్పర్శ, వేదివలె రామపాదారవిందరజముపూని శిలఁ బైఁడి సేసె నామేను మించఁ, గాంతయై మించె గౌతమకాంత యపుడు.
తనమునుపటివృత్తాంతము, మునిపతి వీరలకుఁ దెల్పుమునుపే యనుచున్ఘనలజ్ఞానతముఖియౌ, వనితకు రఘునందనుండు వందన మిడియెన్.
పెండ్లికొడుకవు గమ్మని ప్రేమ మౌని, రామ దీవించి శ్రీరఘురామవిభునిపూజఁగావించుచున్న నద్భుతము గాఁగ, గౌతముఁడు వచ్చి యారాముఁ గాంచి పొగడె.
సౌరధరధీర రఘువర, పారదదరనీరజారిభవకీర్తిరమామారీచమదవిరామా, నీరదనిభధామ రామ నృపతిలలామా.
శ్రీరఘురామ నిన్ను నుతి సేయఁగ నెంతటివాఁడ నేను నీపేరు దలంచినంత నతిభీకరదుష్కృతము ల్దొలంగు నీచారుపదాబ్జసంగతిని సంభవయౌట పవిత్రగాదె భాగీరథిలీల నీభ్రమరకేశిని యంచు నహల్యఁ జేకొనన్.
దివి వర్షించెఁ బ్రసూనవర్ష మపు డందె ల్మ్రోయ నాడె న్సువాసివధూబృందము దివ్యదుందుభులు మ్రోసెన్ ధింధిమిధ్వానమైయివతాళించె సుగంధగంధవహ మెంతే రామపాదాబ్జపల్లవసంజాతపరాగచాతురి సహల్యాగౌతము ల్గూడఁగన్.
అంత సంతుష్టచిత్తుఁడై యక్షపాదుఁ, డధిప మాకందమయ్యె నీయంఘ్రిపద్మమనుచుఁ బొగడుచుఁ గాంత, దోకొనుచుఁ జనియెఁ, గౌశికుండును జనుచు రాఘవుల కనియె.
కనుఁగొంటే మిథిలాపురంబు ధరణీకన్యాపదాంభోజమోహనమంజీరఝళంఝళత్ప్రబలనాదాకృష్ణమందాకినీకనకాంభోరుహకర్ణికాంతరచరత్కాదంబికామేడ్రితాయనఖండాభ్రగకేళిసౌధమయి చెల్వయ్యెన్ రఘుగ్రామణీ.
అస్తమయవేళఁ బురమున కరుగనేల, నేటి కీకేళివనిలోన నిల్చి ఱేపుపోవ మేలగు నని మౌనిపుంగవుండు, రాఘవులతో వనాభ్యంతరమున కరిగి.
గుబ్బకస్తూరికుంకుమ యంటినది కొమ్మ గోరంట కౌఁగిట గ్రుచ్చెనేమొయంఘ్రిలాక్షారసం బంటియున్నది లతాతన్వి యశోకంబుఁ దన్నెనేమొమధువాసనలు గుల్కె మంజుళకేసరం బువిద పుక్కిటిరసం బుమిసెనేమొయసమయంబునఁ బూచినది సహకారంబు భామాలలామ చేపట్టేనేమొ
రామ కనుఁగొంటె కేళికారామసీమ, సహజవాత్సల్యమున భూమిజాతసీతప్రోది సేసినభూరుహంబులు సురేంద్రు, తరుల నవ్వుచు నున్నవి విరులసిరుల.
అని సీతాకేళీవనిఁ, గనుగొని మువ్వురును సాంధ్యకరణీయంబుల్వొనరిచి క్రొన్ననతలిమము, లను వసియించిరి కుతూహలంబున నంతన్.
శ్రీరామునకుఁ బెండ్లి ఱేపని వరుణున కెఱుఁగింపఁ జనుమాడ్కి నినుఁడు గ్రుంకెహెూమాగ్నిశిఖ లిట్టు లుల్లసిల్లు నటన్నకైవడి సాంధ్యరాగములు మెరసెమొనయుదంపతులకు మోహ మీవైఖరి యనుమాడ్కిఁ జీకటు లలమె దిశలఁదలఁబ్రాలు ముత్యము ల్దలపించునంచును గనుపట్టె దివిని నక్షత్రగణము
తెరమఱుఁగు వాసి యీలీలఁదీరు సూపు, సీతమొగ మను క్రమమున శీతకరుఁడుదోఁచె నచ్చెల్వ దృష్ట్లనాఁ దొగలు సెలఁగె, నిండె నీనవ్వు లనఁగ వెన్నెలలు గంటె.
అని పలికి ప్రొద్దువోయెన్, జనవర నిద్రింపు మనుచు సంయమివర్యుండనుజుండును శయనింపఁగఁ, దనకంటికి నిదుర రాక తద్దయుఁ బ్రేమన్.
కన్నులఁ జూడకున్న మహికన్యక తాదృశకౌశికోక్తులంగన్నులఁ గట్టినట్లయినఁ గన్నులవింటివజీరు నిద్దపుంగ్రొన్ననవాఁడితూపు లెదఁ గ్రుచ్చుక వెన్నున దుస్సి పాఱఁగావిన్నదనంబు దోఁప రఘువీరుఁడు మోహముచేఁ దలంకుచున్.
ఎప్పుడు తెల్లవాఱు నిఁక నెప్పుడు మైథిలిరాజుఁ గాంతు నేనెప్పుడు చంద్రమౌళిధను వెక్కిడుదుం ధరణీకుమారి నేనెప్పుడు చెట్టవట్టుదు నభీష్టము లెప్పుడు గాంతునంచుఁ దానెప్పుడు నెంచుఁగాని యెనయింపఁ డొకప్పుడు నిద్రకంటికిన్.
ఇత్తెఱంగున సీతాకాంతనుం దలంచి యంతయు నంతరంగంబునఁ జింతించు రఘుకాంతుం డొక్కింత నిదురింప నంత వందిజనులచెలు వంది ద్విజబృందంబులు కలకలధ్వనుల మేల్కొని యర్ఘ్యప్రదానంబున నరవిందసఖునకు మందేహజయంబునొందించి విదేహరాజపురంబునకుఁ జనునెడ విరహచ్ఛిదేహవిదేహశరవ్యూహకీలితదేహుండగు రఘూద్వహునకుం గౌశికుం డిట్లనియె.
అదె కన్గొంటివె వజ్రసాల మదె ఖేయవ్యాజపాథోధి యల్లదె వైదేహనృపాలశేఖరమహోద్యద్రత్నసౌధాగ్ర మల్లదె రథ్యాగృహకేతుజాతమదవేశ్యాభర్మహర్యాలి యల్లదె యత్యుత్తమవాజిశాల యని యాయాదిక్కులం జూపుచున్.
ఆరెకట్టికవార లందంద కుంతము ల్గొని ముందుగాఁగ ఢీకొల్పుచుండహరిదంతదంతిజయంబును సూచించు కరణిని డవిణెమలహరులు మొఱయధర బూను మనుచుఁ బాదముఁ బట్టి విడువని చిలువఱేఁ డన వెండిగొలుసు దనరగంధాంధమధుపసంఘంబులు మాత్రమె కాని సరసఁ జేరక భీతి జనము దొలఁగఁ
జాల మదమున మావంతు గాలుమీఱి, వచ్చుదంతావళముఁ గంటె వసుమతీశకేలు మొగుచుచు నున్న దీవేళ నీకుఁ, బుడమికన్నియ నడలకు జడిసి కాదె.
అని దాని కోసరిల్లుచు, మనుజేంద్రకుమారుతీరు మౌనుల మేమౌటను దాని కోసరిల్లుట, సనునె కదా యనుచు సరససల్లాపములన్.
నగరివిద్వాంసు లందలములు డిగ నూరకందలం బెక్కి పొం డని నుడువుచునల్లంతఁ గనినంతేఁ బల్లకీల్ డిగ్గి భూవల్లభు ల్మ్రొక్క దీవన లొసఁగుచుఁగేవలభక్తితో లేవవణిక్కులఁ గ్రేవలనఁటఁ గటాక్షించికొనుచురాముసౌందర్యంబు ప్రేమఁ జూచుచు వచ్చు కామినీజనులఁ గ్రేఁగంటఁ గనుచు
వేడ్క గాధేయుఁ డేతేర విని విధేయుఁ, డగుచు మిథిలాధినాథుండు నగరు వెడలియమితగజవాజిభటసంకులముగ నెదురు, కొని సపర్య లొసంగి తోకొనుచు వచ్చి.
జనకక్ష్మాపతి కొల్వుకూటమున విశ్వామిత్రు శ్రీరామచంద్రుని సౌమిత్రి యథోచితాసనములందు న్నిల్పి పీఠస్థుఁడైమునిజంభారి ఫలించె నామఘ మఖంబు ల్దూరమైపోయెఁ బావనమయ్యెం గులముం గులంబు ననుచు న్వాక్ప్రౌఢి వర్ణింపఁగన్.
జనకచిత్తంబు శ్రీరామచంద్రుఁ దగిలి, కనియె బ్రహ్మానుసంధానమునను గాంచఁదవిలి నానంద మపుడు ప్రత్యక్షమైన, సగుణ మట్టిప్రమోద మెసంగు టరుదె.
ఈచందంబున రఘునందను శతకోటికందర్పసౌందర్యుని దర్శించి యమందానందంబు నొంది జనకజగతీసంక్రందనుం డిట్లని వితర్కించె.
సృష్టికిం బ్రతిసృష్టి చేసెనంచును వింటి మీమునీంద్రునిఁ దొల్లి యిపుడు నిచటనొకట నింద్రోపేంద్రులకుఁ బ్రతినిర్మించెనో లేక సూర్యచంద్రులకుఁ బ్రతియొమన్మథునకుఁ బ్రతిమన్మథులో యటు గాకున్న రాజలోకంబునందుఁగలుగునే యింత చక్కఁదనంబు పురుషులమనసు హరించె స్త్రీజనము లెంత
యందు నీయగ్రజుని చెల్వ మరిఁది పొగడ, నితనికిఁ గుమారి నొసఁగి నాయింట నుంచికొనెడి భాగ్యంబు దొరకునొకో య టేల, గలుగు దుష్టప్రతిజ్ఞుఁడఁ గాన నేను.
ఏలా చేసితి దుష్ప్రతిజ్ఞ యిఁకఁ జండీశానకోదండ మీబాలుం డెక్కిఁడఁజాలకుండిన వృథా పంపింపఁగా నేర్తునేచాలింపం దగునే ప్రతిజ్ఞ నగరే పాలకు ల్వచ్చె నాందోళం బే నిఁక నెట్టిచందమునఁ దీర్తుం ధర్మసందేహమున్.
అని మహాహ్లాదమున విదేహాధినేత, వీర లెవ్వారలో సుకుమారమూర్తులనిన దశరథరాజనందనులు వీరు, ధనువుఁ జూడంగ వచ్చినా రనియె మౌని.
అనవుఁడు పరమాద్భుతమున, జనకుఁడు దశరథున కిట్టిసంతానము గల్గెనె యిష్టి సఫలమయ్యెనె, కనుఁగొంటిమి నాఁటి యత్నగౌరవ మెల్లన్.
శ్రీశుఁడు క్షీరవార్ధి వసియించుట మాని మహిన్ మహీశుఁడైయీశశరాస మెక్కిడిన నెక్కిడెఁగాక మనుష్యమాతృ లీయాశలఁ జెంద నేటికి సురాధిపముఖ్యులచేత నైనఁ గాదీశిశువు ల్గనుంగొనఁగ నేమిఫలంబు తపోధనాధిపా.
అనవుడు నిక్కమౌను మనుజాధిప నీవనుమాట యైన యీజనవరనందను ల్గనఁగ సంతసమందినవారుఁ జూడనీధనువులు వీరిముచ్చట వితావితసేయకు మన్న మౌని మీమన సనుచు న్విదేహనృపమౌళి యనేకులఁ బంప వారలున్.
మమత సురాసురు ల్దొలుత మందరభూమిధరంబుఁ దెచ్చుచందమున మహేశచాపసముదంచితపేటికఁ దెచ్చియుంచినంబ్రమదము పూని మౌని రఘురామ కనుంగొను మీశరాసముందెమలుప నేర్తువే యనిన ధీరుఁడు శ్రీరఘువీరుఁ డయ్యెడన్.
తనవిల్లునమ్ములుఁ దమ్మునిచే నిచ్చి మేరుగిరీంద్రంబుమీఁదనుండిదుమికెడి కొదమసింగముమాడ్కి మణిపీఁఠి డిగి నగుముద్దునెమ్మొగముతోడజాఱెడిసిగ కేలఁ జక్క నొక్కుచునుఁ జెక్కులను గట్టాణిచౌకళి నటింపవలెవాటు నెఱనీటు వలిపెచందురుకావి చేలచెఱంగులు నేలజీర
దివ్యభూషణకాంతులు తేజరిల్ల, సీత నెచ్చెలు లాడాడఁ జేరిచూడనఖిలరాజన్యు లచ్చెరువంద దివిని, సొంపు మీఱి నిలింపులు గుంపుగొనఁగ.
సకలలోకైకమోహనచారురూప, సంపద లెసంగ శ్రీరామచంద్రుఁ డపుడుగంధమంధరసింధురగమనలీలఁ, జెలువుమీఱంగ నల్లనఁ జేరనరిగి.
మందసముత్సాహుల కిఁక, మందుసుమీ యసమసంగ మనుజులు హరువిల్మందసముఁ దెఱచిచూచె, న్మందసముద్రేకహరకుమారుఁడు గడిమిన్.
ప్రత్యక్షమై మించుభర్మశైలముఁ బోలి బహునుపర్వాఢ్యమై పరిఢవిలుచుదృగ్గోచరం బైన దృక్కర్ణవతిఁ బోలి జ్యావహనోచితసార మగుచుసాక్షాత్కరించిన శైవధర్మముఁ బోలి ద్రిపురనిర్వాహణనిపుణ మగుచునెదుటఁ దోఁచిన నిర్జరేంద్రచాపముఁ బోలి బహువర్షసూచకప్రబల మగుచుఁ
గనకమయచిత్రకాండప్రకాండ మగుచు, బద్ధమణిఘంటికాకోటిభాగ మగుచుసర్వభూభృద్భయదవజ్రసార మగుచు, నద్భుతంబైన శంభుశరాసనంబు.
కనుఁగొని శ్రీరఘువీరుఁడు, వినతానందనుఁడు సర్పవిభుఁ బట్టెడుమాడ్కిని కుంభీంద్రము రంభా, వనిజముఁ బెకలించుప్రాభవం బలరారన్.
లీలఁ గెంగేలఁ గీలించి లేనగవుతో ధరణీశ తాతలతరమునాఁటిపాతపంచారంబు పసలేదు పేటెత్తె నిది వృథాస్థూల మిందేది బలముఅని మింటికొప్పు గల్గినవాని బలువింటికొప్పున జానకికొప్పుమీఁదఁగేలుంచువేడుకఁ గీలించి యటువంచి ధర్మంబు సుగుణయుక్తంబు చేసి
ఠీవిఁ గళ్యాణవార్తఁ జాటించు ఠేవ, నారి మొఱయించి తెగనిండ నారి దిగిచిలస్తకస్తలవిన్యస్తహస్త మింత, సళ్ళ ఫెళఫెళఫెళమంచు విల్లు విఱిగె.
ఎదఁజొక్కి నిదురవోయెడికుంభకర్ణుండు బబ్బరింపుచు లేచి ప్రాకులాడెఁగల్పాంతదీర్ఘనిర్ఘాతశంక జనింప నేం డ్లెన్నికొనియె వాణీశ్వరుండుభయచంచలితవామపాణిహఠాశ్లేష మబ్బెదం భూతవామాంగకునకుదానును ద్రిపురారిధను వౌటనో మేరుగిరి ప్రతిధ్వనులచే మొఱలు వెట్టె
జనకకౌశికరామలక్ష్మణులు దక్క, దక్కుగలవారు మూర్ఛిల్లి తగఁ దెలిసిరితత్త్రిలోచనచండకోదండదళన, నినద మబ్జభవాండంబు నిండునపుడు.
ఒకరిని బట్టం బదుగురు, సకు లాశుభవార్తఁ దెల్ప జానకి లజ్జన్మొక మింత వంచి యాకౌ, తుకమునకుం దెలిసి యొసఁగెఁ దోరపుసొమ్ముల్.
అంత జనకానుమతిని స్వయంవరోత్స, వమునకై నెచ్చెలులు పంటవలఁతిపట్టిఁజందనాలేపరత్నభూషాప్రసూన, చీనిచీనాంబరములఁ గైచేసి రపుడు.
కడువేడ్క నుబ్బు జక్కవగుబ్బచనుదోయి బిగిజంటఱవికెలోఁ బిక్కటిల్లజిలిబిలిపంచదారలు గుల్కు బొమ్మంచు మోవిపైఁ జిఱునవ్వు ముద్దుగురియఁనునుఱెప్ప వాల్చి క్రేఁగంటఁ గన్గొనుచూపు మారునారసముతో మాఱుమలయజఘనభారంబున జడియు నెన్నెడఁ బాదకటకము ల్ఘలుఘల్లుఘల్లు మనఁగఁ
గేలఁ జెంగల్వపూదండ గీలుకొల్పి, సిగ్గు నొయ్యారమును మీఱఁ జెలులు వేనవేలు దనవెంటఁ గొల్చిరా విభవమునను, జనకకన్యక చనుదెంచె జనకుసభకు.
ఆజనకేంద్రకన్యరుచిరాంగవిలాసముఁ జూచునంతలోలేఁజిగురాకు నిద్దపుగలీపుననుంచిన తమ్మిరేకుఖండా జళిపించి మారుఁడు తటాలునఁ బేరెదఁ జూచి వైవఁగారాజనృపాలశేఖరుఁడు రామనృపాలుఁడు సొక్కి నెమ్మదిన్.
కంటిమో వింటిమో యిటువంటివాలుఁ, గంటి ధరయందె కాదు వేఁగంటి నగరిగలుగు తెఱగంటి తెలిగంటిగముల నైన, నెటులు సృజియించె ధాత యీయిందుముఖిని.
పూపమిటారిచన్నుఁగవ పోఁకల వీకలఁ జౌక సేయు నౌరా పలుచాలు మేలుమగరాలసరాల నిరాకరించు నాహా పగడంపువాతెఱయొయారము చిల్కపటానిపాదుషాతూవుల కోపుసూవుఁ జెలితోరపుఁజూపులయేపు బాపురే.
కన్నె రతనంపుమిన్నా, మిన్నా నడు మనఁటియాకు మేకొను వెన్నావెన్నా పలుకులు పొక్కిలి, పొన్నా పొన్నా మెఱుంగుఁబోఁడికి నదిరా.
వనజాక్షి కటితటం బనుమహీభాగంబు బటువుగుబ్బలపేరి పర్వతములుహరిమధ్యమధ్యమ మనునంబరంబును మెఱుఁగుముంగురు లనుమేఘములును
సఖియమో మనుపూర్ణచంద్రమండలమును రదపఙ్క్తిపేరి తారాగణంబుకలకంఠినగ వనుగంగాప్రవాహంబు బెళుకువాల్చూపులపేరి యమున
సృష్టి చేసెనొ యజునిపై నీర్ష్య మరుఁడు, దాను పద్మోద్భవుఁడు గానఁ గానిచోటబ్రహ్మసృష్టిని యిటువంటి భామ గలదె, మదనుమాయయే కాని యీమంజువాణి.
