పదునైదవకథ

శుకసప్తతి

క. కుముదబిలం బనునొకపురమమరు సురవ్యజనితధ్వజానీకమదభ్రమదప్రమదప్రమదాసుమదామకటాక్షజనితసూనశరంబై. 502

తే. అందుఁ దనరారు వీరాఖ్యుఁడైన యొక్కరౌతు వానికి దోసిటిప్రాలముద్దుగుమ్మ మదవతి యన నొక్కకొమ్మఁ గలదుకమ్మపూవులరెమ్మ బంగారుబొమ్మ. 503

క. ఆలలన నాయకుని యుపలాలనమునఁ దనివిలేక లలితాకారా

వాలములగు జారుల కనుకూలముగా మెలఁగుచుండుఁ గోర్కులుదీరన్. 504

సీ. అత్తగారికిని దీర్ఘాయువిచ్చినయట్టిబ్రహ్మదేవునిమీఁదఁ బండ్లుకొఱుకుభర్తకుఁ బొరుగూరుపయనంబుఁ జెప్పనిధరణీధవునిమీఁదఁ దప్పులెంచుజంద్రసూర్యులప్రకాశము మాయఁ జేయనికటికిచీఁకటిమీఁదఁ మెటికవిఱుచుబసులగోడలునాన్పి వసుధపైఁగూల్పనిముసురువానలమీఁదఁ గసరుఁజూపుతే. పదినెలకు రేలు మఱి పారవశ్యగరిమనెనయఁజేయని నిద్ర నేమేమొ దూఱుఁదవులుకోర్కులచే వెలిచవుల కరుగసందుగానక కుందు నయ్యిందువదన. 505

చ. కడకుఁ దొలంగినం గెలనఁగాఁపుగనుండెడు చేడెతోడ నీవెడపక వింత వానిరతి కేగతి నేగుదు వమ్మచెల్ల యెకుడుభయ మయ్యెడుం దలఁచికొన్ననె యంచని యిట్టిసౌఖ్య మెక్కడఁ గలదంచు విస్తరముగా నది చెప్పినఁ గోరుజారులన్. 506

చ. జననము నందినం బురుషజన్మము కావలెఁ గాక యాఁడుధైనను గుడిముద్ర వైచికొనినం దగు లేక కులాంగనాస్థితిందనలినఁ గామరూపమయిన న్వలదాయని చింతసేయు నవ్వనరుహపత్రనేత్ర తలవ్రాఁతకుఁ దప్పులుగల్గనేర్చునే. 507

క. పెనిమిటియు నత్తవదినెలుకనుఁగలిగి మెలంగ వెడలఁగా నెడ లేమిం

దినదినముఁ దత్తలోదరిమనముననే యిట్టి నేలమాలెలు ద్రవ్వున్. 508

చ. వరునింగన్ను మొఱంగి యిల్వెడలి పోవం బోయి జూరోపభోగరతింజొక్కఁగఁ జొక్కుచోఁ దలవరు ల్గద్దించినం డాఁగ డాఁగి రయోదారత నిల్లు సేరి సతిభంగింగుట్టుతో బంధుమోహరముం జెందఁగ నవ్వధూమణి యుపాయం బెంచు నెల్లప్పుడున్. 509

మ. ఇది జారుం డిలు సేరఁగాఁ దగినతా విచ్చోటఁ దత్సంగమాభ్యుదయార్హం బిది యింటివా రెఱిఁగినం బొమ్మంచు వానిన్రయంబొదవం బంపఁగవచ్చు త్రోవయని తానూహించు గేహంబునన్మదవత్యంబుజలోచనామణి మదోన్మాదం బుదారంబుగన్. 510

క. ఈరీతినుండి యయ్యంభోరుహముఖి మగఁడు మోసపోవనికతనన్జారరతి కొకమహోపాయారంభముఁ బూని దీనయైనది పోలెన్. 511

క. ఒకనాఁటిరాత్రి నిజనాయకుతో గురుభూమిఁ దగుమదంబ జనానందక యెటువలె నున్నదియోయకటా మాయన్న ధవళుఁ డరుదేఁడేమో. 512

తే. తొమ్మిది పదేండ్లు గావచ్చెఁ దోఁడుఁ జూచిగురుతుసైతంబు మఱచితిఁ గోరి యటకుమీరు నన్నంపఁగాఁబోరు వారు నిటకురారుగా చూచుటెట్లు వారలను నేను. 513

క. అని పలుక న్వరుఁ డూరార్చినమాటలు వారితిన్నెఁజేరిన పథికుండనుపమధూర్తుం డొక్కఁడువిని చూతము గాక దీనివిధ మని యంతన్. 514

