ఎనిమిదవకథ
శుకసప్తతి
యతఁడు ప్రార్థించి పుత్తేర నరుగుదెంచెఁబొలఁతిచెంతకు నంతకుఁ బ్రొద్దుగ్రుంక. 95
ఉ. గందపుఁబూతఁబోలు ఱవికందగగుబ్బలమీటు హారపుంజందెపువాటుమాటు బురుసాపని పయ్యెదనీటుఁ జాటునేయందగు మేల్ముసుం గమర నల్ల బ్రభావతి వచ్చె మీనుడాల్పొందినరాచవాని యొఱలోనికటారిఁ దుటారమాడుచున్. 96
ఉ. వచ్చినఁ జూచి కీరమురువారముమీఱ ముఖారుణద్యుతుల్బచ్చెనపన్న నానృపతిపాలికిఁ బోయెదవేమొ పొమ్ము నీయిచ్చకు వచ్చినట్లు రమియింపు మొకానొక మాటపుట్టినన్నెచ్చెలి లేదుబంతియను నేర్పున దిద్దుకొనంగఁ జాలినన్. 97
చ. వదినెలపోరు మాన్ప నిజవల్లభు నిద్దురపుచ్చ మామనోరదమఁగ నత్తగారికి భయం బొనరింప మఱందినూరకేగదమఁగఁ దోడికోడలి కొకానొకనింద ఘటింపవచ్చుఁ బోకదిసిన నేర్పుచేత బెళుక న్వెరవొందిన జారకాంతకున్. 98
ఉ. ఇందుల కొక్కగాథ గల దింతటిలోఁ బతి పాఱిపోవఁడోయిందునిభాననా వినుమ యిందిరకుం దిరమైన యిల్లు సంక్రందనరాజధాని కెనగాఁ దగుశూరవరావలోక మారందసమాఖ్యచే నొకపురంబు పరంతపరాజు ప్రోవఁగన్. 99
తే. అచట జనవల్లభుండన నమరు నొక్కఁడంగసౌష్ఠపమున రతి యౌననంగనలరు మెండైన నిండుప్రాయంబుకలిమిరస్తుమీఱుచు నాతని గేస్తురాలు. 100
తే. వీటఁగల కోడెకాండ్రెల్ల వింతరతులజవుల మరగించి భయము లజ్జయును దీర్చజారవిద్యలఁ గడు గడిదేఱి యామిటారి విడివడ్డమరుతేజి దారిమీఱి. 101
క. తిండికతంబునఁ గండలుమెండుగఁ దాఁ బెంచి మగఁడు మెదలఁ డనుచు నుద్దండత నది మిండనికిన్వండిన కుడు మనఁగ దుడ్డువైఖరి మెలఁగున్. 102
చ. పలుమఱు నేటినీటి కని బానిసఁ బిల్చెద నంచు ఱోలురోకలికని కూరగాయ కొనఁగావలె నంచొకలేనికార్యమేపలుకుచుఁ గోడెకొండ్ర కనుపండువుగా నడయాడువీథినవ్వల నిఁక మాట లేల తలవాకిటఁ గాఁపుర మయ్యె దానికిన్. 103
చ. కలయని వింతవాఁ డెదురుగా నడతేరఁగ డాసి యవ్వలంబెళుకుచు నమ్మచెల్ల తరుణీ చెఱఁగించుక సోఁకె దానికిందలఁపున నేమిసేయునొకదా యని నెచ్చెలితోడఁ బల్కి మెచ్చులు దులకింప వాఁడు తనుఁ జూచినఁ బక్కున నవ్వు వీథులన్. 104
తే. తనదుచిన్నెలకై యాసఁ దడవు సేయనడుగవచ్చిన మనసురానట్టివారిరట్టుగావించి మగనాలిఁ బట్టడాసితౌర మొఱ్ఱో యటని దుమ్ము తూరుపెత్తు. 105
క. కంటికి బ్రియమగువానిన్గెంటని తమకమునఁ గామినీభూత మనన్వెంటఁబడి కౌఁగిలింపకనింటికిఁబో దవ్వధూటి కెంతటి తమియో. 106
క. పతిఁ బ్రక్కఁ బండినప్పుడురతి కొంగక నిదురవోదురా యయ్యో నాచతురుఁడ గుఱకలు చాలున్గతి చెప్పు మటుంచు వానిఁ గడు బాధించున్. 107