అలకవ్యాజముచేతఁ బైకొనెడి నౌరౌరా కురు ల్చీఁకటుల్వలెనంచు న్ముఖచంద్రుం డంప నుడుజాలంబంత సీమంతపుంగళుకుంబాపటపేరఁ ద్రొక్కికొని రాఁగా వీఁగి పాదాంబుజంబుల వ్రాలెం జెలివేణి ప్రోవఁదగదే మూర్ధన్యసంతానమున్.
నాసామౌక్తికరోహిణీరమణి కాంతావక్త్రచంద్రాధరంబాసింపం గనుఁగొన్న తారకలకుం బ్రాపింప లజ్జాభరంబాసన్నశ్రుతికుండలస్ఫురితముక్తాభిఖ్యతారాళితోసాసాదింపఁగఁ జేరెఁ గానియెడ నేలా యోరఁగాఁ జూడఁగన్.
కమ్మవిలుచెంచుఱేనిచిక్కమునఁ దగులు, కొదమజక్కవపిట్టల యుదుటుఁ దెగడిజిలుగుపైఠాణిఱవికెలోఁ గులుకు గబ్బి, గుబ్బచనుదోయి యాముద్దుగుమ్మ కవుర.
అని తనుఁ జూచుచున్న జనకాత్మజ నెమ్మది లజ్జ ప్రేమయుంబెనఁగొన నాలుగేనుమణిపీఠికమెట్టిక లెక్కి రాజనందనుగళసీమఁ జెంగలువదండ యమర్చెను వర్ష మంబుదంబునఁ దిర మొందఁ గ్రొమ్మెఱుఁగు బూనుగతి న్నిజరాగ మేర్పఁడన్.
శ్రీరఘూత్తముఁ డిత్తఱిసీతకేలు, పట్టి తొడమీఁదఁ గూర్చుండఁబెట్టుకొనెడియంతమోహంబుతో నుండె నవనికన్య, యంత నంతఃపురంబున కరిగె నరుగ.
ఇతఁడు మనుష్యమాత్రుఁడని యెంచితిఁ గాని యెఱుంగనైతి శ్రీపతియని యామహీతనయ పద్మనివాసిని యౌట నిక్క మీగతి రవిచంద్రవంశములు గౌరవమొంద జనించినారలోవ్రతికులనేత నీ వెఱుఁగవా సకలజ్ఞుఁడ వెన్ని చూడఁగన్.
అని జనకనేత దశరథజనవరేణ్య, రాఘవులపెండ్లికిని సాగి రమ్మటంచునుత్తరము వ్రాయఁబంచి నియోగిఁ బనుపఁ, బరిఢవము మీఱ నతఁడు నప్పురికి నరిగి.
అవసరంబులవారిచే నధిపునకును, దనదురాక నెఱింగించి మునుపుగానువారు దోడ్కొనిపోవ భూవరబలారి, కడుగర లొసంగి పొడగని యొద్దనుండి.
జనకనృపు నుత్తరం బని, జనపతికిం దెల్పి రాయసము వ్రాయు నియోగిని బిలిచి యొసఁగె నతఁడును, జనపతికనుసన్న నదియు సరభసఫణితిన్.
శ్రీమతుజనకధాత్రీతలనాథుండు దశరథమేదినీధవసురేంద్రుచాలుమానుసులకు సంప్రీతిఁ బుత్తెంచిన ప్రయోజనము దమనందనుండు
రఘువీరుఁ డిలఁగల్గు రాజన్యు లెవ్వరు నెక్కిడనోపని యీశుచాపమెక్కిడి విఱిచిన నెంతయు హర్షించి సీత నొసంగ నెంచితిమి మేము
తనయులును దాము రావలెననుచుఁ జాలు, మానుసులు దశరథరాజమౌళితోడదెలిపెడిది యనుపక్కణ గలిగినట్టి, యుత్తరంబును వినుపింప నుత్సహించి.
తనదు సారిగఁ దెల్పు ప్రధానమణికిఁ, గనకపటభూషణము లిచ్చి గౌరవమునమంచిదే కద జనకసంబంధ మనుచు, బంధువులతోడ యోజించి పైన మగుచు.
గోరథంబుల నెక్కి కులగురుఁ డాదియౌ తాపసోత్తములు నందంద నడువభద్రేభములమీఁద భరతశత్రుఘ్నులు సరిగాఁగ నుభయపార్శ్వముల నడువఁగౌసల్య మొదలైనగఱితల ముచ్చుపన్నాగంపుపల్లకీ ల్ముందు నడువఁవెనుక డెబ్బదిరెండువినియోగములవారు నాప్తులు నృపులు నందంద నడువఁ
జిమటపని మీసముల కప్పుఁ జెంపకురులు, నెదను గస్తూరిపట్టెలు నుదుటితిలకమలర వెలువడె దళథుఁ డౌర ముసలి, సొగ సనుచు వారకామిను ల్సూచి నగఁగ.
ఎదురుగా వచ్చి జనకనరేంద్రు డంత, యేనుఁగులమీఁద సంధించి మానవేంద్రుఁబురికిఁ దోడ్తెచ్చి తనసహోదరునివీడు, విడిది గావించి యులుప నెక్కుడుగ నొసఁగె.
కౌశికుఁడు రేయి రామలక్ష్మణులఁ దోడి, కొనుచు వచ్చిన హర్షించి కుశికసుతునిఁబొగడి తనయుల యాశ్లేషమునను దనిసె, బంతితేరులపంటవలంతిమగఁడు.
మఱునాఁడు జనకునిమంత్రులు పిలువరాఁ గొలువు సింగారమై కలిమి మెఱయదశరథరాజు నందనులతో నగరికిఁ జనుదేర నెఱిఁగి హజారమునకెయెదురుగా జనకరాజేంద్రుఁడు సనుదెంచి కేలుమోడ్చిన తోడఁ గేలుమోడ్చెగేలును గేలును గీలించి సనుదెంచి మునివరు లున్నుగాఁ గనకపీఠ
ములను వసియింపఁ దదుభయకులనృపాల, కులవసిష్ఠశతానందకులు గణింపనింత యొప్పునె సంబంధ మిది యటంచు, నెల్లవారును మది సంతసిల్లి రపుడు.
మనుకులోత్తమ సీత రామున కొసంగి, లక్ష్మణకుమారకున కూర్మిళాకుమారిచే నొసంగెద నని జనకేంద్రుఁ డనిన, నెద దశస్యందనునిమోద మినుమడించె.
తోడుతోడుత భరతశత్రుఘ్నులకును, నీకుశధ్వజతనయల నిమ్మటంచుఁగౌశికుఁడు పల్క జనకుఁ డౌఁ గాక యనఁగ, నల దశస్యందనుముదంబు నలుమడించె.
ఇవ్విధంబున రామలక్ష్మణభరతశత్రుఘ్నులకుం గ్రమంబునఁ సీతోర్మిళామాళవీశ్రుతకీర్తుల నొసంగ నిశ్చయించి జనకభూపాలుండు గురుముఖంబున మఱునాఁటివైవాహికలగ్నంబు శుభప్రదం బని వచించిన నట్ల యౌఁ గాక యని సంతుష్టాంతరంగుఁడై కొడుకులతో విడిదికిం జని మఱునాఁడు ప్రాతఃకాలంబునఁ దనూభవులకు శుభంబుగా గోదానాదిదానంబు లొనరించుచుండె నప్పుడు.
పట్టెవర్ధనములపైఁ బట్టెఁడక్షత ల్బంగారుప్రోఁగులు నుంగరములుఁబైగప్పుకొన్నట్టిపట్టుపచ్చడములు వెలిచాయగల శిరోవేష్టనములుగన్నెరువన్నెనీర్కావిదోవతులును శిష్యులతోడను జెలువుమీఱమాకు వేదము వచ్చు మాకు శాస్త్రము వచ్చు మాకు స్మృతు ల్వచ్చు మాకు శ్రౌత
మంతయును వచ్చుఁ దారతమ్యంబుఁ దెలిపి, యధిపుచే దాన మిప్పింపుఁ డనుచు నృపతివిడిది కేఁగు వసిష్ఠుల వెంటఁబడిరి, తొలఁగ ద్రొబ్బఁగ రాక విద్వాంసు లపుడు.
ధీరు లయ్యు స్వతస్సిద్ధదీనవృత్తి, వేఁడి రింతయెకాని యవ్విభుఁడు దానవేళ వీథుల వీథుల వెదకి తెచ్చి, విప్రుల కొసంగె దానము ల్వేనవేలు.
ఏమిదానంబు మీ కిచ్చిరో జాబాలి స్వర్ణధేనువు గాదె వామదేవఘటనూతికి హిరణ్యగర్భ మిచ్చి రదేమి యతఁడు సేసినపుణ్య మట్లు గలిగెఁదగ వసిష్ఠుఁడు తారతమ్యంబు లెఱుగఁడె యెక్క డాసందడి యెఱుఁగు టెట్లుమీ కేమి యిచ్చిరో మేము దానముఁ బట్టమంటిమి మీ రింతయధికు లౌట
లెఱుఁగ కంటిమి లేదంచు నీర్ష్య దోఁపఁ, బలికికొంచును దానము ల్పట్టినట్టిబ్రాహ్మణులు ధనమణులు గంపలను భృత్య, వరులు కొనితేర నిండ్లకు నరిగి రపుడు.
అంత నిక్కడ జనకజనాధినాథు, పంపునను సీత మొదలైన పద్మముఖులనలువురను బెండ్లికూఁతులఁ జలుపఁ జెలువ, లుదిరి బంగరుపీఁటలు నుంచి రపుడు.
అల యరుంధతి దీవించి యక్షతములు, నుదుటఁ బెట్టినఁ గనుపట్టె సుదతిమోముప్రణయకుపితాత్మ రోహిణి పాదలాక్షఁ, దొరసి చెలువందు పూర్ణచంద్రుం డనంగ.
తలయంటె నొకతె సీతా, కలకంఠికిఁ గలితరత్నకంకణరణనాకులదళికులములతోఁ గర, జలరుహమధ్యమునఁ జికురజాలము వొదలన్.
కమలాస్త్రుఁడు కెంజిగురుం, జముదాళిని కమ్మతేనె చమిరెడిభంగిన్రమణీమణి యొక్కతె సీ, తమెఱుఁగునెమ్మేన గంధతైలం బిడియెన్.
జలరుహగంధికిఁ గుంకుమ, నలుఁగిడియెన్ బోటియొకతె నఖముల సోఁకన్గిలిగింతగొనెడి వలిగు, బ్బలపయ్యెదచెఱుగుమాటఁ బకపక నగుచున్.
తళుకుతళుకన మించు కుందనపుబొమ్మఁ, బటిక నార్చువిధంబునఁ బ్రౌఢ యొకతెమంచిగంధంపుటటకలి నించి మేనఁ, జంద్రవదనకుఁ బన్నీట జలకమార్చె.
సరసి నడయాడు రాజహంసంబుపక్ష, వలసమునఁ గప్పుకైవాలవల్లి యనఁగఁజలువపావడవల గొన్న చెలువకురులు, సరసమై మించెఁ దడి యొత్తుసమయమునను.
వలిపెపైఠాణిచలువదువ్వలువలోన, సరిగెచెంగావిపావడ సగ్గు లీనెఁజంచలేక్షణ మేన వ్యాపించినట్టి, తలిరువిల్కానికీర్తిప్రతాపము లను.
మేదినీసుత చెవిసొర మిగిలియున్న, దశరథకుమారగుణసముదాయ మనఁగఁదనరె ముత్యాలకమ్మలు తరణికులుఁ డ, నంతకల్యాణగుణశాలి యనఁగ వినమె.
నవమణిమయభూషణముల, నవనిజఁ గైచేసి రప్పు డతివలు మిగులందొవరాయల్లుని కెంజిగి, చివురాకుంబాకు చికిలిచేసినమాటిన్.
జగము గెలువఁగ నొకయమ్మె చాలుననుచుఁ, గడమనాల్గమ్ములను రాజకన్యలుగనురతిపతి సృజించె రఘుకుమారకుల గెలువ, ననఁగ సీతాదికన్యక ల్దనరి రపుడు.
వలకారియంచ గావలెఁ గాకయున్నచో నధరంబు చరణంబు లరుణ మగునెకలికిరాచిలుక గావలెఁ గాకయున్నచో ననవిల్తుని వహించుకొనఁగఁ గలదెకళుకురత్నంబు గావలెఁ గాకయున్నచోఁ గన్నభూసతి రత్నగర్భ యగునెతొలుకాఱుమెఱుఁగు గావలెఁ గాకయున్నచోఁ జంచలాలోకము ల్సంఘటిలునె
కంతుబాణంబు గావలెఁ గాకయున్న, భువనమోహనశృంగారపూజ్య యగునెయనుచుఁ బొగడంగ సకలలోకైకమాన్య, యయ్యును నమాన్యయై మించె నవనికన్య.
అంత జనకమహీకాంతానుమతంబున వివాహముహూర్తంబు సమీపంబయ్యెనని పురోహితులు పిలువ వచ్చిన.
ఒరపుగా విరజాజిసరులతో సిగవైచి లాగియా బురుసాకులాయి బెట్టిగీరికప్రంపుచిక్కెంటనామము దీర్చి శ్రీచూర్ణరేఖ రంజిల్లఁజేసిమురువుగా హురుమంజిమురువుతో వీనుల కట్టాణి గొప్పచౌకట్లు దాల్చిమణిహారముల కుంకుమపుపూఁత దెలియంగ రంగైనముత్యాలయంగి దొడిగి
పెద్దపీతాంబరము గండపెండరంపు, కటకకటిసూత్రకేయూరకంకణాదిదివ్యభూషణజాలంబుఁ దేజరిల్ల, రాముఁ డభినవశృంగారధాముఁ డయ్యె.
చెలులు గైచేసి రటువలెఁ జెలువుమీఱఁ, దోనలక్ష్మణభరతశత్రుఘ్నులకునునృపసుతచతుష్టయంబు సుదృగ్జనైక, మోహనంబయి తగెఁ జతుర్వ్యూహగరిమ.
ఇత్తెఱంగున రఘుపుంగవుండు దమ్ములుం దానును గల్యాణోచితకల్యాణమణిమయకల్యాణప్రసూనప్రముఖప్రసూనమాలికాకనకాంబరాదిచతుర్విధశృంగారంబు లంగీకరించి మునిపతంగమంగళాశీర్వచనపురస్సరంబుగా గృహాంగణంబు వెలువడి చతుర్దంశంబులు హరిదంతదంతిసత్త్వంబులుం గుందదంతప్రభాంగంబులు నగుదంతావళచతుష్టయంబు నెక్కి కరంబుల నంకుశంబులంకించి తదగ్రంబులం జూళికల సోఁకించుచు వచ్చునప్పుడు.
పార్శ్వభాగంబులఁ బట్టిన పదివేలపగలువత్తులుఁ బట్టపగలు సేయఁదగిలింపఁ జిఱ్ఱన నెగయు నాకాశబాణంబు లంబరవిమానముల దాఁట
దురుసుగా వెడలెడి బిఱుసులపూవులు భూనభోంతరములఁ బొదివికొనఁగనందం దమర్చిన యట్టివిచిత్రంబు బాణవిద్య సురాళి భ్రమయఁజేయ
నదరువ్రేటులరొదల బ్రహ్మాండ మగల, నెందుఁ జూచిన దివ్వెటీలే వెలుంగభూరిశోభనవాద్యము ల్బోరుకలఁగ, బలిసి యెల్లడఁ జతురంగబలము గొలువ.
పదియునాఱేండ్లప్రాయంపుపద్మముఖులు, కాసె గట్టుక మిగులశృంగారముగనుదశరథేంద్రునిమీఁది పదము పాడి, యభినయించుచు నెదుట నృత్యంబు సలుప.
“జయజీవ వర్ధస్వజగతాంపతే" యంచుఁ జేరి మౌనీంద్రు లాశీర్వదింపఁ"జండీశ చండకోదండఖండనవిచక్షణ” యంచు వందిమాగధులు పొగడశోభనంబులు పాడుచును బుణ్యకాంతలు మునుపుగా గ్రంతలు గొనుచు నడువనాప్తమంత్రులును రాజాధిరాజులు దొర ల్నలువంకఁ గ్రమ్ముక కొలిచి రాఁగ
ముగురుతమ్ములు సరిగ నేనుఁగుల నెక్కి, వెంట నేతేరఁగా రాజవీథి వేడ్కవచ్చెఁ గోటిసురేంద్రులవైభవమున, భద్రకరి నెక్కి శ్రీరామభద్రుఁ డపుడు.
కాంతరొ వీరునల్వురును గంతుజయంతవసంతరోహిణీకాంతులొ కాకయున్న మఱిఁ గల్గునె యీభువనైకమోహనాత్యంతవిలాసరేఖలవిధం బని యొండొరు లాడుకొంచు సౌధాంతరరాజరాజముఖు లారసి యారసికాగ్రగణ్యులన్.
వనితరొ వీరిలో మనసువచ్చిన రాజకుమారుఁ డెవ్వఁడేయని యొకరాజకన్యఁ జెలి యాడినఁ బో యిది యేటిమాట యంచును నునుసిగ్గు మీఱఁ దనుఁ జూచినఁ గాదది రూపరేఖకన్నను రఘురాముఁడే యనిన నవ్విరి తోడిసకు ల్కిలాకిలన్.
వనజాతాయతపత్రలోచనలు భావం బిట్లు రంజిల్లఁగాఁగనుచు న్సేసలు జల్ల నుల్లసితశృంగారంబు భాసిల్ల నల్లన నేతెంచి విదేహవల్లభుని జాల్వాపెద్దమోసాలఁ జంగున దంతీంద్రుల డిగ్గి యారతులు గైకొంచున్ రఘుగ్రామణుల్.
జనకక్ష్మావిభువెంబడి న్నడచి చంచద్దివ్యమాణిక్యదీపనికాయంబు ఫలోల్లసత్కనకరంభాస్తంభసంభావితంబును స్వర్ణాబ్జపటీవితానకలితంబు న్సర్వలోకైకరంజనమౌ హేమవివాహమండపమున న్సౌవర్ణ పీఠంబులన్.
ఆసీనులైన యత్తఱి, శ్రీసీతాకన్యకాదిసీమంతినులన్రాసుతలఁ దోడి తెచ్చిరి, భానురతను కాంతి బయలు బంగరు సేయన్.
అంత వసిష్ఠవిశ్వామిత్రశతానందాదిముదితవిప్రప్రవరసముదితమంత్రపూర్వకంబుగా లక్ష్మణపూర్వజు పదారవిందంబులు గడిగి మణిమయభూషణాదిపరిణయదక్షిణాసంపర్కం బగుమధుపర్కం బొసంగి.
ఏపట్ల న్సహధర్మచారిణిగ నీ కిసీత నాకన్య ధారాపూర్వంబుగ నిచ్చితిం గలుగుభద్రం బెప్పుడు న్నీ విఁకన్జేపట్టందగు నంచు మైథిలనృపశ్రేష్టుండు పల్కంగ సీతాపాణిగ్రహణం బొనర్చె రఘునాథస్వామి హృష్టాత్ముఁడై.
ఊర్మిళను లక్ష్మణునకు మహోత్పలాక్షి, యైనమాళవి భరతున కనుపమానకీర్తి శత్రుఘ్నునకు శ్రుతకీర్తి నొసఁగె, జనకమహీకాంతుఁ డెంతయుసంతసమున.
అప్పుడు పువ్వులవానలు, దెప్పలుగాఁ గురిసె మొరసె దివిదుందుభులున్ముప్పిరిగొనుమోదముఁ గని, యొప్పిరి జనులెల్ల నమ్మహోత్సవవేళన్.
