జగదభిరక్షకాండము
ద్విపదభాగవతము
శ్రీరమ్యుఁడగు పుండరీకలోచనుఁడుద్వారకాపురినున్న తఱి నొక్కనాఁడు
నృగుని శాపవృత్తాంతము
సాంబుఁడులోనుగా సకలకుమాళ్లునంబుధీతీరవిహారణ్యభూమిమృగయానురక్తులై మెలఁగుచుఁ దప్పితగ నిఱ్ఱికందువఁ దడయక వెదకియొకనూతిలో నొక్క యూసరవల్లివికలమైపడియుండ వెఱఁగంది చూచి“యెన్నడు పొడగాన మిట్టిగాత్రంబునిన్ని వన్నెలుగల యీనరటంబుకటకటా! ఈ కూపగతమైన” దనుచుఁబటుశక్తి నందఱుబట్టి యీడ్వఁగనువెడలకయుండిన వెన్నునితోడ
కడువేగఁజెప్ప నక్కడికేఁగుదెంచికూపగతంబైన కృకలాసకంబుశ్రీపతి వీక్షించి చేతను దివియనది దివ్యపురుషుఁడై నంబుజోదరునిపదపంకజములకు భక్తి మ్రొక్కుటయుహరిజూచి పలికె “పుణ్యాత్మ! నీకిట్టిసరటజన్మం బేల సమకూరె?” అనుఁడు10“అనఘాత్మ! నృగుఁడ నిక్ష్వాకువంశజుఁడబెనుపడ సంపదఁబేర్చినవాఁడఁదారకంబులు వృష్టిధారలు నిసుకవారాసితరగలు వడినెన్న వచ్చుగాని నే విప్రసంఘములకు నిచ్చుధేనుసంఖ్యలు గణతింపఁగఁజాలనొకపుణ్యదినమున నొకవిప్రవరునకొకగోవునిచ్చిన యురక యాకుఱ్ఱిక్రమ్మర నామంద గలసిన నెఱుఁగకమ్మొద వొక బ్రాహ్మణాఢ్యుని కొసఁగమును ధారకొన్న యాముసలి బ్రాహ్మణుఁడుతనకుఱ్ఱి తప్పినఁ దడవుచు వచ్చియావిప్రునింటిలో నేపారుచున్నగోవును గొనిపట్టుకొనిపోవ నాపి“యేమి కాఱులు చెప్పెదీకుఱ్ఱి నాకుభూమీశ్వరుఁడు ధారపోసినవాఁడురాజుచే మును పరిగ్రహముఁగన్నాఁడయీజగంబెఱుఁగు నా యిది కుఱ్ఱియగుట
ధరణీశుకడకుఁబోదము ర” మ్మటంచు;నిరుపురు నాకడనేతెంచి నన్ను20దీవించి యిద్దఱుఁ దెఱగెల్లఁ జెప్పభావించి రెండవ బ్రహ్మణుఁజూచివేవిరపడి మీకు వివరింపనేలయీవిప్రునకు మొన్నయిచ్చిన కుఱ్ఱితొఱఁగంది వచ్చినా దొడ్డిలోనున్నయెఱుఁగక నిచ్చితి యీతప్పుసైచివెలయ నీకుఱ్ఱి యీ విప్రునకిమ్మునులియకఁ గొనిపొమ్ము నూఱుధేనువులననవుఁడు నవ్విప్రుఁ డనలంబువోలెఁగనలచుఁ బరుషవాక్యముల నిట్లనియె“ద్విజునకిచ్చిన సొమ్ము వీడ్పడ నిచ్చుకుజనుండు దుర్గతిఁగూలు పెక్కేండ్లుదరఁ బ్రతిగ్రహధనత్యాగి దుర్ఘటము;పరగంగ ధనమీని పతి జంబుకంబునగుదురిట్లెఱిఁగియు నన్యాయమాడఁదగదయ్య నాకిచ్చి ధర్మచారిత్ర!”ఎన్ని చెప్పిన కుఱ్ఱినీనంచు నతఁడుగ్రన్నన దనయింటికడకుఁ గొంపోవయీవిప్రవరుఁజూచి యిట్లంటి “నీకుయీవట్టి మొదవేల? ఇదెనీకు లక్ష30గోవుల నిచ్చెదఁ గొని నీవు కరుణకావవే నన్ను దుర్గతిఁదోయ” కనుఁడు“ధారుణీశ్వర! నాకుఁ దగ దొంగటాలు
ధారవోసెద వేట దానంబు నీవుకుఱుమట్టు పొడవును కొమ్మలుగలిగితెఱగగు చన్నులు తీరైనతోఁకచక్కదనము నొక్కచక్క మేయుటయుఁనెక్కడవిడచిన నిల్లుచేరుటయుఁగ్రేపులు బిలుచునర్మిలిని మాశిశువులేప్రొద్దు వేడిన నీడనిచ్చుటయుకడుసాదునై లక్ష్మిగతి నింటిలోననుడుగక నీధేనువుండిన జాలు;యిదిదప్పిపోయిన యింటివారెల్లమదిలోన మలమల మఱుఁగుచున్నారు;యీకుఱ్ఱినాకు నీవీ వోవలేనియేకాఱులును జెప్ప కిట్లొండు మాటనాడితి కృకలాసమై యుండు” మనుచునాడి బ్రాహ్మణుఁడు శాపంబిచ్చె నంత;వడవడ వణకుచు వడినేఁగి యతనియడుగులపైఁబడి యతనితో నంటి40“నీకష్టజన్మంబు నేనోర్వజాలఁజేకొని నన్ను రక్షింపవే” యనిన“హరి లోకరక్షణార్థమై కృష్ణుఁడనఁగఁబరగు నాతని కరస్పర్శమాత్రముననీకష్ట శాపంబు నీఁగి నీపుణ్యలోకంబునొందు సుశ్లోక! పొ” మ్మనిన
“తడయక యీకష్టతను బొంది యిందుఁబడనిపాటులఁబడి పద్మాయతాక్ష!వేదాంతవేద్యులు వెదుకంగలేనినీదివ్యచరణ సన్నిధిగంటి మంటిపనివినియెదనో కృపారసపూర్ణ!”అనిచెప్పి కృష్ణున కందంద మ్రొక్కికనకవిమాన సంకలితుఁడై నృగుఁడుచనియె దివ్వులుకొల్వ జంభారిపురికిఅతఁడు వోయినఁ జూచి యద్భుతంబందిశతదళనేత్రుఁ డచ్చటివారి కనియె.“హాలాహలాభీలమగు వహ్నికంటెఁగ్రాలును విప్రవర్గపుకోపవహ్నివారల సొమ్ములెవ్వరు హరించినను,దారుణలీల బాధలఁ బెద్దగాల50మలమటఁబొంది కీటాదులైపుట్టిపొలిసిపోదురు కులంబులు గూలిపోవునదిగాన విప్రుల యర్థమీభంగిమదిఁ జూడవలయు నెమ్మదిఁ గోరువారు”అనుచు పుత్రులు దాను నరిగి మురారితనమందిరమున సంతసలీల నుండె.
వసంతఋతువర్ణనము
అంతట సకలలోకానందమగుచుఁగంతుని సామ్రాజ్యఘనలక్ష్మి యనఁగపరమానురాగసంపన్న కారణము
విరహిమానసమహా విద్యేషణంబుశుకకోకిలాలాప సుస్వరప్రదముప్రకటితదంపతి ప్రాణవల్లభముమధుపకుటింబికా మందిరాంగణముమధురసౌరభశైత్య మాంద్యకారణముప్రాలేయకులవార్థి బడబానలంబుప్రాలేయకులవార్ధి బడబానలంబునానొప్పి వనముల నవకంబులెక్కమానుగానేతెంచె మధుమాసలక్ష్మి.తరులతావలులకుఁ దమకంబులెక్కిపరిమళంబై మంద పవనుఁడు వీచె;60గుమురెక్కి తరులెల్లఁ గొనచిగురాకుగములు క్రొన్నన నవకపు మొగ్గ మ్రొగ్గవలిమొగ్గ క్రొవ్విరి వలవులు గులుకవెలిపూవు నూనూఁగు పిందెలుగాయకసుగాయ వులికాయ కడునొప్పు దోరపసనుపండులు వనిపండులు గలిగితరువు లెల్లను గల్పతరువుల భంగిపరువమై చూపట్టు పరిమళశ్రీల!వాసంతి వనములు వాసనగలిగివాసికి నెక్కిచామంతులు పూచె;గొజ్జంగలలరుల గొమరారుమరునిసజ్జపట్టులభంగి సౌరభంబొలసె;కందర్పుటమ్ముల కరణిని వెడలి
సింధువారంబులు చెన్నారఁ బూచె;మగువల గండూప మధుకేళిఁ దేలిపొగడ లామనివేళఁ బొగనొందఁ బూచె;తన్నాసపడి చూడఁ దరుణీజనంబుతన్నాసపడిపూచె దగనశోకంబు;తన్నిన నలరుటే తగవంచు సతులకన్నుసన్నలఁ దిలకంబు చూపట్టె;70సుదతుల కౌఁగిళ్ళ జొక్కులఁ జొక్కిముదమంది కురవకంబులు మ్రానుపడియె;పాటలు చెవివిని పాటలీతరులుపాటిల్లె సతుల యా పాటల నలరి;సంపంగిపూదేనె చవిఁజొక్కి క్రిందగుంపులై యలరెడు గొదమతుమ్మెదలపానాభిరతిఁ జొక్కి పతులును సతులుగానంబు లొనరించు గతిని జూపట్టె;కాయజుఁ డదె దండు గదలి యేతెంచెరాయడి యడలి బోరన గూడుఁ డనుచుఁగోయని యెలమావి కొమ్మల మీఁదఁగోయిల లెలిగించె కొమరగ్గలింప;భావజు త్రైలోక్య పట్టంబుగట్టదీవించఁ జనుదెంచు ద్విజులచందమునఁజెలరేఁగి యెల్లెడఁ జిలుకలు మ్రోసె;వెలుఁగొందు చంద్రుడు వెన్నెలతేటపరువంపు చిన్నిపూపాటన నమరమురిపెంపు నవ్వు కెమ్మోవులఁ దనరఁ
దిలకించు చందన తిలకంబు లలరకలికెలు మేన నుత్కలికలై తనర80వనములు నిత్యయౌవనలక్ష్మిఁ జెందివనితలచందమై వలనొప్పుఁ జూడనీభంగి నామని యేపార సీరియాభీరుకాంతల నాత్మలోఁదలఁచి;
బలరాముఁడు వ్రేపల్లెకు నరుదెంచుట
హరికి నెఱింగించి యట రథంబెక్కియరుదెంచె వ్రేపల్లె కాప్రొద్దె కదలిఏపారఁ జనుదేర నెదురేఁగి యంతగోపయశోద లక్కునఁ జక్కఁజేర్చి“నాతండ్రి! నాయన! నాముద్దుకూన!ఏతెంచితే మమ్ము నిందఱుఁ జూడదేవకియును వసుదేవుఁడు హరియునీవు రోహిణి నెమ్మి నెలతలు సుఖులె?”అని ప్రేమ నడుగుచు నర్మిలి పుత్రుఁగనుఁగొని హర్షాశ్రుకణములు దొరగసంతసింపుచునుండ సకలగోపికలునంతలో నరుదెంచి హలపాణిఁ గాంచిసేమంబుఁ జెప్పి తత్సేమంబు లడిగియామోహరసవార్ధి నందందతేలిహలియు మజ్జనఁ భోజనాది కృత్యములుసలిపి వారునుఁ దాను సంతోషలీలఁ90గలసి వినోదించి కాళిందితీర
