పదునేడవకథ
శుకసప్తతి
క. ధర శాలివాహనుం డనునరనాయకమౌళి పెనుప నలువై విభవాకరము ప్రతిష్ఠానం బనుపుర మలరు న్వేల్పుఱేనిప్రోలుం బోలన్. 5
క. అప్పురిఁ గుబేరుకలిమికిదప్పులు ఘటియించు సోమదత్తుం డనుపేరొప్పు నొకవైశ్యుఁ డలరుఁ గకుప్పటలిని గీర్తివల్లికోటులు ప్రాకన్! 6
సీ. నవరత్నములు సువర్ణమును వెండియును లోహాంతరములు పటలాంశుకములుగోవజవ్వాది కుంకుమపూవు పచ్చకప్పురముఁ బన్నీరుచెంబులుఁ బటీరతరుఖండపటలి యందలపుఁ గొమ్ములు జల్లిసవరము ల్పాదరసంబు జాజియింగువ లేలాలవంగము లోడపోఁకలును గోరోచనగంధకములుతే. కొచ్చికుక్కలు మానిసిక్రోఁతు లరిదిపంచెవన్నెలచిలుకలు బహువిధములపారువాతిన్నె లిఁకమీఁద బలుక నేలపొదలు వానింటఁ బులిజున్ను మొదలుగాఁగ. 7
క. ఈళయు ముమ్మెంగియు బంగాళము పైగోవ మొదలుగాఁ బొదలెడుద్వీపాళిఁగలసరకు లాతనికౌలున దిగు మాట నిజముగలవాఁ డగుటన్. 8
శా. ఏయూరం దనయాపణంబు మఱియిం కేబేరిపేరైన నాత్మాయత్తం బగువిత్త మేయడవియందైన న్నిజద్రవ్య మీచాయన్సంపద వృద్ధి బొంద ధనదస్పర్ధాళుఁడై నిల్బెఁబోయాయూరవ్యుఁడు గోట్లకుంబడగ లెన్నైనం బ్రమోదంబునన్. 9
చ. వలసిన బేరము ల్దెలియవచ్చినవారలు వాదుగల్గువారలు తెగగుత్తగొల్లలును రత్నపరీక్షలవారు కార్యముల్గలిగిన యింగిలీషులముఖాములు చెంగట నుల్లసిల్లఁగాఁగొలువొసఁగు న్మహీశుగతిఁ గోమటి యాత్మగృహాంగణంబునన్. 10
క. అతఁడు ధూర్తచకోరఖ్యాతంబగు నొక్కచిలుక నతులితగమనాయాతేరితవిజ్ఞానసమాతులశేముషిఁ గృపాళుఁడై పోషించున్. 11
తే. అప్పురంబునఁ గామసేనాభిధానయైన వెలచాన మీఱు జయైకతానమీనకేతననలినప్రసూనశరసమానతానూనవీక్షావితాన యొకతె. 12
ఉ. కారుమెఱుంగురాచిలుక కస్తురివీణె పదాఱువన్నె బంగారము నచ్చుకుప్పె తెలిగంబుర వెన్నెలలోని తేట సింగారపుఠీవి లేనగవు గల్గిన చక్కెరకీలుబొమ్మ యొయ్యారపుజీవగడ్డ యన నచ్చెలి మెచ్చులు గాంచె నెంచఁగన్. 13
సీ. ప్రత్యక్షబాహాటపాంచాలనటనలుగనుపట్టఁగాఁ బుస్తకములు చదువుఁ
గనుఁగొన్న రూపమచ్చున నొత్తినట్టులఁదళుకొత్త భావచిత్రములు వ్రాయునట్టువకాని యందముగాక వింతగాఁగోపులు గల్పించుకొనుచు నాడుఁజేరి తంబుర మీటి సారసుథాసూక్తిదేటలూరఁగ వింతపాటఁ బాడుతే. జాతివార్తలు దొలఁక రసంబు గులుకఁగవిత రచియించుఁ గల్పించి కతలు నుడువుమనసు గరఁగంగఁ దీయనిమాటలాడుజిలుకరౌతుకటారి యవ్వెలమిటారి. 14