క. ఇట్టివగనడుచుతనవగఁజుట్టములకుఁ దెలుపు మగని సుద్దులు విని యాదిట్ట చని వారితో మఱియెట్టువిడుం దన్ను నాథుఁ డొల్లఁడటంచున్. 108
తే. మఱియు నమ్మాయలాఁడికోమటినెలంతలందఱును గువ్వకోల్గొని యగడుసేయవారిఁ గూర్చుండఁబెట్టి నావర్తనంబుదెలియదే కద మీకంచుఁ బలుకఁ దొడఁగు. 109
ఉ. అన్నెముపున్నె మే నెఱుఁగనమ్మ మతిం బతి నాదుపాలికింబెన్నిధి గాఁగఁ జూతు మెఱమెచ్చులుగా వొరునెట్టివాని నేగన్నులనైనఁ జూడ నిది కల్లయొ సత్యమొ చూచుచున్నవాఁడన్నలినాప్తుఁ డింకొకటి యారజ ముట్టిపడ న్మెలంగుదున్. 110
తే. అట్లు మెలఁగుట యేమిటి కంటిరేనినింక నెక్కడిసిగ్గు మాయింటియతనికాసపుట్టింప మెలగుదు నట్టులయ్యుబూచివలెఁ జూచుననువానిఁ బొడిచిత్రోయ. 111
చ. కలిగినవాఁడుగా మరునికన్నను వన్నియగల్గువాఁడుగాకులమున మేటిగా సవతిగోరము గానమటంచు నెంచి వేడ్కల కెదురేగుదు న్మగఁడు గల్గియు లేనివిధంబు సేసీ తానెల గలనైన నన్నుఁ గరుణింపఁడు భోగమువారిపొందునన్. 112
క. నాసుద్ది యింతగని మదిదోసమనక తనదుసెట్టి తొత్తులకేమోబాసలఁట బండికండ్లటచేసన్నఁట విన్నవారు చెప్పిరి నాతోన్. 113
తే. పాన్పు కెక్కించి తన ప్రక్కఁ బవ్వళింపగోరి నేఁ జూడ ఱేలు తాఁగుడిచి కట్టియూరకే యిల్లు వెడలు నాయుసుఱు తాఁకిదీపములుసైత మల్లాడుఁ దెఱవలార. 114
సీ. పతిపత్నినని మేనఁ బసుపు పూసికొనంగసొగసులాయని ముంతపొగ ఘటించుఁబెనిమిటి గలదాననని కాటుక ధరింపవేడుకలా యంచు విఱిచికట్టుముత్తైదువనటంచుఁ బత్తి బొట్టు వహింపజిన్నెలాయని కాలఁజేతఁ బొడుచుధవసంగత నటంచుఁ దులదువ్వి ముడిచినమురువులా యని ముడ్డిమూతి నులుచుఁతే. బొలుపు దిగనాడి నే చిన్నఁబోయియున్ననతని కెక్కడ కీడౌనొ యనుచు నాతఁడెంతచేసిన నేమాన కింటఁగలుగుసొమ్ము మెయిఁబూని కాననిచోటుఁ గందు. 115
క. ఇల్లీలనుండ నింటంబల్లియు నను జౌకసేయు పలుకులు వినరేయెల్లెడ లోకములో మగఁడొల్లనియాసతిని మారి యొల్లదనంగన్. 116
ఉ. నాకనరాదుగాక మలినత్వము పోగయి సేయు జోకలన్రేకల నన్నుఁ బోలఁగలరే కలకంఠులు నేరరా యయోపోకలు వారబాలికల పోలిక వారలమాయచేత నన్జౌక యొనర్చునాథుఁ డది చాలక దిట్టును గొట్టు నెప్పుడున్. 117
చ. కటకట నన్ను దూఱెదరుగాక వివేకము లేక మీకు నిచ్చట మగవారు లేరెకద చర్చయొనర్పఁగ నాఁడుదాని కేమిటికని నాథుఁ గూర్చువిధి మీర లెఱుంగరె యిట్టిపోఁడి మేయటమటమైనఁ దాళవశమా నెఱప్రాయపుఁబూవుఁబోడికిన్. 118