తే. వేగ మఱునాఁడె యంగటివీధి కేగిపచ్చడము చీకయును బండ్లుఁ బసుపుఁగొనుచువచ్చి వారింటి కేగి బావా యటంచువీరునకు మ్రొక్కి యతని నివ్వెరగుఁ గాంచి. 515

క. తివిరి జనానందక గారవమున నీయనుజఁ జూచి రారా పోరాధవళాయన వచ్చితి నననవహితుఁడై వీరుఁ డద్భతానందమునన్. 516

క. ధవళుఁడ వీవేనా యనికవుగిటఁ గదియించి నెనరుగలబంధుఁడవౌదువు నేఁటికైన వచ్చితివవసర మిపుడైనఁ గలిగెనా యని పలుకన్. 517

తే. వారిమాటలు విని మదవతి మదీయవచన మేజాణయో విని వచ్చి యిట్లుసందుకొన్నాఁడు కార్యంబు చక్కనయ్యెఁగాంక్ష యొనఁగూర్ప ధగళుఁడే కలఁడటంచు. 518

తే. వచ్చి కల్పితసంభ్రమావార్య యగుచుమ్రొక్క దీవించునాతనిమోముఁ జూచియస్న యాశీర్వదించినయంతఫలమునీవు వచ్చినకతమున నేఁడు గలిగె. 519

సీ. మనయమ్మ కడుసుఖమున నున్నదే యయ్యపెద్దవాఁ డయ్యెఁగా పేర్మి నతనిఁబోషింతురే మీరు పొరచూపు లేక నాయరిది చెల్లెలి వచ్చి యత్తవారుతోడ్కొని పోయిరే దూరంబుగాన యేవార్తయు వినము మావదినె వేకటని వింటి నేబిడ్డఁ గనియెను మగవానిఁగనియెనో యది మేలుగాక యాఁడుతే. దాననై పుట్టి మిముఁ జూడఁ గానకిట్టులేను బడుపాటు చాలదా యెన్నఁడైనదలఁతురా నన్ను మీరు డెందంబునందునేల తలఁతురు మఱచిపోయితిరి నన్ను. 520

చ. చెలియలి పెండ్లి చేసితిరి చిల్లరపబ్బము లెన్నియైన శోభిలె నను నెన్నఁ డైనఁ బిలిపించితిరే పిలిపింపకున్న నేమలరెడుకూర్మి నాఁడుఁబడు చాసపడుం గద యంచుఁ బచ్చపోఁగులు గలచీర యంప నొనఁగూడకపోయెనె యేమి చెప్పుదున్. 521

తే. ఇపుడు మీపుణ్యమున నాకు నేమి కొదవయుండె నేను ధరింపఁగా నొకరి కీయఁగలదులే యందులకు నంట గాదు మీదయాతిదాక్షిణ్య మిటువంటి దంటి నింతె. 522

క. అనవలసి యంటి నిన్నుంగనుఁగొనుటే చాలు బడలికలు కనుపించెం

జనుదెమ్ము కంచ మిడినదియనుచుం గను గీఁటి పిలువ నాతఁడు మదిలోన్. 523

తే. కల్లవగజూదకత్తెలఁ గంటిఁగానియింతమాయల జగజంత నెండుఁగాననెట్లు నమ్మెడి దొర యీయింట దీనికడమనడతలు తెలుతముగాక యనుచు. 524

క. చని యది వడ్డింపఁగ భోజనకృత్యముఁ దీర్చి యంతఁ జలజాప్తుఁడు గ్రుంకిన దానికన్ను సన్నంగని కూటములో వసించె గంకటిమీఁదన్. 525

చ. మదవతి యంత నాత్మవిభు మన్మథకేళిని దేల్చి కూటి చొక్కొదవఁగ నిద్రఁజెందు పతి నొయ్యన నారసి లేచి చెంబుతోనుదకముఁ గొంచు ధూర్తమణి యుండెడి చోటికి నేగి మాయపున్నిదురవహించి యున్న యతనిం గరసంజ్ఞల లేపి యిట్లనున్. 526

క. ఏమోయి నిన్న నడిచిననామాటలు పొంచి విని ఘనంబై తగుమత్ప్రేమ యొనఁగూర్పవచ్చినసామివి గద నిన్ను మెచ్చఁ జనదే నాకున్. 527

ఆ. అందగాఁడ వగుదు వప్పుడె కంటి నీదారి మగఁడు నిద్రఁ దేఱి నన్నువెదకు నటకుమున్ను వేగఁ బోవలయు నీజోలి యేల ప్రక్కఁ జో టొసంగు. 528