ములను బృందావనంబున గ్రీడ సలిపె
బలరాముఁడు వ్రేతలతో నెమునాతీరమందుఁ గ్రీడించుట
తాను గోపికలును దనపిన్ననాఁడుపూని క్రీడించుచాడ్పునఁ గ్రీడసలిపి;పసిఁడి కోరల నుంచి పడతులు సీధువసలారఁ దనియంగ నందఱుఁ గ్రోలి;తనివోక కాళిందితటతరుశ్రేణితనరారు నీడలఁ దగ విశ్రమించి;వరుణసంభవయైన వారుణిఁ దేలితరమిడి బలభద్రుఁ దలపెల్ల నెఱిఁగిపరిమళమాధుర్యఁ భరితమై నిండిఁతరుకోటరమున నుద్భవమొంది నిగుడఁగని ప్రలంబారి య క్కాంతలుఁదానుదనుపారియున్న కాదంబరిఁగ్రోలిమానినిగండూష మదిరారసంబులాని మన్మథకేళి లందంద తేలిమదమెత్తి తన్ను దామఱచి గోపాలసుదతులింపు నడిమి సూరెల నిలువఘనకరిణులలోని గజము చందమునసనువార నందవిహారంబు సలుపఁ100జెన్నారు మోవుల జిగి జేగుఱింపఁజన్నుల కొంగులు జార పయింటవెన్నులపై నీలవేణులు నెఱయఁగన్నులందును సోయగములు మ్రాన్పడఁగఁ
గౌనులు నులియంగఁ గరతాళగతులసానురాగంబుల శౌరిఁ బాడుచునుసన్నులచాయలఁ జతురులాడుచునునన్నులన్నుల వెడ యాటలాడుచునుసీరితోఁ బలుమారు చెనకి నవ్వుచును“మేరలు మీఱి స మేలంబు లాడికలసి వినోదింపగా సీరపాణియలసి యంగము సోల నందంద సొక్కవెలసిన నెరివేణి వ్రేలాడ చమటకలసి కస్తూరి యెక్క వలువ లెల్లగటకాంగుళీయకగ్రైవేయహారపటుకిరీటప్రభాపటలి శోభిల్లమదియించు దివిజసామజము చందముననెదురెవ్వరును లేక యేపు దీపింపతరుణులుఁ దనుగొల్వఁ దరులతావలులఁబరికించి చిత్తవిభ్రాంతిమై పలుకు;110“ఏలకో! ననుఁజూచి యీరాజశుకముశీలించి మొగమొఱ్ఱ సేయుచున్నదియ!నాయంబరంబుల నలుపెల్లఁగొన్నదీయలి!” అని కన్ను లెఱ్ఱజేయుచునుదరువులెల్లను నేడుఁ తనుజూచి నవ్వ;“నరుణించె కింశుకంబదియేమి!” అనుచువదనంబు వఱువట్లు వట్టి మైదప్పిగదిమి దిగ్గనలేచి కాళిందిఁ జూచి
బలరాముఁడు యమునను నాగలిచే నెత్తుట
“ఓ సూర్యకన్యక! ఓ లోకమాత!ఓ సారసల్లాప! ఓ సారసాక్షినీరువెట్టుము లేక నిలువంగజాలబోరన నుదకంబుఁ బోయవే!” అనుఁచుఁబలుమారు పిలిచినఁ బలుకక యున్నఁగలుషించి పరుషవాక్యముల నిట్లనియె.“పిలిచిన నామాట పెడచెవిఁబెట్టిపలుకవు మదిలోన భయమంది రావు!మలినాంగి! నీమేని మదమెల్ల నడఁచిదళనంబు సేసి యుద్ధతమాన్తు” ననుచునదలించి హలమున నమ్మహాతటమువిదళించి తివిసిన వెఱఁగొంది యమున120
యమున బలరామునిఁ బ్రార్థించుట
వడవడ వడఁకుచు వచ్చి తాలాంకునడగులపై వ్రాలి యరుదొందఁ బలికె.“ఓ సర్వలోకేశ! ఓ సుప్రకాశ!ఓ సౌమ్యహృద్గేయ! ఓ రౌహిణేయ!ధరణిభారముఁ బాప దనుజుల నడఁపఁగరమర్థి దేవకీగర్భంబునందుఁజెలువారఁ బుట్టిన చెలువుఁడ వీవ!బలభద్ర! బలప్రలంభధ్వంసరామజడసంగతి బలచంచలచిత్తమలినఁ
దడయక నీ మహత్వముఁగానఁగలనె?నెలతలు సేసిన నేర్పు నేరములుఁదలఁకక లోగొండ్రు ధన్యులే ప్రొద్దు”అని వేడుకొనుచున్న యమున మన్నించిఘనదయామతి హలకర్షంబు విడిచె.ప్రీతిఁ గాళింది విభేదనుండనుచునాతని దీవించి రమరసంఘములు!బలుఁడు నాఁగట గొల్వ వాపినచోటుబలతీర్థ మన ధాత్రిఁ బ్రఖ్యాతమయ్యె.అచట కృతస్నాతులైన మానవులకచలిత విష్ణులోకానంద మొదవు!130ఈభంగి బలభద్రుఁ డెంతయు వేడ్కయాభీరు సతులతో నెమునఁ గ్రీడించియేపారు నిబ్బంగి నీయాఱు నెలలువ్రేపల్లెలోపల వేడ్కలు సలిపిహరిఁజూచు తలఁపున నట ద్వారవతికినరుదెంచెఁ బ్రజబాలలర్థిఁ దన్ననుప
పౌండ్రక వాసుదేవుని వృత్తాంతము
నాలోన గర్శదేశాధినాయకుఁడుపాలసచిత్తుఁడు పౌండ్రభూవిభుఁడుహరితో విరోధియై యతని చిహ్నములుతరమిడి ధరియించి తానంతఁ బోకవాసుదేవుండను వలనొప్పఁ బేరుభాసురంబుగఁ దాల్చి పటుశక్తి మెఱసి
యక్షౌహిణీద్వితయము తన్నుఁ గొలువనక్షతబలశాలియై దండు వెడలె.ఆరాజునకు మిత్రుఁడై కాశిరాజుధీరుఁ డక్షౌహిణీ త్రితయంబుతోడఁబటుశక్తి నతనికి బాసట యగుచుభటదంతిహయరథప్రతతితో నడువనీరసంబునఁ బ్రౌండుఁ డేతెంచి పేర్మిద్వారకానగర ముద్దతి డాయవిడిసి140
పౌండ్రకుఁడు దూతను శ్రీకృష్ణుని వద్దకుఁ బనుచుట
హరి సన్నిధికిఁ దజ్ఞుఁడను దూతఁబనుపనరుదెంచి తగ సుధర్మాభ్యంతరమునవృష్టిభోజాంధక వీరులుఁ గొలువనిష్టవర్తన నున్న నిందిరారమణుఁగని మ్రొక్కి తనవచ్చు కార్యమంతయునువినుపించఁ జొచ్చెను వెఱపింత లేక.“ఆపౌండ్ర నృపతి యాహవదండపాణిభూపాలతిలకంబు వుత్తెంచె నన్ను.ఆతఁడు నీతోడ ననుమన్న మాటలాతతంబుగ విను మంభోజనయన!“వసుధభారము మాన్ప వైరుల నడంపదెసలఁ బెంపఁగ వాసుదేవుఁడ నేనునాచిహ్నములుఁ దాల్చి నాపేరుఁ దాల్చియీచావుఁ దెచ్చుకో నేఁటికి నీకు?ఘనగదాశంఖచక్రమును శార్ఙమును
గనకాంబరంబును గరుడకేతనముమకరకుండలములు మణికిరీటంబుఁబ్రకటంబగుజలసత్ప్రసవమాలికయునివినాకు వేవేగ నిచ్చి ప్రాణములసవరించుకొని నన్ను శరణంబుఁ జొరుము;150కాదేని నాతోడ కదనంబు సేయనాదటఁ బేర్చి ర”మ్మ ని చెప్పె” ననుఁడు;విని జనులందఱు వికవిక నగఁగఘనుఁడు కృష్ణుఁడు వానిఁ గనుగొని పలికె.“కండ క్రొవ్వున గన్ను గానకఁ బెక్కుదుండగంబులు ప్రేలి త్రుళ్ళుగాకేమి!భండనభూమిలోఁ బరిమార్చి వానికండలు భేతాళగణముల కిత్తు,”అని పల్కి దూతకు నర్ఘ్యవస్తువులఁదనిపి వీడ్కోలుప పౌండ్రునితోడహరి వాక్యములు జెప్ప నతఁడు కోపించిదురమున కేతెంచె దోర్గర్వ మెసఁగ.
పౌండ్రకుఁడు హరినిఁ దాఁకుట
బహుదళంబులతోడఁ బౌండ్రుఁ డేతేరనహిమాంశు సమతేజుఁడగు వెన్నుఁడెఱిఁగిపరఁగు సారథ్యదర్పంబు మెఱయఁగదేరెక్కి శస్త్రాస్త్రదీప్తులు నొలయఁబాంచజన్యధ్వని పరిపంథి సేనఁజంచలించఁగ వచ్చు శౌరిపై నడరి
పరిఘతోమరగదా ప్రాసచక్రములుఁగురిసిన, మురవైరి క్రూరబాణములు160నడవులనేర్చు కాలాగ్ని చందమునఁదొడరి సేనలనెల్ల ద్రుంచివైచుటయుఁగనుఁగవ కెంపొందఁ గడఁగి పౌండ్రుండుతనసేనఁ బురిగొల్పి దళములఁ దాకె.కృత్రిమ చక్రంబుఁ గినిసి వైచుటయుఁశత్రుఁడు బెగడ నాచక్రంబు నఱికె;గదయును విల్లును ఖండించి తేరుచిదురుపలుగఁ జేసి సిడముఁ ద్రుంచుటయుబఱిగొని వాలును బలుకయుఁ గొనుచునఱిముఱి నార్చుచు నరుదేరఁ జూచిహరి శార్ఙ్గమున భల్లమరివొసి కంఠమరుదార లక్షించి యార్చి వైచుటయుమకరకుండలరత్నమకుటంబు తోడఁబ్రకటోల్ముఖము భంగి పడియె తచ్ఛిరము.కూలిన పౌండ్రుఁ గన్గొని సేనలెల్లనాలచందంబున నందంద పఱచె.
పౌండ్రకుని మరణమునుగాంచి కాశిరాజు శ్రీకృష్ణునిపై గవిసి మడియుట
కని కాశిరాజు “నేఁగలుగంగ నేలఁగనుకని పార నొక్కట నిల్వుఁ” డనుచుదళములఁ బురిగొల్పి దైత్యారితోడఁదలపడి బహుబాణతతుల నొప్పింపఁ170
గోల వ్రేసిన మ్రోఁగు కోల్పులిభంగివాలమ్ములురమున వడిఁగీలు కొలుపఁగాలాగ్నిసదృశభీకరచక్రనిహతిముడివడు బొమలతోఁ బొలుచు మస్తకముఁబడవైచి యార్చె; నీ భంగి శాత్రవులనిరివురఁ బొలియించి నిందిరాధీశుఁడరుదెంచె ద్వారక కమరాళి పొగడ.
