పదునొకండవకథ

శుకసప్తతి

క. నలినావాసం బనఁగాఁగల దొకపుర మబ్ధికన్యకామణికిం దావలమై మదసారంగోజ్జ్వలఘీంకారవిదళితదిశాభాగంబై. 239

క. ఆనగర మేలు దుర్దమసేనుం డనునృపతి యతనిచెంతను శూరాఖ్యానుఁ డనునొక్కరౌతు మహానతరిపుభీతిహేతు వై వర్తిల్లున్. 240

సీ. గీఱునామము చిన్నికోరమీసలు చెంపబనిమట్టుసిక బొందు పట్టునూలువెనుకకట్టురుమాలు వెడఁదగాయపుఁగాయదారిఁ గాన్పించు గందంబుఁబూఁతకమ్మిపంచెయు గట్టికమ్మిదుప్పటి వల్లెవాటు కెంగేలిలో వంకవంకిపట్టుచేనపరంజిపరుజుతోఁ దగుకత్తిపలుచని బచ్చెనపావుకోళ్లు

తే. చికిలిచౌకట్టు సరిపెణ ల్రక మెసంగునుంగరంబులు నొకవింత యొఱపు నెఱపనేలి నాతనికొలువున కేగుదెంచుఁజూపఱు నుతింప నయ్యాయుధోపజీవి. 241

క. అతనికిఁ గలహప్రియ యనుసతి గల దయ్యతివ నడచుచందము లెల్లన్మతినరయ నతనిపాలిటిప్రతిబంధపుఁ బేరఁటాలు పంకజవదనా. 242

క. ఆరమణినడత యొకటియుఁబేరొకటియుఁగాక యుండఁ బెనుదుఃఖముగాఁబోరాడ విసివి వేసరిశూరుఁడు స్త్రీహత్యఁ జేయఁ జూడనికతనన్. 243

తే. వెడలనడిచినఁ బ్రతిరాజవీర మనెడిపురమునందున్న పితృగేహమునకుఁ బోవఁదలఁచి యయ్యింతి డింభకద్వయముతోడనరిగెఁ బథికులచే మార్గ మరసికొనుచు. 244

తే. చెంతబారెడులో నికుంజాంతరముననొక్కబెబ్బులి యుండి యయ్యువిదఁ జూచికూర్చె నాహార మాఁకలిగొన్ననాకుదైవమని యంతలో వేఱుతలఁపు వొడమ. 246

క. ఇదినాపద మిదినానదమిదినాపొద చేర వెఱతు రెవ్వరు నేఁ డీమదవతికి నెన్నిగుండెలొకదలక నే యున్నయునికి కార్య మెఱుంగన్. 247

ఉ. ఈవన మెల్ల నేలెఁడు మృగేంద్రుఁడుసైతము సాపరాధుఁడైసేవకుఁ డార్తినా మఱుఁగుఁ జెందినచో మదనుజ్ఞమీఁద సంభావితుఁ జేసి వాని బహుమానముతోఁ గొనిపోవుఁగాని తేజోవిభవంబు చూప వెఱుచుం బలవంతుఁడ నేను గావునన్. 248

తే. అట్టి నన్నునుఁ జేరి భయంబు లేనిపొలుపుతోనున్న దీపువుఁబోణి చెంతననుచుఁ గవుకునఁ బట్టరా దరయవలయుయోజన యొనర్చి సేయుట రాజనీతి. 249

క. కార్యాకార్యము లెఱిఁగినయార్యుఁడు నామంత్రి జంబుకాగ్రేసరుఁ డాధైర్యనిధి సుమతినాయకుఁడర్యమపదభక్తుఁ డెచటి కరిగెనొ యెఱుఁగన్. 250

తే. అతని రావించి నావిచారానువృత్తిజెప్పుదునొ దీని నేటి విచార మింకఁగమిచి నా మేనిరక్తమాంసములఁ బీల్పసాఁగె నతిగాఢతరలుఠజ్జాఠరాగ్ని. 251

క. అని తెంపు చేసి కనకనఁగనుఁగొనల న్నిప్పు లురలఁగా వాలము భూమినిఁ దాటించుచుఁ దద్గళమును జూచుచు గుఱక యుఱుకఁ బోనటు లున్నన్. 252