ఉర్వీదేవులు మంగళాష్టకము లత్యుత్సాహసమ్మోదముల్పర్వ న్నెమ్మది బెట్టుగాఁ జదువుచుం బల్మాఱు నాయత్తమాసర్వాయత్త మటంచు నంతఁ దెరవంచం జానకీరాఘవుల్పర్వేందూపమవక్త్రము ల్గనిరి దృక్పర్వంబుగా నొండొరుల్.
మంగళసూత్రము శ్రీసీ, తాంగనగళమునను రాఘవాధీశుఁడు గట్టెం గదిసి మోవితనమో, ముం గౌఁగిలి తనదు వక్షముం గోరంగన్.
కళుకుముత్యపుకమ్మ కమ్మపూబంతులఁ గలితకటాక్షభృంగములు గదియఁజీనిచక్కెర లొల్కు చిగురాకుమోవిపై మొలకనవ్వులమంచు ముంచుకొనఁగరమణీయశృంగారరసపూర్ణకుచఫలభర మోరువక మధ్యభాగ మలయనికరంపుఁజిలుపతేనెలఁ దొప్పుదోఁగినచెలువున మేనఁ గ్రొంజెమట వొడమ
భక్తజనులకుఁ గామితఫలము లొసఁగు, మమత ముంగిటియాలవాలమునఁ దనరుకల్పలతవోలె మేదినీకన్య యపుడు, ఠీవిఁ దగు మెట్టు ప్రాలపుట్టికను నిలిచి.
నిజభుజమూలకాంతులకు నివ్వెరగందుచు నున్న రామభూభుజుని కిరీటభాగమున భూసుత వే తలఁబ్రాలు నించె నంబుజముఖులెల్ల సీత చెయి ముంచె నటంచు నుతింప నంత నంగజనిభమూర్తియైన రఘు కాంతుఁడు నించెఁ దదీయవేణికన్.
ముడిపడె నని యెడఁదం జిడి, ముడివడకుఁడు మీకుఁ గొంగుముడిఫల మనుచున్నొడివెడికడఁక వసిష్ఠుఁడు, తొడిఁబడ ముడివైచె దంపతులచేలంబుల్.
నునుసిగ్గుఁ బ్రేమ బెనఁగొన, నొనరించె నిలాజ లాజహోమము రఘువర్యునికరములఁ బొదువఁ జెమ, ర్చినదో యిటిలాజ లగ్నిఁ జిటపొటమనఁగన్.
కొంచక పాదపల్లవముఁ గొంచుఁ గఠోరపుసన్నెకల్లుఁ దాఁకించెదవంచు నల్కఁ దిలకింపదు జానకి పాదమంటి ప్రార్థించెదఁగాక యంచును సతీసఖి గన్గొన రామచంద్రుఁ డొక్కించుక నవ్వుకొంచు శుభకృత్యములన్ ఘటియించు వేడుకన్.
కేలఁ గీలించి జానకీనీలవేణి, చరణకమలంబు కెంపురాసన్నెకంటఁగదియఁ దాఁకించి యంతలోఁ గందెననుచు, మరలెఁ దత్కాంతి దొరసి యత్యరుణమైన.
వలగొనిరి శిఖికి వేడుక, వెలయఁగ ఫలకాంక్ష పల్లవితచూతంబుల్వలగొను శుకదంపతులుం, బలెను వధూవరులు చెట్టపట్టుక ప్రేమన్.
చూపి ధ్రువు నూరకయ వసిష్ఠుండు నిలువ, నగుచుఁ గౌశికముని యరుంధతినిఁ జూపెమీపురోహితురాలు సుమ్మీ పురంధ్రి, దయఁ గటాక్షించుమంచును ధరణిసుతకు.
మంగళం బంభోజ మంజుళేక్షణునకు మంగళం బంగనామన్మథునకుమంగళం బంభోజమహనీయమూర్తికి మంగళం బసురేంద్రమర్దనునకుమంగళం బాకాశమణివంశమౌళికి మంగళం బురుకీర్తిమండనునకుమంగళం బుర్వీకుమారికేశ్వరునకు మంగళం బాజికుమారునకును
ననుచుఁ బాటలు పాడుచు నతులగతుల,సతులు కంకణఝణఝణత్కృతులు శ్రుతులరహి వహింపంగ జానకీరాఘవులకు, మంగళారతు లిచ్చిరి మమత నంత.
తలుపు ల్వట్టుక పేర్లు సెప్పు మని కాంతారత్నము ల్వల్క మెచ్చులకున్ సీతయు నేను వచ్చితి నటంచు రామచంద్రుండు సిగ్గొలయన్ రాఘవుఁ డేను వచ్చితి నటం చుర్వీజయుం బల్కుచుంగులదైవంబు భజించి పెద్దలకు మ్రొక్కు ల్వెట్టి హర్షంబునన్.
నిఖిలబంధులతోడ మాణిక్యదీప, జాలము వెలుంగు పెండిలిచవికలోనఁబసిఁడిపీఁటల బువ్వంపుబంతి సాగి, సోదరులతోడఁ బ్రేమఁ గూర్చున్నవేళ.
నడిచక్కిఁ జేరోజనపుఁజెక్కడపుపైఁడిపళ్లెంబు ముక్కాలిపై ఘటించికడవన్నెతళుకుబంగరుగిన్నియలు చుట్టు నమరించి కూర లందంద నిలిపిపడమటిపన్నీటికుడినీరు రాయంచగిండులు చెంగటఁ గీలుకొల్పివలయుపదార్థము ల్వడ్డించి కెలఁకుల వనజలోచనలు వీవనలు విసర
సఖులు వడ్డించు వింతకజ్ఞముల మర్మ, మెఱిఁగి త్రోయుచుఁ గైకొంచు నిష్టములనువెలఁది కందిచ్చుచును రామవిభుఁడు వేడ్క, మించుబువ్వంపువిం దారగించునపుడు.
ప్రొద్దుపోయెనటన్న భూపాల యిటువలెఁ బ్రొద్దుపోవలె నంచుఁ బొగడికొనుచువింతపదార్థము ల్సంతరించు మటన్న నింతకన్నను వింత లెవ్వియనుచుఁ
గలిగినయపచారములు క్షమింపు మటన్న నిఁట వింతసేయ నేమిటి కటంచుధన్యుఁడ నీదుబాంధవమున ననిన నే మాడువాక్యంబు నీ వాడి తనుచు
జనకనృపమౌళి దశరథజనవిభుండుఁ, గూర్మి నుపచారములు వల్కికొనుచు సకలబంధుజనములతోఁ గూడి బంతిసాగి, పెండ్లివిం దారగించిరి ప్రేమతోడ.
కలయం జేతులు వార్చి యున్నయెడ బాగాలిచ్చి వే వియ్యపుంగులుకుంగుబ్బెత యోర్తు మేలితెలియాకుంజుట్టు లందిచ్చుచోఁగళుకుంగేదఁగిరేకుఁ జుట్టి యొసగంగా నంది బొ మ్మంచు కెందలిరు న్మోవి గదింప లక్ష్మణునిగాంత ల్నవ్వి రొక్కుమ్మడిన్.
చక్కనిపైఁటలోన జలజాతముమాడ్కి యిదేమి తెల్పుమాగ్రక్కుననంచుఁ దన్ను నొకకామిని వేఁడినఁ బైఁటలోనివాచిక్కనిచన్నుదోయి యిఁకఁ జెప్పెడి దేమని లక్ష్మణుం డనంబక్కున నవ్వి రవ్వికచపంకజలోచన మోము వంచఁగన్.
విరికెందామరలోని మిద్దియ కడున్ విన్నాణమయ్యె న్మరందరసం బుబ్బెడిఁ జుట్టుఁ గేసరము లందంబాయె లేఁదేఁటీరాగరులం బోలెడినంచు నొక్కనవలాకంజంబుఁ గాన్కిచ్చినన్సరసోక్తుల్ పచరించె లక్ష్మణుఁడు హాస్యప్రౌఢి రంజిల్లఁగన్.
అంత.
కమ్మక్రొవ్విరి మేలుకట్ల ఘుమ్మనిమించు జాళువానాటకశాలలోనఁజికిలిదంతపుబొమ్మ చెక్కడంపుకడాని కళుకుకంబములయంకణమునడుమఁబఱచిన రత్నకంబళిమీఁది పచ్చసూర్యపుటంపుగద్దియ నందమైనబురుసాతివాసిపై నిరుగడబలుదిండ్లు తలగడ నొఱఁగి యద్దశరథుండు
జనకనృపమౌళి గొలువున్న సవిధమునను, రాఘవాదికుమారవర్గంబు మునులునవల బంధులు రాజులు నా ప్రజనులు, నిండి కనుఁగొనఁ గన్నులపండువుగను.
అట ధిమ్మంచు మృదంగతాళములు మ్రోయన్ ఖంగునన్ ఠాయిగాబటువుం గుబ్బెతదోయి రాగమనియె న్పాడెం బదం బొండు నంతట గ్రొమ్ముత్తెపుతీఁగమోడి తెరయెత్త న్మేమము ల్బాసి విస్ఫుటలౌ చంద్రకళల్వలె న్వెడలి రంభోజాతపత్రేక్షణల్.
నెలకొని చక్కఁగఁ బుష్పాం, జలి యిచ్చి నటించి రంత సఖియలు బహుభంగుల వారియాటపాటల, శిలలు గరంగె నన జనుల చిత్తము లరుదే.
నెలకొని చక్కఁగా నిలిచిన నిలుకడ మిహికుందనపుబొమ్మ మహిని నిలుపఁజికిలికోపులు కమ్మచేకత్తి మాష్టీని చికటారిపొదలికఁ జెలువు గులుకనభినయించుచును బదార్థము ల్దెలుపుచో రతిముద్దురాచిల్క రహి వహింపఠీవిగాఁ దిరుపుగట్టి తటానఁ దిరువుచోఁ దొలుకరిమెఱుఁగులు దులకరింపఁ
గొసరుచూపుల బెళుకు బేడిసలునిగుడ, సొగసు ముత్యాలచనుకట్టు బిగువు సూపఁదళుకుఁజెంగావికాసె బిత్తఱము నెఱపఁ, జెలఁగి పదచాళి వినిపించెఁ జెలువ యొకతె.
దురుపదంబులు సొక్కు మైసిరులు వొసఁగ, సరిగ నిరుగెల గుంచియ లవదరించిపెక్కువగ జక్కిణీకోపు ద్రొక్కె నొక్క, చక్కనిమిటారి నరపతు ల్సొక్కి చూడ.
ఎఱుకో యెఱుక యటంచుం, గొరవంజి నటించె నొక్కగురుకుచ చంకన్బురుకఁడు బంగరుబుట్టియు, సొరిదిం గొల్లాపురమ్మసుద్దులు వెలయన్.
తరకటబురకట గాదే, తరుణీ నామాట నీకుఁ దార్కాణగు నేబురుకనికి బువ్వ దేవే, యెఱు కడగవె యంచు నొక్కయింతి నటించెన్.
ఇంతి యొక్కతె యర్ధనారీశవేష, మూని సాక్షాత్కరించిన మౌనిజనులుబ్రమసి సద్భక్తి “జయజయ పార్వతీశ", యనుచు మ్రొక్కిరి నృపులు గన్గొనుచు నగఁగ.
చెలి తకతోం తకతోం ద, త్తళంగతోంధిక్దుతోంత తధిగిణతో మంచలవోక దీరెఁ బేరణి, వెలయించుచుఁ జూచువారు విస్మయమందన్.
తరుణవిటులు నటించిన దశరథుఁడును, జెలఁగి రత్నాభిషేకంబు చేసి యంతనటులకు సువర్ణమణిభూషణము లొసంగి, చాలబహుమానము లొనర్చె సంతసమున.
కలయఁ గుంకుమ కస్తురి కప్పురంపు, వీడెము లొసంగి దశరథు విడిది కంపియంచితోల్లాసమున జనకావనీంద్ర, చంద్రుఁడు శయించె వేఁకువజామువేళ.
ఇవ్విధంబున సకలసంభ్రమంబులు గలిగి లక్ష్మీనారాయణుల కల్యాణంబునుంబోలె నమందరాగాధిష్ఠితంబై పార్వతీపరమేశ్వరుల పరిణయంబునుంబోలెసమరసాభిరామంబై పౌలోమిపాకశాసనుల పాణిగ్రహణంబునుంబోలె జనకసమ్మదంబై సీతారామమహోత్సవంబు వెలసె నంత.
కవిగాయకాదియాచక, నివహములకుఁ ద్యాగ మొసఁగి నృపతులకుం బంధువులకు దశరథముఖభూ, ధవులకు బహుమతి యొనర్చెఁ దగువైఖరులన్.
మదమేనుఁగులు మంచిమాపుతేజీలు మేలాయుధంబులజోళ్లు నరదములనుసకినెలపట్టెమంచంబులు పచ్చలపల్లకీల్ రాచిల్కపంజరములుసరిగెజీనువజీని సురటీలు నిలువుటద్దంబులు నుడిగెంపుఁదలిరుఁబోండ్లుపట్టంబరంబులు పరిమళపేటిక ల్ముఖ్యభూషణములు మొదలు గాఁగ
నన్యకన్యాజనకగర్వహరణముగను, హరణముగ నిచ్చె నల్లుండ్ర కాఁడుబిడ్డలకును వెయ్యేసి గ్రామము ల్పసుపునకు నొ, సంగి పంచె విదేహభూజాని యంత.
దశరథదారుణీధవసుధాకరుఁ డెంతయు భక్తి మీఱ నక్కుశికకుమారు నంపి కొడుకు ల్మహిజాదివధూజనంబులున్
శశిముఖు లేఁగుదేర నిజసైన్యముతో బహుతూర్యఘోషముల్దశదిశలన్ ఘనంబయి చెలంగ నయోధ్యకు వచ్చుచుండఁగన్.
రాజహంసాళి దుర్ధర్షకామర్షవర్షతటిచ్ఛటులునా జడలు దనరస్వకృతరక్తహ్రదసంసూచకంబులై దహనోగ్రరక్తనేత్రములు వెలుఁగనిబిడనిజోచ్ఛ్వాసనిశ్వాసపవనతీవ్రమున నా నధరప్రవాళ మదరశాంతినిర్గమనావసరముఖాద్విశ్లథార్గళులనా దంతసంఘర్ష మొదవఁ
బాదఘట్టన మేదినీభాగ మగల, గండ్రగొడ్డలి భుజమునఁ గ్రాల వేఁడివేఁడి రాముఁ డటంచును విలయరుద్ర, రౌద్రమున వచ్చె భార్గవరాముఁ డపుడు.
ఇక నేమి సేయుద మెందు డాఁగుద మంచు దశరథేశ్వరుఁ డెదఁ దల్లడిల్లసంయమిఁ బుత్రభిక్ష యొసంగు మని వేఁడుదునొ యంచుఁ గోసలతనయ గలఁగనిన్న నయ్యెను బెండ్లి నేఁ డిట్టియలజడి వచ్చెనే యని సీత వగలఁ బొగులమనచే నసాధ్యుఁ డేమనవచ్చు నిఁక నంచు ననుజు లింతింత నాయత్తపడఁగ
నల వసిష్టాదు లర్ఘ్యపాద్యములు గొనుచు, నలికి చేరక యూరక నిలిచియుండఁజేరి ప్రణమిల్లి యంజలి చేసి యున్న, రాముఁ గనుఁగొని భార్గవరాముఁ డనియె.
ఖండించె నేవీరకార్తవీర్యావార్యఘనభుజాకదలికాకాననంబుఁజండించె నేమహేశ్వరకుమారునితోడఁ గ్రౌంచభూధరవిదారణనిరూఢిమండించె నేమహోద్దండప్రతాపవైశ్వానరుచే రాజవంశములనుబండించె నేయాగఫలము తండ్రికిని శాశ్వతమగు సప్తర్షిస్థాన మొసఁగి
యహహ సామాన్యుఁడనె యెంచ నశ్వమేధ, సవనదీక్షాంతకశ్యపసంయమీంద్రదత్తసప్తసముద్రాంతధరణితలుఁడ, భార్గవుఁడ ధావదరివాసభార్గవుఁడను.
బాపురే నన్ను బీదబాఁపనివిధంబు, నను గనుంగొని యర్ఘ్యదానం బొసంగవచ్చితివె యంచు రోషంబు పెచ్చుపెరుఁగ, రామచంద్రున కనియె భార్గవుఁడు మఱియు.
ఓరీ రాజకులాధమా తెలిసె నోహో నీదుబ్రహ్మణ్య మీఘోరాస్త్రంబుల దానవీహరణమే కోపంచుఁ గావించి తీవౌరా తాటక తల్లి గాదు గదవయ్యా భూమి నిఃక్షత్రగానేరాసేయుట సత్యవాదివవు లే నే నెవ్వడన్ దెల్పుమా.
అనుచున్ భార్గవరోషపోషణపటువ్యాహారము ల్మీఱఁ దద్ధనువుం తేజముతోడఁ గైకొని సమున్యద్భాహుదర్పంబునంగొనయం బెక్కిడి యమ్ము గూర్చి యిఁక నీకుం శాస్తి గావింప కేఁజన నాబాణ మమోఘ మంచు ధరణీజాభర్త యత్యుగ్రుఁడై.
భార్గవుఁడు పెక్కునాళ్లు తపంబువలనఁ గూర్చు స్వర్ణోకములనెల్ల గూల్చె నొక్కకోలఁ 'గుమ్మరి కేఁడును గుదియ కొక్క, పె'ట్టటంచును బల్కఁగాఁ బృథివి వినమె.
జామదగ్న్యుండు విష్ణుతేజంబు సనిన, రామచంద్రనృపాల మార్తాండు దండఁజందురుఁడుపోలి కనుపట్టె సవినయముగఁ, దొలఁగెఁ దా మున్ను వచ్చిన త్రోవఁ బట్టి.
సకలజనము సెలఁగె జానకీకల్యాణ, వేళకన్న రామవిజయలక్ష్మికలసియున్న రాముఁ గాంచి సీతయు మెచ్చె, సవతిమత్సరంబు సతికిఁ గలదె.
అంత.
జనకుండు జనను ల్సహోదరులుఁ దజ్జాయ ల్మునిజ్యాయలున్జననాథు ల్హితులుం బురోహితవరు ల్సైన్యంబు లేతేరఁగాజనకక్షోణివరాగ్రగణ్యసుతతో శత్రుంజయారూఢుఁడైతనసాకేతపురంబు సొచ్చె రఘునాథస్వామి హర్షంబునన్.
అకలంకమణికంకణకళంకరహితేందుమహితాస్య లుభయచామరలు వీవనుడిగంవువిడికెంపుపొడికెంపునునుమోవిపడఁతులు వన్నెపావడలు వైవమరుదధ్వచరదధ్వబిరుదధ్వజచ్ఛాయ నేలకు నీలి బూర్ణీసు గాఁగనెలవంకవలవంక నలశంకరకుమారుఁ బ్రతిఘటింపఁగఁజాలు భటులు గొలువఁ
బౌరవారిజముఖులు సొం పౌర యనుచు, సేసకొప్పులు గదలంగ సేసఁ జల్లరామభూజాని జూనకీరామతోడ, నగరుచిరసౌధ మగుతననగరు సొచ్చె.
అంత.
చికిలికెమ్మోవికెంజిగురు మిటారింప దంతకోరకము లందంబు గాఁగమవ్వంపుఁజిఱునవ్వుఁబువ్వు నివ్వటిలంగఁ బొదలు వాల్చూపుతుమ్మెదలు మెదలఁగలకలఁ గోయిలపలుకులు చెలరేఁగఁ గలితనాసాచంపకము దనర్పఁజెన్నుగాఁ బొక్కిలి పొన్నక్రొవ్విరి మించ గుత్తంపుగుబ్బపూగుత్తు లలరఁ
బ్రథమఋతుమతి యయ్యె ధరాతనూజ, శుభదినంబున నంతట శోభనంబుసేసి రారేయి రఘుపతి చిత్తజాత, కేలికాలోలుఁడై కేళిగృహమునందు.