కాశిరాజు కుమారుఁడు రుద్రుని వరమును బొంది కృత్తిని బుట్టించుట
కాశీశ్వరుని తల ఘనచక్రనిహతిఁగాశిగాఁగూలినఁ గని పౌరులెల్లనడరి సోద్యంబంద యాయొక్క శిరముపడియె కుండలమణిప్రభలతో నపుఁడు.అతివలు దుఃఖింప నతని నందనుడుసితకీర్తియగు సుదక్షిణుఁడను వాఁడుతన తండ్రి తల యౌటఁదా నిశ్చయించిఘనభక్తి నగ్నిసంస్కారంబు సేసియతుల సమాధి నిష్ఠాత్ముఁడై ప్రమథపతినాత్మనిలిపి తపంబాచరింప;హరుఁడు ప్రత్యక్షమై “యడుగుము నీకువరమిత్తు” ననుటయు వాడు “మజ్జనకుఁ180జంపిన పాపాత్ము సమయించు నట్టి
పెంపు ప్రసాదింపు భీమాక్ష!” అనుఁడుఆ దేవుఁడును “దక్షిణాగ్నిగుండముననాదరంబున విప్రులాభిచారాఖ్యహూమంబు సేయఁగ నొకకృత్తి పుట్టిసోమిచ్చి నీశతృఁ జుఱువుచ్చు” ననుచుహరుఁ డదృశ్యుండయ్యె నంత ఋత్విజులనరుదార వేల్పింప నాయగ్ని వలన
అగ్నిలో నుండి పుట్టిన కృత్తి శ్రీకృష్ణునిపై వెడలుట
నాలోన భయదజిహ్వాలవక్త్రంబుఫాలనేత్రంబును బాహాశతంబుశూలతోమరగదా క్షురికాది భిండివాలచక్రములు దుర్వారాయుధములుచటులకఠోరదంష్ట్రలు తాడనములుకుటిలపు బొమ్మలు క్రూర ద్రుష్టులునుదీర్ఘతాభీలత తీవ్రాట్టహాసగర్ఘరస్వరములు ఘనశరీరంబునడర లోకములెల్ల హరుఁ డొక్కవేటమడియింపఁ బుట్టిన మాడ్కి యో యనఁగఁబదతాడనముల భూభాగంబు వగులనదరి లోహితవర్ణ మదరి యందంద190“ఎవ్వని బరిమార్తు నిట పంపు మనుఁడు”“నవ్వాసుదేవుని నడచిర” మ్మనిన
బహుభూతఢాకినీప్రతితోడ వచ్చిదహనార్చు లొలయ నాద్వారకఁ జొరఁగకారగ్ని దరికొన్న ఘనసత్వచయముపారెడుగతి జనప్రతతి రేఁపఱచియతివలతో జూదమాడుచు నున్నశతదళాయతనేత్రు సన్నిధి నిల్చి“ఇదె యొక్క కృత్తి యహీనాగ్ని శిఖలఁగదిసి పట్టణమెల్లఁ గాల్చుచు వచ్చెనిక్కడ దిక్కులేదీబారిఁ గడపిగ్రక్కున మమ్ములఁ గావవే కృష్ణ!”అని యార్తులై పలుక నాపౌరజనులఁగనికేల వారించి కడకంట నగుచుయది మహేశ్వరకృతియౌ కృత్తి యగుటమదిలోన నెఱిఁగి సౌమ్యజ్ఞాన విభుఁడు;
శ్రీకృష్ణుఁడు సుదర్శనమును గృత్తిపై పనుచుట
తనుకొల్చియున్న సుదర్శన పురుషుఁగని నల్ల నవ్వుచు కనుసన్నఁ బనుపనమ్మహాచక్రంబు హరి యాజ్ఞఁ బూనిక్రమ్మన నేతెంచి కాలాగ్ని వోలె200శతయోజనోత్తాల చటుల విగ్రహముశతభుజసమదోగ్రశస్త్రాస్త్రములునుఘనసహస్రార్కనిర్గత తీవ్రరుచులఁబెనుమంటలెగయ నాభీలమై పేర్చిహరి చక్రమేతెంచు టాలించి కృత్తి
మఱలె బిట్టొఱలుచు మది విహ్వలింపపఱగంగ నయ్యెదు ప్రవరసాధనముయఱిముఱి వెనుకొన నదికాశిఁ జొచ్చె.చొచ్చిన నిట్టట్టు సురగంగ నీకనచ్చక్ర మడరి ఘోరానలశిఖలనాఋత్విజులతోడ నాకృత్తితోడనారాజుతోడ జనావళితోడఘనశతాంగక వాజి గజశాలతోడధనధాన్య వస్తు సంతానంబుతోడఁబొలుపారుసౌధగోపురములతోడఁగాశీపురము చక్కుగాఁ జేసి కాల్చియీశేషి హరి పాలికేతెంచి మ్రొక్కె.నీకథావర్ణన మెల్ల వారలకు210ప్రాకటకృత్యముల్ బాధలు నడఁగుపుత్రసంపదలును భోగసంపదలుశత్రుక్షయంబు మోక్షము నిచ్చుచుండు.”అనిచెప్పుటయువిని యభిమన్యసుతుఁడువినతుఁడై శుకయోగివిభున కిట్లనియె.“ఆ మందలో నుండి యరుదెంచి యచటకామపాలుండేమిగతి విశ్రమించె?ఆతని చరితంబు ననిశంబు వినఁగఁగౌతుకంబయ్యె నాకథఁ జెప్పు” మనిన
ద్వివిదుఁడను వానరుఁడు తన చెలికాఁడగు నరకుని జంపినందులకుఁ బగఁబూని చెలరేఁగుట
“వినవయ్య కురునాథ! ద్వివిదుండనంగదనరారు మైందుని తమ్ముఁడు ఘనుఁడుగిరిచరాధిపుఁడు సుగ్రీవుని మఱఁదినరకుని చెలి మహోన్నత బలాధిపుఁడునారాయణునిచేత నరకుఁడు దెగినఁగ్రూరవార్తకు మదిఁ గుమిలి మర్కటుఁడుహరి నడఁచెదనని నద్దేవుఁ డేలుపురములు నూళ్ళును బొరి చిచ్చులిడుచుకొండలు బెఱికి యుక్కున నూళ్ళ మీఁదమెండుగావైచి భూమిని పాడుసేయవనితల బతులను వడివెంట బెట్టికొనిపోయి పర్వత గుహలలో డాఁచు220నీరీతి నుండగ నెఱిఁగి యాశౌరియూరకనుండఁగ నొక్కనాడంత;వారాసి దాఁటి దైవతకందరమునకారూఢగతివచ్చి యగచరాధిపుఁడుమానినీమంజుళమధురగానములవీనులకింపార విని యల్ల నచటకరిగి చేరువనొక్క యవనిజమెక్కిపరికింపుచున్నచోఁ బడఁతుల నడుమనారుణితాక్షుడై యాసవక్రీడనారామలును దాను నలరి పాడుచునుగోవులలోనున్న గోరాజుభంగి
దావేడ్క విహరించు తాలాంకుఁ జూచిహరియకాఁ దలపోసి యాకీశనరుఁడుతరులెక్కి కిలకిల ధ్వనులు సేయుటయుతరుణులు నవ్వుచుఁ దను చూడ మేనుపరపి ఝంకించుచుఁ బండ్లిగిల్చుచునుబొమలార్చి చూచుచుఁ బొరి మీఁదఁ బొలయుభ్రమరాళిఁ గని యుల్కిపడి పట్టుకొనుచువెలికిలపడి యాడి వెక్కిరింపుచునువెలఁదులఁ గని వంగి వెనుకఁ జూపుచును230గోడిగంబులు సేయుఁ గ్రోతి సేఁతలకుఁజేడియలందఱుఁ జెలరేఁగి నవ్వ;
బలరామ ద్వివిదుల ద్వంద్వయుద్ధము
తాలాంకుఁడొకరాత దర్పించి వైననాలోనఁ గోపించి నతనిపై కుఱికిచీరలు జించి యాసీధుభాండంబుబోరనఁ బగులంగఁ బొడిచి దాఁకుటయు;కామపాలుఁడు వానిఁ గడకతోఁ బట్టివేముష్టిఁ బొడిచిన వికవిక నవ్విప్రళయకాలోత్తాలభైరవుభంగిబలియుఁడై మైవచ్చి బలున కిట్లనియె.“నలినాక్ష! యేరీతి నాఁడు నామిత్రుఁదలమీరి నరకు నుద్దండతఁ జంపివచ్చితి నేనేఁడు వచ్చిన వాఁడఁజెచ్చెర సమరంబు సేయు నాతోడ!
తనరార మైందుని తమ్ముఁడ ద్వివిదుఁడనువాఁడ శూరుఁడ నర్కజు మంత్రిరామునకై పూని రావణుతోడభీమాహవము సేసి పేర్చినవాఁడనెలకొన్న రణవీధిని ద్రుంచివైవఁగెలసి నాచెలికాని కెలసంబుఁ దీర్తు.”240అనిపల్కియార్చి మహాశూలమెత్తికొని వైచుటయు సీరి క్రుంకి మైఁదప్పిముసలంబుఁగొని బెట్టు మోదిన వాఁడువెస మహాతరువెత్తి వేసి యార్చుటయుఁదప్పించుకొని సీరి తరుచరుమీఁదగుప్పించి యుఱికి ముక్కున ముష్టిఁ బొడువతెరలక వానరాధిపుఁ డొక్క పెట్టుతరుణులు బెగ్గిలఁ దరువృష్టిఁ గురిసెలాంగూలమున వ్రేసి లలి నఖాగ్రముననంగంబుఁ జీరి మేనందంద కఱచిపిడికిటఁ బొడిచినఁ బెనుమూర్ఛ నొందిపడిలేచి యాబలభద్రుఁ డాతనినిగళమున జిక్క నాగలి దగిలించియలుకమై రోఁకట నందంద పొడువహనువులు పగిలి మైయదటెల్లఁ బొలిసికనుమూసి నెత్తురు గ్రక్కిరోఁజుచునుబవిదాఁకి కూలిన పర్వతంబనఁగఁబ్లవగేంద్రుఁ డిలఁగూలి ప్రాణంబు విడిచె.ఉవిదలందఱు వెఱఁగంది కీర్తింప
దివిజసంఘము రాము దీవించిరంత250నలిన నేత్రుండున్న నగరికేతెంచిహలి కృష్ణుతోడ నయ్యగచరు వార్తవినుపింప శౌరియు వివిధ బాంధవులువినుతు లొనర్చిరి వెసరామునంత
సాంబుఁడు దుర్యోధనుని కుమార్తె లక్షణ నపహరించుట
అంబుజోదరపుత్రుఁ డతిరథోత్తముఁడుజాంబవతేయుండు సాంబుఁడు ఘనుఁడుకోరి ధుర్యోధను గూఁతు లక్షణనువారణవురి స్వయంవరమునందుననువరియించి కొనిపోవ వారలందఱునుగురుపతి కెఱిఁగింపఁ గోపించి యతఁడు“ఏమేమిరా! సాంబుఁడే నాతనూజనేమని కొనిపోయె నెట్లు జూచితిరి?కురువంశజులతోడఁ గూడి యాదవులుపరిణయప్రాప్తులే పరికించి చూడ?పడుచువాఁడీకన్య బలిమిఁ గొంపోవఁదడయకఁ జూచుట తగవుగా దతనిబట్టి తెత్త” మటంచు బలములతోడదట్టుఁడై వడి సుయోధనుఁ డుగ్రవృత్తివెడలి యార్పుచుఁ దాఁకి విష్ణునందనునిదడయక శస్త్రాస్త్రతతుల నొప్పింపఁ260గనిపోయి తిరిగి యగ్గలికమై వేఁచితన రథంబఖిలవర్తనలఁ గ్రీడింపఁ
బడియార్చి విలుగుణధ్వని చేసి శరములడరింపఁ గురుసేన నందొక్కపెట్టమురిసె రథంబు లమ్ముల గీటణంగెఁగరులు రోఁజుచుఁగూలెఁ గాల్బలం బణఁగెఁదరమిడి సాంబు కోల్తల కోహటించితిరిగిసేనలు రాజు దిక్కున కొదుఁగగినిసి యాతని శల్యకేతుఁడు దాఁకఁగని రాజుతమ్ముఁడు గర్ణ సౌబలులువెనుఁ బ్రావుగా బాణవృష్టి వేల్పుటయుధనువుసారించి యా దైత్యారి సుతుఁడుకాఁడగ నేడు మార్గణముల సేసియేడు బాణముల మహీశు నొప్పించియతని తమ్ముని నాల్గుటమ్ములఁ గ్రుచ్చిశతసాయకంబులు శకునిపైఁ గప్పితొలఁగక శల్యకేతుని విల్లుఁ దునిమిబలముల శరపరంపరలఁ గూల్చుటయునతని విక్రమకేళి కచ్చెరువందియతులితంబగు యోధులందఱుఁ గూడి270
కురువీరులందఱుఁ గూడి సాంబుని విరథునిగాఁ జేసి పట్టుకొనుట
కురుపతి విలుదుంచెఁ గొసరేది కర్ణుఁడరదంబు నుగ్గాడె హరుల గీటణఁచె;విరథునిగాఁ జేసి వెలఁదుకతోనయరదంబుపైనిడి యతనిఁ దోతెంచె.