క. అబ్బెబ్బులిఁ గన వచ్చెందబ్బిబ్బు లిఁకేమినేయుదాన ననుచు నబ్బిబ్బోకవతి మనంబుననబ్బురమును భయముఁ ద్రొక్కులాడఁగ నుండెన్. 253

క. ఆకలహప్రియ పులిచేనేకరణిం బ్రదికి యూరి కేగఁగవలయున్రాకేందువదన తెల్పఁగదే కందముగాని నీయతిస్థిరబుద్ధిన్. 254

క. అనినఁ బ్రభావతి యిఁక నేమని తెల్పుదు నాకుఁ జూడ నగపడియెన యావనితపులివాతి; కేగతివినిపించెదొ దాని బ్రదుకువిధ మిఁకమీఁదన్. 255

ఉ. నావుడుఁ జిల్క పల్కు లలనా విను మత్తఱి నవ్వధూటి ప్రజ్ఞావతియౌట నిప్పులి నిజంబుగ నన్గనుఁగొన్నయప్పుడేచేవదలిర్పఁ బైఁబడక చింతయొనర్చుచుఁ బేలుపోయె నేనేవగదాననో యనుచు నీయెడ భీతియుఁ జూపఁగాఁదగున్. 256

క. అనుచుఁ దనూజులనిద్దఱగొనగోటంగిల్లి వారు కోయని యేడ్వంగనుఁగొని యూరార్చువిధంబున నిట్లను విసివినట్టిపూనిక దోఁపన్. 257

తే. ఏల యేడ్చెద రాఁకటి కేమియొల్లకకట పులిమాంసమేకాని యన్నలారమీకొఱకు వ్యాఘ్రములఁ జంపిమీఱుకతనదూఱుమఱివ్యాఘ్రహంతయ నేర్పుఁగంటి. 258

క. ఇలువాసి మీకు గ్రాసపుపొలవాసిం గూర్ప రోసి భువిఘోరమృగావలికిందలఁకక యడవింబులికిం బులినగుచుఁ దిరిగి పులిపులినైతిన్. 259

తే. ఐన నేమయ్యె నిచ్చోట నరయుచున్నదానఁ బులులున్నవో యని కాన నింకరెండుగలిగిన మాయిద్దఱికిని జాలుఁగాక యొకటుండినం జెఱిసగంబు గలదు. 260

క. అని పలుక జళుకు మదిఁ బెనఁగొనఁగా మేనెల్ల ముచ్చికొనుచుం బులి మెల్లనె యవలికిఁ జని వెసఁ జంగున నచ్చటిలతలు ద్రెంచికొనుచుం బాఱెన్. 261

క. అనినఁ బ్రభావతి మదిఁబర్విననివ్వెఱ ముక్కు మీఁద వ్రేలిడి తలయూఁచి నిజంబుగ మగువలెపోఘనసాహస లనుచుఁ బ్రొద్దుఁగని పల్లవితోన్. 262

క. కనుఁగొంటివె యదిచక్కన్మనసిజనృపకీర్తిరుచిసమాజపుమొక్కన్మినుకులకులములయిక్కన్వినుచక్కింజొక్కమైనవేగుంజుక్కన్. 263

తే. అనుచుఁ గేళిగృహంబున కరిగె మఱి గ్రమక్రమంబునఁ దరణిబింబంబు వ్రాలెనపరవారాశిఁ దనుఁజూచి యచటిమీనకోటిపలలం బటంచు ముక్కులను బొడువ. 264

మ. తన మేనం దగఁదోఁచుసొమ్ము లయినం దజ్జ్యోతి లోఁగొంచు నల్లని మేలౌ బురునీసుకప్పడము చాల న్మించ నేతెంచెఁ బచ్చనివిల్కానిజయాస్పదం బగుజిరాసంజోకతేజీవిధంబున నవ్వేళఁ బ్రభావతీసుదతి చూపు ల్వన్నెలంబర్వఁగాన్. 265

క. చనుదేరఁ జిల్క తత్కరమున వ్రాలి మెఱుంగుబోఁడి ముక్కుకొనఁ జుఱుక్కున గీరి కడమకథయున్విని పోయిన లెస్స గాదె విమలేందుముఖీ. 266