సీ. పలుకుముద్దులకుఁ గోవెలజియ్యగాండ్రెల్లంగుంటెనకాండ్ర వెన్వెంటఁబడఁగఁజనుజక్కవలు గన్న సన్న్యాసులైననుదలవరివారితోఁ జెలిమి సేయఁదళుకుఁజూపులకు విద్వాంసులైనను నిజరామలతోడ రారాపొనర్పఁబొలుపున కాచార్యపురుషులైనను దమవేషభాషలమీఁద వెగటు పడఁగఁతే. దెఱపిగని చూచినట్టి పతివ్రతలునునిజకులాచారవృత్తిపై నెటికె విఱువవింతయొయ్యార మెసఁగఁ గోవెలకుఁ బోయిమరలి యింటికి వచ్చు నమ్మచ్చెకంటి. 15
చ. తొలఁకెడుతత్తఱంబువగతోఁ దొడనిగ్గు హిజారుమీఁద మెట్రిలువడినొంటికట్టున ఘటించిన చీరసగంబు మూపుపై
నలవడబోటి దట్టి మొదలైనవి తేఁ దిరుమంజనంపువేఫలు దఱితప్పెనంచు నవలా భయమందుచు నిల్లు వెల్వడన్. 16
క. కొడుమెత్తుకొఱకు గుడికిన్నడుచు న్వెలపడుచు నాభినామమునుం గ్రొమ్ముడిసౌరు న్మడిచారున్వడిజాఱుంబైఁట వింతవగఁ గనుపింపన్. 17
సీ. తానున్న కేళికంతటికి గణాచారిపెక్కుసుద్దులు మ్రోయు పెద్దబేరిపేరుకోఁదగినట్టి యూరలేని యుటంకుపరులబుద్ధులకుఁ జొప్పడనిమంకుకల్లలు పచరించి గద్దించుతాటోటుపూనియొక్కరి కీయలేని జూటుకలహంబె కూడుగా మెలఁగెడుగయ్యాళినిష్ఠురత్వము సూపు నెఱకరాళితే. బేరజపుగట్టిజంత పాడూరిసంతచలము సాధించు దిట్ట రోసాలపుట్టలోకముల కెల్ల సూచి యల్లుండ్రబూచియెంచఁగల యుచ్చమల్లి యయ్యింతితల్లి. 18
తే. దాని నుతియింపఁ దరమౌనె తాటకావధూటితల్లియొ పూతనతోడఁబుట్టొశూర్పనఖమేనగోడలొ చూడ లంకిణీతనూజయొ యనఁగ వన్నియకు నెక్కె. 19
సీ. ఇరుగింటిదయ్యంబు పొరుగింటికినిగూబయెదురింటివారల కెదురుచుక్కవాడకుఁబగ యూరివారలతలనొప్పిపెంపుడుకూఁతుండ్ర పెద్దపిడుగుపరదేశులకుఁ బులి బాఁపలగాలంబుయాచకకోటుల కాసవిఱుపుదాసర్లమిత్తి సన్న్యాసుల తెరబొమ్మజోగిజంగాలకు సొంటికొమ్ముతే. పాఠకులకొట్టు నట్టువపాలియదురుఁగ్రోవి భరతంపుటయగారి గుండెదివులుబట్టువాకట్టు బవనీలపాముకూనయనఁగ విఖ్యాతిఁ గాంచు నాయాఁడుఁగూచి. 20
సీ. గూనివీఁ పనరాదు కోలమూతినిజాఁచుఁగొడిపెమో మనరాదు గొడఁగసాగుబాకిమో మనరాదు పగసాటి బెదరించునొంటిప ల్లనరాదు కంటగించునరవెండ్రు కనరాదు నాఁడెల్ల జగడించువాటుగా లనరాదు చేటుఁదెచ్చుఁజెవు డనఁగారాదు చేట యెత్తుకవచ్చుగ్రుడ్డిక న్ననరాదు గొట్టుసేయుతే. వెఱ్ఱి యనరాదు పైఁబడి వెక్కిరించుగామి డన రాదు మొగమున గంటువెట్టుపెంకి యనరాదు వట్టిగుంపెనలు సేయుముద్ది యనరాదు గ్రుద్దు నయ్యెద్దుమొద్దు. 21
క. గడెతడవు వేసటలచేసుడివడ కటు తనదు ప్రాఁతసుద్దులు విన్నన్వడినిచ్చు నొక్కపుచ్చినయడగొంటుం బడుకక్రిందియాకులు రెండున్. 22
