8. బలరామావతారకథ
దశావతారచరిత్రము
దసఖశౌర్య యాధునికాదిమహారాజదాన హసనక్షమధైర్యౌదార్యాదికగుణధుర్యాదవనము కృష్ణయార్య యధికైశ్వర్యా.
అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌనిధరణివర బలరామావతార మిఁకను, దెలియఁ జెప్పెద వినుమని తెలుపఁదొణఁగె.
మధురమణీయకేళి వనమంజుళవంజులకుంజమంజరీమధురసధారలన్ రమణమానితమానితమానినీమణీమధురవచోవిలాసముల మాసరమై సరమైకవాసమైమధుర యనంగ నొక్కపురి మండితమౌ మహిమండనంబుగన్.
అసదృశవితరణలీలా, వసుదేవుఁ డమిత్రమిత్రవనజాతవిభావసుదేవుఁ డనఁగ మధురన్, వసుదేవుఁడు దనరు యాదవకులోద్వహుఁడై.
కల రతనికిఁ బదునలువురు, కులభార్యలు వారిలో సగుణలౌ భార్యల్వెలయుదురు వచోజితకో, కిలలై రోహిణియు దేవకియు నన నిరువుర్.
కమలాక్షుఁడు దేవకిస, ప్తమగర్భముఁ జేరి పిదపఁ దనయోగముచేవిమలంబౌ రోహిణిగ, ర్భమునఁ బ్రవేశించి పుట్టె బలరామాఖ్యన్.
గర్భసంకర్షణమున సంకర్షణాఖ్యఁ, గలిగె బలరామునకు నంతఁ గంసభీతిరోహిణీకాంత నందుని గేహమున వ, సించి పోషింపఁ బెరుఁగుచు సీరపాణి.
హరియుం దానును గొల్లగుబ్బెతలగేహంబుల్ ప్రవేశించుచుంబెరుఁగుం బాలును గొల్లలాడుచును గోపీవృత్తవక్షోజముల్కరజాగ్రంబులఁ జీరుచుం గదిసినం గౌఁగిళ్లఁ జొక్కించుచుంగరమర్థిన్ విహరించు సీరి సఖసంఘంబుల్ ప్రశంసింపఁగన్.
బృందావనముల నావులు, మందలు మేఁపుచును గోపమాణవకులతోనెందును బాలక్రీడా, నందంబునఁ బొదలు నందనందనుతోడన్.
ఒకనాఁడు బలభద్రుఁ డుత్సాహమునఁ దోడిబాలురఁ బిల్చి యో బాలురారమనలోన నెవ్వ రేమాత్రంబు దాటఁగా వలతురో కనుఁగొనవలయు హెచ్చుదాఁటినవారిని దాఁటఁజాలనివారు వహియించి భాండీరవటముదాఁకనరిగి రావలెనంచు హరికి శ్రీదాముని దక్కినవారికిఁ దగినవారి
యుద్దు లేర్పాటు సేయుచు నున్నచోఁ బ్ర, లంబదైత్యుండు గోపవేషంబుతోడవచ్చి వంచనచే సీరివధ మొనర్తు, ననుచు సంకర్షణున కుద్ది యయ్యె నపుడు.
నేరుపున నిట్టు లుద్దులు నేరుపఱిచి, రామకృష్ణాదు లొకట శ్రీదామముఖ్యులొకట నెలకొని తమతమయురుబలంబు, వెలయ లంఘించుచుండిరి వేడ్క మీఱ.
చిరుబొజ్జ గదల జిగిబం, గరుగజ్జెలు మొరయ మద్దికాయలు మెఱయంబరువెత్తివచ్చి దాఁటెన్, హరి యిరువదినాలుగడ్గు లౌరా యనఁగన్.
హరి పాటిగ దాఁటెద నని, పరపున శ్రీదాముఁ డెగిరిపడె ముప్పదిటన్సరివారలు ముప్పదిరా, యరయఁగ వేయనుచు గొల్లుమని నవ్వంగన్.
సిగఁజుట్టుకొన్న సంపఁగిమొగ్గతాయెతు చేరు చేరువ తేఁటిబారుఁ గదుమనొసపరిమొసలివాయొంట్లు జాళ్వాచెక్కు నిద్దంపుచెక్కుల నీడఁ జూడబిగియించి కట్టిన మొగిలువన్నియచేల చెఱగులు కటియందు జిందు ద్రొక్కవనమాలికవిశాలవక్షఃస్థలీశాలి బాలికాడోలికాకేళి దెలుప
దూరమున నిల్చి తొడదట్టి తోవవారిఁ, దొలఁగుమని దృష్టి చక్కఁగా నిలిపి పిడికిలించి కరములు గుదియించి ఠీవిఁ గునుకు, పరువునను దాఁటె బలుఁడు తొంబదియడుగులు.
ఒకట కుదయాద్రి కస్తాద్రి కొక్కపంగ, దాఁటజాలియు గిరుదుగా దాఁటి యోడెదానవుఁడు మీఁద గెలువఁగాఁ దలఁచి యాడె, గెలువ సులభంబె యోటమి గలుగుగాక.
ఎగిరి నల్బదినాల్గడుగులు దాఁటగ నొకం డళికింప దాఁటక నెలమి నొకఁడుదాఁటి నలివను ముందఱికి మ్రొగ్గె నొకండు మ్రొగ్గక యట మెరంబున నొకండుగుఱికివ్వ లడుగిడ గుఱిలోనఁ బడె నొక్కఁ డివ్వలవ్వల దాఁటె నెలమి నొకఁడుపరువిడుచో జాఱుచెఱగు ద్రొక్కె నొకండు లివగా దనుచు మరలిచనె నొకఁడు
నడుమఁ బిరివట్టి ఱొమ్ములఁబొడవుభుజము, పొడవు కుత్తుకపొడవును బూన్కి దప్పకుండ గుప్పించి రొండొరు లుద్దు లగుచు, గెలిచె హలి చేర్వ యవ్వలిబలము లోడె.
అంతం గృష్ణుఁడు గేరి నవ్వుచును బావా యింక నీ కేను మున్బంతంబుల్ పలుకంగ వంగుమని దర్పం బొప్ప శ్రీదాముపై
సంతోషం బలరంగ నెక్కి పదముల్ జాడించుచున్ వల్లెత్రాడెంతే గైకొని హా యటంచుఁ గదిమెన్ హేలావినోదంబునన్.
వేడుక గెలిచిన బాలకు, లోడిన బాలకుల నెక్కి యుల్లసములు పెక్కాడుచుఁ బఱవ బ్రలంబుఁడు, తోడనె బలుఁ డావహించి దులదుల నడిచెన్.
దిటము మీఱంగ భాండీరవటము దాఁక, నరిగి యందఱు మరలంగ మరల కసురబలునిఁ గొని సనె గుఱి దాఁటి భారమైన, యంతఁ దనరూపు గైకొనె నద్భుతముగ.
తగిలికాలినమోడు చిగిరించినటువలెఁ గఱకుజుంజుఱువెండ్రుకలు దనర్పనగ్నికుండము లంచు నక్షిగోళంబులు గములు గూడుక పతంగములు వ్రాలవివృతాస్యపాతాళవివరనిస్సరదచ్ఛదారుణాహులనాఁగ దంష్ట్ర లమరగగనంబునను వానకాళ్లు జాతినరీతి నురుతరదీర్ఘబాహువులు దనరఁ
గుంభతటమున సింగంపుఁగొదమ నుంచి, తను వెఱుంగక చనుమత్తదంతిలీలవరనిశాటవిపాటనబలుని బలుని, యంస మెక్కించుకొనిపోయె నసురవిభుఁడు.
అపు డాబలుఁడు నిశాచరు, కపటముఁ గని కృష్ణకృష్ణ గ్రక్కునఁ జెపుమాయిపు డేమి యుపమ వచ్చెన్, విపరీత మటన్న నగుచు వెన్నుం డనియెన్.
గగనాదిసృష్టి గల్గకముందు వెల్గొందు నిర్మలబ్రహ్మంబు నీవ కావెప్రభవించువెనక ప్రపంచస్వరూపమై నెగడు విరాణ్మూర్తి నీవ కావెజన్మాదిరహితుఁడై సత్త్వగుణంబు వహించునారాయణుం డీవ కావెవేయుఫణంబుల విశ్వంభర భరింప నిపుణుఁడౌ ఫణిరాజు నీవ కావె
యేను నీవయ కాదె నీ వేను గాదె, యవని రక్షింప నిరువుర మైతి మింతతలఁపు నిజమూర్తి మానుషత్వంబు నిలుపు, మఱువ నేటికి యన్న నీమహిమ లన్న.
కడువడి బలుఁడు నిజస్మృతి, బెడిదం బగుకడిమి దనుజుఁ బిడికిఁటఁ బొడవన్బొడబొడ నెత్తురు గ్రక్కుచుఁ, బడియెఁ బ్రలంబుండు గోపబాలురు సెలఁగన్.
అంత.
తొలుతన్ రాముఁడనై ఖరు, బొలియించితి నిటుల ననుచు భూజనములకుందెలిపెడుగతి బలరాముఁడు, పొలియించెన్ ఖరుని తాళముల నవని బడన్.
యివ్విధంబున ననేకబాలక్రీడాలోలుండును బ్రలంబధేనుకాసురవిఫాలుండునునగుచుం గామపాలుం డంత నృశంసుండగు కంసుండు జిఘాంసాక్రూరబుద్ధియైయక్రూరుచేత ధనుర్యాగావలోకనవ్యాజంబునఁ బిలిపించినఁ గొంచక కాంచనాంబరసహాయుండై మధురాపురంబున కరిగి.
తొగఱేనిలీల ముద్దులు గుల్కు నెమ్మేను వలుదకాటుకకొండవంటిరూపుఁబిడికిటి కడఁకువౌ బెగడు నెన్నడుమును బ్రేవులప్రోవైన పెద్దకడుపునట్టహాసంబున నడరెడు తెఱనోరుఁ దళుకుగోఱలపేరిదంతయుగమువెఱక పై గమకించువిక్రమక్రమమును మైయెఱుంగని మదోన్మత్తవృత్తి
దనర హరియును గరిని మార్కొనినకరణిఁ, గంససభలోన ముష్టికుఁ గఠినకులిశనఖముఖంబులఁ జీరి తన్మస్తదళన, గురుయశోమౌక్తికములఁ గైకొనియె బలుఁడు.
కృష్ణుచే గంసుఁ జంపించి యెలమి నుగ్ర, సేను తద్రాజ్యమున కభిషిక్తుఁ జేసితల్లులును దండ్రియును దాము మొల్లమి గని, యెల్లసంతోషములఁ జెంది యుల్లసిలఁగ.
అంతఁ గంసపత్నులును దనపుత్రికలు నగునస్తియుఁ బ్రాస్తియు నను నాస్తిమధ్యలుప్రోత్సాహంబు చేసిన నాహవబాహులేయబాహుబలుం డగుజరాసంధుండుపదునెనిమిదవమాఱు మాఱులేనికడిమి నిరునదిమూఁడక్షోహిణులం గూడి మధురాపురంబు సుట్టుకొనినం గలఁగఁ బాఱు యదువృష్ణిభోజాంధకవీరులం జూచిపురక్షోభంబు గాకుండ నేర్పున రాజసుతులతో జరాసుతుం బరాజితుం జేసెదనని మురాహితసహితుండై ఖరారిపురంబు నిర్గమించి దక్షిణాభిముఖుండై యనేకజనపదవనంబులు దాఁటి సహ్యనగంబున నసహ్యతేజోభిరాము భార్గవరాము దర్శించి తదీయకామధేనుపయఃపానపీనబలు లగుచు భార్గవోక్తదుర్గమార్గంబున ననర్గళప్రమోదంబునం జనిచని.
శ్రీమంతంబు శిరోగ్రధామసుషమాసింధూరితద్యోరమాసీమంతంబు వధూసమేతవిహరత్సిద్ధాదినానామరుత్సామంతంబు విలోకిదుష్కృతపయోజస్తోమహేమంతమౌగోమంతంబున కేఁగి యబ్బలుఁ డనుంగుందోడుతో నిట్లనున్.
కాంచనమయ మౌటఁ గనకాద్రి యనవచ్చుఁ గలితైకశృంగంబు గాదు గానిఖర్జూరమయ మౌటఁ గైలాస మనవచ్చుఁ బలలాశిచేఁ బెల్లగిలదు కానిహిమనిఛానం బౌట హిమశైల మనవచ్చుఁ బడుచుఁజూలని చెప్పఁబడదు గానికలితగంధం బౌట మలయం బనఁగవచ్చు జడమరుద్విహృతి చొప్పడదు గాని
యదిర యేగిరు లెనయింక నమరమిథున, మందహసనాతితుహినహేమంతదరికిహరివిలోకపలాయద భ్రాంబుపాయ్య, మర్త్యనామంతకరికి గోమంతగిరికి.
అని వర్ణించుచు నగ్గిరిం గలుగు నాయావింత లీక్షించుచున్ఘనతాపింఛమహావనీతమములోఁ గంజేక్షణుం బాసి యొంటిని దా నొక్కకదంబభూరుహముక్రీనీడన్ వసించెన్ బలుండనురాగంబున నట్టె యప్పు డుదయంబౌ చంద్రు నీక్షించుచున్.
అంతట నొక్కమందమలయానిల మెంతయుఁ జల్లనై శ్రమంబంతయు శాంతిగా మలయునప్పుడు మద్యము తావి రాఁగ విభ్రాంతమనస్కుఁడై హరి పిపాసఁగదంబమహీజకోటరాభ్యంతరసీమ నున్న సురఁబానము జేసెఁ బ్రమత్తచిత్తుఁడై.
అంత వారుణి కాంతియు నబ్జసదన, యనఁగ మువ్వురుపువ్వులబోం డ్లతనుభువనవిజయలక్ష్ములొ యన రూపవిభ్రమములు, హెచ్చి మచ్చిక హలిఁ జేరవచ్చి రపుడు.
మదిరారసముగబ్బు మాటలతబ్బిబ్బుఁ గొదమగుబ్బలయుబ్బు నిదురమబ్బుఁదొలఁగుపయ్యెదకప్పు దూసియాడెడుకొప్పు వెడవీడు నెఱికొప్పువిరులయొప్పుమొదటిలత్తుకఠీవి చెదరినకెమ్మోవి జాఱినచెంగావిచీరనీవికమ్మ నెమ్మేనిగ్గుకడకెడు బలుసిగ్గుఁ దడఁబాటు నడజగ్గుఁ దగ్గుమొగ్గు
వాలుఁగన్నులకెంపుపై వ్రాలుమంపు, నేలపాటిల నొక్కకెంగేలిమ్రొక్కుమురువు నెమ్మేనిబిగువుఁ గెమ్మోవినగవు, నలర నిట్లనె హాల మోహాలవాల.
వరుణునిపంపున వచ్చితి, వరు నిను వరియింపఁ గుముదవల్లభునివిభావరి యింపు మీఱి మదిలో, వరియించు క్రమంబు మెఱయ వరియింతు నినున్.
అనునంతఁ గాంతి శశిక, న్నను జక్కనివాఁడవౌట నాయకుఁగా నిన్ననుమతిఁ గోరితి న న్నీ, యనుమతి రతిఁ దేల్పుమని పటాంచల మలమన్.
ఆరామచిలుకలందగు, నారామలఁ గూడియున్న యారామునితోశ్రీరామ యనియెఁ గుచతట, హారామలకాంతి నగవునందుఁ జిగుర్పన్.
విన రామా యభిరామ వీరల దయన్ వీక్షించి గైకొన్నరీతిని నన్నుం గయికొమ్ము దెచ్చితిఁ బయోధిన్ నీలచేలంబులున్ఘనకోటీరము వజ్రకుండలము సింగారించుకొ మ్మన్న మన్నన వానిన్ గ్రహియించి యెచ్చినమతిన్ నారీమణిం జేకొనెన్.
బలితంపున్ వలిగుబ్బచన్ను లొరయం బైవ్రాలుబంగారపుంగళుకుంజెక్కిలి ముద్దుఁ బెట్టుకొను సింగారంపుఁ గెమ్మోవికెందలిరుందేనెలు గ్రోలు సోలు మొనపంటన్ నొక్కు సొక్కున్ ముదాకులయై తానరగంటఁ గాంతునుర మెక్కున్ హాల ప్రౌఢక్రియన్.
ఉదుటుచన్దోయి మేనొరయ దగ్గఱ నిల్చుఁ గౌఁగిలించిన ప్రేమఁ గౌఁగిలించుమోహంబు మీఱ నెమ్మొగము చెక్కిలిఁ జేర్చు ముద్దుఁగొన్నను వేడ్క ముద్దుగొనునుదావిచెంగావికెమ్మోవి మోవిని గూర్చుఁ గంటి చేసినఁ దమిఁగంటి సేయుబంధోచితంబుగాఁ బవళించుఁ బైకొని బడలినఁ బైకొని బడలజేయుఁ
జిలుగుఁబయ్యెదసురటిచే సేద దేర్చి, వేడ్క మీఱంగఁ గపురంబువిడె మొసంగురమణుఁ డిటు రమ్మనినఁ బునారతికి నొగ్గుఁ, గాంతి హరిమధ్య మధ్య శృంగారములను.
చన్నుఁగవ ముట్టనీయదు చిన్నిమోవి, యానఁ గానీదు నీవిఁ జెయ్యాడనీయదటులనయ్యును మిగులమోహంబు వెనిచె, వనజగేహిని ముగ్ధభావమున పతికి.
ఒకకొమ్మఁ గౌఁగిలించుక వెన్క మెలిగొన్నఁ గేల నిర్వుర గుబ్బక్రేవ లంటుఁజెలుల లోఁదొడఁబిఱుందుల గోరు లుంచుచు మురువుతో నొకతెకు ము ద్దొసంగుసకియలజఘననాభికలఁ జేయార్చుచు మొనపంట నొకతెకెమ్మోవి నొక్కుఁగేలిచే నొకతె సొక్కించి యిర్వుర నంగుళీరతంబునం గళల్ జాఱఁ జేయు
మధురగంధోత్తమాపానమత్తు లగుచుఁ, జిత్తమున నాన యెఱుఁగక మొత్తముగనుహత్తుకొనుబిత్తఱుల గూడి చిత్తజన్ము, జన్మసాఫల్యకరుఁడు ప్రసన్నవరుఁడు.
గంధగజేంద్రలీల యెసఁగంగ హలాయుధుఁ డానతాంగపుష్పంధయనీలవేణికటి చిక్క బొసంగఁగ నిల్చి ధేనుకాబంధధురీణుఁ డౌచు నిరుప్రక్కలఁ గాంతలయందు నొక్కసౌగంధికగంధి ముద్దుగొనుఁ గ్రమ్మఱ నొక్కతెగుబ్బ లంటుచున్.
అలసితి వంచుఁ బైకొనులతాంగి మిటారము సూచి నవ్వుచున్వలపునఁ దాళలేక యెదవ్రాలెడుబాలికఁ గౌఁగిలించుచున్జిలిబిలిచెక్కు ముద్దుఁగొను చేడియవాతెఱతేనె లానుచుంగళలు గరంచి యేలె హలి కాంతల మువ్వుర నొక్కనేర్పునన్.
కంతుకేళిక నీరీతిఁ గలసి మెలసి, యంత సురతాంతరంబున నలసిసొలసియలయికలు దీర్చి తెమ్మెర ల్పొలసిబలసి, చెలులు జెలువుఁడువేడ్కల వెలసిరొలసి.
అంతఁ గృష్ణుడు చనుదెంచి యాదవేంద్ర, యదె జరాసంధుఁ డరుదెంచె నఖిలరాజసైన్యములతోడ నంచు నాశైలశిఖర, మెక్కి కనుఁగొనుచుండి రయ్యిరువు రపుడు.
శరధి న్నిద్దురవోవు శ్రీహరి శిరస్సౌవర్ణకోటీరమున్విరసుండై కొనిపో విరోచనువడిన్ వెన్నాడి దైత్యఘ్నుఁడైగరుడుం డాత్మకఠోరతుండమున దేఁగా నప్డు శ్రీకృష్ణశేఖరభాగంబున వ్రాలెఁ దన్మకుట మర్కచ్ఛాయ నందంబుగన్.
హలికి మకుటము మణికుం, డలమేచకనిచయచయము నందసుతునకుంగలితసువర్ణకిరీటము, గలిగెన్ గిరి నిటు లయత్నగౌరవసిద్ధిన్.
నగరంబు వెలువడివచ్చిన యది మొదలుఁ గరంబు చలంబునం బ్రలంబారి యెందుఁబాఱిపోయెదు నాబారింబడితి వింక బాగిలించక యింగిలించిన విడుతునేయనుచుం బారీంద్రంబు వెంబడిం బడు గంధసింధురంబు తెఱంగున జరాసంధవసుంధరావరాజరాధిరాజన్యుండు కంటకంబు లాడుచు వెంటంబడి యగ్గట్టుచుట్టుముట్టి నేలమట్టంబుగాఁ గొట్టుచు నని బెట్టి దంపు కట్టల్కవుట్ట నక్కట్టిడిదిట్టయై నెట్టుకొని మద్రకళింగచేకితానబాహ్లికకాశ్మీరగోనర్దకరూశకింపురుషమాళవభూపాలురఁ బర్వతాపరభాగంబునందు దుర్యోధనదుశ్శాసనకర్ణవైదర్భభోజాధిపరుక్మిద్రుపదవిందానువిందదంతవక్త్రశతధన్వవిదూరదభూరిశ్రవత్రిగర్తాదు లుత్తరపార్శ్వంబున నులూకకైతవేయైకలవదృఢాక్షక్షత్రధర్మజయద్రథోత్తమోజసాల్వకౌరవేయులు పూర్వభాగంబునఁ దరదచేదిరాజసహితుండై దక్షిణభాగంబున విడిసి దుర్గంబులు లగ్గలుపట్టు నగ్గలిక వెగ్గలంబు గటంకంబులు గిరివిటంకంబులు భుజాటంకములఁ బొంకంబులుగా భేదించియు గదాదండంబు వేదండోపమగండంబులఁ దుండించియుఁ బరిఘల వ్రేసియుఁ బట్టసంబుల గ్రు
చ్చియు ఖనిత్రంబుల గ్రొచ్చియు నుద్దవిడి నుద్దామకుద్దాలంబులం ద్రవ్వియునగ్గుంటి గంటి సేయంజాలక మందరవసుంధరాధరోత్పాటనపరాయణులై నిరాకృతులగు సురాసురులచందంబునఁ బరానీకినీనిరాకరణప్రవీణపరాక్రమవిరాజితధరాదిరాజన్యులు దురాపంబిద్ధరాధరంబని పరాక్రాంతులైన సురాళించి జరాసంధుండు గరాలంబితకరాళశరాసనవరాముక్తకరాళశరాసారంబున ధరాగ్రంబుఁ గప్పియుం బురాణపురుషులగు ఖరాహితమురాభిరాతుల బరాభూతులం జేయఁజాలక దురాలోచనంబు చేసిన.
సరసాధృచ్చిఖరానుజస్వకదిదక్షాకోపభూపాగ్రణీపరితఃప్రజ్వలితానలోజ్జ్వలశిఖాపర్యాకులత్ఖడ్గకాసరమత్తేభవరాహసింహచమరీశార్దూలముఖ్యాటవీచరదుర్వారభయారవాకులితమౌ శైలంబు వీక్షించుచున్.
గోమంతంబున కీయవస్థ మనలం గూడం గదా కల్గె నాహా మేలే యిటువంటిదుర్యశము బాహాశక్తి మీఱన్ నృపగ్రామంబుల్ మడియింపలేమొ యని శృంగం బద్రిశృంగస్థమైయామత్తద్విపకోటిలో దుముకుచాయం గుప్పునన్ సేనలోన్.
దుమికిన హలితో దుమికెం, గమలాక్షుఁడు ముసలనందకప్రముఖములౌవిమలాయుధములుఁ దోడనె, సమకూడెన్ మింటనుండి జను లరుదందన్.
ఈరీతి శౌరి సీరియు, ఘోరాయుధపాణు లగుచుఁ గ్రూరారిచమూవారణహయదారుణరథ, వారణలీలాపరానివారణభంగిన్.