పగడపుఁగోళ్లుఁ గుందనపుఁబట్టెలు గుజ్జరినేఁతపట్టెయంచగరులపాన్పు జాజివిరిశయ్య దుకూలము పై తలాడలున్జిగిదళుకొత్తు చప్పరము చెందొవ క్రొవ్విరిచందువాలతావిగలిగిమించు మంచమున వేడుక శ్రీరఘురాముఁ డున్నెడన్.
తళుకుముత్యపుకొప్పు వలనిగ్గు మదబంభరాళికి విరిగుత్తియాసఁ గొలువఁజుఱుకుకెంపులకమ్మమెఱుఁగు వేఁ జెక్కులఁ గుంకుమమకరికల్ గుదురుకొలుపఁ
గడకంటికెంజాయ గర్ణాంతరంబుల వలగొని మేనిజవ్వాది యుంచఁగస్తూరితిలకంబుకాంతి దీవెలు సాఁగి చెదరుముంగురుల యొప్పిరము గులుకఁ
జెలులు గైసేసి జానకిఁ జెలువు మీఱ, నల్లనల్లన దోఁదెచ్చి యధిపుచెంతనిలిపి వారెల్ల నొక్కొకనెపము పూని, వెడలి చనినను శ్రీరామవిభుఁడు వేడ్క.
బాలిక వీడె మిమ్మనుచు బాహువు సాచిన మాట దాటఁగాఁజాలక సాధ్విగాన జలజాతవిలోచన కప్పురంపుబాగా లొసగంగఁ గైకొని తగన్మడుపొయ్యనఁ జుట్టి యీయ శంపాలలితాంగి నీదుగుచభారము నెన్నడు మోర్వనేర్చునే.
రమ్మని రామచంద్రుఁ డనురాగము మీఱ ధరాకుమారి నంకమ్మున నుంచి సిగ్గునను గ్రక్కున డిగ్గిన డిగ్గనీక హస్తమ్ములఁ బట్టి ముంగురులు సక్కఁగ దువ్వుచుఁ దళ్కుబెళ్కు పైచెమ్మట గోట మిటి వలిసిబ్బెపుగుబ్బసరు ల్దెమల్చుచున్.
చవిచూడనీయవే చంద్రబింబాస్య నీకండచక్కెరమోవి గరఁగిపోదులీలఁ గెంగేలఁ గీలింపనీయవె కొమ్మ వలిగుబ్బిబంతులు వాడిపోవుమించి బిగ్గరఁ గౌగిలింపనీయవె బాల జాళువానెమ్మేను సమసిపోవదింపుతో ముద్దాడ నీయవే కామినీమణి చెక్కుటద్దము ల్మాసిపోవు
తెఱవతల యెత్తి చూడవే దృష్టి దాఁక, దిందుముఖ పల్కవే తేనె చిందిపోవదువిద నవ్వవె క్రొవ్విరు లుడిగిపోవ, వంచు వేఁడుచు రఘుభర్త మించుతమిని.
కంచుక మేటికే చెమట గ్రమ్మెడి నంచు సడల్పఁబూని యుబ్బించకు మే నటం చనిన బిత్తఱి యంతకు నుబ్బగాఁ బటాపంచయి వీడెఁ గంచుకము పక్కున నిద్దపుపైడికొండలందంచితమైన మంచినకరాప్తిని మించుక్రమంబు దోఁపఁగన్.
వజ్రసంపర్కమున కోర్చి వరవిచిత్ర, పత్రవైఖరిఁ బొల్చు నీబటువుగబ్బికులుకుగుబ్బలు కులశైలములను మించె, నేటి కళికెదు నాకోట కిటవధూటి.
అని సయ్యాటంబునఁ జ, న్మొన లలముచు మోవియాన ముద్దియ నొక్కెన్మొనపంటఁ జుఱుక్కన నొ, క్కినఁ దెప్పిరి చెక్కు ద్రోచి కినుకన్ లేవన్.
తరుణిరొ వాఁడిగోరు గలదాన వటంచును జెక్కు నించి నీవరిగెదు పొమ్ము పొమ్ము నిను నారడి పెట్టకపోదునే సఖీపరిసరసీమఁ జూప వనబాలిక పోవఁగఁ గాళ్లు రాక నిబ్బరమును లజ్జ నిల్వఁ బయిపాటున గౌఁగిటఁ జేర్చి క్రమ్మఱన్.
అలరున్ శయ్యకుఁ దారిచి, జలజానన చిత్త మెఱిఁగి సమరతికలనన్గళలంటి కరఁచి శ్రమజల, కలితుఁ డయినయంత మదనకదనాంతమునన్.
ఒకసాలభంజిక యొయ్యనఁ గమ్మదెమ్మెరలు రాఁ గపురంపుసురటి విసరెనొకరత్నపాంచాలి యొసపరితావిపన్నీటిచేగిండి పాణికి నొసంగెనొకపైఁడిప్రతిమ యొద్దికతోడ గండూష మొనరింపఁ గాళాంజిఁ గొనుచు వచ్చెనొక్కజంత్రపుబొమ్మ యుమ్మెత్తవిరిచాయ నందమౌ పావడ యందియిచ్చె
నొక్కమణిపుత్రి వాసనపక్క లొసఁగె, మడిచియుండిన తెలనాకుమడుపు లొసఁగెరాఘవుఁడు నేర్పుమీఱ సూత్రము గదల్ప, సీత చెలులంచు లజ్జచే సెజ్జ డిగియె.
మతి దెలియ నవ్వుచుఁ బునా, రతులం దేలించి యంత బ్రౌఢను జేసెన్సతిఁ గ్రమమున శ్రీరఘుపతి, చతురతరుఁడు గాఁడె యతనుశాస్త్రములందున్.
ఈగతి రఘుకులపతి యను, రాగమతి ధరాసుతావరారోహాసంభోగాభోగసుఖోన్నతుఁ, డై గిరిగొనువేడ్క నహరహము విహరించెన్.
అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁడైజనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెలుపు మని యడుగుటయున్.
ప్రౌఢ్యసితద్రాక్షారస, లేఢ్యసమవచోవిలాస లేఖాచార్యారూఢ్యంచిత మేథావిభ, వాఢ్య నవోదారతోత్సవాఢోకమనా.
రమణీకీర్తితకీర్తితప్తహిమతారాకాశ రాకాశశాంకమనోజ్ఞానన జ్ఞాననవ్యమిథిలాకాంతేంద్ర కాంతేంద్రనీలమణీకుంతలకుంకులక్ష్మభటలీలాభవ్యలాభవ్యయప్రమదాపాదన పాదనమ్రనృపశుంభద్రాగభద్రాగమా.
అమృతధామ గిరిశధామ హరసుధామరాశికాహిమకరా మరతరుసోమహిమకరామజాహ్నవీకమలభూమదరలలామకరివిరామదేవతారమణసామజసితతామరస యశోమనోహరా.
శ్రీరమ్య మగదలాన్వయ, సారసనవహంసయోగ సారసమేతాత్మారూఢ హంససన్నుత, సారయశోహంస కృష్ణసచివవతంసా.
అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌనిధారుణీనాథ యవలికథావిధంబు, తెలియఁజెప్పెద వినుమని తెలుపఁదొణఁగె.
శ్రీరామచంద్రునిఁ జికరాయపట్టంబు గట్టగా దశరథక్ష్మావిభుండుసమకట్టి పురమెల్లఁ జాలశృంగారింపఁ బనిచిన యట్టిసంభ్రమముఁ జూచిదురితాత్మురాలు మందర సహింపఁగలేక గునుకుఁ బర్వున గూనుగునియ నేగియిఁక నేటినిదుర లేవే యని కైకను దొడదట్టి లేపి యోపడఁతి వినవె
రాముఁ బట్టము గట్టఁగా రాజు పూనె, భరతుఁ డింకిట రఘుపతిబంటువాఁడునీవు కౌసల్యదాసివి నే నిఁకేల, వెలఁది తొత్తుకుఁ బడితొత్తు గలదె యెందు.
అటులు గాదేని రాముపట్టాభిషేక, విఘ్న మొనరింపఁగా నొకవింతయుపమగలదు తగినది నీకుఁ గావలనెనేని, చెప్పెద నటంచుఁ జెవిలోనఁ జెప్పి పనుప.
తలపట్టు బెట్టి కోపపు, టిలు సొచ్చెం గైక దశరథేశుఁడు వచ్చెన్వలపు దలకెక్కఁ జూచెన్, లలనామణి గుండెజల్లనఁగ నిట్లనియెన్.
ఎందుకుఁ బల్కవే తరుణి యేమిటి కల్గితివే మిటారి నాయందలినేర మేమె చెలి యేమి యెఱుంగనె కొమ్మ కొండెముల్విందురె ముద్దుగుమ్మ వెడవింటివజీరున కొప్పగించకేయిందుముఖీ యయోరతుల నేలఁగదే జగదేకసుందరీ.
తరుణి నీయధరామృతం బొసంగఁగఁ గాదె యవనిలో నాకు దీర్ఘాయు వొదవెరమణి నీదుముఖాంతరమున గాదె యశేషరాజమండలము గర్వం బడంగెలలన నీశ్రోణీఫలకజితమై గదే ధరణిచక్రంబు నామఱుఁగుఁ జొచ్చెలోలాక్షి నీదయాలోకంబుననె గాదె ప్రాపించె నాది శంబరజయంబు
నిట్టి నినుఁ బాయజాల నీకేల యలుక, యనుచుఁ గైకను దశరఁథుఁడ నునయించిముదిసిముప్పునఁ దన కేల మోహ మనుచు, మరుఁడు రతిచేతిలోఁ జెయి సఱచె ననఁగ.
జనపతి యిటువలె వేఁడుచు, వనితామణి యలుకలేల వలసిన విత్తున్ననుఁ గోరుమనినఁ గేకయ, తనయామణి యిట్టు లనియె దశరథుతోడన్.
భూవర పూర్వదత్తవరము ల్దయచేయుము నేఁడు నీకు నేఁగావలెనన్న నం దొకటఁ గట్టుము పట్టము మత్కుమారు సీతావిభు నొక్కటకొ వనపదంబున నుంచు చతుర్దశాబ్దముల్నావుడు మూర్ఛపోయె నరనాథుఁడు రాముఁడు వచ్చి యంతటన్.
జననీ భూపతి పల్కఁ డే లని వచింపం గైక సీతాధిపావినుమా నే నిట నిన్నుఁ గాన కనుప న్వేడన్ వరంబిచ్చినంబనువం బిల్వఁగబంచి సంశయపడెం బల్కంగ నేమందువోయని సత్పుత్రుఁడ వీవు మాట వినవే యంచుం బ్రశంసింపఁగన్.
అమ్మా యింతేగద కా, నిమ్మని యోతండ్రి యడలనేటికి నీవాక్యముఁ గయికొంటి నిదిగో వ, నమ్మున కరిగెద నటంచు నయనిధి యంతన్.
కైక యొసంగువల్కలములు దాఁగట్టి కట్టనేరక సీత గాంచునపుడుహారామ ననుఁ బాసి యడవి కేఁగెదవంచు భూపతి వెలవెలబోవు నపుడుపట్టి నాకడుపునఁ బుట్టి యిటైతివే యని తల్లి కౌసల్య యడలునపుడుశ్రీమించు పట్టాషిషేకసామగ్రికి వలగొని యంజలి సలుపునపుడు
మది చుఱక్కనకుండునే మహితధైర్య, శాలి గావున శ్రీరామచంద్రమూర్తియందుఁ గనఁబడనీయక మందహాస, కందళితమైన మోము వేడ్కలనె దెలుప.
మహితనితంబబింబంబు జాంబూనదమయమహారథవిభ్రమంబుఁ జూపగుత్తంపువలిగబ్బిగుబ్బచన్గవఠీవి భద్రకుంభులవిజృంభణము నెఱపఁజిల్క తేనియలొల్కఁ బల్కెడిపల్కులఁ బ్రద్యుమ్నవాహము ల్బారుదీరజఘనభారంబున జడియునెన్నడలును రాజహంసకులీనరాజి పొదల
సీత వెనుకొన రాజ్యలక్ష్మియును బోలి, తాను దమ్ముఁడు దశరథదత్తయైనక్షమ వహింపక యప్పటిక్షమ వహించి, రామచంద్రుఁడు శృంగిబేరమున కరుగ.
కులుకుంగుబ్బలపైఁట జాఱఁ జిగిచెక్కుల్ చెమ్మగిల్లంగ మైపులక ల్మించఁగఁ జెంచుజవ్వనులు సొంపు ల్మీఱ శ్రీరామునిన్బెళుకుంజూపులఁ జూడ సీత యట నీర్ష్యాదృష్టిచే నట్టివారలఁ జూచుం జిఱునవ్వుమోమునఁ దనుం బ్రాణేశుఁ డీక్షింపఁగన్.
అంత.
శబరిపతిపూజలకు మెచ్చి జడలు వూని, దశరథనృపాలుని మనోరథంబుతోడరథము మరలించి యానాగపదగభీర, మైన భాగీరథిఁ దరించి యవలిసరణి.
కమనీయపద్మరాగకిరీటతులితమై పల్లవారుణజటాభరము దనరహరిచందనపుఁబూఁతహరువునఁ గపురంబుబూది నెమ్మెయిపూఁతపొలుపు మిగులఁదెలిసాలెజిలుగుదువ్వలువచెల్వంబున లలితకటీరవల్కలము లలరమకరకుండలహారమణిముద్రికలు కోటినవరత్నమయభూషణములు గాఁగ
మినుకుదంతంబుపావలు మెట్టి గట్టి, విల్లునమ్ములు చేపట్టి వెంట ముద్దుఁగులుకునడ సీత వినయంబు దెలుపఁ దమ్ముఁ, డరుగుదేరఁగ శ్రీరాముఁ డరుగునపుడు.
ఎలనాఁగా తల యెత్తి చూడఁగదె వీ రెవ్వారు వీ రేమి గావలెనే యంచని యమ్మలక్క లటఁ ద్రోవన్ వేఁడ నీపైఁడిచాయలచే మించు నతండు నామఱది యౌనం చంతటన్ సిగ్గుచేదలవంచు న్మహికన్య వార లదె యాతం డెవ్వఁడే యం చనన్.
వడి గాఁగ నాలుగైదడుగులు ముందయి వెనుకఁ జిక్కితి వేమి యనుచుఁ బిలుచుఁదను జూచు కాఁపుజవ్వనులు ముత్తెపుసొమ్ము ధరియింపరేలని ధవుని వేఁడుఁజెలికత్తెవలె లెస్స పలుకుచున్నది మావి నలచిల్కఁ బట్టి యిమ్మనుచుఁ గొసరుమనయింట శృంగారవని గల్గ వనవాసమున కిందు రానేల ననుచు నలయుఁ
జెట్టు జెట్టు గనుంగొను జెలమ చెలమఁ, జల్లనీరాను బొదపొద మొల్లవిరులచిదుమ రమ్మన్న నిదిగొ వచ్చెద పదుండ, యని సొలయు సీత త్రోవలోఁ జనుచు నపుడు.
అదె కన్గొంటి విచిత్రకూటము ప్రఫుల్లాంభోజపత్త్రాక్షిపైకుదురయ్యె న్నెలవంక యీచెలువు నీకుం జూడ నెట్లొప్పె మాకుఁ దగం దెల్పుమటంచు సీత నగుచున్ గోరంటగాఁ జంటిపయ్యెద గప్పంగ రఘూద్వహుండు చని యయ్యద్రీంద్రకూటంబునన్.
రజనిచరాంతకుండు రఘురాముఁడు వేడుకమీఱ జానకీగజగమనాసమేతముగఁ గానలఁ ద్రిమ్మర నచ్చటచ్చటన్ధ్వజకలశాతపత్రసముదంచితతత్పదముద్రఁ జూచి తద్రజము మహామునీంద్రులు శిరంబునఁ దాల్తురు భక్తి మీఱఁగన్.
అంత నక్కడ.
శత్రుల రావణాదులను జంపు మటంచును రామచంద్రు నాపుత్రకుఁ బంచితిన్ భయముఁ బొందకు మింకిట నంచుఁ బూర్వపున్మిత్రుఁడు దేవతాపతికి మేలెఱిఁగింపఁగఁ బోయెనో యనన్ధాత్రినిఁ బాసి యద్దశరథక్షితిపాలుఁడు చేరె స్వర్గమున్.
అంత వసిష్ఠుఁ డంపఁగ రయంబునఁ జారులు వోయి పిల్చినన్స్వాంతము సంచలింపఁగను సానుజుఁడై భరతుండు వచ్చి యత్యంతసువర్ణరత్నమయమయ్యు నొకింతయు దాతగాని శ్రీమంతునివీఁడుఁబోలెఁ గళమాసిన యట్టియయోధ్యఁ జూచుచున్.
నగరు సొచ్చిన యంతలో నిగుడు వేడ్క, నెదురుగా వచ్చి కైకేయి యిదిగొ నీకుఁగాను బంపితి రామలక్ష్మణుల వనికి, జనపతియు నీల్గె ధరణిఁ గైకొను మటన్న.
అడవుల కేఁగె రాముఁడు సహానుజుఁడై యనుమాట వీనులంబడ భరతుండు మూర్ఛిలి యమాత్యులు దెల్పఁగఁ దేరి కైక నీకడుపునఁ బుట్టి నింద కొడిగట్టితిఁగా యని బాష్పనేత్రుఁడైయడలి పితృక్రియ ల్సలిపి యంతట రాఘవుఁ జేరె వేఁడఁగన్.
నినుఁ జూడ కుండఁజాలను రార నారామచంద్ర యటంచుఁ గౌసల్య పిలువనేరంబు గలదు మన్నింపు మంచును గైక విడక చేతులు వట్టి వేఁడుకొనఁగవలదన్నయాపె పిల్వఁగను రారాదొకో పుత్ర యటంచు సుమిత్ర నుడువనిందఱు ప్రార్థింప నిది యేటిచలము పోద మటంచు సౌమిత్రి తరువు సేయ
భరతశత్రుఘ్ను లిరువురు పాదయుగముఁ, బట్టుకొని రాక విడుమంచు నెట్టుకొనఁగదొరయునగవునఁ దనదు పాదుక లొసంగి, పనిచె రఘుభర్త పురికదంభరతు భరతు.
ఇవ్విధంబున.
పట్టము గట్టుకొమ్మనుచుఁ బల్మఱు ప్రార్థన సేయ రాముఁ డేపట్టున నిచ్చలేక తనపాదుక లిచ్చినఁ దెచ్చి వానికింబట్టము గట్టి భూమి పరిపాలన చేసెను గ్రామవాసియైపుట్టునె యెందునున్ భరతుఁ బోలినసోదరుఁ డెంచి చూచినన్.
జనియించెన్ గ్రీష్మ మంత న్సమధికరవిరుగ్జాలజాజ్వల్యమానాశ్మనితాంతోద్భూతవహ్నిజ్వలితనికటసంఛన్నతార్ణాగ్నిదహ్యత్తనువీరుద్భుగ్నశాఖాతతితరుదమునోదగ్ధజీర్ణాటవీమధ్యనిషణ్ణారీణవేణూత్కరచిటచిటనిధ్వానభిభ్యన్మృగంబై.
అట్టివేళను జిత్రకూటాద్రి డిగ్గి, జానకీలక్ష్మణులతోడ భానుకులుఁడుశరభకేసరకరటికాసరవరాహ, చటులకాననసీమల జరుగునపుడు.