సీ. రమనేలినట్టి గురస్తునందు రదేమొనేలమిన్నులు గొల్వ నేర్చుటరుదెమేనకాంగననంటుకాని మెత్తు రదేమొసృష్టికిఁ బ్రతిసృష్టి సేయుటరుదెకడవఁబుట్టినవానిఁ గడునుతింతు రదేమొపాథోధి పుక్కిటఁ బట్టుటరుదెలంకఁగాల్చినవాని బింక మెంతురదేమొహెచ్చుమందులకొండఁ దెచ్చుటరుదెతే. యనుచు మదితప్పితప్పి నీళ్లానిపూనితోడిముదుసళ్లఁ బెక్కండ్ర గూడఁబెట్టిపట్టి తలనొవ్వ రవ్వగాఁ బవలురేలువట్టిపగ్గెలు ప్రేలు నవ్వారజరఠ. 23
క. అది నెమ్మదివదలని చలమొదవఁగఁ దనసుతకుఁ బైఁడి యొకనిద్దురకుంపదివేలమాడ లీయకకదియఁగ నీదెట్టి విటశిఖామణినైనన్. 24
క. ఆకామసేననవబిబ్బోకము గనుఁగొనుట మదనభూతావేశవ్యాకులితమానసాంబుజుఁడ్రై కుందుచు సోమదత్తుఁ డతివిరహమునన్. 25
క. అక్కలికి కొనఁగవలసినరొక్కము పురహరుఁడు దానరూపము రతిగాఁజక్కెరవిలుతుఁడు వెఱపున్మొక్కలితన మెపుడుఁ దన్ను ముంపఁగ నుండెన్. 26
ఉ. అంతట నొక్కనాఁ డతఁ డొయారము మీఱఁగఁ గామసేన నేకాంతమునందుఁ జేరి మనసారఁగఁ బుక్కిటివీఁడె మిచ్చి గిల్గింత లెసంగు కౌఁగిటి బిగింపుల నింపులనింపు పారువావింతరొద ల్ముదంబు నొదవించునటు ల్కలఁగాంచి వేడుకన్. 27
చ. తనచెలికానితోఁ బసిఁడిదార్చక యేనల కామసేనతోనెనసితి నిన్న నంచు వచియించిన నాతఁడు దానియింటికిన్జని మది నిల్పఁజాలక ప్రసంగవశంబున సోమదత్తుఁడినవచనంబు లెల్లఁ బ్రకటించినచో వెలముద్ది యుగ్రయై. 28
క. ఏ నెఱుఁగకుండ నాసుతతో నెనయుట యెట్టు లిట్టిదుడుకులు గలవేకానీ రొక్కం బీయకపోనో చూచెదము తనప్రభుత్వం బనుచున్. 29
సీ. శ్లేష్మంబు కుత్తుకఁ జిఱ్ఱుబుఱ్ఱున కఱ్ఱుకఱ్ఱును దగ్గు లగ్గలముఁ గాఁగఁజన్నులు తలఁగడ సంచులవలె వెళ్లిపయ్యెదమీఁద జంపాల లూఁగబీదనరాలతోఁ బెరుఁగువాఁగడుపులోబల్ల నల్లడలందుఁ దుళ్ళిపడఁగ
బుగ్గలాహిరియూటఁ బొడము వాసనతోడికంకినోటను జొంగ యంకురింపఁతే. దిరుకొళములోనఁబడిన క్రోఁతియునుబోలెవడకుకొంచును నేచుట నెవ్వారిఁ గన్నగ్రుడ్లు మిడికించుచును గుడ్లగూబరీతివేగఁ దనయిల్లు వెడలె నావృద్ధవేశ్య. 30
తే. అంతలోననె శాలివాహను దివాణమునకు నేగుటకై బంధుజనులు గొలువవచ్చునలసోమదత్తు నవ్వారవనితజనని వీక్షించి సందడి జడియ కరిగి. 31
తే. వెఱ్ఱి నీ రానుకతమున వెడలునట్టిచొక్కుబోఁదట్టి యొకకన్ను వెక్కఁబెట్టిదడిగఱవఁబోవు వేసిచందమునఁ బట్టిపరుసమెచ్చఁగ నూరుజప్రముఖుఁ బలికె. 32
శా. అయ్యా యల్లుఁడ యెంతపెద్దఱికమయ్యా నిల్చిమాటాడనీవియ్యంజాలని సెట్టివా నెనరు లే దీపట్ల నిట్లైన నీవియ్యా లందఱి కేదిదిక్కు మఱి నీ వెన్వెంటనే వచ్చు మాయయ్య ల్చెప్పరె నీకు మాకుఁ దగవీయాదాయమే కంటివో. 33