చరియించుచు బలుఁ డుద్ధతిఁ, గరముసలముచేత సమరకరులన్ ఖరులంబరులం గరులన్ హరులం, బొరలంగాఁ జేసెఁ గదనభూభాగమునన్.
దరదుఁడను ధరణిరమణ, ద్విరదుని ముసలమునఁ గూల్చె విబుధారి చమూదరదుఁడు సంస్మితనవకుం, దరదుఁడు హలధారి దేవతలు మే లనఁగన్.
అంత జరాసంధుఁడు దు, ర్తాంతగదాదండతుండదారుణమదమౌదంతావళంబుఠేవం, బంతంబునఁ గదిసి కామపాలుని బలికెన్.
హలముం గైకొని దున్నగావలయుఁగా కాయోధనక్రీడకుంబొలయన్ శక్తుఁడవే హలాయుధ రణంబున్ మాని మాభూమిలోవలఁబా లెక్కుడు దున్నర మ్మటకు గోపాలుండవై తేని సంబళమిత్తుం బసిఁగావు కావు ప్రతిభూపాలుండ వీ వాజికిన్.
హలమున వచ్చుధాన్యముల కప్పటికప్పుడు దంచుకోఁగ రోఁకలిఁ గయికొంటి వౌర యిటు గామిని గూలికి ధాన్య మెద్ది పల్లెలఁ బసి గాచుచున్నఁ బనిలే దిఁకఁ జక్రము శూర్పధారిగావలయును నీదుసోదరుఁడు వారిజనాభుఁడు రోహిణీసుతా.
అనిన మాగధునకు హలాయుధుం డిట్లనియె.
క్షితినాథత్వము లేదుగావునఁ బరక్షేత్రంబులం దున్ని లోహితధారం బదనిచ్చి రాజమకుటీహీరావళీబీజసంతతులం జల్లితిఁ గీర్తిసస్యములకై తద్వేళ యుష్మద్ద్రుశాకృతిపుల్ మొల్వఁగఁ గల్పుతీయుటకు నే నేతెంచితిన్ మాగధా.
మాగధాధమ బహుధాన్యమర్దనమున, కేను రోఁకలి గైకొంటి నిది నిజంబెయింక మీలోన గట్టిపొ ల్లేరుపఱిచి, చెరఁగఁ జక్రంబె చాలదే శ్రీహరికిని.
రారా మాగధ మానరా మదము క్షాత్రం బేదిరా నీకుఁ గైవారంబుల్ సవరింపరా నృపసభన్ వారింపరా నీచమూవారంబు ల్బురిసేర ఘోరతరదుర్వారుండరా నేను గర్వారంభంబులు వీడరా యన మదేర్ష్యామర్షదుర్ధర్షుఁ డై.
అటు నిటుఁ బొంచి పొంచి మగధాధిపుఁ డొయ్యన నేటవాలుగాఁదటుకున వ్రేసె వేటు దను దాఁకఁగనీయక తట్టివైచి యక్కుటిలునురంబు వైచె యదుకుంజరుఁ డందునఁ గొంతనొచ్చి యప్పటుబలశాలి సందుగొని పార్శ్వము వేసెఁ దటానఁ దప్పఁగన్.
ఇవ్విధంబున మాగధహలాయుధులు గదారణప్రవీణులై పెక్కువిన్నాణంబులంబోరునెడ డస్సిన మాగధు వధింప నుద్యోగింప మాగధవైరి వేఱెయున్నాఁడునీవు ప్రయాసపడవలవ దనినుడువు నాకాశవాణిపలుకుల కులికిపడు జరాసంధుం బ్రథమసంగరంబున దశకంధరు దయదలంచిన సింధుబంధనుం డగు రఘురాముచందంబునఁ గృపాభిరాముండై బలరాముండు వెఱవక పురంబున కరుగుమని జరాసంధుం బంచి యన్యరాజన్యులం బరాజితులం జేసి విజయలక్ష్మీవిరాజితుండై విజయసఖసమన్వితంబుగా ద్వారకాపురమున కరిగి సుఖంబుండె నంత.
ఎలవంకన్ వలవంకఁ జక్రధరుఁడున్ వృష్ణ్యాదులౌ బాంధవుల్నలువంకన్ మడిఁజంక చేతులిడి నానాభూపతు ల్గొల్వఁగాఁదలపంకం నెలవంకఁ గల్గు దొరచందానన్ బ్రభావాఢ్యుఁడైకొలువయ్యెన్ నలువై హలాయుధుఁడు దళ్కుం గొల్వు కూటంబునన్.
అప్పు డొకద్వారపాలకుఁ డరుగుదెంచి, స్వామి విన్నపమొకటి యెవ్వాడొ కానిపుడమి జనులకు ముమ్మడిపొడవువాఁడు, నివ్వెఱఁగుతోడ వాకిట నిలిచినాఁడు.
దనుజుఁడు గాఁడు నృపాలక, ఘనలక్షణలక్షితుండు గాఁ డమరుండుంగనుఱెప్పపాటు గలఁ దా, తనిఁ గని జను లదరిపాఱెదరు పురిలోనన్.
అదియునుగాక యొక్కధవళాంబుజలోచన వెంటవచ్చి యున్నది భువనైకమోహనమహాద్భుతరూపము కల్మి నిందిరా
సుదతియుఁ దప్ప దీధరణిఁ జూడము తాదృశరూపలక్ష్మి యాత్రిదివములోన నైనఁ గలదే యిఁక దేవరచిత్తమం చనన్.
ఎవ్వఁడొకో యని మదిలో, నివ్వటిలన్ సంశయంబు నృపవరులన్నంగవ్వడిచెలికాఁ డనియెన్, నవ్వచుఁగృతపురుషుఁ డౌట నాకుం దోఁచెన్.
ఎవ్వఁ డైన నేమి యిటకు రావలె నన్న, దోడి తెమ్మటన్న వాఁడు వోయితోడి తేర నతఁడు దుస్సహతనుదీప్తి, హెచ్చఁ గొలువు సేర వచ్చుటయును.
ప్రత్యుద్యుతుఁడై యతనిం, బ్రత్యేకవరాసనంబుపై నిడి యర్చ్యాకృత్యములు దీర్చి హలధరుఁ, డత్యుత్తమప్రీతివినతుఁడై యి ట్లనియెన్.
వింటిరె మిమ్ముఁ జూచినను విస్మయ మయ్యెడు నాకు నన్నఁ గన్గొంటి మహాద్భుతంబు సమకూరెడు మీకునుఁ గాలభేద మీరెంటికి హేతు వింక వివరించెద నా కథ విన్ము నాకభిత్కంటకలుంఠనప్రవణకారణజన్మఫలా హలాయుధా.
ధర్మంబు నాల్గుపాదంబులఁ జరియించు నేయుగంబునఁ గుం టొకింత లేకతోడ మాటాడుచుందురు బంధువులఁబోలి మేయుగంబున నాకనాయకులునుదనసాత్త్వికము దోఁప ధవళాంగుఁడై మించు నేయుగంబునను లక్ష్మీశ్వరుండునేవిఘ్నములు లేక యెల్లవాంఛితములు నేయుగంబున ఫలియించుచుండు
నట్టికృతయుగమున కీర్తిహారి యగుచుఁ, బ్రబలు నానర్తమేదినీభర్తసుతుఁడబేరు రైవతుఁ డండ్రు నాయూరు లవణ, జలధిలోపల దగుఁ గుశస్థలి యనంగ.
అనఁ గృష్ణుఁడు రైవతకా, ఖ్యనగర మదె నీదుపేరఁ గావించినదేయలసర్వజ్ఞుఁడ వీ వెఱుఁ, గనిది గలదె యటుల నౌను గంజదళాక్షా.
అది యుండె వినుము నాకథ, హృదయాంబుజమధ్యమునను శ్రీహరిమధ్యంబదిలముగ నిల్పి సలిపితిఁ, బదివేలేఁడులు మహాతపం బతినిష్ఠన్.
అంత నైదేండ్లబాలిక యైపయోధి, కన్నె నాతోడనున్న రాకన్నె యనుచుబ్రేమ ముద్దాడుచుండితి రామ నాఁటి, యద్భుతప్రేమ యింతంత యనఁగరాదు.
కడపట మఱేమి యిటువంటికన్నె గలుగ, వలయునంచును నాతపఃఫలము గాఁగనడిగితిని వెన్కఁ బ్రత్యక్షమైన లక్ష్మి, నటుల దయజేసె నాయమ హర్ష మొదవ.
తనయుల నూఱ్వురఁ గంటిం, దనుసంభవ యొకతె లేమిఁ దటినీపరిణీతనయన్ వేఁడితిఁ దనయం, దనియన్ లేకున్నఁ గోటితనయులనైనన్.
ఆఁడుపడుచా యటంచు నత్యల్పముగను, మది నెఱుంగక కొంద ఱాడుదురు గానికన్య సామాన్యమే పుత్త్రుఁ గాంచెనేని, నుభయకులములఁ దరియింపనోపుఁ గాదె.
అది విని చెలంగె మత్సతి యటులుఁ గాదె, యల్లుఁడని యాఁడుబిడ్డని యగవు తగవులంపకము శుభశోభనమని యివెల్ల, సంతసముఁ జేయుఁ గన్యకాజనములకును.
కొన్నాళ్లకు గర్భిణియై, కన్నియఁ గనె మద్వితీయకరములు మొగుపంగన్నజనుల్ శశిరేఖం, గన్నట్టిద్వితీయపోలెఁ గళఁ జెలువొందన్.
చూచువారెల్ల నమ్మక్క చుక్కరీతి, జొక్కమైయున్న దీకన్య చక్కఁదనమునిక్క మెక్కడ లేదని చొక్కి పడఁగ, రేవతీనామ మిడితిఁ బుత్త్రికి మహాత్మా.
ఏఁటఁ బెంచుదానిఁ బూటఁ బెంచెనటంచు, జనులు పల్కుపలుకు సత్యముగనుగన్నతల్లి మిగుల గారాబమునఁ బెంపఁ, బెరిఁగెఁ జైత్రలతిక పెంపు మీఱ.
అచ్చనగండ్లు దోయాలును డాఁగిలిమూఁతలు నాలుగుమూలలాటగుజగుజరేకులు గుజ్జనగూళ్లును బొమ్మలపెండ్లిండ్లు నమ్మనములునత్తగోడలియాఁట నాలుమగనియాట తాటిచెట్టాట కోలాటములునుబింపిళ్లుఁ జెండుగోరింపులు వామనగుంతలు వెన్నెలకుప్పలాది
మఱియుఁ బుడికిళ్లు మొదలుగా మనసు వచ్చు, నాటలన్నియుఁ దోడి తొయ్యలులఁ గూడిపడుచుఁదనమున వేడుకపడుచు నాడు, ముద్దరాండ్రకు నల్లారుముద్దుగాను.
అయ్యయయ్య యటంచు నెయ్యంబు మీఱఁగాఁ బలుమాఱు పైపక్కఁ బడకయుంటఁజెల్లె బొమ్మలపెండ్లి చేసె దిం దేటికిఁ జేయవైతివె యన్న సిగ్గుపడుటదాదులమనవి యత్నమున నాతోఁ దెల్ప నరుదెంచితివి యన్న మఱలిచనుటయమ్మ యెవ్వరిఁ బెండ్లి యాడెదవేయన్న ముసిముసినగవుతో మసలుటయును
గరగరిక గాఁగనుమనోమఁ గలుగుటయును, బ్రేమ మీఱంగ వన్నెలు పెట్టుటయునుగురులు గొప్పునఁ గూడెడు కొమరువయసుఁ, దెలిపె నానాఁటఁ గన్యకాతిలకమునకు.
ఇవ్విధంబునఁ గన్యకారత్నంబునకు మెఱుఁగుసానయుం బోలి యనన్యాదృశహావభావం బగుయౌవనప్రాదుర్భావం బగుటయు స్వయంవరంబు చాటించిన.
సప్తద్వీపమహీపశేఖరసుతు ల్సౌందర్యరేఖాన్వితుల్సప్తార్చిప్రతిమానతేజులు బిడౌజస్ఫర్ధిసంపద్భుజుల్సప్తాశ్వక్షణదాకరాన్వయభవు ల్శౌర్యక్రియాశాంభవుల్సప్తాంభోధిమణీవిభూషణధరుల్ చన్దెంతు రశ్రాంతమున్.
చంద్రానన యిందొకరా, జేంద్రకుమారునిని గోర దింతియ కాదాయింద్రుని మెచ్చదు మఱి యా, చంద్రుని మెచ్చదు విలాససంపదకలిమిన్.
ఓయిగురాకుఁబోఁడి కనవో వినవో యిది యేమి చెల్ల నీప్రాయపుతోయజాక్షు లెడఁబాయ రొకప్పుడు ప్రాణనాథులంబ్రాయము రిత్తవుత్తురటె పల్కవె నీమది నున్న యట్టియానాయకుఁ దెల్పవే త్రిదశనాయకుఁ గోరినఁ దెచ్చి కూర్చెదన్.
అని కన్నతల్లి వేఁడినఁ, జనవున నే వేఁడికొనిన సకు లడిగిన వీఁడని వ్రీడ నొడువకున్నం, దనయకుఁ బతి నిశ్చయించుతలఁపు జనించెన్.
సన్న్యాసంబునఁ గాని మర్త్యులకు గాంచన్ రాక త్రైలోక్యమూర్ధన్యంబై తగు బ్రహ్మలోకమున కేతన్మర్త్యదేహంబుతోఁగన్యారత్నముతోడ నేఁగి భవనాగ్రక్షోణి సంప్రాప్తసౌజన్యుండై మను ద్వారపాలకుఁడు వంచం బోవుచోఁ గొల్వునన్.
మిళితగభీరమర్దళధిమింధిమినాదముఁ గిన్నరాంగనాకులకలతానమానములు ఘుమ్మని వీనుల విందు సేయ సంకులసురసిద్ధసాధ్యమునికుంజరముఖ్యులఁ ద్రోచికొందు లోపలి కటువోయి సందడిని బాలిక యెంతయుఁ దత్తఱింపఁగన్.
ఒకయోర నిలిచి దివిష, న్ముకురాస్యల మంజులాస్యములఁ జూచుచుఁ గొండొకదడ వుండితి నానృ, త్యకళావైభవము లెన్నఁ దరమే మనకున్.
ఎక్కడఁ జూచెనో యప్పుడె, వాక్కాంతుఁడు సూచి పిలువ వడిఁ జని భక్తిన్మ్రొక్కి నిలుచున్నఁ గన్నియ, నిక్కడి కేమిటికి దెచ్చి తీవని యడుగన్.
ఈయారాజు లటంచుఁ గొందఱికిఁ బేరేర్పాటు గావించి ధాతా యిందేనృపమాళి కిత్తుఁ దనుజాతన్ దెల్పుమా కన్యకుంబ్రేయుం డెవ్వఁ డటన్న నవ్వుచు వచోబింబాధరావల్లభుండేయేరాజులు నీవు దెల్పితివొ వారెవ్వారు లే రుర్వరన్.
నీవు వచ్చినవెనుక క్షోణితలమున, కృతయుగం బాది యిరువదియేడుమాఱ్లుదిరిగె నాలుగుయుగములు దెలియవింత, వింత గాదిది యిది యొకవింత వినుము.
మును వరమిచ్చుటం గలిమిముద్దియ ముద్దులకూఁతు రయ్యె గావునఁ బెఱవారి నేగతి ధవుండుగఁ గోరు మురారి సీరియైతనరెడు ద్వాపరంబునను ద్వారకలో హరి కిమ్ము పొమ్ము చయ్యన నన వారిజాసనుని యంఘ్రులకున్ నతి చేసి గ్రక్కునన్.
సత్యలోకంబు వెడలి తపోలోకంబు దాఁటి జనర్లోకంబు నిర్గమించి మహర్లోకంబుగమించి నాకలోకసౌభాగ్యంబులు గనుంగొనుచు భువర్లోకంబు డిగ్గి.
తమతమనిత్యకర్మములు గావించుచు నధిపులఁ గొల్చు బ్రాహ్మణులఁ జూచిదాయాదిపాళ్లకై తమలోపలనె పోరు నన్నదమ్ముల కలహంబుఁ జూచిపరులకుఁ గలుగు సంపదలు జూడఁగలేక మతి నీర్ష్య నొందు దుర్మతులఁ జూచిపతుల నొల్లక యన్యసతులఁ గోరెడివారిఁ జేరఁగోరెడు కులసతులఁ జూచి
హ్రస్వదేహుల బధిరుల నంధకులను, రోగపీడితులను దరిద్రులను లోభవంతులను దుఃఖశీలుర వింత గాఁగ, ధరణి జూచుచు మిగుల ఖేదంబు పొడమి.
వెనుకకాళ్లనె దాఁటులు వ్రేయు పాండు, వృషభ మీక్షించి ముందటిరెండుపదములెవ్వి యన నొప్పి పట్టిన దిందులోనఁ, గుడిపదంబని యతివల జడిసి యేను.
వచ్చితి నీద్వారావతి, కిచ్చటఁ గృతయుగముఁ బోలె నింపైనది నీవచ్యుతుఁ డవుటం గన్నియఁ, బుచ్చుకొనుము తపము సేయఁ బోయెద నింకన్.
అని సుత నొప్పగించిన హలాయుధుఁ డెంతయుఁ బ్రేమ మీఱఁ దద్వనితగళంబుపై హలము వైచి యొకించుక వంచునంతలోమునుపొడవైన యమ్ముదిత ముద్దుగ వల్లభు నంతమాత్రయైతనరె విలాససంపదలు తద్దయు మించె విచిత్రవైఖరిన్.
జలజాక్షినగుమోముచంద్రుఁడు శారదపూర్ణిమాశశిఁ బోలె పొలుపు గాంచెముద్దియకమ్మకెమ్మావిమాణిక్యంబు సానదీరినరీతిఁ జాయలూనెఁబద్మాక్షివలిగుబ్బబంగారుకుండలు మెఱుఁగుఁబెట్టినఠీవి మెఱుఁగుసూపెనంగనామణిమోహనాంగహేమశలాక పటిక నార్చినరీతి బాగుమీఱె
మఱియు వాసంతవేళఁ గ్రొమ్మావిలీలఁ, దొలకరిని మించు కేతకీదళము పోల్కివింతచెలువున రేవతీకాంత వెలసె, హలధరుని యోగమాయామహత్త్వమునను.
అంత గర్గాదిపురోహితు లారేయి వివాహశుభముహూర్తం బున్నదని విన్నవించిన నెంతయు సంతసంబున యాదవసార్వభౌముండు పురంబు గైసేయించిన.
రాజబింబాననల్ రాజవీథులఁ జల్లు మలయజోదకముల జలకమాడిమేలిమి మీఱంగ మేలుకట్టులు గట్టు రమణీయచీనాంబరములు గట్టికేవలరమ్యమౌక్తికరంగవల్లికాతారహారంబులు దనరఁ బూనికమనీయవిపణికాఘుమఘుమాయతబహుపరిమళంబులు మేన హరువు పఱిచి
మానితవితానకుసుమదామములు దాల్చి, ప్రతిగృహద్వారరత్నదర్పణములందుగాంచుచున్నెడ నాద్వారకాపురంబు, లక్ష్మి యొప్పెఁ జతుర్విధాలంకృతులను.
అంతట బలభద్రుండును మంగళతూర్యఘోషంబులు మొరయ నభ్యంగనస్నాతుండును జతుర్విధాలంకారసమేతుఁడును నై సమావర్తనాదివైవాహికశుభకృత్యంబులు నిర్వర్తించి కల్యాణవేదికాంతరంబున నున్నయెడ.
శిరసు మజ్జనమయి నెఱిగొప్ప సవరించి యరవిరివిరవాదిసరులు దుఱిమివలిపెచెంగావిపావడ నిగ్గు లీనంగ జాళువాసరిగంచుచేలఁ గట్టితిలకంబు దీర్చి చెక్కుల జవాది యలంది గుబ్బచన్దోయిఁ గుంకుమముఁ బూసికట్టాణిముత్యాలకమ్మలు మొదలుగా నవరత్నమయభూషణములు దాల్చి
నిలువుటద్దంబులోపల నీడఁ జూచి, వ్రీడఁ జెలి యిచ్చుకపురంపువీడియంపుఁగెంపు కెమ్మోవి కొకవింత సొంపునింప, రేవతీకాంత యభినవశ్రీఁ జెలంగె.
రేవతీకాంతఁ దోఁ దెచ్చి రైవతాఖ్య, భూమిపాలుఁడు మధుపర్కపూర్వముగనురామునకు ధారవోసిన రామకేలు, పట్టె బలరాముఁ డెంతయుఁ బ్రమదమునను.
అప్పుడు పువ్వులవానలు, దెప్పలుగాఁ గురిసె మ్రోఁగె దివిదుందుభులున్ముప్పిరిగొనుమోదంబున, నొప్పిరి జనులెల్ల నమ్మహోత్సవవేళన్.
ఇవ్విధంబున సకలసంభ్రమంబులు గలిగి వెలయు రేవతీబలరాములవివాహమహోత్సవంబు కన్నులపండువుగాఁ జూచి వైవాహికదినచతుష్టయానంతరంబున రామకృష్ణానుజ్ఞాతుండై రైవతకమహీపతి బదరికాశ్రమంబునకుం దపంబుసేయం జనియె నంత.
కళుకుమ్ముత్యపుగచ్చుసౌధముల సింగారంపుఁబూఁదోఁటలన్జలధిప్రాంతరకాంతసైకతములన్ సౌవర్ణగేహంబులన్నెలఱాతిన్నెలఁ దూగుటుయ్యలల మాణిక్యంపుసౌధంబులన్బలుఁ డారేవతిఁ గూడి క్రీడ సలిపెన్ భావంబు రంజిల్లఁగన్.
అది వింత యిది వింత యని రిత్తచూపుచు సొలపుఁజూపుల సారె జూడ నేర్పెఁజెలిమితోఁ బయ్యెదచెఱఁగు దెమల్పుచు విడుమంచు నొయ్యన నుడవ నేర్పెనరవింద మందు కొమ్మని కేలు పొడవెత్తి వలిగుబ్బ లురమున నలమ నేర్పెనధరబింబముఁ జురుక్కన నొక్కి కన్కతో మినుకుఁజెక్కిలి గోట మీట నేర్పె
సొంపు మీఱఁగఁ గళలంటి సొక్క నేర్పెఁ, గూడి రతికేళి వేడ్క నోలాడనేర్పెఁగూర్మిఁ గొసరుచు నంతఁ బైకొనఁగ నేర్పె, నెఱతనంబున రమణుఁ డన్నియును సతికి.
కతిపయదినములలోపలఁ, జతురతఁ బ్రౌఢత్వమొంది జవ్వని యొకనాఁడతిముదమున రైవతక, క్షితిధరమున మెలఁగుచుండి చెలువున కనియెన్.
మును పిందుఁ గదళికావనరాజి చెలువొందుఁ బందిటిద్రాక్షలఁ బ్రబలె నిప్పుడీకానలోపల నేఁ గాన నీకాన నెంతగా బలిసెఁ బ్రాణేశ కంటెయమృతోపమానంబు లాదొనయంబువు లనిశంబు మాతండ్రి కదియ ప్రియముపొలుపొందె గొజ్జంగిపూఁదేకాలువ నీవు దీర్పించితో నిన్న నేఁడు
మొన్నఁ జూచిన యటువలె నున్న డపుడె, యింతలోపలెనే యెంత వింత పుట్టెననుచుఁ బలుకంగ బెడబెడలై నగంబు, గదల రేవతి ప్రాణేశుఁ గౌఁగిలించె.
వెఱవకు మంచుఁ దేర్చి యదువీరుఁడు నల్గడఁ జూడగట్టురాపఱగట నిల్చి యన్నగము బాహులఁ నూపుచు మంచుగట్టునామెఱయు కపీంద్రుఁ జూచి తరమే ధర మెత్తఁగ నెవ్వఁ డీవురాయెఱుఁగవె రామ నన్ వనచరేశ్వరుఁడన్ ద్వివిదుండ శూరుఁడన్.
తరమే పెకలింపఁగ నీ, గిరి యంటివి మునుపు జానకీపతి పనుపన్శరనిధి గట్టఁగఁ దెచ్చిన, గిరులశిఖర మాత్ర మింతగిరియే యిదియున్.