వ. అని పలికి రాజసంభోగసమారంభవిజృంభమాణాధీనం బగునమ్మానవతీమానసంబుఁ ద్రిప్పి చెంగటం జెలంగు మెఱుంగుటపరంజిపీఁటపయిం గూర్చుండిన యక్కురంగనయన తరంగితనిజవాంఛాఫలరసవీచికలం బ్రార్థింప నింతింతతరితీపు చూపుచుఁ గీరపుంగవం బిట్లనియె. 267

మ. విను మారీతిఁ బదాభిఘాతపతితోర్వీజాతమై భీతివీడని శీఘ్రంబున దూర మేగి దగదొట్టన్ వ్యాఘ్రమాదండ నున్ననిగండోపల మెక్కి యక్కలికి యందం బందు నల్దిక్కులంగనుపింప న్వెడగుండెకాయ లదరం గాలూఁద లేకున్నెడన్. 268

తే. కనియెఁ దన్మంత్రి యైనసృగాలమౌళిసుమతినామకుఁ డారీతిఁ జూచి యచటకేమిటికి వచ్చెనో వానినేలినాతఁడనుచుఁ జెంగటిపొదఁ జేరి యాత్మలోన. 269

సీ. తనయున్కి యెఱుఁగ కుద్ధతిఁ జెంతఁ జను లేటికొదమపైఁ బెట్టదు క్రూరదృష్టిదగ్గఱ గంతులు తగవేయుచున్నట్టికుందేళ్లఁ బట్టని యందమేమొచెంగటఁ దిరుగుచుఁ జెంగున దాఁటెడుదుప్పులఁ బట్టక తప్పెనేమొ

మొక్కలంబునఁ జేరి సొక్కుచుఁ దిరుగాడుమనుబోతుఁ బట్టంగ మఱచెనేమొతే. యనుచుఁ దనలోన నూహించి యాత్మఁ జెదరిచూచి ధైర్యంబు వదలక చోద్య మందిచెంతఁ జేరఁగ భయమంది చాలఁ గలఁగితఱుచు భ్రమవొంది యంతటఁ దానె తెలిసి. 270

ఉ. నాలుక వ్రేలవైచి వదనంబు వివర్ణవిధంబుఁ జెందఁగామ్రోలఁ జెలంగియాడెడు రురుప్రముఖంబులమీఁద నేమియున్వ్రాలనిచూడ్కి గుండెయదర న్నిలుపోపక యున్న యట్టిశార్దూలకులేంద్రుఁ జూడ భయదోషముఁ జెందినరీతి గన్పడన్. 271

క. నాయంతమంత్రి యుండి యపాయం బగునట్టి వేళ నధినాథుసుఖశ్రీయుతుఁ జేయక యుండుటనాయమె యిదిపోదు పతిమనంబలరింతున్. 272

క. అని తలఁచి సుమతి చేరంజని పులికిం గేలు మొగిచి సవినయముగ నవ్వనినుండి యుబుసుపోకంజనుదెంచితి రేమొ యిచటిజాడలు చూడన్. 273

క. దొరయైనయతఁడు మఱచియుఁబరభూమికిఁ బోవరాదు పనిగట్టినచోనురుతరనిజభటయుతుఁడైయరుగందగు లేకయున్న నాపద లొదవున్. 274

క. అసహాయశూరులరు గనుక సముత్సాహంబు వొడమఁగా వచ్చితిరివ్వసుధయును గంటిరేకదవసతికిఁ బోవుదము తడయవల దిచ్చోటన్. 275

చ. అనఁ బులి యాతఁ డచ్చటిమృగాక్షికఠోరవచోవిశేషముల్వినినది లేదు గాన బహువింతలు తెల్పేద వంచు నెంచి నెమ్మనమునఁ దోచుభీతిని నమందతరస్వర మొప్ప నాతనింగనుఁగొని పల్కు దైన్య మధికంబుగ దిక్కులు పాఱఁజూచుచున్. 276