సురటివిధంబున సరిగపయ్యెదచేల చెఱగు మో మెండకు మఱుఁగుఁజేయుమెండయ్యె బడలిక మెల్లనే పదఁడంచు దండకుఁ జేరి కైదండ యొసఁగుఁగ్రమ్మెఁ జెమ్మటలంచుఁ గర్పూరకదళికాదళవీజనమున నందముగ విసరుఁజెల్లఁబో యెంత నొచ్చెనొ పాదపద్మంబు లొత్తెద నిలుఁడంచు బత్తిసేయు
సీత ఱేపటివేళ నాప్రీతిఁ జూచి, చెలువ మా కుపచారంబుఁ జేసినటులునీవు బడల కరము పొద్దెక్కె ననుచు, రాఘవుఁడు పల్క నవ్వు నారాజవదన.
కనుఁగొంటే కలకంఠకంఠి మగసింగం బట్టె పైకొంచు హస్తిని నుచ్చైస్స్తన కుంభము ల్నఖముఖశ్రీ వ్రచ్చినం జల్లుజల్లున రాలెం దెలిముత్తియమ్ము లన నాలోకింతురే యిట్టికేళిని బ్రాణేశ యటంచు జానకి నగున్ లీలావినోదంబులన్.
స్తనభార మొక్కింత సరసుక వచ్చెద నను గబ్బిచనుగుబ్బ లంటునెనరుఇది యింత ఘనమౌటఁగద మందమయ్యెను నడయంచు శ్రోణిఁ గేలిడుబెడంగుబడలితి దప్పిపుట్టెడు దీర్పవే యని కొనరుచుఁ గెమ్మోవి గ్రోలుమమతయింతదూరము వచ్చి తెంత నొచ్పెనొ యంచు వెడవెడఁ దొడలఁ జై వేయుదుడుకు
మది గరంగింప గమనశ్రమం బెఱుఁగక, ఠీవి శృంగారవనులఁ గ్రీడించునటులవిజనవనభూమి శ్రీరామవిభునిఁ గూడి, జానకీకాంత విహరించె సంతసమున.
అంత.
మదకలప్రతిమల్లమల్లసంగరభిల్లభిల్లసన్నఘభల్లభల్లతతముపంకజాతవిఫాలఫాలలనాజాలజాలలాలితసాలసాలకులముధీరయానగభీరభీరహితోదారదారకపరివారవారణంబుజ్వలితానలపిచణ్డచణ్డచారుశిఖణఖణ్డకుండలికాండకాండకంబు
గండలసమానకుండల కంపమాన, మస్తకాఖణ్డలముఖారిమండలాగ్రభండనఖరాదిమౌనిప్రకాండదండ, కావనంబనఁ దగు దండకావనంబు.
చొచ్చి చని విశిఖయతికిం, జెచ్చర నటఁ బ్రథమభిక్ష చేసెన్ దివిజుల్మెచ్చఁగ రఘుపతి క్షితిసుతఁ, గ్రచ్చఱఁగొనిపోవు సాపరాధువిరాధున్.
అంత శరభంగమునికి బ్రహ్మపద మొసఁగి, యత్రిసుచరిత్రు సేవించి యతనిపత్నియైనయనసూయ యనసూయనంగరాగ, మవనిసుత కీయఁ గైకొని యవలఁ జనుచు.
భామి నీకుచవిజృంభణము వీక్షించెనో భద్రకుంభీంద్రము ల్బఱవఁదొడఁగెలేమ నీసన్నపులేఁగౌను గనియెనో కలగి సింగంబులు గట్టు లెక్కెఁగలికి నీకనుదోయి బెళుకుల కళికెనో పదపడి మృగములు పొదలు తూఱెఁగాంత నీనూగారుఁ గాంచెనో నీలాహి యిట్టిట్టు బొర్లుచు గుట్ట లెక్కె
ననుచు లక్ష్మణధనుగుణధ్వనులవలనఁ, దలఁకి పరువిడు వన్యసత్త్వములఁ జూచిజనకజకు మెప్పు ఘటియించు సరసఫణితి, రఘువరేణ్యుఁడు దండకారణ్యమునను.
జాతివైరగుణం బొకచైతృనందె, కాని సత్త్వంబులం దెందుఁ గలుగనీకరహి వహించునగస్త్యునాశ్రమముఁ జొచ్చి, మౌనిచంద్రునిపాదపద్మముల కెఱఁగి.
అలిగి 'సర్పోభవ' యనినంత నహుషభూధవుఁడు గాఁడే పెద్దత్రాచుపామునే వచ్చునందాఁక ని ట్లుండు మని పోవ వెఱచి యట్లుండదె వింధ్యశిఖరియెక్కడ వాతాపి యింక జీర్ణింపవే యనిన జీర్ణింపఁడే యసురభర్తయాపోశనజలంబు లౌఁగాక చతురర్ణవీతోయ మనఁగాదె విస్మయముగ
విజయ మొందుమటంచు దీవించుమాట, చాలదే మాకు శస్త్రంబు లేల ననుచుఁగలశసంభవుఁ బొగడుచు ఖడ్గతూణ, మఘవధనువులు గైకొని రఘువరుండు.
అంభోజనయనుఁ డసురా, లంభమునకుఁ బ్రతిన సేసె లక్ష్మణయుతుఁడైకుంభజవని “సిద్ధస్యా, రంభోనియమార్ధ” యను సుర ల్విన మఱియున్.
గొనబైన తట్టువున్గునను గోడలువైచి మంచిగందంపుఁ గంబములు నిల్పితళుకుటేనుంగుదంతముల దూలము లెత్తి వారాహిదంష్ట్రలవాసఁ బోసితీరుగాఁ బగడంపుఁదీఁగెపెండె లమర్చిగట్టిగాఁ గురువేరు కట్లు గట్టిబహుచామరంబుల పైకప్పు సవరించి కళుకుపచ్చల గృహాంగణముఁ దీర్చి
పంచవటిలోన సౌమిత్రి యంచితముగఁ, జాలనేరుపుతోఁ బర్ణశాల గట్టవాస్తుహోమంబు గావించి వాసుధేయిఁ, ప్రేమతోఁ గూడియుండె శ్రీరాముఁ డచట.
వనరాశిన్ వటపత్రశాయి వయి మున్ వర్తింతువంచుం జెవిన్వినుట ల్గాని కనంగ నేరముగదా విన్నట్టులన్ దండకావనవాసి న్వటపత్రశాయి వగుచు న్వర్తించు నిన్గంటిమంచును దత్పంచవటీనివాసు ఘనభాసుం గాంతు రాయామునుల్.
అట నొకనాఁడు మోహమున శూర్పణఖ రా నిటునటు ద్రిప్పి హాస్యంబు చేసిశ్రీరఘుపతి సన్నఁ జేసిన సౌమిత్రి యేమి శూర్పణఖ రావే యటన్నఁ
గటకటా యికనైనఁ గరఁగెఁగా మనసంచు మురియుచుఁ జేరరా ముక్కు వట్టియేసీమసరసంబు లివి యమ్మ నేఁ జెల్ల యనిన నీ వెఱుఁగవే వనిత యింత
జాణవయ్యును మాసీమసరస మనుచు, మొలకరాచూరిఁ బెదవితో ముక్కు జవిరిచెవులుఁ గూబలతోఁ గోసి చేత నిడిన, నరిగె ముక్కిఁడి యోలక్ష్మణా యటంచు.
అరిగి ఖరదూషణాది దైత్యాధిపతులు, దర్పబలసంయుతులఁ జతుర్దశసహస్రరథికముఖ్యులఁ దెచ్చె సంగ్రామమునకుఁ, దద్బలంబులఁ జెండెఁ గోదండధరుఁడు.
ఆహరివంశమౌళి ప్రథమాహుతి చేసె ఖరుం బ్రభాతవేళాహవభూమి బాహుజమహానలకీలల దూషణున్ ద్వితీయాహుతి చేసె నత్రిశురు నవ్వలియాహుతి చేసేఁ దోడుతోనాహుతి సర్గదోషపరిహారముగా విధిచోదితక్రియన్.
అప్పుడు.
అరవీడుకొప్పుతో నపరంజిచాయచెక్కులధళాలను కమ్మతళుకుతోడజాఱుపయ్యెంటతో జంటఱవికలోన గమకించుగుబ్బజక్కవలతోడసడలెడునీవితో జఘనస్థలిని మ్రోయు మొలనూలిచిఱుగంటమ్రోఁతతోడగిలుకుమెట్టియలతోఁ గలహంసములు గెల్వనవుజాళువాయందెరవళితోడ
జిఱునగవుమోముతోడను సిగ్గుతోడ, సొలపుఁజూపులతోడ పైవలపుతోడసీత చనుదెంచి కౌఁగిటఁ జేర్చె రాము, ఖరముఖవిరాము వీరశృంగారధాము.
ఖరకరకాండకాండ మెద గాఁడిన యప్పుడు పారవశ్యముంబొరయని రామభూవిభుఁడు భూమిసుతాకుచఘట్టనంబునంబరవశుఁడయ్యెఁ జన్గవనెపంబునఁ గంతుఁడు పద్మకోశపున్శరముల నేసెఁ గాదనినఁ జన్మొనలంటి యురంబు నాటునే.
శూర్పణఖ యంతఁ దననేర్పు శోభిలంగ, రామకర్పూరగంధిని బ్రణుతి సేయఁగపటమునఁ దెత్తునని దశకంధరుండు, పంపె మారీచు జానకి బ్రమయఁజేయ.
అల మారీచుఁడు నంతఁ గాంచనమృగంబై పర్ణశాలాగ్రతస్థలి నానావిధచేష్టలన్ మెలఁగ గోత్రాపుత్త్రికాలోచనంబులకుం గల్గెను నుత్తమంబయిన సమ్మోదంబు చిత్రం బెయిలలో నేరిసరూపదర్శనముచే నింపొంద వీక్షింపమే.
స్త్రీచాపల్యముచేతఁ దెమ్మనియెఁ బో సీతాలతాతన్వి తానేచందంబున లేడివెంబడిని బోయెన్ రామచంద్రుం డహోతూచా జానకివాణి తప్పఁడుగదా దూరం బెఱింగెన్ బళీయాచోఁ బోవలదంచుఁ దెల్పె ననుజుం డైనన్ సుధీశాలిగా.
అధిపుఁ డీరీతి లేడి వెన్నాడి పోయి, సీతకన్నులముందఱ చెలువుఁ గులుకునంతమద మేమిటికి దీని కన్నభంగి, శరము వైచె మృగంబు లక్ష్యంబు సేసి.
శ్రీరామశరమున క్షితిఁగూలుదైత్యుండు హాసీత హాలక్ష్మణా యటంచువ్రాలిన యాయార్తరావంబు చెవిసోఁక క్షితిసుత బెదరి మూర్ఛిల్లి తెలిసియేమి సేయుదు మింక నెందుఁ బోయెను నాథుఁ డట్లయ్యె నాదువాక్యంబు వినకమొదటనేఁ దెలిపితి మునులతోడఁ బ్రతిజ్ఞ గావించునపుడె రాక్షసులతోడ
వలదు వైరం బటంచు నీవలన వచ్చె, దానవిని ముక్కు గోసిన దాన నలిగిఖరుఁడు వచ్చినఁ ద్రుంచె రాఘవుఁడు నేఁడు, రక్కసులఁ గూడి సూడు మరల్పఁబోలు.
ఈయెడఁ దామస మేటికి, నీయన్నను జూచి రమ్ము నీవనిలోనింగాయమ్ములఁ బడినాఁడే, మో యనవుడు లక్ష్మణుండు ముగుదకు ననియెన్.
ఎఱుఁగవె యన్యదుర్దమగిరీశశరాసనఖండఖండనంబెఱుఁగవె రాజలోకభయహేతుభృగూద్వహమానమర్దనంబెఱుఁగవె నిన్నుఁ గాంచిన సమిద్దఖరాదిజయంబు లెల్ల నీవెఱిఁగియు నిట్టు లెంచఁదగవా తెగవేయఁడె రాముఁ డాయరిన్.
దనుజుఁడు నేఁడు నిన్నిట వెతం బొగిలింపఁగఁ గూసెఁ గాని యమ్మనుకులుఁ డట్ల చీరఁ డసమానబలాఢ్యుఁడు గాడె యంచనన్జనకజ యేటిమాట వినసైఁపదు రాఘవునాద మౌను జయ్యనఁ జనుమన్నఁ బోవక నయక్రియఁ దెల్పినఁ గోపగించుచున్.
వంచన చేసెదే తగినవాఁడని రాముఁడు నమ్మి యీడ నిన్నుంచి చనంగఁ గాముకునియోజన చేసెద విట్టులైన నాసించునె యీశరీర మిఁక సీత యటంచును దాళలేక చేలాంచల మూఁది నేత్రముల హారఘువీర యటంచుఁ జింతిలన్.
కలకన్ లక్ష్మణుఁ డింత యేల జననీ కాఁగానిదోసాన నీపలుకు ల్పల్కకు మమ్మ కంటఁ దడినింప న్నీతి గాదమ్మ నాపలుకు ల్నమ్మఁగదమ్మ యిప్పు డిదె నీప్రాణేశుఁ డేతెంచుఁ బోవలెనన్న న్వడిఁ బోయివచ్చెద ధృతి న్వర్తిల్లు మబ్జాననా.
అని యంపించుక చనుచుం, జనఁ గాళ్లాడక మహీజజాలములో నిల్చిన నటకుం జని పొంచెదె, చనవా యని సీత పలుకఁ జనె నతఁ డంతన్.
అతనుగదార్తుఁ డౌట దశ లారును మూఁడును జెంది యంతనేగతిగడలేక యాతురము గైకొనురీతి యతీంద్రవేషుఁడైగతి గలుగన్ స్మరించుగతిఁ గంజదళాక్ష హరే నృసింహ యంచతికపటంబు మీఱఁగ దశాస్యుఁడు జానకిఁ జేరి యిట్లనున్.
ఘననీలవేణి నీకచపాళిమత్తాళి పక్షంబునకు నైల్యభిక్ష యొసఁగుముకురాస్య నీముద్దుమొగము రాకాచంద్రబింబంబునకుఁ గాంతిభిక్ష యొసఁగుఁగమలాక్షి నీవాలుఁగనుదోయి వలకారి బేడిసలకు లౌల్యభిక్ష యొసగుఁగుంభవక్షోజ నీకుచములు కనకకుంభికలకు శృంగారభిక్ష యొసఁగు
రామ యటుగాన నీయధరామృతంబు, భిక్ష యొసఁగవె తృషితుండఁ బ్రేమ ననినబెదరి శ్రీరాముఁడే శరభిక్ష యొసగుఁ, దాళుమని సీత శాలికాంతరముఁ జేరి.
అమ్మకచెల్ల యెవ్వడొ నిశాటుఁడు భిక్షుకవేష మూని మోహమ్మున వచ్చెఁ గాదన సమర్థులు లే రిట నేమి సేయుదంచమ్మహికన్య చింతిల దశాననవింశతిబాహుదండఘోరమ్మగుమూర్తిఁ జూపి యల రావణుఁ డంతట హుంకరించుచున్.
పరవశ భూసుతన్ రథముపై నిడి లంకకుఁ బోవువేళ నయ్యరదము టెక్కియంబున రయంబున నొక్కట గ్రద్ద వ్రాలి యాసురపతిమూర్థముం బొడువ స్రుక్కక దాని వధించెఁ గాని లోనరయఁ డొకింత దుశ్శకున మౌట దశాననుఁ డెంతమూఢుఁడో.
ధరణిజను దెచ్చి లంకా, పురవనమున నిలువఁ దనుజపుంగవసామ్రాజ్యరమాపతి తాఁ దొలఁగెం, బరసతి గోరఁగ నసూయ పడియెనొ యనఁగన్.
మరలి రాముఁడు ద్రోవ లక్ష్మణునిఁ గాంచి, తమ్ముఁడా యేల వచ్చితి తప్పెఁ కార్యమనుచు వేగ నిజోటజంబునకు వచ్చి, సీతఁ గానక యలసి మూర్ఛిల్లి తెలిసి.
ఏరా తమ్ముడ పర్ణశాల తెరువేదీ తాళవే చూపుమాయోరామా యిదె గాదె సీత నెల వేదో తెల్పు మీశాలయైతే రామామణి యేది కాన మదె యెం దేగెం గనంజూడు కాంతారశ్రేణుల లేదు హాధరణిజాతా సీత యెం దేగితే.
అవురా లక్ష్మణ యెందుఁ బోయితిమి యన్నా వేఁటకై కాదె యేల విదేహాత్మజ వేఁడ నిమ్ము మృగ మేలాగిత్తు నేదేవిఁగానవనిన్ హాజనకక్షమారమణకన్యం గానవే సీతఁ గానవె యంచు న్విలపించు రాఘవుఁడు నానాదీనవాక్యంబులన్.
కటిభూమండలము న్వలగ్నతలనాకంబున్ లసన్నాభివిస్ఫుటపాతాళబిలంబు చేకుఱు జగంబుల్మూఁడు ము న్నేలుచున్నటులం దోఁచె మహేంద్రభోగముఁ దృణప్రాయంబుగా నెంచి తిప్పటికిం దోఁచెఁ బ్రవాసదుఃఖము నినుం బాయంగ నోయంగనా.
వెలఁది నీకుచపాళి విహరించు నప్పుడు కృతకమహీధరక్రీడ మఱతుపొలఁతి నీపొక్కిలి పుణికెడువేళల కేళీసరోవరక్రీడ మఱతు
నెలఁత నీనూగారు నిమిరెడువేళలఁ గేలీవనాంతరక్రీడ మఱతుసకియ నీకెమ్మోవి చవిచూచువేళల మధురోపహారసామగ్రి మఱతు
గౌఁగిలింపఁగ రాజ్యభోగంబు మఱతు, మఱతు సకలంబు నినుఁ గూడి మలయువేళనట్టినిన్నును నెడఁబాపె నదయవృత్తి, దైవ మిఁక నేమి సేయుదు తరళనయన.
ఇది పంచవటి యంచు నిపు డెఱింగితిఁ గాని మును భూతలస్వర్గ మనుచునుంటినిది ఘోరవన మంచు నిపు డెఱింగితిఁ గాని మును గేళికారామ మనుచునుంటినిది కొండదరి యంచు నిపు డెఱింగితిఁ గాని మును గేళికాసార మనుచునుంటినిది పర్ణశాలయం చిపు డెఱింగితిఁ గాని మును గేళికాగార మనుచునుంటి
నిది వనావాస మని తోఁచె నిపుడు గాని, మును వనవిహార మనియుంటి మోద మలరనిది తపశ్చర్యగాఁ దోఁచె నిపుడు గాని, మును గృతార్థుఁడనై యుంటి వనజనయన.
తెలినవ్వు మొగమునఁ దిలకంబు దీర్తుగా యిఁక నెందుఁ దీర్తునే యిందువదనవలిగుబ్బచన్నుల నెలవంక లుంతుగా యిఁక నెందు నుంతునే హేమగాత్రిపెన్నెరికొప్పునఁ గ్రొన్ననల్ సేర్తుగా యిఁక నెందుఁ జేర్తునే యేణనయనచికిలిలేఁజెక్కుల మకరిక ల్వ్రాఁతుఁగా యిఁక నెందు వ్రాఁతునే యిగురుఁబోణి
జలరుహము పువ్వుగొత్తులు షట్పదాళి, లవళిదళములఁ జూపితో యవి సహింపకన్యవనితాంగతులితంబు లౌటఁ దావ, కాంగసమములు గామి నోహంసయాన.