నాసఖుఁడగు నరకాసురు, శాసించెను శౌరి గాన శైలముతో నిన్నాసంద్రంబున వైచి ము, రాసురరిపుతోడ ముంతు నట ద్వారకయున్.
అని మాటలాడుచునె యా, ఘనశైలం బగలఁజేయఁ గని హరి కినుకంతనముసలంబున వ్రేసిన, వనచరపతి శిరము వగిలి వసుమతిఁ గూలెన్.
ఇవ్విధంబున ద్వివిదు వధియించి యెప్పటిలీల బాలికామణింగూడి కేళినీరమణికేళికాలోలుండై విహరించుచు హాలామనోహరుఁ డొకనాఁడు పూర్వానుభూతగోపికలం దలంచి కృష్ణానుమతంబున నందవ్రజంబున కొక్కరుండ చనినందనప్రతినందనాలింగనమృదుభాషణంబుల నందయశోదాశ్రీదామోపనందాదిబంధువులకు సంతసంబు సేయుచు జరాసంధాదిపలాయనంబు నొడువుచుఁబ్రొద్దు గడుపుచున్నయెడ.
మధుమదాకులహలాయుధవిలోచనలీల నరుణుఁడై యరుణుఁ డస్తాద్రిఁ జేరెవరుణుండు వారుణీవరున కీవచ్చుచెంగావినా సాంధ్యరాగంబు మెఱసెహలిహలాకృష్టయై యమున యీగతి నుండు ననురీతి నిండె గాఢాంధకారమాతమోయమునపై నలరారు దెలికల్వవిరులునాఁ జుక్కలు విరివికొనియెఁ
గలితనీలాంబరుండునుఁ గామపాలుఁ, డమలవర్ణుండు రేవతీరమణుఁ డగుటరాముపోలిక లోకాభిరాముఁ డగుచు,సోముఁ డుదయించె సురసార్వభౌమదిశను.
పాంథజనములు గొమ్మలప్రాపుఁ గోర, సొరిది నొండొంటి లతకూన లొరఁగిపడఁగధరణిచక్రంబు మిగుల సంతాప మంద, నడరె రేయెండ లప్పు డత్యద్భుతముగ.
అట్టిపండువెన్నెల నయ్యేకకుండలుండు గోపికాపుండరీకనయనల సంకేతంబులఁగూడుక యమునాతీరంబునకుం జని.
కలికి యీపొదరింటఁ గాదె నీ వూరకె కినిసి నాచేత మ్రొక్కించుకొనుటతెరవ యీద్రాక్షపందిటఁ గాదె నడికిరే యనివచ్చి నీవు న న్నేలికొనుటమెలఁత యీగుజ్జుమామిడినీడఁ గాదె చిల్కలు పల్కఁ జెలులంచు నులికిపడుటవనిత యీకదళికావనిఁ గాదె దళవీజనముచే రతాంతరశ్రమ ముడుపుట
దలఁచుకొందువె యీసైకతమునఁ గాదె, నానఁ బైకొనకున్న నోచాన మంచిదత్తతోఁ జెప్పి కొట్టింతు ననిన జడిసి, నీవు నాకోర్కి దీర్చుట నీలవేణి.
అని యిష్టాలాపంబుల, వనిఁ దిరుగుచు మద్యపానవాంఛ జనింపన్వనితామణులుం దానును, గొనియెన్ మదిరారసంబు గుత్తుకమోవన్.
అలవోక ఱెప్పవేయక చూచుచును తెల్పె భామయోర్తు సురానుభావపటిమఁగాంతు నేరము ద్రోచి కౌఁగిలించుచుఁ దెల్పె నాతియొక్కతె ప్రసన్నాతిశయముఁదలయూఁచి చొక్కుచుఁ దలపించె నొకపంకజానన గంధోత్తమానుభవముపరిహాసబహుళోక్తి ప్రకటించె నట నొక్కకంబుకంఠి యిరాతికౌకలంబు
హసనకుసుమంబు లందంద నెసఁగఁ జేసి, వనిత యొక్కతె మధువైభవంబు సూపెఁగన్నుఁగవయందు సాంధ్యరాగంబు మొనయఁ, గాంతయొక్కతె వారుణిగరిమ నెఱపె.
తళుకుంగుబ్బల పైఁట వేయు మని కాంతల్ దూఱ హాలామదాకులితస్వాంత యొకర్తు వేగజిలుగుంగుచ్చెళ్లకొం గెత్తి గు
బ్బలపైఁ గప్పిన బైలు దెల్పు జఘనవ్రాతంబు వీక్షించి యోచెలువా సిగ్గరి వౌదువంచు నగియెం జిత్తేశ్వరుం డింపునన్.
కొదమగుబ్బలతావి కుంకుమముపూఁత, విభుఁడు చెంగావిఱవికంచు విడువఁబోవఁగొసరుఁజూపులఁ దప్పించుకొనుచు నొక్క, కలికి వెన్నెలఁ బైఁటగాఁ గప్పుకొనియె.
ఓయత్త చిలికితి నూరకె నన్నేల కొట్టెద వని యొడ్డుకొనియె నొకతెమగఁడు వచ్చెనటంచు మచ్చికఁ గట్టుకొం గెడలించి తమిఁ బడుకిచ్చె నొకతెయొకసురాఘటి నెత్తి నుంచి చల్లో చల్ల యంచును వనవీథి కరిగె నొకతెయెలనాఁగ బలరాముఁ డేల రాఁడాయెనే యని సారెముచ్చట లాడు నొకతె
తోడికోడ లటంచును దోడి చెలిని, దబ్బఱలె తిట్టె నొక్కతె దానిఁ దనదుకోడలంచును జెక్కిలి గొట్టె నొకతె, మదిర సొక్కున గోపికామానవతులు.
మదిరాపానవిఘూర్ణమాననయనున్ మత్తద్విరేఫాలకున్వదనాంభోరుహగంధలుబ్ధమధుపవ్యాఘాతలోలద్భుజాంగదుఁ గర్ణోజ్జ్వలవజ్రకుండలు వలగ్నప్రస్థనీలాంబరున్మదథామున్ బలరాముఁ జూచి వ్రజభామారత్నము ల్వేడుకన్.
తళుకుం జెక్కిలిముద్దుకెంపుజిగినిద్దాకమ్మకెమ్మోవితేనెలు నాలింగన మంగనాజనము లెంతేవేడ్కతో నొండొరుల్పలుమాఱుం దగ మార్చికొంచు సుఖయింపన్ వారితోఁ గూడి యాబలభద్రుండును క్రీడ సల్పుచు ననల్పంబైన దర్పంబునన్.
వారివిహారముం జలుప వాంఛ జనించెను జేరరాఁగదేవారిజమిత్రపుత్త్రి యని వాకొని పిల్చిన ఫేనహాసముల్మీఱఁగ నెంతలేదనుచు మించి చనన్ యమునాస్రవంతికన్నారఁగఁజూచి యల్కను హలాగ్రమునం బెకలించె నత్తటిన్.
ఇవ్విధంబున గోధుగ్వధూసవిధంబున నేధమానసమధికక్రోధధనంజయక్వథితనయనపథుం డగుచు హలాయుధుండు నిర్ణిరోధపాథఃప్రవాహధామనిధితనూభవారోధంబు విశ్లథంబు గావించి శతథా ప్రవహింపంజేయు సమయంబున.
కోడెజక్కవగబ్బిగుబ్బచన్నులమీఁద దరగపయ్యదకొంగు పొరలిపడఁగఁదమ్మికన్నుల మరందపుబాష్పములు చింద గరువంపుతేఁటిముంగురులు చెదరజలపక్షిమేఖలాకలకలధ్వని మించ సైకతజఘనంబు సంచలింపనబ్జపాదంబుల హంసకంబులు మ్రోయ బెళుకుబేడిసచూపు బిత్తఱింప
నృపబలాకృష్ణ పరమృగీనేత్రఁ బోలి, హలికరాకృష్ణవేణియై జలనినాదనటన మొరయుచు యమున బృందావనంబు, నందుఁ బ్రవహించె వ్యాకులితాత్మ యగుచు.
అంత భయమునఁ గాంతయై యమున చేరి, సీరికి వినమ్రయై కటాక్షింపు నన్నుఁదగునె కులసతి మార్గంబు తప్పి నడువఁ, బరులు నవ్వరె రేవతీప్రాణనాథ.
అలుక శమించి నాపయి హలాయుధ తావకలాంగలాగ్రనిదళితవికీర్ణమత్తటనితంబములన్ నఖరేఖలట్లు నీహలముఖరేఖలం గని వయస్యలఁ బోలు సపత్ను బెల్లఁ బాంసులవయితంచు నవ్వెదరు శుద్ధపయోజనిభాచలంబునన్ .
జలనిధి యేమియంచనునొ చయ్యనఁ బోవలెఁ దోడిచేడియల్నిలువకపోయి రేపగిది నింద గడింతురొ యంచు వేఁడినన్బలుఁడు దయాళుఁడై భువనపావని యేమిటి కింతమాట నీచెలువునిఁ జేరుమంచుఁ బనిచెం గని చెంతలవారు మెచ్చఁగన్.
కొదమరాయంచ జవరాండ్రగుంపుతోడ, సరసి విహరించు రాజహంసంబుఁ బోలిగోపికాహంసయానలఁ గూడి యాము, నాంబువులఁ దేలె యదురాజహంస మపుడు.
ఈరీతిఁ గొన్నిదినములు, నారీతిలకములఁ గూడి నందవ్రజసంచారముల నలరి యంతట, ద్వారావతిఁ జేరెఁ గృష్ణదర్శనరతుఁడై.
అంతట.
వలపు మీఱఁగ స్వయంవరమహోత్సవమున లక్షణకన్య బలంబు మెఱసికొనివచ్చుసాంబుని గినిసి పట్టుకచన్న కురుకుమారులఁ గని క్రోధముననుబదఘట్టనల మహీభాగ మట్టిట్టుగా నలసీరి వడిఁ జేరి హస్తిపురముఘనసాలమూలంబునను లాంగలము గ్రుచ్చి పెకలించఁ బెళపెళఁ బెకలి పురము
యమునకై యొడ్డగిల భీతి సాంబుతోడ, లక్షణాకన్య నర్పించి యాక్షణంబెచేరి మ్రొక్కు సుయోధను చెలిమి మీఱఁ, గౌఁగిటను జేర్చె రేవతీకాంతుఁ డంత.
అవని యొక్కఁడె సాంబుకల్యాణవేళఁ, బెల్లగిలె నట్టిదేవునిపేరివానిపెండ్లి కొకపట్టణంబైనఁ బెల్లగిలదె, యనుచు భీష్ముఁడు నగియెఁ దాలాంకుఁ జూచి.
అంత హస్తినాపురప్రవేశంబు చేసి సాంబునకు లక్షణకన్య వివాహంబు చేసికొనిదుర్యోధనుం డరణంబుగా నొసంగు శతాంగమాతంగతురంగమణిమయభూషణాంబరకోటులఁ గైకొని ద్వారపతి కరుగుదెంచె నిప్పుడు నాహస్తినాపురంబుయమునానది కొడ్డగిలినట్లె యున్నది బలదేవు భుజాబలంబు సన్నుతింప నెవ్వరితరం బదియునుంగాక నింకనొక్కవిచిత్రంబు వినుము.
అలభోజపురమున ననిరుద్ధునకు రుక్మవతిఁ బెండ్లి చేసి తర్వాత రుక్మిద్యూతంబు దలపెట్టి యొడ్డిన యొడ్డెల్ల గెలిచి హలాయుధు గేలిచేయఁజేనచ్చినట్టిపాచికలు గావున గెల్చె దవి వలదని వేఱె యక్షములనుగ్రీడించ హలి గెల్చు గెలుపులన్నియు రుక్ష్మి కావని పలుక నక్కడిజనంబు
వాని నేగూడ నాకాశవాణి యపుడు, బలుఁడు గెల్చె నటంచన నలిగి బలుఁడురుక్ము నష్టాపదంబున రూపణంచి, పరనృపాలుర గెలిచె దోర్బలము మెఱయ.
జనకక్షోణివిభుండు భక్తుఁ డగుటన్ సౌహార్ద్ర మింపొందఁగాఁజని తత్పట్టణవాసియై యతనిచే సంపూజితుండై సుయోధనుఁ డచ్చోటికి వచ్చి శిష్యుఁడయి పాదద్వంద్వసంవాహనంబొనరింపం దెలిపె న్గదాకదననానోపాయము ల్మక్కువన్.
కురుపతి శిష్యుం డయ్యున్, హరిపక్షము పాండుపుత్త్రు లని తలఁపుచుఁ దానిరువురఁ గలయక తీర్థా, చరణంబున కరిగె సీరి సమరమువేళన్.
అరిగి యశుభతిమిరవిభాకరప్రభాసముదంచితం బగుప్రభాసతీర్థంబునఁ గృతస్నానుండై నిజవిలాససముదితసరస్వతి యగు సరస్వతీతటిని మునింగి గగనరమాకబరీసుమనఃకోరకాయితబిందుసరం బగుబిందుసరంబున నవగాహనంబు చేసికలుషభూధరవజ్రధరం బగువజ్రతీర్ధంబున మజ్జనం బొనర్చి రామాదిభూరామేశతటస్థాపితమాసరయూపం బగుసరయూనది నాడి దురితలతానివారణాసియగువారాణసిం జేరి యచ్చట.
కనియెన్ రాముఁ డభంగమంగళతరంగన్ రంగదంభోధిలంఘనసంప్లావితదేవమానవభుజంగన్ జంగమాఘచ్ఛటాఘననైకక్షమదివ్యనామశతసంగన్ సంగరాసింధుబింబనభశ్చారితరూపమానసుషమాభాగంగ గంగానదిన్.
కని వినయభక్తిపూర్వకంబుగా నమస్కరించి.
సవరించెన్ యమునాభమాధవు సరస్వత్యాభపద్మోద్భవున్భవదీయచ్ఛవిశంభు నైక్యమగుటం బ్రత్యక్షమౌ బ్రహ్మ మీవె వివేకాఢ్యుఁడు నీయెడం దనువు వే వీడ్కొన్నచో బ్రహ్మయోగవిశిష్టాత్ముఁడవోలె ముక్తిఁ గను గంగా సర్వముక్తిప్రదా.
అని నుతియించి స్నానదానంబులు చేసి ముముక్షుజనశరణ్యం బగు నైమిశారణ్యంబున కరిగి తన్నుంగని ప్రత్యుత్థానంబు సేయని ప్రతిలోమజాతు సూతుముసలాఘాతంబున గతజీవితుం జేసి మునిప్రార్థితుండై పురాణార్థవేది పునర్జీవితుంగాఁ గటాక్షించి సవనాంగణకల్పితమునిజనరక్తపల్వలుండును నిల్వలతనూభవుండు నగు పల్వలు వధియించి మునిజనసంస్తూయమానుం డగుచుఁబ్రశంసాపరకాశిక యగు కౌశికం దీర్థమాడి ప్రతిదినకల్పితవిప్రయాగం బగుప్రయాగంబున కరిగి కృతమజ్జనుండై సంశ్రితాపాశ యగువిపాశను గోకనదశోభాశోణ యగుశోణంబునం గృతమజ్జనుండై తరువిజితమహేంద్రనగం బగుమహేంద్రనగంబున నిశ్చలసమాధిలీలాసమావృతరేణుకాయుని రైణుకేయుని
దర్శించి కృతమజ్జనాగోదావరీతి వెలయు గోదావరీతీరంబు చేరి కృతఫ్లావనుండైవినతశ్రీశైలబిలహితాధిష్ఠితం బగు శ్రీశైలంబు దర్శించి వేంకటాచలంబున కరిగి.
జాతికిరీటిపచ్చలకిరీటము డాలు ఖంజరీటంబుల పుంజి దెలుపమకరకుండలమరీచికగండమండలి మండలీనాట్యసంభ్రమముఁ జూపగరశంఖచక్రము ల్వరచక్రతిమిరవారణచక్రరిపుహితప్రౌఢి మెఱయరమణీయపీతాంబరప్రభాడంబర మంబరంబునకు హేమంబు నెఱప
వక్షమునఁ గౌస్తుభంబు శ్రీవత్సతులసి, దామముల కాంతియును సముద్దామలీలఁగలసి కుంకుమకస్తూరికల ఘటింప, మెరసి కొలువుండు వేంకటేశ్వరునిఁ గాంచి.
సదయవీక్షాచకచ్చకలవీక్షావని గనుపట్టు వీరరాఘవునిఁ గొలిచిక్ష్మాకాంచి యనమించు కాంచీపురంబులో విలసిల్లు వరదరాజుల భజించియుభయకావేరీమహోజ్జ్వలాశ్రీరంగధాముని శ్రీరంగధాముఁ బొగడిదక్షిణద్వారకాస్థలరాజమునను గృపాళుఁడౌ రాజగోపాలుఁ జూచి
దర్శనంబున బ్రహ్మహత్యానువర్ణ, మోషణాదిమహాదోషములు దొలంగఁజేయుటకు హేతువౌ రామసేతువునను, మునిఁగి రామేశ్వరునిపదములకు మ్రొక్కి.
ముత్యములు పండునదిలోన మునిఁగి మంచి,గందపుంగొండయందు నగస్త్యమౌనిభర్గు సేవించి కన్యాఖ్య దుర్గ గాంచి, భక్తి గోకర్ణనాథునిఁ బ్రణుతి సేసి.
అంత మాహిష్మతీపురి కరుగుదెంచి, భక్తి మను తీర్థమాడి ప్రభాసమార్గమునను సీరి కురుక్షేత్రమునను గాంచె, యోధమానుల భీమదుర్యోధనులను.
కాంచి దయ న్వలదని వా, రించుచు వినకున్న శ్రీహరిప్రహితుండైకాంచనమణిమయభవన, ప్రాంచితమగు ద్వారకాపురంబున కరిగెన్.
బలదేవుఁ డొకనాఁడు పద్మాక్షుతోఁగూడ ధర్మనందను సభాస్థలికి వచ్చియిష్టగోష్ఠిని వసియింప నారదమౌని యరుదెంచి సత్కృతుఁడై వసించిబకుని హిడింబుఁ గీచకుని జరాసంధు రారాజు గెల్చి విక్రమము మెఱసెఘనుఁడు గదాయుద్ధమునను భీముఁడు బలదేవున కొరునకు దిగుడుగాని
యనిన నటులేల హలిసరి పెనఁగలేనె, యనిన భీముని గనుఁగొని కినుక వొడమిసీరి గదదిక్కుఁ జూచినఁ జిత్తమటుల, నైన నాకోర్కె ఫలియించె ననుచు లేచి.
భీముఁడు గదఁ గైకొనినన్, రాముఁడు గదఁ బూనెఁ గ్రోధరక్తాక్షుండైయామేటిమగలఁ గనుగొని, భూమీశులు మిగుల వెరఁగుఁ బొందుచుఁ దమలోన్.
కలహాశి యిప్పు డెక్కడనుండి వచ్చె నీయన్యోన్యరణమున కనియె నొకఁడుగురుఁడు గాఁడే సీరధరుఁ డధికుండన్నఁ దనకేల యీరోస మనియె నొకఁడుఇతనిశిష్యుఁడు కురుపతి గెల్వఁడే సీరికిని సరిపోరఁడా యనియె నొకఁడునది యేటిమాట తాలాంకులోపల సహస్రాంశంబుఁ బోలలేఁ డనియె నొకఁడు
వలదు బలభద్రుతో నేల కలహ మనుచు, బుద్ధికొలఁదిని సమవర్తిపుత్రముఖులుదెలిపి వినకున్న నూరకె నిలిచి రంత, నురివి బలభీమసేను లొండొరులఁ దాఁకి.
అర్పుల నట్టహాసముల నబ్జభవాండము పిక్కటిల్లఁగాదర్పము మీఱఁ బోరు మదదంతులపోల్కి యుగాంతలోకభిద్దర్పకవైరిరోషమున దారుణులై యరుణాయతాక్షులైనేర్పులు మీఱఁ బోరి రతినిష్ఠురమైన గదారణంబునన్.
తనశిష్యుండైనసుయో, ధను జంపెనటంచు మిగుల దారుణమగు కిన్కను గొట్టె బలుఁడు భీముని, ననిలసుతుం డతని గురుఁ డటంచుం గొట్టెన్.
బలుగదపెట్టున భీముఁడు, కులిశాహతిఁ గొండఁ బోలి గులగులలగు నబ్బలుఁ డనిలజుగదపెట్టున, నలరు సరిన్ వింధ్యమట్టు లలుకఁడు కడిమిన్.
చేరి మూఁడునాల్గు చేతులు వెడలిన, యంతలోన వలసి యనిలసుతుఁడుచెదరి యదరి చాల పెదవులు దడుపుచు, స్రుక్కి నాల్గుదెసలు చూడఁదొణఁగె.
అప్పుడు విడువక వైసెం, గుప్పున నడునెత్తి పగులఁ గుదిగొని వెడలెంగప్పెఱ నెత్తురు భీమున, కప్పాండవలోచనముల నశ్రులుతోడన్.
కన్నీళ్లు వఱదలై కాఱఁగాఁ గుంతియు ద్రౌపతి యొకచోటఁ దల్లడిల్లమునుపు నేఁ జెప్పిన వినఁడాయెఁ గార్యంబు దప్పెనంచును ధర్మతనయుఁ డడలఁజూచి యుపేక్ష చేసుక యున్న నాయమా కృష్ణా యటంచుఁ గిరీటి నుడువధౌమ్యాదు లింతక్రోధం బేల శిష్యుపై నంచు నక్కడనుండి యభినుతింపఁ
గినిసి యెవ్వరు చెప్పిన వినక భీముఁ, జంపఁ గడఁగెడు యాదవసార్వభౌముకేలు గదఁ గూడబట్టి శ్రీకృష్ణుఁ డప్పు, డేల వల దన్న కోపంబు చాలునన్న.
హరివాక్యామృతధారం, బరుషరుషానామదావపావకుఁ డాఱంగరుణించి విడిచె లాంగల, ధరుఁ డనిలకుమారుఁ బాండుతనయులు చెలఁగన్.
కళవట్టిపడిన భీముఁడు, దెలిసెన్ హరికరుణ నంత దేవుఁడ నిన్నుందెలియక పోరితి నేరము, గలదనఁగా భీము సీరి గౌఁగిటఁ జేర్చెన్.
పుణ్యము శౌనకాదిమునిపుంజశరణ్యము నైన నైమిశారణ్యమునందు నొక్కమఖరాజ మొనర్చెను రేవతీసతీమణ్యభిరాముఁడై బలుఁ డమానుష వైభవముల్ జగత్త్రయీగణ్యములై తనర్ప జనకామితము ల్దయసేయఁజాలుచున్.
సాంగదక్షిణ లొసఁగి యజ్ఞంబు చేసి, యవభృథస్నాన మొనరించె నతివఁ గూడిసకలబంధుజనములతో సంభ్రమమునఁ, గలుషతిమిరహరుండు లాంగలధరుండు.
ధగధగద్ధగితరత్నకిరీట కాంతులు పదివేల సూర్యబింబములు దెలుపదళధళద్వజ్రకుండలకాంతిమండలి గండమండలమున మెండుకొనఁగఁ
జకచకజ్జలదమేచకకటీరపటాంచలము భుజాగ్రమ్మునఁ గొమరు మిగులఁగలకలక్వణితకంకణముఖ్యనవరత్నమయభూషణములు నెమ్మెయిఁ దనర్పఁ
బుష్పవర్షంబు సురదుందుభులరవంబు, బ్రహ్మరుద్రాదినిర్జరప్రణుతు లలరబ్రహ్మరథ మెక్కి రేవతీప్రాణభర్త, ద్వారపతి చేరి పాలించె వైభవమున.
ఇది బలరామచరిత్రం, బిది దురితలతాలవిత్ర మిది యతిచిత్రంబిది భక్తియుక్తి వినినం, జదివిన జనుఁ డిందు నందు సౌఖ్యముఁ జెందున్.
మును బలునిచరిత దెలిపిన, వెనుకన్ కృష్ణుకథ నీకు వినిపించెదనంటి నరేంద్రా యిపు డది విను, మని మునిపతి దెలుపఁ దొణఁగె నధిపతితోడన్.