క. విను తల్లికి నే మరలంజనియించితి నేఁడు నీదుసల్లాపకథావనధిం దేలఁగఁ బుణ్యంబునికిం బ్రదికితిని కీర్తిభూషణమూర్తీ. 277

ఉ. సిగ్గులచేటుసు మ్మది వచించిన నాప్తుఁడ వౌట నీకు నేనిగ్గురుభీతిహేతు విపుడింతయుఁ దెల్పెద నన్యు లెవ్వరీడగ్గఱ లేరుగా మనదిటంబుఁ గనుంగొన నంచు మెల్ల నేయగ్గజయాన పల్కిన మహాకటుభాషలు విన్నవించినన్. 278

క. ఆఁటదిగా దది మృగములవేఁటాడ న్వచ్చుమృత్యువే తప్పదు నోరాట మిదియేల యిచ్చటనేఁటి కెడయొనర్చుకొనుట నీతియు కాదో. 279

క. అని పలుక సుమతి యెంతయువిని యకటా యెవ్వతెయొ వివేకవిహీనుం

డని యితని బేలుపఱిచెంజనదు గదా పిఱికిదొరల సరసం గొలువన్. 280

క. పతికి భయమడరుచో నదియతిశయముగఁ జేసి మాన్యుఁడై బ్రదుకుం గుత్సితమంత్రి యతనిఁ గైకొనునతిదుర్మతి యైన నాథుఁ డాప్తుఁడు గాఁగన్. 281

వ. కావున నేకాచారంబగు నమాత్యపథంబునం బ్రవరిల్ల నాకు నకారణభయభ్రాంతుండైన యతని కనుగుణంబుగా నడుచుట కర్తవ్యంబుగాదు బహుకాలం బేతదర్థంబునఁ బోషితుండనై యుండి యివ్వెరవుఁ దెలుపకుండిన సామాన్యులలో గణ్యుండనగుదు నితండు మదీయవచనంబులు వినియెనేనిమే లట్టు గాక దుర్బుద్ధియై మదీయస్థానహానిపర్యంతంబుఁ దలంచినఁ దలంపనిమ్మని నిశ్చయించి యాసృగాలంబు శార్దూలంబున కిట్లనియె. 282

తే. ఎలుఁగులకు వేరువిత్తు దుప్పులకు గండమేదులకు మిత్తి లేళ్లకు నెదురుచుక్కకాసరంబులపాలిటి కంటినొప్పియసదు గాదుగదా భవదన్వయంబు. 283

చ. అలవి యెఱుంగ కొక్కపులి కల్గినవాఁడయి భీతిఁ జెందయక్కొలపగఁదీర్చుకోఁదలఁచి కోడెవయాళివజీరుఁ డెప్పుడున్మెలఁగెఁడు వ్యాఘ్రచర్మమను మీనెఱడాగు ధరించి శూరతాకలన భవత్కులంబునకుఁ గల్గదు జోడు మృగాన్వయంబునన్. 284

క. భిన్నేతరమగు సకలసమున్నతవిభవాభిజాత్య మున్నదె కద ని

న్నెన్నుతఱిఁ గొంచగాఁడవెయన్నన్న నఖాగ్రనిర్జితారివి గావే. 285

తే. ఇట్టినీ వొక్కభామ యేమేమొ పలికెననుచు వెఱచితి ననుటెల్ల నరయ నాకుబుద్ధి శోధింపఁగాఁ బోలుఁ బొసఁగ దొరలుతలఁప సేవకహృదయభేదకులు గారె. 286

తే. కాక వెఱచినమాట నిక్కంబ యేనినేఁడు నీవంక శార్దూలనికరమునకుఁజెల్లఁబో మాంసకబళంబు బెల్లమయ్యెఁబ్రాఁతపరివారముల నోట బగ్గిపడియె. 287

క. మనుజాంగనయఁట తనయులకనవరతము పులులఁ ద్రుంతు ననెనఁట యిదియేవినినంత శరీరముతోఁజనుదెంచితె యకట నీదుశౌర్యము గూలన్. 288

తే. రమ్ము నా వెంటఁ గొంతదూరముననుండిదంటతనమున నను వెన్నునంటి చూడునీకుఁ గైకాన్కఁ జేసెద నేఁడు దానిఁదత్తనూజులకంఠరక్తంబుఁ గ్రోలు. 289