నాకన్య బెగడొంద నాకుమారకునిఁజేకొని బంధించి చెరఁబెట్టిరంత.
బలరాముఁడు యాదవుల కోపమును జల్లార్చి స్వయముగా హస్తినాపురికి వెడలుట
కరిఘోటరథభటోత్కరములతోడఁగరిపురిపై దండుగదలుటఁ జూచిబలభద్రుఁ డది “యెంతపని మీరలేమితలఁచి కౌరవులపై దండుపోయెదరు?యాదవులందు నెన్నడు కౌరవులకుభేదంబు లేనిచోఁ బ్రీతి నందెఱిఁగియేమిసేసిన వార లేమన్న వారొ!ఆమార్గ మెల్లను నఱసి సామమునఁదెలిసి సాంబునిఁ దోడితెచ్చెదఁగానికలహంబునకుఁబోవ కారణం బేమి?”అని వారి వారించి యట రథం బెక్కిచనియె నుద్ధవుఁడు తోఁజనుదేర సీరి.అరిగి వారణపురోద్యానంబులందుకరమొప్ప విడిసి యక్కామపాలుండు280దనరాకఁజెప్పి యుద్ధవుఁ బంపుటయునుజని యమ్మహాత్ముఁడాస్ధానంబు నందుఁగురురాజు సచివు శకుని దుస్ససేనుగురు భీష్మకృపబాహ్లీకులు గొలువంగఁగొలువున్న యతనిఁ గన్గొని పొడచూపిభలభద్రురాక నేర్పడ జెప్పుటయును;
నతిసంభ్రమంబున నందఱుఁగూడియతని సన్నిధికేఁగి యర్ధిఁబూజించిసేమంబులడిగి యాసీరి నీక్షించి“యేమివిచ్చేసితి రెఱిఁగింపుఁ”డనినధార్తరాష్ట్రులును బాంధవులును వినఁగనార్తరక్షణశీలి హలపాణి పలికె.“కోరి మామేనత్త కొడుకులు మీరు.ఆరూఢి మీకు మేనల్లుఁడుగానఁదన మేనమఱఁదలి దరళాయతాక్షిఁజనవునఁ గొనిపోయె సాంబుఁడు దీనఁగలఁగి విరోధింపు టర్హంబుగాదువెలఁదితో నాతని విడిచి తెం”డనిన.అల్లన నవ్వుచు నాసుయోధనుఁడుప్రల్లదంబున బలభద్రుతో ననియె.290
హేళనచేయు సుయోధనునిపై నాగ్రహముచే సీరి హస్తినాపురిని నాగలిమొనచే లేవనెత్తుట
“అకట! గురుస్థానమని నిన్నుఁజూడమెకమెకపడు మందమేళముల్ తగునె?ఒకనిఁ గొల్చిన వార లుర్విలో మీరు!ఆదిగర్భేశ్వరు లగు కౌరవులకుయాదవులకు వియ్యమందంగఁ దగునె?మిమ్మేలురాజును మీరును నాకు
నెమ్మి యీడొనరింప నెంతటి వారు!హరి మంచితనమున నన్నియు నొప్పెజరగుట సల్లాపసహజభోజనముసలిపి మన్నించినఁ జనవున మీరుకలసి వర్తింతురుగాక యేనాటనెక్కడి బాంధవంబిక? మాకు మీకుఫక్కి వోనాడఁగఁ బనిలేదు వేగవిచ్చేయు” మను కురువిభుఁ జూచి సీరిచిచ్చులో నెయ్యిఁబోసిన భంగి మండి!“కాలుఁడు ప్రేరేపఁ గానక యిట్లుప్రేలెదవేల? నీ పెంపెల్లఁ బొలియవరుస నెఱుంగక వదరెదుగాకహరికి నీకును నేది యంతర మోరి!300ఎవ్వరు నాకు మీ రెందఱున్నారు?ఎవ్వరుగలరు నీకీబారి గడప!నీ బలంబులు నిన్ను నీ పట్టణంబునాబాలవృద్ధమై యమునలోవైతు!”అని పేర్చి దర్పించి హలదండమెత్తిఘనరౌద్రలయకాలకాలుఁడో యనఁగకరిపురికోట నాఁగటి వాత గ్రుచ్చిభరమున నుంకించి పటుశక్తిఁ దివియ;నది యొడ్డగిలి పడ నఖిలమానవులుబెదరి నిల్వఁగలేకఁ పృథివిపై వ్రాలభీతిల్లి సంధులు పృథివి వేచఱువనాతురారావంబు నందంద చెలఁగ
నాంబికేయుఁడు విని హలిచందమెఱిఁగిసాంబుని విడిచి లక్షణసమేతముగఁదోకొని సకలబంధులుఁ దన్ను గొలువనాకౌరవేశ్వరుఁ డాపగాతనయువిదురుల మాట నిర్విణ్ణుఁడై వినుచుబదరుచు నేతెంచి బలభద్రుఁగాంచి
కురుపతి బలరాముని బ్రార్ధించుట
ముదము తత్తరపాటు మొలవంగ నతనిపదపంకజములకుఁ బ్రణమిల్లి నిల్చి310యాతనిదెస మొగంబై కేలుమొగిచియాతుర ఫణతి నిట్లని విన్నవించె.“దేవదేవారాధ్య! దివ్యావతార!భావగమ్యాకార! భక్తలోకేశ!శ్రీధరణీభర! శేషావతార!మాధవ! నిగమవాఙ్మయ నిర్వికార!వెయ్యిపాదంబులు వెయ్యిచేతులనువెయ్యితలల్ రెండువేలుజిహ్వలునుగలిగి యందొక ఫణాగ్రమున నీజగతిఁగొలఁది నీలముభంగిఁగొని తాల్చునీవుభూతాళి బుట్టింప బ్రోవ శిక్షింపచాతుర్యుఁడవు నీవు సకలలోకేశ!నీతత్వమెఱుఁగంగ నేరక క్రొవ్వియీతఁడాడిన మాటలెల్లను సైఁచు!రక్షించు! మీ యుపద్రవము వారించు!
అక్షయబలరామ!” అనిసంస్తుతింపఘనప్రసన్నాత్ముడై కామపాలుండుతనరార నంబికాతనయు మన్నించిహలముఖ మెడలించె నప్పురికోటబలరాముచే బాధపడి కొంత యెత్తి320నేఁడును జూపట్టె నెఱి మోము మహిమ!పోఁడిగా వినుతింపఁ బోలదెవ్వరికికురుపతి యల్లునిఁగూతును ననిచియరణంబు పదివేలు హరులును గరులుమూఁడు వేల్రథములు మొగినాల్గువేలుపొఁడిగ నిచ్చి యపుడు దోడుకొనుచునుద్వారక కేతెంచెఁ దాలాంకుఁడంత;శౌరి యంతయు విని సంతోషమందె.”అనిచెప్పుటయు రామునతుల విక్రమమువిని కురుప్రవరుండు విస్మయంబంది“పరమయోగీశ్వర! బలభద్రు మహిమసరసిజాసనుకైనఁ జర్చింపరాదుహరియెట్లు విహరించె నటమీఁది కథలుపరిపాటి నాకు నేర్పడఁ జెప్పుఁ”డనినబాదరాయణియు నప్పద్మాక్షు మహిమనాదరంబున వినుమని చెప్పఁదొడఁగె.“నరకునిద్రుంచి యానలినలోచనులవెరవార పదియాఱువేలనూఱ్వురనుపరిణయంబయ్యె నాపంకజోదరుఁడుపరసేది యిందఱఁ బొందునా! ఒకతె330
నారదుఁడు శ్రీకృష్ణుని లీలలను జూడనేతెంచుట
మరిగివర్తించునో! మరి నేర్పుకొలఁదియరసివచ్చెదఁగాక యనుచు నారదుఁడువరభక్తి నేతెంచి వడి ద్వారవతికి.చనుదెంచుచో సత్య సదనంబునందుఁదనుపారుఁ బారిజాతమునీడ నొప్పువిరులచప్పరములో విశదమై పొలుచుపరువంపు పువ్వులపానుపు మీఁదపల్లవశ్రీమించి పరగుకెంగేలనల్లన రుక్మిణి యడుగులొత్తుచునుకాళిందిసతియు లక్షణయును నిలిచితాలవృంతంబులు దనుపార వీవ;తమ్ములమీయంగఁ దగ మిత్రవింద;అమ్ముకుందునకు నానందమొదింపశంబరాంతకు మూలశక్తియో యనఁగఁబంబినరాగసంభ్రమచిత్త యగుచుజాంబవతీదేవి చందనంబలఁద;కంబుకంఠలు మదిఁగరము సంతసమునలి సత్యభామయు నాగ్నజిత్తియునుసలలితంబైన వింజామర లిడఁగఁ;340కెంగేలఁగేలును గీలించి భద్రయంగుళాగ్రములొత్తి యందంద తివియ;లాలితమంగళాలాపంబు లొలయఁ
గేళిమై నింతులు కెలఁకులఁ గొలువ;మండితకోటీరమణికాంతి నిగుడకుండలరుచులు జెక్కుల నవ్వులొలయఁ;చెనకి కౌస్తుభమణి శ్రీవత్సరుచులవనమాల యురమున వాసనఁ జూప;ఆయత శంఖచక్రాది చిహ్నములఁగేయూరకంకణాంకితబాహు లొలయ;హాటకరుచిరచేలాంచలద్యుతులఁబాటిల్లి బాలాతపస్ఫూర్తి నిగుడ,తెల్లదామెరమీఁది తేఁటి చందముననల్లనిమేను నున్నతశయ్యఁ జేర్చిసుదతులతోఁ గూడి సుఖగోష్ఠినున్నయారూఢయౌవను నంభోజనయనునారాయణుని సచ్చిదానందుఁగాంచిమఱుఁగున నిలుచుండి మహతి మీటుటయు;నెఱిఁగి దిగ్గనలేచి యెదురేఁగి మ్రొక్కి350యమ్మునిఁ దోతెంచి యర్థిఁ బూజించిక్రమ్మన నెమ్మోముఁ గనుఁగొని పలికె.“ఓమునీశ్వరచంద్ర! యోగీంద్రవంద్య!సేమమేనీకు? నీశిష్యులు సుఖులె?మామీదగృపఁగల్గి మమ్ము మన్నించియేమివిచ్చేసితి రెఱిగింపు” మనిననల్లననవ్వుచు హరికేలుపాణిపల్లవంబులఁబట్టి పలికె నమ్మౌని.