శ్రీమత్కృష్ణవలాహకంబు సుమనశ్రీచాయియై దేవకీశ్యామాభ్రంబునఁ బుట్టె శ్రావణమునన్ సద్యోగళత్తాపథాత్రీమానుష్యముపైఁ గృపామృతము వర్షింపన్ నిజోరఃస్థలశ్రీమించం దులకింప నిచ్చ సురభేరీగర్జన ల్మీఱఁగన్.
కమనీయదేవకీగర్భసంభవుఁ డయ్యు రోహిణీసంభవరూఢి గాంచిదీప్యమానధరావతీర్ణుఁ డయ్యు నభోవతీర్ణవిఖ్యాతిచేఁ దేజరిల్లికృష్ణపక్షమున భ్రాజిష్ణుఁడై కలిగియు శుద్ధపక్షమునఁ బ్రసిద్ధిగాంచియిందిరాలింగితహృదయుఁ డయ్యును రేవతీనాథసహజనిస్థితి వహించి
చంద్రదశ దెల్ప ముఖము త్రిస్థానభాను, కరణి గనుపట్టుతేజంబు గురుముఖేచ్ఛహేతువై దివ్యకారుణ్యవృష్టి వెలయ, శౌరి దనరారె సూతికాసదనమునను.
ఘనమనోరంజక కరంజకప్రవాళ, మంజురుచిబాలుఁ గనుఁగొని మంత్రసానిసమ్మదము పూని శూర్పానిల మ్మొనర్ప, బొడ్డు గోయఁగఁ జూడ నద్భుతము గాఁగ.
మొలిచెఁ బొక్కిలిచక్కిఁ దొలుపల్కులను మ్రోయు నలుమోము తుమ్మెద గలుగుతమ్మిపొలిచె మస్తమ్మున భూరిరత్నప్రభాపాళిలాలితకోటిహేళిమౌళినిలిచె హస్తంబుల నిఖిలదైతేయభయంకరోదగ్రపంచాయుధములువలచె వక్షంబున వైజయంతీదామశోభితతులసీప్రసూనపటలి
మఱియుఁ గంకణకేయూరమకరకుండ, లాదిమణిభూషణములు హేమాంబరములుజారుతరమైన మేనితేజంబు మీఱి, శౌరి పురుటింటిలోన సాక్షాత్కరించె.
అప్పు డాశ్చర్యమును మోద మతిభయంబు, వెనుకొనఁగ మంత్రసాని వేవేగ వచ్చియవలికడను నమోనమో యనుచుఁ గాచి, యున్న వసుదేవుఁ గన్గొని యుల్ల మలర.
వెడఁదకన్నులవాఁడు నెడఁదమానికెపుఱా వెడఁదకన్నులమిన్న నిడినవాఁడునీలకాయమువాఁడు నిద్దంపుతమి గుల్కు నీలకాయము వేల్పు మేలువాఁడుకేలిచక్రమువాఁడు కితవుల మన్నించు కేళిచక్రముఁ ద్రోవఁ జాలువాఁడువన్నె మించినవాఁడు చిన్నంపుపదియాఱు వన్నె మించిన వల్లెవాటువాఁడు
దేవదేవుఁడు దేవకీదేవిగర్భ, జలధి జనియించె సంపూర్ణచంద్రులీలనేమి తప మాచరించితో యీవు పూర్వ, మునను వసుదేవపాలితభూమిదేవ.
అని తెలిపిన వసుదేవుఁడు, విని రొద వల దనుచు ననుచు వేడుకతోడన్జని లక్ష్మీవిభుఁ గన్గొని, కనుఁగవ నానందబాష్పకణములు దొరుగన్.
శ్రీవాసుదేవప్రియస, ద్భావావేదాంతవాదఫలితామోదాసేవింతు నిన్ను మునికృత, సేవాశ్రితసుప్రసాద శ్రితబహుభేదా.
పటుమతి ననుమానోక్తిన్, ఘటియింతు “జగత్సకర్తృకం కార్యత్వాత్ ఘటవ త్త” ని తాదృశు నిను, నిటువలెఁ గాంచితిమి చిత్ర మే మనవచ్చున్.
అని పొగడ శౌరి దయ మీఱి యాదివృత్త, మంతయును దెల్ఫి భావివృత్తాంతములునుదెలిపి యెప్పటిబాలునిచెలువు గులుక, శయమునను బూనె వటపత్రశాయితండ్రి.
విడికెంపుపడగగొడుగులు, కడువేడుక శేషుఁ డూనఁ గాళిందియు గాల్నడ గాఁగ నరిగి నందుని, పడఁతుకకడ కొడుకు నునిచి పడుచును దెచ్చెన్.
తెచ్చి కంసుని కొసఁగ నుద్వృత్తి నెగుర, వ్రేసి యసి పూన నద్దేవి మింట నిలిచివేఱె యున్నాఁడు నీవైరి వెఱ్ఱి యనుచుఁ, జనియె నట పల్లెలో మహోత్సవము చెల్లె.
దళపుష్పఫలసమాకులకోకిలమిళిందకీరంబు లగుచు శృంగారవనులుకలహంసికాదత్తకమలనాళమరాళజాలంబు లగుచుఁ గాసారములునుగలశాబ్ధికల్లోలకల్పనోత్కక్షరక్షీరంబులై నైచికీకులములునిరతిశయానందనిర్నిద్రమానసాబ్జముల నాబాలగోపాలజనము
లలరె వింతగు మాధవోదయమునందు, సప్తకులపర్వతంబులు సౌరధేనులక్షణోజ్జ్వలధేనుద్విలక్ష నొసఁగె, ధరణిసురులకు నందుఁ డౌదార్యమునను.
అభినవగుణైకసామగ్రి నుభయకులయ, శోదయై మించునట్టియశోద యంతభువనపోషణుఁ బోషించెఁ బుత్త్రమమత, సర్వసముఁడును మాతృవత్సలతఁ దనరె.
మేదినీనాథ నెలలు తొమ్మిదియు మోసి, కన్నదేవకి యటులుండ కడకు నందుభామినికిఁ గల్గె శ్రీకృష్ణబాలలీల, కన్ను లారంగఁ జూడ భాగ్యంబు గాదె.
జోలలు పాడఁగా మిగుల సొంపగుపున్నమచందమామనుంబోలినకృష్ణుముద్దుమొగముం బలుమాఱును ముద్దులాడఁగా
లాలనమించుజిట్టకములం గనుదోయి చెలంగి చూడఁగాఁదాలిమి నేమి నోఁచిరొ తల్లియుఁ దండ్రియుఁ దొంటిపుట్టునన్.
కంసుపంపునఁ బూతన కామరూప, యగుచు జనుబాలువిష మీయ నమృత మొసఁగెవైరులందును దయగలవాఁడు కృష్ణు, డాశ్రితుల పట్ల నిఁక వేఱె యడుగ నేల.
బండిఁ బడఁదన్నెఁ దొడలపైఁ బండి పర్వు, తల్లికి ఘటించె సురగాలి త్రు ళ్లడంచెజన్ను గుడుచుచుఁ దల్లికి సకలజగము, లాస్యమునఁ జూపె శౌరి మహాద్భుతముగ.
అస్తిభాతిప్రయాత్మకమైన బ్రహ్మ, మాకృతి వహింపఁజూచి కృష్ణాఖ్య యిడియెగర్గమౌనీంద్రుఁ డాగమక్రమము మెఱయ, నందునకు దన్మహత్త్వమంతయును దెలిపి.
సిగను జుట్టిన తావి చెంగల్వ లరవీడఁ గొనరావిరేక ముంగురుల నాడనపరంజిమద్దికాయలు చెక్కుల నటింపఁ గమ్మకస్తురితిలకము రహింపఁబంచరత్నమ్ముల పంచాయుధము మించఁ దళుకుముంగామురంబులు సలింపగంటలమొలకట్టు ఘణఘణధ్వని సేయ నందెలు ఘలుఘల్లు మనుచు మ్రోయ
నందె గాలిడి యొకపాణి యవని నూఁది, యన్యకరమున నవనీత మవధరించిబాల్యమునఁ గ్రీడసల్పు గోపాలకృష్ణు, చెలువు వర్ణింపఁ దరమె యాశివునికైన.
సగమురాత్రివేళ జనియింపఁగానేమొ, జారచోరలీల మీఱె శౌరివిశ్వవిభుని కేల వేళానుసరణంబు, లవియు నొకవినోద మయ్యెఁగాక.
నందునియింటను రాధ య, నందగునొకకన్య జవ్వనంబునఁ దనరుంగెందలిరాకుజిరాదొర, పందెము గెలుపింపఁజాలు బాగులు మెఱయన్.
కలికిచూపును గుచంబులు మోవి మోమును గమలారిబింబవిభ్రమము గాంచిరమణికొప్పును మధ్యమము దృష్టి నూఁగారు వరుసనీలాభ్రాళి గరిమఁ బూనియెలనాఁగచెవులు పల్కులు కరంబులు మెడ నవసితాబ్దస్ఫూర్తి నవఘళించిమగువనాసిక నితంబము నఖంబులు మేను స్వర్ణాచలాభాతిశయము గడచి
రతికిఁ గుచఫలరత్నదర్పణతమోణు, కాండశైవాలశష్కులికాశుకీకిసలయపాళీతిలకుసుమసైకతాచ్ఛ, కుందకోరకతిలకలఁ గుందుపఱుచు.
వల్లభునిఁ బ్రోచురతిగతి, నెల్లప్పుడు ఱొమ్ము డించ కెంతయుఁ దమి నప్పల్లవమృదుపద పెనుపఁగఁ, గల్లరికృష్ణుండు దానిఁ గని మది సొక్కెన్.
తొడలపై నుంచి యుగ్గిడువేళఁ జికిలిపెందొడలసం దొయ్యనఁ బుడికిచూచువేడుక విందులు విందు లంచును బిల్వఁ గదిసి పయ్యెద జార్చి కౌఁగిలించునునుముద్దుఁ బెట్టుమంచును వేఁడుకొనఁ గోటికొనఁ జెక్కు మీటి చుంబన మొనర్చుముదముతో నెత్తుక మోవి ముద్దాడినఁ జక్కెరకెమ్మోవి చప్పరించుఁ
బట్టుకొని లేచుగతి నీడ్చుఁ గుట్టుకొంగు, తొలఁగి జఘనంబు గనుపింపఁ గెలసి నవ్వునెన్నిమాయలు నేర్చెనే చిన్నికృష్ణుఁ, డనుచు దనుఁ బెంచు రాధ ముద్దాడ శౌరి.
ఎవ్వరు పట్టిన న్నిలువఁ డెంతయుఁ గృష్ణుఁడు పోరు పెట్టెడిన్జవ్వని యెత్తుకొమ్ము పని చాలు నటంచు యశోద పిల్వఁగానవ్వుచు రాధ యెత్తుకొనిన న్నగుఁ గృష్ణుఁడు నొద్దివారలుందవ్వులవారు నిద్దఱకు ద్వంద్వ మటందురు వారలుబ్బఁగన్.
చిన్నికృష్ణుని దినము గైసేయ వెన్న, ముద్ద వెట్టఁగ నెత్తుక ముద్దులాడఁగాని వేఱొకపని సేయఁ గానరాదు, రాధికాదేవి మిగుల గారాబమునను.
అంత నైదేండ్లప్రాయంబునందె శౌరి, తోడిబాలురతోఁ గూడి వేడుకలరగొల్లయిండ్లను వెన్నలు కొల్లలాడు, గొల్ల లాడుకటూక్తికిఁ గొంకు లేక.
వెన్నఁ బెట్టెద మేది విద్దెమన్నను గోపరమణులయొద్ద విద్దెములు సల్పునొకయింత నేమఱియున్నఁ గవ్వము దీసి పక్కున భాండము ల్పగులఁగొట్టునది యేమిరా కృష్ణ యనిన నేమియు లేదు చేతప్పి పడెనంచుఁ జెలఁగి నవ్వుఁబట్టుకోవచ్చిన బ్రహ్మాదులైనను బట్టనేర్తురె యంచుఁ బర్వు లెత్తు
భామయొక్కతె వెన్నంటి పట్టుకొనిన, మోము ద్రిప్పి చుఱుక్కున మోవి నొక్కునమ్మనేఁ జెల్ల నెంతకాయకుఁ డటంచు, తరుణి విడిచిన విడువక దాఁ బెనంగు.
లోలయగు లోలలోచన, వాలుంజనుదోయిఁ గేల వడిఁ బట్టుక నుయ్యాలో జంపాలో యని, వ్రేలుం గృష్ణుండు సఖులు వికవిక నవ్వన్.
కినుకన్ వ్రేఁతలు వచ్చి కొల్లలిడియెం గృష్ణుండు పాల్వెన్నలంచనినం గోపముతో యశోద యది యేరా కృష్ణ వ్రేపల్లెలోనను బాల్వెన్నలుఁ గొల్లవెట్టితని యన్నం దల్లి లేదే తమిండ్లనెయుండే ననఁ జూడఁ బంపఁ జెలినట్ల న్నిండియుండు న్వడిన్.
పనివడి దొంగిలించుతఱిఁ బట్టుక కృష్ణుని దొంగసిక్కె రమ్మని యొకప్రోడ చేడియల నందఱఁ గూడుక తల్లి యొద్దనుంచినతఱి దత్తనూభవుని చెల్వము గైకొన నీకుమారు దండన మొనరింప మేము వలెనా యన సిగ్గునఁ బోదు రందురన్.
జనయిత్రి రోటఁగట్టిన నర్జునంబులఁ బడద్రోసె నర్జునప్రాయముగనుబృందావనంబునఁ బృథుశక్తి దగ ధేనుబృందావనము సేసెఁ బ్రేమదనరబకునిరోషారుణాంబకుని చంచులు రెండు చించి చెండాడె విచిత్రముగనువత్సరూపకుఁడైన వత్సదైత్యుని బట్టి వక్షంబు పగులఁగా వైచి చంపె
బాలగోపాలకబళనప్రాసితాఘు, నఘు విచారించె గహనమధ్యంబునందుఁబద్మలోచనుఁ డైదేండ్లప్రాయమునను, భక్తలోకైకరక్షణప్రౌఢి మెఱసి.
అంత నొక్కనాఁడు.
వెన్నున బర్హిబర్హమును వేత్రము గేలఁ గటీతటిం బదార్వన్నెపటంబు దట్టిపొరవాంశికనాళముఁ బైఁడికొమ్ము ద
ధ్యన్నకరంబు గల్గి చెలువందుచు గోపకబాలుయుక్తుఁడైవెన్నుఁడు ధేనుబృందముల వెంటఁ జరింపఁగఁ జూచి నివ్వెఱన్.
జలజగర్భుండు గోపవత్సముల డాఁప, భక్తవత్సలుఁ డట్టిరూపముల నొక్కవత్సరంబును మెలఁగ శ్రీవత్సవక్షుఁ, గాంచి వెరగంది మ్రొక్కి నుతించె నిట్లు.
మహనీయతతపుష్పమాలికాంచితచంచరీకపక్షసపక్షకాకపక్షచిత్రైంద్రచాపరోచిస్సాంద్రచంద్రికాంచితకరాదికలాపకృతకలాపబాలభానుప్రభాజాలకల్పనశీలకటివిలోలవిశాలకనకచేలవేత్రదండవిషాణవేణుదధ్యన్నప్రశస్తపంకజశస్తచారుహస్త
నందనందన శాశ్వతానందభక్త, నందనద్రుమసనకసనందనాదిముక్తజననందకాకార యుక్తిదూర, నందకకరాబ్జ నినుఁ గొల్తు నన్నుఁ బ్రోవు.
ఏను నీమాయఁ దెలియఁగా నెంతవాఁడ, మోహినీరూపమున శంభు మోహితాత్ముఁజేయవే మున్ను నను దయచేయుమయ్య, సంతతాక్షయ్య శేషభుజంగశయ్య.
జనకుఁడవు నీవు గోపవత్సలుఁడ వౌట, నేను నటువలె నైతి నేఁ డింతెగాకలేదు నేరంబు నామీఁద లేశమైన, ననుచుఁ జతురోక్తి వినుతించి యజుఁడు చనియె.
ఇట్లు భక్తవత్సలుండు వత్సగోపాలబాలకుల మరలించి మఱియుఁ బెక్కువినోదంబులఁ జరియించుచుండె నంత.
ఏడెనిమిదివత్సరముల, వాఁడై కృష్ణుండు కొన్నివగలఁ జరించెన్వేడుకతోఁ గాయకపుం, జాడలు విడువకనె గోపసహితుం డగుచున్.
నాబంతి దాఁచుకొన్నను నేను విడుతునే యని యొక్కచెలిగుబ్బ లంటి చూదుఁజెలువ యేకాంతంబు చెప్పెద రమ్మంచుఁ జెవియొగ్గినను గవకివలు గొణుగుఁబడఁతి యీముడి నేమి ముడిచితే యే దేది విడుమంచు నునుపోఁకముడికిఁ బెనఁగుఁగాల్దాఁకి మ్రొగ్గునంగనకు ముందై పుత్త్రు గనుఁగొమ్మనుచు నెత్తి కౌగిలించు
నొడ లెఱుంగక నిదురించు నువిదతొడలఁ, గుచ్చల దెరల్చి యత్తను దెచ్చి చూపునేమి చేసెద రిద్దఱే యిం దటంచు, దంపతుల వేఁడు హరి దంటతనము మెరసి.
రమణి యొకర్తె యొంటి మధురాపురికిం బెరుఁ గమ్మఁబోవుచోసమయము గాచి పోఁకముడి జార్చిన జాఱెడుచీర గట్టఁగానమరిక లేక కుండ విడ కత్తభయంబున దించుమంచు నక్కమలదళాక్షి వేఁడుకొనఁ గల్లరిచేష్టలు చేయుచు న్నగున్.
క్షోణీశ యంత యశోదతోఁ బుట్టిన కుంభకుం డనియెడిఘోషభర్తమిథిలాపురముచెంత మేటిసంపదలచేఁ దనరంగ నతనిమందను నిశాటు
లేడ్వురు మదమత్తవృషమూర్తులై చొచ్చి యనిశంబు బాధింప నతఁడు వీనిఁజంపినవారికిఁ జక్కనినాకన్య భక్తి నిచ్చెదనంచుఁ బ్రతిన సేయ
శౌరి యట కేగి వృషముల సంహరించి, భువనమోహిని నీలను స్వవశఁ జేసితత్సహోదరు శ్రీదాముఁ దనకు మిత్రుఁ, గాఁగఁ గైకొనివచ్చెనుత్కంఠ హెచ్చ.
ఆనీలాకన్య యశో, దానందులపట్ల నెల్లఁ దగుభయభక్తుల్వూనుచు రాధాచంద్రని, భాననతోఁ జెలిమి సలుపు నప్ప యటంచున్.
అంతఁ గ్రమక్రమంబున.
మొనలు చూపెడి పినపినమొల్కచనుదోయి యలఁతిపయ్యంటకు నాస సేయఁగొంకున ఱెప్పలాఁగుచుఁ జూచుచూపులు మిసిమికతొలకుల దుసికిలంగఁజిగురాకుపోలిక జిగిఁజూపువాతెఱఁ జిన్నిలేనవ్వులు చెంగలింపనొక్కింతబటువైన యుదుటుఁ దెల్పెడి శ్రోణితటి పటంబునకు నెత్తరము నెఱుపఁ
బొన్నపొక్కిలి లోఁతైన సన్నమైన, నడుము బిగిఁజూపు నునుబోఁకముడికి లోఁగశాకబీజాలివలె నారు చంద మొంద, నీల నవయౌవనంబున నెగడెఁ జాల.
మదవృషభంబులఁ గూలిచి, సుదతీమణిఁ దెచ్చునపుడు చూడఁగ హరికింబదుమూఁడేడులు గావునఁ, బొదలుం జవ్వనము భువనమోహనలీలన్.
కలికిసింగారంపుమొలకలో యన ముఖాబ్జమున నూనూఁగుమీసములు దనరఁగెంపుల గెల్చిన కీర్తియోయన గావిమోవిపైఁ జిఱునవ్వు ముద్దుగులుకసంతతగోపికాస్తనఘట్టనంబున గడుసయ్యె నాఁగ వక్షంబు మెఱయఁగలభహస్తోపమోరులఁ బోలి యాజానులంబియై బాహుయుగ్మంబు వెలయ
జవ్వనంబున గోపాలచక్రవర్తి, నిండుపున్నమచందురు గండుమిగిలికన్నుఁదొగలకు విందయి యన్నుఁ దెగల, మనసు నెలఱాలఁ గరగించి మమత నించె.
పిన్ననాఁటనుండి కన్నులకింపయి, యున్న రాధమీఁదఁ గన్ను వేసియున్నవాఁడు గాన వెన్నుఁ డాప్రాయంపుఁ, గన్నె పొందుఁ గోరి సన్న సేయు.
ఫలపుష్పములు దెచ్చి పట్టుమంచును బైఁట నించుచో గుబ్బఁ దాఁకించుఁ గేలనిక్కట్టుతోవల నెదురైన నొదుఁగక యొయ్యారిమేను మే నొరయ నేగుఁజీఁకటిలోఁ గన్నఁ జెలియ నాపై దయ లేదటే యని కౌగిలింపఁ దివురుసఖులతో రతిరహస్యములు ప్రసంగించు నెలగాఁగ వినఁగఁ దా నెఱుఁగనట్ల
చిలుకసాంబ్రాణితేజివజీరుఁ గేరు, కమ్మనెమ్మేన వగవగ సొమ్ములూనియెమ్మె మెరయించు శ్రీకృష్ణుఁ డెల్లవేళ, రాధ లంకించుకొనెడి యారాటమునను.
శౌరి కడుఁబ్రేమ నిటువలెఁ, జేరిక సేయంగ సిగ్గు చిత్తము గరఁగన్మారుఁడు పొడుపొడుమని యొ, య్యారంబున వెడలె నంత ననురాగమునన్.
కిలికించితవతి కృష్ణుం, దిలకించఁగసాగె సారెఁ దీరగుగుబ్బల్పులకించఁ గళుకుఁజెక్కుల, గులకించుక చెమట జాఱఁ గోర్కులు మీఱన్.
పనిలేనిపనిఁ బూని పైఁడియందియ ఘల్లుఘల్లనఁ గృష్ణుచెంగట నటించుఁదనపైఁట యతనిఁ దాఁకిన గిఱుక్కున మొగం బొరయై చూచు సిగ్గొలయు చూడ్కినేఁ జెల్ల నమ్మ వానికి నెట్లు దోఁచునో చెఱఁగు దా కె నటంచుఁ జెలికిఁ దెలుపునెటుల దోఁచిన మంచిదే యన్నఁ జాలును పొమ్మంచుఁ గెంగేలఁ దమ్మివైచు
నాననము వంచు బొటవ్రేల నవని వ్రాయు, వేఁడినిట్టూర్పు వుచ్చు నావెత యెఱుంగవింతెగదె యంచు ననఁబోవు నంతలోన, గ్రుక్కు మక్కువఁ జొక్కి యక్కువలయాక్షి.
నునుపయ్యెంటచెఱంగు జాఱ హరి కన్నుంగోనలం జూచినంగినుకన్ వాతెఱ పంట నొక్కుచును జంకించు మృగాంకాస్య గ్రక్కున లేదంచును శౌరికన్నులను మ్రొకున్ రాధ కెమ్మోవిపైనెనయించుం దరహాసచంద్రికల శ్రీకృష్ణుండు హర్షింపఁగన్.
కనుఁగోకృష్ణు నెఱుంగనట్లు సకియం గౌఁగింటికిం దార్పుచుంబెనగు న్నాపయి బత్తి లేదనుచుఁ గోపించున్ బలా యేలనేయనుచు న్నివ్వెఱపాటుతోడ నది త న్నెట్టో విలోకింపఁ బక్కున నవ్వు వలిచన్నుదోయి గులుకం గౌఁదీగెజ వ్వాడఁగన్.
కొప్పున జాజులున్ బిగువుగుబ్బల కుంకుమతేనె మోవిపైఁగప్పురవీడియంబు జిగికస్తురిబొట్టును నిచ్చచల్వముంజొప్పడ వారకాంతవలెఁ జూడ్కికి విందొనరించెఁ గాని యొక్కప్పుడు మైలదోఁప నడయాడదు రాధ ముకుందు ముందటన్.