క. అన విని శార్దూలం బనువిను మిచ్చటఁ బ్రేలవచ్చు వెస దానిఁ గనుంగొననంత మాట వెడలునెనినుఁబోఁటికి నే నెఱుంగనే నీబలమున్. 290

క. తగిలించుకొన్నపిమ్మటనిగిలించుటె కాని కార్య మే మున్నది యా

మగువఁ జననిమ్ము పోవుదమగునె యసాధ్యమున సాహసాదృతి సలుపన్. 291

క. చలమున నది పైఁబడినంజులుకనివాఁడ నని యుఱుకఁజూతువు మఱి మాంసలదేహుఁడ ధావనచేనలసితిఁ బరువెత్తఁజాలనౌ నిటమీఁదన్. 292

క. నావుడు గోమాయు వనున్నీవిటు తప్పించుకొన గణించెదు కాయంబీవగల డాఁచికొని యాహా విను మెన్నేండ్లు బ్రదుకుదయ్య మృగేంద్రా. 293

క. బలవన్మృగమంత్రులయెడఁదలవంపుల కోర్వలేక తఱిమెద మదిలోఁదలఁపకు బహుభీతిని లెమ్మలఘుపరాక్రమ మొనర్ప నందుం గీర్తుల్. 294

క. నను నమ్మవేని యిచ్చటివనితీఁగెలు చుట్టి పెనఁచి నాకున్నీకుంబెనవైచికొమ్ము రమ్మికనిను జూచిన నవ్వధూటి నేలం గూలున్. 295

తే. అనుచు నక్క నిజాధీశు నతులశౌర్యమెనయ బోధించి పెనవై చికొనుచుఁ దెచ్చెఁగురుబలావళిఁ జేర నుత్తరుని ధైర్యశోభితుని జేసి తెచ్చు నర్జునుఁడు వోలె. 296

క. ఈలీల వచ్చు నాశార్దూలసృగాలముల భయముతోఁ గనఁ జేయం

జాలుట గలహప్రియ కింకేలాగునఁ గలుగవలయు నిందునిభాస్యా. 297

తే. అనుచుఁ జిలుక పలుక నాప్రభావతి యిట్టియవగడంబు మాన్ప నది యెఱుంగునిపుడు నీ వెఱుంగు దింతియే కాని యీతెంపువగలు మాకుఁ దెలియ వనిన. 298

శా. కీరం బిట్లను నట్లు ఘోరతరభంగిక వ్యాఘ్రగోమాయువుల్చేరన్రా దిలకించి యవ్వనిత కించిద్భీతియు న్లేక ధైర్యారూఢిన్ మృగధూర్తముం బలుకు నాహా సత్యవాక్యత్వ మీడేఱం దబ్బఱకాఁడ వైతి గద యింకేరీతి సైరింపుదున్. 299

తే. పులుల రెంటిని దెత్తు నీపుత్రయుగళమునకు నని నమ్మిక లొసంగి పోయి యిప్పుడొక్కశార్దూలమును దెచ్చి యొప్పగించెదొల్లఁబో కాననేఁడు నీయుసుఱుఁ గిసురు. 300

మ. అనుచుం దిగ్గునలేచుదానిఁ గని యవ్యాఘ్యేంద్ర మౌరౌర ఛద్మననేసం గద నక్క యెక్కరణి నమన్వచ్చు నంచున్భయంబున దాని న్వెస నీడ్చికొంచుఁ బఱచెన్ భూభాగ మల్లాడఁగాఁదనకంచుం బరువెత్తుచోఁ గలవె కాంతావంచనాసంపదల్. 301

క. అనఁ జిలుక కాప్రభావతిమునుపటి వగకన్న నధికముగ వెఱపించెన్వినుమా కలహప్రియ యింతనిరూఢంబైన నేర్పు దానికె చెల్లున్. 302

వ. అని పలికి విరహిజనమథనంబున మనసిజుండు పట్టించు ధర్మదారోదయంబునుంబోలి మిక్కుటంబగు కుక్కుటారవంబున నరుణోదయం బగుట యెఱింగి యక్కురంగనయన యంతఃపురంబునకుం జనియెఁ దదనంతరంబ. 303