“ఆదినారాయణ! అఖిలాండనిలయ!వేదాంగవాహన! విశ్వప్రకాశ!విశ్వంభరాంబర! విశ్వంభరాఖ్య!విశ్వాత్మ! నిత్య! సువిజ్ఞానరూప!నీపేరు భవదుఃఖనీరధితేప!నీపాదములఁ బుట్టె నిఖిలతీర్థములుతీర్థపూతుఁడవీవ తీర్థంబు నీవతీర్థఫలంబిచ్చు దేవుఁడ వీవనీరజభవుఁడును నీతత్వమెఱుఁగనేరఁడు ననుఁబోఁటి నేర్చునే కృష్ణ!నిన్నుఁజూడగలేని నీరసాత్మకులఁగన్నులు కన్నులే కమలాభిరామ!360జలజాక్ష! నీపాదజలజాతయుగముఁదలఁపనేరని దుష్టతముల నేమందు!తప్పక నీమూర్తి దర్శించి మ్రొక్కియిప్పుడే పనివింటి నిందిరారమణ!కన్నులఁ జల్లగాఁ గనుగొంటి మంటినెన్నిచందంబుల నేకృతార్దఁడను!”అనిపల్కి కృష్ణున కందంద మ్రొక్కిచనియె నారదుఁ డొండు సదనంబులోని
శ్రీకృష్ణలీలలు
కక్కడ హరి యుద్ధవాచార్యు తోడనక్కజంబుగఁ జూదమాడగఁ జూచియతనిచేఁ బూజితుఁడై వేరె యొక్క
సతియింటి కరుగుచో శస్త్రాస్త్రలీలలభ్యసింపుచునున్న హరిగాంచి మ్రొక్కియభ్యుదయంబని యటవోయి చూడఁచిన్నిపాపల బొమ్మపెండ్లిండ్లు సేయుచున్న వెన్నునిఁగాంచి యుల్లంబులోనసంతసిల్లుచునుండి మంత్రులుఁదానుఁదగుకార్య మూహింప దైత్యారిచేతనగణితంబుగఁ బూజలంది యామౌని370యటపోయి చూచుచో నశ్వరత్నంబుఁజటులత నెక్కి బజ్జళ్లుఁ ద్రొక్కించు;మరియొక్క యింటిలో మగువలు దానునరమి దాఁగలిమూఁత లాడంగఁజూచియాదట నొకయింట నమలధేనువులుభూదేవులకు ధారఁబోయఁగఁ జూచి;వెండొక్క యింటిలో వెన్నుఁడు సతులుకుండలీనృత్యంబుఁ గోరి యీక్షింపఁగనుగొనె, నాయింట కజ్జాలు పంచిపెనుపార సతులకుఁ బెట్టంగఁజూచె;ఇద్దసమాధిభూయిష్ఠుఁడై యొక్కశుద్ధాంతమున నుండఁజూచి యిబ్బంగివెరవార పదియాఱువేవుర యిండ్లపరిపరివిధములఁ బంకజోదరుఁడుకోరి క్రీడింపఁ గన్గొని దేవమౌనిశౌరిసత్యజ్ఞానసంపదలాత్మనచ్చెరువందుచు హరిఁబ్రస్తుతించి
యిచ్చ నెంతయుమెచ్చి యిట్లని పలికె.“సర్వభూతాత్మక! సతతంబు మెలఁ(ఱఁ)గుసర్వజ్ఞుఁడవు నీవు సకలలోకేశ!380మానుషతను బొంది మహనీయ యిట్టిజ్ఞానాధికుండౌట చర్చింపనరుదు!యోగమాయారూఢి నొనరిన నిన్నుయోగీంద్రులును గాన నోపరు కృష్ణ!ఏయుగంబులయందు నెవ్వరు మున్నునాయంత నెఱుఁగరు నలినాక్ష నిన్ను!నీతత్వరూపంబు నెఱిఁ బెక్కుగతులఁజేతోగతంబయ్యెఁ జెన్నార నాకు!నొక్కఁడ వయ్యును నురుపుణ్యమూర్తి!పెక్కురూపులుదాల్చి పెంపొందుచుండి;గురుఁడును దండ్రియుఁ గోరి దైవంబుఁబరమాత్ముఁడవు పరబ్రహ్మంబు నీవ!”అని ప్రదక్షిణపూర్వమై వచ్చి మ్రొక్కిజననాథ! నవ్వుచుఁ జనియె నారదుఁడుహరియుఁ బదారువేలంగనాజనులుమరిగి వర్తించిన మహనీయకథలుచదివిన వ్రాసిన సద్భక్తి విన్నమదిలోఁన దలచిన మనుజోత్తములకుఁగరమొప్ప ధర్మార్థ కామమోక్షములుదొరకును భవదుఃఖదోషంబు లణఁగు”390నని చెప్పి శుకయోగి యప్పుణ్యచరితలనఘ! వెండియు వినుమని చెప్పదొడఁగె.
“నారదు వీడ్కొల్పి నలినాక్షుఁడంతనారులు దాను నున్నత కేళిసలుపఁగమలారి యామినీకన్యకఁ బ్రీతిఁగ్రమమొప్పఁ బెండ్లికి గానేఁగుదేర
సాయంకాల వర్ణనము
చరమాద్రి యను కలశము నీటిలోనగురువెట్టిన ఘడియకుడుకయో యనఁగ!పరపైన ద్విజవాక్యఫణతులు చెలఁగఁగరమొప్పఁ గ్రుంకె భాస్కరమండలంబు;ఎఱసంజ యడరి కెంపెక్కె నంబరము;తఱితఱిఁ బొడఁజూపెఁ దార లందంద,ఆలోన సకలదిశాక్రాంత మగుచుమేలైన కృష్ణుని మేచాయఁ బోలెనెఱినొప్పఁ గాళింది నీరంబువోలెతఱచైన తేఁటుల దాటుఁల వోలెపెనుపైన నీలాల పేరులు వోలెఘనమైన యేనుఁగ కదువులు వోలెనలినొప్పు నీలోత్పలంబులు వోలెఁబొలుపైన కస్తూరి ప్రోగులు వోలెఁ400దొలుకారుకాంతులు తుఱుములు వోలెఁదలమీరి చీఁకటి దట్టమై పేర్చిఘనతమోవారణగర్వంబు లణపఁగొనకొన్న సింగంపు కొదమకో యనఁగరాకావధూమణి రాగిల్లి చూచు
ప్రాకట రత్నదర్పణమకో యనఁగశార్వరీసతిముఖజలజమోయనఁగఁబూర్వపర్వతముపైఁ బొడమె చందురుఁడు;తఱిమి దిక్పతుల దంతపుకరాటముననెఱయఁ గర్పూరంబె నించిన మాడ్కిపరమైన బ్రహ్మాండభాండంబు నిండికరమొప్ప విలసిల్లె కౌముదీలక్ష్మి;అంతట పీడితులై చకోరములువింతమైఁ బఱతెంచె వెన్నెఁలగ్రోల;వెరవారఁ గృష్ణుఁడు వెన్నెలబైటఁదరుణులు దానును దగ వినోదించినందఱి యిండ్లను నమరు పాన్పులనునందఱఁ గ్రీడించె నన్ని రూపములఁదెఱవలుఁ దారు మోదిలి యుండిరంతఁదఱచుగా నెలుగెంచెఁ దామ్రచూడములు.410
శ్రీకృష్ణుఁడు మేల్కని ప్రాతఃకాలకృత్యములఁ దీర్చుకొనుట
వందిమాగధ భాగవత నినాదములఁగ్రందున శౌరి మేల్కని ధర్మచింతఁదలపోయుచును లేచి తల్పంబు డిగ్గికలధౌతమయపాదుకలఁ బ్రేమఁ దొడిగియువిదలు కైదండలొసఁగి తోనడువరవణించు కనకవజ్రపు బిందియలనుజలకములాడి వస్త్రములు మైఁదాల్చి
సలలితంబుగఁ దీర్చె సంధ్యకృత్యములు.ఎసగంగ నుదయాచలేంద్రంబు మౌళిపసిఁడి కోహళియన భానుఁడు వొడువఁగలకొన కర్పూరగంధ వాసనలనలరెడి విరులచే నతిభక్తితోడదేవార్చనంబు భూదేవార్చనంబుదైవపైతృకములు తెఱఁగొప్పఁ జేసితిలభూహిరణ్మయధేను దానములసలలితంబుగ విప్రసంఘంబుఁ దనిసికోరి విద్వజ్జన గోష్ఠి నాలించియారూఢగతిని తత్వార్థంబుఁ దెలసియంబరాభరణమాల్యానులేపములుతాంబూలములు నిచ్చి తగ వీడుకొల్పి420దివ్యమాల్యంబులు దివ్యగంధములుదివ్యభూషణములు దివ్యాంబరములుధరియించి తగ నాజ్యదర్పణద్యుతులుపరికించి మోసాల బయలికేతెంచిపటహకాహళశంఖపాటకారావపటుతరాశీర్వాదభద్రనాదములుతరమిడి మ్రోయ నందక శంఖచక్రవరగదాశార్ఙ్గ దుర్వారశస్త్రములుపురుషరూపముఁ దాల్చి పొరిదన్నుఁ గొలువకరుణాకటాక్షవీక్షణరోచు లొలయ
నల్లన నవ్వుచు నఖిలబాంధవులఁజల్లని చూపుల శౌరి వీక్షింపఁదేరాయతము సేసి తెచ్చి మ్రొక్కుటయుదారకుఁగని నవ్వి తగ రథంబెక్కిపసిఁడిబద్దలబూనిఁ పడవాళ్లు మ్రోయనెసఁగ సందడి జడియించి తోనడువనగరి సుధర్మాఖ్య యగు సభాస్ధలినికరమొప్పు ముత్యాల గద్దియ మీఁదవీరాసనస్థుఁడై విష్ణుఁ డొప్పారె.చేరి రసజ్ఞులు సేవకోత్తములు430నగణిత నీతివిద్యావిశారదులుదగుమంత్రి సామంత దండనాయకులునల్లుఁడు కొడుకులు నఖిలబాంధవులునెల్లసంపదలతో నేపారి కొలువఅందంద కరకంకణారావ మెలయచందనగంధులు చామరల్ వీవఁగొలువెల్లఁ దామరకొలను చందముననలరి సేవింపఁగ నధికమోదముననగ్రజుఁడును దాను యమ్మురారాతియుగ్రసేనునిఁ గొల్చియున్న యావేళదౌవారికులచేతఁ దగఁజెప్పి పనిచియావాసుదేవుని యనుమతిఁ బడసిచనుదెంచె నొక్కఁ డాజలజాత నేత్రుఁగని మ్రొక్కి పలికె నక్కటికంబుఁదోఁప.