క. నలుగురిలో ని ట్లాపనిపలుకఁగఁ దగదైన వెఱ్ఱిపట్టినకతనందెలిపెద నీకేరోసముగలిగిన బ్రతికితిమి మంచికార్యం బిదియున్. 33
క. ఇయ్యెడఁ గలగిన రోవెలయియ్యక నా కెఱుక లేక యిటు నే నింటందయ్యమువలె నుండఁగ మాతొయ్యలితో నెట్లు కూడితో నే నెఱుఁగన్. 35
క. పైఁడేమి బ్రాఁతి యిదిగోనేఁ డిచ్చెదు మ్రుచ్చు వగల నెలఁత రమింపంబోఁడిమి చెడదే మఱి బురికాఁడవుఁ దగ కొదవలే జగంబు లెఱుంగున్. 36
తే. నిన్ననే నన్ను మొఱఁగి నాచిన్నదానినక్కటా యోడరేవున నమ్మికొందువేమిటికొ జాఱవిడిచితి వింతెకానియంత దబ్బఱకాఁడ వీవౌదొ కావో. 37
తే. మంచిమణులకు వెలఁ బొసఁగించువేళహెచ్చువెలలకు సొమ్ము చేయించుచోటనగరి జాలెలు నీయింట నిగిడియున్నవింత మాకేల మారొక్క మిచ్చిపొమ్ము. 38
క. అన సోమదత్తుఁ డద్భుతమున నచ్చట నిల్చి వెఱ్ఱిముద్దియ కలలోనెనసితి నీదు తనూభవననుపమరతి నింతెకాని యన్య మెఱుంగన్. 39
తే. అనిన నమ్ముద్ది మంచి దట్టైన నేమినాతనూభవవలన ననంగసౌఖ్యమబ్బెఁగద నీకు నిదియు లేదన్న నందువర్థ మిప్పించి యవ్వల నడుగుపెట్టు. 40
క. అని రట్టుసేయ నచ్చటిజనములు సొమ్మీయకునికి చనదని వగదెంచిన దాని దోడుకొనిపోయె నతం డింటికిని రొక్క మిచ్చెద నంచున్. 41
క. చని ధూర్తచకోరమునకుదనవృత్తాంతంబుఁ దెలుపఁ దత్కీరము నవ్వి నిజంబుగఁ గెలిపించెదనిను వెఱవకు మనియె వైశ్యనీరజగంధీ. 42
క. ఆవైశ్యునిఁ దత్కీరంబేవిధి గెలిపింపవలయు నెఱిఁగింపఁగదేనీవే జాణ వటన్నన్భావించుచుఁ జిలుకతోఁ బ్రభావతి పలికెన్. 43
క. ఏలాగున గెలిపించెనొబాళిమెయిం బ్రహ్మలోకపర్యంతము నేనాలోచన యొనరించితిఁజాలదు నాహృదయ మిది నిజంబుగఁ దెలియన్. 44
క. అంతిపురంబున కరిగి దినాంతమున న్నృపతిఁ జేరి నరిగెడుతమితోఁజెంతకు వచ్చినకోమటియింతింగని చిలుకరాయఁ డిట్లని పలికెన్. 46
క. రమణీ యాధూర్తచకోరముకథ యిఁకఁ గొంత కలదు రాజవియోగభ్రమమడఁచి తెచ్చికోల్నెయ్యము తోడుతనైన వినుమటంచుం బలికెన్. 47
క. ఆగతి నింటికిఁ జని యాబోగము ముసలాపె యాత్మపుత్రికతో నాజాగెల్ల దెలిపి పరిభవయోగంబున మదికి ఖేద మొదవఁగ నంతన్. 48
సీ. పుట్టలమ్మ యటన్నఁబో యెంతలేదనుసందివీరుల టన్న జాము గొణుగునెక్కలమ్మ యటన్న నొక్కటికొదవనుబోతురాజు లటన్న బూతు నుడువుధర్మరాజు లటన్న దబ్బఱలే తిట్టుఁగంబమయ్య యటన్నఁ గ్రాసి యుమియుగ్రామగంగ యటన్నఁ గాదా మరో యనుదేవాదులన్న గద్దించి చూచుతే. నిన్ని దేవళ్లఁ గొలిచి నేనేమి గంటిపోయి పచ్చని పులుగాసిపులుఁగుచేత