దోర్మూలములు గాంచఁ దొలఁగించుఁ బయ్యెద నాభి గన్గొన వితా నానఁ బూనుమురువుతోఁ గెమ్మోవి విఱుచు చుఱుక్కున నుదుటుగుబ్బలు నిక్క నొడలు విఱుచుమెలఁతమైనొరగు నేమో చూచి పక్కున నగుఁ బాలు ముద్దాడు నన్నుఁ జూడుమను నొక్కవ్యాజంబునను జెంతఁ జేరు జెక్కుల చెమ్మవో మీటుఁ గొప్పు నిమురుఁ
గటితటం బంటి సొలయుఁ గ్రేఁగంటఁ జూచుఁ, బంత మీడేరెనా యని పైని విరులువైచుఁ గనుసన్నఁ బిలుచు రావా యటంచుఁ, జిలుక పైనిడి కెలయు నచ్చిగురుఁబోణి.
అలచెలువ వలపుసొలపులు, దిలకించుచుఁ జెలఁగి బళిర తేరకు డక్కెన్వలకారిచిలుక యని చం, కలు దాటించుచును శౌరి కడునిర్భయుఁడై.
మగువ నీవ్రేలికి మట్టాయెనా యని కడవ్రేలుఁ బట్టు నుంగరము పెట్టునిది లెస్స యనుచుఁ బాలిండ్లమీఁదికిఁ బాణికమలము ల్సాఁచు హారములు వై చుఁజెలి చూడవే యని చెంగల్వమొగ్గ యిందని వేఁడి యిచ్చు కర్ణమున నుంచుఁగుంకుమ యలఁదుచు గోట నితంబంబు కడ విదలించుఁ బక్కున హసించు
గురుజనంబులు నెడ గల్గి తిరుగువేళ, శౌరి రాధను జేరి రాజసము మీఱనామిటారియు నతనిమాయలకు లొంగి, యుండెఁ గావునఁ జెలరేగుచుండె నపుడు.
వనితామణి యిటువలె న, వ్వనజదళాక్షునకుఁ జాల వలచి మనం బాఘనవర్ణుచెంతఁ దనుపుం, బనిపాటలు మాని మెలఁగు భవనములోనన్.
ఒంటిపాటునఁ గౌఁగిలొసఁగుఁ దత్తఱముతో నంతలోపల మళ్లు నలుకుఁడైననేమైనఁ జూచుచు నెఱుఁగనిరీతిని మాఱుమోమునఁ జెంతఁ జేరి నించుఁగట్టుకొం గెడలించి గట్టునల్లల్లన గంభీరనాభి క్రేగంటఁ జూడఁజెలియ రావే యని చెయి వేయుఁ జీఁకటి గాంచి నీవా యంచుఁ గడకుఁ బోవు
నెదురెదుర చూచు మందల కేగియున్న, నేల రావైతివని దూఱు నాళిఁ జూచియతనిపల్కులె చెవియొగ్గి యాలకించు, వలపునను రాధ కృష్ణునివలకుఁ దగిలి.
మాధవుఁడు రాధ నీరీతి మరులు కొల్పి, మఱియు గొల్లమిటారుల మరులు కొల్పనారజపువన్నెఁ బెట్టుచు ననుదినంబు, వీథిలోపల విహరించు వేడ్క మీఱ.
మునిమునిచీఁకటి న్నడువ ముంగిటవాఁకిట నైన నొంటిపాటున నడయాడుజవ్వనుల డొంకక పయ్యెదయైనఁ జట్టయైనను జడయైనఁ బట్టు నెఱనవ్వునఁ గృష్ణుఁడు లోఁగిరేని గ్రక్కన నొకచోటుఁ జూచుకొను గాదనినన్ వెడలున్ హుటాహుటిన్.
జిలుఁగుఁబయ్యెద జాఱఁ జెక్కుల చెమరూరఁ గనుఱెప్పయిడక చూడనిమిటారిచెలియచెక్కునను దోఁచిన కృష్ణవదనంబుఁ గూర్మి మీఱఁగ ముద్దు గొననివనితపులకండములు గుల్కు బొమ్మంచుమోవికిఁ గ్రుక్కిళ్లు మ్రింగని కుందరదనపైఁడికంబంబునఁ బ్రతిఫలించినమూర్తిఁ గౌఁగిటఁ జేర్చి చొక్కనిలతాంగి
కలుగనేరదు రేపల్లెచెలులలోన, గురుజనంబుల కళికి పైకొనరు గానికరఁగరే చంద్రు గనుచంద్రకాంతమణుల, జోక గోపాలరాయనిఁ జూచునపుడె.
ఉల్లమునఁ గృష్ణమూర్తి యచ్చొత్తినటులు, సంతతంబును జెలువొంద జంద్రముఖులుతన్నిమగ్నైకచిత్తలై ధ్యానయోగి, వరులవలెఁ జొక్కుదురు పారవశ్యమునను.
అమ్మనేఁ జెల్ల మాయత్త చూచినఁ గొట్టుఁ బయ్యద విడర గోపాలరాయయోరి నాగుబ్బల గోర జీరకు పోర నీకు మ్రొక్కెద యశోదాకుమారయవులేర మంచివాఁడవు గంటు సేతురా వాతెఱపై నవనీతచోరచెల్లఁబో నడివీథి నెల్లవారును జూడ ముద్దాడవత్తురా ముద్దుకృష్ణ
యంచు బ్రక్కను బవళించుమించుబోండ్లు, నిదురమబ్బునఁ బగ లిట్లు జదురులెల్లఁగలవరించిన నాసంచు తెలియలేరు, పనులఁ గాచిరి కాన తత్ప్రాణవిభులు.
పనులు సేయువేళఁ బాటఁ బాడెడువేళ, నాటలాడువేళ హరినె కానియన్య మెఱుఁగ రెందు నలగోపసతు లేమి, నోమినారొ తొల్లిబాములందు.
అదిగో కృష్ణుఁడు వచ్చెనన నెంతపనియైన వదలివత్తురు తలవాకిళులకుయముననీళ్ళ కటంచు నరిగి మాధవువేణునాదంబు విందురు మోద మలరఁ
బనిలేనిపని పెట్టుకొని నందసుతుని గేహమున కేగుదురు నూఱారుమాఱ్లుతమినిబ్బరమునఁ జెంతలవారి నెఱుఁగక కులుకుదు రాశౌరికెలన నిలిచి
కమ్మవిలుకానిచేకీలుబొమ్మ లనఁగ, సమ్మదంబునఁ బసిగాపుకొమ్మ లట్టులెమ్మె నడయాడుదురు సంతతము మాన, సము వెన్నునియందు మగ్నమ్ము గాఁగ.
ఈకైవడిఁ గృష్ణుఁడు వ్రజ, కోకిలవాణులను మరులు కొల్పె మనోజవ్యాకులితలైన వారలఁ, జేకొని క్రీడింపఁదలఁచి చిత్తములోనన్.
కమలావల్లభసౌఖశాయ నికమాగచ్ఛద్వచోవల్లభాశ్వమణీస్వాగతికంబు గైరవనుహృత్సరక్తికంబాపగోద్యమ మాశబ్దిక మంగభూవిజయయాత్రావావదూకంబునైకమనీయంబుగ మించె నంతట శరత్కాలంబు భూపాలకా.
ఆశరత్కాలమునఁ బూర్ణిమావసరము, నందు రవి జాఱెఁ జంద్రోదయంబు మీఱెఁదనరె నిరుదెసఁ గెంజిగి ధవళరుచియుఁ, గీరహయునిప్రతాపసత్కీర్తు లనఁగ.
స్మరతేజంబు జనించె నించె దివి సచ్చక్రంబు చక్రంబు దుస్తరమోహాబ్ధి భ్రమించె మించెఁ దుహినాసారంబు సారంబులౌనరవిందంబులు తీరెఁ దీరెననెఁ గల్హారంబు హారంబుడాల్నెరయన్ వెన్నెలమించె మించె విటసందేశంబు దేశంబులన్.
అట్టివెన్నెలలోన యమునాతటంబున ననిచిన శృంగారవనములోనఁబారిజాతముక్రింద మారు గెల్చినభంగి నంగుమీఱఁ ద్రిభంగి యగుచు నిల్చిపదముపై వేఱొకపద ముంచి జాళువావన్నెదుప్పటివలెవాటు మించసాచీకృతానన జలజాతవేణురంధ్రములయందుఁ గరాంగుళము లమర్చి
ప్రౌఢి మీఱంగ మదనగోపాలమూర్తి, గాన మొనరించె నలతానమానములకుమానములు వీడ గోపికామానవతులు, గీతికాదూతికాసమాహూత లగుచు.
కెంగేల జలపాత్ర గీలించి యెలదోఁట త్రోవగా నవ్వలదూఁటె నొకతెయత్త యెక్కడి కంచు నడుగ నెక్కడకి లే దిదిగొ వచ్చెదనందు నేఁగె నొకతెపొరుగింట నుండు మాపొరుగింటిపడుచును చూచి వచ్చెద నంచు లేచె నొకతెమంచినీళ్ళకుఁ బోయి మఱలివచ్చెద నంచు వేడ్క మీఱఁగ నేఁగె వెలఁది యొకతె
త్రోవలో తోడికోడలు పోవఁ జూచి, యేడకే యన్న నదియు నీ వేడ కన్నఁగూయకుమటంచు నిద్దఱుఁ గూడి తోడి, దొంగలై పోయి రాగోవధూర్తుకడకు.
కడవెఁడువేఁడినీళ్ళ జలకంబయి కమ్మనిపాలు వంటకంబిడిన భుజించి నాథుఁడు శయించిన వీడెము వేసికోక య
ప్పుడె నిదురా యటంచు నొకబోటి హసించుచుఁ దల్పుమూసి వెల్వడియె ముకుందు డున్నెడకుఁ బంచశిలీముఖచంచలాత్మ యై.
మొగములోఁ దేటలేనగవు వీడెముకెంపు పెంపునింప సమర్తపెండ్లికూఁతులనువొంద నీరువట్టినమేనితళతళల్ దిలకింపఁ దొలుచూలుతలిరుఁబోండ్లుపసదేరు పసపుదువ్వలువ కాటుక బొట్టు వింతచెల్వూన బాలెంతరాండ్రుగమకపుగుబ్బ లంగములలో నుదుటునిచ్చలు ప్రేమగల నిండుజవ్వనులును
మఱియు వ్రేపల్లెలోనున్న మందమంద, గామినులు కామినులు కీరకాండకాండకుసుమదోదూయమానమానసముతోనఁ, దోనఁ దన్నందపుత్త్రుండు తోన నగుచు.
ఏల వచ్చితి రీవేళ బాలలార, యనినఁ గొందఱు ప్రౌఢరాకాబ్జముఖులుకృష్ణ నిన్నేలవచ్చితి మిప్డు మరుర, ణంబునం దన నందనందనుఁడు వలికె.
మగనాండ్రు మీరు మిముం, దగిలి రమించుటలు నాకు ధర్మువె నేనావగకాఁడుగాను బొండో, మగువలు మీకైన నిట్టిమార్గము దగునే.
అనినం గన్నెలు చిన్నవోవ నగి ప్రౌఢాంభోజపత్రేక్షణల్విన మేమంటివి కృష్ణకృష్ణ యవురా వేసాలు మాతోడనాయనరా దింతియెకాక కన్నయపుడల్లా తప్పుదండాలు వెట్టిన మాసామివి నీవకాక వలపంటే వచ్చెనా బింకముల్.
కానీ పోదుమె ప్రొద్దుపొద్దునను వేడ్క న్నీవు ప్రార్థింపఁగాఁబోనీ పో మనవాఁడుగా యనుచు మాపుణ్యానకున్ వచ్చితేకానంజాలక ధర్మశాస్త్రములు వక్కాణింపఁగాఁ జొచ్చినావౌనే కాక మఱేమిప్రోది కడు లెస్సాయెన్ యశోదాత్మజా.
దినముం జేష్టలచేఁ గరంచఁగను బాతివ్రత్యధర్మంబు మేమెనయంజాలుదు మెట్లుగా నదియుఁ గా కేనాఁడు కాళిందిలోనను నీరాడఁగ వస్త్రము ల్గొనితొ యానాఁడే జనెన్ లజ్జ యన్నను గోపాగ్రణి యేమి చేసితిని నానాఁ డేల నన్ దూరఁగన్.
అనవుడు నవ్వి యవ్వికసితాంబుజనేత్రలు నీ వెఱుంగవేకనికని యుండి బిత్తలియె గట్టుకు రమ్మని చేతులెత్తి మ్రొక్కిన దనకాళుఁబోరి తిలకింపవె మర్మము లెల్ల నెట్టిసీమను సతు లట్లు సూపుదురె మాయెడఁ గల్గెను గాక మాధవా.
అనిన నింతియ కాదె పద్మాక్షులార, దృష్టిదోషంబు పనిలేదు తెలియ కేనుజెనకితినె గాక నన్నుఁ జూచితిరె చూడ, వల్లవుఁడ గాని నే మీకు వల్లభుఁడనె.
అలివేణి నీవె కావా గుబ్బపయిఁ జెయి వేసిన జెయిఁ దట్టివేసి చనుటవనజాక్షి నీవె కావా మోవి యాన వచ్చిన నెమ్మొగం బోర చేసికొనుట
యంగన నీవె కావా వేణి పట్టినఁ బెనఁగి నాచెయి విడిపించుకొనుటఅబ్జాస్య నీవె కావా వెన్కఁ జేరి నే కన్నులు మూసినఁ గసరుకొనుట
వలపు లేదేమొ నల్లనివాఁడ నగుట, నటుల నేల పతివ్రత లగుదు రింతెయదియె మంచిది సౌఖ్యంబు లందు నిందుఁ, జెందుటకు మంచికార్యంబుఁ జేసినారు.
చిత్తమెలర్పఁగా మగలసేవ లొనర్పక యిట్టివేళలన్వత్తురె మెత్తురే పరులు వంశమువాసికి గాసి దెత్తురేచొత్తురె జారవిద్యలకుఁ జూచిన పెద్దలు సాగనిత్తురేయుత్తమశీలలార నను దూఱక మీశరణంబు లొందుఁడీ.
అనినం గాంతలు దృష్టిదోషములు లేవా ధర్మము ల్పల్కు నీవనినం జాలును సృష్టిదోషములు లే వట్టైన బల్సిగ్గునన్నిను సేవింపము గాని యుండు నెపుడు నీయందె మాచిత్తముల్పెనఁగన్ వల్లవచక్రవర్తి వివపాభేదంబునం జూడఁగన్.
రూఢి శృంగారరసమె యీరూప మగుట, శ్యామవర్ణుఁడ వౌదు గాదనఁగ నేలయెఱుఁగుదుము నిన్ను మము నీ వెఱిఁగియుందు, వేల యీవట్టిజోలి యీవేళఁ గృష్ణ.
ధవసేవ ధర్మ మంటివిగదా నీవె మాధవుఁడవు గావె కందర్పజనకవంశంబునకు హాని వచ్చునే చేపట్టినావు వేడుక వేణునాదలోలకనిన నిత్యానందకాముకు ల్మెచ్చరే తగులు చేసిన నమృతస్వరూపయాత్మనివేదనం బౌఁగాక మాభక్తి జారత్వమే భక్తపారిజాత
కలరె సర్వనియంతను గాదనంగఁ, దగినపెద్దలు జగదద్భుతప్రభావశరణ మెయ్యది నీపాదజలజయుగమె, శరణ మగుఁగాక గోపాలజనశరణ్య.
అని మఱియు నిట్లనిరి.
నటియింపవా విషానలఘోరఫూత్కారకాళియాహిస్ఫటాగ్రములయందుఁగబళింపవా జ్వలత్కాలానలజ్వాలికాభీలలోలదావానలంబుధరియింపవా మహీధరవైరిముక్తాశ్మవర్షదుర్ధర్షగోవర్ధనంబుమరలింపవా వార్ధికరభటానీతతల్లోకగామినినందు లోకు లెన్న
మఱియు గల వెన్ని యైన నీమహిమ లెన్న, సులభమా మాకుఁ బరపురుషుండ వగుదుననఁగ నినుఁ గొల్చెదము నేఁడు కరుణఁ జూడు, మేల మ మ్మింత సేయఁ గోపాలరాయ.
గాయకునకు మోహింపుదు, రేయెడ స్త్రీ లనుచుఁ దెలుపదే శ్రుతి గావోగాయకుఁడ వేము గామో, తోయజనేత్రలము వట్టి దూఱేమిటికిన్.
చిక్కులఁ బెట్టినఁ బోమిక, నక్కున గదియించి తారహారావళులంజిక్కులఁ బెట్టక యనుచున్, మక్కువఁ బైఁబడిన యదుకుమారుం డంతన్.
అలమఁబోయినఁ జేతికందని చిన్నిగుబ్బలబాలల వికాసబంధములనుదిమిరంబు నిండుప్రాయము మోహనాంగులఁ గెరలించి యుపరతిక్రీడనములనగవుల నఖరదంతక్షతంబులఁ దెల్పు ప్రౌఢల బహుచిత్రబంధములనుజాతిస్వభావచేష్ట లెఱింగి తత్తత్కళాస్థితు ల్గరఁగించి లలితగతుల
నందఱికి నన్నిరూపంబు లందిపొంద, దక్షుఁ డయ్యును నొకవినోదంబు గాఁగనిరువురకు మువ్వురకు మఱి నేవురకును, బడుక యిచ్చుచుఁ బెనఁగె గోపాలుఁ డపుడు.
అలయ వొకింతయైనఁ జెమటంటదు చెక్కుల మించి యూర్పులంబొలయవు చాలుఁ జాలు నిఁక బొమ్మనఁ వెందఱు వచ్చి వేఁడినంగలయక నీవు దేవుఁడవు గాక మనుష్యుఁడవే యటంచుఁ బ్రేఁమల నని రింతు లాహరిని మన్మథకేళిక మించు లాహరిన్.
పాలు చల్లాఱఁబెట్టి యావేళ యింత, పాలుమాలిక రాఁగ రాధాలతాంగిపవ్వళించెనొ లేదొఁ గోపాలగీతి, చెవినిఁ బడ నుల్కి పడి లేచి శీఘ్రమునను.
పాలని మజ్జిగలోపలఁ, బాలుని తోడంటు వెట్టి భ్రమచే నిదురన్సోలెడిగృహజన మదియే, వేళ యనుచుఁ బడుకయిలుఁ బ్రవేశించి తమిన్.
ముంగొంగుబంగారుచెంగావి యటులుండ జిలుఁగుపైఠాణిదువ్వలువ గట్టిసంపెంగ లటులుండ జాజిక్రొవ్విరిదండ మెండుగాఁ గీల్జడనిండఁ జుట్టికుంకుమపంకంబు పొంకంబుగా నుండ గబ్బిగుబ్బల మంచిగంద మలఁదికళుకు ప్రాగెంపుచెక్కడపుసొమ్ము లటుండఁ దెలిముత్తియంపుసొమ్ములు ధరించి
సొగసు మీఱఁగ వెన్నెలసోగ యంచుఁ, గాంచువారలు భ్రమయ శృంగార మెనయఁబండువెన్నెల నొకయింత భయము లేక, రాధ వెలువడె గోపికానాథుకడకు.
తోరపుగుబ్బ జక్కవలతో వలతోదన నీలజాలముల్తూఱెడివేణిఁజాక చకితోచకితోరు మృగంబులం బొదల్దూఱఁగఁ జేయు చూప రహితో రహితోర్జితగంధకేతకిన్దూరము సేయువాసనలతో నలతోయజగంధి వచ్చుచున్.
ప్రొద్దుముద్దులకూఁతురి యొద్దితోఁటఁ, గన్నెమావులక్రీనీడఁ గలువరాచచలువఱాతిన్నెపై జాజిశయ్యమీఁద, గోపకాంతాసహస్రము ల్గొల్వుసేయ.
ఒక్కతె గుబ్బపై నొరగి యొక్కతె యూరుల నంఘ్రి సాచి వేఱొక్కతె వీడె మీయ మఱియొక్కతె వీవన వీవ బత్తితోనొక్కతె పైఁటఁ జెక్కు చెమరొత్తఁగ లీలరతాంతతాంతుఁడైచొక్కెడు కృష్ణు దూరమునఁ జూచి గిఱక్కున రాధ మర్లుచున్.
నిండారుపండువెన్నెలకాక కోర్వక యెలమావినీడల నిలిచినిలిచికలకలపల్కు చిల్కలపల్కు వినలేక చెవుల నంగుళములు చేర్చిచేర్చిచల్లనితెమ్మెర ల్సైపఁగాఁ జాలక జిలుఁగుఁబయ్యెద చాఁటు చేసిచేసిహృదయంబు భేదించు మదనాశుగములకుఁ దప్పించుకొనలేక తలఁకితలఁకి
ధవవియోగదవాగ్నిచేఁ దాళలేమి, సాహసము షడ్గుణంబంట సహజముగనుగంజపనలోల యగుచుఁ దత్కంజలపన, చూతవనమండలాగ్రంబుఁ జూచునపుడు.
అమ్మమ్మ తెగువ యేటికి, సమ్మతి నీవిభుఁడు వచ్చుఁ జయ్యన ననుచుంగొమ్మపయినుండి కొమ్మ క, రమ్మున నొకచిల్క వాలఁ బ్రమదము మీఱన్.
చిలుకా పక్షము నాపైఁ, గలిగెనె నీకైన ననుచుఁ గరమున నునుఱెక్కలు దువ్వుచు నొకపూఁబొద, జలజాక్షుని దూఱుకొనుచు సతి యున్నంతన్.
అది యెవ్వరే రాధ యౌఁ గదా యిందేల వచ్చెనో హరిఁ బిల్వ వచ్చెనేమొయీవేళ నొంటిగా నింతదూరము వచ్చునా యశోదాదేవి యంపఁబోలుఁగాదుగా యిదియేమొ కలదుపో దోసమే యటువలె నుందురా యంబుజాక్షియెక్కడి దోసమె యెవ్వతె వలవదె వనజనాభుని చక్కఁదనము గనిన
ననుచుఁ జెలులాడఁ జూచి యిట్లాడ నేల, పిలువవచ్చుట నిక్కంబు తెలిసివత్తుమీర లిటు నిల్వుఁడని నిల్పి శౌరి వెడలి, యల్ల పూఁబొదకడఁ బొంచి యాలకింప.
చిలుక శ్రీకృష్ణదేవుండు చిన్ననాఁట, నుంచి నాపయిఁ గడుఁబ్రేమ నుంచి దినముచెలఁగి యెన్నైనఁ జేష్టలు సేయు నకట, యేలలేదాయెనొక్కొ యాహాళి నేఁడు.
వెనుకపాటున వచ్చి వెడఁదకన్నులు మూయుఁ జెలిపేరు చెప్పిన జెలఁగి నవ్వుచెలులెవ్వరైన వచ్చెదరు పోపొమ్మన్నఁ బడుక యిమ్మని కొంగు పట్టి తివియునలతోఁటలోన న న్నలయించి కొనిపోయి విడువక నగుచు నీవిక సడల్పునెడరైనతావున నెదురైన న న్నాఁగిపోనీక వాతెఱతేనె లాను
సిగ్గు ప్రతిబంధమై యంత సేయ నాదు, కోర్కె యీడేఱదయ్యె నీకూర్మి యెంతయరసియుండ్రు యశోదాదు లైనవారు, నెనరుకలిమిని గనిపించుకొనరు గాని.
ఒకనాఁ డొంటిగఁ గేళికాగృహములో నుండంగ శ్రీకృష్ణుఁ డేటికొ నేఁ బోయితిఁ బోయినం జెఱఁగుఁ బట్టెం బట్టినం గొంగు దీ
యకు రావచ్చెద రెవ్వరైననని మల్లాడంగ నావేళ నేలకొ యేతెంచి యశోద చూచి చనె నుల్లాసంబు సంధిల్లఁగన్.
అది మొదలుగ ముదమున నా, సుదతీమణి నామొగంబు చూచిన నగుఁ దానిది యేలనినను నేమో, పెదవి గదలనీక తెలుపుఁ బ్రియసఖతోడన్.