రాజులచేఁ బంపఁబడిన దూత శ్రీకృష్ణుని యెదుట మొరవెట్టుట
“జగతి భారము మాన్ప శత్రుల నడపనగణితంబగు సాదులగు వారిఁగావయాదవాన్వయమున నవతారమొందితాదినారాయణ! అమరేంద్రవంద్య!మగధభూపాలుఁడు మది నోట లేకజగతీశ్వరులనెల్లఁ జంపుచున్నాఁడు!440వెఱవేది యిరువుర వేవుర నృపులఁజెఱఁబెట్టి మదిఁ గృపచింత వోవిడిచితరమిడి దినమొక్క ధరణీశవరునిఁబొరివుచ్చి భైరవపూజఁగావించు.అతనికి లోఁబడ్డ యవనీశులెందుఁగతిలేక యున్న మీకడకుఁ బుత్తేరనరుదెంచినాఁడ నీవాజరాసంధుఁబరిమార్చి నృపకోటి ప్రాణంబు లెత్తుమేవిధంబున నైన నీబారిఁ గడవనీవెకాకొక్కండు నేర్చునే కృష్ణ?ఇది నీకు విక్రమింబిది నీకుఁ బెంపు!ఇది నీకు శౌర్యంబు యిందిరాధీశ!కీర్తియు సుకృతంబు గెలుపు నీకబ్బు!ఆర్తుల రక్షింపు మంభోజనయన!”
నారదుని యాగమనము
అని దూత వినుతింప నంత నారదుఁడు
చనుదెంచె దివినుండి శౌరిసన్నిధికి.అమ్ముని కెదురేఁగి యర్హపీఠముననిమ్ముల నిలిపి మోమీక్షించి పలికె.“మునినాథ! త్రిభువనంబుల వార్తలెల్లఘనదివ్యదృష్ఠిని గననివిలేవు!450ఏమి విశేషంబు లెఱిగింపు” మనినఆముని నవ్వుచు హరిఁ జూచి పలికె.“నీమహత్వంబున నిఖిలంబుఁగాంతునీమాయకడఁగాన నేరకున్నాఁడ!కోరి నీ మేనత్తకొడుకు ధర్మజుఁడుసూరివంద్యుఁడు రాజసూయాధ్వరంబుఁజేయనుద్యోగించి చెచ్చెర నిన్నుశ్రీయుక్తి నాచార్యుఁ జేయనున్నాఁడు!ఆమఘంబీక్షింప నఖిలదేవతలుభూమీశ్వరులు వేడ్కఁ బోవుచున్నారునీరజాయతనేత్ర నీవువిచ్చేసిబోరున రిపుకోటిఁ బొరిమార్చు వేగనచ్చట, శిశుపాలు డడరి నీచేతజచ్చు నీపయనంబు సమకూర్పవలయు;పొరి జరాసంధుఁ నుబొరిమార్ప నెట్టివీరున కెందును వెరవుగాదెందు!అతఁడు భీమునిచేత నట మల్లయుద్ధహతుఁడౌను యన్యుల కతఁడజేయుండు.భీమునిచేతను బెరపెట్టి చంపునే మీకు నెఱిఁగింప నేతెంచినాఁడఁ460
నారదుని మాటలను విని శ్రీకృష్ణుఁ డుద్ధవాచార్యుని యభిప్రాయము నడుగుట
బనివినియద” నంచుఁ బద్మాక్షు వీడుకొని నారదుఁడు బోవ గోవిందుడంతనయ్యుద్ధవునిఁ జూచి యంతరంగముననెయ్యంబు లియ్యంబు నెరయ నిట్లనియె.“నీతియు ధర్మంబు నేర్పును హితవుఁజాతుర్యమును గల సత్యసంధుడవు;కడఁకతోఁగార్యంబుఁ గనుచోట మాకుఁగడునొప్పు మీరలె కన్నులు బుద్ధి”యనుటయు నుద్ధవుఁడంబుజోదరునిఁగనుఁగొని నమ్రుఁడై కడునొప్పఁ బలికె.“ఇందిరాధీశ! నీవెఱుఁగని కృత్యమెందును గలదె నన్నిలఁ బెద్దఁజేసిమన్నించి యడిగెద మార్గంబుఁ దెలియవిన్నవించెద నర్థి విను”మని పలికె.“పరమబంధుఁడు నీకు పాండవాగ్రజుఁడుసురుచిరంబుగ రాజసూయంబు సేయఁదలఁచినయట్టి యధ్వరకృత్యమునకుఁగలఁకువ లేకుండఁ గాచి రక్షింపు!ప్రాణంబుతోడ జరాసంధుఁడుండస్థాణునకును గావ శక్యంబు గాదు!470వాని నేగతినైన వధియింపకున్నపూను జన్నంబు సంపూర్ణంబు గాదు.ఘనబలాఢ్యుఁడు గాన కదనంబులోనఁ
జెనకి యెవ్వనికి నిర్జింపఁగా నరిదియనిలజార్జునులతో నాపురికేఁగిచని విప్రవరులయాచందమై వేడిమల్లయుద్ధంబున మరి భీముచేతనెల్లభంగులవాని యేపడగింపుమాతఁడు దీరిన నఖిలరాజులకుఁ“బ్రీతియౌ పగదీరుఁ బెంపొందు నీకుఁదగ జరాసంధుచేతను బద్ధులైనజగతీశ్వరులఁ బ్రోవఁ జనుటయే లెస్స.”
శ్రీకృష్ణుని ఇంద్రప్రస్థ ప్రయాణము
అని యుద్ధవుండిటు లాడువాక్యములువిని సంతసమునొంది వెన్నుఁడాప్రొద్దెయానకదుందుభి హలపాణి యుగ్రసేనాదులనుమతి సేయంగఁ గదలిభూతలాధీశులు పుత్తెంచినట్టిదూతకభీష్ట వస్తువులిచ్చి యనిపిపటు సైన్య మేఘ పుష్పక బలాకాదిచటులవాజులఁ బూని సన్నద్ధలీల480గరుడకేతనకాంతిఁ గడునొప్పు తేరుగురుతరంబుగ దారకుఁడు దెచ్చి మ్రొక్కనారోహణము సేసి యఖిలబాంధవులుఁదోరంపు వేడుకతోఁ గొల్చి రాఁగఁ;జెలువారు కాంచన శిబిరంబు లెక్కియెలమి పట్టపుదేవు లెనమండ్రు నడువ;
వలనొప్ప పటహాదివాద్యంబు లొలయవందిబృందములు కైవారంబు సేయసందడి పడవాళ్లు జడిసి తోనడువనతివైభవముల నిత్యప్రయాణములజతురతఁ బెక్కు దేశములుత్తరించిజలజాతనేత్రుఁడు సకలసంపదలఁబొలుచునింద్రప్రస్థపురము కేతెంచె.
ధర్మజాదులు శ్రీకృష్ణుని సమ్మానించుట
అమ్మహాత్మునిరాక యరసి ధర్మజుఁడుతమ్ములుఁ దాను బాంధవులతో నెదురు,వచ్చి నమ్రుండైన వసుదేవతనయుగ్రుచ్చి కౌఁగిటఁ జేర్చె; గోవిందు డంతననిలనందను బ్రేమ నక్కునఁ జేర్చితనకు మ్రొక్కిన మాద్రి తనయుల నరుని490ననువార నాలింగనము సేసి వారలందఱుఁ గొల్చిరా నమరేంద్రులీలఁజెంది యప్పురిఁ ప్రవేశించె మురారి.పౌరుల కన్నులపండువ గాఁగభూరిపుణ్యుఁడు పాండవుల నగరికినినరిగి కుంతికి మ్రొక్క నమ్మహాదేవికరమొప్పఁ గృష్ణుని గౌఁగిటఁ జేర్చియానందరసముబ్బి యలుగులుఁ బారఁ
బూని యందఱఁ బ్రేమఁబూజించి కుంతిపాంచాలసుతయు సుభద్రయుఁ గృష్ణుఁగాంచి సాష్టాంగంబు కరమర్థి నెఱఁగిహరి కాంతలును దాను నన్యోన్య ప్రేమబరిరంభణముల సంభావన క్రియలసలిపి యింపార మజ్జనభోజనములఁగలసి క్రీడించిరి; కమలాక్షుఁడంతనాపాండవుల సేమమంతయు నడిగియాపార్థు గృహమున కరుగ నన్నరుఁడుమజ్జనభోజన మహిత సౌఖ్యములనజ్జగన్నాథుని నతిభక్తిఁ దనిపి500హంసతూలిక పాన్పునందు సంప్రీతిఁగంసారి నునిచి కాల్గడనుండి క్రీడనడుగు లొత్తుచు నుచితాలాప లీలఁగడఁగి వినోదింపగా ధర్మసుతుఁడుచనుదెంచుటయు శౌరి చయ్యన లేచితనర నానృపు కరస్థలిబట్టి తివియనేక శయ్యను వారలిరువురు నుండఁజేకొని తమ్ములు సేవించియుండ“నారగించితే కృష్ణ! అలసితీ” వనుచు
ధర్మరాజు రాజసూయయాగ విషయమై శ్రీకృష్ణుని యెదుట ప్రస్తావించుట
శౌరితోడ నజాతశత్రుఁ డిట్లనియె.“లోకబాంధవ! చంద్రలోచన! భక్త
లోకరక్షణ! సితశ్లోక! లోకేశ!నీవెఱుఁగని యవి నిఖిలంబు లందులేవెల్ల యెడల నిర్లేవుండ వీవవినుము నీ కెఱిఁగించు విన్నపమొకటి.ఆనఘాత్మ! రాజసూయము పేరి క్రతువుసేయుదునని మదిఁ జింతించినాఁడనేయుపాయంబున నిదిసిద్ధి బొందునానతిమ్మనుఁడు నాయమతనూభవునియాననంబీక్షించి హరి ప్రీతిఁ బలికె.510
శ్రీకృష్ణుఁడు రాజసూయయాగము నాచరింపవలసినదిగా ధర్మపుత్రుని ప్రోత్సహించుట
“కౌరవవృషభ! లోకము రాజులకునుయేరీతి సిద్ధింప దీమహాక్రతువుధరణీశ! నీవు నీతమ్ములు బలిమిదొరకని కార్య మెందును గలదయ్య?పితృదేవ సద్విజప్రీతి గావింపుటతిశయమగుపుణ్య మయ్యధ్వరంబు!రాజులఁ గెలిచి వారల ధనావళులరాజసంబునఁ దెచ్చి రాజసూయంబువెలయింపవలయు దిగ్విజయంబు సేయఁదలఁచిన వేగ నీ తమ్ములఁ బంపు”మని చెప్పుటయు విని యమనందనుండుననుజుల దిగ్విజయార్థంబు ననుపఁ
పాండవులు దిగ్విజయ యాత్రకై వెడలుటజటుల బలాఢ్యుఁడై సహదేవుఁ డెలమియట దక్షిణంబున కరిగె పెంపొంది;నకులుఁడుదగ్రసైన్యము తన్ను గొలువఁబ్రకటితంబుగ నేఁగెఁ బడమటి కడకు;ఘనబలోపేతుఁడై కదలి యర్జునుఁడుధనదు దిక్కునకు నుద్ధతవృత్తి నడచె;సేమంబుతోడుత నెఱిఁ బూర్వదిశకుభీమబలాఢ్యుఁడై భీముఁడుఁ గదలె;520నీభంగిఁ జని దిక్కులెల్ల సాధించియాభీలరణకేళి నహితుల నోర్చికరిహయమాణిక్యఘన నిష్కములునువరరత్నభూషణావలు లొప్పఁ దెచ్చిధర్మనందనునకుఁ దగ వేఱవేఱనర్మిలి నొప్పించి యనుజు లిట్లనిరి.“జననాథ! విను జరాసంధుఁడు దక్కమన కరి వెట్టని మహివుఁడు లేడువాని నిర్జింప కధ్వరకృత్యమునకుఁబూనఁగఁ దలఁచుట బుద్ధిగా దెందు.”అని పల్క నుర్వీశుఁడగు ధర్మసుతునిఁగనుఁగొని బోధించి కంసారి పలికె.