మోసపోయితి ననికుందు మొనయుఖేదమారట మొనర్ప విసివి యయ్యారిబసివి. 49
సీ. నట్టింట దేవళ్లుపెట్టెఁ బెట్టినతిన్నెఁగొట్టించి వెసఁ బందిగూడు చేసెమెడనున్న పాదాలు విడిచి యెవ్వరిఁగన్నమొరుగుతలారికి మురువు చేసెబానలో దాఁచిన పట్టుపుట్టము చించిపొదుగుడు కోళ్లకుఁ బొత్తి చేసెదేవాదుల కడెంబు దిగిచి కమ్మతగానిపట్టికానికి మొలకట్టు చేసెఁతే. గాటిఱేనికి మీఁదుగాఁ గట్టి యున్నగట్టివరహాని వరహానిగాఁగఁ జూడఁకాడఁబోఁగూడ కొక్కమాటాడకుండగుండనికి రంగుబంగారు గోరుసేసె. 5
తే. అంతఁ దత్పుత్రి కీరమా యింత చేసెదాని నంజుడు దినకున్న నేను సానికూఁతురనె యంచుఁ దల్లిని గుస్తరించిమఱియు నవ్వార్త యూరెల్ల మఱవనిచ్చి. 51
క. వలసిన సతికే చిన్నెలుగలవో యచ్చిన్నెలెల్లఁ గనుపించుచు నవ్వెలవెలఁది సోమదత్తునివలకు న్లోపఱిచి మేలువానిం జేసెన్. 52
తే. చేసి యొకనాఁడు మీయింటి చిలుక కతలుచెప్పునందురు నామాట చిన్నఁబుచ్చ
కిపుడె తెప్పించరా దాని యెడను గలుగుపొలుపు గనుఁగొని మరల నంపుదము గాని. 53
చ. అనవిని సోమదత్తుడు నిజాప్తులఁ బంచిన వారు దెచ్చినంగనుఁగోని కామసేనయు వికాసపుమాటలుగా వచించి యెందును సరిలేక మించు నలధూర్తచకోరశుకాగ్రగణ్యముందనగృహసీమ మంచుకొని దబ్బఱ నెయ్యము నిబ్బరంబుగన్. 54
తే. కొన్ని దినములు చన రోషకుటిలహృదయవనజయై దీనిమాంసంబు వండుమనుచుఁజిలుక నెవ్వరు గనకుండఁ జేతికొసఁగబోనకత్తియ వెస పాకభూమి కరిగె. 55
మ. అపు డాధూర్తచకోరకీరవర మయ్యాపన్మహాంభోధి యేనిపుణత్వంబున నీఁదఁగావలయు నీ నేర్పెల్ల శోభిల్లఁగాఁజెపుమా చూతమటంచుఁ బల్కి తెలియం జింతంపఁగా నవ్వి వైశ్యపయోజాస్యకుఁ జిల్క తక్కిన కథాంశం బిట్లు తెల్పెం దగన్. 56
క. ఆరీతిఁ బాకగేహముఁజేరిన యావంటలక్క చిలుకం దఱుగంగోరి పచనక్రియాచింతారతితో నీలకత్తి నలుగడ నెమకన్. 57
ఉ. అత్తఱిఁ దాని జూచి శుక మంగన యెంతటిపుణ్యమూర్తివోబత్తిజనింప నాదుచెఱఁ బాపెదుఁ గావున నిన్నువంటి యత్యుత్తమ కేను నేర్పెడు ప్రయోజన మున్నదెయైన నామనంబుత్తలమందె నీకిటుల యో జరయింతటి పాటొనర్చెనే. 58
క. ఏను ద్రికాలం బెఱుఁగుదుమానిని పదినాళ్లలో సమంచితరేఖాసూనవయి నిండుజవ్వనమూనంగా నీకు హేతు వున్నది సుమ్మీ. 59