చ. అన విని వాఁడుపల్కు భవదద్భుతచాతురిలో శతాంశమైనను గలదా మదీయనిపుణత్వము నేర్పరులందు నిన్ను నెన్నినఁ దగు మున్ను నాగుఱుతు నీవు నెఱుంగవు నిన్ను నే నెఱుంగనెకద యిట్టిచో నిజముగా నిలనాడితి గాన మాననీ. 529

క. అది యెంతయైన నున్నదెకద యీయద్భుతము జోక గలుగుట మేలౌముదిత కొఱగానివా విట్లాడవినచో మదనకేళి కొడఁబడఁ దగునే. 530

క. అన విని యది యిట్లను నామనముఁ గనన్వలసి పలుకుమాటలు చాలుమన యిద్దఱి ఘనసాహసమునకు న్ఫల మతనుకేళిమోదము గాదే. 531

క. చక్కనివనితా పురుషులకెక్కడి వావులు మనోజుఁ డెక్కడ నున్నాఁడక్కడఁ దగవులు నడచునెమొక్కలితన మేల మేలములు వల దింకన్. 532

క. అని పలుక మఱియు నాతఁడుమనసీయక యున్నఁ జూచి మంచిది పతిచేనినుఁ దునిమించెద ననుఁ గనుఁగొనరా యని బోఁటి పోటుకూఁతలు వెట్టెన్. 533

క. గడగడ వడంకి యతఁ డోపడఁతీ నీ వానతిచ్చుపనిఁ జేసెద నా

కడ నెగ్గుఁ దలఁపవద్దనియొడఁబడిన న్మంచిదని సముత్సాహమున్. 534

క. మది నాతని రక్షింపఁగనది యెంచెఁ బ్రభావతీ మహామతి వౌదేకద యెట్లు కావవలెఁ బదిపదిగ విచారించి తెలియఁబల్కు మ టన్నన్. 585

క. కోమటిమిటారి చిలుకానామతివిస్తార మేమనన్వచ్చు వచశ్శ్రీ మెఱయ నీవె తెల్పుమునా మంచి దటంచుఁ గీరనాథుం డనియెన్. 536

వ. ఇవ్విధంబున నమ్మదవతీవరారోహ యుపాయపరాయణయై యుండె నంతకమున్న కర్ణనిర్భేదనం బగుతదాక్రోశంబు నిద్రాభంగంబుఁ గావించుటయు నవ్వీరుం డదరిపడి లేచి కృపాణపాణియు వికటీకృతభ్రుకుటినిటలుండును నగుచు వచ్చు నంతకమున్న యయ్యింతి సమంతికప్రవర్తియగు నాధూర్తుని సవికారంబుగాఁ బడియుండు మని బోధించి యగాధవ్యధాబాధితయుం బోలె నిజనాథుని కెదురుగాఁ బఱతెంచి సాక్రందనంబుగా ని ట్లనియె. 537

క. పని గల్గి నీరపాత్రముగొని ముంగిటి కేగుదెంచి కోయనుకూఁతల్విని చేరిన వికృతాకృతిగని యున్నాఁ డన్న యేమి కతమో యెఱుఁగన్. 538

క. ఇన్నాళ్లు రానివాఁడేయెన్నిక లొనఁగూర్ప నిచటి కేతెంచెనొ మా

యన్ననుఁ గనుఁగొన రావేని న్నని వచ్చుట నుపేక్ష నించుట తగునే. 539

క. అన విని వదరకువే యాతని కేమియు లే దటంచు దాని పిఱుందంజని వీరుఁ డతని యాకృతగని త్రోవం గాలి సోఁకె గావలె ననుచున్. 540

తే. వెన్ను చఱచి ధవళ వెఱవకురా యంచుఁబలుక నంత నతఁడు తెలివి నొందివారిఁ జూచి లేచి మీ రేల వచ్చితిరేమి యెఱుఁగనైతి నింతతడవు. 541

చ. అనవుఁడు నవ్వి వీరుఁడు నిజాంబుజలోచనఁ జేరఁబిల్చి మంతనమున నీతఁ డొంటికి మనంబున భీతి వహించెనేమొ నీవినుఁ డుదయించుదాఁక వసియింపు సహాయముగాఁగ నంచుఁ బోయిన నగి ధూర్తుతోడ రమియించె వధూమణి యాస దీఱఁగన్. 542

క. అంతటఁ దెలతెలవాఱెంగాంతాయని పలుక వైశ్యకామిని యిచటన్వింత గదె తెల్లవాఱె శకుంతల యని యంతిపురము గుట్టునఁ జేరెన్. 543

తే. చేరి రేయి మహీకాంతుచెంత కరుగుదానితోఁ బూని తోయజోద్యన్మరందధార లూరఁగఁ గీత మోతరుణి యొక్కకథ విను మటంచు వెస నరికట్టి పలికె. 544

Comments

Loading comments…