నవమాంకము
వరవిక్రయము
చ. మనుజుని ముంగట న్మొరడు మాదిరిగా మనుజుఁడు నిల్చి వేర్మనుజుఁడు బల్ల గ్రుద్దుచును మాటికి మాటికి నేమి ప్రశ్న వేసినఁ దలయొగ్గీ యుత్తరము చెప్పుచు, నూర్పులు పుచ్చుచుంట కంటెను నవమాన మింకొకటి నిక్కముగా మహిలోన నున్నదే.
సీ. ధనలోభమో, పట్టుదలయో, దురాశయోవేధింప నిలువెల్ల వెఱ్రి యెత్తికూటసాక్ష్యములను గూరిచికొని యిండ్లువాకిళ్లు ముదుసళ్ళ వశ మొనర్చిబ్రోకర్లుసేయు దుర్బోధలు మది నమ్మిప్లీడర్లు కోరిన ఫీజు లిచ్చిపూఁటకూళ్ళిండ్ల నూడ్పులు నాకి, వారి పంచల దాటియాకు; జాపలఁ బరుండి
కోర్టే దేవాలయంబుగా కోర్టు నెదుటిమఱ్రులుం గంగరావులె మంటపాదికములుగా, జడ్జీ దైవంబుగా నిరంతరంబుఁ దిరుగుదురేమి కర్మంబొ ప్రజలు.
సీ. కరణము తొలి మలి కట్నాల క్రిందనుకూటసాక్షుల గొఱుగుడుల క్రిందవెంట దోడ్తెచ్చు నేజెంటు ఖర్చుల క్రిందప్లీడర్లు లాగెడు ఫీజుక్రిందచల్లఁగాఁ బెరిగిన స్టాంపుడ్యూటీ క్రిందతెమలని సాక్షి బత్తెముల క్రిందకోర్టు గుమాస్తాల కొల్పు ముడ్పుల క్రిందకడలేనియట్టి నకళ్ళ క్రింద
రైళ్ళక్రిందను, కాఫీ హొటేళ్ళ క్రిందకొంపలుం గోడులును మాపుకొనుచు, నోడువాఁడు బయటను, గెలిచినవాఁడు లోననేడ్చుటెగాక, లాభ మింతేని గలదె.
గీ. పెండ్లి కాఁగానె చదువు మాన్పించెఁ ప్రజలుకేరడము సేయఁ గోర్టు కెక్కించె నేఁడుధనమె బ్రతుకైన పెంపుడు తండ్రి కంటెసవతి తల్లియె మేలు నిశ్చయముగాను!
మ. మనసూ! జంకకు, ధైర్యమా! చెడకుమీ మానంబు! నీమానశోధనకాల బిదె, దైవమా! యిపుడె చెంతంజేరి సాయంబు సల్పి ననుం దేల్చు ముహూర్త మిత్తఱిని దల్లీ! భారతీ నాదు వాక్కున నిల్వంబడు మక్కరో కదిసి నాకుం దోడుగా నుండుమీ!
చ. పరువు నశించెఁ! బండితులు బామరులు న్విని యింట నింట నాచరితమె చెప్పుకొంచు నెకసక్కెములాడు నవస్థపట్టె! ముష్కరమునఁ దండ్రి కిప్పటికి గల్గకపోయె నుదార బుద్ధి! యీతరుణము నందు మూర్ఖుని విధంబున నుండుట నాకుఁబాడియే!
గీ. ఆమె చెప్పినదెల్ల యధార్థ మీతఁడాచరించినదెల్ల నా యాత్మ యెఱుఁగునిట్టిచో న్యాయమున కేసు గట్టువడకయున్న దేవుఁడు నను జూచి యోర్చువాఁడె.
ఉ. అమ్మెను నన్ను నా జనకుఁడాయన నన్గొనె రొక్కమిచ్చి; యీకొమ్మకు నేను భృత్యుఁడను, గొంకక యే పని సేయు మన్న నిక్కముగఁ జేయువాఁడ, నిటు - కట్నములం గొనువారు రూఢిగానమ్మడుకాండ్రె కాక, మగలంటకు నర్హులుకారు లేశమున్.
చ. ధనము గణించి నీ యెడల దారుణవృత్తి మెలంగియుండె మజ్జనకుడు, దాని నించుకయు స్వాంతమునందిడఁబోక నన్ను దాసునిగ గ్రహించి యిష్టమగు చొప్పున నానతుఁలిమ్ము నీవు చెప్పిన పనిచేయు దెల్ల పుడు భృత్యుఁడనై పడియుండు నీకడన్.
Comments
Loading comments…