వ. ఇంత యెఱింగిన నీ కీయపాయంబుఁ దప్పించుకొనరాదే యని యంటివేని యలంఘనీయంబగు విధివిధానం బిట్టి దని నిశ్చయించి యున్నదాన నది యట్లుండె నవయౌవనాపాదకం బగు నొక్కమంత్రంబు నా కభ్యాసం బైయుండు; నది నాతోడనె పోయెడుం గదా యను విచారంబు తీరకునికి నీకు నుపదేశించెద దానివలన నీకుఁ బ్రాయంబు వొడముట కడుగనేల నీవిచ్చినవారికిం గలదు కాలయాపనంబు సేయక యిచ్చోట గోమయంబున నలికి మ్రుగ్గువెట్టు మనుటయు నావృద్ధ సంభ్రమాశ్చర్యానురుద్ధయై యచ్చిలుకఱేని నచ్చట నునిచి తదుక్తప్రయోజనంబులకుం బోయిన. 60
క. ఆధూర్తచకోరము గరుదాదృక్పటపటనినాద మడరం బరదుస్సాధంబై వరమానాబాధత్వర మెఱయఁగా నభంబున కెగిరెన్. 61
తే. ఎగిరి చెంగట నీశానగృహములోనగూళ్లు పెట్టిన చిలుకలఁ గూడుకొనియెదానిఁ గానక భయమంది బోనకత్తెకార్కవాకవపాకపాకం బొనర్చె. 62
క. ఆకామనేన మదిఁ జింతాకలుషత మాని సోమదత్తునితో నే
లేకున్నతఱి బిడాలంబాకీరముఁ బట్టి చంపె ననుచుం బొంకెన్. 63
క. అటుకనుక నేర్పుగలిగినఁగుటిలాలక నేఁడు నీవు కోరినపనికేగుట తగు లేకుండినచోనిటనుండియె మరలు మని శుకేంద్రుడు పలికెన్. 64
తే. అంతలోనన యరుణోదయంబు మించనాప్రభావతి యంతఃపురాంతరమునకరిగి యానాఁటి రేయి భూవరునిఁ జేరనేగుచోఁ జిల్క యక్కల్కి కిట్టు లనియె. 65
తే. అతివ ధూర్తచకోరశుకావతంసమంత చేసిన గామసేనాంబుజాతగంధిఁ జెఱతు నటంచుఁ గంకణము గట్టెనెట్లు చెఱపంగవలయు నీ వెఱుఁగఁ జెపుమ. 66
క. అని పలికి తెలియ నేరనివనితామణిఁ జూచు కీరవల్లభుఁ డది దావినిపింపఁ దొడఁగె ననితరజనితర సంస్తవ్యవచనసంభావ్యముగన్. 67
క. ఆరీతిఁ దలఁచి ధూర్తచకోరము తత్క్రియకు వేళఁ గోరుచు నుండన్మారునిచెలిఁ జెనకెడు నొయ్యారముగల కామసేన యంతటిభక్తిన్. 68
క. ఒకనాఁడు కోవెలకు నేగి కపర్దికి మ్రొక్క గర్భగృహమునఁ దన్మూ
రికి వెనుక డాగికొని యాశుక మిట్లని పలికెఁ దద్వచోగతిగాఁగన్. 69
ఉ. మెచ్చితి నీదు భక్తికి సమిద్ధవిశుద్ధకళాభివృద్ధికిన్దచ్చనగాదు నాపలుకు దప్పదు చొప్పడుఁ గాయసిద్ధి యేనిచ్చెద నీవుఁ దల్లియు మఱెవ్వరితో నెఱిఁగింపఁ బోక యీవచ్చుసరోజశాత్రవుని వారమునాఁ డిటు రండు వేడుకన్. 70
క. తొలునాఁడు బోడలై నిశ్చలభక్తిం జోగులకును జంగాలకు మీయిలు చూఱవిడిచి యిటురావలయున్ వైష్ణవుల కొసఁగవల దేమైనన్. 71
క. వారు శివద్రోహులు గదయీరసమున శైవమతము హెచ్చఁగరా దంచేరీతినైనఁ జెఱతురునారీమణి వారిమాట నమ్మకు మింకన్. 72
క. అని పల్క నాల్గుదిక్కులుగనుఁగొని శంకరునిమాటగా నమ్మి కృపావననిధి హర త్రిభువనపావన ధీరస్వాంత యనుచు వర్ణించి వెసన్. 73
క. గుడివెడలి వైష్ణవులు గనుపడకుండఁగఁ జెలుల నరిగ పట్టుమటంచుంబడఁతి తన యింటికడకున్పడిఁ జని నిజజననిఁ బిలిచి నగుమొగ మలరన్. 74