శ్రీకృష్ణుఁడు జరాసంధుని మాయించెదనని చెప్పుట
“జననాథ! నీభుజాశ్రయశక్తి దలఁపనెనయ జరాసంధుఁ డెంతటి వాడు?
మల్ల యుద్ధంబున మారుతిచేతనెల్లుండి చంపింతు నిటు జూడు మమ్ముఁబనుపుము నీకింత భయమంద నేల?”అనిపల్కి భీముఁడు నర్జునుఁ డెలమితనుఁగొల్చి రాగ నుద్ధత గిరివ్రజము
శ్రీకృష్ణుఁడు భీమార్జునులతో బ్రాహ్మణవేషములను ధరించి గిరివ్రజము ప్రవేశించుట
దనర బ్రాహ్మణ వేషధారులై చొచ్చి530యరులకభేద్యుఁడై యలరు మాగధునివర మందిరమున కవారణ నరిగిదేవగురుద్విజ తృప్తిఁ గావించుసావధానుని జరాసంధునిఁ గాంచివామనరూపమై వచ్చి యబ్బలినిభూమి వేఁడినయట్టి బుద్ధులప్రోగుయనిలజార్జునులతో నర్థి దీవించిచనవున నాజరాసంధుతో ననియె.
శ్రీకృష్ణుఁడు జరాసంధుని యుద్ధభిక్ష వేఁడుట
“అనఘాత్మ! యీయింటి కథితులు మేముచనుదెంచినారము సకలవస్తువులునడిగిన లేదన కర్థుల కిచ్చుకడుపుణ్యనిధివి మాగధరాజతనయ!ఏమిగోరిన యర్థ మిచ్చి నిచ్చలునుభూమిలోఁ బొగడొంది బొంకవెన్నఁడును!
ఘనకపోతమునకై కండలు గోసితనువిచ్చి శిబి ధాత్రి ధన్యుఁడు గాఁడె!మును హరిశ్చంద్రుండు మొగి కౌశికునకుఁదనరార పుత్రునిఁ దగ విక్రయించిచండాలరూపమై శౌర్యంబుఁ గ్రాఁగియుండి తాఁబొందఁడే యూర్ధ్వలోకంబు!540ఒక కపోతము తొల్లి యొక కిరాతునకుఁబ్రకటమై తనమేను భక్ష్యంబుఁ జేసియెట్టిపుణ్యులకైన నెన్నఁగరానియట్టిలోకము గాంచె నని చెప్ప వినమె!పడుచును కనకంబుఁ బ్రాయంబు నమ్మియడిగిన లేదని యర్థి వర్గంబునెడపిన పాపాత్ము లిందును నందుఁజెడిపోవుదు”రనుచుఁ జెప్పిన నతఁడువారి తేజంబులు వారి సత్వములువారి మేనుల రణవ్రణకిణంబులునుగని మహీనాథులుగా నిశ్చయించియనియె వారలతోడ నల్లన నగుచు.“భూపాలకులు మీకుఁ బురుడేది! విప్రరూపంబులొంది మా ప్రోలికి వచ్చియడుగుచున్నారు మీరథితులుగారు!అడుగుఁడు ప్రాణంబులైన మీకిత్తు!విప్రవేషముఁదాల్చి వేఁడుట చేతవిప్రోత్తముఁడు స్వయం విష్ణుఁడ వీవ”యని పలుకఁగ శౌరి యతని తెంపునకు
మనములోపలమెచ్చి మగధున కనియె.550అనఘ! యుద్ధార్థులమై వచ్చినారమెనయఁ గృష్ణుండ నే నితఁడు వాయుజుఁడువాఁడు కవ్వఁడి మాకు ద్వంద్వయుద్ధంబుపోఁడిగా నిమ్మన్న పొంగి మాగధుఁడు“అగుఁగాక మీకోరి నట్ల యుద్ధంబుఁదగ నిచ్చినాఁడ యుద్ధతఁ జేర్చిరండు“గోపాల! నీవోడి కురుకుమారకులవైపునఁ దెచ్చితి! పడుచుల తరమె!పసదప్పి నీవోడి పారిన నేలకసువు మొల్వదు నేఁడు! కాన నీతోడసమరంబు సేయుట సమయంబు గాదుకమలాక్ష! నాకీడుగాఁ డర్జునుండుమల్లయుద్ధంబున మారుతాత్మజునిత్రుళ్లడంచెద! మీరు తొలఁగఁగ జూడుఁ”
భీమజరాసంధుల మల్లయుద్ధము
డనిపల్కి సన్నద్ధుఁడై యూరు వెడలిచని యొక్క యెడ సమస్ధలముఁ గావించిమారుతాత్మజుఁడును మగధభూపతియునీరసంబున డాసి యేపార నంత;నంతకాకారులై యత్యుగ్ర భద్రదంతావళంబులు దగ్గఱు మాడ్కి560పటుతర నిర్ఘాతపాతంబులట్లచటులతమై మల్ల చఱచి యొండొరులఁ
బట్టుచు విడుచుచు బాహుపాశములఁజుట్టి విణ్ణాణముల్ చూపి యార్చుచునుసరియగు సవ్యాపసవ్య మార్గములఁదరమిడి గదిసమై తాఁకి వైచుచునుగడల కొమ్మంటులు గ్రమ్మంగఁ జెట్టుకడఁగి వ్రేయుచుఁ జేత గదిమి తప్పుచునునాశీవిషంబుల ననువున మ్రోసియాశుగమును బోలి యందంద వ్రేయముదమున డగ్గరి ముష్టిఘాతములపదతాడనంబులు పటుశక్తిఁ జూపిభీముని మగధుండు పిడికిటఁ బొడువనామారుతాత్మజుఁడ చలుఁడై నిలిచిమోకాలఁ గొని గుండె మోవంగఁ బొడువవీఁకరి మగధభూవిభుఁ డుర్వి వ్రాలె!క్రమ్మన లేచి భీకర ముష్టి హతులనమ్మారుతాత్మజు నందంద నొంపతఱలక నాతఁడాతని జత్రు దేశమఱిముఱి బొడిచిన యంగంబు వడఁక570పడిపడి నిల్చి యాపవమానసుతుఁడునడుముఁ బీడించి విణ్ణాణంబు గొనఁగజాడించి యిరువురు సమసత్వ లీలవీడాడి నొప్పింప వెన్నుఁడు గాంచి!
జరాసంధవధ
వాయుపుత్రుఁడు జూచువగ వృక్షశాఖఁ
జేయార్చి రెండుగాఁ జీరి నవ్వుటయునాసన్న దెలిచి మహాబలాత్మజుఁడుఆసన్నుఁడగు శత్రు నంటంగఁ బట్టిపడవైచి కడకాలుఁ బరుసనఁ ద్రొక్కివెడవెడ నార్చుచుఁ బ్రిదిలి పోనీకనటమున్ను జరచేత నంటంగబడినచటులాత్ముఁడగు జరాసంధుని మేనుతరమిడి కదిళికాస్తంభంబుఁ జీరుకరిఁబోలి నుగ్రభీకర లీలఁ జీరియిరుపక్కలుగఁ జేసి యిరువంక వైచిపరువడి నార్చిన పవమానసుతునిహరియును నర్జునుఁ డందంద పొగడసురసమూహము ప్రీతిఁ జూచి కీర్తించె.
శ్రీకృష్ణుఁడు జరాసంధుని కుమాఁరుడు సహదేవుని రాజ్యమం దునిచి, కారాగృహవాసులగు రాజులను విడిచిపుచ్చుట
హరియు జరాసంధియగు సహదేవుఁబరగ మగధరాజ్య పట్టంబుఁ గట్టి;580యఱిముఱిఁ జరసాల యందున్న నృపులవెఱవాపిఁ యందఱ విడిచి పుత్తెంచె.కారాగృహంబునఁ గడుమాసి సొచ్చిక్రూరబాధలఁ గంది కుందుచునున్నయిరువదివేవురు నెనమన్నూటాఱ్వురురుచయ భ్రాంతులై యొండొండ వెడలిచనుదెంచి కనిరి వాసవలోకవంద్యు
ననుపమదివ్యభూషాంబరాభరణుభీమార్జునసమేతుఁ బృథుదీర్ఘబాహుకామితార్థప్రదుఁ గడు భక్తి మ్రొక్కి;“శ్రీనాథ! గోవింద! శ్రీవత్సచిన్హ!దానవాంతక! కృష్ణ! తామరసాక్ష!ధారుణి రక్షింప ధర్మంబు నిలుపఁగ్రూరదైత్యులఁ ద్రుంపఁ గోరి జన్మించియాజనార్దునుఁడ వీవామ్నాయరూప!ఈ జరాసంధుచే నీబాధనొందినునికియు నిది మహదుపకారమయ్య!ఘనయోగవర్యులు గానఁగలేనినినుఁజూడఁ గంటిమి నిఖిలాండ నిలయ!590తలఁపులుఁ దనువులు దయనిచ్చితీవుజలజాక్ష! ఇది పునర్జన్మంబు మాకు!ఖలు జరాసంధు నొక్కట జీరివైచిబలియుఁడై పేర్చెనీ బకవైరి లావు!”అని దీనవదనులై యర్థి కీర్తించుజననాయకులఁ గృపాజలరాశిఁ దేల్చిజలజాక్షుఁడంత మజ్జనభోజనములనలరించి భూషాంబరాదు లర్పించివారల నూరార్చి వలనొప్పఁ బలికె.“క్రూరాత్ము చరసాలఁ గుంది లోఁగందిముచ్చట నున్నారు; మొగిరాజ్య లీల
లచ్చుగ భోగించుఁ డరుగుడు వేడ్కమదమత్సరంబులు మాని యేప్రొద్దుమదిలోన నన్ను నేమఱకుండుఁ” డనుచురాజుల ననిచి జరాసంధి చేతఁబూజలు గొని రథంబులు వేడ్క నెక్కియనిలజార్జునులతో యతివైభవమునదనుజారి వచ్చె నింద్రప్రస్థపురికి.