హరిఁ జేరవచ్చుచో నట్టె నేఁజూచినఁ బడఁతులఁ గనుగీఁటి కడకుఁబోవునందుఁ డదేమన్న నవ్వుచు మీకేల పొమ్మంచు నొకవేళఁ బులిమిపుచ్చునొంటిగా నున్నచో నొకలేనిపని చెప్పి కమలలోచనుని చెంగటికిఁ బంపువనిత నీచేఁ గాని వల్లఁడు మాకృష్ణుఁ డనినన్నుఁ బనుపు భోజనము పెట్ట
గంధమైనను విరులైనఁ గాని విడియ, మైనఁ బండైన నాచేతఁ గాని వేఱెయొకరిచే నంప దే నెంత యెడ్డికొనినఁ, బ్రేమ వేఁడు యశోద యదేమొ యెఱుఁగ.
నవ్వుచు మాయశోద యొకనాఁడు విలాసిని యాగృహంబులోఁబువ్వులు దెమ్మటన్న నటఁ బోయెడిచో హరి గుబ్బ లంటరానివ్వలి కేఁగుదెంచిన నదే విరు లేవి యనన్ యశోద నేఁబువ్వులు గాన నం దనిన బోటులు హాస్యము సేసి రయ్యెడన్.
హరి యొకమాపునన్ జలకమై కురులార్పఁగ జీనిజాళువానురటి యొసంగి చేతికి యశోద చనెం దమి నేను వీవ బంగరునునుజెక్కులం జెమట గ్రమ్ముట సాత్వికమౌ టెఱింగి యోగురుకుచ నీ కిఁక న్విసరికొమ్మనె శౌరి దరస్మితంబుగన్.
తిలకము దిద్దుచున్న సుదతిన్నగఁ దిన్నఁగ నీవు దిద్దుమాతిలకిని యమ్ముకుందునకు దిద్దెడిచో భుజమూలకాంతి కన్గొలఁకులఁ జూడ నే నెఱిఁగి గొబ్బునఁ గేలటు వంపఁ దోడితొయ్యలు లది యే మటండ్రు వశమా వినుతింపఁగ వ్రీడ మున్గుచున్.
హరితో నే నొకవేళ నొంటిమయి మాటాడంగ నీళాకృశోదరి తా నత్తఱిఁ బొంచిపొంచి కన నంతన్ శౌరి హు మ్మన్నచోనగుచు న్నే నటు చిన్నదానిపయి నేలా యింతకోపంబనన్దరహాసంబున నెంతలే దను జగన్నాథుండు నాపైఁ దమిన్.
ప్రేమము నిచ్చ నిట్లు వలపించి ననుం గికురించి యిప్పు డీభామలతోడఁ గూడుకొని భావములో నను నెంచఁ డీవిధంబేమని చూచుదాన నిఁక నెవ్వ రెఱుంగుదు రీయధర్మ మాకాముఁ డెఱుంగుఁగాని చిలుకా కలకాలము తన్నె నమ్మితిన్.
అని మంచిది రావలెఁ గద, యని కోపము మీఱఁ నేమొ యనఁబూనినచోనిను నమ్మినాఁడ రాధా, యని హరి కౌఁగిటను జేర నది గని యలుకన్.
పెనఁగి విడిపించుకొనుచు నబ్బిసరుహాక్షి, మంచివాఁడవు పొమ్మంచు మాఱుమొగముసేసికొనియుండ నేమి చేసితిని నేర, మేలనే యల్క యనుచు గోపాలవిభుఁడు.
బారికిన్నెరకాయ బటువుగుబ్బలుమీఁద గోరుంచనీయవే కీరవాణితళుకుబంగారునిద్దాచెక్కుటద్దాలు ముద్దాడనీయవే ముద్దుగుమ్మకండచక్కెరపానకము గుల్కుకెమ్మోవి గంటి సేయఁగనీవె కలువకంటితొలుకాఱుమెఱుగుతోఁ దులదూఁగునెమ్మేను గౌఁగిలింపగనీవె కమలవదన
పైఁటచా టేల చేసెదే పద్మగంధి, మోము దిప్పెదవేలనే మోహనాంగిసారెజంకించె దేటికే సారసాక్షి, యేల మేనోసరించెదే యిగురుఁబోణి.
నాళీకశరుఁడు సుమనో, నాళీకము నేయఁ దాళ నవచంద్రకళాఫాలా చాలా యీలా, గేలా చాలా నలంచ కిఁక నేలఁగదే.
అని వేఁడుచు నేరం బిది, యని మోపక యలుగ నేమి యనియెద నేఁడేచనియెద నని యివలికిరా, వనితామణి పిలువ కేల వచ్చితి వనినన్.
వనజదళాక్షి యెచ్చటికి వచ్చితి పిల్వక ప్రొద్దువోక యేవనమునఁ బాటపాడినను వల్లవకామిను లెల్ల వచ్చిరింతనుచునుఁ జేర నీవునను దారున గన్గొని వారిఁ బాసి క్రన్నన నిటు వచ్చితిం గలదె నాయెడ నేర మొకింతయేనియున్.
అనినఁ జిలుకయుఁ గలికి నీ వపుడు చూచి, మగుడు సాహన మెఱిఁగి నీమగఁడు వేగనన్నుఁ గనుగీఁట వచ్చి క్షణంబులోన, నీతెగువ మాన్పనే యనఁ గృష్ణుఁ డపుడు.
కాక నామీఁద నేరంబు గలిగెనేని, యిదిగొ నామేను నీవేణి యిదిగొ వలయుఁలీల దండించు మంచు గోపాలవిభుఁడు, గీలుజడఁ గేలు కందీయ బాల నగియె.
అంత.
వెన్నుఁడు సంతసించి మనవేడ్కకు వెన్నెల లెస్సగాఁగఁ గ్రేగన్నుల చిన్నినవ్వు దొలఁకం దిలకించుచు సిగ్గులాడు నక్కన్నియ ద్రాక్షచప్పరము కమ్మనిశయ్యకుఁ దార్చియంక సీమ న్నెలకొల్పి ముంగురు లమర్చుచుఁ జెక్కిలి ముద్దులాడుచున్.
మోవి తన కిచ్చి కనుఁగవ మూసికొనిన, బాళిమీఱంగఁ దేనియ గ్రోలి బాలసొగసుకాఁడింత యఱకంటఁ జూచెనేని, మాను మరలంగ మోడ్చిన నానఁ బూను.
చక్కెరమోవి యానినను జన్నులఁ గ్రొన్నెలవంక లుంచినండెక్కులు మించ నొల్లమి నటించఁ బెనంగును నింతెకాని యా
చక్కనిసామి లోఁదొడల చక్కిఁ జుఱుక్కన గోట నొక్కినంజొక్కి మిటారి సొమ్మసిలుఁ జూపు కరంగుట సాటి చెప్పఁగన్.
వలపులు రేచి గోలయని వల్లభుఁ డల్లనఁ గేలిసల్పుచోమెలఁతుక నిబ్బరంపుతమి మించగఁ జేతులు ద్రిప్పికొంచు నచ్చెలువుని మందవేగము హసించుచు వెన్ జఱచెం గరాగ్రసంకలితసువర్ణకంకణము ఘల్లన వల్లవుగుండె జల్లనన్.
గళనాదంబులు దత్తఱించుచును సీతార్కంబు రెట్టింపఁ జెక్కులపై స్వేదము గ్రమ్మ సొమ్మసిలి తళ్కున్ మేను వాల్గన్నుదమ్ములు సోలన్ మృదులోరువు ల్పెనఁచుచుం బూఁబోణి దీనోక్తులంజెలువు న్వేఁడ రతాంతమంత సడలెన్ శ్రీకృష్ణుఁడున్ వేడుకన్.
సురతాంతంబున తాంతయై తరుణి మించు ల్గుల్కుశ్రోణి న్నిజాంబర మొక్కించుక వైచి యొత్తిగిలఁ బ్రేమం గృష్ణుఁ డొయ్యారిబంగరుచెక్కు ల్దనచేలచేఁ దుడిచి సింగారంబు గావించి కప్పురపున్ వీడె మొసంగె నంత నలరెం బూఁబోణి విశ్రాంతయై.
అంత.
తిలిరున్ మోవిని గద్దు లేదనెడు నిద్దాకెంపుచిన్నారి చన్నులపై సన్నపుక్రొన్నెల ల్వెలయ వెన్నుం డిచ్చు కైదండతోఁగలకంఠీతిలకంబు వెల్వెడలి రాఁగాఁ జల్లనై యామునానిలమున్ మెల్లన వచ్చెఁ జెంగలువపూనెత్తావి పైఁజల్లుచున్.
అంతఁ గృష్ణుఁడు రాధాలతాంగిఁ జూచి, కంటె యుత్పలపత్త్రసంక్రాంత మగుచునీనితంబంబువలె మించె నీరజాక్షి, యనుచు యామునసైకతంబున వసించి.
ఒప్పుగా విరులతో నొరగొప్పు ఘటియించి బటువుముత్యాలపాపట యమర్చితావిపన్నీటిచేఁ దడియొత్తి మోమున సొగసుగాఁ గపురంపుచుక్క దీర్చిచిరుగోటితాఁకులఁ జిమచిమల్గొనుచెంప సంది కుంకుమగంధ మందపఱిచిచెక్కుల మకరిక ల్చిత్రించి పాలిండ్లఁ జెదరినహారము ల్చిక్కు దీర్చి
కటిని బురుసాచెఱగుచీరఁ గట్టనిచ్చి, సొంపుమీఱ నెగాదిగఁ జూచి ప్రేమగడలుకొన శౌరి నిలువునఁ గౌఁగిలించి, మోహనాంగిని జెక్కిలి ముద్దుగొనుచు.
చిలుకతో నన్ను దూరుచుఁ జెలువ వెనుక, నలిగి యేమని గడఁగితి వనిన నేమిలేదనియె రాధ యెటువలెఁ గాదు తెలుపు, మనుచు గృష్ణుఁడు వేఁడ సిగ్గున లతాంగి.
వచ్చినయప్పు డేననుచు వాకొని గ్రుక్కగ చాన యేటికోమచ్చిక దెల్పుమంచు హరి మాటికి వేఁడిన నిన్ను బాహులంజెచ్చెరఁ బట్టి క్రిందుపడఁజేసి మదం బణఁగింతు గట్టిగాఁదచ్చెననైనఁ గంతునకుఁ దప్పుదునంచుఁ బ్రతిజ్ఞ పూనితిన్.
అనినన్ రాధ హసింప యింత యలుకా యౌరౌర నామీఁదనైనను నీకోపము తీర్చుకొ మ్మటులనైన నీదుకోపంబు దీర్పనె భావింతు నటంచు వేఁడుకొనుచున్ రాధావధూరత్నమోహనపుంభావకళావిలాసముల నబ్జాక్షుండు హర్షింపఁగన్.
ఆరాధాధరమధురసు, ధారసధారాతిదర్పితస్వాంతమునన్గూరిమి రమణుఁడు దముఁదమిఁ, జేరమి నేరమిగ నచటిచెలియలు కలఁగన్.
ఇదిగో వచ్చెద నంచుఁ బోయి యిది యేమీ రాడు కృష్ణుండు రాగదరే చూతమటంచు నంగనలు రంగద్రత్నమంజీరముల్గదలం గుబ్బల పయ్యెద ల్పొదల సింగారంపుఁగీల్గొప్పులంబొదలం దుమ్మెద లెల్లఁ బూఁబొదల నెమ్మిం బల్మరుం జూచుచున్.
ఒకపొదరింటిలో దలిమ మొక్కటి గాంచి యిదేమి చెల్ల నాయకుఁడు విశేషబంధముల నంగనఁ గూడినపొల్పు దెల్ప రేవికసితజాతిశయ్య కడువేడుక మీఱఁగ రాధఁ గూడి యేడకొ చన నోపు నింక నకటా శకటారిని నమ్మవచ్చునే.
గట్టిగాఁ గీల్జడఁ గట్టివేయక మున్నె మోసపోతిమి గదా ముగుదలారగ్రుచ్చి కౌఁగిటఁ జేర్చుకొని విడువకయుండ నేరమైతిమి గదా నెలఁతలారమనచేలచెఱగు లాతనిచేల ముడిగొల్పఁ దెలియమైతిమి గదా చెలువలారయొకతెపై నొకతె మానక గూడి యలయింప నేరమైతిమి గదా నెలఁతలార
యెవ్వ రెఱుఁగుదు రింతలో నిన్నివగలు, సేయుటలు దక్కెగా యని చెలఁగియుంటిమెంత గృష్ణుని వెతకెద మింత ననుచు, వెతల మతి తల్లడిల్లి యా వ్రేతలెల్ల.
లత పెనంగొను తమాలముఁ జేరి యదె రాధికాకృష్ణు లని చేరి కనుచుఁ గనుచుశారిక కృష్ణకృష్ణ యటన్న నదె కాంత శౌరిఁ బిల్చె నటంచుఁ జనుచుఁ జనుచుఁజాటున బర్హిపింఛముఁజూచి చెలికొప్పు హరియూనుపింఛమో యనుచు ననుచుఁకలరవంబులు వల్క లలనామనోహరఘనగళధ్వనియంచు వినుచువినుచుఁ
దరువుఁ దరువును బొదఁ బొదఁ దెరువు దెరువు, సైకతము సైకతమును సారె సారెయరసి యరసి వ్రజాంగన లందు నందు, మఱియు మఱియును వెదకుచు మమత మెఱయ.
నెమిలిపించెమువాఁడు నెఱి మించు సరి మించు గరమించుకాంచనాంబరమువాఁడువేణునాదమువాఁడు వినుగెంపు నునుగెంపు గనుపింపు కౌస్తుభకాంతివాఁడు
మొగులుచాయలవాఁడు మురిపెంపుఁగరిపెంపుమఱపింపుగతివిభ్రమములవాఁడువెడఁదకన్నులవాఁడు విరిపువ్వు సరిక్రొవ్వు చిఱునవ్వు కెమ్మోవిఁ జిలుకువాఁడు
సారఘనసారచందనచర్చవాఁడు, కాంతతిలకాంతమౌళిభాగంబువాఁడుమారసుకుమారసౌందర్యమహిమవాఁడు, మాధవుఁడు వచ్చెఁ గానరే మల్లెలార.
అని మఱియు నగంబుల ఖగంబుల మృగంబుల నడుగుచు నడుగుచుఁ జుఱుక్కను వెన్నెలబయిళ్ల వల్లభాయల్లకభరంబునం దల్లడిల్లుచు హల్లకీభల్లకృపాణులకు లోఁగి వల్లవపల్లవపాణు లల్లనల్లనం జనిచని.
కందళదిందీవరని, ష్యందితమకరందబిందుసందోహపరిస్పందామందానందా, ళిందమిళిందవ్రజం గళిందజఁ గనుచున్.
యమునా నాయము నాకుఁ గాదనక పద్మాక్షుండు మ మ్మీవనాంతమునన్ స్వాంతమునం దొకింత దయయైనన్ లేకయే డించి సప్రమదుండై ప్రమదంబుతో నరిగెఁ జూపన్ లేవుగాఁ దద్వియోగమునన్ భంగమునందె మాధృతు లనంగప్రౌడి రూఢిం గనన్.
భూరికాఠిన్యమత్కుచంబులను బోలి, యవనిఁ బుట్టంగ నట్టి దోషాప్తివలననబ్జదచక్రాంగకరసంగ మభిలషించి, వగచెదరు మీరు నిట చక్రవాకులార.
అనుచున్ వెదకుచుఁ జనుచో, వనజాప్తసుతానితంబవైఖరి బటువైనునుఁదెలివెన్నెలచెలువుం, దనరిన యొకవిపులపులినతలమధ్యమునన్.
విరవాదిసరులతో వెడఁజాఱుసిగతోడఁ గమ్మకస్తురితిలకంబుతోడమోవిపైఁ దిలకించు మొలకనవ్వులతోడఁ గలితనాసామౌక్తికంబుతోడఁగండమండలచలత్కుండలంబులతోడ రమణీయతారహారములతోడఘనకటీతటబద్ధకనకాంబరముతోడ నవరత్నమయభూషణములతోడ
నిఖిలభువనైకమోహననిరుపమాన, మానితాకారరేఖాసమగ్రగరిమసమరు మన్మథమన్మథుఁ డైనకృష్ణుఁ, డంబుజాక్షులమ్రోలఁ బ్రత్యక్షమయ్యె.
అప్పుడు.
చక్కనివాని బోధనిధిసాధుతపోధనచిత్తవృత్తికింజిక్కనివానిఁ బ్రహ్మశశిశేఖరముఖ్యుల కైన దృక్పథంబెక్కనివాని సంతత్సమేధికభక్తికి కాని యేటికింజొక్కనివాని మానధనచోరుని శౌరినిఁ జూచి కామినుల్.
మనమానధనము దొంగిలి, చనుచోఁ దద్ద్రోహమునను జరణంబులు రాక నిలిచె విడిగోఁ గృష్ణుం, డని యవ్విభుఁ జేర నేఁగి యంగనలెల్లన్.
ఏకుందరదనరా యీకమ్మకెమ్మోవిచిగురాకు నజ్జునజ్జుగను గఱచెనేగుబ్బలాఁడిరా యీవెడందయురంబు గ్రుచ్చుచో గుబ్బల గ్రుమ్మి కమ్మె
నేపద్మపాణిరా యీతేటముద్దుచెక్కుల నెత్తురులు గ్రమ్మ గోరఁ జీరెనేనీలవేణిరా యీతళ్కుమేనంట ఘనవేణిచే వ్రేసెఁ గందువార
నట్టిజగదంటకే గాని యనఁగి పెనఁగి, యుండుదువె నీవు మాబోంట్లయొద్దఁ జేరియనుచు నెకసక్కియములాడువనజముఖులఁ, గాంచి నవ్వుచు గోపికాకాంతుఁ డనియె.
నెలఁతుకలార మి మ్మిచట నిల్పి యటం జనుదేర రాధ చెయ్వుల నెలయించి తావకవియోగము తెల్పిన నల్గిపోయె నామెలఁతుకఁ గూర్చుకోక మనమే విహరించిన రట్టుపుట్టునావెలఁదులు మంచిదంచు హరివెంటను రాధను జేరి నంటునన్.
ననవిల్తుగరడిసాధనకట్టుకంబంబు శుకవాణి ప్రాణనాయకునిమేనుకమలసాయకుపానకపుఁజలివెందర యిగురుఁబోణిరొ జీవితేశుమోవిమకరకేతనునిధర్మంపుగొటారంబు జలజాక్షి విభునివక్షఃస్థలంబువలరాజుపెండ్లిబువ్వపునిందు సంపూర్ణచంద్రాస్య కృష్ణునిజవ్వనంబు
కలికి యటుగాన మనము నాటలకుఁ బెనఁగి, దప్పి దీరంగఁ గ్రోలి ఖేదంబులెల్లవదలఁ బవళించి యనుభవింపుదము గాక, యలుగ నేటికి నన రాధ చెలఁగె నంత.
హరిమధ్యాద్వయమధ్యవీథి హరిమధ్యా శౌరిమధ్యంబునన్హరిమధ్యామణి గల్గుమండలము మధ్యంబొంది యానంది యైమురళీనాద మొనర్చెఁ గృష్ణుఁడు జగన్మోహైకశృంగారభాస్వరత న్గన్గొని యచ్చర ల్సొగయ రాసక్రీడయం దంతటన్.
అలసట మీఱ నొయ్యారంబుగాఁ గేల దుఱుమునఁ దుఱిమినవిరులు రాలవలసి వల్లములుగా వలిగుబ్బచన్నులఁ గదియించు సరిగెపయ్యెదలు జాఱనొకవిలాసము గాఁగఁ జికిలి గోరుల మీటు చెక్కుల జవ్వాజిచెమట దొరుగబడలికపొడమి పైపైనూర్చునూర్పుల కమ్మకస్తురితావి ఘమ్మనంగ
నల్లనల్లన నిడుపాదపల్లవముల, ఘల్లుఘల్లున కీలందెకవలు మొరయఁజెలువుకైదండ గైకొని చెలువు మెఱయ, నంబుజాక్షులు యమునాతటంబు దొరయ.
అతివలవక్త్రము ల్వికసితాబ్జములందును జేర షట్పదప్రతతుల చేర నిమ్ము మధుపానమున న్నిశియౌ టెఱుంగ వద్భుత మిది గాదె వారి కుచము ల్దమజోళ్లనుభ్రాంతి నెంతయున్హితమతిఁ జేరు కోకముల కేమి వివేకము లేకపోయెనే.
అయ్యవసరంబున.
సరిగెమెఱుంగుబంగరపుఁజందురకావిపటంబు లూడ్చి బిత్తరముగఁ జల్వపావడలు దాల్చి బయల్పడుగుబ్బజక్కవ
ల్గరములఁ గప్పుకొంచుఁ గుతుకంబునఁ దోయముఁ జొచ్చి రయ్యెడన్దెఱకువతో మిటారు లొఱదీసిన మారుకటారులో యనన్.
మదవతుల మర్లుకొనఁజేయు మదను మెచ్చి, ముదముతో దోఁ పొసంగిన మురువు దోఁపఁదాళిగోణంబు గట్టి గోపాలమౌళి, చెలులతోఁ గూడి జలకేళి సలుపునపుడు.
అదిగొఁ జూచితె కృష్ణ యరవిందకోశంబుసుదతి యౌనౌను వక్షోజప్రకాశంబుఅవులేర యివి గంటె యలరారె విరిగల్వలవియె నీకన్నులకు ననుఁగుఁజుట్టలు చెల్వపిలుకుబేడిసమీల బిత్తరంబులు గంటెనెలఁత బెళ్కఁగలాదె నీదుచూపులకంటెఎడలేదు నిదురించె నిది చిన్నరాయంచనడికియున్నది నీదునడ కూర కాయంచమెండయ్యెనౌర తుమ్మెదల ఝంకారంబుదండిమన్మథునికోదండఠంకారంబుకడలేని వెతలచేఁ గందెగాఁ గోకంబుపడఁతిఁ గానకయున్నఁ బాయునే శోకంబుసుడిలోనఁ గేలేల చొన్పెదవు గోపాలబెడఁగొల్కు లీలలం బెంపొందు నోబాలకలువపూవుల వ్రేయఁగాఁ గందె నామేనుతలిరాకుఁబోఁడి మెత్తనిదాన వౌనౌనుపూనినను గొంచానఁ బోను పోపో చాలుకాననా మది యేటి కనిపించు నీమేలులోతైన వెఱతు లోలోపలికిఁ దీయకుమునాతోనె యీవగలు ననువింత సేయకుముతలరోరి నీచోరతనము లేటికిఁ గూడుఁతొలుపల్కులకుఁ గదా దూఱెదవు నను నేఁడుతలచూప నెందుఁ బోఁదరము నీ కేవేళకలికి నీచనుగొండకడ నుందు నీవేళపూనుకొని మోరతోపునఁ బోవ బోనీనునేను నీకటిభూమి నిల్తు నేడకుఁ బోను
క్రొవ్వాఁడి నీచేతిగోరఁ జీరఁగ రాకునవ్వెదను నీమేన నాటింతు నా పోకువేఁడెదవు కోపంబు వీడితిని మన్నించిమూఁడులోకంబు లిమ్ముల నేలనా మించితావికుంకుమశోణితహ్రదము చేసితివికావునను నేఁగట్టుగనిమేల దీసితివివనములో విహరించు వాంఛ పుట్టెనె నీకునినసూతిపైఁ బ్రేమ హెచ్చ నట్లనె పోకుబలశాలి వౌదు పైపై నీళ్లు చల్లకుముచెలియ నీయధరమధుసేవవలె మళ్లకుముమగవాండ్ర నింతగా మరులుకొల్పితి వౌరవగలాఁడి నే జక్కవలువఁ గట్టఁగనేరకలికిచెయ్వుల నెన్నిగతుల మించెదొ యింకవెలఁది ధర్మపుత్రోవ విహరింతు నీకింక.
అని పెక్కుతెఱంగుల మర్మగర్భితంబులయి శర్మదంబులగు నర్మోక్తులు వెలయంగఁ గర్మసాక్షికూర్మినందననిర్మలోర్మికలఁ దేలి కుసుమధర్మధర్మసధర్మభ్రూవిలాసపటుభర్మపటునితోడం దటము సేరి యంతట.