క. హరుఁ డానతిచ్చినాఁ డెవ్వరితోఁ జెప్పకుము సోమవారమునాఁ డి
ర్వురకు నెలప్రాయ మిచ్చుంజరయు న్మృతి లేదు సంతసం బయ్యఁ గదా. 75
చ. ఆన విని వృద్ధవైశ్య పులకాన్వితయై నవయావనంబు నేనెనసితినేని యీపడుకటిల్లు మదీయము నీవు వేఱె యింటను బవళింపుమన్న జగడాలకు రాకుమె యూర నీవు నేనును గడియింపఁ జొచ్చినఁ దనూభవ గోడలు పైఁడిసేయమే. 76
సీ. ఇప్పుడే తెచ్చి నీ కిచ్చెదఁ గాని యీతళుకుఁగమ్మలు నేనె తాల్చికొందునృపులచేఁ దెచ్చి నీ కిచ్చెదఁ గాని నీపెద్దముక్కఱ నేనె పెట్టికొందునృపునిచేఁ దెచ్చి నీ కిచ్చెదఁ గాని నీబొగడలజోడు నేఁ బూన్చికొందునెటులైనఁ దెచ్చి నీ కిచ్చెదఁ గాని నీమట్టెలు నేఁ గాళ్లఁ బెట్టికొందుతే. నౌర నీవు గడించిన వనుచు నా కొసంగకుండిన మఱి నేను సంతరించుసొమ్ము మీఁదట నీ కీయఁ జూడు నాప్రతాప మని పల్కి యుత్సాహచాపలమున. 77
సీ. కుఱుచనెరు ల్దువ్వికొని కొప్పు సవరించుఁబరువెత్తి కాటుకబరిణ వెదకుసొంపుతో నద్దంబుఁ జూచి పండ్లిగిలించుఁబడఁబోవుచును ముద్దునడలు నడచుగోరంబుగా సారె గుంటకన్నులు ద్రిప్పుఁజూపఱ నగు నోరచూపుఁ జూచు
గరిడి కేగెదనంచుఁ గాసె దాల్పఁగఁ బోవుబాకినో రెగనెత్తి పాటపాడుతే. నింటి కెవ్వారు వచ్చిన నెనయుఁ దనకునదిగొఁ బైఁడీయ వచ్చి రటంచు లేనిబింక మెక్కించుకొని సారె బిగియునపుడెప్రాయ మేతెంచె నంచు నప్పణ్యవృద్ధ. 78
తే. ఇప్పు డెట్లున్న దాన మీ రేల చెప్పరౌర లెస్సాయె నని యొద్దివారిఁ దిట్టుగుంపుగొని చూచువారలఁ గొట్టఁబూనువెరఁగుపడి యింటిబిడ్డల వెక్కిరించు. 79
వ. ఇవ్విధంబున బహుప్రకారదుర్వికారంబులు మీఱఁ గుమారిం జేరి. 80
క. ఏమో తెలుపఁగ వచ్చితిభామా యీలోన మఱపుపాటిల్లెఁ గదేయేమీ మఱవక తనకున్సేమంబును బ్రాయమిచ్చు శివుఁ డుండంగన్. 81
క. గడువీలో మన మేగతినడువన్వలె నేమి చెప్పినాఁడు శివుఁడు నీవడిగితివొ లేదో తెలియంబడుచువుగద నీకుఁ దెలియఁబడ దింతైనన్. 82
తే. పడుచవే గాకయుండినఁ బ్రాయ మిపుడెయిమ్మనఁగరాదె సోమవార మ్మటంచుగడు వొడటియేల యింతలోఁ గాలమేమొదేశమేమొ కదా యంచుఁ దెలియునటవె. 83
క. అనిన విని కామసేనావనజానన విన్నయట్టి వచనము లెల్లన్వినిపించిన నేమేమీయని యమ్ముదిజంత చింత యాకులపఱపన్. 84
క. బ్రదు కెల్లఁ జక్కనగుననిమది నమ్మితిఁ గూఁతురా ప్రమాదము రాదేతుది నిల్లు చూఱవిడిచిననిదియేమో మీఁది కార్య మెవ్వఁ డెఱుంగున్. 85
తే. ఆశపడి బోడనైన నేనగుదుఁగానియింటిసొ మ్మొక్కకాసైన నీయ నొకనికొల్ల నే జవ్వనంబు మొఱ్ఱో యి దెట్లుతగదు నీమాట నే వినుదానఁ గాను. 86