క. అని చిత్తిని మగఁడొల్లనితను వేటికిఁ దనకటంచు దయవుట్టఁగ బోరున బాష్పంబులు తెలిగనుఁగొనలం గురియంగ గోడుగోడున నేడ్వన్. 119
తే. వార లెల్లను బంగారువంటి నిన్నుఁబాసి పలుగాకులకుఁ గొంగుపఱచు చెలులనంటివర్తింప వాని కేమాయె ననుచునంతయు నిజంబనుచు నిండ్ల కరుగు నంత. 120
క. జనవల్లభుండు బాంధవజనముల వెసఁగూర్చి భార్యచందము దెలుపన్విని వారంద ఱిదేమనినెనరున గద్దింపఁ జిత్తినీసతి కడకన్. 121
తే. ఇంత యేటికి నీరేయి నితఁడు పడుకటిల్లు వెలువడి యెక్కడి కేగుఁ దలుపుమూసి గడియ బిగించెద మోసపోకతెల్లవాఱిన మీరది తెలిసికొనుఁడు. 122
క. ఏనిల్లు వెడలిపోయినఁదాను గవాటంబె మూయఁదలఁడె యంతన్దానం దెలియదె తనవగనా నేరము సెప్పఁడేటి నగుఁబా టిచటన్. 123
క. అన విని వారిది యగుననిచనుటయు నానాఁటిరేయి శయ్యపయి న్నాథునిప్రక్క నుండి తమి రేఁగినఁ జిత్తిని చనియెఁ దలుపు గిఱు కనకుండన్. 124
తే. అంత నిద్దుర లేచి వైశ్యాగ్రగణ్యుఁడనుఁగుటిల్లాలు లేకుంటఁ గని కవాటబంధన మొనర్చి తానుండెఁ బాన్పుమీఁదఁబంత మీడేఱె ననుచున్న యంతలోన. 125
చ. చనుఁగవజోడుపో టొకభుజంగునకుం బదఘాత మొక్కజారునకుఁ గటాక్షనీలమణిరోచు లొకానొకతేరకానికిన్మనసిజకేళి యొక్కయుపనాథునకు న్గలిగించి వేగుజామునఁ జనుదెంచెఁ జిత్తిని సముజ్జ్వలకేళిగృహంబుఁ జేరఁగన్. 126
తే. వచ్చి యరదనిరోధంబువలనఁ జూచికాంతుచేష్ట యెఱింగి చేగడియ దివియఁగూడ దెత్తఁగరాదింకఁ గోరివచ్చుచెనఁటిచుట్టాలచేత బజీతనగుదు. 127
క. అని యెంచి వరుని వాకిటిఁకనుపం దానిల్లుసొచ్చి యరరముమూయందనతప్పుఁ దప్పఁ జిత్తినివనిజా యేత్రోవ త్రొక్కవలయుం జెపుమా. 123
తే. అనఁ బ్రభావతి రసభంగ మగు నిదేలమాటిమాటికి నడిగి నామన్కిఁ గొనఁగవినఁగఁ జిడిముడి పడియెడువీనుదోయిచిలుక నాతోడ నీవది తెలుపు మనిన. 129
ఉ. కీరము కెంపుసొంపునడఁగించు మెఱుంగులముక్కుటెక్కు చెన్నారఁగఁ బల్కుఁ కల్కి విను మత్తఱిఁ జిత్తిని చిత్తవీథిలోధీరతఁ బూని లేని తెగదెంపు వహించుచుఁ బల్కె నల్కతోనేకము లేనిదానికరణి న్బతి యింపున నాలకింపఁగన్. 130
తే. వెడలిపోయితి నివ్వీథి వెంట నరుగుపెండ్లివారలఁ జూడ నాపిన్నతనముగూల నింతటిలో పట్టి కోపమెత్తితలుపు బిగియించె మగఁడేమి తలఁచినాఁడొ! 131
క. చుట్టాలచెంత నాకున్ఱట్టొనరింపంగఁ దలఁచెనా యందుకు వారెట్టును జాలరెకా సడిగట్టఁగలరె నొసటఁ గన్ను గలవారైనన్. 132