క. వనజరుచిఁ గొనఁగ సమయంబనుచోరుఁడు రోదసీగృహముఁ జొచ్చి భయంబునఁ బఱవ నడఁచుదీపంబునఁ బోల్పంబడుచుఁ బ్రొద్దు పొటుకునఁ గ్రుంకెన్. 304

చ. ప్రవిమలమౌక్తికంబుల తురాయి నిగన్నిగల న్మెఱుంగు చనవ మనుగెంపుదండల దగద్ధగలం బయలొందనీక నీలవసనపున్ముసుంగు పొదలంగఁ బ్రభావతి వచ్చె నత్తఱిన్గవిసెన లోకలం జకచకల్గల దర్పణలక్ష్మి గేరుచున్. 305

క. వచ్చుటయు నిచ్చలంబున్బచ్చలపంజరము వెడలి పడఁతీ యిదె యేనిచ్చట నున్నానని యనుపచ్చనివిలుకానితేజిఁ బరికించి వెసన్. 306

క. నిన్నఁటికథ మఱి యింకనునున్నదియో యుండెనేని యుచితవచస్సంపన్నతఁ దెలిపెదె గ్రక్కుననన్నరపతిపొందు నేఁటికైన న్వలయున్. 307

క. అన శుక మిట్లను గుతుకంబునఁ గథ కొదవ యన నెంత మూఁడేమాటల్

వినిపొమ్ము పోయి యచ్చటజనపతి రతిఁ జొక్కి తామసము చేయకుమీ. 308

మ. అని యాశావశఁ జేసి యాశుకసుధాశాధీశ మీశానశీర్షనదీశోభికుశేశయాంతరరసశ్లాఘావిశేషాపనోదనశీలావిశాలశీతలగుణోదారోక్తిధారానిగుంభనగంభీరము గాఁగ నిట్లనుచుఁ దెల్పంజొచ్చె నచ్చెల్వకున్. 309

క. కాంతా వింటివెకద విభ్రాంతపుఁబులి నక్కఁ గొనుచుఁ బఱచుట మునుపేయంతం గలహప్రియ తత్కాంతారము వెడలి తల్లిదండ్రులఁ జేరెన్. 310

శా. నిర్దాక్షిణ్యమనస్క యవ్వనిత యంటె న్వెంటనే యంచుఁ దచ్ఛార్దూలం బతిభీతిఁ బాఱెను లతాసంబంధమౌట న్మహాదుర్దాంతోగ్రశిలాభిఘాతవిగళద్ఘోరాస్రధారాతిసమ్మర్దాధ్వంబగు నక్క నీడ్చుకొని సంభ్రాంతాన్యజంతుత్వరన్. 311

క. ఈరీతిఁ బఱచి పరచింతారంభము మఱచి ధావనాయాసమునన్నోరెండ నిలిచె నొకకాంతారమునం బిఱికిగుండె తటతట నదరన్. 312

క. నిలిచి దగదీర్చుకొని హెచ్చిలుకోపముతోడ నింతచేసినదీనిందలవ్రచ్చుక మ్రింగెద ననుతలఁపున జంబుకముఁ గ్రూరతరముగఁ జూచెన్. 313

క. అప్పుడు సృగాల మద్దెసఁదప్పించుకొనంగ నేమి తలఁపఁగ వలయుం

జెప్పుము ప్రభానతీ యననప్పులుఁగున కాసుధాకరానన పలికెన్. 314

తే. కాలిసంకెల లతికానికాయబంధమప్పులి యటన్న నాగ్రహవ్యగ్ర మింకజాఱిపోరాదు సాంత్వనసరణిఁ గూడదెట్లు తప్పించుకొను నక్క యిట్టియెడను. 315

వ. కావున సృగాలంబునకు శార్దూలవదనగహ్వరంబె యవశ్యంబు భావ్యంబని తలంచెదఁ గాని తత్ప్రాణగోపాయనంబునకు నుపాయంబు దోపదు మదీయశేముషీవిశేషం బింతియ, యనంతరకథావృత్తాంతంబుఁ దెల్పు మనినఁ గీరం బిట్లనియె. 316