పటుసింహగర్జల భయముఁ జెందనినన్నుఁ బికనాదములు భయపెట్టదొణఁగెసుడిగాడ్పులకు మున్ను జడియకుండెడినన్ను లేఁదెమ్మెరలు సంచలింపఁజేసెదవవహ్నికీలలఁ దాప మొందనినన్ను మించువెన్నెల దపియింపసాగెఖరయుద్ధమునను భంగము గాంచనినన్ను భంగంబు నొందించె నంగజుండు
అకట వీనిని సైరింప నలవిగానఁ, గలదె నినుఁ బాసినను దృణాగ్రంబునైనఁగదలఁగావించుత్రాణ నాకలిమి బలిమి, జీవదేహంబులును నీవె గావె సీత.
చల్లనిదరహాసచంద్రిక ల్పైఁజల్ల జాబిల్లి వేఁడిమి చల్లఁజేసిపలుకులఁ గపురంపుపల్కు లొల్కఁగఁ బల్కి కలకంఠకటువచఃకలనమాటితనుసౌరభంబున దక్షిణానిలమునఁ గలవిషస్పర్శంబు దొలఁగఁజేసిభూవిలాసంబులఁ బుష్పకోదండకోదండదండము ఖండితంబుఁ జేసి
నన్నుఁ బోషించితివి కాననంబులోన, నీ విపుడు లేమి నివియెల్ల నిజముఁ బూనెకాకయుండినఁ గలదె యేకంబునందు, రెండుగుణములు నవపుండరీకనయన.
అని విలపించుచు నందంద జానకి వెదకుచు నఁట గృధ్రవిభునిఁ గాంచిసంస్కార మొనరించి చనుచోఁ గబంధునిబాహులు ఖండించి ప్రకటభక్తిశబరి యొసంగు పూజనములు గైకొని పంపాసరోవరప్రాంతములనుహనుమంతుతో మాటలాడి తన్మంత్రంబు వలన సుగ్రీవుతోఁ జెలిమి చేసి
యడుగుబొటవ్రేల దుందుభియొడలు మీటి, సప్తసాలంబు లొక్కయస్త్రమునఁ గూల్చివాలిఁ బడనేసి కపిరాజ్య మేలుటకును, గరుణ సుగ్రీవుఁ బట్టంబు గట్టి యంత.
రవి కర్కటముఁ జేర రాజసింహము రాముఁ డట మాల్యవద్గిరికటకముననుమీనకేతనధనుర్జ్యానాదపరిముక్తవృషభకేతనభీమవిశిఖమేషయానకీలలనతులాధిచే జనకకన్యాళివేణీసమాయత్తచిత్తవృత్తి నుండంగ సుగ్రీవుండు తారారుమామత్తకరికుంభమహితకుచల
మమతతోఁ గూడి మరకతమందిరములఁ, గల్పకారామతులితశృంగారవనులస్వర్ణసౌధంబులను గేళిసదనములను, వేడుకలు గాంచె మిథునసంక్రీడనముల.
అంత.
గ్రీష్మభీష్మశిఖండినర్తితశిఖండి, కాననహుతాశిఖండిమేఘప్రతానకల్పితవిధానచిత్రశిఖండియు నయి, లక్షితంబయ్యె వానకాలంబు క్షితిని.
నృపవరాస్థానమండపసరోవరము హసంతికాహల్లకోజ్జ్వలిత మయ్యెమంత్రీంద్రశిబికారిమావధూటి మధూద్ధపరికల్పితనిచోళపటముఁ బూనెఁజరమానవభుజాభుజంగంబు కేతకీదళకలితాతపత్రఫణ మయ్యెవిరహిణీచిత్తంబు విరహితాశ్రయకాననాశ్రితాళికి నాశ్రయత్వ మొందె
విపణి కమలాక్షి యాపణవీక్షణముల, దడికెఁ గనుఱెప్ప వాల్చె మోదమునఁ బొదలిగేహమూకాస్యగోగణక్రియను గోగ, ణంబు వసియించె నాసమయంబునందు.
గొనబుంగింటెపుజంటగొంగడి ముసుంగుల్ వెట్టి సంకేతతావనికిం గొంచెపుఁజిన్కులోపలను బోవన్ వీథిలోనం దళుక్కన నక్కాలమునందుఁ గ్రొమ్మెఱుఁగు డాయం దన్ముఖాంభోజముల్గనియుం గానరు జారలం దలవరు ల్గాఢాంధకారాంధు లై.
ఈమెయిఁ గ్రొమ్మెఱుంగులు పయింబయి మించుపయోధరంబులున్వేమఱుగట్టివాన కడువేగమె వచ్చు నటంచు నెంచితేనీమది కింపుగా దిచట నిల్వుమటంచును బల్కెఁ బాంథునింగోమలియోర్తు తోడియళికుంతలకున్ మరు వెట్టినేర్పునన్.
వడఁకెద వేటికే తడిసివచ్చితి వల్లభ వానలోపలందడిసి వడంకలేదు గృహనాయకు వంచన సేయ నింతగాఁదడసితిఁ గావునన్ వడకెదన్ మఱి యేగతి నీకుఁ దోఁచునోయెడఁదనటన్న మెచ్చుకొని యిత్వరిఁ గూడె భుజంగుఁ డత్తఱిన్.
అమరేంద్రముక్తమేఘములఁ దెచ్చుక్రమంబు రవణించ మించువాయువులు విసరెమబ్బుచేతనె వారి మరలింప వరుణుండు ధనువుఁ బూనఁగ నింద్రధనువుఁ దోఁచెఁదననైల్యమున దండితనుకాంతి దండింపఁ గదలెనాఁగ వలాహకములు నడచెనానటన్నీలకంఠజటాచ్ఛటలునాఁగఁ దొలుకాఱుమెఱుఁగులు తులకరించె
జలదకరిశంక గర్జించు సమయసింహ, గర్జ లన గర్జితము లొప్పె గగనకరటిసాంద్రమ న ధార లనఁగ వర్షంబు గురిసె, వనధిఁ బైకొనెఁ బౌరుషమునకు నదులు.
తే తే లక్ష్మణ విల్లునమ్ములును దేతే తామసం బేటికిందైతేయుం డఁదె పోయెఁ బోయె మనసీతం గొంచు నంచు న్నిజభ్రాతన్ వేఁడుచుఁ దత్తఱించె రఘువీరస్వామి యుద్ధామజీమూతశ్రేణి తళుక్కునన్ మెఱసి సొంపు ల్గుల్క విభ్రాంతుఁడై.
మనపై మూఁకలు గూడివచ్చె దితిజన్మస్తోమము ల్గంటె భర్జనలుం జూప విజృంభణంబు జయనిస్సాణధ్వను ల్లక్ష్మణాయనినన్ రామునిఁ జూచి లక్ష్మణుఁడు గాదయ్యా విలోకింపుమాఘనము ల్గర్జన లింద్రచాపమును నిర్ఘాతధ్వనుల్ రాఘవా.
అదె గర్జించుచుఁ జిత్రవర్ణసుమబాణాసంబు భాసిల్లఁగామదనుం డేసె శరప్రకాండములఁ దెమ్మా విల్లు వీనిన్ హరించెదనన్నన్ రఘురామ క్రొమ్మొగులు వచ్చెం గాని మారుండు గాడది యింద్రాయుధ మింతె పువ్వువిలుగాదన్ లక్ష్మణుం డయ్యెడన్.
ఘనగర్జవిని యుల్కి ననుఁ గౌగిలించిన వెఱవకుమనినచో వింతసొలపుజడిసె నీనడలకు వెడవెడ రాయంచ లనినచో నను మెచ్చుకొనెడుప్రేమఁగొప్పున మొగలిఱేకులు సెక్కి మెఱుఁగుతో మొగిలిదె యనినచో నగుబెడంగునెమ్మి నీనెఱివేణి నీలాహి యని గ్రసించఁగఁ జేరె ననినచో జళుకుఁ జూపు
మఱవరా దిఁక మున్నిటిమమత లివిగొ, చెల్ల యిప్పటి కిటువలెఁ జేసె దైవమిట్టిదుర్దినముల సీత యేమి యయ్యె, నొక్కొ తమ్ముఁడ యెటువలె నోర్చువాఁడ.
అని చింతిల్లఁగఁ లక్ష్మణుం డనియె నన్నా కంటివే మేఘముందనస్వర్ణంబుల నెల్లధాత్రి కిడి యంతన్ వంతచే వెల్లనైధనదాశం జనెఁ దొల్లి యెల్లెడల గోత్రం దట్టమౌ కీర్తియుంజనఁ దాత్కాలికదాత కెయ్యెడల శశ్వత్కీర్తి సంధిల్లునే.
క్రశిమానరావణ రాజ్యలక్ష్మియుఁబోలె నెందెందు నిమ్నగ లింకఁబాఱ“విజయస్వ” యనుచు దీవింపఁగా నేతెంచు కైవడిఁ దోఁచె నగస్త్యమౌనిభవదీయకీర్తిసంపదఁ బోలి యెల్లెడ నుల్లసిల్లెను ఱెల్లు పెల్లు వెఱిఁగితానును హంససంతతి గాన సాహాయ్య మడరించుబలె నంచ లరుగుదెంచె
నాశరస్ఫూర్తి నారీతి నతిశయిల్ల, నింక నీదుశరస్ఫూర్తి హెచ్చఁజేయకేల కురియించె దీపస్రవృష్టి వైరి, బలములఁ దదీయవనితలఁ గలుగఁజేయు.
అని సౌమిత్రి తదాజ్ఞఁ దోడుకొనిరా నంభోజినీబంధునందనుఁ డేతెంచె వలీముఖప్రముఖనానాసింహనాదార్భటీజనితప్రత్యురుశబ్దసూచితభవిష్యద్ధక్షిణాంభోధిబంధనవేళోద్ధరణక్రియాకులసమస్తక్ష్మాధరాక్రోశుఁ డై.
ఏతెంచి నాల్గుదిక్కుల, సీతాసతి వెదకఁ బ్లవగసేనఁ బనుపుచోసీతాపతి హనుమంతుని, చేతికి ముద్రిక యొసంగి శీఘ్రం బనుపన్.
అతఁ డుప్పొంగుచు నంగదాదిపిసారంగాచ్ఛభల్లేంద్రసంగతుఁడై దక్షిణదిక్కునం జనుచు రంగత్పక్షసంపాతసంవృతసంపాతిఖగోక్తమార్గమున నుర్వీకన్యకాలోకనోద్ధతుఁడై యెక్కె మహేంద్రశైలము మరున్మార్గస్పృహత్సాలమున్.
నిలిచి యంఘ్రులఁ దన్ని నిగుడుచో గిరి ఘటోద్భవపదన్యాసవింధ్యాద్రిఁ బోలగట్టినాళపుటుంటపిట్టకైవడి యురోఘట్టన ఱెక్కలగట్టుగూలసురసార్థకృతమహత్తరసూక్ష్మతరరూపములను హరిత్వంబు విలసితముఁగనంజనాసంతతి యందు సింహిక నొంచు టని నిలింపులగుంపు లభినుతింప
రాముచే దైత్యుఁ డీల్గు కార్యంబు దెత్తు, విశ్వసింపుడు నామాట వేల్పులారయనుచు బాడబలంఘన మాచరించు, పగిది నౌర్వాంబునిధి దాఁటెఁ బవనసుతుఁడు.
ఏపున నాసువేలగిరి యెక్కి యట న్శతయోజనోన్నతంబై పదియాఱువన్నెఁ జెలువైన త్రికూటముమీఁద సింహలద్వీపమునన్ బలారిముఖదేవభయంకరదీప్తి నొప్పులంకాపురరాజ్యలక్ష్మి తటకావడి చూచుచు నున్ననత్తఱిన్.
రవి యస్తంగతుఁడైన సూక్ష్మతనుఁడై రక్షోధిరాట్పట్టణంబవలీలం జొరఁబాఱి పఙ్క్తిముఖముఖ్యానేకనాకద్విషద్భవనశ్రేణుల నెల్లెడన్ వెదకి సీతం గానఁగాలే కశోకవనిం బావని గాంచెఁ బావని మహీకన్యం బ్రహృష్టాత్ముఁ డై.
కనుఁగొని లెస్సగ గుఱుతులు, కనుఁగొని యట వచ్చి పఙ్క్తికంధరుఁ డని పోయినమాటలు విని నమ్మిన, జనకసుతం జేరి మ్రొక్కి సవినయుఁ డగుచున్.
తల్లి జానకి నీ ప్రాణవల్లభుండు, శ్రీరఘూద్వహుఁ డనుజసుగ్రీవముఖ్యయోధతతితోడ సుఖముననున్నవాఁ డ, టంచు శ్రీరామునంగుళీయక మొసంగె.
కైకొని కన్నుల నొత్తుచు, హాకాంత రఘూద్వహా యటంచును బ్రణయవ్యాకులితచిత్తయై క్షో, ణీకన్యక యిట్టులనియె నివ్వెఱతోడన్.
అన్నా యేగతి దాఁటివచ్చితివి నీ వంభోధి సేమంబుతోనున్నారా రఘురామలక్ష్మణులు లంకోద్యానమద్వాసమున్విన్నారా దశకంధరాధము రణోర్విం గూల్చుకార్యంబు దాఁగన్నారా వినిపింపు నీకు శుభమౌ గాకంచుఁ ద న్వేఁడినన్.
తనవృత్తంబును రామలక్ష్మణుల యందంబు న్వివస్వత్కుమారునిసఖ్యంబును దెల్పి భీమతరమౌ రూపంబునుం జూపి సీతను నమ్మించి శిరోమణిం బడసి యోతల్లీ ముదంబుండుమీయనఘున్ రాముని దెత్తు నేనని తదీయాజ్ఞానుసారంబునన్.
వెడలి యవ్వనిలోపల వృక్షవితతి, విఱిచి కుప్పలు వేసె నవ్వీరవరుఁడులంక భస్మంబు సేయువేళకును గాష్ఠ, జాలమును గూడవేసిన చంద మొంద.
అంత వనపాలపంచసేనాధినాథ, సప్తమంత్రి సుతాక్షశిక్షాప్రవీణుఁడైన హనుమంతు నింద్రజిత్తును నెదిర్చి, బ్రహ్మశరపాశమునఁ గట్టి పట్టి తెచ్చి.
తండ్రిముందఱఁ బెట్టి యోదానవేంద్ర, కోఁతిఁ దెచ్చితి ననఁబోయి కొఱవి దెచ్చినాఁడ ననవుడు ముక్కులు నలఁచుకొనిరి, కొలువువారెల్ల నపుడు పక్కునను నగుచు.
కరువలిసుతుఁ డిట్లనియెం, గొఱవి నగుదు నీపలాశకులము దహింపన్సురవైరి సత్యవాణిని, సరస్వతి యనంగ వినమె సత్యం బనుచున్.
శ్రీరఘువీరచంద్రునకు సీత నొసంగి యభంగవైభవోదారుఁడవై చెలంగుము దశానన యంచును బుద్ధి చెప్పినన్మారుతితోఁక చూఁడుమనె మండుచు రావణుఁ డౌర సమ్మతింజేరి మదాంధచిత్తునకుఁ జెప్పఁగఁ బోయిన హాని వచ్చుఁగా.
శ్రీజనకేంద్రనందనకుఁ జిత్తము రంజిలఁ గంజరాగవిభ్రాజితకీలకాభినవపంకజపూజ లొనర్చి కేళికారాజితవాలకీలి నలరావణు లంకఁ దగుల్పఁజేసె నీరాజస మెంత భక్తుఁడవురా హనుమంతుఁడు క్షోణిపుత్త్రికిన్.
దనుజాధీశపురంబుఁ గాల్చి మహిజాతం గాంచి వాలాగ్ని వార్ధిని జల్లార్చి కపీంద్రులం గలసి యెంతేవేగ నేతెంచి నేఁగనుఁగొంటిన్ రఘువీర జానకిని లంకాపట్టణాభ్యంతరంబున నంచున్ హనుమంతుఁ డిచ్చె ధరణీపుత్త్రీశిరోరత్నమున్.
ఇచ్చినఁ గైకొని మారుతి, మెచ్చినఁ గౌఁగిటను గ్రుచ్చి మిహిరకులీనుండచ్చెరువగుబలములతో, వచ్చె న్వారాశితీరవనిఁ జేరంగన్.
శరణాగతు దశకంధర, శరణాగతుఁ డనక యనఘసద్గుణమణిసంభరణు విభీషణుఁ గరుణా, భరణుం జేపట్టె రామభద్రుఁడు ప్రేమన్.
కట్టఁడు వారివాశి లయకాలధురంధరుఁ బఙ్క్తికంధరుంగొట్టఁ డదెంత నమ్మెనొ యకుంఠితనైజభుజాబలంబు చేపట్టుగ నవ్విభీషణు నపారకృపారస మూర లంకకుంబట్టముఁ గట్టె రామజనపాలశిఖామణి రాజమాత్రుఁడే.
అంత విభీషణోక్తగతి నంబుధిచెంత దినత్రయంబు తానెంతయు భక్తి దర్భల శయించి నిరాహృతియై ధరాసుతాకాంతుఁడు త్రోవ యిమ్మని యకంపితచిత్తముతోడ వేఁడ నంతంతకు నుబ్బువార్ధిఁ గని యారఘువీరుఁ డుదగ్రకోపుఁడై.
కుంభకర్ణస్ఫూర్తితి కొమరొంద నందంద జలకుంభంభము ల్సందడింపమేఘనాదనిరూఢి మీఱుచు నుల్లోలకల్లోలజాలము ల్గడలుకొనఁగనతికాయవిభ్రమం బతిశయిల్లఁగఁ దిమింగిలగిలాదివిసారకులము పొదలఁబటుమహోదరమహాపార్శ్వవైఖరి వారిచరజంతుసంతతుల్ ల్చౌకళింపఁ
బ్రతిఘటించిన రావణుబలముఁ బోలి, యెదుటఁ గనుపట్టెఁ గంటివె యీపయోధిఁదెమ్ము లక్ష్మణ చాపంబుఁ దీవ్రవేగ, రూపరోషంబులను వారిరూ పడంతు.