శ్రీకృష్ణుఁడు భీమార్జునులతో నింద్రప్రస్థపురికి మఱలి వచ్చుట
వచ్చి యాపట్టణద్వారంబు నందుసచ్చరిత్రుఁడు పాంచజన్యమొత్తుటయు600నారవమాలించి యరుదెంచి పౌరులారూఢమగు మహా హర్షంబుతోడఁగామాది రహితు నిష్కాము శ్రీకృష్ణురామానుజన్ముఁ బురాణ పూరుషునిఁగనిమొక్కి సంతోష కలితులై రంత;అనుజులు కృష్ణుఁడు నరుదెంచి మ్రొక్కపరమసమ్మదమునఁ బాండవాగ్రజుఁడుకరమర్థి మువ్వురఁ గౌఁగిటఁ జేర్చిహరిమోముఁ గని ముదితాత్ముఁడై పలికె“పురుషోత్తమాచ్యుత! పుండరీకాక్ష!వరద! వామన! భక్తవత్సల! కృష్ణ!సరసిజాసనవంద్య! సారసనేత్ర!నీదాసులగు మాకు నిఖిలలోకముల
నేదసాధ్యములగు నిందిరాధీశ!మఱఁదులు నీవు నమ్మగధేశు మీఁదయఱిముఱి నేఁగిన నంతనుండియునువిలసిల్లు నురిగోల వేదనఁ బొందుపులుగు చందంబునఁ బొరలు చుండితిమి!చెచ్చెర శత్రునిర్జించి మీరిందువచ్చిన ప్రాణంబు వచ్చె గోవింద!”610అని పల్కుటయు పాండవాగ్రజుఁ జూచివినయంబుఁ దోఁప నవ్విష్ణుఁ డిట్లనియె.“నీయాజ్ఞ తలమోచి నెగడిన మాకునాయెడ జయలబ్దులగు టెందు నరుదె?మూఁడులోకములకు ముల్లైన యట్టివాఁడు మగధభూమి వల్లభు నట్టెవాని నశ్రమమున వధియించె భీముఁడేను నాసత్వము నేమనఁగలను!బెడిదంపు పగదీరెఁ బెంపొంద నీవుఁదొడరి యజాతశత్రుఁడవైతి గాన
శ్రీకృష్ణుని ప్రోత్సాహముచే ధర్మరాజు రాజసూయమునకు గడంగుట
రాజుల రక్షింప రాజసూయంబునోజముఁ దప్పక నొనరింపు” మనినహరి వాక్యములకుబ్బి యమతనూభవుఁడుకురుపతి ముఖ్యులఁ గోరి రప్పించిభాగీరథీతీర పావనస్థలిని
యాగశాలలు గట్టి యఖిల వస్తువులుసమకూర్చి వ్యాసాది సంయమీశ్వరులఁగ్రమమొప్ప ఋత్విజగణము రావించియాగోపకరణంబు లన్నియుఁ దెచ్చియాగమోక్తక్రియ నన్ని సంధించి620దక్షుల నియమించి ధర్మనందనుడుదీక్షితుఁడై మహాద్విజకోటితోడవేలుచుచుండఁగ విష్ణుఁడంతటికిఁజాలి భూసురవర్యసమితితో నిలువతమ్ములు సకలబాంధవులును దారుఁగ్రమ్మర పరిచర్యఁ గావింపుచుండహవ్యభాగమునకు నఖిల దేవతలుదివ్యయానములతో దివినుండి చూడ
యుధిష్ఠిరుఁడు శ్రీకృష్ణున కగ్రపూజ నొసంగుట
నయ్యుధిష్ఠురుఁడు ధౌమ్యాదుల గూడిచయ్యన నగ్రపూజలు చేయఁగోరియందఱ రాజుల నర్థి నీక్షించి‘ఇందెవ్వరికి నర్ఘ్యమిత్తునో” యనఁగసహదేవుఁ డన్నకు జలజాక్షుఁ జూపి“విహిత మాయర్ఘ్యంబు విష్ణున కిమ్ముద్విజుఁడును గురుఁడు ఋత్విజుఁడును భూమిభుజుఁడు దైవంబునై పొలుపారు నతఁడు!అతనిఁ బూజించిన నఖిలదేవతలుపితరులు మునులు సంప్రీతిగావింతు”
రనవుండు ప్రియమంది యమతనూభవుఁడుఘనభక్తి హరికి నర్ఘ్యము సమర్పించె.630బహురత్న భూషణాంబర గంధపుష్పవిహితభంగుల మంత్ర విధిఁ బూజ సేయమునులు రాజులు మనంబుల సంతసిల్లననిమిషావళి వచ్చి యభినుతి సేయనాలోన శిశుపాలుఁ డంతయుఁ జూచికాలాహిగతి మ్రోసి కరతలంబెత్తియొండొండ రోషాగ్ను లొలుకుచుండఁగనుపాండవాగ్రజు జూచి పలికె నుద్వృత్తి
శిశుపాలుఁడు శ్రీకృష్ణుని నిందించుట
“కటకటా! ధర్మజ! కడుచిన్నపాపఁడిటుజెప్ప నీబుద్ధి యేల నిట్లయ్యె?గోపాలకుని జాలికుని సత్వహీనుబాపాత్ముఁ బశుకర్ముఁ బరదారగమనునేమని పూజించి తిందఱి నడుమ?ఏమటివాఁడు వీఁడీ యర్ఘ్యమునకుబలపరాక్రముల భూపతుల సన్మునులదలవంపు సేయఁగఁ దగునయ్య నీకు?ఎఱుగక కూర్మి నీవిచ్చిననైనతఱిలేచి యర్ఘ్యంబు తానెట్లుగొనియె?పూజనీయులగు నీ పురుషులలోననేజాతిగలవాఁడు! ఇటుపెద్ద సేయ?”640
ధర్మరాజు శిశుపాలునకు సమాధాన మిచ్చుటఅనిపల్కుటయు విని యంతకాత్మజుఁడు“వినవోయి! శిశుపాల! వెఱ్ఱివి గాకహరికి సమానుఁడు నధికుఁడు గలడె?ఇరవుఁదప్పినమాట నేటికాడెదవు?యజ్ఞరక్షకుడును యజ్ఞభోక్తయునుయజ్ఞఫలంబిచ్చు నతఁడును దానె!అతని తేజోశంబు లఖిలదేవతలునతని గాదన నీకు నర్హమే యిట్లు?”అని పల్క సభ్యులు నతనిఁ గీర్తించికనుఁగొని శిశుపాలుఁ గలుషించిరంత.
శిశుపాలవధ
ఆమాటలకు దైత్యుఁ డాత్మసైన్యంబుతో మహారౌద్రంబుతోఁ బన్నునిలుచె!కురుబలంబుల నాఁగఁగొనక వే గదిసిపరవశంబొనరింప పంకజోదరుఁడువారల వారించి జ్వలనార్చులొలయదారుణచక్ర ముద్ధతఁ బ్రయోగింపనాదిత్యకుండలాయతతీవ్రమగుచుఁజేదిభూపతి శిరచ్ఛేదంబు సేసె.ఆహారవంబులు నమరసన్నుతులునోహోబలంబుల నులివు పె ల్లడర650నాతని తేజోంశ మందఱుఁ జూడనాతతంబుగ వచ్చి హరిలోనఁ గలసె!
మునులు ఋత్విజులునుమురవైరి లావుఁగొనియాడి మెచ్చిరి గురుభక్తి నంతరాజసూయంబుఁ బూర్ణము సేసి ధర్మరాజు, పెంపున భగీరథు సుతయందునవభృతస్నాతుఁడై యరుదెంచి రాజనివహంబుఁ బూజించి నెరవడిఁ గొలిపివరదక్షిణల విప్రవరకోటిఁ దనిపియావిభవంబున నఖిలబంధులకువావిరి నుత్తమవస్తువు లొసఁగియనుప! సుయోధనుఁ డా పట్టణముననినుపారఁ గొన్నినెలలు వర్తించియాసంపదల పెంపు నయ్యధ్వరంబునాసభావిభవంబు నాగౌరవంబుఁబాంచాలి రూపసౌభాగ్యసంపదలుఁగాంచి నిర్విణ్ణుఁడై కడు చిన్నపోయియమ్మహీపతిపేర్మి యంతరంగమునఁగ్రమ్మర దనవీటి కరిగె రారాజు.660పొరిఁ బాండవులచేతఁ బూజలు వడసిహరి ద్వారవతి కేఁగె నతివలుఁ దాను.”అని చెప్పుటయు కౌరవాధినాయకుఁడువినుతుఁడై శుకయోగి విభున కిట్లనియె“వరమునీశ్వర! నీదువాక్యామృతంబుగురుభక్తి నెంతఁయు గ్రోలిననైన
తనివొందు చిత్తమాదైత్యారి మహిమవినుపింపు మటుమీఁది వృత్తాంత” మనుఁడుఅమ్మహాయోగీంద్రుఁ డమ్మహాత్మునకుఁగ్రమ్మన నప్పుణ్యకథఁ జెప్పదొడఁగె.“ఇవియాదిగాఁ బెక్కు లిందిరావిభుఁడువివిధవినోదియై విహరింపుచుండె.మఱియును గృష్ణుఁడు మహనీయగతులతెఱవలఁగూడి వర్తించెఁ బెంపార;బహురత్నచిత్రితభర్మ్యహర్మ్యములవిహరించె సతతము వెలఁదులు దాను;వరపుష్పతానేక వనముల యందుమరియును బెక్కైన మదనతంత్రములఁదనిపి యాయింతుల ధన్యులఁ జేసె.”అనియిట్లు విష్ణుని యవతారకథలు670వినిపించు ఘనులకు విన్నపుణ్యులకువినిమెచ్చియీగల వివరమంతులకుఘనదోషహరమును గైవల్యసుఖముఘనులు యోగీంద్రులు గమనింపలేనిహరిభక్తి గల్గును నరయంగ నిదియవెరఁగున మది గల్గు విమలాత్ములకునుఅని యిట్లు నిత్యధర్మారంభు పేరజనలోకనవపారిజాతంబు పేరఁజతురకళాపూర్ణచంద్రుని పేరనతులవైభవనిర్జరాధీశు పేరశోభితనవరూపనూనాస్త్రు పేర
నౌభళమంత్రి కందామాత్యు పేరఁగోరి భరద్వాజగోత్రసంజాతుఁఢారూఢమతి నయ్యలార్యనందనుఁడుశృంగారరసకళాశ్రితవచోధనుఁడుసింగనామాత్యుఁడు చెలువగ్గలించిసలలితరసభావశబ్దగుంభనలవలనొప్పు శ్రీభాగవతపురాణమునమహదాదియగు దశమస్కంధసరణివిహితలీలలనొప్పు విష్ణుచారిత్రఁ 680బ్రాకట జగదభిరక్షకాండంబునాకల్ప మాకల్ప మగుభంగిఁ జెప్పె.
జగదభిరక్షకాండము సమాప్తము.
శ్రీకృష్ణార్పణమస్తు.
Comments
Loading comments…