క. అనఁ గామసేన యంతటిపని రారాదమ్మ కుముదబాంధవధరుఁ డాడినమాటకుఁ దప్పటవేయని సమ్మతిపఱిచి నిర్భరాహ్లాదమునన్. 87
క. త్యాగధ్వజ మెత్తించి సమాగతయాచకుల కీశ్వరార్పణ మనుచున్బోగముచెలి ధనమెల్లంబ్రోగులుగా నొసఁగె సకలము న్వినుతింపన్. 88
సీ. పట్టెనామంబుఁ గీడ్పఱిచి నూతనవిభూతిని ద్రిపుండ్రంబులు దీర్పవచ్చుద్వయము పోఁబెట్టి శైవపురాణపద్యపాఠికల వేమాఱుఁ బఠింపవచ్చు
వనమాలికలు పాఱవైచి రుద్రాక్షపూసలపేరు లఱుత నెక్కొలుపవచ్చువిష్ణుసుకీర్తన విడిచి శంకర హరశబ్దము లుచ్చరించంగవచ్చు.తే. గాని భుజములు కాయలు గాచి యున్నతప్తముద్రలు మఱుపెట్టఁదరమె యనుచువైష్ణవు లభావవైరాగ్యవైభవంబుఁబొంద నది శైవుల కొసంగె భూరిధనము. 89
వ. ఇవ్విధంబుగా నిజాంశుకావశిష్టంబుగా గృహప్రముఖంబు లగుధనంబులు సకలభూషణంబులును ద్యాగంబు గావించి యమ్మించుఁబోఁడి జననీయుతంబుగాఁ బ్రతీక్షించుచు నయ్యిందువాసరంబు ప్రసన్నం బగుటయు. 90
చ. తిరుపతి కొప్పు లందముగఁ దీర్చిన బూడిదబొట్లు మంచి వేర్పఱచిన మించునట్టి రుదురక్కలపేరులుఁ గావికోకలున్హరశివశబ్దము ల్దగ మృగాంకకళాధరుగేహసీమ కేగిరి గుడిమేళము ల్పొదలఁ గిన్నరకంఠియుఁ దానితల్లియున్. 91
క. చని భావజారి సేవించి నిజంబగుభక్తి నొంది చెంత వసింపంగనుఁగొన వచ్చిరి బహుయోజనదూరమునందుఁ గల్గు జనసంఘంబుల్. 92
తే. ఇవ్విధంబున భూజను లెల్లఁ జూడఁబ్రొద్దుకైవ్రాలుదాఁక నప్పొలతు లుండియేమొ సర్వేశ్వరుం డిట్లు తామసించెననుచుఁ జింతించుచున్న యయ్యవసరమున. 93
తే. గోపురముమీఁద ధూర్తచకోరకీరమెక్కి ప్రజలార మీకేల తిక్కపట్టెవీరిబగిసికి మఱి గారవించి హరుఁడుకాయసిద్ధి యొసుగునే కల్లగాక. 94
క. అని వారు తన్నుఁ దునుమంబనుచుటయును వారికొంప చెఱచుటకై దేవుని వెనుకనుండి తా నాడినమాటకు వార లచ్చటికి వచ్చుటయున్. 95
క వినిపించిన నింతేనాయని యందఱు నవ్వ లజ్జ నానతముఖులైచని రవ్వేశ్యలు తచ్ఛుకమునకుం గలనేర్పు నీకుఁ బొసఁగ న్వలయున్. 96
క. అనినఁ బ్రభావతి మది మించిన వెఱఁగున నిన్నువంటి చిలుకలనేర్పుల్గననగునె యనుచు వేగుటగనుఁగొని వెసం జనియెఁ గేళికాగృహమునకున్. 97
క. ఆనాఁటిరేయి బాళిన్భూనాయకమౌళిఁ జేరఁబోయెడుతఱి నమ్మీనాయతాక్షి జూచి ప్రసూనాంబకతురగ మతులసూక్తిస్ఫురణన్. 98
క. వేసారక మద్వచనసుధాసారము మెచ్చ నీకె తగుఁగావున నీవీసారి యొక్కకథ వినుమాసారిజయస్తనద్వయా యని పలికెన్. 99
Comments
Loading comments…