క. ఇది తెలియకున్న బుద్ధికిఁగొదవనుట ల్గాదు జారుఁ గూడఁగఁ జనుతోయదకచ కిట్టి విపద్దశయద నెఱిఁగి యడంపవలయు ననియనుట చుమీ. 317

క. అవ్వలి కథ వినుమా యెలజవ్వని యారీతిఁ జూచుశార్దూలపతిన్నివ్వెఱఁ గనుఁగొని జంబుకమవ్వేళకు నొకనుసాయ మాత్మందోఁపన్. 318

మ. పులికిం గేలు మొగిడ్చి పల్కు విను మంభోరాశిగంభీర నాపలుకు ల్ద్రోహ మొనర్చెరా యనుచు నాపైఁ గోపమే కాని రాఁగలకార్యం బెఱుఁగంగలేవు సముదగ్రక్రోధయై యావధూతిలకం బిచ్చటి కేగుదెంచుఁ దనుజోద్రేకక్షుధల్ మాన్పఁగన్. 319

క. మన మున్నచో టెఱుంగునెయని తలఁప న్వలవ దుపలహతి గళితాస్మత్తనురక్తధార త్రోవంగనుఁగొని యదె యడవిజాడఁగాఁ బఱతెంచున్. 320

క. మున్నొనరించిన నేరంబెన్నకు తత్ఫలముఁ గంటినేకద యిఁకమీఁద న్నీకు శుభ మొనర్చెదన న్నరయకు మింక వంచనాపరుఁగాఁగన్. 321

క. పెనఁ ద్రెంచి యెచటికేనియుఁజనుమా శార్దూలహంత్రి జాడ మెయిం గ్రక్కున వచ్చిన నినుఁ బొరిగొనుననఘా జైవాతృకత్వ మందుము నీవున్. 322

క. అని పలికినపుడె నఖములఁబెన పటుకునఁ ద్రెంచివైచి బెబ్బులి పఱచెంజనియె న్నక్కయు వేఱొకవనమునకున్ దెలియ వింటివా తెలిగంటీ. 323

క. అనినఁ బ్రభావతి నివ్వెరగున మ్రాన్పడి యుండి తెలిసికొని చిలుకా యీయనపాయోపాయస్థితినను నడిగిన నాకుఁ దెలియునా యెంతైనన్. 324

క. అని యంతఁ దెల్లవాఱుటఁగని యంతఃపురము సేరెఁ గాంతామణి యాదినకరబింబము గ్రుంకినదనుకాకీరమణి యొప్పిదంబున నుండెన్. 325

క. అంతటఁ జీఁకటి గని యక్కాంతామణి నృపతిఁ జేరఁగాఁ బోవుతమింజెంతకుఁ జేరినఁ గనుఁగొనికంతునినెఱతేజి ముద్దుగాఱఁగఁ బల్కెన్. 326

తే. ఎంతవేగిర మమ్మ పూర్ణేందువదనమాటుమడిగినఁ జనుమ యమ్మనుజవిభునిధామసీమకు నిపుడు నందాఁక నొక్కయమలతరమైన కథ వినుమనుచుఁ బలికె. 327

క. ధరపై రాజపురంబునఁబరఁగెడు నొకరెడ్డి గలఁడు పరిహితనామస్ఫురితుఁడు కృషికార్యధురంధరుఁ డలరున్ హాళికావతంసుం డగుచున్. 328

క. ఆరెడ్డి కిద్దఱాండ్రు పయోరుహబాణుని శరంబులో యనఁగా శృంగారిణియు సువేషయు ననుపేరుల మెలఁగుదురు సొంపు బెంపెసలారన్. 329

తే. చెలువుఁ డెప్పుడుఁ బగలెల్లఁ జేసి పనులుకోరి మెలఁగుట రేలెల్లం గుంభకర్ణనిద్రఁ బాల్పడి రతికి సంధింపకునికివార లిద్దఱుఁ గడిదేఱి జార లైరి. 330

ఉ. చామనిమేనులు న్ననుపుఁ జల్లెడుమోములలోనఁ గల్గుబల్గోములు మానపుం బొడవులుం బిడికింట నడంగుకౌనులుం

Comments

Loading comments…