అని హంసడోలికాయమానకల్లోలపాలికాశాలిశాలికావాలరింఛోళికాసముత్పతజ్ఙలకణమాలికాకల్పితగగనకేలికాలోలమరుద్బాలికాచూలికాపాలికానవమాలికాజాలకదుర్నివారం బగుపారావారంబు నిరీక్షించి పునఃపునఃప్రవర్ధమానరోషంబున జటాపటలి కన్న ముందుగ ముడిగొను కుటిలభూకుటియును దూణీరాంబకంబులకన్న ముందుగ గొప్పలగు నిప్పులకుప్పుల వెదచల్లువిశాలాంబకంబులును దటినీవిటహృత్పుటంబుకన్న ముందుగఁ గటతటనదరుకటతటంబులును దుర్వారమౌర్వీనినాదంబుకన్న ముందుగఁ బర్వురథసంఘర్షకటుతరకిటకిటధ్వనులు వెలయ నిజసహోదరకరోదరకలితకాకోదరతులితశరశరాసనంబు సెలసి పుచ్చుకొని భవిష్యజ్జలధిశిరోనమనసూచకంబుగాఁ గార్ముకంబు వంచి యప్పు మరలించు మరలించు మని పొగడదండ వేయుక్రమంబునఁగోదండంబున నారి సారించి లంకాంతరీపదనుజగార్భిణ్యగర్భనివారణావారణమన్త్రాయమానంబుగ గుణధ్వానంబు చేసి యిటువలె శరధిశరంబులు రిత్త సేయుదు ననువలెఁ జటులతరమాంసలాంసరుచిరశరధిశరంబు లొక్కపరి తివిచివైచిన నంతకంతకు నుప్పొంగుశరధిశరంబులంబోలి నిజశరధిశరంబు లక్షయంబుగాఁ దొడిగి యేయుచుండ నప్పుడు ధారాశుద్ధి వెలయ వారాశినీరంబునకులంఘించు కాండప్రకాండంబులును జలధిరాజన్యుండు వదాన్యుండని జలకరికరభంబుల వేఁడుకొన నిగుడు మార్గణగణంబులును జలకన్యకాముఖాంభోజంబులవ్రాలు శిలీముఖంబులును మకరప్రాణసమీరణపారణంబు సేయుమహాజిహ్మగంబులును వనాంతరంబుల నెల్లెడం జొచ్చి వర్తించు పృషత్కంబులును పొదఁ
జొరవంజొచ్చి చనువిశిఖంబులును జలపాయితోదయంబుల వారించునాశుగంబులను మణిమాంసాపేక్ష ఫణిఫణంబులందును ముకంకపత్రసముదాయంబునుం గలిగి ప్రళయానసరప్రకటీభవదేకభావసకలాకూపారవారిశోషణప్రణవద్వాదశద్వాదశాత్మాదారుణకిరణశ్రేణికాధురీణంబులై రామబాణంబులు దీరనిర్ఘాతసదృశలింగంబులగు విస్ఫులింగంబులు చెదర వారాశిం జొరఁబాఱినరఘువీరశరఘాతధూతదంభోళిపాతభీతపలాయమానంబు లగుచు శతశఃకణశఃఛిన్నభిన్నంబులగు నంగంబులును రఘునాయకుసాయకంబు లేచాయ నిగుడునోయని నిర్నిమేషంబున గనుంగొనుచుండియు ఖండఖండంబులగు సగండకసముద్దండపాఠీనమండలంబులును దలలు దాఁచుకొనియునుం దప్పలేక తెప్పలుగాఁ గూలుకమఠకర్కటంబులును ముడిగొను నడుగుల నెడనెడం దడబడుచుఁ జుట్టలు చుట్టుకొని బిట్టొరలుభుజంగంబులును నారాచంబులు నాసారంధ్రంబులం దూఱిశిరంబుల కెక్కినం గ్రక్కతిలి తుండంబులు ద్రిప్పుచు ఘీంకృతులు గుప్పుచుఁ గుప్పదెప్పునం గూలు జలకరిఘటలునుం గలిగి రత్నాకరంబు హల్లకల్లోలమైయుండెమఱియును.
జలనీలికాశిరోజశ్రేణి బెదరించి చంకనత్సంకజాస్యంబు దూఱికలితముక్తారదావళి నుగ్గు గావించి ప్రకటప్రవాళాధరంబు చించిశంఖకంధరనాటి శైలశృంగాంసము లగలించి భుజగబాహలు దళించికనుకవక్షఃస్థలి గాఁడి భ్రమీనాభి యవియించి కరికరోరువులు చీల్చి
మనుకులశరంబు లాపాదమస్తకంబు, ముంచి భువనైకమోహనమూర్తిఁ గలఁపహతమహాసత్త్వ మయ్యు నుబ్బడగడయ్యె, నమృతనిధి గానఁ బ్రాణభయంబు లేదొ.
ఇటు లుప్పొంగ నభంగభంగజలధిన్ వీక్షించి రూక్షేక్షణాస్ఫుటదంభోజభవాండుఁ డౌచు ఖరరక్షోహర్త బ్రహ్మాస్త్రమున్ఘటియించెం దనవింట వింటఁగలమూఁక ల్వీఁగె నూఁగెన్ సముత్కటశైలంబులు వేఁగె మూఁడుజగము ల్గ్రాఁగె న్విధిస్వాంతమున్.
చకితుఁడై యంత గంగాదిసతులతోడ, నబ్ధి యేతెంచి రత్నోపహార మొసఁగిజానకీజానిపాదాంబుజాతయుగళి, కవని సాష్టాంగ మెఱఁగి యిట్లని నుతించె.
శ్రీజానకీమనోరాజీవసారంగ రంగదభంగశౌర్యప్రచండచండకరాన్వయజలధిపూర్ణశశాంక శంకరధనురహీశ్వరసుపర్ణపర్ణమూలాశితాపసమానసవిహార హారాదిభూషణోదారవత్సవత్సలతాగుప్తవనజాప్తతనుజాతఁ జాతరూపాంబరద్యోతమాన
మానవాశనగర్వశిక్షానిదాన, దానజలవాహినీపూర్ణతమనదీనదీనజనవాంఛితార్థప్రదానదక్ష, దక్షజానుతనామ కోదండరామ.
తనసహోదరున కిత్తఱి నెద్దిగతి యంచుఁ దల్లడించుచు గౌరి ధవుని వేఁడెఁగద్రువపుత్రశోకంబు నేగతి మాన్ప నగునంచుఁ గశ్యపుఁ డడిగె నజునిఁదనపౌత్రుఁ డేమి యయ్యెనొ బలీంద్రుఁ డటంచుఁ బ్రహ్లాదుఁ డెంతయుఁ బలవరించెగిరికొనుచింతచేఁ గిటికూర్మరూపము ల్సంహరింపఁదొణంగెఁ జక్రపాణి
నీశరాగ్నులు నానీరు నీఱుఁ జేసి, మీఱి పాతాళలోకము ల్దూఱునవుడులోకసంరక్షణైకలోలుండ వయ్యుఁ, దగునె నీ వింత సేయ సీతాసహాయ.
అని నుతులు చేసి మరుభూమి నజునియాశు, గంబుఁ బఱపించి సేతుబంధంబునకునునలుని నియమించి చనియె నజ్జలధి నలుఁడుఁ, గపులు దెచ్చిన గిరులచేఁ గట్టునపుడు.
ఒకచేఁ బట్టెఁడు నెంతగట్టు నితఁడం చుగ్రాత్ముఁడై గంధవాహకుమారుం డట నుత్తరంబు గన దేవాహార్య మేలంచు భూమికుమారీవరుఁ డన్న వద్దనఁగ నేమీ తెచ్చుఁగాకంచు నుత్సుకుఁడై కట్టె నలుండు వారధి సురస్తోత్రైకపాత్రంబుగన్.
మును సుగ్రీవునకు న్విభీషణునకున్ మోదంబుతోఁ బట్టముందనుఁ జేరంగని కట్టెనంచును సముద్రంబుం దనుంజేర శోభనలీల న్ఫువనాధిపత్యమునకుం బట్టంబుఁ దాఁ గట్టెనోజననాథాగ్రణినాఁగ సేతు వమరెన్ సాముద్రగోధిస్థలిన్.
హరిసంఘంబులు గొల్చిరా సరసవాతాపత్యసంరూఢుడైఖరశత్రుం డసమాస్త్రరీతి వెలయం గామాతురుం బఙ్క్తికంధరు నంత్యోగ్రదశార్తుఁ జేయుటకు దోర్దర్పంబునన్ దైత్యరాట్పురముం జేరెను హంససంతతి నతు ల్వొంగార శృంగారియై.
ఇవ్విధంబున రఘునాథుండు పాథోనిధానంబుం దాఁటి యనేకబలజాలంబులతోసువేలనగరంబునఁ బాళెంబు డిగిన శుకసారణులు వచ్చి చూచి చని రామలక్ష్మణసుగ్రీవమహాబలనందనాదిబలంబుల వేఱువేఱ విన్నవించిన విని నిశితక్రూరకటాక్షంబుల నాక్షేపించుచు జిహ్మగమనద్విజిహ్వుని విద్యుజ్జిహ్వునింబిలిచి మాయ సేయ నియోగించి యద్దురాత్ముండు వద్దురా రావణా యనకకుహనారఘూద్వహుని శిరంబును సశరాసనశరంబునుంగాఁ దెచ్చి సీతముందఱం బడవైచినం జూచి యుల్లంబునఁ దల్లడిల్లి పెల్లడలు పుడమిపట్టికి నవి కల్లలనితెల్పు సరమవాక్యంబుల సముల్లాసరమం గాంచి యుండె నంత.
ఇనకులుఁ డాసువేలగిరి నెక్కి కనుంగొనఁ బైఁడిమేడపైఁబనివడి కుంచెగిండి యడపంబును బావడ లూని వేల్పుజ
వ్వను లిరుగ్రేవలం గొలువ వన్నెయుఁగాఁ గొలువున్న రావణుంగని పడఁదన్ని వచ్చె భుజగర్వమునన్ రవిపుత్త్రుఁ డత్తఱిన్.
పడమట ననిలజుఁ దూరుపు, కడ నీలుని దక్షిణమునఁ గపిరాజసుతున్విడియించి యుత్తరంబున, విడిసి రఘూద్వహుఁడు సామవిధితత్పరుఁ డై.
అంగదుఁ బంప నాతఁడు రయంబున లంకకుఁబోయి పఙ్క్తికంఠుం గని దుర్మతీ మహితనూజను రామున కొప్పగించి నీయంగము నిల్పుకొమ్ము వల దావల దానవవైరి వీడుఁ గాంచంగలవంచు నక్కొలువు సౌధము గూలఁగఁ దన్ని వచ్చినన్.
సంగరము గల్గెనని యంగములు మిక్కిలియుఁబొంగఁగ రయంబునను జంగలిడుచున్ వేబంగరపుకోటలతుదంగలుగు మానికపుశృంగముల కెక్కుచు నలంగములపైకింజంగునను దాఁటుచుఁ గురంగములరీతియుఁదురంగములభాతియుఁ జలంగఁగ నభంగోత్తుంగభుజుసత్త్వము వొసంగఁగఁ బ్లవంగకులపుంగవులు శూరత మెలంగిరట వేడ్కన్.
అంత.
స్మరహరాదికసురాసురదురాసదధరాధరవరాతిగరథోత్కరముతోడమదవదాయతపదాస్పదవదావదఘనాంగదమదావళరాజఘటలతోడమృగహయాధికరయాహృతిజయాహతభయావహహయాత్యుత్తమావళులతోడనలికులానలపలాహకబలాహితబలార్జనకులాచలబలప్రతతితోడ
నసురనాయకు లెదిరి శస్త్రాస్త్రవృష్టి, గురియ నగధారులై యెదుర్కొనిరి కపులుద్వంద్వసంగ్రామ మయ్యె నత్తఱిని మేఘ, నాదుఁ డంగదుఁ గికురించి నభముఁ జేరె.
భవపాశనోదనుల రా, ఘవులన్ దశకంఠసుతుఁడు గట్టెం గద్రూభవపాశంబుల గరుడుం, డవి యుడిపె న్దమము మాన్చు రవియుం బోలెన్.
అంత హనుమంతుచేత ధూమ్రాక్షుఁ డీల్గె, ననిన కంపనుఁ డతనిచేతనే యడంగెవాలినందనుచేఁ గూలె వజ్రదంష్ట్రుఁ డనిలపుత్రునిచేతఁ బ్రహస్తుఁ డీల్గె.
అప్పుడు.
రణనిస్సాణధణంధణధ్వనులచే బ్రహ్మాండము ల్వీలరావణుఁ డేతించి శితాస్త్రపఙ్క్తి రవిజున్ వారించి యయ్యక్షశిక్షణు నొప్పించుచు నీలునిం గదిసి దోశ్శౌర్యంబు వాటించి లక్ష్ముణు శక్తిం బడవైచి రామవిభుపై శస్త్రాళి వర్షింపఁగన్.
అలుకన్ రామనృపాలశేఖరుఁ డధిజ్యంబైన వింటన్ శరంబులు సంధించి ధ్వజాశ్వసారథిరథంబు ల్గూల్చి మాణిక్యమౌళులు నేలంబడనేసి యేటి కిఁకఁ జాలున్ వీటికిం బొమ్మనందలవీడం బరువెత్తె రావణుఁడు సేన ల్కేకిస ల్గొట్టఁగన్.
ఇటువలె లంకఁ జేరి దనుజేశ్వరుఁ డంతటఁ గుంభకర్ణుఁ బంపుటయును వాఁడు నాకసము భూమియు నిండినకొండమెండునంబటపటనార్చుచుం గపులఁ బట్టుక మ్రింగుచు వచ్చి భానుజత్రుటితసనాసకర్ణుఁడయి త్రుంగెఁ దుదన్ రఘువీరుతూపులన్.
నెనరు గల్గిన యన్నయ నిదురలేపి, పనుప వచ్చినకుంభకర్ణునకు దీర్ఘనిద్ర యొసఁగె రఘూత్తమనిశితమార్గ, ణంబు లవిపక్షపాతు లనంగరాదె.
అంత దేవాంతకుండు నరాంతకుండు, ద్రిశిరుఁ డతికాయుఁడును వింశతిభుజసుతులుదగ మహాపార్శ్వుఁడును మహోదరుఁ డనంగ, వెలయు పినతండ్రులను గూడి వెడలి రపుడు.
రంగదభంగశౌర్యమున నంగదుఁ డప్పు డంగదుం డయ్యె నరాంతకునకుదేవాంతకుండును ద్రిశిరుఁ డంగదలైరి హనుమంతుచేతి మహాద్రులకునుభుజమహోదరవహ్నిపుత్రుచే భిన్నమహోదరుం డయ్యె మహోదరుండువృషభునివలన నివేశితయను మహాపార్శ్వుఁ డయ్యెను మహాపార్శ్వుఁ డొకట
సంగరము చేసి యతిఘోరసంగరమున, గపులఁ బెక్కండ్రఁ జంపి నాకపులు వొగడనంత నతికాయుఁ డతికాయుఁ డయ్యె లక్ష్మ, ణప్రయుక్తవిరించిబాణప్రహతిని.
అంతట నింద్రజిత్తు సమరాంగణహోమము చేసి నీతిహోత్రాంతరసీమ వెల్వడు మహారథ మెక్కి పయోధరాధ్వసంక్రాంతి చెలంగె వైధనశరంబున షష్ఠిసహస్రకోటివిక్రాంతకపీంద్రలక్ష్మణుల రాఘవు మూర్ఛిలనేసి నవ్వుచున్.
గెలిచితి రామలక్ష్మణులఁ గీశులనంచు మహాట్టహాసముల్సలుపుచు నింద్రజిత్తు చనఁ జయ్యన బ్రహ్మనుతోపదిష్టుఁడైమలయక వేగ నేగి హనుమంతుఁడు మందులగట్టుఁ దెచ్చి వారలరుజలెల్ల మాన్పె రఘురాముఁడు మెచ్చుచుఁ గౌఁగిలింపఁగన్.
అంత.
ఖలుఁ డారావణుఁ జేరియుండెనని యింకం దీనిఁ గైకోఁడు నిష్కలుషుండైన విభీషణుం డనుచు లంకన్ శుద్ధి గావింప నుజ్జ్వలకీలనలముం దగిల్చెఁ గపిరాట్సైన్యంబు హాహారవాకులదైత్యాళి తదంతరాఘమువలెన్ క్షోభించె నత్యుద్ధతిన్.
కుంభుఁడు సంస్ఫాలితభుజ, కుంభుఁడు పురి వెడలె మఱి నికుంభునితోఁ దత్కుంభచ్ఛదకు దివాకర, సంభవదోర్దండ మపుడు చండం బయ్యెన్.
తోడఁబుట్టిన కుంభునిఁ జాడనేఁగె, నల నికుంభుండు నంతట ననిలసుతునిచేత నంపించుకొని మైందుచేత శోణి, తాక్షుఁడు ద్వివిదుచేత యూపాక్షుఁ డరిగె.
మకరాలయబంధనరా, మకరాళశరాస్త్రశస్త్రమహిమ రుషోద్దామకరాక్షుఁ డగుచుఁ గూలెన్, మకరాక్షుఁడు దనుజసేన మల్లడిగొనఁగన్.
అంత.
జంభవిదారి వైరికృతసంగరుఁడై రఘువీరరోషసంరంభముఁ జూచి నిల్వక పరాజితుఁడై కుహనామహీసుతాలంభమున న్మరుత్సుతుఁ దొలంగఁగఁ జేసి యఁట న్నికుంభిలాకుంభిని దీక్షఁ గైకొనుచు గొబ్బున హోమము సేయుచున్నెడన్.
హనుమంతుం డట పోయి యశ్రువులతో హారామ హారామ యంచును శోకింపఁగ సీతఁ జంపి చనె నచ్చో నింద్రజిత్తుం డటంచును దెల్పన్ విని హావిదేహసుత యంచున్ మూర్ఛిలెన్ రాఘవుండు నివారించెఁ దదీయమూర్ఛ ననుజుండున్ యత్నపూర్వంబుగన్.
అక్కట నేఁడు నీదగుననర్థము దెల్పెను నిట్టులైన నేనెక్కడఁ జొచ్చువాఁడ నిఁక నెవ్వరిఁ జంపిన నేమి యంచుఁ దావెక్కుచు లక్ష్మణుండు పలవింపఁగ రాముఁడు చేరి యాగతింజొక్కిపడన్ విభీషణుఁడు భూసుతమేలు వచించి యిట్లనున్.
ఇనకుల యాంజనేయు భ్రమయించి నికుంభిలహోమదీక్ష గైకొనఁ జనె నింద్రజి త్తటకు గొబ్బున లక్ష్మణుఁ బంపుమన్న నజ్జనపతి విస్మయంబున ససైన్యముగాఁ బనుప న్నికుంభిలావని కరుదేర లక్ష్మణుఁడు వాసవవైరియు ముక్తహోముఁడై.
కనకస్యందన మెక్కి బిట్టెగయ నుగ్రంపశ్యనేత్రాబ్జుఁడైహనుమద్వాహన మెక్కి లక్ష్మణుఁడు దివ్యాస్త్రాలిచే వానిమాయ నివారించి శిరోధరంబుఁ దెగవ్రేయం గల్పకశ్రేణి బోరున వర్షించెఁ బ్రసూనవర్షములు మెండయ్యెన్ సురస్తోత్రముల్.
అంత.
సౌమిత్రేయుఁడు శక్రజిజ్జయరమాచంచన్నఖశ్రేణికాసామగ్రిం బిశునాశుగప్రణితనూసౌందర్యుఁడై మొక్కినన్వైమాత్రేయునిఁ గౌగిలించుకొని ముద్వారాశి నోలాడె శ్రీరామక్షోణివిభుండు రావణు గతప్రాణుండుగా నెంచుచున్.
హతశేషత్రిదశాహితుల్ బలవిపక్షారాతియాయోధనక్షితిలోఁ గూలుటఁ దెల్ప మూర్ఛిలి దశగ్రీవుండు హాపుత్త్ర దైవతలోకేంద్రుఁడు తన్నుఁబట్టుకొని పోవన్ వాని వారించి తెచ్చితి నేఁ డేటికి నొప్పగించి చని తీశ్రీరాముబాణాగ్నికిన్.
అని శోకించి సరోషుఁడై జనకకన్యం జంపఁగాఁ బోయి మంత్రినిరుద్ధుండయి పంపి మూలబలముం ద్రెళ్లన్ రఘూత్తంసుచేతను దా వచ్చి యనేకకీశభటులం దండించి యత్యుగ్రశక్తిని సౌమిత్రిని నేయ నాతఁడు ధరిత్రిన్ వ్రాలె నిశ్చేష్టుఁడై.
అనుజునిఁ జూడ శోకము దశాననుఁ జూడఁగ వచ్చురోషముంబెనఁగొన రామభూవిభుఁడు పేర్చి జ్వలద్విశిఖార్చి నేర్చగాదనుజవిభుం డెదుర్చుటకుఁ దాళక యూడనిఁ బాడె ఖిన్నుఁడైవనచరు లోదశాస్య యలవాటుగదా యిది నీకు నంచనన్.