బురుసాసీరలు గట్టి జంటఱవిక ల్పొంకించి సంపంగిక్రొవ్విరిదండ ల్నెఱిగొప్పులం దుఱిమి తావి న్మించు గంధంబుఁ గస్తురియున్ గోవజవాది కుంకుమము మెచ్చు ల్గుల్కఁగాఁ బూసి కప్పురపున్ నాభులు దీర్చి సొమ్ము లిడి యంభోజాతపత్రేక్షణల్.
చికిలి సేయించిన చిగురుఖండాజోదుకన్నెగేదంగిచేకత్తు లనఁగఁగందర్పుఁ డాడించు కుందనాటకమునఁ బొల్చు కుందనపుకీల్బొమ్మ లనఁగఁజిలుకతేజీదొర శృంగారవనమున మెలఁగెడికస్తూరిమెకము లనఁగరతిరాజుమణిపంజరము వాసి తమయిచ్చఁ జెలఁగెడు ముద్దురాచిలుక లనఁగఁ
గొలను వెలువడు రాయంచకొదమ లనఁగ, మేఘములఁ బాయు క్రొక్కాఱుమెఱుఁగు లనఁగఁబూర్ణిమాచంద్రకళలనఁ బువ్వుఁబోండ్లు, వెలసి రభినవశృంగారకలనమునను.
ఒక్కతె పూలు చుట్ట మఱియొక్కతె గంద మలంద ముందె వేఱొక్కతె మిన్నసొమ్ము లిడ నొక్కతె బంగరుసాల్వు గట్టఁగాఁజక్కెరవిల్తుకన్న నెఱచక్కఁదనంబుల జాణరాయఁ డమ్మక్క యనంగఁజాలిన యొయారమునం దగె నట్టివేళలన్.
స్వామి పరాకు హెచ్చరికంచుఁ గొందఱు పంకజాక్షులు బరాబరులు సేయఁగీలుకంకణముల కేలెత్తి కొందఱు మోహనాంగులు కొల్వు మ్రొక్కు లిడఁగఁదంబుఱ మీటి కొందఱు కుందరదనలు తనమీఁదిపదములు వినికి సేయఘనగోపికామానధనహారి యనుచుఁ గొందఱు చెలు ల్బిరుదపద్యములు చదువఁ
గొమలుకొందఱు దగ నూడిగములు సేయ, భవ్యయామునసైకతభద్రపీఠిరాధ నంకంబు నుంచి రా రాజసమునఁ, బెద్దకొలువుండె గోపాలభిదురపాణి.
తొడపై నుంచిన రాధికామణియు నెంతోవేడ్కతోఁ గప్రపున్మడుపు ల్పల్మొన నొక్కి తా నొసఁగఁ బల్మాఱు న్విలాసంబు గన్పడఁగా నందుచు మోవి నొక్కుచును బైపైఁ బొంగు పాలిండ్లఁ గేలిడుచుం జెక్కిలి ముద్దుగొంచు నలరెం గృష్ణుండు లీలాగతిన్.
తరలాక్షి యొకతె చేసురటి నడ్డము సేసి బోటినొక్కతె కన్ను గీఁటికొనియెసిగ్గులే యేమి చూచెదమంచు నొకలేమ భామనొక్కతెను జేపట్టి దిగిచెసుదతి యొక్కతె యట్టె చూచి జంకెన బొమ్మముడితో నుచుక్కని మోము త్రిప్పెనెఱుఁగవా యిందు రా యిఁక నంచు నొకకల్కి చిలుకపై నిడి యట్టె కెలయసాగె
మఱియుఁ దగునీరసంబున మగువ లెల్ల, గుసగుసలఁబోవ వారలకోర్కి నెఱిఁగియందఱకు నన్నిరూపుల నతులగతుల, రతుల నలయించె గోపికారమణుఁ డపుడు.
వలిచనుగుబ్బ లూఁతగొని వాతెఱ గ్రోలుచు నెత్తి కౌఁగిటన్మెలఁవుచుఁ గొంతసేపు తమిమించఁగఁ గేళి ఘటించి తెచ్చుకోలలయిక నూరకున్న జలజాక్షునిచిత్త మెఱింగి గోపికల్చెలఁగుచుఁ దాము పైకొనిరి చెల్వుఁడ చిక్కితి వంచు నవ్వుచున్.
కలగళధ్వనులతో ఖగకులంబులు, మ్రోసెఁ గ్రమ్ము నిట్టూర్పుతో గాడ్పు విసరెఁదెగుముత్తెసరులతోఁ దెరలెఁ దారావళి చెదరుముంగురులతో మెదలెఁ దేంట్లుకులుకుగుబ్బలతోడఁ జెలరేఁగె జక్కన ల్వీడువేనలితోడ వీడెఁ దమమునెమ్మోము చెమటతోఁ గ్రమ్మెఁ దమ్మిని తేనెసొగయుగన్నులతోడఁ దొగల మునిఁగె
నింక మీమీగృహంబుల కేఁగవలదె, యనుచు రత్యంతమున గృష్ణుఁ డాదరమునఁబలికినను విన్ననౌ గోపికలముఖాబ్జ, తల్లజంబులతోఁ దూర్పు తెల్లనయ్యె.
అంత వారల మక్కువ నక్కుఁ జేర్చి, యిందుముఖులార యీవేళ నిండ్ల కేగుఁడటులనయ్యెడు రాత్రులయందు ననుచు, నమ్మిక లొసంగి హరి పంప నలినముఖులు.
వెన్నుఁ గనుగొని కనుఁగొని విడిచిపోవ, లేక తమి మీఱఁగాఁ గౌఁగిలించికొనుచురేయి రమ్మని వేఁడుచు వేయువగల, మఱలి రొకభంగి గోపికామానవతులు.
అంఘ్రులు ఘలుఘల్లుమనఁగఁ గీలూడ్చి వైచినరత్నఖచితమంజీరములునుహొయలుగాఁ గొప్పుల పయిపయిఁ జరుపుచో జాఱిన కమ్మగొజ్జంగివిరులు
త్వరఁగొన్ని ద్రెవ్విన దగఁ గ్రువ్వగా లేక యట్టెవేసిన తారహారములునుఘణిఘణిల్లన మ్రోయఁగా విసర్జించిన చిఱుగంటమొలనూలిసరిపెణలును
మరలి త్రోవలఁగంచు విస్మయముతోడ, నాదునిలు వెళ్ళినంజాలు ననుచు వెడలినట్టిరమణులు రమణు లేమండ్రొ యను భ,యమున నిజగేహములు సేరి రవనినాథ.
కొమిరె చందురుకావి టెక్కెములలీల, నమరె నరుణోదయద్యుతు ల్కమలనాభురథమువలెఁ దోఁచె రవియంత రశ్మిగణము, లలమ ద్విజసంఘములకలకలము లెసఁగ.
తళుకుంగన్నులకెంపు కెంపు జిగినిద్దామోవి బల్ గెంపు చన్నులపై గ్రొన్నెలసొంపు సొంపు గనియున్ నోరెత్తఁగాఁజాల కతలు మామ ల్మగలున్ లతాంగుల యశోదాపుత్రుఁ డెన్నేనిమాయలు గావించెనొ కాని కాక యిటు సేయంబూనునే దాసులన్.
అంత శంఖజూటవృషభాసురకేశిహంతకడ కొకనాఁడు నారదుం డరుగుదెంచిసత్కృతుండై యిట్లని నుతించె.
శ్రీవసుదేవపుత్ర సరసీరుహనేత్ర సువర్ణనేత్ర బృందావనమిత్ర ప్రత్యహవినస్యదమిత్ర హితాబ్జమిత్ర సంభావితగోత్ర వేత్రపరిపాలిత గోత్రకరాంత గోత్రతారావగగోత్రకృష్ణ యదురాజశిఖామణి నిన్నుఁ గొల్చెదన్.
అని ప్రశంసించి భావికార్యవృత్తాంతంబు దెలిపి చనె నంత జిఘాంసాకంసప్రహితుండై విప్రహితుండగు నక్రూరుఁడును రేపల్లెకు నరుగుదెంచి వల్లవీవల్లభుపాదంబులకుఁ బ్రణమిల్లి యిట్లని నుతించె.
జయజయ కృష్ణకృష్ణ ఘనసన్నిభవిగ్రహ విగ్రహక్షమాజయజయ దేవదేవ జలజాతరవిక్రమ విక్రమస్పృహాజయజయ శౌరిశౌరి వరసంవృతమార్గణ మార్గణప్రియాజయజయ చక్రిచక్రి వరసంభృతగోపక గోపకల్పనా.
అని యక్రూరుం డభినందించిన నందనందనుఁ డానందించి నందయశోదానుమతుండై రాధాదిగోపికల నూఱడించి బలరామాక్రూరసమేతుండై మధురాపురంబున కేఁగునెడ.
భువనవ్యాపకుఁ డగుమా, ధవుఁ డప్పుడు చూపె భక్తతమునకు యమునాభువనంబున మృదుతాజిత, భవితాఖలనీలమూర్తి ప్రత్యఙ్మూర్తిన్.
అక్రూరుని వెంబడిగాఁ, జక్రాయుధుఁ డేఁగుదెంచి సహితాగ్రజుఁడైచక్రాది దివిజగేహస, మక్రమ మణిధామమధుర మధురకు నంతన్.
రజకునిఁ గొట్టి వస్త్రములు గట్టకయున్న దనకు లేదాయెనే కనకపటమువెస సుదాముఁ డొసంగు విరులు దాల్పకయున్న వక్షఃస్థలిని లేదె వైజయంతికుబ్జచేకలపంబు గొనకున్న నిందిరాకుచకుంభఘుసృణంబు కొదవె తనకునంధకారాతివి ల్లపహరింపకయున్న నరయమే మును రాముఁ డనుచుఁ దన్నుఁ
గరివరదుఁ డయ్యుఁ జెల్లునే కరి వధింప, భువనపతి యయ్యుఁ జెట్లతోఁ బోరవలెనెహరికి నిదియు వినోదంబు లయ్యెనేమొ, యనుచుఁ దోవచ్చు నక్రూరుఁ డనఁగ శౌరి.
చనువున బలిమిం దగఁ గై, కొనఁదగుఁ గద మేనమామ కూఁతురి నిఁకఁ గంసుని జంపి జయరమాక, న్యను వరియించెన్ ముకుందుఁ డందఱు మెచ్చన్.
ఆశింపఁడయ్యెఁ గంస, శ్రీసర్వంబునకు నుగ్రసేనునిఁ బతిఁగాఁజేసెం బరమానందము, చేసేం దలిదండ్రులకును శ్రీహరి యంతన్.
గొల్లయిల్లాండ్ర మానంబుఁ గొల్లలాడి, నట్టికల్లరి బ్రహ్మచర్యంబుఁ బూనెవెనుకటికెగాని యిటువంటివిద్య లేదు, వెనుక నొకనాఁడు కుబ్జఁగూడినదె గాని.
గురుసుతునిఁ దెచ్చుకొఱకై, యరిగిన శంఖంబు దొరకె హరికిం దద్దుష్కరకార్యకార్యఘటనము, దొరకిన సత్కీర్తిమూర్తితోఁ దగె ననగన్.
అంత.
నలువంకఁ దగుకాంచనముల పూమొగ్గలు ప్రజ్వలస్తంభదీపములు గాఁగఁపొన్న క్రొన్ననకమ్మపుప్పొడిదిన్నెయ డంబు మీఱిన దాడిమంబు గాఁగఁదళుకుకెందలిరుటాకులగుంపు లందందఁ జఱచుహరిద్రహస్తములు గాఁగఁగలకలకంఠికాకలకంఠకలనంబు లల్లొనేరెడిపాట యనువు చాటఁ
బ్రేమ మీఱంగ లతకూనపేరటాండ్రు, కొమరు క్రొవ్విరివెండిపళ్లెములఁ దేఁటియలఁతి జిమ్మిలివాయన మందుకొనఁగఁ, బ్రథమఋతు వయ్యె వనలక్ష్మి ప్రాభవమున.
అట్టివాసంతవేళ నుద్యానమునను, మక్కువఁ జరించుచు మురారి యొక్కనాఁడుచెలిమి మీఱంగ నుద్ధవుఁ జేరఁబిలిచి, పలికెఁ గెమ్మోవి చిఱునవ్వు మొలకలెత్త.
అక్కట నన్నుఁ బాసి క్షణమైన సహింపఁగలేరు గోపికల్చక్కెరబొమ్మ లేకరణి సైఁచిరొ యిన్నిదినంబు లందు లోమిక్కిలి రాధ యీయెడను మేను భరించుట దుర్లభంబు నీవక్కడి కేఁగి కృష్ణుఁ డిదె వచ్చె నటంచు వచింపు ముద్ధవా.
అత్తల మామలన్ మగల నన్నలఁ దమ్ములఁ దల్లిదండ్రులంజిత్తులదుద్దువెట్టుచును జీటికిమాటికి నన్నె చేరఁగావత్తురు మేలుకజ్జములు వంతుల కిత్తురు నిండుఁగౌఁగిటంగ్రుత్తురు మారుకేళికను గూడుచు మెత్తురు మత్తచిత్తలై.
ఏ నక్రూరుని వెంట వచ్చునపు డట్టే నన్ను వీక్షించి నేఁడైన న్నిల్వు మటంచుఁ గన్నుఁగొనలం బ్రార్థించినం గూడదం
టేనెమ్మోములు వంచి యుస్సురనుచు న్నేత్రాంబువర్షంబులన్నానంజేసిరి పైఁట లచ్చెలులు మానన్ నేర్చునే యుద్ధవా.
ఎన్నఁడు గారవింతునొకొ యే నిఁక నిచ్చటనుండి వచ్చినంగన్నెలు గౌఁగిలించి ముఖకంజము లక్కునఁ జేర్చిమక్కువంగన్నుల బాష్పము ల్దొరుఁగ గద్గదికోక్తుల నన్ను దూఱినందిన్ననిమాటలం గలఁక దేర్చుచు వేడుక నోలలాడుచున్.
చొక్కమై యరగంటఁ జూడఁగా నేర్చిన నప్సరస్త్రీలనీ డనఁగవచ్చునడకువ తిన్నగా నడుగిడ నేర్చిన నాగకన్యలనీ డనంగవచ్చునెలవంటిముద్దుమోములు గల్గెనేని గంధర్వకాంతలనీ డనంగవచ్చుమెఱుఁగుఁదీఁగెలవంటి మేనులూనినను గిన్నరకామినులనీ డనంగవచ్చు
నితరమానవకాంతలనీ డనంగ, రాదు కల్లలు గాదు నీమీఁదియానకంతుప్రతిసృష్టి యేమొ యీకంజముఖులు, బ్రహ్మసృష్టిని గాన మాపాటివారి.
చుక్కలలోపల మిక్కిలి, చొక్కంబగు చంద్రరేఖ సోయగమున నాచక్కెరబొమ్మల మించిన, చక్కఁదనంబునను రాధ సన్నుతి కెక్కెన్.
సొలపు మీఱఁగ నోరచూపులు చూచెనా వలరాచజాలరి వలలు వెదకుమొలకనవ్వులు గుల్కుమొగ మింత యెత్తెనా ఘనచకోరముల యాఁకండ్లు దీరుముద్దుమాటాడి కెమ్మోవి గదల్చైనా కలకలధ్వనులఁ గోయిలలు చేరునొయ్యారమునఁ జిల్గుపయ్యెద జార్చెనా కుంభిరాజములు ఢీకొన గడంగు
నాచపలమీనలోచన నామృగాంక, వదన నాపల్లవోష్ఠి నామదగజేంద్రకుంభజృంభితవక్షోజకుంభ రాధ, నభినుతింపంగ శక్యమే యజునికైన.
మగువ నెఱికప్పుగొప్పు నమాస యనుచుఁ, బొలఁతి నెమ్మోముఁ గన్గొని పున్న మనుచుబ్రమసియుండుట సంతసపర్వ మయ్యెఁ, గలదె యిటువంటివింత లోకంబునందు.
ఇంటివార లొకించుక యెఱుఁగనీయ, రాదనుచు సంచరింతుము రాధ నేనునాభయము సంభ్రమముఁ జేయు నవని పాన, కంబులోపలిమిరియపుకార మట్లు.
ఒకగుబ్బ నాప్రక్క నొరయ మూఁపునఁ గేలి నిడు నుత్సవముల సందడులయందుజాతరలో నున్న సన్న సేయుచు లేనిపనులఁ బెట్టుక వచ్చు భవనమునకుసంకేత మొనరించు సంధ్యవేళను దానె వెదకుచో టిది యంచు వేడ్కమీఱనడురేయి నిద్రించు నను లేపికొనిపోవు వేగ యామునతీరవిపినమునకుఁ
బాటఁ బాడిన నామీఁదఁ బాట బాడు, మించు పాలిండ్లయందు నే నుంచునట్టిపచ్ఛిగోరులు పయ్యెదవిచ్చినిచ్చి, పెరిఁగి లేచిన గను రాధ వింతవగల.
కలకంఠు ల్వలిగుబ్బజంట నెలవంక ల్వేఁడ నేమేనియుంబలుకన్నేరక రాధ నీళ్లు నమలున్ బంతిన్ యశోదాంగనాతిలకం బేమిటి మాట తాఁకినవి యింతే కేతకీకంటకంబులు బొమ్మం చదలింప నట్లయను నప్పూఁబోణి లేనవ్వునన్.
ఆనాఁటి వినోదము లె, న్నైనం గలవైన నెన్న నాకలుగునొకోయానారీపరిరంభం, బేనాఁటికినైన వచ్చు నిదె హరి యనుమీ.
అని పంప నుద్ధవుఁడు చని, వనితలతో మాటలాడి వచ్చి లతాంగుల్వినిపింపుమనినమాటలు, తనతోఁ దెల్పిన మురారి దరహాసమునన్.
ఏమనిరోయి యుద్ధవ మృగేక్షణ లామధురాపురంబులోఁబ్రేమను వన్నె వెట్టి వలపింపఁగ నాయకురాండ్రు గల్గ మామోములఁ జూచునే యిఁకను ముచ్చటగా నని బలాబలాయేమిటిమాట నామనసొకింత యెఱుంగరుగా వ్రజాంగనల్.
ఎప్పుడు వచ్చునంచుఁ తమి హెచ్చగ నొక్కెడఁ గాచియున్నచోఁగొప్పరవీడ గబ్బిచనుగుబ్బల పయ్యెద జాఱ సంభ్రమంబుప్పతిలంగఁ జేర ముద మొప్పఁగ వచ్చియుఁ గౌఁగిలించుచోనప్పటిసౌఖ్యమింత గలదా వెలబోటులయందు నెయ్యెడన్.
అనిన న్నవ్వుచు నుద్ధవుండు కమలాక్షా ముగ్ధజారాంగనాజనసంగం బిది యెంత మన్మథకళాశాస్త్రైకపారీణలైవినయోక్తు ల్ఘనరక్తులు న్వెలయఁగా వేయాఱుబంధంబులంబెనఁగంజాలిన ప్రౌఢవారసతులం బేర్కొన్నచో నావుడున్.
ఐనం జూతమటంచు నున్నయెడ నబ్జాక్షానుకూలంబుగాభానుం డస్తనగంబుఁ జేరఁజనుచోఁ బ్రాగద్రికూటంబునన్శ్రీనాథప్రియకారియై పొడమె రాజీవారి తచ్చంద్రికాశ్రీనైపుణ్యము మించెఁ జోరజనరాజీవారియై యయ్యెడన్.
తళుకుసంపఁగిమొగ్గతాయెతు ల్మెఱయంగ నరవిరివిరజాజిసరులు చుట్టితీరుగాఁ గస్తూరితిలకంబు దీరిచి మేలిమిబురుసారుమాల గట్టిమురువైన హురుమంజిమురువుతోఁ గట్టాణి ఘనమైనగొప్పచౌకట్లు దాల్చితావికుంకుమపుగంధముపట్టె యురమున రాణించు తారహారములు వైచి
వలిపెచెంగావిదుప్పటివల్లెవాటు, నేలజీరాడ గిలుకుపావాలు మెట్టిచికిలుసానాకరంబునఁ జెలువు గులుక, నగధరుం డొంటిగాఁ దననగరు వెడలె.
వెంట నరుదెంచు నడప వాల్గంటిచేతి, యుదిరియడపంబు గైకొని యుద్ధవుండుకెలసఁ జనుదేర పరిజనంబులను బనిచి, కమలనేత్రుఁడు నగరమార్గమునఁ జనుచు.
విటవిటీసల్లాపవికవికహాసము ల్గళనాదసహకారికలరవములుఁబురుషాయితాంగనాపరిహాసవచనము ల్చటులకచాకర్షసంభ్రమములుఁదతహృత్కళాదిభేదనముష్టిఘాతము ల్మోదకల్పితశుష్కరోదనములుఁగోపనానూపురకోలాహలంబులుఁ గఠినరతాసహాక్రందనములుఁ
బ్రథమరత్యంతకామినీప్రార్థమాన, సరసశృంగారపదపద్యసంభ్రమములువేణువీణావినోదము ల్వినుచు వేశ్య, వాటిలో వాసుదేవుండు వచ్చునపుడు.
చకితనేత్రలు దమతమసంభ్రమములు, వదలి కృష్ణునిఁ జూడఁగా వచ్చిరపుడుఏమియాశ్చర్య మాతని నెప్పుడెపుడు, గాంతుమని యున్నవారలు గారె వారు.
విడువిడురా యని విటునిచెక్కిలి గొట్టి తనమోవి విడిపించికొని యొకర్తువిటుఁడు పయ్యెదఁ బట్టి విడమిఁ గుచ్చెలలెల్లఁ జనఁ బోఁకముడి బట్టుకొని యొకర్తువసగాదు వలపు రావలెనంచుఁ గినుకతో నధిపుకౌఁగిలి విడనా డొకర్తురతిమధ్యమున లేచి రమణుదుప్పటి చీర యనుచు నట్టిటుఁ జుట్టుకొని యొకర్తు
కేళిసదనంబు నందుండి జాలకముల,, గాంచి రితరులు ద్వారభాగములఁ గడచికెలనఁ జేరియు నేఁడి శ్రీకృష్ణుఁ డనుచుఁ, జెలులు వేఁడిరి తమకంబు కొలఁది మిగుల.
కనుఁగొని కృష్ణుఁ గామినులు కంతునిబారికిఁ జిక్కి చొక్కుచుంగొనకొని యేమి నోఁచిరో గోపిక లోపికమీఱ నిట్టి దేవుని మనసార నిద్దపుగవుంగిట నుంచఁగ నిప్పు డేమిటారిని గరుణించి వచ్చెనొకొ ప్రేమ నటంచును జూచుచుండఁగన్.
కలికిమిటారికత్తె నయగారచొకారపుమేలుబంతి కన్నెలతలమిన్న బంగరపునిగ్గు మనోభవురాజ్యలక్ష్మి నాఁగల యొకకాంత మాధవునిఁ గన్గొని మోహరసైకలోలయైతొలఁకెడువేడ్కతో హరిని దోడుక రమ్మని తల్లిఁ బంపినన్.
కప్పువేసిన వెండ్రుకలగొప్పసవరంబు సవరించి పెట్టినజాఱుకొప్పుదురుసుగాఁ బైకెగఁద్రోసికట్టినవాలుఁజనుదోయి బిగిచూపుజంటఱవికమిసిమిపైపూఁత క్రొమ్మెఱుఁగునెమ్మోమున సొగనుగా నిడిన కస్తూరిబొట్టుజిగిదక్కి స్రుక్కిన చెక్కిలికుబ్బుగా దాపిన కపురనెత్తావివిడెము
వడియు నెమ్మేని కొకవింతబెడఁగు నెఱపు, సరిగెచెంగావిపావడ చలువవలువచెలువు గులుకంగఁ జెలువు చెంగలువబంతి, హరికిఁ గానుక యొసఁగి లోలాంబుజాక్షి.
కేలెత్తి మ్రొక్కుతఱి భుజ, మూలనఖక్షతులు చెలఁగు మురువున మోముంగీలుకొనగంటివడువున్, మేలిమి దెలుపంగ హరికి మెలఁతుక పలికెన్.
దేవరకు గంధ మొసఁగిన పూవుఁబోఁడి, వక్కలాకులు గైకొని వత్తురనుచునింటికై తోడితెమ్మనె నిపుడటన్న, నౌనె యాకుబ్జగేహమా యనుచు శౌరి.