ఉ. ఏనటువంటిదాననే యహీనపతివ్రత నేను గల్గఁగావానలుఁ బంటలుం బుడమి వర్తిలు నింత యెఱుంగలేక తానే నను రవ్వచేసినఁ దృణీకృత మింతె శరీర మొక్కమట్టైన ననూనదుఃఖ మెనయన్ దన కాఁపుర మెత్తిపోవదే. 133
క. కానీ బహుతరతోయానూనంబైనట్టి బావి యున్నది నేనున్నానంచు మిగులఁ జప్పుడుగానపుడే యగ్గయాళి గ్రక్కునఁ జనియెన్. 134
క. చని నూతిలోపల గుభుల్లన నొకగుండెత్తి వైచి యల్లనఁ గనుచాటున నిలువఁబడియె నిజమనిజనవల్లభుఁ డాత్మలో విచారముమీఱన్. 135
క. ఎత్తెదగాకని చనియెన్మత్తచకోరాక్షి కేళిమందిర మపుడుద్వృత్తిఁ జొరబాఱి మూసినముత్తెమువలెఁ దలుపు మూసి మొక్కలమిడియెన్. 136
క. అదిగని నివ్వెరఁగున నెమ్మదిగానక తద్వరుండు మ్రాన్పడియుండెంజదికిలఁబడి యంతట రవియుదయించిన వచ్చి బంధు లొక్కటఁ జూడన్. 137
తే. వారితో నది యోయన్నలార కంటిరా వితవితగ నన్నింత ఱట్టు సేసితానె తొత్తులకాంక్ష మదంబుకతననిల్లుపట్టక తిరిగెడు నివ్విధమున. 138
క. అని పలుక వార లలుకన్జనవల్లభుఁ దిట్టి వానిజాతికి వెలిగానొనరించిపోయి రోచక్కనికొమ్మా యింతనేర్పు గలిగినఁ బొమ్మా. 139
క. అనినఁ బ్రభావతి తనయాత్మనె యౌరా యాఁడువారి తల్లియ యనిచిత్తిఁనిఁ బొగడి తెల్లవాఱుటఁగని చనియెం గేళిలసదగారంబునకున్. 140
వ. చని యథోచితవిధంబునం బ్రవర్తిల్లె దదనంతరంబ క్రమంబున. 141
చ. హరనటనాతివేగగళితాలికలోచనవిస్ఫులింగమైసరసిజబంధుఁ డస్తగిరిచక్కటి వ్రాలఁ దదీయకీచకోత్కరములు గాలు క్రొందగుపొగల్బలెఁ జీకఁటి పిక్కటిల్లె నంబరమునమించుఁదత్తృటితమౌక్తికముల్బలెఁ జుక్క లొప్పఁగన్. 142
చ. అపుడు ప్రభావతీరమణి హారమణీఘృణిధోరణీప్రసూనపటలయు న్వినీలవసనభ్రమరాళియు నై లతాకృతింగపురువహించి వచ్చిన శుకంబు “మనోరథసిద్ధిరస్తు తేచపలవిలోచనే” యని యసహ్యపుదీవన నిచ్చి యిట్లనున్. 143
ఉ. వింటివె యొకవింతకథ వీనుల కింపు ఘటింపఁజాలు నిష్కంటకరాజమౌళి దొరగా విదిశాపురి మించు నందు నేవెంటఁ గొఱంతవోని పృథివీసురుఁ డొక్కఁడు సోమశర్మ పేరింట నెసంగు భార్యయయి రేవతిపేరి వధూటి గొల్వఁగన్. 144
సీ. గాదెలఁ గొలుచు ముక్కారుఁ బండెడు మళ్లునత్తోఁపు నడబావు లండ దొడ్డియాకుఁదోఁటలగుంపు పోఁకమ్రాకులు గుత్తచేలు గొఱ్ఱలకదుపొలమందచెఱకుగానుగ మొద ల్జెడక వర్ధిలు నేర్పుబానిసె ల్బడవాళ్లు బంటుపైదపారిగోడలు గొప్పపడసాల మేల్మచ్చుగారముంగిలి వింతగాని పొరుగు
Comments
Loading comments…