అంతట హనుమంతుఁ డౌషధు ల్గొనితేరఁ గదలుచు మునివేషుఁ గాలనేమిఁగని మున్ను గాన మిమ్మునినం చడిగి వాని జలము వేఁడిన వాఁడు గొలను జూపఁజని యచ్చటను మౌనిశాపంబు దీర్చి పొమ్మని పదంబులు పట్టుకొనినమకరిమర్దింప నది ధాన్యమాలినియై కాలనేమిఁ దెల్పిన నైన నేమి యనుచు
వానిఁ బరిమార్చి ద్రోణపర్వతముఁ జేరి, యచట కాపున్న గంధర్వనిచయములనుగెలిచి తరిగట్టుఁగొని తెచ్చు పులుఁగుఱేని, సరణి మందులకొండ యంసమునఁ జేర్చి.
తెచ్చిన యంతనె ప్రాణము, వచ్చె న్సౌమిత్రి కఖిలవానరబలమున్మెచ్చెన్ రాఘవుశోకము, విచ్చెన్ రావణమనోరవిందము నొచ్చెన్.
అసురేంద్రుఁ డంత శుక్రాదిష్టమగునియమమునఁ బాతాళహోమంబు సేయననలుఁడు చెప్పి పంపెనొ నాఁగ ధూమంబు భీమమై వెడల విభీషణుండుదెలిసి రాఘవులకుఁ దెలిపి తద్విఘ్నంబు గావింప సబలు నంగదునిఁ బంపనతఁడు మందోదరీహరిణాక్షి వేణిఁ బట్టీడిచితెచ్చి దైత్యేంద్రుచెంత
నిలుప నాకంజవదన కన్నీరు దొరుగ, నాయకునిఁ జూచి వెస రోయఁబోయె వాఁడుస్వక్సృపంబులు పడవైచి సురియఁ బూని, యంగదాదులఁ దఱిమి మహారయమున.
దశమస్తకాధగద్ధగితరత్నకిరీటకాంతి భాస్కరుఁ గచాకచికిఁ గవయభుజచతుఃపంచకాద్భుతసాధనశ్రేణి భుజగజిహ్వాభుజాభుజకి మొనయజాజ్వల్యమానవింశతిదంష్ట్రి మర్త్యహర్యక్షదంష్ట్రారదారదికి నెదురదీప్తరోషజ్వలద్విదశకాలోకము ల్శిఖశిఖావళి ముఖాముఖికి డాయ
వెడలె సంగ్రామమునకుఁ బృథ్వీధరేంద్ర, సహజగౌరవవైభవాసహశతాంగపటపటాత్కారపటలలంపటపటాగ్ర, గళితదశకంధరుఁడు దశకంధరుండు.
మనుకులచంద్రుఁ డట్టియెడ మాతలి దెచ్చిన వాసవీయకాంచనరథ మెక్కి యెక్కిడిన చాపముతోఁ బ్రతిఘాజ్వలద్విలోచనములతో యుగాంతయమశాసనుకైవడి మించు వేల్పులంగనుఁగొన గొంకి రంత దశకంఠు నెదుర్పడి పోరు నయ్యెడన్.
పల్లవారుణజటాపటలంబు ముడిగొన ముడిగొనుబొమల నెమ్మొగము వెలుఁగవెలుఁగుతోఁ జనుచూపు విలయాగ్ని వెదచల్లఁ జల్ల గానిమహోచ్ఛ్వసనము దనరఁదనరఁ బై బైఁ గటి తటియంగ మదరంగఁ దరగలై రథపటుధ్వాన మానమానని ఫాలఘర్మమునఁ జెక్కులు నాన నానతంబగుచు బాణాస మలర
మలరహిని బోల్చు రావణు మర్మ మంట, మంటలన్నియుఁ దనకదంబముల మాటిమాటికే యంచు నంధకమధనభీమ, భీమమగురోషమున వీరురాముఁ డెదిరె.
పరుషాన్యోన్యవికత్థనంబు విహితప్రత్యస్త్రశశ్వన్మిథశ్శరజాతం బితరేతరత్వరితమూర్ఛామగ్నసారథ్యభంగురరథ్యంబుఁ బరస్పరాహతదళత్కోదండదండంబునైకర మొప్పెన్ రఘురామరావణుల సంగ్రామంబు భీమంబుగన్.
గుణజాతంబులొ యంగుళీభవములో కోదండకౢప్తంబులోగణుతింపం బసకాదు కాదన నిషంగం బంటి చేసాచి మార్గణముల్ దీసినయప్డు కుండలితమై కన్పట్టునే భానుదారుణమా విల్లని మెచ్చి రందు రఘువీరున్ దేవతాబృందముల్.
శరవేగప్లవమానగండక సమంచద్భంగలీలాప్తిసాగరమున్ రాహుతులాధికాయతధనుఃకంఠీరవప్రాప్తి నంబరముం బోలుచు రామరావణు లసామ్యంబైన యుద్ధంబుఁ జేసిరి నక్తందిన మేడునాళ్లు దివిజశ్రేణు ల్విలక్షింపఁగన్.
అంత.
రామవిభుండు నిస్తులశరంబుల రావణుహస్తమస్తకస్తోమముఁ ద్రుంచినన్ మొలచుఁ దోడనె తోడనె త్రుంచు రాముఁడున్వేమఱు నట్లు ద్రుంచి యటు వెన్క విభీషణు డెచ్చరింప గర్భామృతమున్ హరించె ననలాస్త్రమున న్శిర మొండు చిక్కఁగన్.
బ్రహ్మణ్యంబయి మించు రాఘవపరబ్రహ్మంబు ధన్వంబునన్బ్రహ్మాస్త్రం బరివోసి యేసినఁ గృతాబ్రహ్మణ్యవిప్రావహున్బ్రహ్మాండోజ్జ్వలతేజు రావణు జగద్భాధాచణుం ద్రుంచి వేబ్రహ్మాదు ల్నుతియింప రామశరధిం బ్రాపించె నత్యుద్ధతిన్.
విజయకమలాభిరాముఁడై వీరరాముఁ, డనుజకరమున కొసఁగి బాణాసనంబురథము డిగ్గి మనోల్లాసరమను భాను, సుతునికైదండ గొని యనిఁ జూచుచున్న.
పరితఃకీర్ణకచావృతాంసము గళద్భాష్పంబు సిక్తస్తనాంతరచేలంబుఁ బతద్విభూషణము హానాథేతివాగాస్య మత్యురునిశ్వాసవిశోషితాధరము శోకద్విగ్నచిత్తంబు నైయరుదెంచెన్ రణభూమిఁ జేర దశకంఠాంతఃపురం బయ్యెడన్.
అరుదెంచి వరునిపైఁ బడి, పొరల విభీషణుఁడు వారి బోధించి ధరావరునాజ్ఞఁ బంక్తిముఖునకుఁ, బరలోకక్రియలు దీర్చి పావనుఁ డైనన్.
యావత్కాలము భూమి రాముకథ సూర్యాచంద్రముల్ వారిధుల్తావత్కాలము లంక నేలు మని తాత్పర్యంబుతో రామసంసేవాలోలు విభీషణున్ సుగుణరాశిన్ నిల్పె సౌమిత్రి సీతారామాహృదయేశజంగమజయస్తంభంబునా నంతటన్.
తళుకున్నిద్దపుఁబైఁడిబొమ్మవలె సీతాకాంత పెంజిచ్చునిచ్చలపుంగాఁ కలవన్నెవాసి గని మించం గాంచి హర్షించుచుంగులకాంతామణి చెంత నుంచుకొనియెం గోదండదీక్షాగురుండలఘుప్రౌఢవచోనిరూఢిఁ దగ బ్రహ్మాదు ల్ప్రశంసింపఁగన్.
అంత.
దశరథుని గాంచి మ్రొక్కి యింద్రవరమునను, బలము బ్రతికించి పురి కేఁగఁదలచురామునకు విభీషణుఁ డొసఁగె సాంద్రప్రఫుల్ల, పుష్పకంబైన కౌబేరపుష్పకంబు.
రతివలెఁ గామగమనమయి, వితతంబగుపుష్పకము బ్రవేశించి చమూతతితో సతితో ధృతితోఁ, బతితోరపువేడ్క రాజపథగతుఁ డగుచున్.
అదె చిత్రమకరాంకహయవిచిత్రవిటంకవసతిలగ్నశశాంక యసురలంకసకలలోకములందు జయలక్ష్మినేఁ జెందఁ గుంభకర్ణుం డిందుఁ గూలె ముందుమనలక్ష్మణునితోడ మల్లాడి మదమూడి శక్రు గెల్చినప్రోడ సమసె నీడనట వ్రాలె బటుదండుఁ డైయుండు మును నిండురాజసంబున నుండురావణుండు
సేతు వదె యంచుఁ దెల్పుచు సీతతోడ, రామచంద్రుఁడు రామేశ్వరంబు చేరితనదుపేర సమీరణతనయుపేర, దివ్యలింగంబు లఁటఁ బ్రతిష్ఠించి కొలిచి.
భవభావిభవవిభావా, భవభావభవాభిభావభావీభూభాభవభావభావివైభవ, భవభావిభుభావివిభువభావావిభవా.
అని వర్ణించి విభుండు సేతువు శరాసాగ్రంబునం ద్రుంచె శేషునకైనం బొగడంగ శక్యమె ధనుఃకోటిప్రభావంబు గ
న్గొనినంతం జను బ్రహ్మహత్య మొదలౌ క్రూరాఘసంఘంబు మజ్జనముం జేసినవారి పుణ్య మెఱుఁగన్ శక్యంబె మాబోంట్లకున్.
అంత రఘువల్లభుఁడు పుష్పకాధిరూఢుఁ, డగుచుఁ గిష్కింధత్రోవఁగా నరిగి రవిజసతుల రప్పించి సీతపార్శ్వముల నిలిపి, జనకనందనతో నిట్టు లనియెఁ జనుచు.
పంపానదినిఁ గంటె శంపాలతాతన్వి ఋశ్యమూకముఁ గంటె ఋష్యనయనశబరీవనముఁ గంటె శబరీజితఘనాళి దండకఁ గంటె వేదండయానపర్ణశాలలఁ గంటె స్వర్ణభాసురవర్ణ ఘటజాశ్రమముఁ గంటె కుటజగంధిచిత్రకూటముఁ గంటె చిత్రశాలికపోల గంగఁ గన్గొంటివె భృంగచికుర
యనుచుఁ దెల్పుచు వచ్చి యయ్యనిలసుతుని, బిలిచి తమరాక భరతుతోఁ దెలుపఁబంచిఘనభరద్వాజుఁ గనఁ బ్రయాగమున నిల్చి, యాతఁ డొనరించు మంచివిం దారగించి.
ప్రభాతసమయంబునఁ బ్రభావతీప్రభాతరంగితపుష్పకాభిరాముండై భరద్వాజసమాసాదితభోజనానందిగ్రామసమేతంబుగా రామచంద్రుండు నందిగ్రామంబునకుఁ జనుదెంచునప్పుడు నెదురుగా సకలసేనాపరివృతుండును శత్రుఘ్నసేవితుండును గౌసల్యాదిజనయిత్రీసహితుండును నైన భరతుండు కృత్యాచారతరంగిణీరోధఃపురోధఃపురస్సరంబుగా నరుగుదెంచినం జూచి రఘువీరుండు డిగ్గున లేచి సుగ్రీవుకైదండ గొని విభీషణపురోనిర్దిష్టమణిసోపానమార్గంబునఁ బుష్పకంబు డిగ్గి వసిష్ఠునకు వందనం బాచరించి వందమాను లగు భరతశత్రుఘ్నులఁగౌఁగిలించికొని తల్లులకుం బ్రణమిల్లి తదీయానందబాష్పధారానేకంబు చిరాద్భావిపట్టాభిషేకసంసూచితంబుగా సంతసిల్లి నందిగ్రామంబు ప్రవేశించి భరతపూర్వకంబుగా సుమిత్రాపుత్రులతో జటావల్కలంబులు సడలించి పతంగనందనదనుజపుంగవాదిపురోహితసహితంబుగా నభ్యంజనస్నానంబు చతుర్విధశృంగారంబు లంగీకరించి మణిమయశతాంగం బెక్కి సుగ్రీవాంగదవిభీషణాదులుమాతంగతురంగాదివాహనారూఢులై కొలిచిరాఁ బురాంగనలు సేసలు చల్లవందిమాగధులు వొగడఁ బంచమహావాద్యంబులు బోరు కలుగ మహోల్లాసంబున.
అల మేరువును బోలి యందంద నందమై కురుజులు మేరువు ల్గొమరుమిగులగలువడంబులలోన యలజవ్వనపుమిటారులచూపు కలువడంబులు ఘటింపఁగలయ నెల్లెడ వణిక్కులదీపములవాకిళులయందు మణిదీపములు వెలుంగమకరతోరణము లంబరమార్గమకరతోరణవిచక్షణములై రాయడింప
రహి వహించు నయోధ్యాపురంబు సొచ్చి, తననగర లక్ష్మణునియింటఁ దపనసుతవిభీషణుల నన్యులను నన్యపృథులరత్న, గేహముల నుంచి తా రాజగృహము చేరి.
ఆమఱునాఁడు మారుతసుతాదికపీంద్రులు వారిరాశి గంగాముఖపుణ్యతీర్థములు గైకొనిరా శుభవాద్యఘోషముల్భూమిసుపర్వమంత్రరవముం జెలఁగ న్మణిపీఠి సీతతోశ్రీ మెఱయంగ రాము నభిషిక్తునిఁ జేసె వసిష్ఠుఁ డత్తఱిన్.
భరతుండు ముక్తాతపత్త్రంబు ధరియించి యిందుబింబంబు కొల్వెక్కఁజేయసరిగాఁగఁ గవులు చామరములు వీచుచు విష్ణుపయోధులవిధము దెలుపఁగపిరాజతనయుండు ఖడ్గంబు ధరియించి శేషాహివల్లభుసేవ నెఱపఁబవమానసూనుండు పగలు దీవటిఁ బూని స్వప్రతాపంబు సాక్షాత్కరింప
సీతప్రతిబింబ మన సురస్త్రీప్రదీప, మర్కసంకాశరత్నసింహాసనమునఁబ్రేమఁ గొలువుండెఁ బట్టాభిరాముఁ డగుచు, రామచంద్రుండు భక్తసంరక్షణుండు.
అపుడు బ్రహ్మాదిదేవత లఖిలమునులు, వచ్చి కృతపూజు లగుచు రావణుని ద్రుంచిమనిచితివి లోకముల రామ యనుచు వినుతి, చేసి రందఱు వేజ్వేఱఁ జిత్రగతుల.
ఖరకరఘోరతేజ కవికల్పక బంధనదీనజానకీవరధరధీర రాఘవభవస్తవలోలుప చాపరోధ భాస్వరకర వీరగుప్తసవసర్వనమారమణీమణీమనోహర శరహారకీర్తియనయప్రియదానవదావజీవనా.
రఘువరధీరతా విమలరామ దయాపర దివ్యమూర్తిమానఘనలినాక్ష దానరతయక్షయరూప జితారిభాసు రాలఘుశరవీరభూవిధులలామజయాకర భవ్యకీర్తినిత్యఘనఘనాభ దాశరథి యక్షయరూపప్రతాపభాస్కరా.
సురవరదరకరఖరకర, కరఖరశరవారవీరఖరహరహారస్ఫూరదరనరవరధీర, త్రరమారఘురమ్యరక్షిరణరతరథ్యా.
భవ్యారామక్షితీశా భవనజలజప్రాయవైశద్యకీర్తీదివ్యాగత్యాగరాజద్విజకులరమణాదీనభద్రాఫలాయత్క్రవ్యాదాకీర్ణనానాదహనవినతపక్షాజరాతీతధీరానవ్యాపద్మేశభావ్యానరభరణదిశానాథగణ్యోపసేవ్యా.
నరవరధీరగుప్తకృపణావరభూధవమన్యువేగజేత్రరియుతధీరతాలఘుతరావనభృల్లలితాభభూసురాత్యురుఘనభావమావిభవయుక్తరమావహవత్సనిర్మలావరకృప ధన్యుఁ జేయు రఘువల్లభ రాఘవ భక్తవత్సలా.
మానవపాయజనుతశివ, మానధనాసారభవనమదసదననదాదానవదసదమనవభర, సానాధనమానశినుత జయపావనమా.
హారీనిత్యాసనర్మాహరవినుతనయాత్యాయసత్రావిరాధీధీరానిత్రాసయత్యాధృతపదనతధాత్రీపదివ్యాభరాకాకారాభవ్యాదిపత్రీడ్గమన శుభగుణగ్రామసక్తాసరామామారాసక్తాసమగ్రామహిత వరధనుర్మాససత్యాదిరీహా.
అని బ్రహ్మాదులు వొగడఁగ, విని సంతస మొందు రామవిభునకు భక్తిన్వినుతి యొనర్చి సమీరణ, తనయుం డిట్లనుచుఁ బొగడెఁ దనవాక్ప్రౌఢిన్.
భ్రాజితవిక్రమా వికచపంకజపత్త్రవిలోచనా రణక్ష్మాజితదానవా విమలకార్తికచంద్రనిభాననా మహారాజశిరోమణీ జనకరాజలలామకుమారికామనోజ్ఞాజలజాప్తతేజ యతిసన్నుత చారుగుణోన్నతా హరీ.
అని హనుమంతుఁడు పొగడఁగ, విని వేడుక మీఱ రామవిభుఁడు ధరిత్రీతనయఁ గని చెలువ వింటే, నను బొగడెడి పద్యముననె నైపుణి మెఱయన్.
వికచపంకజపత్త్రవిలోచనా, విమలకార్తికచంద్రనిభాననాజనకరాజలలామకుమారికా, జయతి సన్నుతచారుగుణోన్నతా.
అని నాస్తోత్రము మంజుభాషిణి త్వదీయస్తోత్రము న్గర్భితంబును నైమించ రచించె నందు ననినన్ భూపుత్రి మోదంబుతోఁదనచేహార మొసంగ మారుతియు ముక్తాదామముం దాల్చి చెల్వెనసెన్ స్ఫాటికమాలికామహితవాణీశానుచందంబునన్.
అంత.
వారివారి యథోచితవైఖరులను, బనిచి కృతయుగధర్మంబు ప్రబల సకలయాగములు చేసి జనులు సౌఖ్యములఁ బొదల, జగములను బ్రోచు శ్రీరామచంద్రవిభుఁడు.
ఈరామాయణకథ యె, వ్వారు పఠించినను వినిన వ్రాసిన సౌభాగ్యారోగ్యభాగ్యయుతులై, వారలు వెలయుదురు సుమతి వసుమతిలోనన్.
అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెలుప విని ప్రమోదాన్వితుఁడైజనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెలుపు మని యడుగుటయున్.
శ్రీరాగోజ్జ్వలగేహ తోయజదళాక్షీమోహనాదానవత్సారంగప్రవరాళిపార్శ్వనినదద్ఘంటీరవప్రాంగణాసౌరాష్ట్ర ప్రియశంకరాభరణరాజత్ప్రజ్ఞకేదారకాశ్రీరామేశ్వరధీరమధ్యలలిత శ్రీదాభిరామక్రియా.
పూర్వోత్తరమీమాంసా, పూర్వోత్తరవినుతసమరభూసాహసితాపూర్వోత్తరసారథిరథి,పూర్వోత్తరరాజమిత్ర భూరిధనాఢ్యా.
చంద్రకాంతోన్నమత్సౌధయూథక్రమాచంద్రకాంతోపలాంచద్యశశ్చక్రమాచంద్రకాంతోపమానన్ముఖాబ్జక్రమాచంద్రకాంతోత్తమాశ్వస్ఫురద్విక్రమా.
ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్టభాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగనామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతంబైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు సప్తమాశ్వాసము.
Comments
Loading comments…