అనుటయుఁ గుబ్జానామం, బునకుంబనిలేదు స్వామిపుణ్యంబునఁ జక్కనిదయ్యె నియ్యడను నే, ననరా దీవాడఁ గలరె యాపాటిచెలుల్.
అనిన నీకేల సంకోచ మంబుజాక్షి, కంతుసింగాణిమువ్వంక గాదె మెఱుపుపలుదెఱంగుల మెఱయదే పద్మముఖికి, మునుపు కొదవేమి యనుచు నమ్ముదితఁ గనుచు.
నీరజాననముద్దునెమ్మోముచెలువంబు గనుఁగొన్నఁ బద్మిని యనుచుఁ దోఁచెకంబుకంధరకంఠకంబుసౌందర్యంబు గనుఁగొన్న శంఖిని యనుచుఁ దోఁచెహస్తీంద్రనిభయాన యానశృంగారంబు గనుఁగొన్న హస్తిని యనుచుఁ దోఁచెనీమనస్వినికి నాపై మది గల్గుట గనుఁగొన్నఁ జిత్తిని యనుచుఁ దోఁచె
జాతి యెయ్యది యొక్కొ యీనాతి కనిన, మాధవున కేల జాతిసంబంధ మనుచునుద్ధవుఁడు వల్క నవ్వుచు నుద్ధవమున, నద్ధవుఁడు సేరఁగావచ్చునవసరమున.
పొదిగిట నిల్చిచూచు విరిఁబోడి ముదం బెదఁ బిక్కటిల్లఁగానెదురుగ వచ్చి తోన చెలులిచ్చిన కమ్మనితావినీటఁ దత్పదజలజాతము ల్గడగి పయ్యెదచేఁ దడియొత్తి యింపుసొంపొదవగఁ గేలొసంగి వినయోక్తులఁ దేనియ లొల్కఁ బల్కుచున్.
గోపికారమణులఁ గూడుక క్రీడించు శ్రీకృష్ణు వ్రాసినచిత్తరువులుసకినెలతలగడ ల్చప్పుడైనను దోన కివకివల్గొణుగుపారువపుజోళ్లుకమ్మక్రొవ్విరిమేలుకట్లకుఁ దేఁటులై తిలకించు సాంబ్రాణిధూపములునుబదివన్నె దివ్వెకంబమున మాణిక్యంబు లీల నెంతయుఁ బ్రజ్వలించుదివ్వె
గలిగి విలసిల్లు కేళికాగారమునను, జాళువాకోళ్ళపట్టెమంచంబునందుధవుని వసియింపఁ బంచి యుద్ధవునిజెంతఁ, బసిఁడిగద్దియ నుండె నప్పద్మగంధి.
వక్కలాకులు విరు లొక్క వరుససొమ్ము, ఱవికెపావడ జంట చెఱంగుచీరయుద్ధవుఁ డొసంగ వింత సేయుదురె యంచుఁ, జెలువజనని ప్రియోక్తులు పలుకుచుండ.
సదనమున కేఁగి పన్నీట జలకమాడి, హరువు మీఱంగఁ గైసేసి యారగించిలలితమన్మథసామ్రాజ్యలక్ష్మి పోలి, వచ్చి నిలుచున్న చెలిచెలువంబుఁ గాంచి.
శశిసహస్రకళాప్రసన్నుఁడై యుండెనా చెలిమోముతో సాటి చేయవచ్చుజలజపత్రములు చేరల కెక్కుడుండెనా పొలఁతికన్నుల సరిఁబోల్పవచ్చుఁబదియేడువన్నెలబంగారు గల్గెనా కలికిమేనికిఁ బ్రతిఁ బలుకవచ్చుఁగనకాద్రి కింక నొక్కటి జోడు గల్గెనా వనితగుబ్బల కెన యనఁగవచ్చు
ననుచుఁ బొగడుచుఁ దలయూఁచి హరి వయస్య, మోముఁ జూఁచిన యంతట స్వామికరుణయట్టిదే కాదె యాశ్చర్యమా యటన్న, మంచిమాటంటివని వేశ్యమాత యపుడు.
కామినీమణి చిన్నది యేమి యెఱుఁగ, దెటుల మతి సెప్పి సేవ సేయించుకొనఁగవలెనొ మీచిత్త మనుచు నచ్చెలువచేత, విడియమిప్పింపఁ గైకొని వెన్నుఁ డపుడు.
గందవొడి వక్కలాకులు, నందుక నుద్ధవుఁడు వారిజాక్షులు సన గోవిందుఁడు గాంభీర్యంబున, ముందుగఁ దను జెనకకున్న మోహము మీఱన్.
మడుపు సాలుటయును మదిరాక్షిసకినెలు గులుకుమంచముమీదఁ గూరుచుండిచిఱునవ్వుమోమునఁ జెలువుని పాదపల్లవములు కోమలోరువుల నుంచితలిరులు పెనఁగొను చెలువున నొత్తుచు గిలిగింతగొనఁగఁ గెంగేలు దొడలసోఁకించుచును గోటి సుదలంటఁ బిసుకుచుఁ గరకంకణంబులు ఘల్లుఘల్లు
మనఁగఁ జిటపొట గ్రుద్దుచు నంగుళంబు, లోయ్య నెటికలు దివుచుచు నెయ్యముననుగన్నుఁగవ నొత్తుచును గబ్బిచన్నుఁగవను, జేర్చుకొంచుఁ బదాబ్జసంసేవ చేసి.
పలుకవదేమి సామి యొకపాటివధూటిని నీవు మెత్తువేచెలువము గుల్కు రాధవలెఁ జిత్తము రంజిల సేవ సేయఁగాఁగలిగినకాంతఁ జేకుఱిన గా కిపు డాపెఁ దలంచుకొంటివోపులకలు నిండెనంచు విరిబోణి ముదంబునఁ బక్కఁ జేరుచున్.
ఏదేది సామి నామీఁదిప్రేమకు గుఱు తనుచుఁ బుక్కిటివీడియంబుఁ గొనుచునవు మంచివగలకాఁడవె నీవు చేనందుకొన వంచు విడెము పల్కొన నొసఁగుచువిడువరా మడుపుసందడి మోవి నేల నొక్కెదవంచుఁ గినిసి జంకించుకొనుచుమొదటనే నునుబోఁకముడికిఁ బెనంగెదు వసగాదొ తమియంచు మసలుకొనుచు
నెంతదడ వూరకుండఁగా నేమియెఱుఁగ, వేమొ యనియుంటి నీవేల యెఱుఁగ వింతనాఁడె వ్రేపల్లెసతులమానములు గొన్న, చతురుఁడవు గావె యన నగి శౌరి పలికె.
చెలి యాభీరుల నెన్న నేల యిదె యక్షీణప్రతాపంబుతోనలరు న్నేజవజీరుపోరునను బోరాడంగ నీకే తగుందొలుతన్ రాధకుఁ జెల్లు నన్నఁ గినుకన్ లోలాక్షి దేవాంగనాతిలకం బేయది యంచు మార్మొగము గా ధీరుండు లేనవ్వునన్.
వనితరొ కోప మేమిటికి వల్లవకాంతలలోన జాణయౌనని యలరాధఁ బేర్కొనుట యంతియె నీసరియైనఁ జేసినం
గినుకను నేర్పుసూపుటలు గేలిగదా యని వేఁడి నిక్కమౌనని మరుఁ డెచ్చరింప ఘనమౌ తమి మన్మథయుద్ధలోల యై.
అంగనకనుబొమ సింగాణి యెక్కిడి పొరిఁబొరిఁజూపుఁ దూపులు నిగుడ్పఁబతివానిలక్షణ ప్రత్యస్త్రములఁ ద్రిప్పి నిఖిలాంగకంబుల నిగుడఁజేయనభిమంత్రితంబులై యవి వశీకరములై కుచకుంభమధ్యంబుఁ గ్రుచ్చునపుడుకుంకుమఘర్మపుక్రొన్నెత్తు రందంద యలరంగఁ గళపట్టినట్టు సొగయ
నలుక బలమేడకోఁజన నటపటాగ్ర, కలితకేతువు వాల్చ లోకట్టు సెదరిబట్టబయలయ్యె రణమహీభాగ మంతఁ, గాంతలోనయ్యెనని శౌరి కౌతుకమున.
స్తనకుంభికుంభయుగము జ, ఘనఘనచక్రంబు నఖముఖక్షతములు గానొనరిచి బాహాయుద్ధం, బునఁ బెనఁగుచుఁ గ్రిందుపఱిచి పోరఁగ నంతన్.
పొలఁతుక క్రిందుమీఁదగుచు భూషణతూర్యనినాద మొప్పఁగాకొలకనకోళ్లు లావుకలు కోకిలము ల్కలహంసము ల్శిఖావళములు బారువాలు నలువంకఁ బ్రతిధ్వను లీయలీయమైగళరవము ల్ఘటించె రతికాంతరణాంతరశంఖభంకృతిన్.
అంగంబు లపు డేకమయ్యెనో నా గట్టిగా బాహులతలచేఁ గట్టికట్టిమొనలు ఱొమ్మున నాటి వెనుచక్కి వెడలఁగాఁ గోడెగుబ్బల ఱొమ్ము గ్రుమ్మి కుమ్మియలుకలు కబళించి యధరాధరము పంటఁ జిక్కించికొని గంటి చేసి చేసిమొనగోర నిజబాహుమూలము ల్కంఠంబు చిన్నారిచెక్కులుఁ జించిచించి
యతనుసమరంబు సేయు నయ్యతివ క్రిందు, పఱిచె హరి యంత నంతలోఁ బద్మముఖియుమరలి పైకొనె మొలనూలి చిఱుతగంట, మ్రోఁతచే డిండిమధ్వని బ్రోదిసేయ.
కుంచితపాదయై తివురుకోవులు మీఱఁగ ధూర్తకృష్ణునిన్వంచనచేసి క్రిందు పడవైచితి నింకిట నీమదం బడంగించకపోదునే యనుచుఁ గేరడము ల్పచరించు చెక్కు దాటించుఁ గురు ల్గ్రహించు నెఱటెక్కున వాతెఱ గ్రోలు వ్రాలుచున్.
అంత నొక్కింత బడలి పద్మాయతాక్షి, స్వామిచెంగట నే పౌరుషంబు నెఱపనెంతదాన నటంచు శయించి చిత్ర, రతులఁ దేలించెఁ జౌశీతిగతుల శౌరి.
అప్పుడు.
ఏదేది నాసామి యిది వింత యౌనంటి వని గళధ్వని మెచ్చుకొనెడి సొలపుఔర నాప్రాణనాయక యేలితివి మేలు మేలని రతిశక్తి మెచ్చుమెలఁపునయ్యలూ నీదాసి నయ్యెదరా పాయకుర యంచుఁ దమి రేగి కొసరువలపుబడలితివేమొ నా పంచదారలమోవి యిందరా యని తేనె లిచ్చుతలఁపు
నలసినా నింక విడవరా యనుచుసొక్కి, మోడ్పుకన్నులఁ గెంగేల మ్రొక్కు నలపుబతిని గరఁగించెఁ బతికేళి సతిని గరఁచె, నిరువురును గేళివిశ్రాంతిఁ బొరసిరంత.
సరసాలాపములన్ వినోదగతులన్ సంగీతసాహిత్యవైఖరులన్ ద్యూతకళావిలాసముల శృంగారప్రసంగంబులన్స్మరశాస్త్రార్థవివేచనంబులను శశ్వద్ద్వంద్వవైచిత్రులన్హరికిన్ వేడుక సేసె నిద్రపయి నీర్ఘ్యం గాంత రేయంతటన్.
అంత.
కలకలపక్షులు బలుకఁగ, జలజాక్షుఁడు విస్మయమున సఖియరొ యపుడేతెలవాఱెనె యొకనిమిషము, వలెఁ దోఁచెన్ నీవిలాసవైఖరివలనన్.
నెఱజాణవు నిను మెచ్చితి, వరమిచ్చితి వేఁడుమనిన వనిత దినము నీపరిరంభము కావలెనన, హరి మంచిది యనియె ననిన నతివ చెలఁగుచున్.
తలిమము డిగ్గుచో చరణతామరసంబులు పైడిగుల్కుపావలు ధరియించి కేలొసఁగ వల్లభుఁ డల్లన కేళిగేహమున్వెలువడి కాంతనిల్పి కడువేడుక నుద్ధవుకేలుదండతోనలరుకటారికానినెఱయందము గేలియొనర్చు బాగునన్.
చెంప కొకింతజాఱుసిగ చెక్కిటిగోరును కన్నుగోనలంగెంపును గెంపుమోవి బలుకెంపును నెమ్మెయిచిట్లు గంధమున్సొంపులు మీఱ నారజపుసోయగ మౌర యటంచుఁ గోరి లోచంపకగంధు లాడుకొన శౌరి గృహంబున కేగె నీటునన్.
లోకారాధ్యుఁడు గావున, శ్రీకృష్ణున కిటుల నడువఁ జెల్లెం దగునేయాకైవడి వర్తింపఁగ, లోకమువారలకు రాజలోకవతంసా.
అంత.
హరి యక్రూరుని బంచెన్, ధర పాలిప్పించు పాండుతనయుల కంచున్కురుపతి యంధత నాస, త్పురుషుని శుష్కోపచారముల మరలించెన్.
సైన్యములఁ జంపి, యల జరాసంధధరణి, పతినిఁ బదియేడుమాఱులు పాఱఁద్రోలియవనుముచికుందు నేత్రాగ్ని నణఁగఁ జేసి, హరి యుపాయంబుననె యపాయములు దొలఁగ.
అలభర్గనుతుఁడు జలధిన్, ఖలదుర్గమమైన ద్వారకాపురి సేరెన్బలవర్గముతో హరికిన్, జలదుర్గము వలసె వలదె జనపాలురకున్.
శ్రీకాంతాస్పదమై దమైకనిధి ధాత్రీదేవతాసంతతవ్యాకౢప్తాధ్వరమై రమైధకసముద్యద్విక్రమక్షత్త్రియా
నీకప్రోల్లసమై సమైలబిలవాణిజ్యార్యశూద్రార్జితాస్తోకార్ధాధికమైకమై జనుల కెందున్ జెల్వమౌ ద్వారకన్.
అప్పురి కుశస్థలి యనంగ నొప్పు మున్ను, ద్వారవతినాఁగ రహి మీఱు ద్వాపరమునదానిసౌభాగ్య మెన్న నెవ్వాని శక్య, మల్లవైకుంఠమే తప్పదది నరేంద్ర.
యాదవవృష్ణిభోజకుకురాంధకసాత్వతు లాదశార్హు లామోదదశార్హులై కొలువ ముఖ్యసుధర్మసభానివిష్టుఁడైశ్రీదయితుండు రంజిలె నశేషసురాశ్రితపార్శ్వభాగుఁడౌనాదివిజాధినాయకునియందమునన్ భువనంబుఁ బ్రోచుచున్.
మును రుక్మిణిని విన్న యనురాగ మంతరంగావాలతలమున నంకురించెవెనుక విప్రుడువచ్చి విచ్చేయు మనిపిల్వఁ గొమరుమీఱఁగ ననల్కొనలు సాగెఁగుండిననగరంబు దండ నిల్చినవేళ మేలుగీలుకొనంగఁ బూలు బూచెశైలకన్యానివాసంబు వెల్వడఁబోఁగఁ గనుఁగొనగా దోరకాయలయ్యె
నెత్తి రథమున నిడ ఫలియించె నన్య, రాజలోకంబు గెల్చి ద్వారకకు వచ్చిప్రేమఁగల్యాణ మై రతిక్రీడఁ దనియ, వనజనాభున కనుభవంబునకు వచ్చె.
మొదలం దొంగగు నేమి యాడఁ జను సొమ్ము ల్వానిపైఁ బెట్టి పల్కుదు రెవ్వారిలలో "గతానుగతికో లోకో" యనన్ సత్యమౌనదిరా మున్నవనీతచోరుఁడని కాదా భక్తినిశ్రేయసప్రదుఁ గృష్ణు న్మణిచోరుఁ డంచనియె సత్రాజిత్తు విత్రాసియై.
వసుమతి నెంతవారలకు వచ్చు నొకానొకనింద వచ్చుచోనసురవిఘాతిరీతిఁ బరిహారము సేయ నొకండు నేర్చునేబిసబిస నేఁగి జాంబవతిఁ బెండిలియై మణిఁ దెచ్చి యిచ్చి యింపెసఁగఁగ సత్యభామ వరియించె వినిందకుఁ డార్తి గుందగన్.
అఁటఁ గాళిందిని మిత్రవిందను సుదంతాబ్దాక్షి భద్రామహీకటినిన్ లక్షణ బెండ్లియై నరకునిన్ ఖండించి వానింటఁ జొక్కటమై మించు పదాఱువేల మహిరాట్కన్యావతంసంబులన్ఘటియించెం దనకుం గులాంగనలుగాఁ గల్యాణలీలాగతిన్.
కలహాంతరిత భోజకన్యను లాలించు స్వాధీనపతిక సత్యను భజించువాసకసజ్జిక యౌసుదంతను గూడు విప్రలబ్ధను మిత్రవింద నరయుఖండితయైన లక్షణ వేఁడికొను విరహోత్కంఠితను భద్ర నూఱడించుఁగాళింది నభిసారికను జేరి కలయుఁ ప్రోషితభర్తృకను జాంబవతినిఁ జేరుఁ
గడమ పదియాఱువేవురుకంజముఖుల, భావహావవిలాసవిభ్రమవిహారలలితబిబ్బోకచకితలీలాదరస్మి, తాదిశృంగారచేష్టల కలరు శౌరి.
నీళానీలాలక రా, ధాలలనను దోడి తెచ్చి దయమీఱంగానేలెం గులకాంతలతో, నాళీకాక్షుండు రతుల నానాగతులన్.
చంద్రముఖి కోరఁగ నుపేంద్రుఁ డింద్రుఁ గినిసి, పారిజాతంబు గొనెఁ దనపాలు గాఁగభామినులవల్లఁ గాదె సౌభ్రాత్రమునకుఁ, గలుగు నొక్కొక్కయెడ విభాగంబు ధరను.
కనెఁ బదుగురిఁ బదుగురిఁ బ్రతి, వనితామణియందు సుతుల వనజాక్షుఁడు దత్తనయులకు లెక్కలే దిల, ఘనవర్ణునిభాగ్య మెన్నఁగాఁ దరమగునే.
అలరుకటారిజోదు మొదలైనకుమారులు తత్తనూజులుంజెలువము మీఱఁగాఁ గొదమసింగములంబలెఁ బార్శ్వసీమలన్గొలువఁగ నిండుకొల్వయి ముకుందుఁడు వేడ్క జగజ్జనంబుమెచ్చులకయి విశ్వరూపమును జూపినవైఖరి మించె నెంతయున్.
హరుఁ గొలిచి సాంబుఁ గనియెన్, హరి యందురు గాని యెదిరి యని చేసినయాహరుఁ గెలిచి బలికుమారుని, కరములు ఖండింపఁడే జగంబు లెఱుంగన్.
అంత నఘశిక్షకుండు సృగునకు మోక్షం బొసంగి యాదవవేదండంబు గావుననారదు భ్రమియించి భీమాయుధస్ఫూర్తి రాజమండలగ్రాహక మాగధ తమస్ఫురణం బడంచి సుదర్శనంబునం దమఘోషనందనుని తేజంబునం గూల్చి మరియు భూభారకులగు సాల్వదంతవక్త్రవిదూరాది భూవరుల హరించి సకలదిగ్విజయలక్ష్మీసమేతుండై జగత్కల్యాణకరుండై ద్వారక సామ్రాజ్య మేలుచుండె నంత నొక్కనాఁడు.
తనకుచేలత్వ మట యథార్థంబు గాఁగఁ, జింపిదోవతికొంగునఁ జేరెఁడంతముడిచి తెచ్చిన యడుకులు పిడికెఁడంటి, మమత కృష్ణుఁడు మెసవెడిసమయమునను.
చినిఁగి మాసికలు వేసినకోక బంగారుచెఱగులచెంగావిచీర యయ్యెఁజెవులకుఁ జాలని చిఱుతలక్కాకులు కట్టాణిముత్యాలకమ్మ లయ్యెఁపుస్తెమాత్రమెకాని పోఁడి మెఱుంగని గళమున హారము ల్నెలవుకొనియెనొకటిరెండోఁగాజు లున్నకరంబుల నవరత్నమయకంకణములు వొదవె
నలకుచేలునిసతికి దుస్సలకు మఱియుఁ, జూడ చూడంగ మైఁగ్రమ్ముసొమ్ములకునుగొదవ లేదయ్యెఁ బ్రబలుసంపదలవలన, రుక్మిణీనాథుదివ్యకారుణ్యమునను.
ఇవ్విధంబున సుగృహీతకుచేలుం డగు కాంచనచేలుండు సుశ్రీలుఁ గావించిఖాండవదహనంబున నైన యాఖండలు భండనంబున గాండీవకోదండునకు విజయసుభద్రావాప్తి ఘటించి మనసు భుద్రావాప్తిం జేసినది హెచ్చుగాదు పరవాసుదేవలోకనివాసు లగు భూసురకుమారులం దెచ్చి వివ్వచుం జిచ్చు సొరకుండ మాన్చి రక్షించె నదియునుం గాక మీపెద్దలగు పాండునందనులఁ బెక్కుచందంబులఁ బ్రోచె నది యెట్లనిన.
కృష్ణమానంబు రక్షించె శాకాన్నంబు గొని పాత్ర నక్షయోదనము నించెఁగఱ్ఱిసారథి యయ్యెఁ గాంగేయుపైఁ జక్ర మెత్తి వివ్వచ్చున కీశుచేతఁబరమాస్త్ర మిప్పించె భాను గప్పెను భగదత్తాస్త్రమున కురఃస్థలము పూనెద్రోణు వారించెఁ కర్ణునిశక్తి మరపించె నహిబాణమునకు దే రణఁగఁద్రొక్కె
సన్న జేసి సుయోధను సమయఁ జేసెఁ, బెనిచె నుత్తరగర్భంబు భీముఁ బ్రోచెమహికిఁ బట్టముఁ గట్టె ధర్మజుని వింటె, పంకజాక్షుని పాండవపక్ష మధిప.
తనుఁ గొలిచిన తనుఁ బొగడినఁ, దనచారిత్రములు విన్న ధన్యులకెల్లన్వనజాక్షుఁడు గృష్ణుఁడు గో, రినకోరికె లొఁసగుననిన నృపుఁ డలరారెన్.
పెనఁచి కట్టినపట్టు పించంబు నడిపట్టు చంద్రకాంచితవిలాసములు దనరఁబుట్టినవంశంబుఁ బట్టినవంశంబు బహుపర్వసంగతిఁ బరిఢవిల్లభాసమానగళంబు పదపద్మయుగళంబు నమల ముక్తాశ్రయంబై తనర్పనపదానుజాతంబు నాస్యాంబుజాతంబు నానానుదృఙ్మోహనంబు గాఁగ
శ్రీల విలసిల్లు గోపాలకృష్ణమూర్తి, గంధగజహేమపర్యంకికాతురంగచామరభటాదిశాశ్వతైశ్వర్య మొసఁగి, సేవకశ్రేణి నెపుడు రక్షించుఁగాత.
అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁడైజనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెల్పుమని యడుగుటయున్.
ఛలనిద్రాననచుంబనావసరదృష్టశ్రీకపోలస్ఫురత్పులకవ్రీళితముగ్ధకోకకుచసభ్రూభంగమధ్యాధరస్థలదంతక్షతకేళికాపరమనోబ్జాతప్రగల్భాంగనాకలనాదోదిత పాహిపాహి ముఖవాః కల్లోలహల్లోహలా.
అనురాగసమాకర్షిత, కనకాంశుక నీవిబంధఘటనాక్షమతావనమన్మగథీగోపిక, ఘనజఘనాదానవర్షి గజిరాజఘనా.
రాధికాదిమహితపర్వరసిరసాన్నదానధీరాధికానుమోదరంగదంతరంగసంగతారాధికాధినాథభక్తరంజనాననప్రచారాధికారసంగ సంగరాంగణాదిభంగదా.
ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్టభాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగనామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతంబైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు అష్టమాశ్వాసము.
Comments
Loading comments…